కశ్మీర రాజతరంగిణి-53

0
2

[box type=’note’ fontsize=’16’] కశ్మీర్ ప్రాచీన చరిత్ర గురించి అవగాహన కలిగించి, భవిష్యత్తు గురించి ఆలోచనలు కలిగించాలన్న ప్రయత్నంలో భాగంగా నీలమతపురాణం తరువాత అందిస్తున్న జోనరాజు, శ్రీవరుడు, ప్రజ్ఞాభట్టులు కల్హణుడి అడుగుజాడల్లో నడుస్తూ సంస్కృతంలో రచించిన ‘కశ్మీర రాజతరంగిణి’ అనువాదాన్ని తెలుగు పాఠకులకు అందిస్తున్నారు కస్తూరి మురళీకృష్ణ. [/box]

విప్రాణామ్ శతవేమోన మేకాహేహ విపధ్యతే।
నివేద్యమెత దిత్యూచే క్రౌర్య క్రాంతోధ పార్థివః॥
(కల్హణ రాజతరంగిణి IV, 633)

[dropcap]రా[/dropcap]జు అత్యంత శక్తిమంతుడు. అతడి చుట్టూ దీపం చుట్టూ పురుగులు చేరినట్టు దుష్టులు, స్వార్థపరులు చేరతారు. వారి లక్ష్యం ఒక్కటే. దీపం ఉండగానే ఇల్లు చక్కపెట్టుకోవటం. రాజును తమ గుప్పిట్లో పెట్టుకోవటం వల్ల లబ్ధి పొందటం వారికి కావల్సింది. స్వయంగా శక్తి లేకపోవటం వల్ల రాజు అధికారాన్ని దుర్వినియోగం చేయటం ద్వారా తమ దౌష్ట్యాన్ని సంతృప్తి పరచుకుంటారు. ఇలాంటి వారి ప్రభావానికి గురయితే మహావృక్షమైనా చెదపురుగులు పడితే ఎలా వ్యర్థమవుతుందో, రాజులు ఎంత గొప్ప వారయినా చరిత్రలో దుష్టులుగా మిగిలిపోతారు. జయాపీడుడి కథ కూడా అలాగే అయింది.

జయాపీడుడు గొప్ప కార్యాలు సాధించాడు. అతని అతని వ్యక్తిత్వంలో ఆరంభం నుంచి ఒక నిర్లక్ష్యం కనిపిస్తోంది. శత్రు రాజ్యానికి మారువేషంలో వెళ్ళి పట్టుబడిపోవటం, ఆవేశంతో ముందు వెనుకలు చూడకుండా దాడికి వెళ్ళి చిక్కుకుపోవటం వంటివి జయాపీడుడు ఎంత గొప్ప వీరుడయినా విచక్షణా రహితంగా ప్రవర్తిస్తాడన్న భావన కలిగిస్తాయి. అందుకే బాధ అనిపించినా ఉత్తముడిలా ఉండి తాత లలితాదిత్యుడి అడుగుజాడల్లో నడుస్తున్న జయాపీడుడు ఒక్కసారిగా తన చుట్టూ చేరిన దుష్టుల ప్రలోభంలో పడి తండ్రిని అనుసరించటం ఆరంభించటం స్వాభావికం అనిపిస్తుంది. ఏ వ్యక్తి కూడా సంపూర్ణంగా మంచివాడు, సంపూర్ణంగా దుష్టుడు కాడు. అతడిలో మంచీ, చెడూ ఉంటాయి. పరిస్థితులను బట్టి, సమయాన్ని బట్టి, అవకాశాన్ని బట్టి మంచి చెడులు ద్యోతకమవుతాయి. మంచి అధికంగా ప్రకటితమయితే మంచివాడు, లేకపోతే దుష్టుడు. అందుకే జయాపీడుడు మంచివాడిగా ఉంటూ దుష్టుడిగా మారటం బాధ కలిగించినా, ఆశ్చర్యం అనిపించదు. ఇక్కడే రాజతరంగిణి ద్వారా భారతీయ సామాజిక వ్యవస్థకు ప్రత్యేకమయిన ఒక అంశం స్పష్టమవుతుంది.

భారతీయ సమాజంలో కులవ్యవస్థ మంచిచెడుల విచికిత్స పక్కన పెడితే, ‘బ్రాహ్మణులు’ అన్నవారు ఈ సమాజానికి మనస్సాక్షిగా వ్యవహరించారన్నది రాజతరంగిణి స్పష్టం చేస్తుంది. ఒక నది ప్రవాహం ఆరంభంలో ఉన్నట్లు తరువాత కాలంలో ఉండదు. అలాగే ఏ వ్యవస్థ అయినా ఎల్లప్పుడూ ఒకేలా ఉండదు. కాబట్టి తరువాత ఈ వ్యవస్థ ఎలా పరిణమించింది, ఇప్పుడు దాని స్థితి ఏమిటి అనేటటువంటి చర్చలను వదిలి, ప్రస్తుతం రాజతరంగిణిలో అవసరమైనంత వరకే ఈ విశ్లేషణను పరిమితం చేసి చూస్తే, కశ్మీరులో సామాజిక, ధార్మిక, రాజకీయ వ్యవహారాలలో ‘బ్రాహ్మణ్యం’ ఒక ‘మనస్సాక్షి’ పాత్రను పోషించటం స్పష్టమవుతోంది.

సర్వకాలం బ్రాహ్మణ్యామహో ధైర్యమకుంఠితం।
నిస్త్రింశస్య బభూవుర్యే తస్యాపి పరిపంధివః॥
(కల్హణ రాజతరంగిణి IV, 631)

సర్వకాలం అంచంచల ధైర్యం కల బ్రాహ్మణులు మహనీయులు. వారి ధైర్యం అకుంఠితం. కాలం గడిచినా వారి ధైర్యమనే కరవాల  ధార మొండిది కాలేదు. జయాపీడుడి శక్తికి వెరవకుండా వారు అతని దుష్టచర్యలను ఎదుర్కొన్నారు. వ్యతిరేకించారు. ఇక్కడ గమనించాల్సిందేమిటంటే సత్యం పలికేవారు, అన్యాయాన్ని ఎదిరించేవారు, ప్రాణాలకు ప్రమాదం ఉన్నా లెక్క చేయక, ధైర్యం ప్రదర్శించారు బ్రాహ్మణులు. అలాంటి వారే బ్రాహ్మణులు. ‘సత్యకామ జాబాలి’ కథలో అప్రియమైనదైనా సత్యం చెప్పేవాడిని బ్రాహ్మణుడిగా పరిగణించటం కనిపిస్తుంది. అంటే, ‘బ్రాహ్మణ్యం’ అన్నది ఒక లక్షణం. అందుకే భారతీయ ధర్మంలో గౌరవం గుణానికి. మిగతావన్నీ గుణం ముందు దిగదుడుపే.

జయాపీడుడి దుశ్చర్యలను బ్రాహ్మణులు వ్యతిరేకించారు. జయాపీడుడి లోని దుష్ట స్వభావం, దుష్ట సాంగత్యం వల్ల జాగృతమయింది. దాంతో ప్రజలను హింసించటం ప్రారంభించాడు. జయాపీడుడికి ప్రజలను హింసించటం అన్నది ఒక మాదకద్రవ్యం లాంటి మత్తునిచ్చే వ్యసనం అయింది. అతనికి ప్రజలను ఎంత హింసించినా సంతృప్తి అన్నది కలుగలేదు. ‘నేను పాపం చేసి తీరుతాను’ అని కంకణం కట్టుకున్నట్టు ప్రవర్తించాడు జయాపీడుడు. జయాపీడుడు ఎంతగా లోభి అయ్యాడంటే, పంటలు పండగానే పంటను మొత్తం తానే కాజేసేవాడు. రాజు ఇలా ప్రవర్తిస్తుంటే అతని అనుచరులు ఇంకా క్రూరంగా ప్రవర్తించారు. మొత్తానికి అందరూ కలసి ప్రజల జీవితాలను దుర్భరం చేశారు. ఇలాంటి పరిస్థితులలలో బ్రాహ్మణులు ప్రజల తరఫున రాజుకు వ్యతిరేకంగా గళం విప్పారు. ఈ రకంగా వారు రాజుకు ప్రధాన శత్రువులయ్యారు. దాంతో రాజు బ్రాహ్మణులను హింసించటం ప్రారంభించాడు. అందరికీ అర్థమయ్యేట్లు చెప్పాలంటే, బ్రాహ్మణులు ఆ కాలంలో ప్రజల హక్కుల కోసం, సౌఖ్య జీవనం కోసం పోరాడిన వారన్న మాట. ప్రజల సుఖ సంతోషాల కోసం, న్యాయం కోసం రాజును వ్యతిరేకించిన విప్లవ వీరులన్న మాట. రాజు హింసను తట్టుకోలేని వారు ప్రాణాలు అరచేత పట్టుకుని కశ్మీరం వదిలి పారిపోయారు. అయినా కశ్మీరంలో ఉన్నవారు రాజును ప్రశ్నించటం మానలేదు. రాజ వ్యతిరేకతని మానలేదు. ఈ సందర్భంలో జయాపీడుడు ఒక ప్రకటన చేశాడు. ‘ఏ రోజయితే వందకన్నా ఒక్కటయినా తక్కువ సంఖ్యలో బ్రాహ్మణులు మరణిస్తారో, ఆ విషయం వెంటనే నాకు తెలియపరచాలి’ అని ఆజ్ఞాపించాడు. అలా జరిగిన రోజు రాజు ప్రదర్శించే క్రౌర్యాన్ని తగ్గిస్తాడన్న మాట! ఈ సందర్భంలో రాజు తనను పొగిడే కావ్యాలు రాయించుకున్నాడు. పాత గ్రంథాలను, కవితలను కూడా తనని పొగిడేటట్టు మార్చాడు. ఈ సందర్భంలో కొందరు పండితులు రాజును పాణినితో పోలుస్తూ పొగుడుతున్నట్టే విమర్శించారు వ్యంగ్యంగా.  అంటే పైకి రాజుకి విధేయంగా కనిపించినా రాజును వారు వ్యతిరేకిస్తునే ఉన్నారన్న మాట.

నితాంతం కృతకృత్యస్య గుణవృద్ధి విధాయికః।
శ్రీ జయాపీడ దేవస్య పాణికేశ్చ కిమన్తరమ్॥
(కల్హణ రాజతరంగిణి IV, 635)

జయాపీడుడికి వ్యాకరణకర్త పాణినికి తేడా ఏమిటి? పాణిని వ్యాకరణం ద్వారా తన కర్తవ్యం నిర్వహించాడు. సక్రమంగా వ్యవహరించటం నేర్పి మంచిని పెంచాడు. జయాపీడుడు ఉపసర్గలను వాడుతూ, గుణ, వృద్ధి నియమాలు ఏర్పాటు చేశాడు. మరో కోణం లోంచి చూస్తే జయాపీడుడు ఆన్ని కార్యాలు నశింపచేసి మంచిని తొలగించాడు  అన్న అర్థం వస్తుంది.

ఈ రకంగా రాజు వ్యతిరేకతను పలు రూపాలలో ప్రదర్శించారు బ్రాహ్మణులు. వారిలోని ఈ లక్షణమే బహుశా, సమాజంలో వారిని అంతగా ద్వేషాలకి, దూషణ భూషణలకు గురి చేస్తోంది.  నిక్కచ్చిగా  సత్యం పలికే ఈ లక్షణం ‘అహంకారం’గా అర్థమయి వారి మాటల్లోని సత్యాన్ని సమాజం గుర్తించే బదులు ద్వేషించేటట్టు చేస్తున్నది. అయితే, ఇది చాలా లోతైన అంశం. వివాదాస్పదమైన అంశం. అది ఈ రచన పరిధికి బాహిరం, అప్రస్తుతం. కాబట్టి దాన్ని ఇంతటితో వలిది కశ్మీరు చరిత్రలో ముందుకు సాగుదాం.

చివరికి ఒకరోజు, ఒకటి తక్కువగా వంద బ్రాహ్మణులు చంద్రభాగా జలంలో దూకి ప్రాణాలు త్యాగం చేశారు. అప్పటి నుంచి రాజు జయాపీడుడు అగ్రహారాలు దోచుకోవటం తగ్గించాడు.

ఒకరోజు తమకు జరిగిన అన్యాయాన్ని రాజుకు విన్నవించుకునేందుకు కొందరు బ్రాహ్మణులు వచ్చారు. వారిని ద్వారపాలకులు చెంపదెబ్బలు కొట్టారు. దాంతో వారు రాజు ముందు తమ నిరసనను వ్యక్తపరిచారు. “మనువు, మాంధాత, రాముడి వండి గొప్ప రాజులు కూడా పండితులను ఈ విధంగా అవమానించలేదు” అన్నారు.

ఇది జయాపీడుడి ఆగ్రహాన్ని పెంచింది. “ఎంత అహంకారం మీది! ఇతరులు వేసే భిక్ష మీద ఆధారపడిన మీరు ఇలాంటి పరుషమైన భాష మాట్లాడతారా? మీరేమైనా గొప్ప తపశ్శక్తి కల ఋషులా?” అని హేళన చేశాడు.

దానికి సమాధానంగా, ఇట్టిలుడనే బ్రాహ్మణుడు “యుగధర్మాన్ని బట్టి నీలాంటి సామాన్య మానవుడు కూడా రాజు అయినట్టు, నేను మహర్షినయ్యాను” అన్నాడు.

ఆ మాతలు విని ఆవేశంతో రాజు, “అది ఏమి? నీవు తపోధనులైన విశ్వామిత్రుడు, వశిష్ఠుడు, అగస్త్యుడు వంటి వాడినని అనుకుంటున్నావా?” అని అడిగాడు.

“నువ్వు హరిశ్చంద్రుడు, నహుషుడు, త్రిశంకులలో ఒకరివి అయితే నేనూ ఆ ఋషులలో ఒకడినవుతాను” అన్నాడు ఇట్టిలుడు.

“విశ్వామిత్రుడి కోపం వల్ల హరిశ్చంద్రుడు దుర్దశ పాలయ్యాడు. అగస్త్యుని కోపం వల్ల నహుషుడు సర్పమయ్యాడు. వశిష్ఠుని కోపం వల్ల త్రిశంకు స్వర్గ భ్రష్టుడయ్యాడు. నీ కోపం వల్ల నువ్వు నన్నేమి చేయగలవు? కానీ నా కోపం నిన్ను శవంలా మారుస్తుంది” అన్నాడు జయాపీడుడు.

రాజు మాటలకు ఇట్టిలుడు కుపితనేత్రుడై, ముఖము అగ్నిజ్వాలా సమంగా తేజోదీప్తమవగా, బుస కొట్టిన పాములా, వేడి నిట్టూర్పు విడిచి, చేతితో నేలపై చరిచి, “నా కోపం వల్ల నీ శిరస్సుపై క్షణకాలంలో ధర్మదండము బ్రహ్మదండమై పడదా?” అన్నాడు.

అప్పుడు రాజు కోపంతో, ఎగతాళిగా, “అయితే ఇంకా ఆలస్యమెందుకు, ధర్మోల్లంఘన చేసిన ఈ నీచుడిపై బ్రహ్మదండము పడి ధర్మాన్ని రక్షించటం లేదే?” అన్నాడు.

ఇట్టిలుడు “దుష్టుడా! ఇదిగో చూడు అధర్మం నశిస్తుంది” అంటూండగానే ఫెళ ఫెళ రావాలతో, రాముడు తాటకిపై ఎక్కుపెట్టిన బాణంలా, ఇంద్రుడు రాక్షసులపై విసిరిన బాణంలా, పెద్ద శబ్దంతో రాజభవనం పై కప్పు నుంచి సర్పదండం ఒకటి రాజు శిరస్సుపై పడింది.

(ఇది కస్తూరి మురళీకృష్ణ రచించిన కల్హణ కశ్మీర రాజతరంగిణి కథల పుస్తకంలోని ‘ధర్మదండం’ కథ నుంచి గ్రహించిన కల్హణ రాజతరంగిణి లోని శ్లోకాలకు నాటకీయ రూపం).

ధర్మదండం ఘాతంతో రాజు శిరస్సుపై లోతయిన గాయం అయింది. అది పురుగులు పడింది. ఆ పురుగులను ఎంత తీసివేస్తే అంతగా పెరిగాయి. నరకంలో అనుభవించాల్సిన బాధలను భూమిపై అనేక రోజులు అనుభవిస్తూ, దుర్భరమైన రీతిలో జయాపీడుడు మరణించాడు. చివరికి అతని శరీరాన్ని వదిలివెళ్ళాలని ప్రాణం తపించింది. అలా తన మనస్సును నియంత్రించలేని జయాపీడుడు భూమిపై నరకశిక్షను అనుభవించాడు. 33 ఏళ్ళు కశ్మీరాన్ని పాలించాడు జయాపీడుడు. అతని ఆత్మశాంతికి అతని తల్లి అమృతప్రభ ‘అమృత కేశవ’ మందిరాన్ని నిర్మించింది. ఈ సందర్భంలో లోకరీతిని వివరిస్తూ కల్హణుడు చక్కటి వ్యాఖ్య చేస్తాడు.

ధన ఆశతో రాజులు, మలిన జలం ఆశతో చేపలు తమ స్వస్థాలన్ని వదిలి తప్పుడు త్రోవలో వెళ్తాయి. రాజులు విధి చేతిలో, చేపలు జాలరుల చేతుల్లో చిక్కి నరకానికి వెళ్తాయి.

జయాపీడుడి తరువాత అతని కొడుకు లలితాపీడుడు రాజయ్యాడు. ఆయన ఇంద్రియలోలుడు. స్త్రీ సాంగత్యంలో నిరంతరం మునిగి తేలడం వల్ల రాజ్యం వేశ్యలకు, దుష్పరిపాలనకు ఆలవాలమయింది. దౌష్ట్యంగా తన తండ్రి సంపాదించిన ధనాన్ని నాట్యగత్తెలకు, వేశ్యలకు అర్పించాడు. దుష్టపు చర్యతో సంపాదించిన ధనం, ఎలా సంపాదించాడో, అలాగే పోతుందంటాడు కల్హణుడు. ఇది గొప్ప సత్యం.

ఆధునిక సమాజంలో డబ్బు సంపాదనే ధ్యేయంగా, ఎలా వీలయితే అలాగ, ఎంత మోసం ఎలాగయినా చేసి డబ్బు సంపాదించటమే పరమావధిగా భావిస్తూ, అక్రమంగా సంపాదించినవాడే ఉత్తముడని విర్రవీగుతున్న కాలంలో కల్హణుడు చెప్పిన మాటలను, లోకరీతిని గ్రహించి జాగ్రత్త పడాల్సి ఉంటుంది. ‘చీమలు పెట్టిన పుట్టలలో పాములు చేరటం’ లోకరీతి అని గ్రహించి తమ జీవితాన్ని అర్థవంతంగా గడపాలి. ఎంత సంపాదించినా ‘ఆరడుగుల నేల’ అదీ ఈ లోకంలో తప్ప, ఇంకేమీ మిగలదనీ, ఆ మిగిలిన ‘ఆరడుగుల నేల’ను కూడా అనుభవించలేడన్నదీ గ్రహించాలి మనిషి.

వేశ్యాలోలులు, అనుభవించటమే ఉత్తమం అని భావించిన వారు రాజు చుట్టూ చేరారు. పలు వేశ్యలలో పలు రకాలుగా సంగమించటమే వీరత్వం, గొప్పతనం అనుకున్నాడు. పూర్వ రాజులను హేళన చేయటం, ఎద్దేవా చేయటం ఆరంభించాడు. రాజుకు బుద్ధి చెప్పాలని ప్రయత్నించిన వారిని రాజు దాకా చేరనివ్వలేదు రాజు చుట్టూ చేరిన దుష్ట ఉపగ్రహాలు. ఆ కాలంలో రాజుకు బుద్ధి చెప్పి, రాజు చర్యలను బహిరంగంగా గర్హించినది మంత్రి మనోరథుడు మాత్రమే. అతడు రాజును కలవటం మానేశాడు. దుష్ట యజమాని మంచి మాటలు విననప్పుడు అతడికి దూరంగా ఉండటమే మేలంటాడు కల్హణుడు. పన్నెండేళ్ళు ప్రజలకు నరకం చూపించి లలితాపీడుడు మరణించాడు. అతని తరువాత జయాపీడుడి మరో కొడుకు సంగ్రామపీడుడు రాజయ్యాడు. ఆయన ఏడేళ్ళు రాజ్యం చేశాడు.

లలితాపీడుడు మద్యం మత్తులో కూడిన జయాదేవి అనే వేశ్యకు జన్మించిన చిప్పట జయాపీడుడు కశ్మీరాధిపతి అయ్యాడు. రాజయ్యే సమయానికి చిప్పట జయాపీడుడు ఇంకా పసి పిల్లవాడు. దాంతో అతని తల్లి సోదరులు పద్మ, ఉత్పల, కళ్యాణ, మమ్మ, ధర్మ అనే అయుదుగురు పిల్లవాడి పేరు మీద అధికారం చలాయించారు. రాజభోగాన్ని అనుభవించారు. అయితే జయాదేవి ఉత్తమురాలు. ఈ అయిదుగురు ఖజానాని ఖాళీ చేశారు. కానీ జయాదేవి ప్రజలు కష్ట పడకుండా చూసింది.

సోదరి రాజ్య వ్యవహారాలు చూస్తుంటే వీరు అయిదుగురు ఎలాంటి విఘాతం లేకుండా సర్వ సౌఖ్యాలు అనుభవించారు. వీరు అయిదుగురు బాల్యంలోనే చిప్పట జయాపీడుడిని తప్పు త్రోవ పట్టించారు. అయితే వీరికి రాజ్యకాంక్ష కలిగింది. తమ సోదరి సంతానాన్ని మాయోపాయంతో చంపించారు. 12 ఏళ్ళు నామమాత్రపు రాజుగా ఉన్న చిప్పట జయాపీడుడి పాలన అలా ముగిసింది. అయితే అయిదుగురిలో రాజ్యాధికారం ఎవరికి దక్కాలన్న విషయంలో ఏకాభిప్రాయం కుదరకపోవటంతో వీరు ఓ తోలుబొమ్మ లాంటి వాడిని నామమాత్రపు రాజుగా  సింహాసనంఫై కూర్చోబెట్టి, పరోక్షంగా అధికారం తాము అనుభవించాలని నిశ్చయించారు. రాజును ఇష్టంవచ్చినట్టు ఆడించవచ్చు. తాము నిర్ణయాలు తీసుకుని బాధ్యతను రాజుపై నెట్టవచ్చు.బాధ్యత లేకుండా అధికారం చలాయించవచ్చు.   చెడ్డ పేరు వస్తే సింహాసనంపై కూర్చున్న వాడికి వస్తుంది, తమ చేతికి తడి అంటదు. ఆధునిక పరిభాషలో చెప్పాలంటే, ‘Outside Support’ అన్నమాట!

(ఇంకా ఉంది)

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here