కశ్మీర రాజతరంగిణి-54

0
2

[box type=’note’ fontsize=’16’] కశ్మీర్ ప్రాచీన చరిత్ర గురించి అవగాహన కలిగించి, భవిష్యత్తు గురించి ఆలోచనలు కలిగించాలన్న ప్రయత్నంలో భాగంగా నీలమతపురాణం తరువాత అందిస్తున్న జోనరాజు, శ్రీవరుడు, ప్రజ్ఞాభట్టులు కల్హణుడి అడుగుజాడల్లో నడుస్తూ సంస్కృతంలో రచించిన ‘కశ్మీర రాజతరంగిణి’ అనువాదాన్ని తెలుగు పాఠకులకు అందిస్తున్నారు కస్తూరి మురళీకృష్ణ. [/box]

తేషామాత్రాన్త దేషానామ్ నామమాత్ర మహీపతిన్।
తాంస్తాన్కర్తు మసామాన్యా అన్విరోధోన్యోన్యముద్యయా॥
(కల్హణ రాజతరంగిణి IV, 688)

[dropcap]నా[/dropcap]మమాత్రపు రాజును సింహాసనంపై కూర్చోబెట్టి, పరోక్షంగా తాము అధికారం చలాయించాలని ఆ అయిదుగురి మధ్య పోటీ బయలుదేరింది.

రాజతరంగిణి చదువుతూంటే అనేక సందర్భాలలో సమకాలీన ప్రపంచంలో జరుగుతున్న అనేక సంఘటనలు, రాజకీయ ఆటలు గుర్తుకు వస్తాయి. కాలం మారింది. సమాజం మారింది. ఆలోచన మారింది. వ్యవస్థ మారింది. వేషభాషలు మారాయి. కానీ మనిషి మారలేదు అనిపిస్తుంది. అప్పుడు అయిదుగురు అన్నదమ్ములు తమలో తాము పోరాడుకుంటూ, తమకు నచ్చిన తోలుబొమ్మను సింహాసనంపై కూర్చోబెట్టి అధికారం పరోక్షంగా తామే చలాయించలాని పోటీపడితే, ఇప్పుడు సంకీర్ణ ప్రభుత్వం ఏర్పాటు చేసి, ఔట్ సైడ్  సపోర్ట్ అంటూ, ఓ తోలు బొమ్మను ఆడించినట్టు, ప్రధాని పదవిపై ఆశ పడినవాడిని ఆడించడం మనం అనుభవించాం.  గుర్రాలు వేర్వేరు దిశల్లో లాగుతుంటే, ఎటు శక్తి ఎక్కువైతే ఆ వైపు ప్రయాణించే రథంలా దేశం ప్రయాణించటం అనుభవించాం. పేరుకు మాత్రం అధికారి అయి, అధికారం అంతా ఇతరుల చేతిలో ఉండే నిస్సహాయులైన రాజ్యాధికారులను చూశాం. ఇదంతా కశ్మీరులో ఒకప్పుడు జరగటం కల్హణుడి రాజతరంగిణి ప్రదర్శిస్తుంది. అంటే కాలం మారుతుంది కానీ మనిషి మారడన్న మాట. మనుషుల కార్యకలాపాల పేర్లు మారతాయి తప్ప పనులు మారవన్న మాట.

రాజ్యాధికారం కోసం రాజును చంపిన తరువాత ఎవరిని రాజుగా ఉంచాలన్న విషయంలో అయిదుగురూ తమకు నచ్చినవాడే రాజుగా ఉండాలని పోరాడేరు. ఈ కుట్రలు కుతంత్రాలు చేయలేక, తోలుబొమ్మ రాజులా ఉండడం ఇష్టంలేక త్రిభువనపీడుడు రాజ్యార్హత ఉండి కూడా రాజ్యాధికారం తిరస్కరించాడు. దాంతో ఉత్పలుడు తన శక్తిని ఉపయోగించి అజితాపీడుడిని రాజుగా చేశాడు. రాజుగా అయితే చేశాడు కానీ అధికారం మాత్రం ఇవ్వలేదు. అధికారాన్ని, ఐశ్వర్యాన్ని అయుదుగురు సోదరులు ఇష్టం వచ్చినట్టు అనుభవిస్తూ రాజుకు మాత్రం అతని అవసరాలు, ఖర్చులు లెక్కించి దాని తగ్గట్టు ధనం ఇచ్చేవారు. అంటే, పేరుకు కశ్మీరాధిపతి అయినా, ఈ అయిదుగురు అన్నదమ్ముల దయాదాక్షిణ్యాలపై ఆధారపడిన జీతగాడన్న మాట కశ్మీరరాజు. అంతేకాదు, ఈ అయిదుగురులో రాజు ఏ ఒక్కరితో మాట్లాడినా మిగతా నలుగురికి కోపం వచ్చేది. వారు రాజును సతాయించేవారు. అచ్చు మన సంకీర్ణ ప్రభుత్వం లాంటి పరిస్థితి ఇది. ఈ పరిస్థితిని కల్హణుడు తన కవి హృదయంతో వర్ణిస్తాడు.

సాపత్యాస్తే బుధుడిరే రాజ్యం స్వామి వివర్జితమ్।
నిర్జనే మహిషం శాంతి మిధః పేర్ణ్యా వృకా ఇవ॥
(కల్హణ రాజతరంగిణి IV, 694)

తమ కుటుంబం, సంతానంతో కలిసి వాళ్ళు (అధికారం పరోక్షంగా అనుభవిస్తున్న అయిదుగురు సోదరులు), రాజు లేని రాజ్యంపై పడి, తోడేళ్ళు చచ్చిన ఎద్దును పీక్కు తిన్నట్టు పీక్కు తిన్నారు.

ఇంత కన్నా గొప్పగా రాజ్యాన్ని దోచుకుని తినేవారిని వర్ణించటం కుదరదు. అయితే దోచుకుని తినేటప్పుడు కలిసి దోచుకుంటారు, కానీ పంచుకునేటప్పుడు పోరాడుతారన్నట్టు, ఉత్పలుడు, ముమ్మడుల నడుమ వివాదం వచ్చింది. వారిద్దరి నడుమ జరిగిన పోరులో మరణించిన వారి శవాల వల్ల వితస్త నది ప్రవాహ దిశను మార్చింది. ఈ సంఘటనను ప్రతిబింబిస్తూ శశాంకుడనే కవి ఓ కావ్యం కూడా రాశాడంటాడు కల్హణుడు. ఇప్పుడు ఈయన రాసిన కావ్యం లభ్యం కావడం లేదు. కానీ వల్లభదేవుడు సంకలించిన ‘సుభాషితావళి’లో ఈయన రచించిన కొన్ని పద్యాలు లభిస్తున్నాయి.

తమలో తాము కలహించుకుని జననష్టం కావించిన తరువాత అందరూ కూడబలుక్కుని అజితాపీడుడిని గద్దె దించారు. సంగ్రామపీడుడి కుమారుడు అనంతాపీడుడికి అధికారం అప్పజెప్పారు. అయితే అనంతాపీడుడు ముమ్మడి చేతిలో కీలుబొమ్మ. దాంతో ముమ్మడి ఆధిక్యం పెరిగింది. దాంతో ఉత్పలుడి కొడుకు సుఖవర్మ రాజుతో బద్ధ శత్రుత్వం వహించాడు. ఉత్పలుడి మరణం తరువాత సుఖవర్మ ఉత్పాలాపీడుడికి రాజ్యాధికారం కట్టబెట్టాడు. దాంతో సుఖవర్మ అందరిలోకీ శక్తిమంతుడయ్యాడు. ఈ సమయంలో కాస్త శక్తి కల ప్రతి ఒక్కడూ తానే రాజు అని ప్రవర్తిస్తూ బలహీనులైన ప్రజలను దోచుకోసాగారు.

ఇది కూడా మనం అనుభవిస్తున్నాం. శక్తిమంతుడయిన అధికారి లేనప్పుడు క్రింద ఉన్నవారు ఇష్టారాజ్యంగా ప్రవర్తిస్తారు. ప్రతి ఒక్కడూ తానే అధికారి అవుతాడు. అరాచకం సృష్టిస్తాడు. బలహీనుడిని బెదిరిస్తారు. నీతులు, సూత్రాలు బలహీనులకు తప్ప శక్తిమంతులకు కాదు. వారేం చెప్తే అదే నీతి, వారేం చెప్తే అదే సూత్రం అన్నట్లవుతుంది. ఇలా రాజు బలహీనుడవడంతో రాజ్యంలో అరాచకం పెరిగింది. సుఖవర్మ రాజు కాకున్నా రాజు కన్నా ఎక్కువ శక్తిమంతుడయ్యాడు. ఇది భరించలేని శుష్కుడు సుఖవర్మను చంపేశాడు. దాంతో శూరుడనే మంత్రి, సుఖవర్మ కుమారుడు అవంతివర్మ రాజుగా ఉండడానికి అర్హుడని భావించి, ఉత్పలాపీడుడిని గద్దెదించి అవంతివర్మను రాజుగా చేశాడు. ఈ సందర్భంలో కల్హణుడిలోని కవి, తాత్వికుడు విజృంభించాడు.

ఎంతో ప్రయత్నించిన వాడికి వాడు ప్రయత్నిస్తున్నది లభించదు. కానీ దాని కోసం ఏ మాత్రం ఆశపడిని వాడికి అది అయాచితంగా లభిస్తుంది. ఈ గమ్మత్తయిన విధి పనితీరును వ్యాఖ్యానిస్తూ అతని తాత, తండ్రులు రాజ్యాధికారం కోసం ఎంత ప్రయత్నించినా వారికి రాజ్యాధికారం లభించలేదు. అదే వారి మనుమడయిన అవంతివర్మకు రాజ్యాధికారం అయాచితంగా లభించింది. ఇది అతని పూర్వీకుల పుణ్యఫలమే అంటాడు కల్హణుడు. అంతే కాదు, ఒకే కడవ నుంచి జన్మించిన అగస్త్యుడు సముద్రపు నీటినంతా ఒకే గుక్కలో ‘స్వాహా’ చేశాడు అంటాడు.  అదే ఎన్ని కుండలలో తోడి పోసినా కడలి నీరు అయిపోదు. కానీ ఓ కుండలో పుట్టిన వాడు సముద్రపు నీటిని తాగేశాడు! ఎంత అద్భుతం విధి లీలలు! (ఈ సంఘటనల ఆధారంగా కస్తూరి మురళీకృష్ణ ‘సంభవామి యుగే యుగే’ అన్న కథను రచించాడు. ఇది ‘కల్హణ రాజతరంగిణి కథలు’ సంపుటిలో ఉంది).

ఇప్పటి నుంచి కశ్మీరులో ‘అవంతివర్మ’ అద్భుతమైన పాలన ప్రారంభమవుతుంది. పలు నిస్సహాయులు, బలహీనులు, చేతకానివారు రాజులుగా అయ్యారు. కశ్మీరు అల్లకల్లోలమయింది. కశ్మీరు ప్రజలు అనేక కష్టాలు అనుభవించారు. తీవ్రమైన ఎండల తరువాత చల్లని జల్లుగా అవంతివర్మ పాలన కశ్మీరు ప్రజలకు ఉపశమనం కలిగించింది. అల్లకల్లోలమైన కశ్మీరుకు ఒక సుస్థిరత్వాన్ని సాధించింది అవంతివర్మ పాలన. దీంతో నాలుగవ తరంగం పూర్తవుతుంది. అయిదవ తరంగం అవంతివర్మ పాలన వర్ణనతో ఆరంభమవుతుంది.

***

పరలోకాధ్వగాన్భూపానపాయోన బాన్ధవాన్।
హేమ భోజన భాండాది భాండాగారే యదర్జితమ్॥
(కల్హణ రాజతరంగిణి V, 9)

అవంతివర్మ రాజ్యానికి వస్తూనే తన దారిలోని ముళ్ళని తొలగించినట్టు దుష్టులందరి అడ్డు తొలగించాడు. మంత్రి శూరుడితో కలిసి కశ్మీరుకు సవ్యమైన పాలనను అందించాడు. అయితే అవంతివర్మ తన పూర్వీకులను, వారి జీవితాలను బాగా అధ్యయనం చేశాడు. ప్రపంచరీతిని అర్థం చేసుకున్నాడు. ఈ ప్రపంచంలో అధికారం, ఐశ్వర్యం ఏదీ శాశ్వతం కాదని అర్థం చేసుకున్నాదు. ఏదీ మనిషి వెంట రాదని గ్రహించాడు. లక్ష్మీదేవికి ఎవరితోనూ ఎలాంటి అనుబంధం ఉండదని అర్థం చేసుకున్నాడు. ఒక్క క్షణం ఒక వ్యక్తిని ఐశ్వర్యంతో ముంచెత్తిన లక్ష్మీదేవి, తరువాత క్షణంలో అతనెవరో తెలియనట్టు వదిలి పొతుందనీ, పరలోక ప్రయాణంలో మనిషి ఒంటరి వాడని గ్రహించాడు అవంతివర్మ. బంగారు ఆభరణాలు, పాత్రల వంటి వన్నిటికీ రాజులు తాము యజమానులనుకుంటారు కాని అవి ఇక్కడే ఉంటాయి. రాజులు రిక్తహస్తాలతో వెళ్ళిపోతారని అర్థం చేసుకున్నాడు. దాంతో రాజభవనంలో ఉన్న బంగారు వస్తువులన్నీ కరగించి వేసి, బంగారాన్ని దానం చేసేశాడు. ఆ రకంగా, రాజు ఐశ్వర్యం సర్వం ప్రజలకు పంచిపెట్టిన తరువాత రాజు దగ్గర రాజ చిహ్నాలు, తెల్లటి వింజామర, గొడుగు తప్ప మరేమీ మిగలలేదు.

‘నేను తినను, ఇంకొకరిని తిననివ్వను’ అంటేనే సమస్య వస్తుంది. గత కాలంలో అక్రమంగా ధనార్జన చేసిన వారందరి ధనాన్ని కూడా రాజు ప్రజలకు పంచిపెట్టటంతో అంతవరకు సిరిసంపదలతో, అడ్డు అదుపులేని అధికారాలు అనుభవిస్తున్న వారంతా రాజుపై తిరుగుబాటు చేశారు. ఇది కూడా మనం సమకాలీన సమాజంలో అనుభవిస్తున్నాం. అధికారం కోల్పోయిన వారు ఇంకా అధికారులేనన్నట్టు ప్రవర్తిస్తూ, అధికారంలో ఉన్నవారికి ఏమీ చేతకాదు, అధికారార్హత తమదే అన్నట్టు అహంకారంతో ప్రవర్తిస్తూ రాజ్యాన్ని అల్లకల్లోలం చేయటం అనుభవిస్తున్నాం. ఆ కాలంలో అవంతివర్మ కూడా ఇలాంటి వ్యతిరేకతని ఎదుర్కున్నాడు. అవినీతిపరులు, అన్యాయాలకు, అక్రమాలకు అలవాటు పడ్డవారు, దౌర్జన్యం ద్వారా ఐశ్వర్యం గడించినవారు, మోసమే జీవన విధానంగా కలవారందరూ – నీతి, ధర్మాలకు కట్టుబడి, ఆధ్యాత్మికంగా సత్ప్రవర్తన కల అవంతివర్మకు వ్యతిరేకంగా తిరుగుబాటు చేశారు.

రాజ్యం నిష్పాద్య నిర్విఘ్నమధ వాత్సల్య పేషలః।
విభజ్య బంధు భృత్యేషు బుధుజే పార్థవః శ్రియమ్॥
(కల్హణ రాజతరంగిణి V, 21)

రాజ్యంలో పాలనకు అడ్డంకులన్నీ తొలగించి వేసిన తరువాత అవంతివర్మ తన బంధువులు, భృత్యువులతో కలిసి, ప్రేమార్ద్ర హృదయుడై రాజ్యసంపదను అనుభవించాదు. ధర్మకార్యాలను నిర్వహించాడు. మందిరాలను నిర్మించాడు. అంతరాయం కలిగిన విద్యలకు వ్యాప్తి కలిగించి, ఉత్తములను, నిపుణులను సత్కరించి రాజ్యంలో వారికి సముచిత స్థానాలు కల్పించాడు. అవంతివర్మ కాలంలో పేరుపొందిన పండితులలో ముక్తాకణుడు, శివస్వామి, ఆనందవర్ధన కవి, రత్నాకరుడు వంటి వారున్నారు. అవంతివర్మ మంత్రి శూరుడిని స్వంత బంధువు కన్నా ఎక్కువగా గౌరవించాడు. శూర మంత్రి అవంతివర్మను ఇష్టదైవంలా భావించేవాడు. ఎంతగా అంటే, తాను పుత్ర సమానంగా భావిస్తున్నవాడు, రాజును వ్యతిరేకిస్తున్నాడని తెలిసి, స్వయంగా అతనికి శిరశ్ఛేదం చేసేంతంగా!

అవంతివర్మ పాలనలో పది సంవత్సరాల పాటు ఎలాంటి ప్రాణిహింస జరగలేదు. చేపలు నీటిలోంచి బయటకు వచ్చి ధైర్యంగా ఎండలో చలి కాచుకుని నీళ్ళలోకి నిర్భయంగా వెళ్ళిపోయేవి. మహాపద్మ సరస్సుకు వరదలు రావడం వల్ల పంటలు సరిగ్గా పండటం లేదని, నీటి పారుదల వసతులు కల్పించాడు. ఈ సమయంలో సుయ్యుడు అనే ఒక అద్భుతమైన వ్యక్తి అవంతివర్మ ఆస్థానంలో ప్రవేశించాడు. సుయ్యుడి గాథ అద్భుతంగా ఉంటుంది.

ఓ శూద్ర వనితకు,  పారేసిన కుండలో ఓ శిశువు దొరుకుతాడు. ఆమె సంరక్షణలో శిశువు పెరిగి, విద్యాభ్యాసం చేసి, సత్ప్రవర్తనతో మేధావిగా గుర్తింపు పొందుతాడు. అతడి చుట్టూ ఎందరో విద్వాంసులు చేరుతారు. కశ్మీరాన్ని వరదలు బాధిస్తున్నాయని తెలుసుకుని వరదలను అరికట్టే ఉపాయాలు తన దగ్గర ఉన్నాయంటాడు సుయ్యుడు. అతని మాటలు తెలిసి రాజు అతడిని తన రాజాస్థానానికి ఆహ్వానిస్తాడు. “నా దగ్గర ధనం లేదు, ఉంటే, వరదల బెడద తొలగించగలను” అంటాడు సుయ్యుడు. ‘ఇతడు పిచ్చివాడు, అతడి మాటలు పట్టించుకోవద్ద’ని అందరూ హెచ్చరించినా, ఎవరి మాటలను లక్ష్యపెట్టకుండా రాజు సుయ్యుడికి అడిగినంత ధనం ఇస్తాడు. ఆ తరువాత సుయ్యుడేం చేశాడన్నది కాస్త కామన్‌సెన్స్, మరికొంత అతద్భుతమైన ఇంజనీరింగ్ టెక్నాలజీతో కూడుకున్న అద్భుతం! ఎవరికి పుట్టాడో తెలియని సుయ్యుడు, శూద్రవనిత దగ్గర పెరిగాడు. ఇవేవీ ప్రజలు అతడిని గౌరవించటంలో, అతని చుట్టూ చేరటంలో, అతడిని గౌరవించి, సత్కరించి, అందరి వ్యతిరేకతను కాదని బాధ్యతను అతనికి అప్పగించటంలో అడ్డుకాలేదు. భారతదేశంలో వివక్షత, ఆది నుంచీ ఉన్నదనేవారు ఇది గమనించాలి. భారతీయ సమాజం గురించి తీర్మానాలు చేయటం అంత సులభం కాదని తెలుసుకోవాలి.

నీట మునిగిన నందక గ్రామంలో సుయ్యుడు దీనారాల పాత్రను నీళ్ళలోకి వదిలేస్తాడు. అందరూ ‘రాజు పిచ్చివాడిని నమ్మేడ’ని అంటారు. అయితే రాజు మాత్రం సుయ్యుడిపై విశ్వాసం ప్రదర్శిస్తాడు. అతడేం చేస్తాడోనని కుతూహలంగా ఎదురుచూస్తుంటాడు. ఆ తరువాత క్రామరాజ్యంలో యక్షధార వద్ద దీనారాలను నీళ్ళలోకి వదిలేస్తాడు సుయ్యుడు. అక్కడ పైనుండి బండరాళ్ళు దొర్లి వితస్త ప్రవాహానికి అడ్డు పడటం వల్ల నది ప్రవాహ మార్గం మళ్ళి ఊళ్ళను ముంచెత్తుతోంది. ఆ నీళ్ళల్లోంచి రాళ్ళు తొలగించి దీనారాలను ఏరుకోమంటాడు సుయ్యుడు. ప్రజలంతా నీళ్ళలోకి దూకి బండరాళ్ళను తొలగించి, దీనారాలు ఏరుకోవడం ఆరంభిస్తారు. ఈ రకంగా రెండు రోజుల్లో, ప్రవాహానికి అడ్డుపడ్డ రాళ్ళ అడ్డంకి తొలగుతుంది. ప్రవాహం పూర్వ మార్గం పడుతుంది. ఈలోగా రెండు మూడు చోట్ల ప్రవాహానికి ఆనకట్టలు కట్టిస్తాడు సుయ్యుడు. దాంతో వారంలోగా ‘నీల నది’ ప్రవాహం పూర్వ మార్గంలో పడుతుంది. నది ప్రవాహం మార్గం తప్పకుండా ఉండేందుకు ఒడ్డుకి ఇరువైపులా బండరాళ్ళతో అడ్డుగోడలు కట్టిస్తాడు.

ఇంతకాలం దారి తప్పి, ప్రతిబంధకాల వల్ల కొట్టుమిట్టాడుతున్న వితస్త సరైన మార్గం దొరకటంతో పరవళ్ళు తొక్కుతూ సముద్రం వైపు పరుగులు పెడుతుంది. వరద నీరు తీస్తుంది. సారవంతమైన మట్టితో నిండిన నేల తళతళలాడుతుంది. ఎక్కడెక్కడ నది కట్టలు తెగే వీలుందో, అక్కడక్కడ అడ్దుగోడలు నిర్మింపజేశాడు. చెట్లు నాటించాడు. కాలువల ద్వారా నీళ్ళు పొలాల్లోకి మళ్ళించాడు. వరదలు వచ్చే అవకాశం ఉన్న చోట కొత్తగా కాలువలు త్రవ్వించాడు. ఇలాంటి పలు కాలువల నిర్మాణంతో ప్రధాన స్రవంతి పలు పడగలతో విలసిల్లే నల్ల త్రాచులా శోభించింది అంటాడు కల్హణుడు. అత్యద్భుతమైన వర్ణన ఇది. కాలువలు పడగలు. ప్రధాన స్రవంతి పాము శరీరం. ఊహిస్తేనే ఒళ్ళు పులకరించే వర్ణన. సుయ్యుడు ఏర్పాటు చేసిన ఈ నీటి పారుదల ప్రభావం వల్ల త్రిగ్రామకి ఎడమ వైపు నుండి సింధునది, కుడి వైపు నుండి వితస్త నది ప్రవహిస్తూ వైన్యస్వామి వద్ద కలిసిపోతాయి. శ్రీనగరంలో ఈనాటికీ ఈ రెండు మహానదుల సంగమాన్ని, సుయ్యుడు నిర్మించిన వంతెనలను చూడవచ్చునంటాడు కల్హణుడు. ఈనాటికీ వితస్త నది కిరువైపులా సుయ్యుడు నిర్మించిన ఈ రాతి కట్టడాలున్నాయి. చెట్లున్నాయి. ఈ ప్రాంతాలు సుయ్య కుండల, ఉత్స కుండల, మర్త్య కుండల వంటి పేర్లతో ఉన్నాయి. ‘కుండల’ అంటే వర్తులాకారంలో కట్టిన కట్టడం లేక వర్తులాకారంలోని పాత్ర అన్న అర్థం వస్తుంది. ఒక మంత్రగాడి వెంట పాముల సమూహం పరిగెత్తి వెళ్ళినట్టు, సుయ్యుడి వెంట కశ్మీరు నదులు అతడెలా చెప్తే అలా ప్రవహించాయి. అత్యద్భుతమైన ఇంజనీర్ సుయ్యుడు. బహుశా, అప్పటి సుయ్యుడు, ఇప్పటి మోక్షగుండం విశ్వేశ్వరయ్యలా జన్మించాడేమోనని ఓ మేధావి అభిప్రాయపడ్డాడు. ప్రపంచంలో అత్యద్భుతమైన ఇంజనీర్ సుయ్యుడు.

(ఇంకా ఉంది)

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here