కశ్మీర రాజతరంగిణి-57

5
2

[box type=’note’ fontsize=’16’] కశ్మీర్ ప్రాచీన చరిత్ర గురించి అవగాహన కలిగించి, భవిష్యత్తు గురించి ఆలోచనలు కలిగించాలన్న ప్రయత్నంలో భాగంగా నీలమతపురాణం తరువాత అందిస్తున్న జోనరాజు, శ్రీవరుడు, ప్రజ్ఞాభట్టులు కల్హణుడి అడుగుజాడల్లో నడుస్తూ సంస్కృతంలో రచించిన ‘కశ్మీర రాజతరంగిణి’ అనువాదాన్ని తెలుగు పాఠకులకు అందిస్తున్నారు కస్తూరి మురళీకృష్ణ. [/box]

తతోపి పాపినో భూవన్కోపి తస్మిన్‍క్షణే ద్విజాః।
తస్మాదప్యగ్రహారాన్యే జాగృహుర్గుహ భోజినః॥
(కల్హణ రాజతరంగిణి 5, 403)

[dropcap]కొం[/dropcap]దరు చరిత్రకారులు కల్హణుడు రాజతరంగిణిని రచించటం వెనుక ప్రధానోద్దేశం బ్రాహ్మణుల గొప్పతనాన్ని ప్రదర్శించాలని అని వ్యాఖ్యానిస్తారు. బల్ల గుద్ది వాదిస్తారు. రాజతరంగిణిలో బ్రాహ్మణుల శాపాల వల్ల రాజులు నశించిన గాథలున్నాయి. బ్రాహ్మణులు ఉపవాస నిరసన ప్రదర్శన చేసి రాజును గద్దె దింపిన సంఘటనలున్నాయి. బ్రాహ్మణ సంఘాలు ఒత్తిడి తెచ్చి రాజు నిర్ణయాలను మార్చిన దృష్టాంతాలున్నాయి. అయితే ఎంతగా బ్రాహ్మణుల మంచి చర్యలను పొగుడుతూ ప్రదర్శించాడో, అంతగా వారి దుశ్చర్యలను, నీచ ప్రవర్తనలనూ తీవ్రంగా విమర్శిస్తూ ప్రదర్శించాడు కల్హణుడు.

కానీ ప్రతి ఒక్కరిపై ఏదో ఒక ముద్ర వేసి, రంగుటద్దాల గుండా తప్ప ఉన్నదాన్ని ఉన్నట్టు చూడలేని స్థితిలో ఉన్న సమాజం వ్యక్తి ప్రతి చర్యకూ ఏదో ఒక ఉద్దేశం ఆపాదించందే అర్థం చేసుకోలేదు. ఓ రచయిత నిర్మోహంగా, నిర్మొహమాటంగా, నిక్కచ్చిగా, నిజాయితీగా, గత చరిత్రను భావి తరాలకు అందించాలని రచన చేశాడంటే, నమ్మలేని దుస్థితిలో ఉంది సమాజం. ఎలాంటి దురుద్దేశం లేకుండా ఒక వ్యక్తి రచన చేశాడంటే ఒప్పుకోలేని స్థితిలో ఉన్నారు మేధావులు. ఏదో ఒక దురుద్దేశం ఆపాదించి, ముద్ర వేసి అతడిపై చులకన అభిప్రాయం కలిగించి, అతడిని, అతడి రచనల విలువను తగ్గించకుండా ఉండలేరు. ముఖ్యంగా, అతడి రచనలోని అంశాలు తాము నిర్ధారించే సిద్ధాంతాలకు, తీర్మానాలకు వ్యతిరేకంగా ఉంటే ఆ రచననను అంగీకరించే స్థితిలో లేరు ఈనాటి మేధావులు. వీలుంటే ఆ రచన స్వరూపాన్నే మార్చేస్తారు తప్ప తమ సిద్ధాంతాలు, అవగాహనలో దోషం ఉందని ఒప్పుకోరు. కల్హణుడు బ్రాహ్మణుల గొప్పతనం చూపించేందుకే రాజతరంగిణి రచించాడని వ్యాఖ్యానిస్తారు తప్ప ఆయన ఎంత నిష్పాక్షికంగా, నిజాయితీగా, ఉన్నది ఉన్నట్టు ప్రదర్శిస్తూ రాజతరంగిణిని రచించాడో ప్రస్తావించరు. కల్హణుడు రాజతరంగిణిని నిష్పాక్షికంగా, నిజాయితీగా, నిక్కచ్చిగా రాశాడని  రాజతరంగిణిలో ఇకపై వచ్చే పలు ప్రస్తావనలు స్పష్టం చేస్తాయి. అంతే కాదు, ‘బ్రాహ్మణ’ అన్న పదానికి అంత గౌరవం ఎందుకో కూడా కల్హణుడి వ్యాఖ్యలు ప్రదర్శిస్తాయి. ఎవరిని పడితే వారిని ‘బ్రాహ్మణుడ’ని గుడ్దిగా గౌరవించటం భారతీయ సమాజంలో ఎన్నడూ లేదని, వ్యక్తి గుణం, ప్రవర్తన, వ్యక్తిత్వాన్ని బట్టి గౌరవం అన్నదాన్ని కల్హణుడి రాజతరంగిణి నిరూపిస్తుంది.

రాజు చక్రవర్మ ‘నీచ’ ప్రవర్తనను చీదరించుకుంటూనే రాజతరంగిణిలో ప్రదర్శిస్తూ వచ్చిన కల్హణుడు తన పదునైన విమర్శను ఆ కాలంలోని బ్రాహ్మణుల కోసం ప్రత్యేకంగా అట్టేపెట్టాడు. ‘శ్వాపక స్త్రీ( కుక్క మాంసం తినేవారు శ్వాపకులు)’తో సాంగత్యం వల్ల రాజు పాపం చేశాడని, ఆ పాపానికి పరిహారం ‘పునీతురాలైన బ్రాహ్మణ స్త్రీ’ సాంగత్యంతో పోతుందని రాజుని అతని చుట్టూ ఉన్న దుష్టులు నమ్మించారు. దాంతో ఒక నెల పాటు ఉపవాసం చేసి పవిత్రురాలయిన ఓ బ్రాహ్మణుడి భార్యతో సంగమించి రాజు తన పాపానికి పరిహారం చేసుకుంటాడు. ఇది చెప్పిన తరువాత కల్హణుడి వ్యాఖ్య – ‘ఆ కాలంలో బ్రాహ్మణులు రాజు కన్నా పాపాత్ములు’.

కశ్మీర చరిత్రలోనే కాదు, భారతదేశ చరిత్రలో కూడా ఒక విషయం స్పష్టంగా కనిపిస్తూంటుంది. పలు సందర్భాలలో బ్రాహ్మణులు రాజు ‘మనస్సాక్షి’లా వ్యవహరిస్తారు. రాజుకు హితవు చెప్తారు. సమాజానికి ఏది మంచో అది బోధిస్తారు. రాజును సన్మార్గంలో పెట్టాలని ప్రయత్నిస్తారు. అది కుదరని పక్షంలో, రాజు దుష్టుడయితే, రాజ్యం వదిలి వెళ్ళిపోతారు. లేదా కత్తి పట్టి యుద్ధం చేసి రాజును గద్దె దింపుతారు. పుష్యమిత్రుడు ఇందుకు ఉదాహరణ. లేదా తాము వెనుక ఉండి మరొకరిని రాజుగా నిలిపి ధర్మకార్యం నిర్వహిస్తారు. చాణక్యుడు, అప్పాజీ ఇందుకు చక్కని ఉదాహరణలు. దీనికి మరో పార్శ్వం కొందరు ప్రలోభానికి గురయి రాజు చెప్పినట్టు చేస్తారు. రాజు దుశ్చర్యలకు ఏదో ఓ రకంగా ప్రామాణికత కలిపిస్తూ ‘చెడు’ను నిలపడంతో తమ వంతు బాధ్యతను నిర్వహిస్తారు.  భారతదేశ చరిత్రలో భారతీయ సమాజాన్ని లొంగదీసుకోవాలని ప్రయత్నించిన ప్రతివారూ బ్రాహ్మణ సమాజంపైనే తమ శరాలను సంధించారు. వారిని హింసించారు. అనేకులు పారిపోయి తమని, తమ ధర్మాన్ని రక్షించుకున్నారు. కశ్మీరు చరిత్రలో కూడా ఇకపై పలు సందర్భాలలో పనిగట్టుకుని పాలకులు పండితులను హింసించటం, చంపటం కనిపిస్తుంది. అయినా వారు తమ ధర్మాన్ని వదలలేదు. ధర్మాన్ని వదిలినవారు చేసినంత నష్టం భారతీయ ధర్మానికి విదేశీ ముష్కరులు కూడా చేయలేదు.

అయితే, చరిత్రలో వీరిని ప్రస్తావించడంలో తేడా కనిపిస్తుంది. ‘మంచి’ వైపు నిలిచిన వారిని స్మరించడం, ‘చెడు’ వైపు నిలిచిన వారిని దుష్టులని ఈసడించటం తెలుస్తుంది. చరిత్ర రచనలో కూడా ‘ధర్మం’ వైపు నిలిచిన వారిని ప్రాతఃస్మరణీయులను చేయటం, వ్యతిరేకులను పట్టించుకోకపోవటం ఆనవాయితీ. అందుకే రాజతరంగిణిలో కల్హణుడు నిర్మొహమాటంగా అనాటి బ్రాహ్మణులను రాజు కన్నా దుష్టులు అన్నాడు. దుష్టుడి కన్నా వాడికి మద్దతిస్తున్న వారి దౌష్ట్యం అధికం. అందుకే ఆ రాజభవనంలో ఆహారం సేవిస్తూ, రాజు అందిస్తున్న అగ్రహారాలను దానంగా స్వీకరిస్తున్న బ్రాహ్మణులను పాపులుగా అభివర్ణిస్తాడు కల్హణుడు.

ఈ సందర్భంలో ఓ విషయం ప్రస్తావించుకోవాలి. మొఘలు రాజులలో అక్బరు, సంస్కృత గ్రంథాలను పార్శీ అనువాదాలను ప్రోత్సాహించాడు. ఆయన జైనులను, బ్రాహ్మణులను చేరదీసి వారితో మత చర్చలు జరిపేవాడు. వారి పవిత్ర గ్రంథాల సారం వినేవాడు. అయితే, అక్బరు, జహంగీరు, షాజహాన్‍ల దగ్గర ఉంటూ వారికి తమ ధర్మం గురించి బోధిస్తూ, మెప్పు పొంది, వారి నుంచి అనేక వరాలు పొందిన జైనులు ఆ విషయం ప్రకటించుకున్నారు. అలాంటి వారిని గొప్పవారిగా పొగిడారు. కానీ అదే సమయంలో వారి ఆస్థానాలలో ఉన్న బ్రాహ్మణ పండితులెవరూ ఆ విషయం గొప్పగా చెప్పుకోలేదు. ఏదో తప్పనిసరిగా, పొట్టకూటి కోసమో, మరెందుకోసమో వారి దగ్గర ఉన్నట్టున్నారు తప్ప వారి నుండి ఎలాంటి వరాలు, వారు పొందలేదు, ఆశించలేదు. ఏమైనా లభించినా దాన్ని గొప్పగా చెప్పుకోలేదు. ఒకవేళ సుల్తానును ఏమైనా అర్ధించినా అది హిందువులపై దమనకాండ తగ్గించమని, వారిని పన్నులతో బాధించవద్దనీ వేడుకున్నారు. ఇది కశ్మీరులో కూడా కనిపిస్తుంది.

“The Jain verbosity about their imperial experiences are framed by an inverse reticence to pen narrative records on the part of Brahmans involved in similar cross-cultural exchanges. Brahmans far outnumbered Jains as recipients of Mughal patronage but were reluctant to describe their imperial interactions in Sanskrit texts.”

“The Brahmanical silence is deafening in its declaration that while Sanskrit intellectuals could participate in the imperial Persianate sphere, they could not allow narratives of such interactions to permeate their literary world.” (Culture of Encounters by Audrey Truschke, Page No. 169)

దాన్ని కొందరు ‘అహంకారం’ అంటారు. మరో కోణంలో చూసేవారు ‘ఆత్మగౌరవం’ అంటారు. భారతీయులు ఇలా ఎవరిముందు తల వంచకపోవటం, తప్పనిసరి పరిస్థితులలో లొంగినట్టు కనిపించినా, తమ గౌరవాన్ని నిలుపుకోవటాన్ని దెబ్బ తీయటం ఆవశ్యకంగా భావించిన బ్రిటీష్ వారు భారతీయుల ఆత్మగౌరవానికి మూలాలయిన ధర్మాన్ని, చరిత్రను, సంప్రదాయాన్ని తక్కువ చేయాలన్న ప్రయత్నం చేశారు. దాని ఫలితాలు ఇప్పుడు మనం అనుభవిస్తున్నాం.

ఈ సందర్భంలో ‘కవీంద్రాచార్య సరస్వతి’ గురించి ప్రస్తావించుకోవాల్సి ఉంటుంది. ఆయన తన పాండిత్యంతో మొఘలు రాజును మెప్పించి, వారణాసి సందర్శించే సనాతన ధర్మానుయాయులపై విధించే పన్ను  తొలగేట్టు చేశాడు. ఈయనను ప్రస్తుతిస్తూ ‘కవీంద్ర చంద్రోదయ’ అన్న పద్యాల సంకలనం 70 మంది కవుల పద్యాలతో వెలువడింది.

దామరుల సహాయంతో రాజ్యం సంపాదించిన చక్రవర్మ, శ్వాపక మహిళ ప్రేమికుడయిన రాజు చక్రవర్మ, తనను నమ్మిన దామరులను మోసంతో చంపించాడు. దాంతో దామరులు ప్రతీకారం తీర్చుకునేందుకు అవకాశం  కోసం ఎదురుచూడసాగారు. ఒకరోజు రాజు శ్వాపక మహిళ సంగమం తర్వాత బహిర్భూమికి వెళ్తున్నప్పుడు దామరులు రాజుపై దాడి చేశారు. రాజు ఒంటినిండా గాయాలతో రక్తం ఓడుతూ ప్రాణరక్షణ కోసం పరుగెత్తుతుంటే, వారు జంతువును వెంబడించి వేటాడుతున్నట్టు రాజుని వేటాడేరు. ఆయుధం దొరక్క, దాక్కునే స్థలం లేక, రాజు తన పడక గదిలో శ్వాపక మహిళపై పడి ఉండగా వారు అతడిని జంతువును చంపినట్టు చంపారు. కల్హణుడు చక్రవర్మను చంపిన విధానాన్ని ‘కుక్క’ని చంపినట్టు చంపారు అని వర్ణిస్తాడు. రాజు తన దుశ్చర్యలకు తగిన శిక్షను అనుభవించాడు. అయితే ప్రజల పాపాలు ఇంకా పరిహారం కాలేదన్నట్టు చక్రవర్మ కన్నా దుష్టుడు, పార్థుడి కొడుకు ఉన్మత్తవంతుడు రాజ్యానికి వచ్చాడు. అది క్రీ.శ. 937వ సంవత్సరం.

 భారతదేశ చరిత్రలో ఇలా రాజును వేటాడి చంపటం, నిరాయుధుడిగా ఉన్నవాడిపై దాడి చేసి చంపటం అన్నది లేదు.  చాలా అరుదు. అది అరుదుగా జరిగినా ప్రజలు అలాంటి వాడిని రాజుగా ఆమోదించేవారు కాదు. కానీ భారతదేశం మ్లేచ్ఛులమయం అవుతూ వస్తున్నప్పటి నుంచీ పరిస్థితులలో మార్పు వచ్చింది. దృక్కోణాలలో మార్పు వచ్చింది. ఇలా రాత్రి పూట బహిర్భూమికి వెళ్ళేవారిపై దాడులు చేసి చంపటం అన్నది పర్షియన్లు భారతదేశంలోని పలు ప్రాంతాలపై అధికారం సాధించిన తరువాత మొదలైన పద్ధతి.  ఆ కాలంలో మ్లేచ్ఛుల  మూకలు గ్రామాలపై దాడులు చేసి దోచుకుని, అక్కడి ప్రజలను హింసించి, మతం మార్చి, మతం మారని వారిని చంపేవారు. దేవాలయాలను కూలగొట్టి, వాటి శకలాలతో వారి ప్రార్ధనా స్థలాలు  నిర్మించేవారు. దాంతో మ్లేచ్ఛుల  మూకలు వస్తున్నాయంటే ప్రజలు ఊళ్ళు వదలి పారిపోయేవారు. వాళ్ళు వెళ్ళిన తరువాత మళ్ళీ ఊళ్ళల్లో ప్రవేశించారు. అలాంటప్పుడు ఎవరయినా దొరికితే వారితో మ్లేచ్ఛుల  మరింత క్రూరంగా వ్యవహరించేవారు. ఇందువల్ల ప్రజలలో మ్లేచ్ఛులపై ద్వేషం, క్రోధాలుండేవి. బహిరంగ యుద్ధాలలో వారిని గెలవలేమని తెలిసిన వారు ఇలా నిరాయుధులుగా, నిస్సహాయ స్థితిలో దొరకటం ఎదురుచూసేవారు. అర్ధరాత్రిళ్ళు ఇలా బహిర్భూమికి వచ్చిన మ్లేచ్ఛుల  నాయకులపై దాడులు చేసి చంపేసేవారు. ఈ భయంతో మ్లేచ్ఛులు, ఇంటికి దూరంగా కాక, ఇంటికి దగ్గర గానో, రక్షణ ఉన్న స్థలాలలోనో విసర్జన శాలలను నిర్మించే పద్ధతిని ఆరంభించారు. అయితే మ్లేచ్ఛులకు ‘విసర్జితాలు’ అసహ్యం. అందుకని వాటిని ఎత్తి దూరంగా పారేసేవారు అవసరం అయ్యారు. ఇందుకోసం యుద్ధంలో బందీలుగా చిక్కినవారో, మతం మారకుండా ఉన్నవారో నియమితులయ్యేవారు. అలా దేశంలో అంతవరకూ లేని ‘పెంట ఎత్తే’ వ్యవస్థ ఏర్పడింది (ఈ విషయాలు కస్తూరి మురళీకృష్ణ ద్రష్టఅన్న నవలలోనూ; ‘ఉజ్జ్వల భారత మహోజ్జ్వల గాథలుకథల సంపుటిలో  భక్తి ఉద్యమానికి ఊపిరులూదిన నరహరి సర్కార్అన్న కథలోనూ పొందుపరిచారు).

దేశ విభజన సమయంలో పాకిస్తాన్‍కు చెందిన ప్రాంతంలోని నిమ్న కులాల వారంతా భారత్‍కు ప్రయాణమయ్యారు. దాంతో పాకిస్తాన్‌లో వీధులూడ్చేవారు, డ్రైనేజీలను శుభ్రం చేసేవారూ కరువయ్యారు. అతి శుభ్రమైన పాకిస్తాన్ చెత్తస్తాన్ అయిపోయిందన్న విమర్శలు వెల్లువెత్తాయి. ఎందుకంటే   తక్కువ స్థాయి ఉద్యోగాలున్నాయి కానీ చేసేవారు లేరు. ఈ సమయంలో పాకిస్తాన్ నాయకత్వం దేశం నుంచి తక్కువ స్థాయి ఉద్యోగాలు చేసే హిందువులను, క్రిస్టియన్‍లను దేశం వదిలి వెళ్ళకుండా అడ్డుకుంది. వాళ్ళు వెళ్ళిపోతే వీధులూడ్చేదెవరు? డ్రైనేజీలు శుభ్రపరిచి పెంటలెత్తేదెవరు? ఈ సమయంలో అంటే 1948లో పాకిస్తాన్‍లో ఇండియన్ హై కమీషనర్ శ్రీ ప్రకాశ్, పాక్ ప్రధానితో నిరసన వ్యక్తపరిచాడు. ‘Surely God did not create the Hindus… to clean the roads and latrines of Karachi!’. But, ‘who’, the Prime Minister purportedly replied. ‘would clean the streets and latrines of Karachi in case they did not come back?’ (Empires of the Indus by Alice Albinia, Page No.20). ఈనాటికీ పాకిస్తాన్‌లో మైనారిటీ కాఫిర్‍లే డ్రైనేజీలు,  వీధులూ  శుభ్రం చేస్తారు. వారికి ఎలాంటి ఎదుగుదల, ఉద్యోగావకాశాలు లేవు.

చరిత్ర సరిగా తెలియని వారు, భారతీయ వ్యవస్థను చులకన చేసి, ప్రజల మధ్య విద్వేషాలు సృష్టించాలనుకునే విచ్ఛిన్నవాదులు, భారతీయ కులవ్యవస్థ గురించి పలు రకాల ద్వేషపూరిత వ్యాఖ్యానాలు చేస్తారు. కానీ చరిత్రను పరిశీలిస్తే మరో రకమైన ‘సత్యం’ కనిపిస్తుంది. మహమ్మద్ ఘజినీ వెంట భారత్ వచ్చిన అల్బెరూనీ భారతదేశంలో అంటరానివి ఎనిమిది కులాలు మాత్రమే అని రాశాడు. తోలు శుభ్రపరిచేవారు; చెప్పులు తయారు చేసేవారు; ఇంద్రజాలికులు; చేపలు పట్టేవారు; జంతువులను, పిట్టలను వేటాడేవారు; వీధులను, భవనాలను శుభ్రపరిచేవారు, తట్టలు బుట్టలు అల్లేవారు, నావికులు. ఇవి కాక ఇప్పుడున్న కులాల ఆవిర్భావానికి అగ్రవర్ణాల దౌష్ట్యం, భారతీయ ధర్మశాస్త్రాల నైచ్యం, జీవన విధానంలోని ద్వంద్వ ప్రవృత్తులనడం కాక విదేశీయుల దండయాత్రలు, వారి ఆగమనంతో వల్ల భారతీయ సమాజంలో చెలరేగిన కలకలం, జరిగిన అల్లకల్లోలం వంటి అంశాల ఆధారంగా సామాజిక పరిణామ క్రమాన్ని అధ్యయనం చేయాల్సి ఉంటుంది.

The people called Hadi, Domba, chandala, and badhatau are not reckoned among any caste or guild. They are occupied with dirty work, like the cleansing of villages and other services. They are considered as one sole class and  distinguished only by their occupations. In fact, they are considered like illegitimate children: for according to general opinion they descend from  a Sudra father and a Brahmani mother as the children of fornication: therefore they are degraded outcastes.  ( India by Al-Biruni ,edited by Qeyamuddin Ahmad,  chapter IX, para  IV, page 46 )

అంటే, నాలుగువర్ణాలు కాక పంచమ వర్ణంగా భావిస్తున్నవారు పలుకారణాలవల్ల వారి కులం కోల్పోయినవారన్నమాట. అయితే, సమాజం ఈ విధమయిన వివక్షతను ఇతర నాగరికతల్లోలా మౌనంగా స్వీకరించలేదు. ఆ కాలంలోనే, సంత్ జ్ఞానేశ్వర్, ఇలాంటి వెలివేతను నిరసించి, ధర్మ శాస్త్రాలు అందరికీ తెలియని అజ్ఞానం వల్ల ఇలాంటి పరిస్థితులు నెలకొంటున్నాయని గమనించి భగవద్గీతను మరాఠీ భాషలోకి అనువదించాడు. వేద సారాన్ని అభంగులనే సులవయిన కీర్తనల రూపంలో సామాన్యమానవుడికి చేరువ చేశాడు. ఆయన స్ఫూర్తితోనే దేశ వ్యాప్తంగా సామాజిక సంస్కరణను దైవంతో, ధర్మంతో ముడిపెడుతూ ఉద్యమాలు చెలరేగాయి. దేశ వ్యాప్తంగా పలు ప్రాంతాలలో సామాజిక వివక్షతకు వ్యతిరేకంగా ఇలాంటి స్వఛ్ఛంద సామాజిక తిరుగుబాట్లు ఆధ్యాత్మిక, ధార్మిక ఉద్యమాల రూపంలో జరిగేయి.  ( చూ:  ఉజ్జ్వల భారత మహోజ్జ్వల గాథలుకథల సంపుటిలో  భక్తి ఉద్యమానికి ఊపిరులూదిన నరహరి సర్కార్అన్న కథ)   ఈ సందర్భంలో ప్రఖ్యాత చరిత్రకారుడు కె.ఎస్. లాల్ వ్యాఖ్యను గమనించాల్సి ఉంటుంది.

‘The mindset of upper caste/backward caste conflict syndrome needs reviewing as it is neither based on historical evidence nor supported by compulsions of the situation. The present day isolated conflicts may be a rural politician/plebian problem of no great antiquity’ (The Legacy of Muslim Rule in India, by K.S. Lal, Page No. 275-276).

ఉన్మత్తవంతుడి పాలన గురించి చెప్పేందుకు కల్హణుడి కలం కూడా ఇష్టపడక, కదలక స్తంభించిపోయిందట!

స్థగితా తత్కథా పాపస్పర్శభీత్యా సరస్వతీ।
కథం చిత్ర్తస్నురశ్వేవ సేయం ప్రస్థాప్యతే మయా॥
(కల్హణ రాజతరంగిణి 5, 416)

ఉన్మత్తవంతుడి దుష్పరిపాలన గురించి, దౌష్ట్యం గురించి చెప్పేందుకు ఆ పాపం తనకూ చుట్టుకుంటుందేమోనని సరస్వతి కూడా భయపడుతోందట. అయినా అతి కష్టం మీద ముందుకు సాగుతున్నానని అంటాడు కల్హణుడు. కదలడానికి ఇష్టపడని గుర్రాన్ని బలవంతంగా ముందుకు నడిపించినట్టు కథను కొనసాగిస్తున్నానంటాడు కల్హణుడు. తలలపై, వెంట్రుకలపై మోదుతూ, ముక్కుతో సహా ఇతర అవయవాలపై పలు రకాల వాయిద్యాలు వాయించగల వారే అతని ఆస్థానంలో మంత్రులుగా అయ్యారు. వాళ్ళు సిగ్గు లజ్జ వదిలి నర్తిస్తూ ఉన్మత్తవంతుడికి ఉన్మత్తమైన ఆనందాన్ని అందించారు. అంగవస్త్రం వదిలి, నృత్యం చేసిన పర్వగుప్తుడు రాజుకు ఆత్మీయుడయ్యాడు.

ఇది చదువుతుంటే ఇప్పటి సంగీత, నృత్య, చలనచిత్ర కళలు కళ్ళముందు కదులుతాయి. విచిత్ర శబ్దాల సృష్టి, వొళ్ళంతా కనిపిస్తూ, లైంగిక కదలికలను తలపుకు తెచ్చే కదలికలతో, పిచ్చి కూతలు, పచ్చి బూతులతో ఉన్నదే అత్యుత్తమ కళగా చలామణీ అవటం గమనిస్తే, ఉత్తమమన్నది నిరాదరణకు గురయి, ఉన్నతమన్నది విస్మృతిలో పడటం తెలుసుకుంటే, ‘మారేది కాలం తప్ప మనిషి కాదు’ అన్న భావన స్థిరపడుతుంది. దిగజారుడుతనాన్నే ఆధునికంగా, అభ్యుదయంగా, అత్యుత్తమంగా బావిస్తున్న ఆధునిక పండిత మేధావుల ప్రవర్తన గుర్తుకువస్తుంది. హృదయం బరువెక్కుతుంది. అందుకేనేమో, ఉన్మత్తవంతుడి పాప చరిత్రను తాకేందుకు సరస్వతి కూడా జంకింది. కానీ కల్హణుడిలా అయిష్టంగానైనా మనమూ ముందుకు పోక తప్పదు. గత చరిత్ర తెలియని వారు ఆ తప్పిదాలే చేస్తూంటారు. కాబట్టి చరిత్ర తెలుసుకోక తప్పదు.

(ఇంకా ఉంది)

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here