Site icon Sanchika

కశ్మీర రాజతరంగిణి-62

[box type=’note’ fontsize=’16’] కశ్మీర్ ప్రాచీన చరిత్ర గురించి అవగాహన కలిగించి, భవిష్యత్తు గురించి ఆలోచనలు కలిగించాలన్న ప్రయత్నంలో భాగంగా నీలమతపురాణం తరువాత అందిస్తున్న జోనరాజు, శ్రీవరుడు, ప్రజ్ఞాభట్టులు కల్హణుడి అడుగుజాడల్లో నడుస్తూ సంస్కృతంలో రచించిన ‘కశ్మీర రాజతరంగిణి’ అనువాదాన్ని తెలుగు పాఠకులకు అందిస్తున్నారు కస్తూరి మురళీకృష్ణ. [/box]

ధింకనిర్విచారాన్కృపతీ క్యేషాం విషమచేతసామ్।
ఫలశున్యా స్తుతిస్తోషే దోషే ప్రాణధనక్షయః॥
(కల్హణ రాజతరంగిణి 6, 323)

[dropcap]యు[/dropcap]క్తాయుక్త విచక్షణా శూన్యులు, చంచల మనస్కులు ప్రభువులయితే, వారు వారికి ఆనందం కలిగినప్పుడు ఎలాంటి బహుమతులివ్వకుండానే అనుచరులకి శుష్క పొగడ్తలు అందిస్తారు. వారికి నచ్చనప్పుడు ధనప్రాణాలు కొల్లగొడతారు.

దిద్దారాణి పాలనాకాలాన్ని వివరిస్తూ కల్హణుడు చేసిన ఈ వ్యాఖ్య ఈనాటికీ వర్తిస్తుంది. మానవ ప్రకృతిలో అధికార దాహం, అహంకారం, తన క్రింది వారంటే తూష్ణీంభావాలు ఉన్నంత కాలం ఈ వ్యాఖ్య వర్తిస్తుంది.

కొన్నాళ్ళ సత్ప్రవర్తన తర్వాత దిద్దారాణి మళ్ళీ తన ఇష్టం వచ్చినట్టు దౌష్ట్యంగా ప్రవర్తించటం ఆరంభించింది. తనకు అడ్డుగా ఉన్నారనిపించిన ఇద్దరు మనుమళ్ళను చంపించింది. భీమగుప్తుడనే మరో మనుమడిని సింహాసనంపై కూర్చోబెట్టింది. ఫల్గుణుడు మరణించటంతో ఆమె అడ్డు అదుపు లేకుండా ప్రవర్తించటం ప్రారంభించింది. ‘ఖాసా’ జాతికి చెందిన తుంగుడనే, ఎద్దులను కాపలా కాసేవాడిపై ఆమె మరులు గొన్నది. ఎద్దులను కాచే తుంగుడిని రాణి తన ఆంతరంగిక మందిరంలోకి రానిచ్చింది. ఆమెకున్న అసంఖ్యాకమైన ప్రియులలో తుంగుడిని అత్యంత ప్రియమైనవాడిగా భావించింది. తన ప్రవర్తనను నిరసించిన భుయ్యుడిని చంపించింది. యుక్తవయసు వచ్చిన భీమగుప్తుడు దిద్దారాణి ప్రవర్తనను, చర్యలను నిరసించాడు. ఆ పరిస్థితిని చక్కదిద్దాలని ప్రయత్నించాడు. వెంటనే రాణి అతడిని చెరసాలలో బంధించింది. చిత్రహింసలు పెట్టి చంపించింది. ఆ తరువాత తానే సింహాసనాన్ని అధిరోహించింది. అది క్రీ.శ. 980వ సంవత్సరం. దిద్దారాణి సింహాసనాన్ని అధిష్టించటంతో తుంగుడు సర్వాధికారి అయ్యాడు. ఆ సందర్భంలో పై వ్యాఖ్య చేశాడు కల్హణుడు.

ఆనాటి ప్రభువుల స్థానాన్ని ఈనాడు అధికారులు ఆక్రమించారు. పేరుకు ప్రజాస్వామ్యమైనా, అధికారులు ప్రభువుల్లాగే పలు సౌఖ్యాలు అనుభవిస్తారు. తమ క్రిందివారి భాగ్యవిధాతలుగా వ్యవహరిస్తారు. తాము ఉన్నతులం, తమ క్రింద పని చేసేవారు అధములు అన్నట్టు భావిస్తారు. అలాంటి వారి మెప్పుకోరి, స్వార్థం కోసం కొందరు వారి చెంత చేరుతారు. ప్రియమైన మాటలు చెప్పి వారి మనస్సులు దోస్తారు. తమ లాభం చూసుకుని ఇతరులకు కష్టాలు కలిగిస్తారు. ఇది ఇతరులలో నిరసన కలిగిస్తుంది. కానీ అధికారంలో ఉన్నవారి దృష్టికి ఈ నిరసన రాకుండా జాగ్రత్తపడతారీ స్వార్థపరులు. ఇంతకీ వారు సాధించేదేమిటంటే, ఏమీ లేదు! ఎందుకంటే అధికారులకు ఎవరిపైనా శాశ్వతమైన ప్రేమ, అభిమానాలుండవు. తనకు ఉపయోగపడేవాడిని చేరదీస్తారు. ఉపయోగపడని వారిని శిక్షిస్తారు. అలాగని చేరదీసిన వారికి కూడా ఎలాంటి సాయం చేయరు. తమ అవసరం తీరిన తరువాతనో, తమకు వారి వల్ల ఉపయోగం లేదని గ్రహించిన తరువాతనో, చెత్తను విసిరివేసినట్టు విసిరేస్తారు. దిద్దారాణి అదే చేసింది. ఈనాటికీ అదే జరుగుతోంది. అధికారి సాన్నిహిత్యంతో తమని తాము అధికులమని భావించుకుని గర్వించేవారు అప్పుడూ భంగపడ్డారు. ఇప్పుడూ భంగపడుతూనే ఉన్నారు. వారు అప్పుడూ ఇతరులకు అన్యాయం చేశారు. ఇప్పుడూ అన్యాయం చేస్తూనే ఉన్నారు. ఇది జగతి రీతి.

రాణికి దగ్గరయి సర్వాధికారాలు తుంగుడు అనుభవిస్తూండటం వల్ల అధికారం కోల్పోయిన వారంతా ఒకటయ్యారు. దిద్దారాణి సోదరుడి కొడుకు విగ్రహరాజును తెరపైకి తెచ్చారు. విగ్రహరాజు శక్తిమంతుడు. అతడు ముందుగా ప్రధాన అగ్రహారాల అధిపతులయిన బ్రాహ్మణులను తనవైపు తిప్పుకున్నాడు. వారందరిని ఏకత్రాటిపై తెచ్చాడు. వారందరితో నిరసన ప్రదర్శనలు ఆరంభించాడు. రాజ్యంలో అల్లకల్లోలం సృష్టించేందుకు ‘ప్రాయోపవేశాల’నే ఆయుధాన్ని వాడాడు. బ్రాహ్మణులు ఒక్కటై నిరసన ఆరంభించగానే ప్రజలలో అల్లకల్లోలం బయలుదేరింది. వారు తుంగుడిపై ద్వేషంతో తుంగుడు దొరికితే చంపాలని, తుంగుడి కోసం వెతకసాగారు. తుంగుడి ప్రాణాలు రక్షించేందుకు రాణి తుంగుడిని భద్రంగా దాచి, పరిస్థితి మెరుగుపరిచేందుకు ప్రయత్నాలు ప్రారంభించింది.

ఇక్కడ కాసేపు ఆగి ఆలోచించాల్సి ఉంటుంది.

ఆనాడూ, ఈనాడూ – ప్రభుత్వాలను వంచటానికి, నాయకుడి చేతకానితనం నిరూపించటానికి, అధికారం సాధించటానికి ‘నిరసన’ ప్రధాన ఆయుధం. శక్తిమంతులు ఒక గుంపుగా ఏర్పడి, ఆందోళనలు చేయటం, అల్లర్లు చేయటం, హింస జరపటం, అమాయకులను రెచ్చగొట్టటం, అన్యాయమయిపోయినట్టు అరవటం ,  ఆనాడూ, ఈనాడూ అధికార సాధనకు రాజమార్గం. గమనిస్తే, ఇటీవలి కాలంలో ప్రతి చిన్న విషయాన్నీ పెద్దది చేయటం, అది ప్రాణాంతకం అన్నట్టు ప్రచారం చేయటం, ఒక ఉత్సవంలా నిరసనలు చేయటం, ఆపై తమకు నచ్చని నాయకులపై దాడులు చేయటం మన దేశంలో సర్వసాధారణం అయింది. ‘ఆందోళన జీవి’ అన్న పదం జాతీయ స్థాయిలో ఆమోదం పొందిన పదం అయింది. కశ్మీరు చరిత్రను గమనిస్తే, కశ్మీరులో జరిగిన దానికీ, దేశంలోని ఇతర భాగాలలో జరిగిన దానికీ, ఈనాడు జరుగుతున్న దానికీ ఏ మాత్రం తేడా లేదన్న భావన కలుగుతుంది. వ్యవస్థ మారినా వ్యవస్థ వ్యక్తిత్వం మారలేదనిపిస్తుంది. రాణి దిద్దాదేవి తనకు వ్యతిరేకంగా జరుగుతున్న ‘కుట్ర’ను ఎదుర్కున్న విధానం ఈ భావనను బలపరుస్తుంది.

సాధారణంగా ఎవరో ఒకరు రెచ్చగొడతారు. నిరసనలు మొదలవుతాయి. అధికారులు నిరసన చేస్తున్న వారి నాయకులతో ఒప్పందాలు చేసుకుంటారు. నిరసన వీగిపోతుంది. రెండు వైపులా నాయకులు బాగానే ఉంటారు. నాయకులను అనుసరించిన వారు నష్టపోతారు. దిద్దారాణి పరిస్థితిని అర్థం చేసుకుంది. విగ్రహరాజు దేశంలో అల్లకల్లోలం సృష్టించటం ద్వారా అధికారాన్ని అందుకోవాలని ప్రయత్నిస్తున్నాడని గ్రహించింది. దీనికి తుంగుడితో తన సంబంధాన్ని కారణంగా చూపుతున్నాడనీ గ్రహించింది. ఈ నిరసనకు బ్రాహ్మణులను ప్రధాన ఆధారంగా చేసుకున్నాడనీ అర్థం చేసుకుంది. బ్రాహ్మణ సమూహానికి నాయకుడికి ‘బంగారం’ ఎరగా వేసింది. క్షణాలలో నిరసనలు ఆవిరైపోయాయి. ఎవరెవరు శక్తిమంతులో, ఎవరెవరు తన పట్ల వ్యతిరేకత ప్రదర్శించారో వారందరికీ లంచాలిచ్చింది. విగ్రహరాజు శక్తిని నిర్వీర్యం చేసేసింది. దాంతో విగ్రహరాజు తోక ముడవాల్సి వచ్చింది. ఇదంతా అప్పుడే కాదూ, ఇప్పుడూ మన కళ్ళ ముందు జరుగుతూనే వుంది. ‘ప్రపంచం కొత్తది కానీ దాని ముఖం పాతది’ అంటే ఇదే.

నిరసన ఆవిరైపోవటంతో మళ్ళీ తుంగుడు, అతడి అనుచరులు శక్తిమంతులయ్యారు. తమను వ్యతిరేకించిన వారందరినీ పద్ధతి ప్రకారం మట్టుపెట్టారు. కొన్నాళ్ళ తరువాత విగ్రహరాజు మళ్ళీ బ్రాహ్మణులకు లంచాలిచ్చి ‘నిరసన’ నాటకం ఆరంభించాడు. కానీ తుంగుడు ముందే లంచాలిచ్చి నిరసనను ఎదగనివ్వలేదు. ఇలా కశ్మీరులో ‘నిరసనలు’, ‘లంచాలు’, ‘వితరణలు’, వ్యతిరేకులను చంపటాలు సాగుతూ వచ్చాయి, ఆధునిక సమాజంలో లాగే. వ్యతిరేకించిన వారందరినీ మట్టుపెట్టి తుంగుడు కశ్మీరంలో శక్తిమంతుడయ్యాడు. ఈ సమయంలో దిద్దారాణి రాజును ఎన్నుకునేందుకు, భావితరాలకు ఆదర్శప్రాయమైన ఒక వినూత్న పద్ధతిని ప్రవేశపెట్టింది.

ఆపిల్ పళ్ళను గదిలో విరజిమ్మింది. ఎవరు ఎక్కువ పళ్ళు ఏరితే వాడే కశ్మీరానికి రాజు అని ప్రకటించింది. దాంతో రాజ్యాధికారం పై ఆశ ఉన్న దిద్దారాణి బంధువుల పిల్లలంతా పళ్ళను ఏరటం కోసం ఎగబడ్డారు. ఆ తరువాత జరిగింది కశ్మీర రాణి దిద్దాదేవికథలో కస్తూరి మురళీకృష్ణ నాటకీయంగా వర్ణించారు.

“మహారాణి, నేను అధికంగా రేగు పళ్ళను సంపాదించాను” సంగ్రామ సింహుడు తన రేగు పళ్ళ బుట్టను రాణి ముందుంచాడు.

మిగతా అందరూ రక్తాలు ఓడుతూ, గాయాలతో ఉన్నారు. కానీ సంగ్రామ సింహుడి శరీరం మీద ఒక్క గాయం కూడా లేదు.

“ఇన్ని పళ్ళు ఎలా సంపాదించావు?” అడిగింది రాణి.

“మహారాణీ! వీరంతా పోరాడి సంపాయించిన పళ్ళన్నీ, వారి మధ్య పోరాటం పెట్టి నేను సంగ్రహించాను. వారు పోరాడుకుని అలిసిపోయారు. వారి పళ్ళన్నీ నావే అయ్యాయి” అన్నాడు సంగ్రామ సింహుడు గర్వంగా.

రాణి పెద్దగా నవ్వింది. “నీవే సామ్రాజ్యాధిపతివి. ఎదుటివారి అజ్ఞానాన్ని ఆసరగా తీసుకుని పైకి ఎగబ్రాకగలిగినవాడే కలియుగంలో నాయకుడవుతాడు. వాడే ప్రజల మధ్య చిచ్చు పెట్టి, వారు కొట్టుకు చస్తుంటే, తాను పబ్బం గడుపుకుంటాడు. ధర్మం, నీతి పేరెత్తేవారు కలియుగంలో రాజులు కాలేరు” అని సంగ్రామ సింహుడిని యువరాజుగా అభిషిక్తుడిని చేసింది దిద్దారాణి (కల్హణ కశ్మీర రాజతరంగిణి కథలు, పేజీ నెం 175).

అలా సంగ్రామ సింహుడు అధిక సంఖ్యలో ఏపిల్ పళ్ళను ఏరి కశ్మీరానికి రాజయ్యాడు.

ఈ సందర్భంలో కల్హణుడు ఒక గమ్మత్తయిన భావాన్ని ప్రకటించాడు.

జంతోర్భావా విదధతి యథా భావినః కార్య సిద్ధం తత్త్వం తేషాం క్వచన వస్తుతో నాస్తి కించిత్।
(కల్హణ రాజతరంగిణి 6, 364)

ఏదైనా సాధించాలని నిర్ణయించుకున్నవాడికి తన నిశ్చయ భావన తోడ్పడి కార్యం సిద్ధించేట్టు చేస్తున్నది తప్ప ఆయా పరికరాలలో స్వభావ సిద్ధమైన సిద్ధాంతమేదీ లేదు.

అర్హత లేనివారు అందలాలు ఎక్కటానికి రాజమార్గాన్ని ఏర్పరిచింది దిద్దాదేవి. రాచరికమైనా, ప్రజాస్వామ్యమైనా ఈనాటికీ రాణి దిద్దాదేవి చూపిన మార్గాన్నే అనుసరిస్తున్నాము.

ఈనాడు ఒక వ్యక్తి అధికారం సాధించటానికి ప్రధానంగా అతడు అధిక సంఖ్యలో ప్రజలను ఆకర్షించటం కారణమవుతోంది. అతడు ప్రజలను సక్రమంగా ఆకర్షించాడా, అక్రమంగా ఆకర్షించాడా అన్నది అనవసరం. ఆకర్షించాడా? లేదా? అన్నది ప్రధానం. ప్రజలకు ఆత్మవిశ్వాసాన్నిచ్చి, మనోబలాన్ని పెంచి, సన్మార్గంలో వారిని ఆకర్షించటం కష్టం. ప్రజలను మభ్యపెట్టి, రెచ్చగొట్టి, వారిలోని పశువును నిద్రలేపి, విచక్షణను హరించి, స్వార్థ ప్రయోజనాల ఆశలు చూపి ఆకర్షించటం సులభం. ప్రస్తుతం ప్రపంచంలో ఏ సమాజంలో చూసినా జరుగుతున్నది అదే. ఎన్ని ఏపిల్ పళ్ళు ఏరాడన్నది ముఖ్యం తప్ప, ఎలా ఏరేడన్నది ముఖ్యం కాదు. అధిక సంఖ్యలో పళ్ళను సాధించిన వాడే రాజు. ఇది కేవలం రాజకీయ రంగంలోనే కాదు, సమాజంలోని అన్ని రంగాలలోనూ కనిపిస్తోంది.

పరీక్షలో అధికంగా మార్కులు సంపాదించినవాడు అధికారి అయ్యే అర్హత సంపాదిస్తాడు. ఇతర లక్షణాలు అవసరం లేదు. మార్కులు అదృష్టం వల్ల సాధించాడా, అవగాహన వల్ల సాధించాడా, అర్హత ఉండి సాధించాడా అన్నది అనవసరం. అధికారికి ఉండే లక్షణాలున్నాయా? అన్నది అనవసరం. ఎన్ని ఏపిల్ పళ్ళు సాధించాడనేది ప్రధానం.

తన కళ ద్వారా ఏం ప్రదర్శించాడు, ఎలా ప్రదర్శించాడన్నది ముఖ్యం కాదు. తన కళ ద్వారా ఎంతమందిలో పాశవిక ప్రవృత్తులను ప్రకోపింపచేసి ఆకర్షించాడన్నది కళాకారుడి ఉత్తమత్వానికి కొలబద్ద అయింది. ఎంతమంది అనుయాయులను ఆకర్షించి పదే పదే తన కళను పొగిడేట్టు చేసుకున్నాడన్నది కళ ఔన్నత్యానికి కొలబద్ద అయింది. ‘కళ’  ఔన్నత్యానికి కొలబద్ద కాదు.

అంతవరకూ వంశపారంపర్యంగానో, ప్రజాభీష్టం ప్రకారంగానో రాజ్యాధికారం చేపట్టే పద్ధతి పోయి, అధికారంపై ఆశ ఉండి, అధికార సాధన కొసం ఏదైనా చేసి అధికారులను తన వైపు తిప్పుకోగలిగినవాడే రాజయ్యే పరిస్థితిని దిద్దాదేవి స్థిరపరిచింది. ఎలాగయినా అనుకున్నది సాధించినవాడికే అందలం అన్న ఆలోచనకు ప్రామాణికతను ఆపాదించింది దిద్దాదేవి. అది పేరు మారినా, రూపం మారినా, ఈనాటికీ కొనసాగుతూ వస్తోంది. ఆనాడు ఏపిల్ ఫళ్లయితే, ఈనాడు మార్కులు, ఓట్లు, ప్రేక్షకులు, శ్రోతలు, ఇలా ‘నాణ్యత’ కన్నా ‘సంఖ్య’ ప్రాధాన్యం ఉండటం ద్వారా దిద్దాదేవి ఈనాటికీ మన సమాజాన్ని ప్రభావితం చేస్తూనే ఉంది.

ఇలా దాదాపుగా 50 ఏళ్ళ పైన కశ్మీరుపై, భారతీయ సమాజంపై తిరుగులేని ప్రభావాన్ని చూపిన, చూపుతున్న దిద్దారాణి లౌకిక శకం 79వ సంవత్సరంలో, భాద్రపద శుక్ల అష్టమి నాడు మరణించింది. ఆమె మరణించిన తరువాత అంతవరకూ అధిక ఏపిల్ పళ్ళు ఏరిన కారణాన యువరాజుగా ఎంపికయిన సంగ్రామ సింహుడు కశ్మీర సింహాసనాన్ని అధిష్టించాడు (క్రీ.శ.1003).

సంగ్రామ సింహుడు కశ్మీర సింహాసనాన్ని అధిష్టించటంతో కల్హణుడు రచించిన రాజతరంగిణి ఆరవ అధ్యాయం పూర్తవుతుంది.

ఇంతవరకూ కల్హణుడు రచించిన రాజతరంగిణి ఒక ఎత్తు, ఇక పైని రెండు తరంగాలు ఒక ఎత్తు. ఎందుకంటే, ఇంతవరకూ కల్హణుడు సేకరించిన, విన్న ఆధారాల ద్వారా కశ్మీరు చరిత్రను రచించాడు. ఇకపై కల్హణుడు రచించినది ప్రత్యక్ష సాక్షుల ద్వారా వినది, ప్రత్యక్ష సాక్షుల అనుభవాలను రాతల ద్వారా గ్రహించినది, తాను తన తండ్రి ద్వారా, బంధువుల ద్వారా విన్నది, తాను స్వయంగా అనుభవించినదీ. అందుకే రాజతరంగిణిలో ఒక్కో  తరంగం గడుస్తున్న కొద్దీ ఆ తర్వాతి తరంగం నిడివి పెరుగుతూ వస్తుంది. శ్లోకాల సంఖ్య పెరుగుతుంది. ఆ తరంగంలో పొందుపరిచే విషయాల వివరణ పెరుగుతుంది. వర్ణనలు పెరుగుతాయి. అంతర్లీనంగా తాను ప్రదర్శిస్తున్న విషయాల పట్ల కల్హణుడి ఆవేదన కూడా అధికమవుతుంది. కశ్మీరు నెమ్మదిగా పరాయి పాలనలోకి దిగజారేందుకు నాందీ ప్రస్తావన కల్హణుడి రాజతరంగిణిలో కనిపిస్తుంది. ఇతరుల ప్రభావంతో భారతీయ ధర్మం, భారతీయుల జీవన విధానం, భారతీయ వ్యవస్థలు కలుషితం అవటం రాజతరంగిణిలోని చివరి మూడు భాగాలు ప్రదర్శిస్తాయి. ఇది చివరి రెండు భాగాలలో ప్రస్ఫుటంగా కనిపిస్తుంది. కల్హణుడి తరువాత రాజతరంగిణిని కొనసాగించిన జోనరాజు రచనను సమగ్రంగా అర్థం చేసుకోవటానికి భూమికను కల్హణుడి రాజతరంగిణి ఏర్పాటు చేస్తుంది.

(ఇంకా ఉంది)

Exit mobile version