కశ్మీర రాజతరంగిణి-66

0
2

[box type=’note’ fontsize=’16’] కశ్మీర్ ప్రాచీన చరిత్ర గురించి అవగాహన కలిగించి, భవిష్యత్తు గురించి ఆలోచనలు కలిగించాలన్న ప్రయత్నంలో భాగంగా నీలమతపురాణం తరువాత అందిస్తున్న జోనరాజు, శ్రీవరుడు, ప్రజ్ఞాభట్టులు కల్హణుడి అడుగుజాడల్లో నడుస్తూ సంస్కృతంలో రచించిన ‘కశ్మీర రాజతరంగిణి’ అనువాదాన్ని తెలుగు పాఠకులకు అందిస్తున్నారు కస్తూరి మురళీకృష్ణ. [/box]

కాలేనన్త మహీభర్తుర్వైరి  విగ్రహ సంకటే।
సాహసాన్యుదజృంభంన్త తాని తాని క్షణే క్షణే॥
(కల్హణ రాజతరంగిణి 7, 222)

[dropcap]రా[/dropcap]ణి సూర్యమతి కశ్మీర రాజ్య వ్యవహారాలు చక్కబెట్టింది. కానీ ఆ కాలంలో పలువురు పాలనను తప్పుదారి పట్టించేవారుంటే, పాలనను సక్రమ మార్గంలో నడిపించేవారు ఇంకొంతమంది ఉండేవారు. రాజ క్షురకుడు క్షేముడు అనేవాడు రాజు మెప్పు పొందాడు. కీలకమైన పదవిని సాధించాడు. ప్రజలపై పన్నులు పెంచి అతడు కోశాగారాన్ని నింపాడు. కేశవుడు అనేవాడు సైతం మంత్రిగా ఉన్నంత కాలం రాజు కీర్తిని విస్తరింప చేశాడు. ఈ సమయంలో హలధరుడు అనేవాడు రాణికి సహాయంగా నిలచి, అంచెలంచెలుగా ఎదిగాడు. చివరికి ప్రధానమంత్రి అయ్యాడు. ఈయన ఇరుగుపొరుగు ప్రాంతాలను కశ్మీరు సామ్రాజ్యంలో భాగం చేయటంతో రాజు, రాణికి అతడంటే గురి కుదిరింది. కొందరు అక్రమంగా సంపాదించి, దాచిన బంగారాన్ని వెలికితీశాడు హలధరుడు. ప్రజలకు అనుకూలము, ఉపయోగకరమైన పనులు చేస్తుండటంతో ప్రజలకు ప్రీతిపాత్రుడయ్యాడు హలధరుడు. ఇవి అవినీతిపరులకు, పదవులపై ఆశ ఉన్నవారికి కంటగింపుగా మారింది.

అయితే, అనంతుడు ఓ వైపు శివభక్తి ప్రదర్శిస్తూనే  మరోవైపు ఇరుగుపొరుగు రాజ్యాలతో యుద్ధాలు చేస్తూనే ఉన్నాడు. ఆయన ఎన్ని యుద్ధాలు చేస్తే అంతగా సమస్యలు వస్తూనే ఉన్నాయి. యుద్ధాలు నిర్విరామంగా జరుగుతూనే ఉన్నాయి. పలు సందర్భాలలో రాజును హలధరుడు రక్షించాడు. రాజు అనంతుడు ఒక పథకం, పద్ధతి లేకుండా రాజ్యాలపై దాడులు చేస్తుండటంలో అనేక ఇబ్బందులు పడ్డాడు. ఈ సందర్భంగా కల్హణుడు అంటాడు – “అనంతుడి పని అంతా తిరుగుబాటుదార్లని అణచటంతో సరిపోయింది. తరచూ అతనికి కశ్మీరంలో అంతర్గతంగా, బయట సమస్యలు తలెత్తునే ఉన్నాయి” అని.

ఇక్కడ గమనించవలసిన విషయం ఉంది. కశ్మీరానికి ఒకరి తరువాత ఒకరుగా బలహీనమైన రాజులు వస్తున్నారు. వారికి తగ్గట్టు రాజ్యంపై కన్నేసేవారి సంఖ్య పెరుగుతోంది. ధనంపై ఆశ అధికమవుతోంది. దీనికి తోడు సరిహద్దులలో ఉన్న రాజ్యాలు, కొండలలో నివాసం ఏర్పర్చుకున్నవారు కశ్మీర రాజ్యాన్ని చికాకు పెడుతున్నారు. ఇది నెమ్మదిగా కశ్మీరును బలహీనం చేస్తోంది. అంటే రాజకీయంగా, సామాజికంగా కూడా కశ్మీరు బలహీనమవుతున్నదన్న మాట. ఇది ఇప్పుడు వెనక్కి తిరిగి చూస్తే స్పష్టంగా తెలుస్తుంది. ఆనాటి సమాజ లక్షణాలను సమకాలీన సమాజంపై ఆరోపించి విశ్లేషిస్తే భవిష్యత్తును ఊహించే వీలు కలుగుతుంది.

స్వాతంత్రం సాధించినప్పటి నుంచీ భారతీయ రాజకీయ వ్యవస్థను గమనిస్తే కశ్మీరు పరిస్థితిని మరింత సులభంగా అర్థం చేసుకునే వీలు కలుగుతుంది. ఆరంభంలో భారతదేశానికి సుస్థిరమైన పాలన దీర్ఘకాలం అందింది. ఆపై అధికారంకోసం పోటీలు, కుట్రలు జరిగేయి. అధికారం త్వరత్వరగా చేతులు మారింది. మళ్ళీ సుస్థిరమైన ప్రభుత్వం అందింది. ఆ పై మంచి ఉద్దేశంతో పాలన ఆరంభించినా ఉద్దేశం తప్పుదారి పట్టటం, తద్వారా అస్థిరత ఏర్పడటం కనిపిస్తుంది. సంకీర్ణ ప్రభుత్వాలు వ్యవస్థను దిగజార్చటం కనిపిస్తుంది. ఆ తరువాత సుస్థిర ప్రభుత్వం ఏర్పడ్డా, నాయకత్వం శక్తివంతమైనది కాకపోవటంతో, సమాజంలో అశాంతి, అవినీతి పెరగటం కనిపిస్తుంది. ప్రస్తుతం ప్రభుత్వం సుస్థిరమైనదే అయినా, వ్యక్తిగత అనిష్టాన్ని సమూహానికి ఆపాదించి వ్యవస్థను నిర్వీర్యం చేయాలని ప్రయత్నించటం,  నిర్ణయాలను వ్యతిరేకించటం, అల్లకల్లోలం సృష్టించటం, పలు రకాల అపవాదులను ప్రచారం చేయటం, వ్యక్తుల నడుమ విద్వేషాలు రగల్చటం, సమాజాన్ని, వ్యవస్థను బలహీనం చేయటం కనిపిస్తుంది. ఇదంతా అధికారం కోసమే అనీ తెలుస్తోంది. దీని ప్రభావం భవిష్యత్తుపై ఎలా ఉంటుందో ఊహించాలంటే కశ్మీరు చరిత్రను తెలుసుకోవాల్సి ఉంటుంది. ఓ వైపు రాజ్యంలో వ్యవస్థలు ఇలా దిగజారుతూ ఉంటే, కశ్మీరంలో సరిహద్దుల వద్ద నుండి దాడులు, దురాక్రమణాలు పెరిగాయి. ఇవి గజనీ దండయాత్ర తరువాత అధికం కావడం గమనిస్తే సరిహద్దు ప్రాంతాలలో వారు మతం మారటం, కశ్మీరుకి ఎలా ప్రమాదాన్ని కొని తెచ్చిందో అర్థమవుతుంది. ప్రపంచ రాజకీయాలలో, మానవ సంబంధాలలో ‘మతం’ ప్రాధాన్యం స్పష్టం అవుతుంది. మతం మారటం అన్నది వ్యక్తిగత నిర్ణయమయినా అది సమాజంపై దీర్ఘకాలంలో ఎలాంటి ప్రభావం చూపిస్తుందో తెలుస్తుంది కశ్మీరు చరిత్రను గమనిస్తే!

తమ చుట్టూ జరుగుతున్న పరిణామాలతో సంబంధం లేకుండా, ముంచుకొస్తున్న ముప్పు స్పృహ లేకుండా కశ్మీరులో అధికారం కోసం అసూయతో, కుట్రలు కుతంత్రాలు సాగుతూనే ఉన్నాయి. రాజును పలుమార్లు ప్రమాదం నుంచి రక్షించటం వల్ల, తిరుగుబాటులను అణచటం వల్ల, ప్రజా సంక్షేమ కార్యాలు చేపట్టటం వల్ల హలధరుడు రాజు రాణికే కాదు, ప్రజలకు కూడా ప్రీతిపాత్రుడయ్యాడు. హలధరుడి పెరుగుతున్న ప్రాబల్యం పలువురికి కంటగింపు అయింది. ఎలాగయినా అతడిని దెబ్బ తీయాలనుకున్నారు. రాణి సూర్యమతితో అతనికి ఉన్న సాన్నిహిత్యం హలధరుడి వ్యతిరేకులకు ఆయుధంలా ఉపయోగపడింది. రాణి సూర్యమతికీ, హలధరుడికీ నడుమ ఉన్న సాన్నిహిత్యం  ఆధారంగా దుష్ప్రచారం చేశారు. దాంతో తప్పనిసరి పరిస్థితులలో హలధరుడిని కారాగారంలో పెట్టాల్సి వచ్చింది. కొన్నాళ్ళకి మళ్ళీ హలధరుడి అవసరం వచ్చిన అతనికి కారాగారం నుంచి విముక్తి లభించింది. ఆధునిక సమాజంలో కూడా ఒక వ్యక్తి వ్యక్తిత్వాన్ని దెబ్బ తీయడం, ఆ వ్యక్తి ఎదుగుదలను అరికట్టటంలో ఆరోపణ  ప్రధాన పాత్ర పోషిస్తుంది. ముందుగా ఆరోపణలు చేయటం, ఆ ఆరోపణలు నిజం అన్నట్టు ప్రచారం చేయడం జరిగితే, ముందుగా వ్యక్తి ‘దోషి’గా ప్రజల ముందు నిలుస్తాడు. ఆ తరువాత అతడు నిర్దోషి అని తేలినా ఎవరూ పట్టించుకోరు. ఎందుకంటే అప్పటికి అతని కథ సమాప్తం అయి ఉంటుంది. ఒక మంచి మనిషి గురించి చెడును నమ్మినంత సులభంగా ప్రపంచం చెడ్డ మనిషి చెడును నమ్మదు.

సూర్యమతికి రాజు పూర్తిగా వశుడయిపోవటంతో, రాణి, తన ఇష్టానుసారం ఇంకా బాల్యావస్థలోనే ఉన్న కలశుడికి రాజ్యాభిషేకం చేసింది. ఇది అనంతుడికి ఇష్టం లేదు. దాంతో సన్నిహితుల సలహాను అనుసరించి రాజ్యభారాన్ని తానే నిర్వహించటం ఆరంభించాడు. దాంతో స్వేచ్ఛ అన్నది లేక, రాజు అయినా తన మాట చెల్లుబాటు కాక, కలశుడు నామమాత్రపు రాజుగా మిగిలిపోయాడు.

సూర్యమతి కూడా పుత్రప్రేమతో తొందరపడి పుత్రుడిని రాజుగా నిలిపింది. కానీ కోడళ్ళు రాజభోగాలు అనుభవించటం భరించలేకపోయింది. అసూయతో, వారితో సేవకుల పని చేయించింది. అంటే, ఆ కాలంలో కూడా అత్తలు కోడళ్ళను సతాయించటం ఉండేదన్న మాట. ఈ సందర్భంగా కల్హణుడు ఓ వ్యాఖ్య చేస్తాడు. ఎవరయితే కారణం లేకుండా అత్యుత్సాహం ప్రదర్శిస్తారో, లేక, ఎలాంటి కారణం లేకుండా దుఃఖిస్తారో అలాంటివారిది జంతు ప్రవృత్తి. అలాంటివారు ఏ నిర్ణయం తీసుకోలేరు. తీసుకున్న నిర్ణయంపై నిలవరు.

కశ్మీరులో ఇలాంటి పరిస్థితి నెలకొని ఉన్న సమయంలో లోహార రాజు, అనంతుడి పినతండ్రి అయిన క్షితిరాజు కశ్మీరం వచ్చాడు. బిల్హణుడి ప్రకారం క్షితిరాజు మహావీరుడు. గొప్ప పండితుడు. కవులను పోషించటంలో భోజుడి వంటివాడు. విష్ణుభక్తుడు. అయితే బిల్హణుడి ప్రకారం ఈయన సూర్యమతి సోదరుడు. కల్హణుడు క్షితిరాజును, అనంతుడి పినతండ్రి అన్నాడు.  వీరుడైన క్షితిరాజు అనంతుడి దగ్గరకు వచ్చి తన గోడు చెప్పుకున్నాడు. తన కొడుకు తన రాజ్యం కబళించాలని ప్రయత్నిస్తున్నాడని చెప్పి దుఃఖించాడు. అంతేకాదు, ఒకరోజు పుణ్యతీర్థాలకు వెళ్ళిపోయాడు, అన్నీ వదిలి. ఈ రాజ్యం గొడవలన్నీ చూస్తున్న అనంతుడు  ఓ సుమూహర్తంలో లోహార  రాజ్యం – ఇంకా పిల్లవాడయిన ఉత్కర్షుడికి కట్టబెట్టాడు.. దాంతో ఉత్కర్షుడి సంరక్షణ కోసం అనంతుడు తన్వంగుడిని నియమించాడు.

క్షితిరాజుకు అతని కొడుకుకి నడుమ చెలరేగిన ఉద్విగ్నతల గురించి చెప్తూ కల్హణుడు ఓ విషయం వెల్లడిస్తాడు. క్షితిరాజు కొడుకు తండ్రి మీద కసితో, కోపంతో తాను పెంచే కుక్కలకు భాగవతుల పేర్లు పెడతాడు. భాగవతులంటే విష్ణుభక్తులు. భాగవతులను అవమానించిన వారికి పుట్టగతులుండవని వైష్ణవుల నమ్మకం. కానీ తండ్రి మీద ద్వేషంతో, తండ్రిని బాధపెట్టాలని కొడుకు వైష్ణవాన్ని అవమానించాడు. ఇది ఇప్పటికీ జరుగుతోంది. ఒక వ్యక్తిని బాధించేందుకు, అతని విశ్వాసాన్ని, నమ్మకాలను అవమానించటం మనం చూడవచ్చు.  ఏ వ్యక్తి విశ్వాసాలను అవమానించారో, ఆ వ్యక్తి కోపంతో రెచ్చిపోతే అందరి దూషణకు గురవుతాడు. మౌనంగా సహనంతో వుటే చేతకాని తనమంటారు. ముందు నుయ్యి, వెనుకగొయ్యిలాంటి పరిస్థితి ఇది. అందుకే క్షితిరాజు అన్నీ వదలివెళ్ళిపోయాడు.  ఈ సందర్భంగా కల్హణుడు రాసిన శ్లోకం పలు ఆలోచనలకు దారితీస్తుంది.

సర్వసాధారణీ భూతభోగానం రాజవీజీనామ్।
తావజ్ఞాతీయమ్ భవన్నాహా ద్రోహ కలంపితమ్॥
(కల్హణ రాజతరంగిణి 7, 262)

తన్వంగుడు, బాలుడయిన ఉత్కర్షుడి పాలనను స్థిరపరిచి, లోహారాన్ని శక్తివంతమైన రాజ్యంగా తీర్చిదిద్ది కశ్మీరానికి తిరిగి వచ్చాడు. ఆ కాలంలో రాజ కుటుంబీకుల నడుమ అధికారం కోసం ఆరాటాలు, పోరాటాలు, కుట్రలు ఇంకా సర్వసాధారణం కాలేదు అంటాడు కల్హణుడు. కల్హణుడు రాజతరంగిణి రాసే సమయానికి కశ్మీరంలో రాజ్యం కోసం కుట్రలు, రాజ్యం కోసం రాజ కుటుంబీకుల నడుమ పోరాటాలు సర్వసాధారణం అయిపోయాయి. బహుశా ఈ శ్లోకం రాసేటప్పుడు కల్హణుడి మనసులో దిగజారిన సమకాలీన రాజకీయ, సామాజిక పరిస్థితులు మెదలి ఉంటాయి.

అనంతుడు నిజానికి గొప్ప వీరుడయినా, రాజ్య పాలనలో అంత ఆసక్తి, చాతుర్యం ఉన్నవాడు కాదు. కానీ రాణి సూర్యమతి అతని పేరు మీద రాజ్యం చేసి, కశ్మీరు వ్యవహారాలను చక్కపెట్టింది. వారికి అండగా నిలిచి, శత్రురాజులనుంచి ప్రమాదం ముంచుకొచ్చేలోగా, వారి పని పట్టడంలో ముందుండే హలధరుడు మరణించాడు. హలధరుడు మరణశయ్య వద్ద రాజు, రాణిలకు సలహాలిచ్చాడు. శక్తివంతుడవుతున్న ‘జిందురాజు’ గురించి జాగ్రత్త పడమని హెచ్చరించాడు. కలశుడికి, అనంతుడికి నడుమ భేదాలు సృష్టించాలని జిందురాజు ప్రయత్నిస్తున్నాడనీ సూచించాడు. శక్తివంతుడైన జిందురాజు సహాయంతో అనంతుడు రాజపురి (రాజౌర్) పై పట్టు సంపాదించాడు. హలధరుడి సూచనను అనుసరించి జిందురాజును జైలుపాలు చేశాడు అనంతుడు.

కాలం గడుస్తున్న కొద్దీ కలశుడు పెద్దవాడవటమే కాదు, చెడు  ప్రభావాలకు గురయ్యాడు. బిజ్జ, పిద్ధరాజు, పాంజ వంటి షాహి రాజ వంశానికి చెందినవారి ప్రభావానికి గురయ్యాడు. కోశాధికారి నాగుడి కొడుకు జయానందుడు కలశుడి దుర్మార్గ ప్రవర్తనకు మరింత ప్రోత్సాహం ఇచ్చాదు. బ్రాహ్మణోత్తముడయిన అమరకంఠుడి కొడుకు ప్రమధకంఠ కలశుడికి గురువయ్యాడు. ఈయన రాజుకు లైంగిక విచక్షణా రాహిత్యాన్ని నేర్పాడు. వావి వరసలు లేవని బోధించాడు. ఈ సమయంలో ఓ దుష్టుడయిన వర్తకుడితో పరిచయమయింది. ఇతడు తనని తాను గురువుగా ప్రకటించుకుని ప్రజలను తప్పుదారి పట్టించాడు. రాజు పూర్తిగా అతడికి లొంగిఫోయి భ్రష్టుడయ్యాడు.

ఇక్కడ రాజు దుశ్చర్యలను, దిగజారుడు కార్యకలాపాలను కల్హణుడు వర్ణించాడు. మద్యం మత్తులోని కేళీ విలాసాలు, పలు రకాల మాంసాహారాల సేవనాలు వంటివి వర్ణించాడు. ఇలాంటి దిగజారుడు కార్యకలాపాలలో ‘చంక’ అన్న పేరుగల వాడి ముక్కు కోసేస్తారు. అతడు అలానే నెమ్మదిగా రాజు ప్రాపకం సంపాదిస్తాడు. రాజుకు అందమైన అమ్మాయిలను సరఫరా చేస్తూ మంత్రి అయిపోయాడు చంకడు. అతడికి ‘ధిక్కుర’ అన్న బిరుదునిచ్చారు. అతడి ప్రోద్బలంతో రాజు సిగ్గు లజ్జలను త్యజించాడు. కలశుడి దిగజారుడి పనులకు వృద్ధులయిన అతడి తల్లి తండ్రి ఎంతో బాధపడ్డారు.

తన ప్రతి చర్యను పొగుడుతూ దిగజారుడుతనాన్ని గొప్పతనంగా భావించిన కలశుడి చుట్టూ పనికిమాలినవాళ్ళు, మోసగాళ్ళు, కపటవేషధారులు చేశారు. వీరి ప్రభావంతో కలశుడు పరాయివారి భార్యలపై మోజు పెంచుకుని రాత్రిళ్ళు ఇల్లిల్లూ తిరిగేవాడు. ఇలా ఓ మహిళను అర్ధరాత్రి కలవటానికి దొంగతనంగా వెళ్ళిన కలశుడిని ఆ ఇంటివారు దొంగగా భావించి తన్నటానికి వస్తే, అతని అంగరక్షకులు రాజు మీద అడ్డుగా పడి, రాజు వంతు తన్నులు తింటూ “ఇతడు కశ్మీర రాజు కలశుడు” అని అరిచారు. అలా చావు తప్పి కన్ను లొట్టబోయి, పరువు పోయి ప్రాణాలతో బయటపడ్డాడు కలశుడు. చంద్రుడు, ఇంద్రుడు వంటి వారు కూడా అదుపు లేని లైంగిక వాంఛకు లొంగిపోయి అవమానాల పాలైనప్పుడు కలశుడు ఎంత! అని వ్యాఖ్యానిస్తాడు కల్హణుడు. కలశుడు ప్రజలందరి ఛీత్కారాలు అనుభవించాల్సి వచ్చింది. ఆత్మగౌరవం లేనివారి వల్ల వంశగౌరవం ప్రమాదంలో పడుతుంది. ఆ తరువాత ప్రాణాలే ప్రమాదంలో పడతాయి. వ్యక్తి నడవడి దెబ్బతిన్నప్పుడు సర్వం దెబ్బతింటుంది అంటాడు కల్హణుడు. అన్నిటికన్నా ప్రాధాన్యం సచ్ఛీలం, సత్ప్రవర్తన అంటాడు.

 కలశుడు అర్ధరాత్రి చావు తప్పి కన్నులొట్టబోయి రాజభవనం చేరిన సంగతి విన్న రాజదంపతులు ఇంక భరించలేకపోతారు. కలశుడిని బంధించి కారాగారంలో పారేసి, పెద్ద మనుమడు ఒప్పకుడి కొడుకు హర్షుడిని సింహాసనంపై కూర్చోబెట్టాలని నిశ్చయిస్తారు. హర్షుడు గొప్ప కళాకారుడు. గాయకుడు. వీరుడు. అతనికి సింహాసనం కట్టబెట్టటం ద్వారా కలశుడి అవినీతిపూరిత దుర్మార్గపు పాలనను అంతం చేయాలనకుంటారు. తెల్లారగానే కలశుడిని తన భవంతికి రమ్మని కబురు పంపుతాడు అనంతుడు.

తండ్రి నుంచి పిలుపు అందుకున్న కలశుడికి భయం కలుగుతుంది. తండ్రి తనని శిక్షిస్తాడని గ్రహించిన కలశుడు జయానందుడు, బిజ్జలను తోడు తీసుకువెళ్తాడు.

కలశుడు గదిలోకి అడుగుపెట్టగానే అనంతుడు కోపంతో అతడి చెంప ఛెళ్ళుమనిపిస్తాడు. మొలకి ఉన్న కత్తిని తనకి అందివ్వమని ఆజ్ఞాపిస్తాడు.

కలశుడు భయంతో రాజాజ్ఞను పాటించేలోగా బిజ్జడు అడ్డుపడతాడు.

“మీ తండ్రీ కొడుకులు ఏకాంతంలో ఏం చేసుకున్నా ఫరవాలేదు. అది మీ ఆంతరంగిక విషయం అవుతుంది. కానీ కలశుడు మా రాజు. అతడిచ్చే జీతం వల్ల నేను జీవిక కొనసాగిస్తున్నాను. నా ముందు అతడిని అవమానించటం సహించను” అని కత్తిని చేతపట్టి అంటాడు బిజ్జడు.

దాంతో స్వయంగా నిర్ణయం తీసుకోలేని, నిశ్చయంగా ప్రవర్తించటం అలవాటు లేని అనంతుడు వెనుకడుగు వేస్తాడు.

బిజ్జడు కలశుడిని తీసుకుని వచ్చేస్తాడు. అలా కలశుడికి కారాగారం తప్పింది. బిజ్జడు కలశుడిని తిన్నగా కలశుడి భార్య ‘దిల్హాదేవి’ దగ్గరకు తీసుకువెళ్తాడు. రాజుకు తలనొప్పిగా ఉందని చెప్పి ఆమె రాజును లోపల ఉంచి తలుపులు మూసేస్తుంది. ఎవ్వరినీ రానీయదు.

కలశుడికి అనంతుడికి జరిగినదంతా విన్న రాణి సూర్యమతి కోపం పట్టలేకపోతుంది. కలశుడికి సింహాసనం దక్కటంలో ఆమె పుత్ర ప్రేమ ప్రధాన పాత్ర పోషించింది. ఇప్పుడు రాజుతో అనంతుడు వ్యవహరించిన విధానం ఆమె పుత్ర ప్రేమను పొంగింపజేస్తుంది. ఆమె పరుగున కలశుడి మందిరం చేరుతుంది. ఆమె వెంటే అనంతుడు వెళ్తాడు.

ఆ తరువాత జరిగింది గొప్ప విషాదాంత నాటకానికి ఏమీ తీసిపోదు.

(ఇంకా ఉంది)

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here