Site icon Sanchika

కశ్మీర రాజతరంగిణి-69

[box type=’note’ fontsize=’16’] కశ్మీర్ ప్రాచీన చరిత్ర గురించి అవగాహన కలిగించి, భవిష్యత్తు గురించి ఆలోచనలు కలిగించాలన్న ప్రయత్నంలో భాగంగా నీలమతపురాణం తరువాత అందిస్తున్న జోనరాజు, శ్రీవరుడు, ప్రజ్ఞాభట్టులు కల్హణుడి అడుగుజాడల్లో నడుస్తూ సంస్కృతంలో రచించిన ‘కశ్మీర రాజతరంగిణి’ అనువాదాన్ని తెలుగు పాఠకులకు అందిస్తున్నారు కస్తూరి మురళీకృష్ణ. [/box]

ఉత్పార్య తామస్యామ్యాఖ్యం పూర్వం తామ్రమయం రవిం।
స రీతి ప్రతిమాః స్సైరం విహారేభ్యో ప్యపాహరత్॥
(కల్హణ రాజతరంగిణి 7, 696)

[dropcap]క[/dropcap]లశుడు, హర్షుల నడుమ జరిగినదంతా విషాదాంత గాథలా ఉంటుంది. ఆ కాలంలో కశ్మీరు రాజకీయాలు, సమాజం, మనస్తత్వాలు దిగజారటం స్పష్టంగా తెలుస్తూంటుంది. కలశుడు, తన సంతానం, తన తరువాత రాజు కావలసిన హర్షుడికి ఎంత తక్కువగా ధనం ఇచ్చేవాడంటే – హర్షుడు రోజు విడిచి రోజు భోజనం చేసేవాడు. కానీ హర్షుడు గొప్ప గాయకుడు. అతని గానం వింటూ కశ్మీర ప్రజలు మైమరిచిపోయేవారు. రాజ సభలో కూడా హర్షుడు తన గానంతో అందరినీ మెప్పించాడు. అయితే హర్షుడి చుట్టూ చేరినవారు అతడిలో దుష్ట భావనలు నూరిపోశారు. కలశుడు రాజ్యార్హుడు కాడు. ‘అతడిని చంపి నువ్వు రాజుగా’ అని హర్షుడి చెవినిల్లు కట్టుకుని పోరారు. ఆరంభంలో హర్షుడు వారి మాటలను పట్టించుకోలేదు. వారికి బుద్ధి చెప్పాడు. కానీ రాను రాను ఉలితో కొడుతుంతే ఎంతటి శిల అయినా నిర్దేశించిన రూపు ధరించినట్టు, దుష్టుల సలహాకు హర్షుడు లొంగాడు. కలశుడిని హత్యచేయాలని పురమాయించాడు. హంతకుల సైన్యాన్ని తయారు చేశాడు. ఇంతలో, ఎవరయితే హర్షుడిలో దుష్ట భావనల బీజాలు నాటేరో, వారే రాజు వద్దకు వెళ్ళి హర్షుడు కుట్ర పన్నుతున్నాడన్న విషయం చెప్పారు. కలశుడు ముందు ఈ విషయం నమ్మలేదు. కానీ హర్షుడు నిజం ఒప్పుకున్నాక, కలశుడు ఎంతో బాధపడుతూ హర్షుడిని కారాగారంలో బంధించాడు. కానీ అతడికి రాజకుమారుడికి తగ్గ భోజనం పంపించేవాడు.  హర్షుడిని కారాగారంలో బంధించినప్పటి నుంచీ కలశుడి ప్రవర్తన మారిపోయింది.

కలశుడు సంపూర్ణంగా స్త్రీలోలుడయ్యాడు. చివరికి హర్షుడి భార్యలనూ వదలలేదు. హర్షుడి ఓ భార్య హర్షుడిని చంపేందుకు అన్నంలో విషం కలిపింది. అది తెలిసినప్పటి నుండీ హర్షుడు అన్నం తినటం మానేశాడు. తను నమ్మిన సేవకుడు ఇచ్చే ఫలాలు తింటూ గడిపేడు. విచ్చల విడిగా ఖర్చులు పెడుతున్న కలశుడు ధనం కోసం తామ్ర స్వామి మందిరంలో సూర్యుడి తామ్ర విగ్రహాన్ని తొలగించాడు. విహారాలలోని ఇత్తడి విగ్రహాలను కొల్లగొట్టాడు. దీని గురించి వ్యాఖ్యానిస్తూ “This is an instance of spoliation of Viharas for the sake of metal of statue of any statuary” అని వ్యాఖ్యానిస్తారు.

శ్లోకంంలోని మొదటి పాదంలో సూర్యుడి తామ్ర స్వామి విగ్రహాన్ని తామ్రం కోసం తొలగించారని ఉంది. విహారాల్లోని ఇత్తడి విగ్రహాల ప్రసక్తి రెండవ పాదంలో ఉంది. కానీ మన వ్యాఖ్యాతలు రెండవ పాదానికి ప్రచారం ఇచ్చి మొదటి పాదాన్ని విస్మరిస్తారు. కశ్మీరు రాజులు విహారాలను కొల్లగొట్టారని, ధ్వంసం చేశారని వ్యాఖ్యానిస్తారు. విహారాలను ధ్వంసం చేయటం భారతీయులకు అలవాటు అని నమ్మించాలని ప్రయత్నిస్తారు. కానీ నిజం వేరేగా ఉంది. రాజులు మందిరాలలో విగ్రహాలను కాని, విహారాలలో విగ్రహాలను కానీ కరిగించటం వెనుక పరమత ద్వేషం, అసహనం వంటివి లేవు. రాజు లోభం, నైచ్యం, దౌష్ట్యం వంటివి ఉన్నాయి తప్ప మరొకటి లేదు. వారు విహారాలలో విగ్రహాలతో పాటు, మందిరాలలోని విగ్రహాలనూ ధనం కోసం కరిగించారు. కానీ విహారాల విషయం ప్రస్తావించి, ఇల్లెక్కి కూసి, మందిరాల విషయం విస్మరించటం మన చరిత్ర రచయితల దృష్టిని తెలుపుతుంది. ఏ రకంగా నయినా భారతీయులు తమ గత చరిత్రను చూసి సిగ్గు పడేట్టు చేయాలి. విదేశీ ముష్కరుల అనాగరిక ప్రవర్తనకూ భారతీయుల ప్రవర్తనకూ తేడా లేదు. భారతీయులలో ఎలాంటి ఔన్నత్యం లేదని నమ్మించాలన్నది ప్రయత్నం. గమనిస్తే, మందిరాలు, విహారాలలోని విగ్రహాలను కరిగించిన సంఘటనలన్నీ ధనం కోసమే. ఈ సంఘటనలన్నీ విదేశీ ముష్కరులు భారతదేశంలోకి చొచ్చుకు వచ్చి భారతీయ సమాజాన్ని అల్లకల్లోలం చేయటం ఆరంభించిన తరువాతవే. ఓ రకంగా దైవంపై, విగ్రహాలపై నమ్మకం సడలిన తరువాత సంఘటనలే ఇవన్నీ. ‘నృసింహ స్వామి శతకం’ వంటి రచనలను గమనిస్తే, కాకతీయ సామ్రాజ్య పతనం తరువాత తురుష్కుల అకృత్యాలను మౌనంగా భరిస్తూ, ముక్కలవుతున్న దైవ విగ్రహాలను ప్రశ్నించటం కనిపిస్తుంది. ఇలాంటి భావనలు తురుష్కుల తాకిడిని అత్యంత తీవ్రమైన స్థాయిలో అనుభవించిన ఉత్తర భారతంలో తీవ్రంగా ఉండటంలో ఆశ్చర్యం లేదు. కశ్మీరులో ధనం కోసం రాజులు విగ్రహాలను కరిగించటంలో ఆశ్చర్యం లేదు. దాన్ని విహారాలపై దాడిలా, బౌద్ధులపై అసహనంలా వ్యాఖ్యానించటంలోనే చరిత్రకారుల ‘దృష్టి’ తెలుస్తుంది.

కలశుడి దుష్ట ప్రవర్తనకు అంతు లేకుండా పోయింది. అతడు ప్రజల ఆస్తులను స్వాధీనం చేసుకోవటం మొదలుపెట్టాడు. వారసులు లేని వారి ఆస్తులను కాజేశాడు. అయితే ఈ ప్రపంచంలో ప్రతీ పనికీ దానికి తగ్గ ఫలితం ఉంటుంది. దుష్టపు చర్యలకు ఫలితం చెడుగానే ఉంటుంది. కలశుడు చేసే చెడు పనుల మూలంగా అతడి ఆరోగ్యం పాడయింది. అతడు శివుడి మందిరంలో కలశాలు స్థాపించబోతుంటే అతడి   ముక్కు నుంచి కారిన రక్తంతో కలశం నిండింది. ఎన్ని ప్రయత్నాలు చేసినా రక్త ప్రవాహం ఆగలేదు. దాంతో మరణ సమయం సమీపించిందని అర్థమయింది రాజుకు. తన సంతానం అయిన హర్షుడికి రాజ్యం కట్టబెట్టాలనుకున్నాడు. కానీ పలువురు వ్యతిరేకించారు. దాంతో లోహారం నుంచి ఇంకో కొడుకు ఉత్కర్షుడిని పిలిపించాడు. ఇంతలో అతని పరిస్థితి దిగజారటంతో, మార్తాండ మందిరంలో మరణించాలని ఆ వైపు ప్రయాణమయ్యాడు. అధికారం ఉన్నంత కాలం రాజులు అహంకరిస్తారు. కానీ మరణ కాలం తామెంత నిస్సహాయులో రాజులకు తెలుపుతుందంటాడు కల్హణుడు. తాను విగ్రహాలు కరిగించిన పాప పరిహారం కోసం మార్తాండ మందిరంలో బంగారు విగ్రహం సమర్పించాడు రాజు. కానీ ఏం చేసినా అతడి ఆరోగ్యం మెరుగుపడలేదు. చివరికి క్రీ.శ. 1089లో కలశుడు మరణించాడు. మరణించిన రాజు శవాన్ని అక్కడే వదిలి అందరూ ఉత్కర్షుడికి పట్టాభిషేకం చేసేందుకు పరుగెత్తారు. రాజు శవం కాలుతూంటేనే అతని ఇతర సంతానం ఆస్తి పంపకాల గురించి వాదించుకోవటం ఆరంభించారు. ఈ సందర్భంగా కల్హణుడు చక్కని శ్లోకం రాశాడు. ఒక మనిషి మరణించి, అతని శవం కాలుతున్నప్పుడే అతడి వారసులు ఆస్తి పంపకాల గురించి చర్చించుకుంటారు. ఇది తెలిసి కూడా మనుషులు దురాశతో అక్రమ పద్ధతుల్లో ధనార్జన చేస్తారు అంటాడు కల్హణుడు.

ఉత్కర్షుడు రాజయ్యాడు కానీ ప్రజలు అతడిని రాజుగా స్వీకరించలేదు. ప్రజలందరికీ హర్షుడు రాజవ్వాలని ఉంది. తన గానంతో, సత్ప్రవర్తనతో ప్రజల అభిమానం చూరగొన్నాడు హర్షుడు. తండ్రి మరణంతో హర్షుడు ఆహారం సేవించటం మానేశాడు. అతని అభిమానులు అతడికి రాజ్యం దక్కేట్టు చూస్తామని ప్రతిజ్ఞ పట్టారు. ఉత్కర్షుడికి రాజ్యార్హత లేదని వారి భావన. ఉత్కర్షుడు హర్షుడికి స్వేచ్ఛనిచ్చి దేశ బహిష్కారం విధిస్తానని వాగ్దానం చేశాడు. కానీ వాగ్దానం నెరవేర్చలేదు. దాంతో వారి ఇంకో సోదరుడు విజయమల్లుడు హర్షుడి పక్షం వహించాడు.

ఉత్కర్షుడు రాజ్యానికి వచ్చాడు కానీ అధికారం అంతా క్రింది అధికారులకు అప్పగించాడు. అతడు సమయమంతా ఖజానాలోని ధనాన్ని పరిశీలిస్తూ గడిపేవాడు. విజయమల్లుడికి ఉత్కర్షుడు ఇస్తానన్న ధనం ఇవ్వకపోవడంతో తన సైన్యాన్ని సమకూర్చుకుని విజయమల్లుడు రాజధాని వైపు ప్రయాణమయ్యాడు. దామరులు కూడా అతనికి సహాయంగా వచ్చారు. ఇతరులు కూడా విజయమల్లుతో చేరారు. రాజభవనాన్ని ముట్టడించారు. పశువుల శాలకు నిప్పు పెట్టారు. ఎలా ఆరంభమయిందో తెలియదు కానీ, ‘హర్షుడికి స్వేచ్ఛనివ్వండి’ అన్న నినాదం మొదలయింది. ప్రజలు కారాగారం తలుపులు, కిటికీల నుంచే హర్షుడిని పూలమాలలతో ముంచెత్తారు. హర్షుడు కూడా చకచకా పావులు కదిపాడు. తన సమర్థకులను రాజభవనం చుట్టుముట్టమన్నాడు.

ఈ సమయంలో హర్షుడిని చంపేందుకు ఉత్కర్షుడు 16మందిని పంపాడు. హర్షుడు బ్రతికి ఉన్నంత కాలం ప్రజలు ఉత్కర్షుడిని రాజుగా ఒప్పుకోరని అతని సలహాదార్లు నమ్మించారు. అయితే ఉత్కర్షుడు తన నుంచి ఆజ్ఞలు వచ్చేదాకా హర్షుడిని చంపవద్దన్నాడు. చుట్టుముట్టి తన ఆజ్ఞల కొసం ఎదురు చూడమన్నాడు. ఈలోగా హర్షుడు అత్యంత చాకచక్యంతో తనను చుట్టుముట్టిన సైనికులందరినీ పేరు పేరునా పలకరించాడు. వారికి బహుమతులిచ్చాడు. తియ్యగా మాట్లాడేడు. హర్షుడి స్నేహ పూరిత ప్రవర్తనతో వారందరూ సిగ్గు పడ్డారు. ఇంత సహృదయుడిని చంపాలా అని బాధపడ్డారు. ‘మాట’ వ్యక్తికి ఆభరణం వంటిదని వ్యాఖ్యానిస్తాడు కల్హణుడు.

సిగ్గుతో తల వంచుకున్న సైనికులను చూసి “మీరెందుకు సిగ్గు పడతారు? రాజు చెప్పిన పని చేసే సేవకులకు ఎలాంటి దోషం అంటదు. కానీ క్షణం క్షణం మారే జగతి రీతిని గమనించండి” అన్నాడు. వారికి హరిశ్చంద్రుడి కథ చెప్తాడు. హరిశ్చంద్రుడి దురదృష్టంతో తన దురదృష్ట పరిస్థితిని పోలుస్తూ వారి అభిమానం సంపాదించాడు. ఇక్కడ మనిషి జీవితంలో విధి గొప్ప పాత్ర పోషించటం తెలుస్తుంది. ఉత్కర్షుడు హర్షుడిని చంపమనేందుకు సూచనగా ఒక ఉంగరం, వదిలెయ్యమనేందుకు సూచనగా ఇంకో ఉంగరాన్ని పంపిస్తానన్నాడు. కానీ చివరి క్షణంలో ఏ ఉంగరం దేనికో మరిచిపోయాడు. చంపమనే ఉంగరం బదులుగా వదిలెయ్యమనే ఉంగరం పంపాడు. దాంతో ఉత్కర్షుడు తన పతనాన్ని తానే కొని తెచ్చుకున్నాడు.

రాజు పంపిన ఉంగరం చూడగానే హర్షుడిని చంపేందుకు ఉన్న సైనికులు ఆనందంతో నృత్యాలు చేశారు. వారంతా హర్షుడి పాదాలకు నమస్కరించారు. హర్షుడు కారాగారం వదిలి బయటకు వచ్చాడు. దారంతా ప్రజలు అతనిని పూలమాలలతో నింపేశారు. భవనాలపై నుంచీ పూలు వెదజల్లారు. రాజభవనం నుంచి సింహాసనం తెచ్చి హర్షుడిని సింహాసనంపై కూర్చోబెట్టారు.  కారాగారం దుస్తులతోనే సింహాసనంపై కూర్చున్న హర్షుడు అత్యంత శోభతో వెలిగిపోయాడంటాడు కల్హణుడు. ఉత్కర్షుడు ఇక తనకు భవిష్యత్తు లేదని గ్రహించి ఆత్మహత్య చేసుకున్నాడు. 24 ఏళ్ళ ఉత్కర్షుడు 22 రోజులు రాజ్యం చేశాడు! ఈ రకంగా విధి అద్భుతమైన మలుపు తిరగటంతో మరణించాల్సిన హర్షుడు కశ్మీరానికి రాజయ్యాడు. ఒక్కరోజులో రాజును పడదోసి జైలు నుంచి సింహాసనం చేరాడు హర్షుడు.  కానీ రాజ్యం కోసం తండ్రి కొడుకులు, అన్న దమ్ములు పోరాడుకోవటం, ఇతరులు, ఏదో ఒక పక్షం వహించి అవకాశం దొరికినప్పుడు తామే సింహాసనం ఎక్కాలని తాపత్రయపడటం కశ్మీరులో ఆరంభమయింది.

కల్హణుడి తండ్రి హర్షుడి దగ్గర పని చేసేవాడు. దాంతో హర్షుడి పాలనకు, ఆ తరువాత జరిగిన అనేక సంఘటనలకు కల్హణుడు ప్రత్యక్ష సాక్షి. అందుకే ఈ సంఘటలను కల్హణుడు అత్యంత విపులంగా అత్యంత బాధతో వర్ణిస్తాడు. హర్షుడి పాలన చరిత్రలో రాజుల అదృష్టాలు, ఆనంద, విషాదాలు అత్యున్నత, అతి నైచ్యాలకు పాఠ్యపుస్తకం లాంటిది. అందుకే కల్హణుడు హర్షుడి వ్యక్తిత్వం గురించి కొన్ని శ్లోకాలు ప్రత్యేకంగా రాశాడు. హర్షుడి వ్యక్తిత్వంలో ఉన్నన్ని వైరుధ్యాలు, అద్భుతాలు, నైచ్యాలు మరే రాజులోనూ కనబడవు. హర్షుడు రాజయినప్పుడు ప్రజలు సంబరాలు చేసుకున్నారు. తమ కష్టకాలం తొలగిపోయిందని ఆనంద నాట్యాలు చేశారు. కానీ, ఆ తరువాత ఈ ప్రజలే హర్షుడిని అసహ్యించుకున్నారు. బికారీలా ప్రాణాలు అరచేత పట్టుకుని అతడు వీధులవెంట ఆశ్రయంకోసం అభ్యర్దిస్తూంటే ఆ ప్రజలే నిర్దాక్షిణ్యంగా తలుపులువేసేశారు. దిక్కులేని చావు పొందాడు హర్షుడు.

హర్షుడు గొప్ప విద్వాంసుడు. అత్యంత గొప్ప కవి. పలు భాషా కోవిదుడు. రాజనీతి పారంగతుడు. అతను అత్యంత దుర్భరమైన కష్టాలను అనుభవించాడు. ఊహించలేని సౌఖ్యాలను అనుభవించాడు. అతను అనుభవించినన్ని ఆనందాలను ఎవరూ అనుభవించలేదు.  అతను అనుభవించినన్ని దుఃఖాలను కూడా ఎవ్వరూ అనుభవించలేదు. ఎంత త్యాగం అతని వ్యక్తిత్వంలో ఉందో, అంత స్వార్థం ఉంది. ఎన్ని సత్కర్మలున్నాయో, అన్ని దుష్ట కర్మలు ఉన్నాయి. గమనిస్తే, హర్షుడి లాంటి జీవితం భారతదేశ చరిత్రలో అతి అరుదుగా కనిపిస్తుంది. అందుకే హర్షుడి రూపాన్ని కూడా కల్హణుడు విపులంగా వర్ణించాడు.

ప్రతిమార్క పరీమాణ జలత్కుండల మండితః।
ఉత్తుంగ ముకుటాన ద్ధవి కటాష్ణీష మండలః॥
(కల్హణ రాజతరంగిణి 7, 876)

అంతడి కుండలాలు సూర్యప్రభతో ధగధగలాడేవి. అతడి శిరస్సున మణి కిరీటం మెరుస్తూ ఉందేది. అతడి చూపులు సింహాన్ని గుర్తుకు తెచ్చేవి. అతడి భుజాలు వృషభాన్ని గుర్తుకు తెచ్చేవి. అతని మీసాలు చిక్కటివి, పొట్టివి. అతడు ఆజానుబాహువు. ఎర్రని దేహఛ్చాయతో విశాల వక్షస్థలంతో అందరినీ ఆకర్షించేవాడు. అతని కంఠం గంభీరమైన మేఘనాదం. ఈ రీతిగా హర్షుడు మామూలు మనిషి కాదు, మూర్తీభవించిన దైవం అన్న భావన కలిగించేది. ఎవరైనా హర్షుడిని చూస్తే విభ్రాంతికి గురయ్యేవారు. హర్షుడి వర్ణన అయిన తరువాత ఆరంభంలో అతడి పాలనను వర్ణిస్తాడు కల్హణుడు. హర్షుడి గురించి ఇంత విపులంగా వర్ణించటం ఎందుకంటే, హర్షుడి లాంటి అద్భుతమైన, అనూహ్యమైన జీవితం భారత చరిత్రలో మరో రాజుకు లేదు. ముంచుకొస్తున్న తురుష్క ప్రభావం, ఇంకా పూర్తిగా వీడని భారతీయ సంప్రదాయం, ఆలోచనలు, ఒక వ్యక్తి జీవితాన్ని ఎలాంటి అయోమయానికి గురిచేస్తాయో హర్షుడి జీవితం తెలుపుతుంది. హర్షుడి వ్యక్తిత్వాన్ని విశ్లేషిస్తే అద్భుత సామాజిక వ్యక్తిత్వం బోధపడుతుంది. రాబోయే సమాజానికి ప్రతినిధిగా అనిపిస్తాడు. అతని జీవితంలో ఉత్తమమైనవన్నీ భారతీయ ధర్మంతో ముడిపడివున్నవి. అతని దిగజారుడు జీవితం విదేశీదుష్ట ప్రభావంవల్ల ఏర్పడింది. అందుకే అతడిని తురుష్కహర్షుడు అని ఈసదింపుగా సంబోధిస్తాడు రాజతరంగిణి రజయిత కల్హణుడు. దీన్నిబట్టే అర్ధంచేసుకోవచ్చు భారతీయ సమాజంలో తరువాత కనబడిన మార్పులన్నిటికీ ప్రతినిధి హర్షుడు అని!!!

(ఇంకా ఉంది)

Exit mobile version