Site icon Sanchika

కశ్మీర రాజతరంగిణి-71

[box type=’note’ fontsize=’16’] కశ్మీర్ ప్రాచీన చరిత్ర గురించి అవగాహన కలిగించి, భవిష్యత్తు గురించి ఆలోచనలు కలిగించాలన్న ప్రయత్నంలో భాగంగా నీలమతపురాణం తరువాత అందిస్తున్న జోనరాజు, శ్రీవరుడు, ప్రజ్ఞాభట్టులు కల్హణుడి అడుగుజాడల్లో నడుస్తూ సంస్కృతంలో రచించిన ‘కశ్మీర రాజతరంగిణి’ అనువాదాన్ని తెలుగు పాఠకులకు అందిస్తున్నారు కస్తూరి మురళీకృష్ణ. [/box]

జ్ఞాతిద్రోహ మహాపాప్మనష్ట ధీరథ పార్ధవః।
డింబానారుప్య సంభావ్యామ భడద్దిట బోజ్యతామ్॥
(కల్హణ రాజతరంగిణి 7, 1072)

[dropcap]ప్ర[/dropcap]జలందరికీ ప్రీతిపాత్రుడయిన హర్షుడు కొందరు దుష్టబుద్ధుల ప్రభావానికి గురయి నీచంగా ప్రవర్తించటాన్ని కల్హణుడు విపులంగా వర్ణించాడు. దుష్ట మంత్రులు, రాజును తమ అదుపులో పెట్టుకుని అడ్డూ అదుపూ లేకుండా ప్రవర్తించటాన్ని ఎంతో బాధతో వర్ణిస్తాడు. దుష్టపుటాలోచనలతో రాజు చెంత చేరినవారు – ముందుగా తెలివైనవారు, రాజుకు విధేయులు, వీరులు, శూరులపై తమ దృష్టిని కేంద్రీకరించారు. ఏదో ఓ రకంగా వీరిని రాజు దృష్టిలో అనుమానితులుగా చేశారు. ఆ తరువాత వారిని రాజ్యం నుంచి వెళ్ళగొట్టటమో, మోసం చేసి చంపటమో చేశారు. ఈ రకంగా రాజుకు సహాయంగా ఒక్క వీరుడూ లేకుండా చేశారు. రాజుకు విధేయుడు అన్నవాడిని లేకుండా చేశారు. ఇదంతా గమనించకుండా రాజు చెప్పుడు మాటలు వింటూ – వినోదాలు, విలాసాలలో తేలియాడుతూ – తనకు సహాయం చేసేవారిని, శ్రేయోభిలాషులను దూరం చేసుకున్నాడు. తనను పొగిడేవారు, తనకు అమ్మాయిలను అందించేవారు, తీయని మాటలు మాట్లాడేవారు, ధనం అందించేవారు తనవారని భ్రమలో పడ్డాడు. కల్హణుడు రాజతరంగిణిలో, రాజు సమర్థకులను, వీరులను, దుష్టులు ఎలా మాయోపాయాలతో అంతం చేశారో విపులంగా వర్ణించాడు. కొందరిని గొంతు కోసి చంపారు. కొందరిని నమ్మించి మోసం చేసి చంపి వీధుల్లో పారేశారు. కొందరి తలలు దారుల్లో విసిరేసి, శరీరాన్ని నదిలో పారేశారు. కొందరి గొంతులను తాళ్లతో బిగించి చంపేరు. కొందరిని చిత్ర హింసలుపెట్టారు.  ఇవన్నీ చదువుతుంటే ఆధునిక మాఫియా ముఠాల హత్యలు, హింసలు గుర్తుకు వస్తాయి. ఈ మాఫియా ముఠాగాళ్ళకు ఏ మాత్రం తీసిపోని విధంగా, అప్పుడప్పుడు ఈ మాఫియా వాళ్ళకు పాఠాలు నేర్పే విధంగా ఉంటాయి ఈ హత్యలు, హింసల వర్ణనలు. భారతీయ వాఙ్మయంలో ఇలాంటి కుట్రలు, కుతంత్రాలు, హత్యలు, హింసలు మనకు లభ్యం కావు. శత్రువుతో కూడా గౌరవంగా, నాగరికంగా వ్యవహరించే గాథలే కనిపిస్తాయి. కానీ శత్రువు శవాన్ని అవమాన పరచటం, తలను మొండేన్ని వేరు చేయటం, నమ్మించి శరణు ఇస్తామని వాగ్దానం చేసి ఆయుధాలకు దూరం చేసి మరీ చంపటం… ఇలాంటివన్నీ మనకు ప్రధానంగా రాజతరంగిణిలోనే తారసపడతాయి. అంతవరకు ఉత్తమ వ్యక్తిత్వం ఉన్న రాజులు, ఓటమిలోనూ అత్యంత గౌరవప్రదంగా వ్యవహరించిన వారు, గెలుపులోనూ స్థితప్రజ్ఞత ప్రదర్శించే రాజులు కనిపిస్తారు. ‘ముద్రారాక్షసం’లో తనను వ్యతిరేకించిన రాక్షసమంత్రిని చంద్రగుప్తుడు తన మంత్రిగా చేసుకోవటం కనిపిస్తుంది. కానీ రాజతరంగిణి దగ్గరకు వచ్చేసరికి, శత్రువును దొంగ దెబ్బ తీయటం, నమ్మించి మోసం చేయటం వంటి మ్లేచ్ఛ పద్ధతులు హర్షుడి పాలనాకాలంలో ప్రబలటం కనిపిస్తుంది. అంతేకాదు, మరో దుశ్చర్యపై మ్లేచ్ఛ ప్రభావం స్పష్టంగా కనిపిస్తుంది.

హర్షుడిని అతని తండ్రి చెరసాలలో ఉంచాడు. తండ్రిపై ఆ కోపం హర్షుడిలో ఉంది. చుట్టూ ఉన్నవారు ఆ కోపాన్ని రెచ్చగొట్టారు. విలాసాలకు హర్షుడి దగ్గర ఖజానా కరిగిపోతున్న కొద్దీ ఆ కోపం  ప్రభావం తండ్రి నిర్మించిన మఠాలలో ఉన్న ధనంపై పడింది. తండ్రిపై కోపం, ధనంపై ఆశల వల్ల హర్షుడు తండ్రి నిర్మించిన మఠాలను కొల్లగొట్టాడు. తండ్రి దాచిన ధనాన్నంతా కొల్లగొట్టి విచ్చలవిడిగా ఖర్చుపెట్టాడు. తన అంతఃపురంలో 360 మంది స్త్రీలను చేర్చాడు. వీరంతా దుశ్శీలలు. దుష్ప్రవర్తనకు పేరు పొందినవారు. అంటే గతంలోని భారతీయ రాజులకు భిన్నంగా హర్షుడు ధనం కోసం పవిత్ర మఠాలను కొల్లగొట్టాడు. భారతీయ రాజుల పద్ధతులకు భిన్నంగా ‘జనానా’ను ఏర్పాటు చేసుకున్నాడు. ఈ పద్ధతులు హర్షుడిపై మ్లేచ్ఛుల ప్రభావాన్ని స్పష్టం చేస్తాయి. పవిత్ర స్థలాలంటే గౌరవం లేకపోవటం, స్త్రీని భోగవస్తువుగా, విలాసాలకు ప్రతినిధిగా మాత్రమే భావించటం భారతీయ ధర్మ విరుద్ధం. హర్షుడిలో అలాంటి విరుద్ధ ప్రవర్తన మ్లేచ్ఛ ప్రభావం వల్ల అన్న నిజాన్ని ప్రకటించకుండా చరిత్రకారులు ‘కశ్మీరులో పవిత్ర స్థలాలను దోచటం, విరగ్గొట్టటం ఆనవాయితీ’ అని నమ్మించాలని ప్రయత్నిస్తారు. వాదిస్తారు. తెలియని వారు అబద్ధాని, అర్ధ సత్యాన్ని సంపూర్ణ సత్యంగా భావించి మన చరిత్ర గురించి, మన పూర్వీకుల గురించి చెడు అభిప్రాయాన్ని ఏర్పరుచుకుంటారు. హర్షుడి దుష్ప్రవర్తన గురించి కల్హణుడు వ్రాసిన శ్లోకం గమనించదగ్గది.

స సర్వ శాస్త్రాధిగమ ప్రౌఢః పరివృఢో విషామ్।
యన్మోహిత మతిశ్చక్రే వైధేయైరపి మన్త్రిభిః॥
(కల్హణ రాజతరంగిణి 7, 960)

సకల శాస్త్రాలలో నిష్ణాతులు, విజ్ఞానవంతులు కూడా తెలివి లేని వారి చేతిలో పావులవుతారు. హర్షుడి విషయంలో ఇదే జరిగింది.

రాజుకు సహాయం చేసేవారు, విధేయులు, వీరులు అనుకున్న వారందరినీ రాజుకు దూరం చేసిన తరువాత, దుష్ట మంత్రులు తమలో తాము కలహించుకోసాగారు. రాజుకు తామూ సన్నిహితంగా ఉండాలన్న తపనతో, ఎదుటివాడిని దెబ్బతీయాలని ప్రయత్నించారు. ఈ పరస్పర కలహాలలో వారు ఒకరినొకరు దెబ్బ తీసుకుని నష్టపోవటమే కాదు, రాజును కూడా నష్టపరిచారు. వాళ్ళు కొమ్ముల దురద తీర్చుకోవటానికి ఒకదానితో ఒకటి తలపడే దుప్పుల్లాంటి వారని వ్యాఖ్యానిస్తాడు కల్హణుడు.

ఇలాంటి పరిస్థితులలో కొందరికి సింహాసనంపై కన్ను పడింది. వారు రాజును హత్య చేయాలన్న ప్రయత్నాలు ప్రారంభించారు. దాంతో మరో రకమైన కుట్రలు, కుతంత్రాలు  మొదలయ్యాయి. రాజును హత్య చేయాలన్న పథకాలతో పాటు, తమకు పోటీగా వచ్చే వారిని అడ్డు తొలగించుకోవాలన్న ప్రయత్నాలూ జోరుగా సాగాయి. రాజుకు కర్ణాకర్ణిగా ఇలాంటి ప్రయత్నాలు తెలిసాయి. దాంతో హర్షుడు ప్రతివాడినీ అనుమానించటం మొదలయింది. గతంలో చెరసాలలో ఉన్నప్పటి భయాలన్నీ జాగృతమయ్యాయి. ఈ విషయాలన్నీ కల్హణుడు విపులంగా రాశాడు. పేర్లతో సహా ఎవరెవరు ఎలాంటి కుట్రలు చేశారు, ఎలాంటి అక్రమాలకు పాల్పడ్డారు, చివరికి ఎలా దెబ్బ తిన్నారు వంటివన్నీ వివరంగా రాశాడు.

ఇవి చదువుతుంటే ఎలాంటి కశ్మీరు ఎలా అయిపోయిందన్న బాధ మనసును తొలిచేస్తుంది. ‘కశ్మీరు పార్వతి, రాజు శివాంశజుడు’ అన్న శ్రీకృష్ణుడి మాటలు మదిలో మెదిలి బాధ మరింత పెరుగుతుంది. విచ్చలవిడిగా ప్రవర్తించే రాజు, మహిళలను భోగవస్తువులుగా భావించి, వందల సంఖ్యలో అంతఃపురంలో మహిళలను ఉంచుకునే నీచ ప్రవర్తన, రాజుని చంపాలని సేవకుల ప్రయత్నాలు, తన సింహాసనం నిలుపుకోవటం కోసం అనుమానమున్న ప్రతివాడినీ హింసించి చంపటమే కాదు, తను తరువాత సింహాసనంపై ‘హక్కు’ ఉంటుందని అనుమానమున్న తన కుటుంబీకులను, వంశానికి చెందినవారిని కూడా వెతికి వెతికి నిర్దాక్షిణ్యంగా హతమార్చటం పార్వతి లాంటి కశ్మీరు ఏ స్థాయికి దిగజారిందో తెలుపుతుంది. ఇంతటితో ఆగలేదు, ఇంకా ఇంకా దిగజారి చివరికి తనని తాను మరిచిపోయి, తన గత వైభవాన్ని మరచిపోయి, గతంలోని పవిత్రత, సత్ప్రవర్తన, సచ్ఛీలం, నీతి నిజాయితీ, నాగరీక ప్రవర్తనలన్నీ మరిచి తుచ్ఛ జాతుల దుష్ప్రభావానికి గురయి పాతాళానికి వేగంగా దిజగారుతూ సంపూర్ణంగా రూపాంతరం చెందేందుకు ఉరుకులు పరుగులు పెట్టడం కూడా మనం చూడవచ్చు. ఈనాడు చరిత్రకారులు, సామాజిక విశ్లేషకులు ఈ మ్లేచ్ఛ సంపర్కంతో రూపుమారుతున్న సమాజాన్ని ఆధారం చేసుకుని భారతీయ సంస్కృతి, సామాజిక జీవనంపై వ్యాఖ్యానాలు చేస్తున్నారు. విమర్శలు గుప్పిస్తున్నారు. కానీ, విదేశీ సంపర్కంతో హిమాలయాల నుండి భువికి దిగిన స్వచ్ఛమైన గంగలాంటి పవిత్ర భారతీయ సమాజం కలుషిత జలాలతో ఎలా మలిన గంగలా రూపాంతరం చెందిందన్న విషయాన్ని ప్రస్తావించరు.

తన వారందరినీ, ఎవరెవరికి సింహాసనార్హత ఉన్నదో అలాంటి వారందరినీ చంపించటం వల్ల రాజు దుష్టుల ప్రభావంలో పడటమే కాదు, తను తరువాత రాజ్యం ఎవరో అనామకుల పాల పడేందుకు మార్గం సుగమం చేస్తున్నాడన్న కనీసపుటాలోచన కూడా హర్షుడికి రాలేదంటాడు కల్హణుడు. ఒక పసి పిల్లవాడు ప్రదర్శించేటటు వంటి ఆలోచన, అవగాహనలు కూడా హర్షుడు ప్రదర్శించలేదని వాపోతాడు కల్హణుడు.

హర్షుడి తండ్రి కలశుడిపైన హర్షుడి లోని కోపాన్ని రెచ్చగొట్టి కలశేష మందిరంపై ఉన్న బంగారు కలశాన్ని దోచమని ప్రోత్సహిస్తే, హర్షుడు అందుకు సిద్ధమైపోయాడు. కాని కలశేషుడి భక్తులు తెలివిగా మతి తప్పిన ఏనుగు, శిఖరం అంచు నుండి క్రిందకు పడకుండా దారి తప్పించినట్టు, హర్షుడి దృష్టిని మళ్లించారు. కలశేషుడి మందిరాన్ని కాపాడారు.

“గ్రామాలను చుట్టుముట్టండి, బంగారాన్ని దోచండి. కలశేశ్వరుడి మందిరంలోని ధనాన్ని దోచండి. మందిరాన్ని కూలగొట్టి, ఆ రాళ్ళతో వితస్తపై వంతెనను నిర్మించండి” అని దుష్టుల బోధనల ప్రభావానికి గురయి ఆజ్ఞాపించిన హర్షుడిని – పథ్యం ఇష్టపడకుండా తినకూడని వాటి కోసం ఆశపడే రోగిని, ఆ పదార్థాలు తినకుండా కాపాడినట్టు – భక్తులు కాపాడేరు. ఇలా ఎన్నో సంఘటనలను కల్హణుడు ప్రస్తావిస్తాడు. అధికారులు ధన మదాంధతతో ఎలా పవిత్ర స్థలాలను, పవిత్ర స్థలాలుగా గాక, ధనం నిండి దోచుకోదగ్గ ఖజానాలుగా మాత్రమే భావించారో ఎంతో వేదనతో వర్ణిస్తాడు కల్హణుడు.

ఈ సందర్భంగా కల్హణుడు ప్రస్తావించిన అనేక సంఘటనలలో ఒక సంఘటనను ప్రస్తావించుకోవలసి ఉంటుంది.

లోష్ఠానుడనే వాడు రాజును పలు దుష్ట కార్యాలకు ప్రోత్సహిస్తుండేవాడు. ప్రయాగుడు  రాజు దుష్ట పనులు చేయకుండా అడ్డుపడేవాడు. చివరికి లోష్ఠానుడు ఓ రాజు హర్షుడితో హాస్య ప్రసంగం చేస్తూ “కారాగారంలో ఉన్న దైవానికి స్వేచ్ఛ ప్రసాదించండి ప్రభూ” అన్నాడు.

హర్షుడికి అది అర్థం కాలేదు. “దైవానికి స్వేచ్ఛ ప్రసాదించటం ఏమిటి?” అని అడిగాడు. “ఒకప్పుడు ఉద్ధండపురాన్ని భీమషాహి అనే రాజు పాలించేవాడు. కలశుడి పాలన కాలంలో పూజారుల నడుమ చెలరేగిన విభేదాల వల్ల భీమకేశవ మందిరానికి తాళాలు వేశారు. ఈ విభేదాలు సమసిపోయిన తరువాత మందిరం తలుపులు తెరిచారు. అప్పుడు గమనించారు, మందిరంలోని ఆభరణాలను దొంగలు ఎత్తుకుపోయారని. దాంతో, దొంగల భయానికి మళ్లీ గుడి తలుపులు తాళం బెట్టారు. ఇప్పటికీ మందిరం తాళాలు వేసే ఉన్నాయి. ఆ తాళాలు బద్దలు కొట్టి, మందిరం లోని ధనాన్ని దొంగల నుంచీ రక్షిస్తూ, తమరు స్వీకరిస్తే, భగవంతుడు దొంగల భయం నుంచి విముక్తుడయి మళ్ళీ పూజలు అందుకుంటాడు” అన్నాడు. అంతేకాదు, ఆ ధనం దైవానికి ఎందుకూ పనికిరాదు, కాబట్టి ఆ ధనం స్వీకరించి ప్రజా సంక్షేమం కోసం వాడవచ్చని పదే పదే బోధించాడు. దాంతో హర్షుడు ఒక రోజు మందిరం తాళాలు పగలగొట్టించాడు. లోపల ఐశ్వర్యం చూసి రాజు మతి పోయింది. పాడుపెట్టి  వదిలేసిన మందిరంలోనే ఇంత ధనం ఉంటే, ఇక నిత్యం పూజలందుకునే మందిరాలలో ఇంకెంత ఐశ్వర్యం ఉంటుందోనన్న ఆలోచన వచ్చింది హర్షుడికి.

హర్షుడి ఈ ఆలోచనను బ్రాహ్మణ సమూహం వ్యతిరేకించింది. అయితే వారి ఇతర వ్యతిరేకతల లాగే ఈ వ్యతిరేకత కూడా వారి ‘కోరిక’ తీరటంతో వీగిపోయింది. దేవాలయ ధనాన్ని రాజు దోచుకున్నందుకు పరిహారంగా వారిపై విధించే పన్నును తొలగించమని కోరారు. రాజు అంగీకరించటంతో వారు నిరసన విరమించి దేవాలయ ధనాన్ని రాజు దోచుకునేందుకు అంగీకరించారు. ‘యథా రాజా తథా ప్రజ’ అనేందుకు ఇది చక్కని దృష్టాంతం. రాజు దేవాలయ ధనాన్ని దోచుకోవాలనుకున్నాడు. తమకు విధించే పన్ను తొలగిస్తే దేవాలయ ధనం దోచుకోవచ్చన్నారు బ్రాహ్మణులు. ఈ సంఘటన చదువుతుంటే సమకాలీన సమాజం గుర్తుకు రాక మానదు.

దేవాలయ ధనాన్ని ప్రజా సంక్షేమానికి వాడాలని ‘దొంగల భయం నుంచి దైవానికి విముక్తి కలిగించాల’ని ఆధునికులు ప్రయత్నించటం గుర్తుకు వస్తుంది. దైవ సంబంధిత ప్రతి విషయాన్ని ఇంకేదో సాంఘిక విషయానికి ముడిపెట్టి వ్యాఖ్యానించటం గుర్తుకువస్తుంది. దేవాలయ ధనాన్ని ప్రజా సంక్షేమం నెపం మీద దోచుకున్న హర్షుడు ఆ ధనాన్ని వినియోగించిన విధానం, ఆ తరువాత అతడికి పట్టిన గతి గమనిస్తే, ఇందులో ‘హెచ్చరిక’ కూడా అర్థమవుతుంది.

హర్షుడు ఆ ధనాన్ని వినియోగించిన విధానం, ఆ తరువాత అతడికి పట్టిన గతి తెలుసుకునే కన్నా ముందు భారతీయ సమాజంలో దేవాలయాల ప్రాధాన్యాన్ని టూకీగా స్మరించుకోవాల్సి ఉంటుంది.

భారతీయ జీవన విధానంలో ‘దేవాలయం’ గుండె లాంటిది. దేవాలయం ఒక గొప్ప ఆర్థిక వ్యవస్థకు కేంద్రంగా ఉండేది. అందుకే ప్రపంచంలో ఇతర ఏ సంస్కృతిలో, నాగరికతలో లేని విధంగా, భారతీయ జీవన విధానం దేవాలయం కేంద్రంగా ఎదిగింది. అందుకే భారతదేశంలో అనేక ఊళ్ళూ, నగరాలు, ఆ స్థలంలోని ప్రసిద్ధ దేవాలయం పేరుతోనే గుర్తింపు పొందుతాయి. తిరుపతి, భద్రాచలం, కేదారనాథ్, మధుర, రామేశ్వరం వంటివాటితో సహా అనేకానేక ఊళ్ళలో ‘మందిరం’ తప్ప మరొకటి ఉండదు. ఒక మందిరం చుట్టూ ఊళ్ళూ, నగరాలు వెలుస్తాయి. ప్రతి గ్రామానికి ఒక గ్రామ దేవత ఉంటుంది. ప్రధాన దేవాలయం ఉంటుంది. అందుకే దేవాలయ నిర్మాణం ఒక పవిత్ర కార్యం, ప్రజా సంక్షేమ కార్యం అయింది. ఎందుకంటే, ఒక దేవాలయం నిర్మిస్తే, ఒక ఊరు వెలుస్తుంది. ఎంతోమందికి జీవనోపాధి లభిస్తుంది. దాని ఆధారంగా ఒక ఆర్థిక వ్యవస్థ నిర్మాణమవుతుంది.  ఒక economic eco system  ఏర్పడుతుంది.  ఇది ఆ ప్రాంతానికే కాదు, ఆ రాజ్యానికీ లాభకారకమవుతుంది. మధ్యయుగంలో దేవాలయాలు ఈనాటి బ్యాంకుల్లా వ్యవహరించేవి. రాజుల నిర్ణయాలను ప్రభావితం చేసేవి. ఆ తరువాత వ్యాపారుల కూటములు  ఏర్పడి ప్రత్యక్షంగా ఈ కార్యం నిర్వహించినా, పరోక్షంగా దేవాలయాల నిర్వహణకు దానాలు ఇవ్వటం ఒక పవిత్ర కార్యంగా భావించినా, దాని వెనుక రాజ్య ఆర్థిక, సామాజిక వ్యవస్థను పటిష్టం చేయటం ఉండేది.  యుద్ధ సమయాలో దేవాలయ ధనాన్ని అవసరార్ధం వాడిన రాజు, ఆ తరువాత తాను తీసుకున్న దానికి రెట్టింపు తిరిగి దేవాలయాలకు చెల్లించేవాడు. అందుకే ఒక రాజ్యం ఉచ్చస్థాయిని దేవాలయాల ఐశ్వర్యం ప్రతిబింబించింది. గమనిస్తే భారతదేశంలో విలసిల్లిన ప్రతి సామ్రాజ్యం, వారి పాలనా కాలంలోని దేవాలయాల శక్తిపై ఆధారపడి ఉండడం గమనించవచ్చు. అందుకే కారణం ఏదైనా దేవాలయంపై దాడి అన్నది భారతీయ సామాజిక ఔన్నత్యంపై, పటిష్టతపై దాడిగా పరిణమిస్తుంది. ఈ దాడి ఫలితం సర్వనాశనం అన్నదీ చరిత్రలో నిరూపితం. చోళులు, పల్లవులు, విజయనగర రాజులు, కాకతీయులు, ప్రతి ఒక్కరి గొప్పతనం వారు నిర్మించిన మందిరాలు ప్రతిబింబిస్తాయి. అందుకే హర్షుడు దైవాన్ని విముక్తం చేయటం నెపం మీద దేవాలయాల ధనాన్ని దోచుకోవటం కల్హణుడిని అంతగా బాధించింది. అంత నిరసన కలిగించింది.

(ఇంకా ఉంది)

Exit mobile version