Site icon Sanchika

కశ్మీర రాజతరంగిణి-73

[box type=’note’ fontsize=’16’] కశ్మీర్ ప్రాచీన చరిత్ర గురించి అవగాహన కలిగించి, భవిష్యత్తు గురించి ఆలోచనలు కలిగించాలన్న ప్రయత్నంలో భాగంగా నీలమతపురాణం తరువాత అందిస్తున్న జోనరాజు, శ్రీవరుడు, ప్రజ్ఞాభట్టులు కల్హణుడి అడుగుజాడల్లో నడుస్తూ సంస్కృతంలో రచించిన ‘కశ్మీర రాజతరంగిణి’ అనువాదాన్ని తెలుగు పాఠకులకు అందిస్తున్నారు కస్తూరి మురళీకృష్ణ. [/box]

త్రిల్ల సేనాభిధం దృష్ట్యా ప్రవిష్టం డామరం పరే।
ఉచ్ఛలోసావితి భ్రాన్త్యా విహారం తమ దాహయన్॥
(కల్హణ రాజతరంగిణి 7, 1336)

[dropcap]ప్ర[/dropcap]జలలో ఉచ్ఛలుడు, సుస్సలుల పట్ల పెరుగుతున్న అభిమానం హర్షుడిని కలవరపరిచింది. కానీ వారిద్దరూ శక్తిమంతులు కావడంతో హర్షుడు వారి జోలికి పోలేదు. ఆ కోపం అంతా ఇతర విషయాల వైపు మళ్లించాడు. రాజభవనం చుట్టూ ఆకాశాన్ని తాకే చెట్లు ఉండడం వల్ల రాజభవనం సరిగ్గా కనబడడం లేదని చెట్లన్నీ కొట్టించాడు. ప్రజలపై పన్ను భారం పెంచాడు.  అధికారులతో ప్రజల దగ్గర నుండి పన్నులు క్రూరంగా వసూలు చేయించాడు. హర్షుడి ఈ దుశ్చర్యలకు వ్యతిరేకంగా డామరులు తిరుగుబాటు చేశారు.

ప్రజలలో తన పట్ల పెరుగుతున్న కోపం కానీ, తన పాలన తీరు పట్ల పెరుగుతున్న వైముఖ్యం కానీ హర్షుడు గమనించలేదు. అధికారం వల్ల కలిగిన అహంకారంతో తనకు ఎదురు లేదనుకున్నాడు. డామరులను అణిచివేయమని ఆజ్ఞలు జారీ చేశాడు. డామరులందరినీ చంపివేయమన్నాడు. డామరుడన్నవాడు కశ్మీరులో మిగలకూడదని ఆజ్జలు జారీ చేశాడు. ఒక రకంగా తన గొయ్యి తానే తవ్వుకున్నాడు.

అధికారి అన్నవాడు, తన అధికారం దైవదత్తం అనీ, ఒక బాధ్యత అనీ, ఇతరులకు సేవ చేసేందుకు దొరికిన అవకాశం అనీ భావించినంత కాలం రాజు దైవాంశజుడయ్యాడు. రాజ్యం సుభిక్షంగా ఉంది. ప్రజలు సుఖ సంతోషాలతో జీవించారు. ఎప్పుడయితే రాజు అధికారాన్ని తన హక్కుగా భావించి, ప్రజలకు తాను భాగ్యవిధాతను అనుకున్నాడో అప్పటి నుంచీ ప్రజలకు కష్టాలు మొదలయ్యాయి. దేశానికి దుర్దశ ఆరంభమయింది. రాజు క్రూరుడు, ధూర్తుడయ్యాడు. దైవ స్థానం నుంచి దిగజారి రాక్షసుడయ్యాడు.

హర్షుడి సేనలు మరులపై విరుచుకుపడి, తమ గూళ్ళలో నిద్రిస్తున్న పక్షులను చంపినట్టు చంపేయి. డామరులలోనే వ్యాపారులు, వైశ్యులుగా పరిగణనకు గురయ్యే లావణ్యులను ఊచకోత కోశాడు. కల్హణుడు రాజతరంగిణిలో డామరులు, లావణ్యులు అన్న పదాలను సమానార్థకాలుగా వాడతాడు. ప్రస్తుతం కశ్మీరులో ‘లోన్’ (Lone) తెగ ఒకప్పటి లావణ్యులు అని భావిస్తున్నారు. వీరు వ్యవసాయం చేస్తారు. ‘లోన్’లు కుప్వారా జిల్లాలో అధికంగా ఉన్నారు. వీరు కల్హణుడి కాలంలో జుట్టు పెంచుకునేవారు. వీరుల్లా కనబడేవారు. హర్షుడు  ఎలాంటి ఆజ్ఞలు జారీ చేశాడంటే, పెద్ద జుట్టుతో వీరుడిలా కనబడిన ప్రతి ఒక్కడిని లావణ్యుడిలా భావించి సైనికులు చంపేశారు. చివరికి రహదారులలో ప్రయాణీకులను కూడా పెద్ద జుట్టు ఉంటే లావణ్యులని భావించి చంపేశారు. దాంతో సైనికుల నుంచి తప్పించుకోగలిగిన వారు ప్రాణాలు అరచేత పెట్టుకుని పొరుగు దేశాలకు పారిపోయారు. ఈ సమయంలో హర్షుడు జరిపిన అకృత్యాలు చెంగీజ్‌ఖాన్‌ను గుర్తుకు తెస్తాయి. ఎప్పుడయితే సమాజం తనని తాను మరచి పరాయి వారిని అనుకరిస్తూ, వారిలా మారాలని ప్రయత్నిస్తుందో అప్పుడు సమాజంలో ఇలాంటి వికృతులు  బయలుదేరుతాయి.

కశ్మీరులో డామరుల పుర్రెలతో తోరణాలు కట్టారు. వీధులన్నీ అలంకరించారు. డామరుల అభరణాలు, గొలుసులు, దుస్తులు వీధుల్లో వ్రేలాడగట్టారు. డామరుడి తలను తెచ్చినవారికి బహుమతులు ప్రకటించారు. డామరుల తలలను తినేందుకు కశ్మీరం నిండా గ్రద్దలు, కాకులు వచ్చి చేరాయి.

పుర్రెల గుట్టలు తయారు చేయటం, చంపినవారి శవాలను వీధుల్లో వ్రేలాడగట్టడం, వారి దుస్తులను, అభరణాలను వీధుల్లో ప్రదర్శించడం, శవాలను అవమాన పరచటం, అంతా తురుష్కులు/మంగోలుల అలవాట్లు. ఇవి కశ్మీరులో కూడా ప్రవేశించాయని కల్హణుడి రాజతరంగిణి నిరూపిస్తుంది. బాబరు భారతదేశంలోకి ప్రవేశించేముందు అఫ్ఘన్లను తరిమి తరిమి, వేటాడి, వేటాడి చంపటం ఒక ఆటగా భావించేవాడు. అందుకే బాబరు ఆడుతూ పాడుతూ భారత్ లోకి అడుగుపెట్టాడని కొందరు చరిత్ర రచయితలు వ్యంగ్యంగా వ్యాఖ్యానిస్తారు. ఆ ఆటలు, పాటలు కశ్మీరు చేరాయన్న మాట.

డామరుల శవాల దుర్గంధంతో కశ్మీరు అల్లల్లాడిపోయింది. మాదవ రాజ్యంలోంచి దామరులను సంపూర్ణంగా తరిమిచేసిన తరువాత, క్రామ రాజ్యంలో తలదాచుకున్న డామరులను పూర్తిగా నాశనం చేయటానికి కశ్మీర సైన్యం ఆ రాజ్యంలోకి అడుగుపెట్టింది. హర్షుడి సేనలు క్రామ రాజ్యంలోకి వస్తే తాము పూర్తిగా నశిస్తామని గ్రహించిన డామరులు క్రామరాజ్యం వదిలి ‘లీలాహ’కు పారిపోయారు.

హర్షుడు, డామరులపై ఆగ్రహించి, వారిని సమూలంగా నాశనం చేయాలని కంకణం కట్టుకోవటం, వేటాడి చంపటం, మొఘల్ రాజులు సిక్కులను వేటాడి వేటాడి చంపిన సంఘటలనను గుర్తుకు తెస్తుంది. రెండవ ప్రపంచ యుద్ధంలో హిట్లర్, యూదులను వెతికి వెతికి చంపిన సంఘటనలు గుర్తుకువస్తాయి. కాలం మారినా మారని మానవ క్రౌర్య స్వరూపం అర్థమవుతుంది. మనిషిలోని ఈ పశువును అణిచిపేట్టేందుకే భారతీయ ధర్మంలో ప్రతీ వ్యక్తికీ బాధ్యతలు, కర్తవ్యాలు నిర్దేశించారని అర్థమవుతుంది. వాటిని పాటించినంత కాలం పశువు అదుపులో ఉన్నది. అప్పుడప్పుడూ తలెత్తినా అణగిపోయింది. కానీ ఎప్పుడయితే తుఫానులా మ్లేచ్ఛ మూకలు భారతదేశాన్ని ముంచెత్తి అల్లకల్లోలం చేయటం ఆరంభించాయో, అప్పుడే భారతదేశం తన స్వస్వరూపాన్ని మరచి కొత్తరూపం ధరించటం మొదలుపెట్టింది. అనేక వికృతులు పొడసూపాయి. మ్లేచ్ఛ మూకల ప్రభావంతో అనేక వికృతులతో కూడిన భారతీయ సమాజాన్ని పోల్చి విశ్లేషించి అధ్యయనం చేయాల్సిన అవసరం ఉంది. ఆ తరువాతనే భారతీయ సమాజం గురించి ఓ అవగాహన ఏర్పడుతుంది. అందుకే కల్హణుడు హర్షుడిని రాక్షసుడు అన్నాడు. మ్లేచ్ఛుల వల్ల భారతీయ సమాజంలో రాక్షసులు ఉద్భవించటాన్ని ప్రత్యక్షంగా చూసిన కల్హణుడు భవిష్యత్తును గ్రహించాడు. అందుకే కశ్మీరు గొప్పను సజీవంగా నిలిపేందుకు రాజతరంగిణి రచించాడు.

కిమన్య ద్రాక్షసః కశ్ఛిత సురతీర్థర్ఘ పూజితమ్।
నిహంతుం మండలమిదం హర్ష వ్యాజూదవాతరత్॥
(కల్హణ రాజతరంగిణి 7, 1243)

ఎవరు మాత్రం ఏం చేయగలరు? దేవతలు గౌరవించి, మునులు తీర్థాలతో అత్యంత పవిత్రంగా అలరించిన కశ్మీరును నాశనం చేసేందుకు రాక్షసుడు హర్షుడి రూపంలో వచ్చాడు.

ఇప్పుడు కల్హణుడి బాధను అర్థం చేసుకోవచ్చు.

ఊహ తెలిసినప్పటి నుంచీ తీవ్రవాదంతో అల్లకల్లోలమవుతున్న కశ్మీరు తెలిసినవారికి కశ్మీరు పట్ల ఉండే అభిప్రాయం వేరు. భూలోక స్వర్గం లాంటి కశ్మీరును దర్శించి, ఆనందం అనుభవించి, అడుగడుగునా శివలింగాలలా కనిపించే గులకరాళ్ళను చూసి, నిరంతరం శివలింగాలని అభిషేకిస్తూ, నురుగులతో పరుగులిడుతున్న నదులను చూసిన వారికి కశ్మీరంలో తీవ్రవాదుల తుపాకీ ధ్వనులు, ప్రాణాలు పోయినవారి కోసం రోదిస్తున్న ధ్వనులను ఊహించుకుంటుంటే, భరించరాని భాధ కలుగుతుంది. కశ్మీరు వైభవాన్ని దర్శించని, దాని గురించి తెలియని మనకే ఇంత బాధ కలుగుతుంటే, కశ్మీరు వైభవం తెలుసుకుని, తన కళ్ళముందే మ్లేచ్ఛుల ప్రభావంతో, మనవారే రాక్షసులై కశ్మీరు వైభవాన్ని చిదిమేసి నరకంలా మారుస్తుంటే ఈ మార్పుకు తాను ప్రత్యక్ష సాక్షి అవటం కల్హణుడికి ఎంత తీవ్రమైన వేదన కలిగించి ఉంటుందో ఊహించాలంటే బాధ కలుగుతుంది. ఇలా దిగజారుతూ నరకంలా మారిన కశ్మీరంలోనే పుట్టి పెరిగే తరాలకు కశ్మీరు పూర్వవైభవం తెలిసే వీలు లేదు. కశ్మీరు ఔన్నత్యం చెప్పినా అర్థం కాదు. అందుకే కల్హణుడు రాజతరంగిణి రచించాడు. కశ్మీరుకే కాదు సమస్త భారతదేశానికి ప్రాచీన ఔన్నత్యాన్ని సజీవంగా అందించటమే కాదు, ఏ రకంగా స్వర్గం లాంటి కశ్మీరు మ్లేచ్ఛ ప్రభావంలో నరకపు లోతుల్లోకి దిగజారి రాక్షసమయం అయిందో, అందుకు తమని తాము మరిచిన భారతీయులే ఎలా కారణమయ్యారో కూడా ప్రదర్శించాడు రాజతరంగిణి ద్వారా కల్హణుడు. రాజతరంగిణి ఒక గొప్ప పాఠం నేర్పుతుంది. తనని తాను మరచిన జాతి రాక్షసత్వంలోకి దిగజారుతుంది. పరాయి వాడిలా కావాలని తపన పడే వ్యక్తి స్వీయవ్యక్తిత్వం నశిస్తుంది.

హర్షుడు ఇలా రాక్షసుడిలా ప్రవర్తిస్తున్న కాలంలో, హర్షుడి మంత్రి లక్ష్మీధరుడి భార్య సుస్సలుడితో ప్రేమలో పడింది. ఇది లక్ష్మీధరుడికి ఆగ్రహం తెప్పించింది. అయితే లక్ష్మీధరుడు స్వయంగా సుస్సలుడిని ఏమీ అనలేడు. అందుకని, సుస్సలుడు రాజద్రోహం చేస్తున్నాడని, అతడికి కశ్మీర సింహాసనంపై కన్నుందని, అతడిని అదుపులో పెట్టక తప్పదని హర్షుడిని ఎగదోశాడు. అంటే హర్షుడి ద్వారా తన ప్రతీకారం తీర్చుకోవాలని ప్రయత్నించాడన్న మాట లక్ష్మీధరుడు.

అధికారులు ఎంత తెలివైనవారో , అంత అమాయకులు. ఎవరినయినా నమ్మితే గుడ్డిగా నమ్ముతారు. ఎంతగా అంటే, తన వ్యక్తిగత స్వార్థం ఆధారంగా వారు ఏం చెప్పినా అది నిజమని నమ్ముతారు. వారు చెప్పినట్టు చేస్తారు. తమ చావు కొనితెచ్చుకుంటారు. హర్షుడు అదే చేశాడు. లక్ష్మీధరుడు చెప్పింది నిజమని నమ్మాడు. ఉచ్ఛలుడు, సుస్సలులను హతమార్చమని ఆజ్ఞలు జారీ చేశాడు. ఇది తెలుసుకున్న సోదరులిద్దరూ అర్ధరాత్రి రహస్యంగా కశ్మీరు వదిలి పారిపోయారు. డామరులతో చేతులు కలిపారు. అంటే హర్షుడు మూర్ఖంగా తన శత్రువులందరూ ఏకం అయ్యేట్టు చేస్తున్నాడన్న మాట. అంత వరకూ హర్షుడికి వ్యతిరేకంగా పోరాడాలన్న ఆలోచన లేని సుస్సలుడు, ఉచ్ఛలుడు కూడా దామరులతో కలవటం అంటే ప్రవాహానికి దిశ దొరికినట్టే. ఉచ్ఛలుడు దామరులను, ఇతర సమర్థకులను కూడగట్టుకుని కశ్మీరుపై దాడి చేశాడు. ఏ రాజు కూడా ఉచ్ఛలుడికి ఆశ్రయమివ్వకుండా చేయాలన్న హర్షుడి ప్రయత్నాలు ఫలించలేదు. ఉచ్ఛలుడు హర్షుడికి వ్యతిరేకంగా బయలుదేరాడని తెలియగానే ఎక్కడెక్కడి నుంచో దామరులు, ఖాసాలు పెద్ద సంఖ్యలో వచ్చి  ఉచ్ఛలుడిని చేరారు. తేనెటీగల్లా దామరులు వేల సంఖ్యలో అన్ని వైపుల నుంచి ఉచ్ఛలుడిని చేరారంటారు కల్హణుడు. హర్షుడి సైన్యం ఉచ్ఛలుడిని ఎదుర్కొంది. ఉచ్ఛలుడు ఓ విహారంలో ఉన్నాడని పొరబడి ఆ విహారాన్ని కూల్చేశారు హర్షుడి సైనికులు. ఈ సందర్భంలో కూడా విహారాన్ని కూల్చేందుకు కారణం, శత్రువు విహారంలో దాక్కున్నాడన్నది తప్ప బౌద్ధంపై ద్వేషంతో కాదు.

హర్షుడి తాకిడికి తట్టుకోలేక ఉచ్ఛలుడు మృత్యువు కోరల్లోంచి తప్పించుకుని వితస్త దాటి ‘తారమూలక’ చేరాడు. అయితే, హర్షుడు ఉచ్ఛలుడిని వెంబడిచలేదు. ముల్లును శరీరంలోంచి తీయనంతవరకూ అది బాధ కలిగిస్తూనే ఉంటుంది. అలాగే వదిలేస్తే అది తీవ్రమైన నష్టం కలిగిస్తుంది. అలాగే శత్రువును కూడా సంపూర్ణంగా ఓడిస్తేనే అతని నుంచి ప్రమాదం తప్పుతుంది. లేదంటే, ప్రమాదం పొంచి ఉన్నట్టే. కాలం గడచిన కొద్దీ ప్రమాదం తీవ్రమవుతుంది. ప్రాణాలు అరచేత పెట్టుకుని పారిపోతున్న ఉచ్ఛలుడిని హర్షుడు వెంబడించలేదు. అతడిని వదిలేసి సాధించిన తాత్కాలిక విజయానికే ఆనందపడిపోయి సంబరాలు చేసుకొన్నాడు.

ఇంతలో సుస్సలుడు సైన్యంతో మరోవైపు నుంచి దాడి చేశాడు. ఉచ్ఛలుడు మళ్ళీ నలువైపులా చెల్లాచెదురైన దామరులను కూడదీసుకున్నాడు. సుస్సలుడు ‘శూరపుర’ను గెలుచుకున్నాడు. దాంతో హర్షుడు ఉచ్ఛలుడిని వదిలి సైన్యాన్ని సుస్సలుడి పైకి పంపాడు. సుస్సలుడు హర్షుడి సైన్యాన్ని ఓడించాడు. దామరుల సహాయంతో ఉచ్ఛలుడు ‘లోహారం’ వైపు నుంచి దాడి చేశాడు. ఓ వైపు నుంచి ఉచ్ఛలుడు, మరోవైపు నుండి సుస్సలుడు హర్షుడి అధికారానికి గండి కొడుతూ కశ్మీరాన్ని సమీపించారు. పద్మాపురం చేరుకున్నారు. హర్షుడి ఆజ్ఞలను మంత్రులు పాటించటం మానేశారు. ఎవరికి వారు సుస్సలుడో, ఉచ్ఛలుడో ఎంచుకుని ఆ వైపు చేరిపోసాగారు. హర్షుడికి తనవారంటూ ఎవరూ లేకుండా పోయారు. ‘నా అన్న వారెవరూ లేరా?’ అని రోదించాడు హర్షుడు. ఆరిపోయే ముందు దీపం వెలిగేట్టు హర్షుడికి సహాయంగా ‘చంద్రరాజు’ వచ్చాడు. సైన్యంతో అతడు ఉచ్ఛలుడు, సుస్సలులపై విరుచుకుపడ్డాడు. వారిని పద్మపురం నుంచి తరిమివేశాడు. వ్యక్తిని పూర్తిగా దెబ్బ తీసేముందు విధి ఆశ కల్పిస్తుందట. లేడిని పులి వదిలినట్టే చేసి పట్టుకుంటుందట. హర్షుడి విషయంలో ఇది నిజమైంది.

(ఇంకా ఉంది)

Exit mobile version