Site icon Sanchika

కశ్మీర రాజతరంగిణి-74

[box type=’note’ fontsize=’16’] కశ్మీర్ ప్రాచీన చరిత్ర గురించి అవగాహన కలిగించి, భవిష్యత్తు గురించి ఆలోచనలు కలిగించాలన్న ప్రయత్నంలో భాగంగా నీలమతపురాణం తరువాత అందిస్తున్న జోనరాజు, శ్రీవరుడు, ప్రజ్ఞాభట్టులు కల్హణుడి అడుగుజాడల్లో నడుస్తూ సంస్కృతంలో రచించిన ‘కశ్మీర రాజతరంగిణి’ అనువాదాన్ని తెలుగు పాఠకులకు అందిస్తున్నారు కస్తూరి మురళీకృష్ణ. [/box]

ఇతః ప్రచృతి యః కశ్చిద్రాజ్యస్యాస్య గతౌజసః।
చక్రికామాత్ర సాధ్యత్వం జానన్నాశం కరిష్యతి॥
(కల్హణ రాజతరంగిణి 7, 1420)

[dropcap]క[/dropcap]శ్మీర రాజ్యం పవిత్రత నాశనమైపోయింది. ఇకపై ఎవరూ కుట్రలు చేయగలుగుతారో, వాళ్లే రాజ్యాధికారం పొందుతారు.

భవిష్యత్తును దర్శించి ప్రకటించిన సత్యం ఇది!

కశ్మీరులో భవిష్యత్తులో రాజ్యం పొందేందుకు ఉండే ఒకే ఒక అర్హత సమర్థవంతంగా కుట్రలు చేసి అధికారం సాధించగలగడం!

హర్షుడికి తన పాలన చివరి దశకు చేరుకుందని అర్థమయింది.

సుస్సలుడు ఓ వైపు నుంచి దూసుకు వస్తుంటే, ఉచ్ఛలుడు మరింత వేగంతో ముందుకు వస్తున్నాడు. ఇద్దరూ చెరోవైపు నుంచి కార్చిచ్చులా కశ్మీరు రాజ్యాన్ని ‘స్వాహా’ చేసుకుంటూ వస్తున్నారు. సుస్సలుడి కన్నా ఉచ్ఛలుడు మరింత వేగంగా ముందుకు వస్తుండడంతో హర్షుడు తన దృష్టిని ఉచ్ఛలుడిపై కేంద్రీకరించాడు. సైన్యాన్ని ఉచ్ఛలుడిపైకి పంపాడు. కానీ ఎదురు వచ్చిన వారిని వచ్చినట్టే మట్టుపెడుతూ ఉచ్ఛలుడు దూసుకు వస్తుండడంతో హర్షుడికి ఏం చేయాలో తోచలేదు. ఒక దశలో ఉచ్ఛలుడికి వ్యతిరేకంగా యుద్ధం చేస్తే, సైన్యానికి నాయకత్వం వహించేందుకు ఎవ్వరూ ముందుకు రాలేదు. ఏరి కోరి మృత్యుముఖంలోకి ఎవరు వెళ్తారు? దాంతో హర్షుడికి ‘తన వారు’ అన్నవారు లేకుండా పోయారు.

అతడి చుట్టూ చేరిన మంత్రులు అతడిని దేశం వదిలి పారిపోమని సలహాలివ్వడం ప్రారంభించారు. కొందరు అతడిని ఆత్మహత్య చేసుకోమని బోధించారు. మరికొందరు యుద్ధం చేసి మరణించడం గౌరవప్రదం అన్నారు. హర్షుడికి ఏదీ చేయాలని అనిపించలేదు. ప్రజల అభిమానం పొంది, శక్తివంతమైన స్థితిలో రాజ్యం ఆరంభించిన తాను ఎలాంటి స్థితికి దిగజారాడో అర్థమయింది. రాజ్యాన్ని తాను ఎంతగా బలహీనం చేశాడో బోధపడింది. తన వల్ల ఇప్పుడు రాజ్యం ఎవరు కుట్రలు చేయగలుగుతారో, ఎవరు పదిమందిని కూడగట్టుకోగలరో వారికే దక్కే దుస్థితికి దిగజారిందని గ్రహించాడు హర్షుడు. ఆ గ్రహింపు వల్ల కలిగిన వేదనతో బాధతో హర్షుడు అన్న మాటలివి. అప్పటి నుంచి ఇప్పటి వరకూ ప్రజాభిమానంతో, ప్రజల పరిస్థితి మెరుగుపరచాలన్న తపనతో కాక, కుట్రలు, కుతంత్రాలతో, ప్రజలను ఏదో ఒక రకంగా రెచ్చగొట్టి, మభ్యపెట్టి, గుడ్డివాళ్లను చేసేవారే కశ్మీరులో అధికారం సాధిస్తూ వస్తున్నారు.

హర్షుడి రోజులు దగ్గర పడ్డాయని అందరికీ అర్థమయింది. హర్షుడి మాటలను లెక్క చేయడం మానేశారు. యుద్ధానికి వెళ్ళమంటే ముందు డబ్బులివ్వమన్నారు. హర్షుడి ముందే ఉచ్ఛలుడిని రాజుగా ప్రకటిస్తూ మాట్లాడేరు. ఇదంతా హర్షుడికి క్రోధాన్ని తెప్పించింది. ఉచ్ఛలుడు, సుస్సలుల తండ్రిని, బంధువులను చంపించాడు. అతని భార్య సహగమనం చేసింది. ఈ వార్త విన్న ఉచ్ఛలుడు, సుస్సలుడు క్రోధంతో కశ్మీరంతో గ్రామాలను తగలబెట్టారు. మరింత క్రోధంతో శ్రీనగరం వైపు ప్రయాణమయ్యారు. తన సోదరుడు ఉచ్ఛలుడి కన్నా ముందు తానే శ్రీనగరం చేరి కశ్మీర సింహాసనం అధిష్టించాలన్న ఆలోచనతో సుస్సలుడు మరింత వేగంగా శ్రీనగరం వైపు దూసుకుపోయాడు. ఉచ్ఛలుడు తన కన్నా ముందు రాజధాని చేరకుండా అతడి దారిలో అవరోధాలు సృష్టించాడు. కానీ ఉచ్ఛలుడు అన్ని అడ్డంకులను దాటుకుని శ్రీనగరం సమీపించాడు. అదే సమయానికి సుస్సలుడిని రాజసైన్యం శక్తివంతంగా ఎదుర్కోవటంతో సుస్సలుడి ప్రగతి ఆగిపోయింది. ‘త్వరగా సింహాసనం నువ్వు ఆక్రమించకపోతే, సుస్సులుడు ఆక్రమిస్తాడ’న్న కబురు అందటంతో ఉచ్ఛలుడు మరింగ వేగంగా రాజధాని వైపు దూసుకుపోయాడు. ఉచ్ఛలుడిని ఎదుర్కోవాల్సిన సైన్యాధికారులంతా అతడిని నగరంలోకి ఆహ్వానించారు. హర్షుడి భార్యలు నిప్పుల్లోకి దూకడం ఆరంభించారు. రాజధాని వదిలి హర్షుడు పారిపోవాలని ప్రయత్నించాడు. కానీ శ్రీనగరంలోకి సుస్సులుడు అడుగుపెట్టటాన్ని ఆపేందుకు వంతెనలన్నిటినీ కాల్చేయటంతో హర్షుడు శ్రీనగరం వదిలి వెళ్ళలేకపోయాడు. ఉచ్ఛలుడి సేనలు శ్రీనగరంలోకి ప్రవేశించాయి. హర్షుడు సేనలను నడిపిస్తూ యుద్ధంలో పాల్గొన్నాడు. తమని పాలించే అర్హత సంపాదించేందుకు రెండు సేనల నడుమ జరుగుతున్న పోరును ప్రజలు నిర్లిప్తంగా చూస్తుండిపోయారు.

హర్షుడి ఏనుగు దెబ్బతిన్నది. అది తన సేననే తొక్కి చంపటం మొదలుపెట్టింది. దాంతో హర్షుడు యుద్ధం నుంచి వైదొలగవలసి వచ్చింది. హర్షుడు లోహారం పారిపోయే ప్రయత్నాలు ఆరంభించాడు. శత్రుసేనలు రాజభవనంలో ప్రవేశించాయి. డామరులు, ప్రజలు రాజభవనంలో అందినవి అందినట్టు దోచుకోవటం ప్రారంభించారు. ప్రజలు రాజభవనంలో ఇష్టం వచ్చినట్టు ప్రవర్తించారు. కొందరు ముత్యాలను తెల్లటి బియ్యం అనుకుని వాటిని పచ్చడి చేశారు. ఇంకొందరు కాలి బూడిదయిపోయిన దుస్తుల బూడిదలో బంగారం కోసం వెతికారు. ఇలా ప్రజలు ధనాన్ని అగౌరవపరచటంతో అలిగి లక్ష్మీదేవి కశ్మీరాన్ని శాశ్వతంగా విడిచి వెళ్ళిపోయింది అంటాడు కల్హణుడు. అప్పుడు కశ్మీరాన్ని విడిచి వెళ్ళిన శాంతి కానీ, లక్ష్మి కానీ ఇంకా కశ్మీరంలో అడుగుపెట్టలేదు! నిప్పు నాల్కలు చాచి నలుమూలలా విస్తరిస్తున్న దృశ్యాన్ని, ప్రజలు విచక్షణ వీడి విచ్చలవిడిగా దోచుకుంటున్న దృశ్యాన్ని చూసిన హర్షుడికి చిన్నప్పుడు నేర్చుకున్న యాజ్ఞవల్క్య స్మృతిలోని శ్లోకం జ్ఞాపకం వచ్చింది.

ప్రజాపీడన సంతాపాత్య ముద్భుతో కుతాశనః।
రాజ్ఞాః కులం శ్రియం ప్రాణాన్నాదగ్ధ్వా వినివర్తతే॥
(కల్హణ రాజతరంగిణి 7, 1582)

ప్రజల బాధలలోంచి ప్రజ్వరిల్లిన అగ్ని రాజును, అతని వంశాన్ని, అతని అదృష్టాన్ని జీవితాన్ని భస్మం చేసి గానీ ఆరదు.

అత్యద్భుతమైన శ్లోకం ఇది. అధికారం కోసం అర్రులు సాచే వారందరూ తప్పనిసరిగా అర్థం చేసుకోవాల్సిన శ్లోకం. అధికారం సాధించిన ప్రతి ఒక్కరూ ప్రతి రోజూ మననం చేయాల్సిన శ్లోకం. అధికారాన్ని దుర్వినియోగం చేస్తూ ప్రజలను బాధించే వారంతా నిత్య పారాయణం చేయాల్సిన శ్లోకం ఇది.

ప్రజలను బాధిస్తూ, దోచుకుంటూ, అవినీతికి పాల్పడుతూ, కుట్రలు చేస్తూ ఏదో సాధించామనుకుని అధికారి సంతోషించవచ్చు. కానీ ఆ సంతోషం తాత్కాలికం. ప్రజల వేదనాగ్ని అతడినే కాదు అతడి వంశాన్ని, ఆస్తిని, సర్వనాశనం చేస్తుంది. చరిత్రలోకి తొంగి చూసి గమనిస్తే, పలు దృష్టాంతాలు దొరుకుతాయి ఈ నిజాన్ని నిరూపించేందుకు.

శ్రీనగరాన్ని, భవనాలను ఉచ్ఛలుడు తగులబెట్టాడు. హర్షుడు గుప్పెడుమంది సైనికులతో మిగిలిపోయాడు. అతడికి యుద్ధంలో వీరమరణం చెందాలని ఉంది. కానీ అతని వెంట ఉన్న ఓ దుష్ట మంత్రి హర్షుడు యుద్ధానికి బయలుదేరినప్పుడల్లా అడ్డుపడి ఆపేసేవాడు. చివరికి కల్హణుడి తండ్రి చంపకుడు హర్షుడికి లోహారం అయినా పారిపోమని, లేక, యుద్ధం చేసి వీరమరణం అయినా పొందమని సలహా ఇచ్చాడు. హర్షుడి పాలనను, అతని పతనాన్ని, అతని అంతిమ క్షణాలను కల్హణుడు విపులంగా వర్ణించటంలో అతని తండ్రి చంపకుడిచ్చిన సమాచారం ప్రధాన పాత్ర వహించి ఉంటుందని ఊహించవచ్చు.

హర్షుడు తన కొడుకుని సురక్షిత స్థలానికి పంపాడు. అతదు చేరాడో లేదో తెలుసుకునేందుకు చంపకుడిని వెళ్ళమన్నాడు హర్షుడు. “రాజా ఇంకా కాస్సేపటికి మీ వెంట ఎవరూ ఉండరు. ఒంటరిగా మిగులుతారు. అలాంటప్పుడు నన్ను ఇలా పంపటం మంచిది కాదు. నన్ను మీ వెంటనే ఉండనివ్వండి” అని బ్రతిమిలాడేడు చంపకుడు. కానీ హర్షుడు అతడిని బ్రతిమిలాడేడు. “నువ్వు కూడా నా మాట వినకపోతే ఎలా?” అన్నాడు కన్నీళ్ళతో. దాంతో విధి లేని పరిస్థితుల్లో రాజును వదిలి వెళ్ళాడు చంపకుడు. అతడికి అదే రాజు చివరి చూపు అని తెలుసు.

చంపకుడు వెళ్ళిన తరువాత హర్షుడి చుట్టూ ఉన్న వారు ఏదో ఓ నెపంతో హర్షుడిని వదిలి వెళ్ళారు. హర్షుడు యుద్ధానికి వెళ్ళాలనుకున్నప్పుడల్లా ఏదో ఒకటి చెప్పి అతడిని ఆపేవారు. హర్షుడి కొడుకుకి అందజేస్తామని అతడి ఒంటి మీద ఉన్న ఆభరణాలన్నీ ఒకటొకటిగా తీసుకువెళ్ళారు. చివరికి చంపకుడన్నట్టు హర్షుడు ఒక్కడే మిగిలాడు. ఆ రాత్రి ఎలా గడపాలో అతడికి తెలియలేదు. అతడి భవనం కాలిపోయింది. అంతవరకూ అతడిని ఆశ్రయించి, అతడి దృష్టి తమ మీద ప్రసరిస్తే చాలు జన్మ ధన్యమైపోయినట్లు ప్రవర్తించినవారంతా హర్షుడి ముఖం మీదే తలుపులు మూసేశారు. ఎవ్వరూ అతడికి ఆశ్రయమివ్వలేదు. అప్పులవాడి నుంచి దాక్కున్నట్లు మంత్రులంతా హర్షుడిని చూసి దాక్కున్నారు. ఎవ్వరూ అతడికి ఆశ్రయమివ్వలేదు. అత్యంత వైభవం అనుభవించిన కశ్మీర రాజు, చిరిగిన దుస్తులతో, శ్రీనగరం వీధులలో ఆశ్రయం అభర్థిస్తూ తిరిగిన దృశ్యం ఊహించుకుంటేనే హృద్యం ద్రవిస్తుంది. మంచివాడు, పండితుడు, కవి అయిన హర్షుడు కశ్మీరుకు ఆరంభంలో చక్కని పాలనను అందించాడు. కానీ దుష్టుల ప్రభావంలో పడి తురుష్క హర్షుడయ్యాడు. నీచాతినీచమైన పనులు చేశాడు. మ్లేచ్ఛులు సైతం సిగ్గు పడేట్టు వ్యవహరించాడు. దుష్టుల ప్రలోభంలో పడ్డాడు. చివరికి తన రాజ్యంలోనే ఆశ్రయం కోరి ఇల్లిల్లూ తిరిగే దుస్థితికి దిగజారాడు. అత్యంత దయనీయమూ, దుర్భరమైన స్థితి ఇది. శివాంశజుడయిన కశ్మీర రాజు తన ఔన్నత్యం మరిచి, తన వారసత్వం మరిచి, పరుల ప్రలోభంలో పడి ధనం కోసం దేవాలయాలనే దోచిన పాపం, ప్రజలను పీడించిన పాపం, కామంతో ఒళ్ళూపై తెలియకుండా వ్యవహరించిన పాపాల ఫలితం ఇది. రాజుకు తిండి సామాగ్రి తెస్తామని మభ్యపెట్టి అతని వద్ద ఉన్న మిగిలిన ధనాన్ని కాజేశారు. చివరకు ఒంటి మీద ఉన్న చిరిగిన వస్త్రాలతో మిగిలిపోయాడు హర్షుడు. ఇంతలో రాజుల పాపాలను ప్రక్షాళన చేసేట్టు కుంభవృష్టి ఆరంభమయింది. హర్షుడు పూర్తిగా తడిసి ముద్దయ్యాడు. చివరికి ఓ సేవకుడు దారి చూపగా, ఊరవతల తాపసి గుడిసె బయట రాత్రంతా వర్షంలో తడుస్తూ, బురదలో పడుకుని గడిపాడు.

‘నేనెవరిని? నేనేం చేస్తున్నాను? నేనెక్కడున్నాను? నేనేం చెయ్యాలి? నా రాజ్యం పోయింది. భార్యలు అగ్నికి ఆహుతి అయ్యారు. నా కొడుకు ఎటు వెళ్ళాడో తెలియదు. నా వాడు అన్నవాడు, నాడి అన్నది ఏదీ లేకుండా, ఒంటరిగా, ఓ తాపసి గుడిసె ముందు బురదలో పొర్లుతున్నాను. ఏమిటిది?’ అని ఆలోచిస్తూ, గతాన్ని తలచుకుంటూ, దుఃఖిస్తూ రాత్రి గడిపాడు హర్షుడు. తెల్లారి తాపసి అతడిని గుడిసెలోకి రానిచ్చాడు. కానీ అతడు, అతడు తెచ్చిన మరో మహిళ రాజును అవమానపరిచారు. అతడి కొడుకు యుద్ధంలో మరణించాడన్న వార్తను నిర్దాక్షిణ్యంగా చెప్పారు.

హర్షుడు దుఃఖాతీతమైన స్థితికి చేరుకున్నాడు. అతడికి గతమంతా గుర్తుకు వచ్చింది. తన పొరపాట్లను గ్రహించాడు. తాను రాజ్యం కోల్పోయినా ప్రజలు మామూలుగా ఉన్నారని తెలుసుకుని, పగలంతా వెలుగిచ్చిన సూర్యుడు అస్తమించగానే ప్రజలు సుఖంగా నిద్రించినట్టు, ప్రపంచం ప్రాణాలతో ఉన్నవాళ్ళదే తప్ప, మరణించిన వారిది కాదని అర్థం చేసుకున్నాడు. అతనికి ఆశ్రయమిచ్చిన తాపసి, ఉచ్ఛలుడి దగ్గర ధనం తీసుకుని హర్షుడు తన గుడిసెలో ఉన్నాడని రహస్యం చెప్పాడు. దాంతో ఉచ్ఛలుడి సేనలు హర్షుడిని చుట్టుముట్తాయి. హర్షుడు బాకుతో వీరోచితంగా పోరాడేడు. కానీ డామరులు వెనుక నుంచి వచ్చి దాడి చేశారు. ‘ఓ మహేశ్వరా’ అంటూ హర్షుడు ప్రాణాలు విడిచాడు. క్రీ.శ. 1101 సంవత్సరంలో, మరణించినప్పుడు హర్షుడి వయసు 42 సంవత్సరాల ఎనిమిది నెలలు. హర్షుడి తలను శరీరం నుంచి వేరు చేసి ఆ తలను ఉచ్ఛలుడికి అందజేశారు. ఓడినవాడి తలను నరకటం, దాన్ని బహుమతిగా ఇవ్వటం అన్న మ్లేచ్ఛ పద్ధతులు భారతదేశంలో వేళ్లూనుకోవటానికి ఇది నిదర్శనం. అయితే ఉచ్ఛలుడు హర్షుడి తల వైపు చూడలేదు. కన్నీళ్ళతో హర్షుడి దహన సంస్కారాలు జరపమని ఆజ్ఞలు జారీ చేశాడు. విధి ఎలాంటిదంటే, ఒకప్పుడు తన కనుసన్నలతో దేశాన్ని శాసించిన వ్యక్తి, నేడు దహన సంస్కారాలు పొందాలంటే, మరో వ్యక్తి ఆదేశాలు అవసరమయ్యయి అని వాపోతాడు కల్హణుడు.

హర్షుడి జీవితం భావి తరాల వారికి గుణపాఠం లాంటిది. కానీ గతం నుంచి గుణపాఠాలు నేర్చుకోవటం మానవుడి లక్షణం కాదు. ఆధునిక సమాజంలో సద్దాం హుస్సేన్ అయినా, గడ్డాఫీ అయినా, అధికారం అనుభవించినంత కాలం అనుభవించారు. తరువాత వారు కలుగుల్లో దాకున్న ఎలుకల్లా తమ దేశంలోనే ప్రాణాలు అరచేత పట్టుకుని దాక్కున్నారు. దిక్కులేని మరణం పొందారు. వీరే కాదు, చుట్టూ చూస్తే, చేసిన కర్మ ఫలితం ఇక్కడే అనుభవిస్తారన్న నిజం స్పష్టమవుతుంది.

హర్షుడి మరణం సందర్భంగా కల్హణుడు కొన్ని అద్భుతమైన సత్యాలను ప్రకటించే శ్లోకాలు రాశాడు.

అదృష్టం అన్నది మెరుపు లాంటిది. వెంట ఉన్నప్పుడు అంధుడిని చేస్తుంది. ఎవరైతే అత్యద్భుతమైన గొప్పతనం ప్రదర్శిస్తారో, అతి నీచమైన స్థితిలో వారు అంతిమస్థితిని అనుభవిస్తారు. కానీ తామేదో గొప్పవారమన్న భ్రమలో మనుషులు వ్యవహరిస్తారు. మనిషి ఆరంభంలో ఏమీ కాడు. చివరలో ఏమీ కాడు. ఈ నడుమ ఒక్క క్షణం సేపు ఆనందం అనుభవిస్తాడు. దురదృష్టాలు అనుభవిస్తాడు. తల, కాళ్ళు లేని నటుడి లాంటి వాడు మనిషి. అతడు ఎటు నుంచి వస్తాడో, ఎటు పోతాడో ఎవరికీ తెలియదు. సంపదల వైపు పరుగులిడే మనిషి సుఖం వైపు చూస్తాడు, తప్ప శాంతి వైపు చూడడు అంటాడు కల్హణుడు.(కల్హణ కశ్మీర రాజతరంగిణి కథలలో తురుష్క హర్షుడు కథ హర్షుడి జీవితాన్ని ప్రతిబింబిస్తుంది. )

హర్షుడి మరణంలో కశ్మీరంలో ఉచ్ఛలుడి పాలన ఆరంభమయింది. దేవతలు హిమాలయాన్ని వదిలేయటంతో, కాంతి హిమాలయాన్ని వదిలి మేరు శిఖరంపై ప్రసరించినట్టు ఒక వంశం అంతరించి, మరో వంశ పాలన ఆరంభమయింది కశ్మీరంలో.

దీనితో కల్హణ రాజతరంగిణిలో సప్తమ తరంగం సమాప్తం.

(ఇంకా ఉంది)

Exit mobile version