Site icon Sanchika

కశ్మీర రాజతరంగిణి-77

[box type=’note’ fontsize=’16’] కశ్మీర్ ప్రాచీన చరిత్ర గురించి అవగాహన కలిగించి, భవిష్యత్తు గురించి ఆలోచనలు కలిగించాలన్న ప్రయత్నంలో భాగంగా నీలమతపురాణం తరువాత అందిస్తున్న జోనరాజు, శ్రీవరుడు, ప్రజ్ఞాభట్టులు కల్హణుడి అడుగుజాడల్లో నడుస్తూ సంస్కృతంలో రచించిన ‘కశ్మీర రాజతరంగిణి’ అనువాదాన్ని తెలుగు పాఠకులకు అందిస్తున్నారు కస్తూరి మురళీకృష్ణ. [/box]

రాజ్య కించిత్కరే గర్గాయత్త జీవిత మృత్యవః।
బాహ్యాశ్చాఖ్యాన్తరే చాసన్నల్పే వాస్పథకోవివ॥
(కల్హణ రాజతరంగిణి 8, 426)

[dropcap]త[/dropcap]న సోదరుడిని చంపినవారిపై ప్రతీకారం తీర్చుకునేందుకు, తన సోదరుడి తరువాత రాజ్యం తనకు దక్కాలన్న ఆలోచనతో సుస్సలుడు సైన్యంతో కశ్మీరుపై దాడి చేశాడు. అయితే, ఉచ్ఛలుడిని హత్య చేసిన ద్రోహులను, వీరోచితంగా పోరాడి మట్టు పెట్టిన గర్గ, సల్హణుడిని రాజును చేయటంతో సంతృప్తి చెందాడు. కశ్మీరుపై దాడి చేయవద్దని సుస్సలుడికి కబురు పంపించాడు. అంతే కాదు, ఉచ్ఛలుడిని చంపిన భిక్షాచారుడు సుస్సలుడి దగ్గర ఉన్నంత కాలం తాను సుస్సలుడితో చేతులు కలపననీ హెచ్చరించాడు.

సుస్సలుడికి గర్గ మాటలు రుచించలేదు. అయితే, తన సోదరుడికి ద్రోహం చేసిన భిక్షాచారుడిని చంపించాడు. గర్గ హెచ్చరికను లెక్క చేయకుండా కశ్మీరంపై దాడి చేశాడు. ‘రాజ్యం వంశపారంపర్యం అన్నది ఒకప్పటి మాట. ఇప్పుడు రాజ్యాన్ని భుజబలంతో సాధించుకోవాలి. ఎలాగయితే నా సోదరుడు నేను యుద్ధం చేసి రాజ్యం గెలుచుకున్నామో, ఇప్పుడు కూడా యుద్ధం చేసి రాజ్యం గెలుస్తాను’ అంటూ కశ్మీరు పైకి సైన్యం నడిపించాడు సుస్సలుడు.

రాజుగా ఉన్న సల్హణుడికి యుద్ధం తెలియదు. అతడికి సలహా నిచ్చేవాడు లేడు. స్వయంగా ఆలోచించలేడు. రోజుకో అమ్మాయిని తాను అనుభవిస్తాడు. ఆ తరువాత ఆమెను లోధన అనే సేవకుడికి అప్పజెప్తాడు. ఇలా ఇద్దరూ అనుభవించటం తప్ప రాజుకు ఏమీ తెలియదు. దాంతో రాజుకు అండగా నిలిచిన ‘గర్గ’ ప్రాధాన్యం పెరిగిపోయింది. గర్గ చేతిలో రాజు తోలుబొమ్మ అయ్యాడు. గర్గ తనకి నచ్చని వారి గురించి చెప్తే చాలు, రాజు వారిని చంపించేవాడు. తన శక్తితో సుస్సలుడిని గర్గ ఖాసీల రాజ్యానికి తరిమేశాడు. దాంతో రాజు గర్గ ఎలా చెబితే అలా చేసేవాడు. కశ్మీరంలో అందరికన్నా శక్తిమంతుడిగా నిలిచాడు గర్గ. గర్గ చేతిలో రాజు తోలుబొమ్మ అయ్యాడు. కశ్మీరు ప్రజల ప్రాణాలు గర్గ దయా దాక్షిణ్యాలపై ఆధారపడేవి ఆ కాలంలో. గర్గ ఎక్కడికి వెళ్తే అక్కడి ప్రజలు ప్రాణాలు అరచేత పెట్టుకుని భయంతో బిక్కు బిక్కుమంటుండేవారు. గర్గ తామందరినీ సమూలంగా నాశనం చేసేందుకు వచ్చాడని భయంతో ఉండేవారు. ఇలాంటి భయాలతో గర్భవతులకు గర్భస్రావాలయిపోయేవి.

పెరుగుతున్న గర్గ శక్తి రాజుకి భయం కలిగించింది. గర్గ వ్యతిరేకులను ఆయన గర్గను హత్య చేసేందుకు ప్రోత్సాహించాడు. ఓ రోజు కొందరు గర్గ ఇంటిపై ఆయుధాలతో దాడి చేశారు. గర్గ చంద్రుడు ధైర్యంగా వారిని ఎదుర్కున్నాడు. రాజు ప్రత్యేకంగా పంపినవారు గర్గపై దాడి చేసిన వారిని ప్రోత్సహిస్తూ తామూ దాడిలో పాల్గొన్నారు. గర్గ సైనికులు గర్గ ఇంటి చుట్టూ రక్షణ కవచం నిర్మించారు. వారు తమపై దాడి చేస్తున్న వారిని ఇంటి దగ్గరకు రానీయలేదు. ఇంటికి నిప్పు పెట్టాలని ప్రయత్నించిన వారి ప్రయత్నాలను అరికట్టారు. విజృంభించి వీర విహారం చేస్తున్న గర్గ ముందు ఎవరూ నిలవలేకపోయారు. సాయంత్రానికల్లా తనపై దాడికి వచ్చిన వారందరినీ తరిమివేశాడు గర్గ. ఆయన గాయపడ్డా, తన సైనికులతో కలిసి రాత్రంతా కాపలాగా తిరుగునే ఉన్నాడు.

తనపై దాడి చేసిన వారిని గర్గ సమర్థవంతంగా తిప్పికొట్టటం రాజులో భయం పెంచింది. ఎక్కడ గర్గ తనపై దాడి చేస్తాడోనన్న భయంతో నిద్ర పట్టలేదు. చివరికి గర్గతో సంధి చేసుకుని రాజీ పడాలని నిశ్చయించాడు. ‘మహోత్తమ సహేలా’ అనేవాడు గర్గకూ, రాజుకూ రాజీ కుదురుస్తానన్నాడు. లోహారం బయలుదేరాడు. గర్గతో రాజుకు రాజీ కుదిర్చాడు కానీ సుస్సలుడి దాడిని ఆపలేకపోయాడు. సుస్సలుడు సైతం గర్గతో ఒప్పందం చేసుకున్నాడు కానీ మనసులో అతనికి గర్గ పట్ల నమ్మకం లేదు. ఎక్కడ గర్గ తనకు వ్యతిరేకి అవుతాడో అన్న భయం సుస్సలుడి మనసులో ఉంది. చివరికి సుస్సలుడి అనుచరులు కశ్మీరుపై దాడి ఆరంభించారు. ఓ వైపు గర్గ ఎక్కడ తనకు వ్యతిరేకంగా పోరాడుతాడో అన్న భయం ఉన్నా, సుస్సలుడు ముందుకు సాగాడు. సంకుల సమరం తరువాత సుస్సలుడు రాజును బంధీగా పట్టుకున్నాడు. నాలుగు నెలల నాలుగు రోజులు కశ్మీర రాజుగా వైభవం అనుభవించిన సల్హణుడు సింహాసనం కోల్పోయి జైలు పాలయ్యాడు. క్రీ.శ. 1112 సంవత్సరంలో సుస్సలుడు, తన సోదరుడు ఒకప్పుడు అనుభవించిన రాజ్యానికి రాజయ్యాడు.

యుద్ధం అయిపోయిన తరువాత కశ్మీరు ఎలా ఉందంటే, పక్షుల కేకలతో కళకళలాడుతున్న చెట్టు పైకి రాయి విసిరితే, పెద్ద శబ్దంతో పక్షులన్నీ ఎగిరిపోయిన తరువాత చెట్టు నిశ్శబ్దంగా ఉన్నట్టు కశ్మీరు కూడా నిశ్శబ్దమైపోయిందట.

సుస్సలుడు రాజు అవటాన్ని కశ్మీరు ప్రజలు హర్షించారు. అతడికి స్వాగతం పలికారు. అయితే సుస్సలుడి మనస్సులో ఎవరు తనకి ఎప్పుడు ద్రోహం చేస్తారో, ఏ వైపు నుంచి మోసం ఏ రూపంలో అనుభవించాలో అన్న భయం ఉంది. దాంతో, అతడు తన సోదరుడికి అన్యాయం చేసిన వారిని, మోసం చేసి మట్టుపెట్టిన వారిని ఏరివేయటం ఆరంభించాడు. వెతికి వెతికి వారిని చంపించాడు. సుస్సలుడి ప్రతీకారాగ్ని ఎంత తీవ్రమైనదంటే, తన సోదరుడికి ద్రోహం చేసిన వారి సంతానాన్ని సైతం నాశనం చేశాడు. చిన్న పిల్లలను కూడా క్షమించలేదు. ప్రజలు నైతికంగా ఎంతగా దిగజారారో అర్థం చేసుకున్న సుస్సలుడు తన కాఠిన్యాన్ని ఏ మాత్రం తగ్గించలేదు. స్వతహాగా మృదు స్వభావం కల సుస్సలుడు, తాను మెత్తగా ఉంటే ప్రజలు లెక్క చేయరన్న భావనతో ఎంతో కఠినంగా వ్యవహరించాడు. కశ్మీరు సమాజానికి పద్ధతి ప్రకారం వ్యవహరించటం నేర్పాలని అలా కఠినంగా ఉన్నాడు.

సుస్సలుడు ప్రజలను, వారి మనస్తత్వాలను అర్థం చేసుకున్నాడు. ఎప్పుడు కాఠిన్యం ప్రదర్శించాలో, అప్పుడు రాజీ పడకుండా కఠినంగా ఉన్నాడు. ఎవరి పట్ల దయతో వ్యవహరించాలో, వారితో దయగా ఉన్నాడు. అంతేకాదు, ఇటీవలి కాలంలో ఏ కశ్మీరు రాజు ప్రదర్శించని దూరదృష్టిని ప్రదర్శించాడు. సుస్సలుడు కూడా సోదరుడు ఉచ్ఛలుడి లాంటి వాడే అయినా, ఉచ్ఛలుడి కోపం విషపు పిచ్చి కుక్క కాటు లాంటిదయితే, సుస్సలుడి కోపం తేనెటీగ కుట్టటం లాంటిది. సుస్సలుడు ఇతర విషయాలలో ఎలా ఉన్నా, ఎవరయినా అవమానకరంగా ప్రవర్తించినా, సభా మర్యాదను పాటించకపోయినా సహించేవాడు కాదు. రాజద్రోహం ఆలోచన ఉన్న వారితో ఎంత కఠినంగా వ్యవహరించేవాడో, ఇతరులందరితో అంతే దయతో ప్రవర్తించేవాడు. ఎవరికీ అనవసరంగా శిక్ష విధించేవాడు కాదు. రక్తపాతం అతనికి నచ్చేది కాదు. అందరితో మర్యాదగా మాట్లాడేవాడు. జాలి, దయ ప్రదర్శించేవాడు. అయితే సుస్సలుడికి సంపదలను ఆర్జించాలన్న ఆశ ఉండేది. కట్టడాలు నిర్మించటం రాజుకు ఇష్టం. గుర్రాలంటే ఇష్టం. దాంతో నిర్మాణ నిపుణులు, గుర్రాల వ్యాపారులు కశ్మీరులో ధనవంతులయ్యారు. ఎప్పుడయిన ప్రకృతి వైపరీత్యాలు సంభవించినప్పుడు ప్రజల బాధలను తగ్గించేందుకు నిజాయితీగా తపన పడేవాడు. పండుగలు వైభవంగా జరిపాడు సుస్సలుడు. ప్రజలకు విలువైన బహుమతులు పంచాడు.

సుస్సలుడు ఊహించినట్టే ‘గర్గ’ అతని మాట వినలేదు. ఉచ్ఛలుడి పిల్లవాడిని సుస్సలుడికి అప్పగించేందుకు ఇష్టపడలేదు. ఆ పిల్లవాడిని గర్గ నుంచి తప్పించి తెమ్మని సుస్సలుడు పంపిన సైన్యాన్ని గర్గ నలిపివేశాడు. గర్గ, అతని బంధువులు రాజ సైన్యాన్ని నాశనం చేసేందుకు సిద్ధంగా ఉన్నారు. ఇది గమనించిన సుస్సలుడు పెద్ద సైన్యంతో వారిపై దాడి చేశాడు. సంకుల సమరం జరిగింది. కశ్మీరు సైన్యంలోని పలువురు వీరులను గర్గ సంహరించాడు. కానీ సుస్సలుడు యుద్ధం కొనసాగించాడు. చివరికి ఒకరుకొకరుగా అందరూ గర్గని వదిలివెళ్లారు. గర్గ కశ్మీరు వదిలి పారిపోకుండా సుస్సలుడు గర్గను చుట్టుముట్టాడు. చివరికి ఓటమిని ఒప్పుకుని గర్గ రాజు కోరినట్టు ఉచ్ఛలుడి సంతానాన్ని సుస్సలుడికి అప్పగించాడు. గర్గ తరపున పోరాడిన వారెవరితో సుస్సలుడు దయతో వ్యవహరించలేదు కానీ గర్గను క్షమించటమే కాదు, అతడి మనస్సును గెలిచేందుకు గర్గపై వరాలు కురిపించాడు. కానీ సుస్సలుడికి వ్యతిరేకంగా పోరాడి ప్రాణాలు కాపాడుకున్నవారు సరైన సమయం కోసం ఎదురుచూస్తున్నారు.

ఓ రోజు రాజు సైన్యాన్ని పర్యవేక్షిస్తున్న సమయంలో శ్వాపకులయిన అభోగదేవుడు కత్తితో రాజుపై దాడి చేశాడు. వెనుక నుంచి గజ్జకుడు దాడి చేశాడు. అయితే రాజుకు ఇంకా ఆయుష్షు ఉండటంతో రాజు బ్రతికాడు. గొప్ప పోరు జరిగింది. అభోగదేవుడు, తిక్క వంటి వారిని సైనికులు సంహరించారు. కానీ తిక్క కొడుకు ప్రాణాలతో తప్పించుకున్నాడు. భవిష్యత్తులో రాజుపై విప్లవం లేవదీసి పక్కలో బల్లెమయ్యాడు. గర్గను రాజు పక్షపాతంతో చూడడం వీరి నిరసనకు కారణం.

ఈ సందర్భంగా కల్హణుడు సత్యం చెప్పే చక్కటి శ్లోకం రాశాడు. ఎవరికయితే భూమి మీద జీవించేందుకు సమయం బాకీ ఉందో, వాడిపై పిడుగు పడ్డా ప్రాణాలు పోవు. ఎవరి సమయం అయిపోయిందో, వాడు పువ్వు తాకిడికే ప్రాణాలు విడుస్తాడు.

తనకు వ్యతిరేకంగా జరిగిన కుట్ర సుస్సలుడిలో అభద్రతాభావాన్ని పెంచింది. దాంతో తనకు విధేయులై, కష్టకాలంలో అండగా నిలిచిన వారిని కూడా సుస్సలుడు దూరం చేసుకున్నాడు. వీరంతా దేశం వదిలివెళ్ళి సుస్సలుడి వ్యతిరేక కూటమిలో చేరిపోయారు. సహస్ర మంగళుడు కేంద్రంగా సుస్సల వ్యతిరేక కూటమి ఏర్పడింది. వీరంతా కలిసి భిక్షాచారుడిని కశ్మీరుకు అసలు రాజుగా ప్రకటించారు. భిక్షాచారుడు హర్షుడి మనుమడు. ఇతడిని ఉచ్చలుడు చంపాలని ప్రయత్నిస్తే, ప్రాణాలు తప్పించుకుని దక్కనులో తలదాచుకున్నాడు.  భిక్షాచారుడు రంగప్రవేశం చేయటంతో, సుస్సలుడి వ్యతిరేకులంతా అతడే కశ్మీర రాజ్యానికి అర్హుడు అని ప్రకటిస్తూ, భిక్షాచారుడి చుట్టూ చేరారు. ఈలోగా సహస్ర మంగళుడి కొడుకు ‘ప్రాశ’, తొందరపడి కశ్మీరంపై దాడి చేశాడు. బందీ అయ్యాడు.

తన వ్యతిరేకులు జరుపుతున్న చర్యలు సుస్సలుడికి ఆగ్రహం కలిగించాయి. రాజోద్యోగులందరినీ ఉద్యోగాల నుంచి తొలగించి వేరే వారిని ఆ స్థానాలలో నియమించాడు. ఇలా నియమించిన వారిలో కొందరు పిసినారులు, ధనంపై ఆశ కలవారు ఉండడంతో రాజు ఖజానా ఖాళీ అయింది. అధికారులలో అవినీతి విపరీతంగా పెరగటంతో ప్రజలు ఇబ్బందులు పడ్డారు. కానీ కనకుడి వంటి ఉత్తమ అధికారులు ప్రజల బాధను తగ్గించాలని ప్రయత్నించారు. కరువు సమయంలో ఉచితంగా ఆహారాన్ని అందించేవాడు కనకుడు. దాంతో ఇతర దేశాల వారు కూడా కశ్మీరం వచ్చేవారు ఆహారం కోసం.

రాజ్యంలో పరిస్థితి దిగజారటం గమనించిన సుస్సలుడు పరిస్థితిని మెరుగుపరిచే చర్యలు చేపట్టాడు. ఉచ్ఛలుడికి విధేయులుగా ఉన్నవారికి, ఉత్తములకు అధికారం ఇచ్చాడు. సరిహద్దుల వద్ద శక్తివంతమైన సైన్యాధికారులను ఉంచటం వల్ల శత్రువుల దాడులను అరికట్టాడు సుస్సలుడు. ఇలా రాజ్యాన్ని సురక్షితం చేసిన తరువాత సుస్సలుడు మందిరాలు కట్టించటం ప్రారంభించాడు.

అదేమి దురదృష్టమో, లేక ఏదైనా శాపమో తెలియదు కానీ కశ్మీరులో మళ్ళీ శాంతి సౌభాగ్యాలు నెలకొంటున్నాయని అనిపిస్తున్న తరుణంలోనే మళ్ళీ కశ్మీరు పరిస్థితి దిగజారింది. కశ్మీరులో ప్రజలు సుఖ శాంతులతో ఉండడం ఏ దేవతలకో ఇష్టం లేనట్టుంది.  లేక, ఏ రాక్షసుడో కశ్మీరుపై కన్నేసి, కశ్మీరులో శాంతి నెలకొనకుండా చూస్తున్నట్టున్నాడు.

రాజు గర్గను అత్యంత గౌరవించటం నచ్చనివారు ఒక పద్ధతి ప్రకారం రాజుకు గర్గపై చాడీలు చెప్పారు. గర్గ కొడుకు కళ్యాణ చంద్రుడు వీరుడు. అతడికి వ్యతిరేకంగా రాజుకు నూరిపోశారు. మరో వైపు వీళ్ళే గర్గ దగ్గరకు వెళ్ళి ‘రాజు నీకు వ్యతిరేకగా ఉన్నాడు. నిన్ను చంపించాలని చూస్తున్నాడు’ అని గర్గ మనసులో రాజు పట్ల విషబీజాలు నాటేరు. ఈ రకంగా దుష్టులు రాజు దగ్గర మాట్లాడిన మాటలకు వ్యతిరేకమయిన మాటలు గర్గ దగ్గర మాట్లాడి రాజుకూ, గర్గకు నడుమ చిచ్చు పెట్టారు.

ఓ రోజు గర్గ తన కొడుకుని వెంట తీసుకుని అమరేశ్వరానికి వెళ్లాడు. గర్గ విప్లవం లేవదీస్తాడన్న భయంతో రాజు గర్గ పైకి సైన్యాన్ని పంపాడు. తనకు అలవాటయిన రీతిలో గర్గ వీరోచితంగా పోరాడి, కశ్మీరు సైన్యాన్ని చెల్లా చెదురు చేశాడు. కశ్మీరు సైనికుల శవాలను దహనం చేసేటప్పుడు ఎగసిన నిప్పు ఆకాశాన్ని కప్పేసింది. ఇక గర్గను ఉపేక్షించకూడదని సుస్సలుడు పెద్ద సైన్యంతో గర్గపై దాడి చేశాడు.

(ఇంకా ఉంది)

Exit mobile version