కశ్మీర రాజతరంగిణి-78

2
2

[box type=’note’ fontsize=’16’] కశ్మీర్ ప్రాచీన చరిత్ర గురించి అవగాహన కలిగించి, భవిష్యత్తు గురించి ఆలోచనలు కలిగించాలన్న ప్రయత్నంలో భాగంగా నీలమతపురాణం తరువాత అందిస్తున్న జోనరాజు, శ్రీవరుడు, ప్రజ్ఞాభట్టులు కల్హణుడి అడుగుజాడల్లో నడుస్తూ సంస్కృతంలో రచించిన ‘కశ్మీర రాజతరంగిణి’ అనువాదాన్ని తెలుగు పాఠకులకు అందిస్తున్నారు కస్తూరి మురళీకృష్ణ. [/box]

ప్రతి ప్రత్యూషమాయాత్సు సర్వారంభే వైరిషు।
అద్య ధృవం జితో రాజౌత్యజ్ఞాయి ప్రతి వాసరమ్॥
(కల్హణ రాజతరంగిణి 8, 738)

[dropcap]సు[/dropcap]స్సలుడి వ్యతిరేకులు తిరుగుబాటు చేశారు. డామరుల సహాయంతో వారు వ్యతిరేక చర్యలు చేపట్టారు. ప్రజలను తమ వైపు ఆకర్షించటానికి హర్షుడి మనుమడు భిక్షుచారుడిని కశ్మీరం రప్పించారు.

ఈ విప్లవాలను, తిరుగుబాటులనూ – వాటిని అణచివేయడానికి సుస్సలుడు తీసుకున్న ప్రతిచర్యలను కల్హణుడు విపులంగా వర్ణిస్తాడు. యుద్ధాలలో గాయపడటం, శవాల గుట్టలతో దారులు నిండిపోవటం, అరాచకం అడ్డూ అదుపు లేకుండా అంతటా తాండవం చేయటం కల్హణుడు విపులంగా వర్ణించాడు. వీరుల పేర్లు, ఏ వీరుడు ఎంతగా పోరాడేడు, ఎంతవరకూ తిరుగుబాటుదార్లు చొచ్చుకువచ్చారు, ఎవరెంత మందిని చంపారు వంటి విషయాలను కల్హణుడు విపులంగా వర్ణిస్తూ రాశాడు. తిరుగుబాటుదార్లు రోజూ శ్రీనగరంపై దాడి చేయటం, ఇవాళ్ళో, రేపో రాజ్యం సుస్సలుడి చేజారిపోతుందని ప్రజలు అనుకోవటం జరుగుతూ వస్తోంది. ప్రతి ఉదయం ఇదే ఆఖరి రోజు సుస్సలుడిది అని ప్రజలు అనుకోసాగారు.

కల్హణుడు చేసిన యుద్ధ వర్ణనలు, యుద్ధం వల్ల కకావికలవుతున్న సామాన్య ప్రజలు, కూలి బూడిదవుతున్న నగరాలు, ధ్వంసమవుతున్న దారుల వంటి వివరాలు చదువుతుంటే, ఇప్పుడు మన కళ్ళ ఎదురుగా జరుగుతున్న యుక్రెయిన్, రష్యా యుద్ధం గుర్తుకు వస్తుంది. ఇప్పుడు మన కళ్ళ ఎదురుగా జరుగుతున్నట్టే, సుస్సలుడు, ప్రజలందరి చేతికీ ఆయుధాలిచ్చి తిరుగుబాటుదార్లను తరిమివేసేందుకు సిద్ధం కమ్మంటాడు. ఇప్పుడు జరుగుతున్నట్లే శ్రీనగరంలో కొందరు సుస్సలుడి వైపు ఉన్నట్టే నటిస్తూ తిరుగుబాటు సేనలకు సమాచారం అందిస్తూంటారు. వ్యక్తుల అహాలు, అధికార దాహాలు ఏ రకంగా ప్రజల జీవితాలతో ఆటలాడుకుంటూ ప్రశాంత జీవనాన్ని ధ్వంసం చేస్తాయో తెలుస్తుంది. అప్పుడే కాదు, ఇప్పుడూ ఇదే పద్ధతి కొనసాగటం – విధానం మారింది తప్ప, ఇంకేమీ మారలేదు అనిపిస్తుంది. అప్పుడు కత్తులతో, బాణాలతో, బల్లేలతో, నిప్పు కర్రలతో, రాళ్ళ బండలతో దాడులు చేసుకుని వినాశనం కలిగిస్తే, ఇప్పుడు గైడెడ్ మిస్సైళ్లు, డ్రోన్లు, క్షిపణులతో మారణహోమం సాగిస్తున్నారు. అంతే తప్ప మనిషి ఏమీ మారలేదు. నాగరికత అభివృద్ధి చెందటం అంటే, తక్కువ సమయంలో ఎక్కువ నాశనం చేయగలిగే శక్తి సంపాదించగలగటం అని నిర్వచించుకోవాల్సి ఉంటుంది.

సుస్సలుడు సంధికని పిలిచి తిరుగుబాటు నాయకులు కొందరిని మాయోపాయంతో చంపించాడు. దాంతో ప్రజలు సుస్సలుడిని చీదరించుకున్నారు. ప్రజలంతా సుస్సలుడికి శత్రువులయ్యారు. సుస్సలుడు పిచ్చెక్కిన వాడిలా, కనబడిన వారందరినీ ‘ఇప్పుడేం చేయాలి’ అని అడగటం ప్రారంభించాడు. సుస్సులుడిని ద్వేషిస్తూ ప్రజలు భిక్షుచారుడిని ప్రశంసించటం ప్రారంభించారు.

ఇది ఇప్పటి ప్రపంచంలో కూడా చూడవచ్చు. ఒక వ్యక్తికి ప్రజలు బ్రహ్మరథం పట్టి నాయకుడిగా ఎంచుకుంటారు. అతను తమని ఉద్ధరిస్తాడని ఆశిస్తారు. కొన్నాళ్ళకి భ్రమలు తొలగుతాయి. అప్పుడు, ఎవరికయితే బ్రహ్మరథం పట్టి అధికారం అప్పజెప్పారో, అతడినే శాపనార్థాలు పెడుతూ దూషిస్తారు. ఆశలు కల్పించిన ఇంకొకడికి తమ అదృష్టం మారుస్తాడన్న ఆశతో నీరాజనాలిస్తారు. కానీ అధికారం వచ్చాకా మళ్ళీ అసంతృప్తి మొదలవుతుంది. ఇది చక్రనేమి క్రమమే అప్పుడయినా, ఇప్పుడయినా. అందుకే అంటాడో తత్త్వవేత్త ‘మనిషి అసంతృప్తిలో పుట్టి అసంతృప్తిలో బ్రతికి, అసంతృప్తిలో మరణిస్తాడు. జీవితాంతం సంతృప్తి కోసం అన్వేషిస్తాడు. కానీ మరణించాకే సంతృప్తి అంటే ఏమిటో తెలుసుకుంటాడు’ అని. ఇది మనిషి కయినా, మానవ సమూహానికైనా వర్తిస్తుంది.

ఒకరొకరుగా సుస్సలుడి అనుచరులు, అధికారులు సుస్సలుడిని వదిలి భిక్షుచారుడిని చేరేవారు. చినుకులా మొదలయి, వర్షమై, తుఫానయి ముంచెత్తినట్టు సుస్సులుడిని వదిలి వెళ్ళే వాళ్ల సంఖ్య క్షణక్షణానికి పెరిగిపోయింది. క్షణక్షణానికి డామరులు, భిక్షాచారుడు ముందుకు దూసుకువస్తున్నారు. రాజును చూసి ప్రజలు ‘అయ్యో’ అనే బదులు ‘తగిన శాస్తి జరిగింది’ అనుకోసాగారు.

శ్రీనగరంలోకి ఉధృతంగా వచ్చి పడుతున్న బాణాలు – సామన్యులు, పిల్లలు, ఆడవాళ్ళు అని చూడకుండా – తమ దారికి అడ్దు వచ్చిన వారందరినీ పరలోకం పంపించసాగాయి. రాజు తన భవనం వదిలి బయటకు రాలేకపోతున్నాడు.

ఈ సమయంలో కశ్మీరంలో బ్రాహ్మణులు నిరాహార దీక్ష ప్రారంభించారు. ‘పరిస్థితులు ఇలాగే కొనసాగితే ప్రజల బ్రతుకులు దుర్భరమయిపోతాయి. పంటలు పండించే వారుండరు. పండిన పంటలను కోసేవారుండరు. పండిన పంటను శత్రువులు కోసుకుపోతారు. కశ్మీర ప్రజలు ఏం తింటారు?’ అని వాదిస్తూ బ్రాహ్మణులు నిరసన దీక్ష చేపట్టారు.

బ్రాహ్మణులను శాంతింప చేయటం కోసం సుస్సలుడు చేపట్టిన చర్యలు కశ్మీరాన్ని మరింత అశాంతిలోకి నెట్టాయి. ప్రజలు వీధుల్లోకి వచ్చి అందినవి అందినట్టు దోచుకోవటం ఆరంభించారు. రాజ్య నిర్వహణలో ఎలాంటి అనుభవం లేని బ్రాహ్మణాధికారులు, రాజు ఎంతగా వారిని శాంతింప చేయాలని ప్రయత్నిస్తే అంతగా మొండికేసి, అల్లకల్లోలానికి కారణమయ్యారు. వీరు రాజు శత్రువులుగా భావించే వారి కన్నా ఘోరంగా ప్రవర్తించి, మిత్రుల కన్నా శత్రువులే మేలు అనిపించారు. కాలి నొప్పి కన్నా మెడ నొప్పి మరింత బాధాకరం కదా!

రాజు నిస్సహాయుడవటంతో కశ్మీరంలో ప్రభుత్వం అన్నది లోపించింది. ప్రజలకు రక్షణ అన్నది లేకుండా పోయింది. డామరులు రాజ్యంలో ప్రవేశించి కొల్లగొట్టటం మొదలు పెట్టారు. ప్రజలు తమ ఇళ్ళూ వాకిళ్ళూ వదిలి ప్రాణాలు అరచేత పట్టుకుని కనబడిన దిశలో పరుగెత్తారు.

‘సుస్సలుడు పోయి భిక్షుచారుడు అధికారానికి వస్తే మన సమస్యలు పరిష్కారమవుతాయి’ అని ప్రజలు బహిరంగంగానే అనసాగారు. ఇక్కడ కల్హణుడు ఈనాటి పరిస్థితిని దృష్టిలో పెట్టుకుని వ్యాఖ్యానించినట్టే వ్యాఖ్యానిస్తాడు.

ప్రజలు అమాయకులు. వారు ఎవరు ఆశ కల్పిస్తే వారిని గుడ్డిగా నమ్ముతారు. వాడెవడో, ఎలాంటివాడో కూడా తెలుసుకోకుండా గుడ్డిగా నమ్మి మోసపోతారు. సామాన్యులు ఎవరెటు తీసుకుపోతే అటు పోతారు. ఎవరేం చెప్తే దాన్ని నమ్ముతారు. అనుసరిస్తారు. ఆకాశంలో చంద్రుడు కనబడగానే వెన్నెల కురిపిస్తాడని ఆశిస్తారు. కానీ చంద్రుడిని మేఘం కప్పేస్తుందన్న ఆలోచన రాదు.

రాజుకి ఎవరిని నమ్మాలో, ఎవరిని నమ్మవద్దో తెలియటం లేదు. కనపడ్డ ప్రతీవారికీ, ధనం, విలువైన ఆభరాణాలు ఇచ్చి వారి విధేయతను సంపాదించాలనుకున్నాడు సుస్సలుడు. కానీ సుస్సలుడు ఇచ్చిన ధనం తీసుకున్న వారు ‘సుస్సలుడి పని అయిపోయింది’ అంటూండటంతో సుస్సులుడు  అందరూ వదిలేసిన తరువాత చావుకు ఎదురుచూసే రోగిలా బాధపడ్డాడు.

ఇది విధి వైచిత్రి. ఒకప్పుడు గొప్ప వీరుడిలా, సింహాలా తిరిగిన సుస్సలుడు ఇప్పుడు ఆత్మవిశ్వాసం లేక భయంతో వణుకుతూ పిల్లి కన్నా ఘోరంగా ఉన్నాడు. ఇదే సమయానికి డామరులు నడుమ అనైక్యత ఏర్పడి వాళ్ళు వెనక్కి మళ్ళాలని అనుకున్నారు. అదే సమయానికి రాజు సైన్యం తమకు జీతాలివ్వాలని నిరసన దీక్ష ప్రారంభించాయి. వారికి రాజు ఎంత ధనం ఇచ్చినా ‘ఇంకా మాకు డబ్బులు రావాలి’ అని నిరసన ప్రారంభించారు. వారు రాజును చుట్టుముట్టి కదలనీకుండా చేసి మరీ, ‘ఇంకా, ఇంకా’ అంటూ ధనం వసూలు చేసుకున్నారు. ‘ఎలాగో రాజు కాలం అయిపోయింది. అందినంత సాధిద్దాం’ అన్నట్టు ప్రవర్తించారు.

ఇది కూడా మనం ఇప్పటి సమాజంలోనూ చూడవచ్చు. అధికారం కోల్పోతామన్న భయంతో నాయకులు వరాల జల్లు కురిపిస్తారు. అయినా నిరసనలు చేస్తూ ‘ఇంకా, ఇంకా’ అంటూ డిమాండ్లు చేస్తూనే ఉంటారు. ఒక కోరిక తీరుస్తే ఇంకో కోరిక కోరుతారు. అధికారిని వంచి అవమానించినా వారికి సంతృప్తి కలగదు. అధికారి బలహీనుడయితే అంతే మరి!

ఒకరోజు సుస్సలుడు ఇక రాజ్యం చేయలేనన్న నిశ్చయానికి వచ్చాడు. రాజ్యం వదిలి పారిపోవాలనుకున్నాడు. కాపలాగా ఉన్నవారి కన్నుగప్పి పారిపోవాలనుకున్నాడు. పారిపోయేందుకు రాజు గుర్రం ఎక్కగానే సైనికులు లూటీ ప్రారంభించారు. కొందరు మాత్రం రాజును అనుసరించారు. కానీ ఒకరొకరుగా రాజును వదిలిపోయారు సైనికులు. రాత్రి రాజు ప్రతాపపురం చేరేసరికి గుప్పెడు మంది సైనికులే మిగిలారు రాజు వెంట.  రాజుకు ఆశ్రయమిచ్చిన వారు కూడా రాజును భయపెట్టి, తమ ఇల్లు వదిలి వెళ్ళేలా చేశారు. రాజు పూర్తిగా ఇల్లు దాటకముందే డామరుల వైపు మళ్ళిపోయారు.

సుస్సలుడు వెళ్తున్న దారిలో పరశురామ ప్రీతి అవుతున్న నగరాలను, గ్రామాలను చూస్తూ సిగ్గుతో తల వంచుకున్నాడు. భార్య వైపు కూడా కళ్లెత్తి చూడలేకపోయాడు. అందరూ వదిలివెళ్ళినా, తన వెన్నంటి ఉన్న సైనికులకు తన దగ్గర ఉన్న ధనమంతా పంచిపెట్టాడు.

రాజు శ్రీనగరం వదిలి పారిపోగానే నగర అధికారి ‘జనక సింహుడు’ మిగతా అధికారులనందరినీ సమావేశ పరిచాడు. వారికి నాయకుడయ్యాడు. భిక్షుచారుడి మద్దతుదార్లతో మంతనాలు ప్రారంభించాడు. ప్రజలంతా ప్రాణాలు అరచేత పెట్టుకుని బిక్కు బిక్కుమంటూ, రాజు లేని రోజులు గడిపారు. రాజు లేని శ్రీనగరంలో శత్రువులు అకాండతాండవం చేశారు. బలహీనుల్ని చంపేశారు. అందినవి అందినట్టు దోచుకున్నారు. ఇళ్ళను తగులబెట్టారు.

తెల్లారే సైనికులు చుట్టూ ఉండగా, భిక్షుచారుడు వైభవంగా శ్రీనగరంలోకి ప్రవేశించాడు. అది క్రీ.శ. 1121వ సంవత్సరం. భిక్షుచారుడి వెనకే, పసిపిల్లవాడిని సంరక్షిస్తున్నట్లు, అతడికి మద్దతుగా పోరాడిన మల్లకోస్తకుడు ప్రవేశించాడు. అతడే అందరికీ సూచలలిస్తూ, తానే రాజన్నట్టు ప్రవర్తించాడు. ఇతరుల శక్తి ఆధారంగా అధికారం సంపాదించినవాడు పేరుకే అధికారి. ఎందుకంటే అధికారం సాధించేందుకు దోహదపడిన వారంతా తమకు కావల్సింది సాధించుకుంటారు. కాదంటే తమ శక్తి చూపించి అధికారిని బెదిరిస్తారు.

అధికారానికి వస్తూనే భిక్షుచారుడు వివాహం చేసుకున్నాడు. సుస్సలుడు పంచేయగా మిగిలిన ధనంతో సౌఖ్యాలు అనుభవించటం ప్రారంభించాడు. సుస్సలుడు వదలగా మిగిలిన ఆస్తులను – చంపిన జంతు శవాన్ని సింహాలు పీక్కుతిన్నట్టు – భిక్షుచారుడు, డామరులు, ఇతర అధికారులు పంచుకున్నారు. అడవుల్లో బ్రతికే డామరులు శ్రీనగరం వచ్చి   స్వర్గంలో సౌఖ్యాలు అనుభవిస్తున్నట్లు కేరింతలు కొట్టారు.

భిక్షుచారుడికి రాజ్యపాలనలో అనుభవం లేదు. డామరులు భిక్షుచారుడు ‘దేవుడి అవతారం’ అని ప్రచారం చేశారు. కానీ భిక్షుచారుడు మందు ప్రభావం తెలియని వైద్యుడి లాంటి వాడు. రాజు ప్రాపకం పొందేందుకు పలువురు రాజుకు తమ కుమార్తెలను సమర్పించారు. రాజుకు  పాలన తెలియదని గ్రహించిన మంత్రి ‘బింబుడు’ రాజు పేరు మీద తానే పాలన నెరపసాగాడు.

బింబుడు నృత్యగత్తెలకు, వేశ్యలకు బానిస అయినా, నిజాయితీపరులు, మోసగాళ్ళను గుర్తు పట్ట గల శక్తి కలవాడు. కానీ రాజు చుట్టూ, తేనె చుట్టూ చేరే ఈగల్లాంటి మోసగాళ్లను చేరకుండా ఆపలేకపోయాడు.

ముగ్దే రాజ్య ప్రమత్తేషు మంత్రి షూగేషు దస్యుషు।
ఉత్థానో పహతం రాజ్యం నవత్వేపి బభూత తత॥
(కల్హణ రాజతరంగిణి 8, 866)

రాజు అమాయకుడు/మూర్ఖుడు అయితే, మంత్రులు దుష్టులయితే, అహంకారంతో అందరినీ దోచుకునే డామరులు వీరికి తోడయితే, రాజ్యం ఆరంభంలోనే అంతమయేందుకు సిద్ధంగా ఉంటుంది.

కొత్త రాజు భిక్షుచారుడు రాజ్యాధికారం వల్ల లభిస్తున్న సౌఖ్యాలతో మైమరిచిపోయాడు. పిచ్చివాడయి పోయాడు. రాజ్యకార్యాలు వదిలేసి రోజూ ఓ అమ్మాయిని పొందడం, కడుపునిండా వింత వింత ఆహారాలు భక్షించటంతో కాలం గడపటం ఆరంభించాడు.

రాత్రంతా ఆనందించటం వల్ల రాజు రోజంతా నిద్ర మత్తులో జోగుతుండేవాడు. బాగా తాగి మత్తులో ఉండేవాడు. దాంతో రాచకార్యాలు నిర్వహణకు రాజు పనికివచ్చేవాడు కాదు. ఎవరయినా తనతో అవమానకరంగా భావిస్తే, కోపగించే బదులు, వాడిని తన తండ్రిలా భావించి ఆదరించేవాడు. రాజు చుట్టూ అనాగరికులు, ఇతరులు వదిలిన ఆహారాన్ని సేవించేవారు చేరారు. వారంతా రాజుతో తమ స్థాయికి తగ్గ పనులు చేయించేవారు. రాజు మాట నీటి మీద రాత లాంటిదవటం, అతడికి అధికారం లేకపోవడంతో, రాజు చుట్టూ చేరిన వారందరికీ ఆశించిన పదవులు దక్కలేదు. చివరికి రాజు ఎలాంటి వాడు అయ్యాడంటే – మంత్రులు ఏమంటే, దాన్ని చిలుక పలుకుల్లా వల్లె వేసేవాడు. స్వంత మాట ఒక్కటీ మాట్లాడేవాడు కాదు. రాజును ప్రతీ మంత్రీ తన ఇంటికి ఆహ్వానించి పంచభక్ష్య పరమన్నాలు పెట్టి, ఆయన దగ్గర విలువైన బహుమతులు కాజేసేవారు.

బింబ భార్య రాజుకు భోజనం వడ్దించే నెపం మీద సౌందర్య ప్రదర్శన చేసి రాజును పిచ్చివాడిని చేసి నియంత్రణ కోల్పోగొట్టేది. ఎవరి నడుమ నయినా భేదాభిప్రాయాలుంటే రాజు, వారిని వివాహబంధంలో ఇరికించాలని ప్రయత్నించేవాడు. అయితే, తన సేవకులు ఏమి చెప్తే అది చేసే రాజు పట్ల త్వరలోనే నిరసన మొదలయింది. సరైన రాజు లేకపోవటంతో ప్రతి ఒక్కడూ తానే రాజయినట్లు ప్రవర్తించి ప్రజలను ఇబ్బందుల పాలుచేశారు. డామరులు కనబడిన యువతిపై అత్యాచారం చేసేవారు. కశ్మీరు ఒక్క రాజు లేని, పలువురు రాజులున్న రాజ్యంలా అల్లకల్లోలమైంది. అరాచకం పాలయింది.

సుస్సలుడు, ఇంకా బ్రతికి ఉండడంతో, ఎప్పుడయినా అతడి నుంచి ప్రమాదం ఉందని భిక్షుచారుడు సుస్సలుడి పైకి సైన్యం పంపించాడు. సహాయం కోసం భిక్షుచారుడు సల్లార విస్మయుడి ఆధీనంలో ఉన్న తురుష్క సైనికులనూ తన సైన్యంలో భాగం చేసుకున్నాడు.

‘సల్లార విస్మయుడె’వరు? అతని క్రింద తురుష్క సైన్యం ఎందుకుంది? అన్న ప్రశ్న చరిత్రకారులను వేధించింది. చివరికి ‘సల్లార’ అన్న పదం పర్షియన్ పదం ‘సాలార్’ అనీ, ‘సాలార్’ అంటే సైన్యాధికారి అనీ తీర్మానించారు. ‘విస్మయ’ అన్నది ‘ఇస్మాయిల్’ అని అర్థం చేసుకున్నారు. అంటే భిక్షుచారుడు, తురుష్కులను ఆశ్రయించాడన్న మాట, సుస్సలుడిని అంతమొందించేందుకు. ఆ తురుష్క సైన్యాధికారి ‘సాలార్’ ఇస్మాయిల్! భారతీయులకు ఇదొక శాపం లాంటిది. పిట్టల నడుమ పోరు తీర్చేందుకు పిల్లిని పిలిస్తే, ఆ పిల్లి రెండు పిట్టలను తినేసిందట. కశ్మీరు ఇస్లాంమయం అయ్యేందుకు నీరు పోసినవాడు భిక్షుచారుడు. నారు పోసింది అతని తాత తురుష్క హర్షుడు.

(ఇంకా ఉంది)

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here