కశ్మీర రాజతరంగిణి-79

0
2

[box type=’note’ fontsize=’16’] కశ్మీర్ ప్రాచీన చరిత్ర గురించి అవగాహన కలిగించి, భవిష్యత్తు గురించి ఆలోచనలు కలిగించాలన్న ప్రయత్నంలో భాగంగా నీలమతపురాణం తరువాత అందిస్తున్న జోనరాజు, శ్రీవరుడు, ప్రజ్ఞాభట్టులు కల్హణుడి అడుగుజాడల్లో నడుస్తూ సంస్కృతంలో రచించిన ‘కశ్మీర రాజతరంగిణి’ అనువాదాన్ని తెలుగు పాఠకులకు అందిస్తున్నారు కస్తూరి మురళీకృష్ణ. [/box]

ప్రత్యక్ష దర్శినోద్యాపి సాశ్చర్యా వయమస్య యత్।
తాః ప్రజాః కోపితాః కేన కేన భూయః ప్రసాదితాః॥
(కల్హణ రాజతరంగిణి 8, 895)

[dropcap]రా[/dropcap]జతరంగిణి రచనలో కల్హణుడి ఉద్దేశం స్పష్టంగా భావి తరాలకు తమ ప్రాచీనుల ఔన్నత్యం తెలపటంతో పాటు, వారు చేసిన పొరపాట్లను దృష్టికి తేవటం. అందుకని తాను చెప్తున్న విషయాలకు అనుగుణంగా పలు వ్యాఖ్యానాలు చేస్తుంటాడు కల్హణుడు. భిక్షుచారుడు, సుస్సలుల పాలనాకాలాన్ని కల్హణుడు ప్రత్యక్షంగా అనుభవించాడు. కశ్మీరు రాజు తురుష్క సేనల సహాయం అభ్యర్థించటం, ఆ తురుష్కులు కశ్మీరుకు వచ్చి డామరులతో కలిసి యుద్ధానికి వెళ్ళటం, ఆ తరువాత కశ్మీరులో జరిగిన సంఘటనలకు కల్హణుడు ప్రత్యక్ష సాక్షి. అయినా సరే, రాజతరంగిణి రాయటం కోసం ఆయన ఎంతోమందిని ఇంటర్వ్యూ చేసి ఉంటాడు. సంఘటనలలో పాల్గొన్న వారినీ, ప్రత్యక్ష సాక్షులను ప్రశ్నించి తాను చూడలేని విషయాలను తెలుసుకుని ఉంటాడు. అన్నిటినీ క్రోడీకరించి రాజతరంగిణి రచించాడు. అందుకే. ‘ఎవరయితే ఈ సంఘటలకు ప్రత్యక్ష సాక్షులో’ అంటూ ఆరంభిస్తాడు కల్హణుడు.

తురుష్కులు, డామరులు “మేము సుస్సలుడిని తాళ్ళతో కట్టి బంధించి తెస్తాం” అని ప్రగల్భాలు పలుకుతూ సుస్సలుడిపై యుద్ధానికి వెళ్ళారు. వాళ్ళు తప్పకుండా విజయం సాధిస్తారని ప్రజలు నమ్మారు.

‘బింబుడు’ యుద్ధానికి వెళ్ళినప్పటి నుంచీ భిక్షుచారుడి ప్రవర్తన మరింతగా దిగజారింది. రోజూ బింబుడి భార్యతో కులకడం, ఇతరులతో కలిసి విందులు వినోదాలలో పాల్గొనడం అతని దినచర్యగా మారింది. రాజ్య వ్యవహారాలు పట్టించుకోలేదు. దాంతో ప్రజలు, గతంలో తాము ఎవరినైతే నిందించి, అవమానించి, అత్యంత నీచంగా రాజ్యం నుంచి తరిమికొట్టారో, ఇప్పుడు ఆ సుస్సలుడి కోసం పరితపించసాగారు. సుస్సులుడు రాజుగా ఉన్నప్పుదు పరిస్థితులు ఎంత బాగుండేవోనని చర్చిస్తూ, సుస్సలుడిని పొగడసాగారు. ‘సుస్సలుడు ఎప్పుడు వస్తాడో’ అని దారి వైపు చూడసాగారు. ఈ సందర్భంలో పై శ్లోకం రాశాడు కల్హణుడు.

ప్రత్యక్ష సాక్షులు ఇప్పటికీ ఈ సంఘటనలను తలచుకుని ఆశ్చర్యపోతారట. ఎందుకని ప్రజలు సుస్సలుడిని ద్వేషించారో, ఎందుకని ఇప్పుడు అతడిని ఆహ్వానిస్తున్నారో అర్థం కాని అయోమయంలో ఇరుక్కున్నారట ప్రత్యక్ష సాక్షులు.

ఇది అప్పుడే కాదు, ఇప్పటికీ మనకు అనుభవమే. గతంలోనూ పలుమార్లు అనుభవించాం కూడా. అయిదేళ్ళ కొకసారి జరిగే ఎన్నికల్లో ఒక నాయకుడి పనితీరుతో అసంతృప్తి చెందిన ప్రజలు మరో నాయకుడికి అధికారం అప్పజెప్తారు. అయిదేళ్ళ తరువాత గతంలో ఎవరినయితే తిరస్కరించారో వాడికే మళ్ళీ పట్టం గడతారు. ఇది ఆశ్చర్యంగా ఉంటుంది. ఈ అయిదేళ్ళలో నాయకుడిలో కానీ, అతడి అవినీతి ఆలోచనల్లో ఎలాంటి మార్పు రాదు. మళ్ళీ పదవికి వచ్చిన తరువాత అతను గతంలో ప్రవర్తించినట్టే ప్రవర్తిస్తాడు. మార్పు వచ్చింది ప్రజల ఆలోచనల్లోనే. పెద్ద గీత ముందు చిన్న గీతలాగా, ఒకడిని మించిన వాడొకడు. దాంతో ప్రస్తుతం వాడి కన్నా ముందు వాడే నయం అనుకుంటారు. అయిదేళ్ళ తరువాత మళ్ళీ వీడి కన్న వాడే నయం అనుకుంటారు. ఇప్పుడు ప్రజాస్వామ్యంలో మనం చూస్తున్నటువంటి ప్రవర్తననే, ప్రజాస్వామ్యం లేని ఆ కాలంలోనే కశ్మీరీ ప్రజలు ప్రదర్శించారు. సుస్సలుడిని తరిమికొట్టారు, భిక్షుచారుడిని ఆహ్వానించారు. ఇప్పుడు భిక్షుచారుడి కన్నా సుస్సలుడే నయమని సుస్సలుడి రాక కోసం ఎదురుచూస్తున్నారు. ఇలాంటి ప్రవర్తన యుగధర్మమేమో అనిపిస్తుంది! ప్రాచీన కశ్మీరును పరిశీలిస్తే ప్రజలలో కాని రాజుల్లో కాని ఇలాంటి ప్రవర్తన కనిపించదు. రాజు దుష్టుడయితే ప్రజలు తిరగబడ్డారు. మరొకడిని వెతికి రాజును చేశారు. అంతేకాని ఇలా చెడ్డవాళ్ళలో పెద్ద గీత, చిన్న గీత అన్నట్టు ఆలోచించలేదు. అయితే అప్పటి రాజులు వేరు, ఇప్పుడు కశ్మీరంలో అధికారం కోసం ఆరాటపడేవారు వేరు. ఇలాంటి కశ్మిరీ ప్రజల అర్థం పర్థం లేని, తార్కికబద్ధం కాని ప్రవర్తను చూసి కల్హణుడు, కశ్మీరీ ప్రజలు జంతువుల్లా తర్కరహితంగా ప్రవర్తించారు అని వ్యాఖ్యానించాడు.

ఇంతలో కశ్మీరు రాజకీయాలలో అనుక్షణం తలదూరుస్తూ, తమ శక్తిని ప్రదర్శిస్తూ వస్తున్న బ్రాహ్మణులు భిక్షుచారుడిని వ్యతిరేకిస్తూ నిరసన వ్రతం ఆరంభించారు. రాజకీయాలతో సంబంధం ఉన్న వారి ప్రేరణతో మందిరాలలో పురోహితులు కూడా నిరసన ప్రారంభించారు. కశ్మీరులో అడుగడుగునా రాజుకు వ్యతిరేకంగా నిరసనలు వెల్లువయ్యాయి. ఇప్పటిలాగా కశ్మీరులో పురోహితులంతా తమ బలప్రదర్శనగా, ఐకమత్య ప్రదర్శనగా ఓ పెద్ద బ్రహ్మాండమయిన బహిరంగ సభను నిర్వహించారు. దేవతల విగ్రహాలను అలంకరించి, పల్లకిలో ఊరేగిస్తూ, మేళ తాళాలతో తమ నిరసన స్థలానికి తీసుకువచ్చారు. ఈ రకంగా కశ్మీరు రాజకీయాల్లో మరోసారి బ్రాహ్మణ సమూహం తమ వంతు పాత్రను పోషించారు.

కశ్మీరులో పదే పదే జరుగుతున్న ప్రజల నిరసనలు, రాజకీయాలను నిర్దేశించే ప్రజల సామూహిక శక్తిని చూస్తుంటే, ‘రాచరికం’ అన్నది అమలులో ఉన్నా, ఏదో ఒక రూపంలో ప్రజలు తమ రాజుగా ఎవరు ఉండాలో తామే నిర్దేశిస్తూ వచ్చారని అర్థమవుతుంది. అందుకే విదేశాలలో జరిగినట్టు విప్లవాల అవసరం మన దేశంలో పడలేదు. తలలు నరకడాలు, అధికారులను వేటాడి చంపటాలు మన దేశంలో జరగలేదు. గిలటిన్ల ప్రసక్తే లేదు. రాజు నచ్చకపోతే ప్రజలు నిరసనలు తెలిపారు. రాజును కాళ్ళ బేరానికి తెచ్చారు. దీనిలో బ్రాహ్మణుల నిరసన అన్ని నిరసనల కన్నా శక్తివంతమైనది. వారి నిరసన సమంజసమైనదా, స్వార్థపూరితమైనదా, కుట్రలకాలవాలమా అన్న సంగతి పక్కనపెడితే, వారి నిరసన రాజులను కదిలించింది, వారి నిర్ణయాలను మార్చింది అన్నది సంఘటిత ప్రజాశక్తికి నిదర్శనంగా నిలుస్తుంది. రాచరికమైనా, విదేశాలలోలాగా కాకుండా, ప్రజాభిప్రాయానికి మన దేశంలో అధికంగా విలువ ఉండేదని తెలుస్తుంది. అందుకే రాచరిక వ్యవస్థ పతనమై విదేశీ పాలన వచ్చినప్పుడు ప్రజలు స్వచ్ఛందంగా విప్లవ బావుటాలు ఎగురవేశారు. చరిత్రకారులు ఎంతగా 1857 ప్రథమ స్వాతంత్ర ప్రోరాటాన్ని ‘సిపాయిల తిరుగుబాటు’గా కొట్టివేయాలని ప్రయత్నించినా, రాజుల పట్ల, రాచరిక కుటుంబాల దుర్దశ పట్ల ప్రజలలో ప్రదర్శితమైన సానుభూతి కూడా ఆ విప్లవం అంతకాలం కొనసాగటానికి కారణం అన్న విషయం కాదనలేని సత్యం. అందుకే విదేశాలతో పోలిస్తే రాచరికం పట్ల భారతదేశంలో అంత ఏహ్యభావన, నిరసనలు కనబడవు. కానీ విదేశీ అనుభవాల ఆధారంగా భారతదేశ చరిత్రను రచించి, విదేశీ సమాజానికి భారతీయ సమాజాన్ని అనుబంధంగా భావించి, అందుకు అనుగుణంగా చరిత్రను సృజించి నమ్మించాలన్న విదేశీయుల పద్ధతి వల్ల మనది కాని మన చరిత్ర మనదయింది. మనది కాని మన స్వభావం మనది అయింది. ఇందుకు రాజతరంగిణి గొప్ప నిదర్శనం!

బ్రాహ్మణుల నిరసనను అరికట్టాలని రాజు ఎన్ని ప్రయత్నాలు చేసినా ఫలితం కనబడలేదు. సుస్సలుడు రాజయితే తప్ప తమ నిరసన ఆగదని వారు స్పష్టం చేశారు. బ్రాహ్మణుల నిరసన చూడడానికి కశ్మీర ప్రజలు తండోపతండాలుగా వచ్చేవారు. వారందరికీ రాజు దౌష్ట్యం వివరిస్తూ, సుస్సలుడి గొప్పతనం చెప్తూ, సుస్సలుడు రాజు అయితే కశ్మీరు స్వర్గంలా మారటాన్ని చిలువలు పలువలుగా చెప్పారు బ్రాహ్మణులు. వీరిని అణచివేయటానికి రాజు బలప్రయోగం చేయబోతే బ్రాహ్మణులు యుద్ధానికి సిద్ధమయ్యారు. అంటే, ఓ రకంగా బ్రాహ్మణ సమాజం ఆ కాలంలో ‘సామాజిక మనస్సాక్షి’గా వ్యవహరించిందన్న మాట. ఇప్పటి ‘మీడియా’ చేస్తున్న పనిని వారు నిర్వహించారన్న మాట. తమ అభిప్రాయాలను ప్రజల మనసులలో ప్రవేశపెట్టి, తమపై ప్రజలకు ఉన్న గౌరవాన్ని, నమ్మకాన్ని ఉపయోగించుకుంటూ సమాజంలో ‘మార్పు’ కోసం ప్రయత్నించారన్న మాట. అయితే, ఇప్పటి మీడియా లాగే అప్పటి బ్రాహ్మణ్ సమాజానికి కూడా సమాజం కన్నా రాజకీయాలపైనే దృష్టి అధికం.

భిక్షుచారుడు తనను వ్యతిరేకించే వారందరినీ బంధించాలని ప్రయత్నించాడు. ఇది పసిగట్టి వారంతా సుస్సలుడి దగ్గరకు పారిపోయారు. అతడిని ఆశ్రయించారు. ఇప్పుడు పార్టీలు మారినట్టన్న మాట!

చివరికి ‘పర్ణోత్స’ వద్ద సంకుల సమరం సాగింది కశ్మీరు సింహాసనం కోసం. సుస్సలుడు పర్ణోత్స యుద్ధంలో అత్యంత శౌర్యం ప్రదర్శించాడు. అతడు ప్రదర్శించిన వీరత్వంతో అంతవరకూ సుస్సలుడిపై ఉన్న చులకన అభిప్రాయం చెదిరిపోయింది. తురుష్కులను తరిమికొట్టాడు సుస్సలుడు. కశ్మీర సైన్యం ఒక రాజుకు వ్యతిరేకంగా పోరాడుతూ, ఓడిపోయి కశ్మీరు ధైర్యానికి చెడ్డ పేరు సాధించింది అంటాడు కల్హణుడు. భిక్షుచారుడి సైన్యం, తురుష్క సైన్యంతో కలిసి వెనుకడుగు వేయటంతో కశ్మీరీయులు సుస్సలుడిని శరణు వేడారు.

హ్యో ధనూంసి శిరాంస్సద్య నమయన్తోద్భు తాశయాః।
కుల ప్రభోః పురః స్పష్టం నతో దృష్టా లలజ్జిరో॥
(కల్హణ రాజతరంగిణి 8, 924)

ఈ సందర్భంగా కల్హణుడు కశ్మీరీ ప్రజల స్వభావాన్ని వ్యగ్యంగా వర్ణించాడు (పిలకా గణపతి శాస్త్రి గారి అనువాదం ఈ శ్లోకాలను విస్మరించింది).

అంతకు ముందు రోజు తమ రాజుకు వ్యతిరేకంగా బాణాలు సంధించారో, ఈ రోజు అతడి ముందు తలలు వంచి నిలబడ్డారు సిగ్గు లేకుండా! అని వ్యాఖ్యానించాడు. పోల్చి చూస్తే ఈనాటికీ ఇదే ప్రవర్తన కశ్మీరు ప్రజలలో చూడవచ్చు.

భారతదేశానికి విధేయులుగా ఉన్న ప్రజలు ప్రాకిస్తానీ ప్రేరేపిత తీవ్రవాదుల ప్రలోభాలకి లొంగి భారతీయ సైన్యంపై దాడులు చేశారు. రాళ్ళు రువ్వారు. కశ్మీరు వీడిపొమ్మని నినాదాలు చేశారు. ఇప్పుడు కశ్మీరు లోని తీవ్రవాదులను  భారత సైన్యం హతమారుస్తూ, కశ్మీరు పరిస్థితిని అదుపు లోకి తెచ్చుకోగానే, అదే ప్రజలు, భారత విధేయత ప్రకటిస్తున్నారు. కాలం మారినా మనుషులు మారరు. వారి స్వభావాలు మారవు అంటారు. ఆ రోజు ఆ ప్రవర్తన చూసి కల్హణుడు ఎంతగా ఆశ్చర్యపోయాడో, ఈ రోజు ఈ ప్రవర్తన చూసి అలాగే ఆశ్చర్యపోతున్నాం. సుల్తానుల వ్యతిరేకంగా పోరాడిన వారే, విజయం సాధించిన సుల్తానులను పొగడడం, బ్రిటీష్ వారిని దూషించిన వారే, వారిని గంధర్వులుగా భావించటం, భారతీయుల స్వభావం లోనే ఈ వైచిత్రి ఉన్నట్టుంది అనుకోవటానికి వీలు లేదు,  పరిస్థితులకు తగ్గట్టు తమ ప్రవర్తనను మార్చుకునే లక్షణం సమస్త మానవ సమాజంలో ఉన్నట్టుంది. రెండవ ప్రపంచ యుద్ధంలో నాజీలు తమ దేశాలను ఆక్రమించగానే, యూదులను పట్టించి, నాజీలకు జేజేలు కొట్టిన ప్రజలే నాజీలు ఓడిపోగానే వారిని దూషించి, విజేతలకు బ్రహ్మరథం పట్టారు. ఇది మానవ స్వభావంలోనే ఉన్నట్టుంది!

సుస్సలుడితో తలపడాటానికి భిక్షుచారుడు వెళ్ళగానే రాజధానిలో ఉన్న అధికారులు , తంత్రినులు, ఇతరులు భిక్షుచారుడికి వ్యతిరేకంగా విప్లవం లేవదీశారు. దాంతో తన సింహాసనం కాపాడుకోవటం కోసం భిక్షుచారుడు శ్రీనగరం వచ్చాడు. విప్లవకారులూ, రాజు సైన్యానికి నడుమ ఘోరమైన పోరు జరిగింది. భిక్షుచారుడి సైన్యం విజయం సాధించింది. దాంతో ఒక్కసారిగా, కశ్మీరులో పరిస్థితి మారింది. ఈ పరిస్థితిని కల్హణుడు వ్యంగ్యంగా వర్ణించిన తీరు కశ్మీరు ప్రజల ప్రవర్తన పట్ల, బ్రాహ్మణుల చిత్తశుద్ధి రాహిత్యం పట్ల కల్హణుడి ఏహ్య భావనను స్పష్టం చేస్తోంది.

క్షిప్త్వా క్షిప్రం స్పకక్ష్యాం తర్వి బుధ ప్రతిమా భయాత్।
తే విరిశాంద్యా విప్రాద్యాః ప్రాయముత్సుద్య విద్వతాః॥
(కల్హణ రాజతరంగిణి 8, 939)

అప్పటిదాకా పెద్ద సంఖ్యలో నిరసనలో కూర్చున్న బ్రాహ్మణోత్తములు,  నిరసనను వదిలి దేవతల విగ్రహాలను చంకలో ఇరికించుకుని భయంతో ఆ ప్రాంతం నుంచి అదృశ్యం అయిపోయారు. ఎవరయితే అక్కడ ఖాళీ పల్లకీలకు కాపలాగా ఉన్నారో వారు రాజును శరణువేడి నిరసన వదిలేశామని చెప్పటంతో వారిని చంపకుండా వదిలేశాడు భిక్షుచారుడు. అంతవరకూ విప్లవకారుల ఆజ్ఞలను అనుసరిస్తూ పరుగులిడిన గుర్రాలు ఇప్పుడు భిక్షుచారుడి సైన్యంలో పరుగులెత్తుతున్నాయి.

పశువులతో పోలుస్తూ ఎంతో వ్యంగ్యంగా బ్రాహ్మణుల సమాజాల నిరసనలోని నిజాయితీ రాహిత్యాన్ని ఎత్తి చూపించాడు కల్హణుడు. ఇదంతా అందరూ ఆశ్చర్యంతో చూస్తున్నారట. అయితే కల్హణుడు, నిన్న విప్లవకారుల వైపున్న గుర్రాలు, ఈ రోజు భిక్షుచారుడి వైపు రావటాన్ని ఆశ్చర్యంతో చూస్తున్నారందరూ అనటంలో – పశువులు పార్టీ మార్చటం, బ్రాహ్మణుల పలాయానం కన్నా ఆశ్చర్యం గొలిపే విషయం అని అత్యంత వ్యంగ్యంగా, ఘోరమైన హేళన్ను ప్రదర్శిస్తూ ప్రకటించాడు. పశువులకు నోరు లేదు. కళ్లెం ఎవరి అదుపులో ఉంటే, వారి మాట వింటాయవి. కానీ ఆలోచనలుండి, తెలివి ఉన్న బ్రాహ్మణ సమూహాలు పశువుల కన్నా ఘోరంగా ప్రవర్తించాయని ఎత్తి పొడుస్తున్నాడు కల్హణుడు. ఎంతగా కడుపు మండి, హృదయం దహించుకుపోతుంటే, ఇంత కసిగా వ్యాఖ్యానించి ఉంటాడు కల్హణుడు! కల్హణుడి ‘కసి’, ‘నిరసన’లు అర్థం కావాలంటే భవిష్యత్తులో కశ్మీరులో జరిగే సంఘటనను తెలుసుకోవాల్సి ఉంటుంది.

తనను వ్యతిరేకీంచిన వారందరి ఇళ్లనూ, ఆస్తులను ధ్వంసం చేయించాడు భిక్షుచారుడు. రాజు ఈ ప్రతీకారోత్సవంలో నిమగ్నుడై ఉన్న సనయంలో సుస్సలుడు ఎదురన్నది లేకుండా, ఎలాంటి ప్రతిఘటనను ఎదుర్కోకుండా శ్రీనగరంలోకి ప్రవేశించాడు.

క్రోధం ఉట్టిపడుతుండగా, తనని వ్యతిరేకించిన వారందరి వైపు క్రోధపూరితమైన దృక్కులు ప్రసరిస్తూ, దుమ్ము కొట్టుకుపోయిన గడ్దంతో, చుట్టూ కత్తులు సిద్ధంగా పట్టుకున్న సైనికులతో శ్రీనగరంలోకి ప్రవేశించాడు సుస్సలుడు. తనని హేళన చేస్తూ, వెక్కిరించి వెళ్లగొట్టిన ప్రజలు, ఇప్పుడు రాజవీధిలో ఇరువైపులా నిలబడి తనపై పూలు వెదజల్లుతున్నా, వారి వైపు నిరసనగా చూస్తూ శ్రీనగరంలోకి అడుగుపెట్టాడు సుస్సలుడు.

రాజ్యంలో అడుగుపెట్టిన సుస్సలుడికి రాజభవనంలో అడుగుపెడుతుంటే వేశ్యావాటికలో అడుగుపెట్టిన భావన కలిగింది. వెంటనే రాజభవనం వదిలి, శ్రీనగరం వదిలి పారిపోతున్న భిక్షుచారుడిని వెంబడించాడు సుస్సలుడు. తన సైన్యాధికారులతో, కొద్దిపాటి సైన్యంతో ప్రాణాలు అరచేత పట్టుకుని పారిపోయాడు భిక్షుచారుడు. వితస్త దాటి ‘పుశ్యావాద’ అన్న గ్రామం చేరాడు.

‘రాజతరంగిణి’లో ఇంకా ముందుకు వెళ్ళేముందు ఒక్క విషయం ప్రస్తావించుకోవాల్సి ఉంటుంది. ఏ సమాజంలోనయినా అధికశాతం ప్రజలు, ఎలాగయితే పశువులు కర్ర ఎవరి చేతిలో ఉంటే వారి మాట వింటాయో, అలా అధికారానికే తల వంచుతారు. వ్యక్తిగత ఇష్టాయిష్టాలు, ఆదర్శాల కన్నా ప్రాణాలు కాపాడుకోవటానికి ప్రాధాన్యం ఇస్తారు. కానీ కొందరు ప్రాణాలను త్యజించి మరీ తమ వ్యక్తిత్వాని కాపాడుకుంటారు. ఆదర్శం కోసం నిలుస్తారు. అలాంటి వారిని సమాజం గౌరవిస్తుంది. అలాంటి వారు భావి సమాజానికి నిత్యస్మరణీయులు అవుతారు. వారిని ఆదర్శంగా తీసుకుని భవిష్య సమాజం వ్యక్తిత్వాన్ని తీర్చిదిద్దుకుంటుంది. అలాంటి వారిని విస్మరించిన సమాజం, అలాంటివారిని గౌరవించలేని సమాజం వ్యక్తిత్వ రాహిత్యంతో, వెన్నెముక లేనిదవుతుంది. పశువులా ‘కర్ర’ ఎవరి చేతిలో ఉంటే వారి మాట వింటుంది.

(ఇంకా ఉంది)

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here