Site icon Sanchika

కశ్మీర రాజతరంగిణి-80

[box type=’note’ fontsize=’16’] కశ్మీర్ ప్రాచీన చరిత్ర గురించి అవగాహన కలిగించి, భవిష్యత్తు గురించి ఆలోచనలు కలిగించాలన్న ప్రయత్నంలో భాగంగా నీలమతపురాణం తరువాత అందిస్తున్న జోనరాజు, శ్రీవరుడు, ప్రజ్ఞాభట్టులు కల్హణుడి అడుగుజాడల్లో నడుస్తూ సంస్కృతంలో రచించిన ‘కశ్మీర రాజతరంగిణి’ అనువాదాన్ని తెలుగు పాఠకులకు అందిస్తున్నారు కస్తూరి మురళీకృష్ణ. [/box]

ఇథ్థం నానామవైః పక్షప్రతిపక్షైరుపేక్షితమ్।
రాష్ట్రం నిఖిలమేవాగాత్సర్వతః శోచనీయతామ్॥
(కల్హణ రాజతరంగిణి 8, 1035)

[dropcap]భి[/dropcap]క్షుచారుడు ప్రాణాలు అరచేత పట్టుకుని కశ్మీరం వదిలి పారిపోయాడు. కానీ కశ్మీర సింహాసనంపై ఆశను వదులుకోలేదు.సుస్సలుడు సింహాసనం సాధించాడు కాని అతడికి రాజ్యం అంతా తనని తరిమికొట్టి, వ్యతిరేకించినవారే కనబడసాగారు. ఓ వైపు భిక్షుచారుడు మళ్ళీ సైన్యం కూడదీసుకుని తనపైకి యుద్ధానికి వస్తాడన్న భయం, మరో వైపు రాజ్యంలో తన వ్యతిరేకులు కలిసి తిరుగుబాటు చేస్తారన్న వెరపు సుస్సలుడిని పాలన వైపు దృష్టిని పెట్టనివ్వలేదు. తనని వ్యతిరేకించిన వారందరినీ ఏరి పారేయసాగాడు సుస్సలుడు. ఈ రకంగా తనను సమర్థించిన వారినీ బాధపెట్టాడు. దేశం వదిలి పారిపోయిన భిక్షుచారుడు సమర్థకులను కూడగట్టుకున్నాడు. తన సింహాసనాన్ని తిరిగి దక్కించుకునేందుకు కశ్మీరంపై విరుచుకుపడ్డాడు.

ఈ వ్యవహారాన్నంతా కల్హణుడు రాజతరంగిణిలో విపులంగా వర్ణించాడు. ఏ వీరుడు ఏ వైపు ఉన్నాడు, ఏ వీరుడు ఎంత వీరోచితంగా పోరాడేడు, ఎవరెవరు రాజుని వదిలి భిక్షుచారుడి వైపు వచ్చారు, ఎవరెవరిని ఎలా చంపారు అనేదంతా కళ్ళకు కట్టినట్టు పేర్లతో సహా వివరించాడు కల్హణుడు. అయితే, యుద్ధం కాక కల్హణుడు అత్యంత విపులంగా, కళ్ళకు కట్టినట్టు వర్ణించింది ప్రజల దుస్థితి. రెండు ఏనుగుల పోరాటం వల్ల అడవి విధ్వంసమయినట్టు భిక్షుచారుడు, సుస్సులుల అధికారపు పోరు వల్ల ఏ రకంగా కశ్మీరు జనజీవితం అల్లకల్లోలమయిందో, ఎంతగా అందమైన కశ్మీరం పీనుగుల పెంటదిబ్బలా మారిందో హృదయ విదారకంగా వర్ణిస్తాడు కల్హణుడు. ఆ వర్ణన చదువుతుంటే, ఎంత వద్దనుకున్నా, ఇరాక్, సిరియా, యుక్రెయిన్, ఆఫ్ఘనిస్థాన్ లతో పాటు మతకల్లోలాలకు గురైన అనేక ప్రాంతాల దృశ్యాలు కళ్ళముందు నిలబడతాయి. ఇద్దరి అధికార దాహానికి, అహంకారాల పోరాటానికి ఆనాడూ, ఈనాడూ, ఏనాడయినా తన జీవితాలను సామాన్యులు పణంగ పెట్టటమే నన్న చేదు నిజం స్పష్టమవుతుంది.  హృదయం బాధామయం అవుతుంది. గతం నుంచి గుణపాఠాలు నేర్వని మానవ జాతి, గతంలో జరిగిన వినాశనాన్ని పదే పదే సంభవింప చేస్తూ, అదే బురదలో పడి పొర్లే బుద్ధిహీన జీవిలా ప్రవర్తిస్తోందని అర్థమవుతుంది.

భిక్షుచారుడి సైన్యం -కశ్మీరు ప్రజలు, రాజయితే భిక్షుచారుడి పాలన క్రిందకు వచ్చే ప్రజలే నన్న కనీస జ్ఞానం లేకుండా శత్రువుల రాజ్యాన్ని కబళిస్తున్న ఉత్సాహంతో గ్రామాలపై, ప్రజలపై విరుచుకు పడ్డారు. ఇళ్ళను తగులబెట్టారు. ప్రజలను విచక్షణారహితంగా హతమార్చారు. ప్రజలను హింసించి ఆనందించారు. దాంతో భిక్షుచారుడి సేనలు వస్తున్నాయన్న భయంతో, వారి నుంచి తప్పించుకునేందుకు విజయక్షేత్రంతో సహా, పలు నగరాలు, పల్లెల ప్రజలు చక్రధరపురంలో చక్రధర మందిరంలో తలదాచుకున్నారు. ఇంతమందికి ఆశ్రయం ఇచ్చిందంటే, ఆ మందిరం ఎంత పెద్దదో ఊహించవచ్చు. అయితే, అలా తలదాచుకున్న వారిలో తన శత్రువు కూడా ఉన్నాడని ఓ సైనికుడు మందిరానికి నిప్పు పెట్టాడు.  ప్రజలు ఆ మందిరంలో తమ ఆహారధాన్యాలు, ఇతర వస్తువులు అన్నీ తెచ్చుకుని యుద్ధం అయ్యేదాక అక్కడే ఉండాలనుకున్నారు. కానీ సైనికుడు మందిరానికి నిప్పు పెట్టటంతో ప్రజలు ఎటూ పోలేక, ఉక్కిరిబిక్కిరి అయ్యారు. పశువులు భయంతో అటూ ఇటూ పరుగులు పెట్టాయి. నిప్పుతో కాలని ప్రజలు పశువుల పాదాల క్రింద పడి మరణించారు. పశువుల పాదాల నుంచి తప్పించుకున్న వారు నిప్పుకు ఆహుతి అయ్యారు. సూది మొన మోపటానికి కూడా స్థలం లేనట్టు మందిరంలో ఉన్న ప్రజల హాహాకారాలు, పశువుల కేకలతో జగతి దద్దరిల్లింది. మందిరం నుండి ఆకాశానికి ఎగసిన జ్వాలలు, పొగ, భయంకరమైన రాక్షసుల్లా తోచాయి. నల్లటి గడ్డంతో, ఎర్రటి జుట్టుతో రాక్షసులు ఆకాశాన్ని కప్పినట్టు తోచింది.

ఈ భయంకర దృశ్యాన్ని వర్ణించడంలో కూడా కల్హణుడిలోని కవి, అత్యద్భుతమైన ఊహతో పరిస్థితిని కళ్ళ ముందు నిలిపాడు. పొగ నల్లగా ఉంటుంది కాబట్టి, నల్లటి గడ్డం; జ్వాలలు ఎరుపు రంగులో ఉంటాయి కాబట్టి ఎర్రటి జుట్టు ఉన్న రాక్షసులతో ఆకాశమంతా నిండి ఉందని వర్ణించాడు. ఈ వర్ణన తురుష్కులను సూచిస్తుందని కొందరి వ్యాఖ్యాతల అభిప్రాయం. ఎందుకంటే భిక్షుచారుడి సైన్యంలో తురుష్కులు కూడా ఉన్నారు. భిక్షుచారుడి సైన్యం కశ్మీరీ ప్రజలపై ప్రదర్శిస్తున్న క్రౌర్యం తురుష్క ప్రేరేపితమన్న ఆలోచనను కూడా పలువురు ప్రకటించారు. ఏది ఏమైనా కశ్మీరు ప్రజల పరిస్థితి తలచుకుంటేనే భయంకరంగా అనిపిస్తుంది, కల్హణుడి వర్ణనలు చదువుతూ, ఆ దృశ్యాలను ఊహించుకుంటే.

పొగ లేకుండా విస్తరిస్తున్న అగ్నిజ్వాలలు కరిగిన బంగారం ప్రవాహంలా, తీవ్రమైన వేడికి బంగారు ఆభరణాల మేఘం కరిగి ద్రవరూపంలో ప్రవహిస్తున్న భ్రమను కలిగిస్తోంది. ఈ ఘోరం నుంచి తప్పించుకుని పరిగెత్తుతున్న దైవాల శిరస్సుల నుంచి జారిపడిన ఎర్రటి పొగల్లా అనిపిస్తున్నాయి ఎగస్తున్న జ్వాలలు. వేడికి విరుగుతూ కర్రలు చేస్తున్న శబ్దం, ఆకాశంలో గంగానది వేడికి సలసలా మరుగుతూ చేస్తున్న శబ్దంలా ఉంది. ఆకాశంలో జ్వాలల వల్ల ఏర్పడుతున్న వెలుగు నీడలు, ఈ ఘోరమైన అగ్నిలో కాలి ఆకాశానికి ఎగురుతున్న ఆత్మలలా అనిపిస్తున్నాయి. నిప్పులలో కాలి బూడిదవుతూ పక్షితతులు పెడుతున్న కేకలతో ఆకాశం, నిప్పులో కాలిపోతూ మనుషులు చేస్తున్న ఆక్రందనలతో భూమి దద్దరిల్లిపోతున్నాయి. నిప్పుల్లోంచి ప్రాణాలు అరచేత పట్టుకుని తప్పించుకున్న ప్రజలను, వారి కోసమే ఎదురుచూస్తున్న డామరులు కత్తులకు ఎర చేశారు. ఆకాశానికి ఎగస్తున్న నిప్పుల వేడి తాళలేక మరణించిన వారి సంఖ్య, నిప్పుల్లో కాలి చనిపోయిన వారి కంటే అధికం. ప్రజలు, పశువులూ, పక్షులూ అన్నీ మరణించిన తరువాత డామరుల కత్తుల రక్త దాహం తీరిన తరువాత ఆ ప్రాంతం అంతా ఓ రకమైన స్మశాన నిశ్శబ్దం ఆవరించింది. కేవలం మానవ మాంసం నిప్పులలో ఉడుకుతున్న వాసన, ఆరిపోతూ జ్వాలలు చేస్తున్న శబ్దాలు తప్ప అక్కడ మరేమీ లేదు. ఆ ప్రాంతంలో పారుతున్న రక్తపుటేరులు, వాటిల్లో కొట్టుకు వస్తున్న మాంసం, క్రొవ్వులు – వంద రెండు వందల నదుల ప్రవాహంలా తోచింది. వీటి దుర్వాసన వంద యోజనాల దూరం వరకూ విస్తరించింది. చక్రధరపురం గతంలో సుశ్రవసుల క్రోధానికి, తరువాత డామరుల తాకిడికి గురయి ఈ రకమైన వినాశనాన్ని అనుభవించింది. ఇటువంటి  ఘోరమైన వినాశనం మహాభారతంలో ఖాండవదహనంలో తప్ప మరెక్కడా జరగలేదు. ఇప్పుడు చక్రధరపురంలో అంతకన్నా ఘోరమైన వినాశనం సంభవించింది.

విజయగర్వంతో ఆ ప్రాంతంలో అడుగుపెట్టిన భిక్షుచారుడికి శూన్య గృహాలు, శూన్యపు వీధులు ఆహ్వానం పలికాయి. ఎందుకంటే అక్కడి ప్రజలంతా ఇళ్ళు వదిలి చక్రధరపురంలో తల దాచుకుని ప్రాణాలు కోల్పోయారు.

ఎంతటి భయంకరమైన, దయనీయమైన దుస్థితి. ఇదంతా చదువుతూ ‘ఆ కాలంలో వారు అనాగరికులు’ అని అనుకోవటానికి వీలు లేదు. అప్పటికన్నా ఘోరమైన రీతిలో ఇప్పుడు మన కళ్ళ ఎదుటే యుద్ధం జరుగుతోంది. మిగతా జీవుల శవాల గుట్టలు, కాలి కూలి బూడిదయిన పెద్ద పెద్ద భవంతులు, శూన్యంగా ఉన్న ఇళ్లు, శూన్యమైన నగర వీధులు, ప్రాణాలు అరచేత పెట్టుకుని పారిపోతున్న ప్రజలు…. అయినా జాలి, దయ, కరుణ లేక యుద్ధాన్ని కొనసాగిస్తున్న దేశాలు, దొరికిన అమాయక ప్రజలను దొరికినట్టు ఊచకోత కొస్తున్న సైన్యాలు… కల్హణుడు ఆనాటి కశ్మీరును వర్ణిస్తున్నాడా? కొద్ది కాలం నాటి సిరియాను, ఇరాక్‌ను, ఆఫ్ఘనిస్థాన్‌ను; ఇప్పటి యుక్రెయిన్‌ను వర్ణిస్తున్నాడా? అన్న భ్రమ కలుగుతుంది. భిక్షుచారుడి తురుష్కులు, డామరుల సైన్యం వస్తోందన్న భయంతో పారిపోయిన ప్రజలను చూస్తే – ఆఫ్ఘనిస్థాన్ వదిలి వెళ్ళాలని విమానాలను పట్టుకుని వేలాడిన ప్రజలు గుర్తుకువస్తారు. తామేమై పోయినా పర్వాలేదు, తమ పిల్లలు సురక్షితంగా ఉండాలని ఫెన్సింగులపై నుండి పిల్లలను విమానాశ్రయంలోకి విసిరేసిన ప్రజల దౌర్భాగ్యం కళ్ళ ముందు కనిపిస్తుంది. కాలం మారినా, నాగరికత ఎదిగినా, సాంకేతిక అభివృద్ధి సాధించినా, మౌలికంగా మనిషిలోని పశుస్వభావంలో మార్పు రాలేదని, అభివృద్ధి చెందిన సాంకేతిక పరిజ్ఞానం అతనిలోని పాశవిక ప్రవృత్తిని మరింతగా ప్రకోపింప చేస్తోందని స్పష్టం చేస్తుంది. ఒక బటన్ నొక్కటంతో కళ్ళ ముందు కూలిపోయిన భవంతులను చూపిస్తూ, ప్రేక్షకులలోని పాశవిక ప్రవృత్తిని సంతృప్తిపరుస్తూ, వ్యాపార లెక్కలు వేసుకుంటున్న మీడియా కూడా యుద్ధంలోని అత్యాచారాన్ని ఒక గొప్ప దృశ్యంలా ప్రదర్శిస్తూ –  అత్యాచారమే జరుపుతోందన్న భావన కలిగిస్తుంది. ఎందుకంటే మీడియాలో ప్రదర్శిస్తున్న సెన్సేషనల్ దృశ్యాలు చూస్తే కలుగని జుగుప్స, జాలి, మానవ క్రౌర్యం పట్ల ఆవేదన, ఆవేశం కల్హణుడి వర్ణనలు చదివితే కలుగుతాయి. ఎంత నిరర్ధకం మానవ అహంకారం అన్న భావన కలుగుతుంది. ఇంతలో కల్హణుడు మరో వర్ణన చేస్తాడు. డామరులు, శవాల నుంచి విలువైన వస్తువులను ఏరుకుంటున్నారట, కాపాలికుల్లా!

ఇక్కడ కల్హణుడు అద్భుతమైన శ్లోకం రాశాడు:

యత్కృత్ క్రియతే కర్మ లోకాంతర సుఖాంతకం।
సమూఢైః సులభాపాయః కాయశ్చిత్రం న గణ్యతే॥
(కల్హణ రాజతరంగిణి 8, 1041)

ఏ శరీరం కోసమైతే ప్రజలు అన్ని రకాల దృష్కృతాలు జరుపుతారో, ఒక్క క్షణమైనా వారికి ఆ శరీరం ఒక్క క్షణంలో ఎలా నాశనమౌతుందో స్ఫురణకు రాదు. క్షణంలో నాశనమయ్యే శరీరం కోసం, ఈ లోకంలో నెరపే దృష్కృతాల వల్ల పరలోక సౌఖ్యాన్ని కూడా కోల్పోతారు [కశ్మీర ప్రజల ఈ దుస్థితి వర్ణన పిలకా గణపతిశాస్త్రి గారి అనువాదంలో వదిలారు].

ఈ ఘోరం తెలుసుకున్న సుస్సలుడు, ప్రజల సంరక్షణ తన బాధ్యత అన్న నిజం గ్రహించి సైన్యంతో బయలుదేరాడు. డామరులను తరిమివేశాడు. లాగగల శవాలను లాగి వితస్తలో పారేశారు. మిగతావాటిని చక్రధర మందిరంలోనే తగులబెట్టారు. ఈ సమయంలో రిల్లణుడు గొప్ప సాహసం ప్రదర్శించి అధికారి అయ్యాడు.

కశ్మీరంలో భాద్రపద మాసంలో ఎనిమిదవ రోజున – మరణించినవారి బూడిదను నదులలో కలుపుతారు. శ్రీనగరం నుంచి నాలుగవ రోజున ప్రయాణం ఆరంభిస్తారు. ఆ రోజు నగరంలోని బంధువులంతా మరణించిన వారి ఇంటికి వచ్చి పెద్దగా ఏడుస్తూ తమ బాధను, విధేయతను, మరణించినవారి పట్ల గౌరవాన్ని, బ్రతికి ఉన్నవారి పట్ల సానుభూతిని తెలుపుతారు. ఆ రోజు నగరమంతా ఏడుపులతో దద్దరిల్లుతుంది. కానీ ఇప్పుడు కశ్మీరం ప్రతి రోజూ ప్రజల ఏడుపులతో దద్దరిల్లుతోంది.

ఈ యుద్ధం ఇంకా కొన్నాళ్ళు కొనసాగింది. భిక్షుచారుడి వైపు వీరులు అనేకులున్నారు. కానీ సుస్సలుడి సైన్యంలో భిక్షుచారుడికి ధీటుగా ఒక్క వీరుడు కూడా లేడు. ఈ యుద్ధంలో భిక్షుచారుడు గొప్ప వీరుడిలా, సైనికుల పట్ల సానుభూతి కలవాడిగా, ప్రణాళికా బద్ధంగా యుద్ధం చేసే నిపుణుడిగా అందరి మన్ననలందుకున్నాడు. ఆయన తాను గెలిచిన ప్రతి ప్రాంతంలో తాను సింహాసనం కోసం పోరాడటం లేదని, ప్రజల దుస్థితిని తొలగించి, వారి జీవితాలను మెరుగుపరచటం ద్వారా తనకన్నా ముందున్న వారు చేసిన పొరపాట్లను సరిదిద్దాలని ప్రయత్నిస్తున్నాని చెప్పేవాడు.

సుస్సలుడు ఎట్టి పరిస్థితులలో సింహాసనం వదిలేందుకు సిద్ధంగా లేడు. అలాగని తన సైన్యాన్ని నమ్మే పరిస్థితిలోనూ లేడు. ఎందుకంటే, ఒకప్పుడు వీరంతా భిక్షుచారుడిని సమర్థించిన వారు. దాంతో భిక్షుచారుడు, సుస్సలుడి నడుమ పోరు కశ్మీరాన్ని తీవ్రమైన దుస్థితికి దిగజార్చింది. ఆ సంవత్సరం విపరీతంగా మంచు కురవడం వల్ల భిక్షుచారుడి సైన్యం దెబ్బతిన్నది. ఆ రకంగా సుస్సలుడు భిక్షుచారుడిపై విజయం సాధించాడు.

ఇలా సాధించిన ‘శాంతి’ ఆధారంగా సుస్సలుడు పాలన వైపు దృష్టి పెట్టలేదు. తనను వ్యతిరేకించిన వారిని ఏరివేయటంలోనే కాదు, తనకు సహాయం చేసి తన వైపు పోరాడిన వారిని కూడా ఏదో చిన్న అనుమానంతో శిక్షించటం, జైలులోకి తోయటం ఆరంభించాడు. దీంతో ఎక్కడ రాజు దృష్టి తమపై పడుతుందేమోనని, అధికారులు రాజ్యం వదిలి భిక్షుచారుడిని ఆశ్రయించారు. రాజు ఆగ్రహం ఒకరి వైపు ప్రసరిస్తే మిగతావారంతా భయపడి భిక్షుచారుడికి మద్దతు నిచ్చారు. దాంతో కొద్ది నెలల శాంతిని భగ్నం చేస్తూ భిక్షుచారుడు మళ్ళీ కశ్మీరం వైపు ప్రయాణం ఆరంభించాడు.

మళ్ళీ కశ్మీర సింహాసనం కోసం యుద్ధం ఆరంభమయింది.

ఎక్కడెక్కడ నదులను దాటలేకపోయారో భిక్షుచారుడి సైనికులు అక్కడక్కడ గ్రామాలను తగులబెట్టారు. ప్రజలను హింసించారు. మరోవైపు యుద్ధం చేస్తున్న సుస్సలుడు శ్రీనగరం శత్రు సైనికుల పరమైందని తెలిసి శ్రీనగరం రక్షణ కోసం వెనక్కి మళ్ళాడు. అయితే ‘గంభీర’ నదిని దాటే సమయంలో సైన్యం బరువును తట్టుకోలేక నదిపైని వారధి కూలిపోయింది. అధిక శాతం సుస్సలుడి సైనికులు నదిలో కొట్టుకుపోయారు. సుస్సలుడి వెంట గుప్పెడు మంది సైనికులే మిగిలారు. సైనికులకు ధైర్యం చెప్పే ప్రయత్నం చేసిన సుస్సలుడు పొరపాటున నదిలో పడిపోయాడు. ఆయన తప్పించుకోనే లోగా, ఈత రాని సైనికులు ఆయనను పట్టుకుని తప్పించుకోవాలని ప్రయత్నించటంతో ఆయన మునిగిపోయే పరిస్థితి వచ్చింది. అతి కష్టం మిద వారిని తప్పించుకుని చావు తప్పి కన్ను లొట్టబోయిన చందాన ఒడ్డు చేరుకున్నాడు సుస్సలుడు. మిగిలిన సైన్యాన్ని కూడదీసుకుని ముందుకు నడిచాడు.

ఇక్కడి నుండి జరిగిన యుద్ధాన్ని కల్హణుడు విపులంగా వర్ణిస్తాడు. వీరుల పేర్లు వారు చంపిన శత్రు వీరుల పేర్లతో వివరంగా రాస్తాడు. రాజధానిలో అడుగడుగూ శత్రు సైన్యాలు ఎలా గెలుచుకున్నాయి, సుస్సలుడి సేనలు అడుగడుగూ ఎలా వారిని ప్రతిఘటించాయో కళ్ళ ముందు నిలుపుతాడు కల్హణుడు. అయితే ఈ యుద్ధాన్ని వర్ణించటంలో ఎక్కడా కల్హణుడు యుద్ధాన్ని ‘సమంజసం’ అన్న రీతిలో వర్ణించడు. యుద్ధాన్ని ‘గొప్ప’గా చూపించడు. యుద్ధంలోని భయానక వాతావరణాన్ని చూపిస్తాడు. యుద్ధం వల్ల సామాన్యులు పడే కష్టాన్ని దయనీయంగా వివరిస్తాడు.

దాదాపుగా 25 మంది వీరులతో మిగిలిన సుస్సలుడు, వెనుకడుగు వేయకుండా శత్రువుతో తలపడ్డాడు. ఆ రోజు సుస్సలుడి ఆఖరి రోజు అని అందరూ అభిప్రాయపడ్డారు. కానీ, ఒకరొకరుగా, సుస్సలుడి రక్షణ కోసం వీరులు బారులు తీరారు. నలువైపుల నుంచి వచ్చి చేరారు. దాంతో నెమ్మదిగా భిక్షుచారుడి సైన్యం వెనుకడుగు వేయాల్సి వచ్చింది. సుస్సలుడి సైన్యం డామరులను చెల్లాచెదురు చేసింది. సుస్సలుడి వైపు గొప్ప వీరత్వం ప్రదర్శించింది రిల్లణుడు.

వెనుకడుగు వేస్తున్న భిక్షుచారుడి సైన్యం ‘గోపాద్రి’ పర్వతం చేరింది. ఈ గోపాద్రి పర్వతాన్ని ప్రస్తుతం ‘తఖ్త్-ఎ-సులైమాని’ అంటున్నారు. ఈ పర్వతం పేరు మీదే దగ్గరలో ఉన్న గ్రామాన్ని ‘గుప్కార్’ అంటారు. ఈ పర్వతం దగ్గర జరిగినటు వంటి యుద్ధం కనీవినీ ఎరుగనిదని అంటాడు కల్హణుడు. చరిత్రలో ఇలాంటి యుద్ధం ఎప్పుడూ జరగలేదంటాడు.

(ఇంకా ఉంది)

Exit mobile version