కశ్మీర రాజతరంగిణి-81

1
2

[box type=’note’ fontsize=’16’] కశ్మీర్ ప్రాచీన చరిత్ర గురించి అవగాహన కలిగించి, భవిష్యత్తు గురించి ఆలోచనలు కలిగించాలన్న ప్రయత్నంలో భాగంగా నీలమతపురాణం తరువాత అందిస్తున్న జోనరాజు, శ్రీవరుడు, ప్రజ్ఞాభట్టులు కల్హణుడి అడుగుజాడల్లో నడుస్తూ సంస్కృతంలో రచించిన ‘కశ్మీర రాజతరంగిణి’ అనువాదాన్ని తెలుగు పాఠకులకు అందిస్తున్నారు కస్తూరి మురళీకృష్ణ. [/box]

వసన్తే డామరాః సర్వే ప్రామృన్మార్గైర్నిర్జైర్నిర్జైః।
ఆగత్య భూయో భూపాలం నగరస్థ మవేష్ఠయన్॥
(కల్హణ రాజతరంగిణి 8, 1155)

[dropcap]క[/dropcap]ల్హణుడు రచించిన రాజతరంగిణి ఎనిమిదవ తరంగం అంతా అల్లకల్లోలమవుతున్న కశ్మీర గాథ ఉంటుంది. భిక్షుచారుడు, సుస్సలుల నడుమ రాజ్యాధికారం కోసం జరిగిన సర్వ వినాశక పోరు వర్ణనలుంటాయి. ఇదొక అంతం లేని పోరు. కశ్మీర ప్రజల జీవితాలను అల్లకల్లోలం చేసిన అధికార పోరు. ఒకసారి భిక్షుచారుడిది పై చేయి అయితే, మరోసారి సుస్సలుడిది పై చేయి అవుతుంది. ఒకసారి సుస్సలుడి పని అయిపోయిందనిపిస్తే, మరోసారి దీనితో భిక్షుచారుడి పని ఖతం అనిపిస్తుంది. కానీ మళ్ళీ ఇద్దరూ శక్తి పుంజుకుంటారు. ఇటువైపు వీరులు అటు వెళ్తారు. అటువైపు వీరులు ఈ వైపు వస్తారు. ఈ రకంగా ఒక రోజు కాదు, రెండు రోజులు కాదు, నెలల తరబడి అధికారం కోసం పోరు కశ్మీరంలో సాగుతూనే ఉంది. అటు వైపు కొందరు, ఇటు వైపు కొందరు యుద్ధాన్ని తెగనీయరు. పోరుకు పురిగొల్పుతుంటారు. వారు ఈ వైపు ఉన్నట్టుంటారు కానీ, ఆ వైపుతో కూడా మంతనాలు సాగిస్తుంటారు. ఎట్టి పరిస్థితులలో యుద్ధం ఆగకుండా కాపాడుతూ ఏ వైపు గెలిచినా తాము మాత్రం లాభపడేట్టు జాగ్రత్తలు తీసుకుంటారు వీరు. ఇలా జరిగిన యుద్ధాల పరంపరను కల్హణుడు ఎంతో బాధతో, వేదనతో వర్ణించాడు.

మానవ సమాజంపై విరుచుకుపడే ప్రాకృతిక వైపరీత్యాల కన్నా ఘోరమైన నష్టం కలిగిస్తుంది యుద్ధం. ప్రాకృతిక వైపరీత్యాలు సంభవిస్తాయి. తరువాత మానవ జీవితాన్ని పునర్నించుకునే వీలును కల్పిస్తుంది ప్రకృతి. మళ్ళీ ఎప్పుడో కానీ ప్రాకృతిక వైపరీత్యం సంభవించదు. కానీ యుద్ధం అలా కాదు. సమాజాన్ని అల్లకల్లోలం చేస్తుంది. మానవ జీవితాన్ని దుర్భరం చేస్తుంది. ప్రాకృతిక వైపరీత్యాలకి ఒక కేంద్రం ఉంటుంది. కేంద్రం నుంచి దూరంగా వెళ్ళిన కొద్దీ దాని ప్రభావం బలహీనమవుతుంది. కానీ యుద్ధానికి కేంద్రంతో పనిలేదు. అది మానవ సమాజాన్ని ప్రభావితం చేస్తుంది. మారణ హోమం తగ్గినా ద్వేషభావనలు తొలగవు. అవి పెరుగుతూ మళ్ళీ యుద్ధాలవుతాయి. మొదటి ప్రపంచ యుద్ధం రెండవ ప్రపంచ యుద్ధానికి దారితీసింది. రెండవ ప్రపంచ యుద్ధం ‘కోల్డ్ వార్’కి దారి తీసింది. ప్రపంచాన్ని ఉద్విగ్నతా మయం చేసింది. దాని ఫలితమే ఇప్పుడు ప్రపంచంపై ప్రత్యక్షంగా దుష్ప్రభావం చూపిస్తున్న రష్యా – యుక్రెయిన్ యుద్ధం. ఇలా ఎన్నటికీ ఎడతెగని ద్వేష భావనలను కలిగిస్తాయి యుద్ధాలు.

సుస్సులుడు, భిక్షుచారుడి నడుమ జరిగిన యుద్ధాలను విపులంగా వర్ణించాడు కల్హణుడు. చివరికి చలికాలం రావటంతో సుస్సలుడు, భిక్షుచారుడిని వెంబండించడం మాని శ్రీనగరం వచ్చాడు. ఇంతలో డామరులు అన్ని వైపుల నుంచి వచ్చి శ్రీనగరంపై దాడి చేశారు. దాంతో సుస్సలుడు మళ్ళీ ఎడతెగని యుద్ధాలలో పాల్గొనేందుకు సిద్ధమయ్యాడు.

భిక్షుచారుడికి – తాను అధికారంలోకి రావటం డామరులకు ఇష్టం లేదని అర్థమయింది. దాంతో చివరి ప్రయత్నంగా కశ్మీరంలో విప్లవం లేవదీయాలని, ఇది విఫలం అయితే కశ్మీరం వదిలి వేరే దేశానికి వెళ్ళిపోవాలని నిశ్చయించుకున్నాడు. డామరుల సహాయంతో కశ్మీరంలో విప్లవం లేవదీశాడు. సైన్యంతో దాడి చేశాడు. మళ్ళీ సంకుల సమరం ఆరంభమయింది. ఈ సమయంలో భిక్షుచారుడు గెలిస్తే సింహాసనం అతనికి దక్కుతుందని డామరులు భయపడ్డారు. దాంతో భిక్షుచారుడి వైపు పోరాడుతూ, భిక్షుచారుడికి విధేయులుగా ఉన్న వీరులను చంపటం మొదలుపెట్టారు. ఈ సమయంలో కశ్మీరం తుఫానుల తాకిడికి గురయింది. ఇళ్ళు, ఊళ్ళు, చెట్లు ఎగిరిపోయాయి. ఇంతలో డామరులు ఒక ఇంటికి నిప్పు పెట్టారు. గాలి ఆ నిప్పును అన్ని ఇళ్ళకు అంటించింది. దాంతో మొత్తం నగరం అగ్నికి ఆహుతి అయింది. ఆ నిప్పు వల్ల ఎగసిన పొగ వల్ల భూమి కనబడలేదు.  ఆకాశం కనబడలేదు. సూర్యుడు కూడా కనబడలేదు. అగ్ని జ్వాలల వెలుతురులో అప్పుడప్పుడు క్షణకాలం కనబడి అదృశ్యమయ్యే ఇళ్ళు ‘చివరి వీడ్కోలు’ పలుకుతున్నట్లున్నాయి. వితస్త నది కరవాల ధారలా, మృత్యువు ఖడ్గంగా తోచింది. వితస్త రెండు అంచుల నుంచి రక్తం కారుతున్న మృత్యువు ఖడ్గంగా ఉంది అంటాడు కల్హణుడు. ప్రపంచం నాశనమవుతున్న సమయంలో హిమాలయ పర్వతాలపై ఉన్న మంచులా పొగ నడుమన కనిపిస్తున్న మందిరాలు తోచాయి. మొత్తం బూడిద అయిన నగరంలో పెద్ద బుద్ధుడి విగ్రహం మొత్తం మసిబారి నల్లగా కాలిన మహావృక్షంలా కనిపిస్తోంది.

సుస్సలుడికి తన పోరాటం చివరి దశకు వచ్చిందని అర్థమయింది. శ్రీనగరం సర్వం తగలబడిపోతోంది. శత్రు సైన్యాలు శ్రీనగరంలోకి మిడుతల దండులా ప్రవేశించాయి. సర్వత్రా హాహాకారాలు నిండాయి. ఈ సమయంలో సుస్సలుడికి పారిపోయే వీలు లేకుండా వితస్త పైని వంతెనను కూల్చేశారు. దాంతో యుద్ధంలో వీరస్వర్గం పొందటం తప్ప మరో మార్గం లేదని సుస్సలుడు గ్రహించాడు.

పురం దగ్ధం స్వమాత్సన్నం ప్రజా నష్టాశ్చ చింతయన్।
ఆసన్నం మరణం రాజా నిర్విణ్ణో వహ్యమన్యత్॥
(కల్హణ రాజతరంగిణి 8, 1187)

దగ్ధమవుతున్న నగరాన్ని చూస్తూ రాజు ప్రజలకు జరిగిన నష్టానికి చింతించాడు. బాధపడ్డాడు. మరణం ఆసన్నమవుతోందని గ్రహించి మరణాన్ని ఆహ్వానించాడు.

సుస్సులుడు చివరి యుద్ధానికి సిద్ధమౌతుంటే, అతని చుట్టు ఉన్న సైనికులు ఆయన  మళ్ళీ గతంలోలాగా రాజ్యం వదిలి పారిపోతున్నాడని అడ్డుకున్నారు.

“ఎటు వెళ్తున్నారు?” అడిగారు.

“హమ్మీరా (గజనీ మహమ్మద్) తో యుద్ధంలో రాజు భిజ్జ ఏం చేశాడో, అదే చేయబోతున్నాను. ఆత్మగౌరవం ఉన్న వ్యక్తి మరణం సమీపిస్తోందని తెలిసి, తన రక్తంతో మాతృభూమిని తడుపుతాడు. నేనూ అదే చేయబోతున్నాను” అన్నాడు.

అది విన్న సైనికులు “మేము బ్రతికి ఉండగా మీకు అలాంటి పరిస్థితి రాదు” అన్నారు. వారు చివరి పోరాటనికి పరుగులిడారు.

పోరాటం ఆరంభయింది. సుస్సలుడు వీరోచితంగా పోరాడేడు. అసంఖ్యాకంగా శత్రుసైన్యాన్ని సంహరించాడు. ఆ రోజు యుద్ధం ముగిసిన తరువాత వెనక్కు వస్తూ సుస్సులుడు కాలి బూడిద అయి అందాన్ని కోల్పోయిన శ్రీనగరాన్ని చూసి దుఃఖించాడు. అలా అందవిహీనమైన శ్రీనగరాన్ని చూస్తున్న అతనికి అన్నింటిపై వ్యామోహం నశించింది. ‘సర్వనాశనమయిన ఈ బూడిద కోసమా ఇన్నాళ్ళూ పోరు జరిపింది?’ అన్న వైర్యాగ్య భావన కలిగింది సుస్సలుడికి. అతని కళ్ళల్లో నీళ్ళు నిండాయి. అప్పటి నుంచీ అతని కంటి నుంచి కారే నీటి ధార ఆగలేదు. నగరం మొత్తం బూడిద కావటంతో, ఇంకా కొన ప్రాణాలలో ఉన్నవారికి తినటానికి తిండి లేదు. బయట నుండి తిండి వచ్చే పరిస్థితి లేదు. ఎందుకంటే నగరం వెలుపల ఉన్న ఆహారాన్నంతా డామరులు దోచుకున్నారు. ఆకలికి అలమటిస్తూ, ఒళ్లంతా బూడిదతో నిండిన కశ్మీరీయులు నల్లగా మాడిపోయిన స్తంభాలలా ఉన్నారు. ఇంకా సర్వ నాశనకారి అయిన యుద్ధం కొనసాగుతోంది. ఇంకా విజయం లభిస్తుందన్న ఆశతో సుస్సలుడు పోరాడుతూనే ఉన్నాడు. ఇంతలో అతని భార్య మరణించిందన్న వార్త సుస్సలుడికి అందింది. అతనికి జీవితేచ్ఛ నశించింది. వరాహమూలలో ఉన్న తన కొడుకుని శ్రీనగరం రప్పించాడు. చుట్టూ శవాలు, ఎముకల గుట్టలు, కాలి బూడిద అయిన భవనాల నడుమ తన వారసుడు ‘జయసింహుడి’కి రాజ్యం అప్పగించాడు సుస్సలుడు. జయసింహుడికి రాచరిక చిహ్నాలు అందజేశాడు తప్ప, రాజ్యపాలన అధికారం ఇవ్వలేదు.

జయసింహుడు రాజయిన వెంటనే పరిస్థితి మారిపోయింది. వీరోచితంగా పోరాడుతూ శత్రువులను దూరం పెట్టాడు జయసింహుడు. ఆ సంవత్సరం వర్షాలు బాగా పడ్డాయి. పంటలు బాగా పండాయి. దాంతో పరిస్థితి కాస్త మెరుగయింది. కానీ కశ్మీరుకు శాంతి రానీయకుండా కొందరు సుస్సలుడికి, జయసింహుడి గురించి చాడీలు చెప్పారు. అవి నమ్మి సుస్సలుడు, జయసింహుడిని బంధించమని నమ్మకస్తులను పంపాడు. ఇది జయసింహుడిని బాధించింది. నిజానిజాలు తండ్రికి వివరించాలని శ్రీనగరం బయలుదేరాడు జయసింహుడు.

జయసింహుడు రాజధానికి రాకుండా దారిలోనే అతడిని సముదాయించి వెనక్కి పంపే ఏర్పాట్లు చేశాడు సుస్సలుడు. జయసింహుడికి నిజం తెలుసు కాబట్టి అతడు దాడి చేస్తే తాను తట్టుకోలేనని సుస్సలుడికి తెలుసు. అందుకని జయసింహుడు అప్రమత్తంగా లేనప్పుడు అతడిని బంధించాలన్నది సుస్సలుడి ఆలోచన.

ధిగ్రాజ్యం యత్‌కృత్ పుత్రాః పితరేశ్చేత తరమ్।
శంకమానా న కుత్రాపి సుఖం రాత్రిషు శరత్॥
~
పుత్రపుత్రీ సుహృద్భృత్యా యేషాం శంక నికేతనమ్।
విస్రంభ భూర్భూపతీనాం కస్తేషామితి వేత్తి కః॥
(కల్హణ రాజతరంగిణి 8, 1243, 1244)

తండ్రి, కొడుకులు ఒకరిపై ఒకరు అనుమానంతో రాత్రిళ్ళు ప్రశాంతంగా నిద్రపోకుండా చేసేటువటి సింహాసనం, రాజ్యాధికారం ఎందుకు? సంతానాన్ని, భార్యను, స్నేహితులను, సేవకులను నమ్మలేని రాజులు ఎవరిని నమ్ముతారు? అని వాపోతాడు కల్హణుడు.

భవిష్యత్తులో భారతదేశంలో రాజ్యం చేసిన తురక రాజులందరి పరిస్థితి ఇలాంటిదేనని కల్హణుడు ఊహించి కూడా ఉండడు. లేక ఊహించి ఇలాంటి శ్లోకాలు రాశాడా?

కల్హణుడు తన కళ్ళ ముందే జీవన విధానం మారటం చూశాడు. గతంలోని ఔన్నత్యం అంతమై, మ్లేచ్ఛ పద్ధతులు, మ్లేచ్ఛ భావాలు భారతీయ జీవన విధానాన్ని ప్రభావితం చేయటం చూశాడు. ఆ ఆవేదన లోంచి పుట్టిన శ్లోకాలు ఇవి అనిపిస్తాయి. భారతీయ సమాజంలో సంతానాన్ని, భార్యను, స్నేహితులను, సేవకులను నమ్మటం అధికంగా కనిపిస్తుంది. ఇలా అనుమానించటం భారతీయులకు కొత్త. ఈ కొత్త రాబోయే రోజులలో ‘సామాన్యం’ అవుతుందని కల్హణుడు గ్రహించాడు. ఆ ఆవేదనను ఈ శ్లోకాలలో ప్రదర్శించాడు. ‘ప్రశాంతంగా నిద్రపోలేని అధికారం, ఎవరినీ నమ్మనివ్వని అధికారం సాధించీ ఏం లాభం?’ అంటున్నాడు కల్హణుడు.

తనకు మద్దతు నిచ్చేవారినందరినీ అనుమానంతో దూరం చేసుకున్న సుస్సలుడు, ఉత్పలుడనే వాడిని నమ్మాడు. వాడిని చేరదీసి, బుజ్జగించి, బహుమతులు ఇచ్చి ‘భిక్షుచారుడిని హత్య చేసే బాధ్యత’ను అప్పగించాడు. ఉత్పలుడు భిక్షుచారుడి మద్దతుదారు. అతడీ విషయం చెప్పగా, అదను చూసుకుని సుస్సలుడిని హత్య చేయమని వారు ఉత్పలుడిని ఒప్పించారు. అవకాశం కోసం ఎదురుచూస్తున్న ఉత్పలుడి గురించి నిజం తెలిసినా సుస్సలుడు నమ్మలేదు. ఉత్పలుడి  గురించి నిజం చెప్పిన వారినే శిక్షించాడు. పోయే కాలం వస్తే, నమ్మకూడని వారినే నమ్ముతారు అంటాడు కల్హణుడు. ఒక రోజు రాజు ఒంటరిగా ఉన్నప్పుడు ఉత్పలుడు రాజును కత్తితో పొడిచి చంపాడు. అయితే ఉత్పలుడినే రాజు చంపాడని భావించటంతో సైన్యం ద్రోహులపై దాడి చేసింది. ఇంతలో ఉత్పలుడు, రాజభవనం  కిటికీ దగ్గర అందరికీ కనిపించేటట్టు నిలబడి – రక్తం కారుతున్న కత్తిని ఎత్తి పట్టుకుని చూపిస్తూ “రాజును నేనే చంపాను. రాజ సమర్థకులను వదలకండి” అని ప్రకటించాడు. దాంతో రాజ సమర్థకులు పారిపోవటం ఆరంభించారు. వారిపై కుట్రదార్లు విరుచుకుపడ్డారు. ఉత్పలుడు రాజు తలను మొండెం నుంచి వేరు చేసి దాన్ని పట్టుకుపోయాడు.

ఈ వార్త తెలిసిన జయసింహుడు దుఃఖించాడు. అయితే తన బాధను ముఖంలో ప్రతిఫలింపనీయలేదు జయసింహుడు.  జయసింహుడి చుట్టూ ఉన్న శ్రేయోభిలాషులు కొందరు, అతడు రాజ్యం వదిలి సురక్షితమైన స్థలానికి వెళ్ళాలని సూచించారు. మరి కొందరు తండ్రి మరణానికి ప్రతీకారం తీర్చుకోవాలని, సింహాసనం కాపాడుకోవాలని అభ్యర్థించారు.

సుస్సులుడి అడ్డు తొలగటంతో రాజ్యం తనదేనని భిక్షుచారుడు శ్రీనగరం ప్రయాణమయ్యాడు. జయసింహుడు తన ఆలోచనలను బయటపెట్టలేదు. “తెల్లారి ఆలోచిద్దాం” అన్నాడు. ఆ రాత్రి శ్రీనగరం అనిశ్చింతతో గడిపింది. తెల్లవారితే ఏమౌతుందో ఎవరికీ తెలియదు. తెల్లారుతూనే జయసింహుడు నగర రక్షణకు నడుం కట్టాడు. ప్రధాన స్థలాలను రక్షించమని కాపాలాకు పంపాడు. పారిపోయిన సైన్యాన్ని కూడగట్టే ప్రయత్నం చేశాడు.

“ఎవరెవరు బలవంతంగా ఏమేమి దోచుకున్నారో అవి వారికి తిరిగి ఇచ్చేస్తే వారిపై ఎలాంటి చర్య తీసుకోను. అలాగే భయంతో శత్రువును చేరినవారు తిరిగి వెనక్కు వచ్చేయాలి” అని చాటింపు వేయించాడు.

దాంతో ప్రజలు పెద్ద ఎత్తున జయసింహుడి వైపు వచ్చారు. పారిపోయిన సైనికులు వచ్చి రాజును చేరారు. వందమంది కన్నా తక్కువ ఉన్న జయసింహుడి వైపుకు ఇప్పుడు అసంఖ్యాకంగా ప్రజలు వచ్చి చేరారు. ఇలా ప్రజలకు విశ్వాసాన్నిస్తూ, శ్రీనగరంలో అరాచకాన్ని అంతం చేయాలని జయసింహుడు ప్రయత్నిస్తున్న సమయంలో శ్రీనగరంపై ఆధిపత్యాన్ని సాధించేందుకు భిక్షుచారుడు నగర పొలిమేరల్లోకి వచ్చి చేరాడు. అతని వెంట డామరులు, దొంగలు, నేరగాళ్లు, దోపిడీలు చేసేవాళ్ళంతా కలిసి పెద్ద సైన్యం కూడా వచ్చింది.

అయితే జయసింహుడికి ప్రజలు స్పందిస్తున్న తీరు చూసి, భిక్షుచారుడి శ్రేయోభిలాషులు అతడిని శ్రీనగరంలో అడుగుపెట్టవద్దన్నారు. “ప్రజలు జయసింహుడి వైపున్నారు. ప్రస్తుతం పద్మపురం దగ్గర ఆగండి. మేము శత్రువులను అడ్డుకుంటాము. శత్రువును సంపూర్ణంగా ఓడించిన తరువాత మీరు శ్రీనగరంలో అడుగుపెట్టండి” అన్నారు. భిక్షుచారుడు వారి సూచనలను పట్టించుకోలేదు.

‘ఇలాంటి పనికిమాలిన సూచనలను ఇవ్వద్ద’న్నాడు.

సుస్సలుడి మరణంతో, రాజ్యం తనదేనని భిక్షుచారుడు నమ్మాడు. ఎలాగో రాజ్యం తనదేనన్న అలసత్వంలో వెంటనే శ్రీనగరం చేరాలన్నాడు భిక్షుచారుడు.

ఇంతలో కశ్మీరంలో మంచు కురవటం మొదలయింది. దట్టమైన మంచు దారులను కప్పేయటంతో భిక్షుచారుడు కదలలేకపోయాడు.

ఈ సమయాన్ని జయసింహుడు ఉపయోగించుకున్నాడు. పారిపోయిన సైన్యాన్ని కూడగట్టుకున్నాడు. సైన్యంలో ఆత్మవిశ్వాసం నింపాడు. రాజపుత్రుల సహాయంతో భిక్షుచారుడిపై యుద్ధానికి బయలుదేరాడు.

మళ్ళీ కశ్మీరంపై అధికారం కోసం యుద్ధం మొదలయింది.

(ఇంకా ఉంది)

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here