Site icon Sanchika

కశ్మీర రాజతరంగిణి-82

[box type=’note’ fontsize=’16’] కశ్మీర్ ప్రాచీన చరిత్ర గురించి అవగాహన కలిగించి, భవిష్యత్తు గురించి ఆలోచనలు కలిగించాలన్న ప్రయత్నంలో భాగంగా నీలమతపురాణం తరువాత అందిస్తున్న జోనరాజు, శ్రీవరుడు, ప్రజ్ఞాభట్టులు కల్హణుడి అడుగుజాడల్లో నడుస్తూ సంస్కృతంలో రచించిన ‘కశ్మీర రాజతరంగిణి’ అనువాదాన్ని తెలుగు పాఠకులకు అందిస్తున్నారు కస్తూరి మురళీకృష్ణ. [/box]

మాసైశ్చతుర్ధిః స పితృ ప్రమహాహ దనన్తరమ్।
అనన్య శాశనం రాష్ట్రం స్వవేవ సమపాదయత్॥
(కల్హణ రాజతరంగిణి 8, 1544)

[dropcap]భి[/dropcap]క్షుచారుడు ఒక వైపు, జయసింహుడు ఒక వైపుగా సర్వనాశనకారి అయిన యుద్ధం కొనసాగుతూనే ఉంది. యుద్ధం ఒకసారి భిక్షుచారుడు గెలుస్తాడనిపించేట్టు, మరోసారి జయసింహుడు గెలుస్తాడనిపించేట్టు సాగుతోంది. ఈ యుద్ధంలో రాజు జయసింహుడి తరఫున సుజ్జి వీరోచితంగా పోరాడుతాడు. డామరులు అతడిని చంపాలని విశ్వప్రయత్నాలు చేస్తారు. కానీ అన్ని ప్రయత్నాలను సుజ్జి తిప్పికొడతాడు. ఈ సమయంలో జయసింహుడు, తనను వ్యతిరేకించే లావణ్యులకు, డామరులకు ‘లంచం’ ఆశ చూపించి తన వైపుకు తిప్పుకుంటాడు. ఎప్పుడయితే తనకు మద్దతునిస్తున్న డామరులు లావణ్యులు, జయసింహుడికి మధ్దతుగా నిలుస్తున్నారో, అప్పుడు భిక్షుచారుడికి తాను ఓడిపోక తప్పదని అనిపిస్తుంది. ఇక రాజ్యం తనకు దక్కదన్న నిరాశతో అన్నీ వదిలేసి వెళ్లి పోవాలనుకుంటాదు. కానీ, ఇంకా అతనికి విధేయులుగా ఉన్న డామరులు ధైర్యం చెప్తారు. దాంతో మళ్ళీ సింహాసనంపై ఆశ కలుగుతుంది. మళ్ళీ యుద్ధానికి సిద్ధపడుతుంటాడు.

ఒక సందిగ్ధమయ, డోలాయమాన స్థితిలో వ్యక్తుల ప్రవర్తన ఎలా ఉంటుందో కల్హణుడు అద్భుతంగా చూపిస్తాడు. అధికారం నిలుపుకునేందుకు రాజు అయి జైలు పాలయి, మళ్ళీ రాజయిన జయసింహుడు, తనను వ్యతిరేకించిన వారిని తన వైపుకు తిప్పుకునేందుకు అన్ని రకాల ఆశలు చూపుతాడు. కోరికలు తీర్చేందుకు సిద్ధమవుతాడు. వారికి అడిగిన పదవులు ఇచ్చి, వారిని దువ్వుతాడు. వారికి ప్రాధాన్యం ఇస్తాడు. ఇది అంత వరకూ రాజుకు విధేయులుగా ఉంటూ, ప్రాణాలు పణంగా పెట్టి రాజు తరఫున పోరాడుతున్న వారిలో నిరాశను కలిగిస్తుంది. రాజు కోసం ప్రాణాలు పణంగా పెడుతున్న తమను విస్మరించి, రాజును వ్యతిరేకించిన వారికి పెద్ద పీట వేయటం వారిలో క్రోధం కలిగిస్తుంది. రాజు వైపు మళ్ళిన శత్రువులు తాము కోరింది రాజు అందించినంత వరకే రాజుకు విధేయులుగా ఉంటారు. మనస్ఫుర్తిగా రాజుకు విధేయులుగా ఉన్నవారి మనసు విరిగి రాజుకు దూరమవుతారు.

ఆధునిక ప్రజాస్వామ్య రాజకీయాలలోనూ ఇలాంటి పరిస్థితిని చూడవచ్చు. అధికారం కోసం జరిగే పోరాటంలో తమకు మద్దతు నిచ్చిన వారిని విస్మరించి, పోరాటంలో తనను వ్యతిరేకించిన  వారిని ఆకర్షించేందుకు వారికి పెద్ద పీట వేయటం వల్ల, అధికారం సాధించిన తరువాత రాజకీయ నాయకులు తమ విధేయులను దూరం చేసుకోవడం మన కళ్ళ ఎదురుగానే జరుగుతోంది. జయసింహుడు బలహీనమైన స్థితిలో ఉన్నాడు. కాబట్టి, తనను వ్యతిరేకించే శక్తిమంతులను తన వైపు ఆకట్టుకోవాల్సిన అవసరం ఆయనకు ఉంది. కానీ ఆధునిక రాజకీయాలలో సంపూర్ణమైన మద్దతు ఉన్నవారు కూడా ఇలాంటి చర్యలకు పాల్పడి కష్టాలలో ఇరుక్కోవటం గమనించవచ్చు.

భిక్షుచారుడి పరిస్థితి మరో రకం. ఆయన అధికారం అందుకునేంత దగ్గరకు వచ్చి దూరం వెళ్ళిపోతున్నాడు. అందినట్టే అంది అందకుండా పోతున్న అధికారం భిక్షుచారుడిని ఆశ, నిరాశల నడుమ ఊగిస్తూ, అల్లలాడిస్తోంది. నిరాశ బావనలో క్రుంగిపోతూ, ఆశ భావనతో పైకి లేస్తూ, తానేమిటో, ఏం కావాలో, ఏం లభిస్తుందో తెలియక అల్లల్లాడుతున్నాడు భిక్షుచారుడు. ఈ సందిగ్ధ పరిస్థితి అతనిలోని రాక్షసుడిని వెలికి తీస్తున్నది. ఫలితంగా అతడు సుస్సలుడి తలను అతడి కొడుక్కు పంపాడు. శవాన్ని అవమానించాడు. డామరులు పొగిడితే పొంగిపోయాడు. నిరాశలో క్రుంగిపోయాడు. ఆశలు వదులుకుని వెళ్ళిపోవాలనుకున్నవాడు, మళ్ళీ యుద్ధానికి బయలుదేరాడు.

ఈ డోలాయమాన పరిస్థితుల్లో, డామరులు, ఇతరులు ఎవరివైపు మొగ్గాలో తెలియని సందిగ్ధంలో పడ్డారు. భిక్షుచారుడికి మద్దతునిస్తూ జయసింహుడితో మంతనాలు సాగించారు. జయసింహుడికి మద్దతు తెలిపినా, భిక్షుచారుడికి అధికారం దక్కితే తమపై ప్రతీకారం తీర్చుకుంటాడన్న భయంతో, భిక్షుచారుడితో కూడా సత్సంబంధాలు నెరపుతూ రెండు నాల్కల ధోరణిని ప్రదర్శించారు. వీరిని కల్హణుడు నక్కలు, తోడేళ్ళతో పోల్చాడు. ఈ నక్కలు తోడేళ్ళు రెండు సింహాలను పోరాటానికి ఎగదోస్తాయి. వారి పోరాటంలో మరణించిన వారి శవాలను పీక్కుతింటాయి. రెండు వైపులా ఉండడంతో ఎవరు గెలిచినా లాభం నక్కలు, తోడేళ్ళకే.

ఈ సింహాలు, తోడేళ్ళు, నక్కల నడుమ జరిగే పోరాటంలో ప్రజలు నలిగిపోయారు. వీధులు శవాలమయం అయ్యాయి. గ్రామాలు బూడిద కుప్పలయ్యాయి. ఇళ్లు వాకిళ్లు బంధువులను కోల్పోయిన ప్రజలు తమ దేశంలోనే దిక్కులేని వారయ్యారు. తిండి తిప్పలు లేక, ఉండే నీడ లేక అల్లల్లాడిపోయారు. ఆ కాలంలోనే కాదు, ఈ కాలంలో కూడా జరుగుతున్నది అదే. అధికారంకోసం జరిగే  పోరాటాలలో మాడిపోయేది, ఓడిపోయేది, నష్టపోయేది, కష్టపడేది సామాన్య ప్రజలే. లాభాలు పొందేది నాయకులే. ప్రజలను దేశం కోసం పోరాడమంటారు. ఆయుధాలు అందిస్తారు. మత రక్షణకు నడుం కట్టమంటారు. హింసను ప్రేరేపిస్తారు. ప్రజలు కొట్టుకుని చచ్చిపోతే, ఆ శవాల గుట్టల పై నుంచి అధికారం అందుకునేందుకు నడస్తూ వెళ్తారు. అప్పుడు కశ్మీరులో అదే జరిగింది. ఇప్పుడూ అదే జరుగుతోంది!

ఒక దశలో యుద్ధం వదిలి మరో దేశం వెళ్ళి ప్రశాంతంగా గడపాలని భిక్షుచారుడు నిర్ణయించుకున్నాడు. తాను గెలవలేనీ యుద్ధం అన్న నిరాశలో పడిపోయాడు. అప్పుడు, అతనికి మద్దతుగా నిలిచిన డామరులు కొందరు “తొందరపడవద్దు. జయసింహుడు తన దగ్గర ఉన్న డామరులను ఏదో ఒక రోజు హింసిస్తాడు. అప్పుడు జయసింహుడికి మద్దతు నిస్తున్న డామరులు తిరుగుబాటు చేసి నిన్ను రాజుగా ఆహ్వానిస్తారు. కాబట్టి మనం అందరి మద్దతు కూడగట్టుకుని రాజధానిపైకి వెళ్దాం” అన్నారు. వారి మాటలను నమ్మి భిక్షుచారుడు మద్దతు కూడగట్టుకునే ప్రయత్నాలు ఆరంభించాడు. అందువల్ల తాత్కాలికంగా యుద్ధం ఆగింది.

శాంతి తాత్కాలికంగా ఏర్పడడంతో జయసింహుడు తన తండ్రికి, సోదరుడికి అన్యాయం చేసిన వారిని ఏరివేయటం ప్రారంభించాడు. తన తండ్రి మరణించిన నాలుగు నెలల తరువాత కశ్మీరుపై అధికారం సాధించాడు జయసింహుడు. అయితే ఇది సంపూర్ణమైన అధికారం కాదు. శత్రువు దగ్గరలోనే ఉండి మద్దతు చేకూర్చుకుంటున్నాడు. రాజ్యంలోనే పలువురి విధేయత ప్రశ్నార్థకం. వారి మద్దతు జయసింహుడి వైపు ఉన్నా వారి దృష్టి భిక్షుచారుడి వైపు ఉంది.

శ్రీనగరంలో ఒక్క ఇల్లు కూడా లేదు. ప్రజలకు తిండి లేరు. రాజ్యమంతా డామరులు నిండిపోయారు. ఈ మధ్యలో జయసింహుడు రాజయ్యాడు. తరువాత జైలు పాలయ్యాడు. మళ్ళీ రాజయ్యాడు. తనను వ్యతిరేకిస్తున్న వారందరికీ క్షమాభిక్ష ప్రసాదించాడు. ఇది భిక్షుచారుడి పరిస్థితిని బలహీనం చేసింది. గతంలో రాజులు అనుసరించిన పద్ధతికి భిన్నంగా వ్యవహరించటం జయసింహుడికి లాభించింది.

అయితే కశ్మీరంలో మంచు దట్టంగా కరియటం వల్ల భిక్షుచారుడు కూడగట్టుకున్న సైన్యం శ్రీనగరంపై దాడి చేయలేక ఆగింది. దట్టమైన మంచు కరగగానే తాము దాడి చేసి జయసింహుడిని గద్దె దింపి భిక్షుచారుడికి అధికారం కట్టబెడతామని డామరుల నమ్మకం. హిమం వల్ల రక్షింపబడ్డ జయసింహుడిని వారు వ్యంగ్యంగా ‘హిమరాజు’ అని పిలిచి వెక్కిరించేవారు.

భిక్షుచారుడు మంచు కరగటం కొసం ఎదురుచూస్తున్న సమయంలో జయసింహుడు, లక్ష్మకుడనే  వాడి సహాయంతో భిక్షుచారుడి అనుచరులందరినీ తన వైపు తిప్పుకున్నాడు. భిక్షుచారుడి అనుచరులను తన సమర్థకులుగా  మలచుకున్నాడు. మంచు కరగగానే భిక్షుచారుడు శ్రీనగరంపై దాడికి బయలుదేరాడు.

ఇది రాజు వైపు ఉన్న డామరులలో కలవరం కలిగించింది ఒకవేళ భిక్షుచారుడు రాజయితే తమపై ప్రతీకారం తీర్చుకుంటాడని భయపడ్డారు. వారు రాజపురికి చెందిన సోమపాలుడిని రహస్యంగా కశ్మీర సింహాసనానికి ఆహ్వానించారు. సోమపాలుడు తన దూతలను పంపించాడు. వారు, భిక్షుచారుడిని రక్షించే నెపంతో భిక్షుచారుడిని అంటి పెట్టుకున్నారు. యుద్ధం మళ్ళీ మొదలయింది.

వీరుడు సుజ్జి గంభీర నది వద్దకు సైన్యంతో చేరాడు.

నదికి రెండు వైపులా శత్రు సైన్యాలు మొహరించి ఉన్నాయి.

సుజ్జి సైన్యం నదిపై వంతెన నిర్మించడం ప్రారంభించింది. ఈలోగా కొద్దిపాటి సైన్యంతో సుజ్జి పడవలలో నది దాటాడు. అతనిపై శత్రుసేనలు విరుచుకుపడ్డాయి. సుజ్జి శత్రువులకు చిక్కడం తథ్యమనుకున్న సమయంలో వంతెన దాటి సుజ్జి సైన్యం వచ్చింది. దాంతో భిక్షుచారుడి సేనలు వెనక్కి తగ్గక తప్పలేదు. తిరుగుబాటుదార్లు పారిపోవాల్సి వచ్చింది. సుజ్జి వారిని వెంబడించాడు. భిక్షుచారుడి వెంట ఉన్న సోమపాలుడి దూత కూడా ప్రాణాలు అరచేత పెట్టుకుని పారిపోవాల్సి వచ్చింది. ‘నక్క ఆడసింహం కోసం ఆశపడితే ఎలా ఉంటుందో, సోమపాలుడు కశ్మీర సింహాసనం కోసం ఆశపడడం అలా గుంద’ని అనుకున్నాడు.

సుజ్జి వీరోచిత పోరాటంతో కశ్మీర రాజు శక్తివంతుడయ్యాడు. భిక్షుచారుడిని వదిలి రాజు వైపుకు వచ్చేందుకు ఒకరితో ఒకరు పోటీపడసాగారు. కశ్మీరు సింహాసనం కోసం ఆశ పడ్దా, తన ఆశను బహిర్గతం చేయని సోమపాలుడు కశ్మీర రాజు జయసింహుడికి మద్దతు ప్రకటించి, భిక్షుచారుడికి ఆశ్రయం ఇవ్వ నిరాకరించాడు. దాంతో భిక్షుచారుడు, కశ్మీరుకు దూరంగా ఉన్న ‘సుల్లరి’లో తల దాచుకున్నాడు. తగిన అవకాశం కోసం ఎదురుచూడసాగాడు. ఇలాంటి పరిస్థితులలో జయసింహుడి పాలన ఆరంభమయింది.

నిరంతర యుద్ధాల వల్ల రాజ్యంలో శాంతి భద్రతలు కరువయ్యాయి. ప్రజలకు ఇళ్లు, వాకిళ్ళు లేవు. ఆదాయం లేదు, పంటలు లేవు, ఆహారం లేదు. దాంతో దోపిడీలు అధికమయ్యాయి. ఎవరి మాట ఎవరూ వినే పరిస్థితి లేదు. సలహాలు ఇచ్చేవారెవరూ లేరు. చివరికి రాజుకు సైతం సలహాలు ఇచ్చేవారు లేరు. అధికారులలో నీతి నియమాలు లేవు. ఎదుటివాడిని మోసం చెయ్యటమే ప్రతి ఒక్కడి లక్ష్యం. జయసింహుడు రాజ్య పాలనపై దృష్టి పెట్టినప్పటి పరిస్థితి ఇది. జయసింహుడికి సంబంధించి కల్హణుడు శ్లోకాలు రాయటంలోనే జయసింహుడి పట్ల అతని గౌరవభిమానాలు వ్యక్తం అవుతాయి.

జయసింహుడి పాలన నాటి పరిస్థితుల గురించి వివరంగా చెప్పటం ఎందుకంటే, ఆయన పాలనా విధానాన్ని విశ్లేషించే సమయంలో వీటిని పరిగణనలోకి తీసుకుంటారని అంటాడు కల్హణుడు. “ప్రస్తుతం జయసింహుడి గుణగణాలు కొద్దిగా చెప్తాను, ఎందుకంటే భవిష్యత్తులో తరచుగా అతని గుణగణాలను ప్రస్తావించవలసి వస్తుంది కాబట్టి” – అంటాడు. చాలా లోతయిన వ్యక్తిత్వాలను విశ్లేషించడం అంత సులభం కాదు. ఇందుకోసం అతను రాజయే ముందు సత్యాలను, రాజయిన తరువాత సంఘటలను తెలుసుకుని ఆలోచించి అంచనా వేయాల్సి ఉంటుంది అంటాడు. సమకాలీనుడయిన రాజు గుణగణాలను నిష్పాక్షికంగా, సత్యాల ఆధారంగా విశ్లేషించాలి అంటాడు. అంతే కాదు, ఒక వ్యక్తి గురించి సంపూర్ణంగా తెలుసుకోవడం కుదరదు, ఎందుకంటే ‘మంచి’ గురించి ప్రతి ఒక్కరికి తనదైన ప్రత్యేక అభిప్రాయం ఉంటుంది అంటాడు. ఎవరెవరికి మనం చెప్పే గుణాలు నచ్చుతాయో, వారు మనం చెప్పేది సత్యం అని అంటారు. నచ్చని వారు మనం కల్పించి చెప్తున్నామో, అబద్ధం చెప్తున్నామో అని అంటారు. కాబట్టి మనం సత్యం చెప్పినా, ఎదుటి వ్యక్తి అభిప్రాయానికి అది వ్యతిరేకంగా ఉంటే దాన్ని ఆమోదించడు. ఇలాంటి పరిస్థితులలో  మనం సత్యం అనుకున్నది చెప్పటం తప్ప మరో విషయాన్ని పట్టించుకోకూడదు అని జయసింహుడి గుణగణాలను వర్ణించటం ప్రారంభిస్తాడు కల్హణుడు.

ఈ సందర్భంగా కల్హణుడు ఒక గొప్ప సత్యం చెప్తాడు. ప్రతి వ్యక్తికీ తాను అనుభవించి, తన బుద్ధికి అర్థమయ్యేదే సత్యం అనుకుంటాడు. మరెవరు సత్యం చెప్పినా దాన్ని నమ్మడు. ఇలాంటి పరిస్థితుల్లో ఎవరయినా, తాను చెప్తున్నదే ‘సత్యం’ అని అందరూ తాను ప్రకటించిన సత్యాన్ని స్వీకరించి, ఆమోదించాలని అనటం ఎంత వరకూ సమంజసం? ప్రస్తుత ప్రపంచంలో సమస్యలన్నీ నేను చెప్పినదాన్ని నమ్మినవాడే నా వాడు; నమ్మనివాడు నా శత్రువు; వాడికి జీవితార్హత లేనేలేదని నమ్మి ఆచరించటం వల్ల ఉత్పన్నమవుతున్నవే. ఇందుకు భిన్నంగా సత్యం ఒకటే, దాన్నే పలువురు పలురకాలుగా దర్శిస్తారు, ప్రకటిస్తారు అన్న విశ్వాసం విస్తరిస్తే, ఆచరిస్తే ‘అశాంతి’ దూరమవుతుంది. సహనం పెరుగుతుంది. కానీ ఈ సత్యాన్ని అందరూ ఆమోదించటం కూడా కష్టమే!

(ఇంకా ఉంది)

Exit mobile version