[box type=’note’ fontsize=’16’] కశ్మీర్ ప్రాచీన చరిత్ర గురించి అవగాహన కలిగించి, భవిష్యత్తు గురించి ఆలోచనలు కలిగించాలన్న ప్రయత్నంలో భాగంగా నీలమతపురాణం తరువాత అందిస్తున్న జోనరాజు, శ్రీవరుడు, ప్రజ్ఞాభట్టులు కల్హణుడి అడుగుజాడల్లో నడుస్తూ సంస్కృతంలో రచించిన ‘కశ్మీర రాజతరంగిణి’ అనువాదాన్ని తెలుగు పాఠకులకు అందిస్తున్నారు కస్తూరి మురళీకృష్ణ. [/box]
[dropcap]జ[/dropcap]యసింహుడు తనపై తిరుగుబాటు చేసిన వారిని, విప్లవాలు లేవదీసిన వారిని అణచివేసి కశ్మీరానికి శాంతిని సుస్థిరత్వాన్ని సంతరించి పెట్టడంతో కల్హణుడు రచించిన రాజతరంగిణి అయిపోతుంది.
తన వ్యతిరేకులందరినీ అణచివేసిన తరువాత జయసింహుడు పాలన వైపు దృష్టి పెట్టాడు. కశ్మీరంలోని వివిధ మఠాలలో ఉన్న ధనాన్ని సంరక్షించే వ్యవస్థను ఏర్పాటు చేశాడు. దేశ నిర్మాణంపై దృష్టి పెట్టాడు. నగరాలలో పెద్ద పెద్ద వీధులను నిర్మించాడు. వాటిని నిరంతరం శుభ్రంగా ఉంచి, సరైన రీతిలో వీధులను నిర్వహించే పంచాయితీలను ఏర్పాటు చేశాడు. అంటే, పలు రకాల యుద్ధాలతో, హింసతో అల్లకల్లోలమై అవ్యవస్థలోకి దిగజారిన కశ్మీరాన్ని సువ్యవస్థితంగా నిర్మించే వైపు దృష్టి పెట్టాడన్న మాట జయసింహుడు. పలు రకాల మఠాలు నిర్మించాడు. ఆ మఠాలలో అతిథి అభ్యాగతుల సేవకు వ్యవస్థను ఏర్పాటు చేశాడు. తనకు విధేయులుగా ఉన్న వారికి ఎలాంటి అవసరాలు పడినా జయసింహుడు స్వయంగా దగ్గరుండి తీర్చేవాడు. జయసింహుడి సత్ప్రవర్తన, సచ్చీలం వల్ల, దుష్ట భావాలున్న వారు కూడా తమ దౌష్ట్యం విడిచి సన్మార్గంలో ప్రయాణించారు. ప్రజల క్షేమం కోసం పలు రకాల చట్టాలు చేశాడు. ప్రజలు ఇబ్బందులు పడకూడదని పలు రకాల చర్యలు చేపట్టాడు. ఇలా జయసింహుడు అనేక ధార్మిక కార్యాలు నిర్వహించి ఎంతో పుణ్యం కూడగట్టుకున్నాడంటాడు కల్హణుడు.
అధికారం కోసం ఆశపడడం సహజమే అయినా అధికార సాధన కోసం అడ్డదారులు త్రొక్కటం వల్ల అధికారం అందుతుందో లేదో తెలియదు కానీ రాజ్యం అల్లకల్లోలం అవుతుంది. రాజ్యం బలహీనమవుతుంది. అదృష్టవశాత్తు కశ్మీరులో జయసింహుడి వంటి దృఢచిత్తుడు, అవసరమైతే మోసం చేసయినా రాజ్యాన్ని సుస్థిరం చేయగలిగినవాడు ఆ సమయంలో రాజుగా ఉండడం వల్ల కశ్మీరుకు శాంతి సిద్ధించింది. దాంతో అల్లకల్లోలమైన కశ్మీరానికి తాత్కాలికంగా నయినా ఊరట లభించింది.
అయితే కశ్మీరానికి శాంతి అన్నది తాత్కాలికమే అని నిరూపిస్తూ కమలియ సోదరుడు ‘బాణలింగం’ అన్న పేరిట ఓ సామ్రాజ్యాన్ని ఏర్పాటు చేసుకున్నాడు. అతడికి ఈ పనిలో సహాయం చేసినవారు, జయసింహుడిని ఓడించేందుకు అతని వ్యతిరేకులు కశ్మీరానికి రప్పించిన మ్లేచ్ఛ మూకలు. దాంతో కమలియ సోదరుడు నిరంతరం తురుష్కులతో తిరిగేవాడు. వాళ్ళు చెప్పినట్టు వినేవాడు. వాళ్ళ పద్ధతులు నేర్చుకున్నాడు. వారిని అనుసరించేవాడు. అతడు అత్యంత క్రూరుడిగా తయారయ్యాడు. ప్రజలను హింసించటం, దోచుకోవటం తప్ప మరేమీ తెలియదు అతడికి. తురుష్క సంపర్కంతో క్రూరుడయ్యాడు. అయితే తన తప్పు గ్రహించిన అతడు వితస్త నదీ తీరంలో శివలింగాన్ని ప్రతిష్ఠించాడు. జయసింహుడి సత్ప్రవర్తన, దుష్టులలో కూడా మంచిని వెలికి తెచ్చింది. జయసింహుడు తన కూతురి వివాహం సోమపాలుడి కొడుకు భూపాలుడితో చేశాడు. ఇది ఇరువురికీ లాభదాయకంగా పరిణమించింది. భూపాలుడు రాజ్యానికి వచ్చిన తరువాత అతడు జయసింహుడి సహాయంతో ఫ్రిజ్జ, అంగదుల రాజ్యాన్ని గెలుచుకున్నాడు. ఆ రకంగా కశ్మీరు సామ్రాజ్య విస్తరణలో తన వంతు కర్తవ్యం నిర్వహించాడు భూపాలుడు. చివరికి 22 సంవత్సరాలు పాలించి, కశ్మీరానికి సుస్థిరతను సాధించి, సాంత్వననిచ్చి, ఐశ్వర్యాన్ని కశ్మీరానికి తిరిగి తెచ్చిన జయసింహుడు మరణించాడు. కశ్మీరు ప్రజల పుణ్యం వల్ల జయసింహుడు సుదీర్ఘ కాలం రాజ్యం చేయగలిగాడు అంటాడు కల్హణుడు.
జయసింహుడి మరణంతో కల్హణుడి రాజతరంగిణి ఆగిపోతుంది. ఆ తరువాత చరిత్రను కల్హణుడు చెప్పలేదు. కల్హణుడు చరిత్రను ఉన్నదున్నట్టు నిర్మొహమాటంగా చెప్పగలగటానికి ప్రధాన కారణం ఆయన ఏ రాజాశ్రయం ఆశించలేదు. స్వతంత్రుడిగా, స్వచ్ఛందంగా కావ్య రచన కావించాడు. తాను చెప్పాలనుకున్నది నిష్కర్షగా, నిర్మొహమాటంగా చెప్పాడు. సుదీర్ఘ కాల కశ్మీర చరిత్రను రచించటం వల్ల మానవ జీవితంలోని తాత్కాలిక ఆవేశకావేశాలు, స్వార్థాలు, దుశ్చర్యలు ఏ రకంగా దీర్ఘకాలిక దుష్ప్రభావాలకు కారణాలవుతాయో విశ్లేషించే వీలు చిక్కింది కల్హణుడికి. ఒక వ్యక్తి తన తాత్కాలిక లాభాలు ఆశించి దుశ్చర్యలు నెరపితే, ఆ దుశ్చర్యల ఫలితాలు అతని వంశం వారు, భావి తరాల వారు అనుభవిస్తారని రాజుల కథల ద్వారా ప్రదర్శించే వీలు లభించింది కల్హణుడికి. అందుకే అధికారం, ఐశ్వర్యాల కన్నా సత్ప్రవర్తన, సచ్చీలం, ధర్మపాలనలు వ్యక్తికే కాదు భావితరాలకు కూడా రక్షణ కవచంలా కాపాడుతాయని రాజతరంగిణిలో తరంగాల రూపంలో వస్తూ, ఎగసిపడి, వెనక్కు మళ్ళి కాలమనే సముద్రంలో కలసిపోయే రాజులు, రాజ వంశాల గాథలను గ్రంథస్థం చేయడం ద్వారా ప్రదర్శించాడు కల్హణుడు.
గోదావరి నది సప్తముఖాలుగా విస్తరించి ఉన్నత తరంగాలతో విలసిల్లే సముద్రంలో కలసినట్టు, రాజులనే నదులు రాజతరంగిణిలో, తరంగాల రూపంలో ప్రవహిస్తూ కాల సముద్రంలో కలసిపోయారు అంటూ అష్టమ తరంగాన్ని ముగిస్తాడు కల్హణుడు.
ఇక్కడ గమనించాల్సిందేమిటంటే, కల్హణుడు రాజతరంగిణి ‘సంపూర్ణం’ అనలేదు. అష్టమ తరంగం సమాప్తం అన్నాడు. అంటే, ఆయన ఇంకా రాజతరంగిణిని కొనసాగించాలని అనుకున్నట్టు అనిపిస్తుంది. కానీ అనివార్య కారణాల వల్ల రాజతరంగిణిని ఆయన కొనసాగించలేక పోవటంతో జయసింహుడి మరణంతో కల్హణ రాజతరంగిని ముగుస్తుంది.
మళ్ళీ దాదాపుగా రెండు వందల ఏళ్ళ తరువాత జోనరాజు అనే భట్టు బ్రాహ్మణుడు రాజతరంగిణి రచన కొనసాగించినప్పుడు కశ్మీరం సంపూర్ణంగా రూపాంతరం చెందింది. కశ్మీరం సంపూర్ణంగా తురుష్కమయం అయ్యేందుకు రెండు మూడు వండల ఏళ్ళు పట్టటానికి జయసింహుడు ఏర్పరిచిన పటిష్టమైన వ్యవస్థ ఒక కారణం. ఈ విషయాలన్నీ జోనరాజు తాను రచించిన రాజతరంగిణిలో ప్రదర్శించాడు. అయితే, జోనరాజు రాజతరంగిణిని తురుష్క రాజుల పాలనలో రచించాడు. కల్హణుడిలా ఆయన సర్వస్వతంత్రుడు కాదు. అయినా సరే, తన కవితాశక్తిని ఆధారం చేసుకుని తాను చెప్పాలనుకున్న చేదు నిజాలను చక్కెర పూసి మరీ చెప్పాడు. మార్మికంగా చెప్పాడు. పైన ఒక అర్థం లోన మరో అర్థం వచ్చేట్టు చెప్పాడు. అప్రియ సత్యాలను ప్రియంగా అనిపించే అబద్ధాల నీడలలో దాచి చెప్పాడు. ఒక వారం విరామం తరువాత తెలుగులో తొలిసారిగా జోనరాజ విరచిత ద్వితీయ కశ్మీర రాజతరంగిణి వ్యాఖ్యాన సహిత అనువాదం ఆరంభిద్దాం!
(కల్హణ రాజతరంగిణి సమాప్తం. 26-6-2022 సంచిక నుంచి జోనరాజ విరచిత ద్వితీయ కశ్మీర రాజతరంగిణి ఆరంభం).