[dropcap]ఆ[/dropcap]కాశపు అంచుల్ని తాకుతూ
స్వేచ్ఛనే జయించే తాయిలమేదో
అరకమోసే
ఆ చెమట చుక్కలెపుడూ
చెబుతూనే వుంటాయి..
పచ్చని వాకిళ్ళ మధ్య ….
అన్నదాతల కథల వ్యథలు….
మందిలో మర్మమెరిగిన మనసు
శూన్యపు లావాను పలకరించి
మొండి మొనల్ని తడుముకుంటూ
శుద్దముక్కతో బీజాక్షరాల హేతువు
నాటి సమాజపు పందిరి తీర్చిదిద్దే
ఆ చేతులెపుడూ చెబుతూనే వుంటాయి…
నల్లబల్లపై శ్వేతాక్షర మాలగా
చిట్టి చీమల ప్రపంచాన్ని…
జాలి లేని దారిలో
నమ్మిన విశ్వాసంలో
ముళ్ళ కిరిటాన్నీ మన్నించి
ఆత్మగౌరవ అస్థిత్వాన్ని నిలబెట్టే
సామ్యమేదో సామాన్య మధ్యతరగతి
గదిలో వల్లెవేసే పాఠలేవో
చెబుతూనే వుంటాయి. …
జీవిత సాగరంలో ఈదే
చేప పిల్ల కథల తరగలను…
ఆశలు ఆవిరిచేసే
ఆంక్షల వలయాలు చుట్టుముట్టినా
క్రొత్త చిగురులేసి
సృజనకు పట్టం కట్టే ఊపిరులన్నీ
ఉజ్వల భవితలో పునాదులై
నిశిని వెలివేసే వెన్నెల ఝరులన్నీ
చెబుతూనే వుంటాయి….
శకలాలుగా రాలే అమ్మ రెక్కల కష్టాన్ని…
బాధనీ వెలితినీ తవ్వుకునే
తీతువులమైనా….గుప్పెడు ఔదార్యపు
వాక్యాలతో…
జీవిత నిఘంటువులోని ప్రతి జీవీ
కష్టజీవుల జాబితాలో ముందు వెనుక
తరతమ భేదాలు లేని
సామ్యవాద పరిమళమేదో
ఒంటికి రాసుకునే వుంటాయి….
రేపటికి ఓ వెలుగు వాకిలిని తెరిచుంచాలని…!