కాశీపట్నం చూడర బాబూ – పుస్తక పరిచయం

1
1

[dropcap]మ[/dropcap]ణి వడ్లమాని రచించిన ఈ నవల తొలుత జాగృతి వారపత్రికలో ధారావాహికంగా ప్రచురితమైంది. ఇది రచయిత్రి రెండో నవల.

***

“వడ్లమాని మణి ‘కాశీపట్నం చూడర బాబూ’ అని ఒక నవల రాశారు. పేరులోని తెలుగుతనం నవలలో కూడా వుంది. ఇది ఒక ప్రయాణం. ప్రయాణం అంటేనే ఎంతోమంది వుంటారు. ఈ నవలలోనూ వున్నారు. ఎన్నో పాత్రలు అతివేగంగా వచ్చేసి మొదట్లో గాభరా కలిగించినా, రైలు ఎక్కగానే హడావిడిగా వున్నా కాసేపటికి అంతా సర్దుకున్నాక ప్రయాణం సాఫీగా సాగినట్లూ సాగుతుంది. పాత్రలు చాలా వున్నా అన్నీ సజీవమైన పాత్రలు. ఇది చిన్న నవలే. కథ అంశమూ చిన్నదే. కాకపోతే ఆపకుండా చదివించింది” అని “నవల. సాహితీ ప్రపంచంలో అగ్రస్థానం పొందిన ప్రక్రియ” అనే ముందుమాటలో పొత్తూరి విజయలక్షిగారు అభిప్రాయపడ్డారు.

***

“ఇది కాశీ ప్రయాణం కథ. ఒక యాత్రావర్ణన లాంటిది. ఈ యాత్రలో కొందరు కుటుంబాలతోనూ, కొందరు ఒంటరిగానూ ప్రయాణం చేస్తున్నారు. కాని, ఒంటరిగా ప్రయాణిస్తున్నవాళ్ళ వెనక కూడా కుటుంబాల నేపథ్యాలున్నాయి. “కాశీపట్నం చూడర బాబూ” అని కాశీపట్నం పెట్టె గ్రామాల్లో చూపించే రోజుల నుంచి, తమ ఎదుట ఉన్న మనిషి గురించి గూగుల్ శోధించి మొత్తం సమాచారం క్షణాల్లో సేకరించే రోజులదాక  మూడు తరాల వాళ్ళు కలిసి చేస్తున్న ప్రయాణం గురించి చెప్పిన చెప్పిన కథ ఇది.”

“మామూలుగా మనం కాశీయాత్ర ఆముష్మికానికి సంబంధించిన దనుకుంటాం. కానీ, ఆ ప్రయాణం పొడుగుతా మనకి పరిచయమయ్యేది ఇహలోక సమస్యలే. మానవ సంబంధాల చుట్టూనే ఈ కథ నడుస్తుంది. తల్లిదండ్రులూ, పిల్లలూ, అత్తమామలూ, అల్లుళ్ళూ, కోడళ్ళూ, తాతలూ, మనవలూ, భార్యాభర్తలూ, ప్రేయసీ ప్రేమికులూ – వివిధ రకాల ఈ భూమికల్ని పోషిస్తూ మనుషులు సాధించగలిగినవీ, సాధించలేకపోయినవీ మన కళ్ళ ముందు కదలాడతాయి. అంతిమంగా వాళ్ళంతా ఇరుగుపొరుగుగా, సహయాత్రీకులుగా, ఒకరికొకరు మనుషులుగా ఆలంబనగా నిలబడటంతో కథ సమాప్తి చెందుతుంది. ఇంత తక్కువ నిడివిలో ఇంత రసస్ఫూర్తి కలిగించగలగడం మామూలు విషయం కాదు.” అంటారు వాడ్రేవు చినవీరభద్రుడు “సాహిత్య విద్యావంతురాలు” అనే తన ముందుమాటలో.

***

“ఇరుకు దారులు, కుక్కలు, ఆవులు, మనుష్యులు, డబ్పాలాంటి రిక్షాలు, తుపాకీలు పట్టుకొని మిలటరీవాళ్ళు. ఎప్పుడూ చూసినా హడాడావిడిగా, గజిబిజీ. అన్ని రకాల భాషల మాటలతో గందరగోళంగా ఉన్నా, అక్కడ ఏదో ఏదో తెలియని ఆకర్షణ అయస్కాంతంలా పట్టి లాగుతుంది. బహుశా అందుకే కొన్ని వేల సంవత్సరాల నుండి ఈ కాశీని చూడటానికి వస్తూనే ఉన్నారు. నేను కూడా ఆ ప్రేమలో పడిపోయాను. కుల, మత, భాషలకు అతీతంగా మనుష్యులందరూ ఒకే కుటుంబంలోని వ్యక్తులలా కలిసి గడపటం అనేది ఓ అపూర్వమైన అనుభవం. ఒక్కటి మటుకు నిజం! ఈ నవలని ఆధ్యాత్మిక దృష్టికోణంతో కన్నా సాధారణ మనుష్యుల వాస్తవిక దృష్టి కోణంలోనే చూసాను. దాన్నే అక్షరాలుగా మార్చి రాసాను” అన్నారు రచయిత్రి “నా మాట”లో.

***

కాశీపట్నం చూడర బాబూ (నవల)
రచన: మణి వడ్లమాని
ప్రచురణ: జె.వి. పబ్లికేషన్స్, హైదరాబాద్
పేజీలు: 104
వెల: రూ.100
ప్రతులకు: అన్ని ప్రముఖ పుస్తక విక్రయ కేంద్రాలు, రచయిత్రి వద్ద.
రచయిత్రి చిరునామా:
మణి వడ్లమాని, 2-2-185/53/3, స్ట్రీట్ నం. 13, సాయి దత్త హాస్పిటల్ ఎదురుగా, సోమసుందర్ నగర్, బాగ్‌అంబర్‌పేట్, హైదరాబాద్-500013.
ఫోన్: 9652067891

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here