Site icon Sanchika

కష్టార్జితం

[శ్రీమతి దాసరి శివకుమారి రచించిన ‘కష్టార్జితం’ అనే కథని అందిస్తున్నాము.]

[dropcap]సా[/dropcap]యంత్రం ఆరయ్యింది. వంశీకృష్ణ తమ అపార్ట్‌మెంట్‍కు వచ్చి కాలింగ్ బెల్ కొట్టాడు. రోజులాగా భార్య రమ్య వచ్చి తలుపు తీయలేదు. ‘తనకంటే ముందే ఇంటికి వచ్చేదే? ఆలస్యమైతే ఫోన్ చేసేది’ అనుకుంటూ తన దగ్గరున్న తాళం చెవితో తలుపు తీసుకుని లోపలికి వెళ్ళాడు. రమ్యకు ఫోన్ చేస్తే స్విచ్ ఆఫ్ అన్న సమాధానమే మాటిమాటికీ వస్తోంది. కంగారుపడి రమ్యతో పాటు పనిచేసే ప్రభకు ఫోన్ చేశాడు.

“మామూలు గానే వచ్చేశామండీ. ఈ రోజు తనేదో సూట్‌కేసుతో వచ్చింది. సాయంత్రం అది తీసుకుని ‘కాబ్’ ఎక్కి వెళ్లి పోయింది. మీతో ఏం చెప్పలేదా?” అన్నది.

“నేను కనుక్కుంటాను లెండి” అంటూ వంశీ ఫోన్ పెట్టేశాడు.

సూట్‌కేస్‌తో ఆఫీసుకు వెళ్ళటం, ఆ తర్వాత దాంతో కాబ్‌లో సాయంత్రం బయటకు వెళ్ళటం,ఫోన్ ఆపేయడం.. ఇవన్నీ ఏంటో! ఎక్కడికి వెళ్ళి వుంటుంది? తను పెద్దవాళ్ళెవరికి ఫోన్ చేసినా కంగారు పడతారు అన్న ఆలోచనలో ఆ రాత్రంతా నిద్ర లేకుండా ఆందోళనగా గడిపాడు. మర్నాడు ఉదయం మామూలుగా అమ్మానాన్నలకు, అత్తామామలకు ఫోన్ చేస్తే – “రమ్య ఆఫీసుకు రెడీ అవుతున్నదా? బాగున్నది గదా?” అన్నారు.

అక్కడికీ వెళ్ళలేదు. తనిప్పుడేం చేయాలి? పోలీసులకేమైనా ఫోన్ చేయాలా? తన ‘ఆఫీసులో మిత్రులతో గాని, ఇరుగు పొరుగు బెంగుళూరు తెలుగు కుటుంబాల వారికి తన భార్య ఇంట్లో నుండి చెప్పకుండా వెళ్ళిందని ఎలా చెప్పాలి?’ అనుకుంటూ రమ్య పని చేసే ‘ఇన్ఫోసిస్’ బ్రాంచ్‌కే వెళ్ళాడు.

మరలా ప్రభకే ఫోన్ చేసి, “ఒకసారి బయటకు రాగలరా?” అని అడిగాడు.

“రమ్య ఆఫీసు లోనే వున్నది. ఫోన్ తనకిస్తాను. మీరే మాట్లాడండి” అన్నది.

అయోమయంలో వున్న వంశీకృష్ణకు ఫోన్‍లో రమ్య గొంతు నెమ్మదిగా వినిపించింది. “సాయంత్రం ఆరింటికి మైత్రి వర్కింగ్ ఉమెన్స్ హాస్టల్‍కు రండి. మాట్లాడుదాం” చెప్పింది.

‘కొత్త కాపురం. పెళ్లై నాలుగు నెలలే అయింది. ఇద్దరి ఆఫీసులు బెంగుళూరు లోనే కాబట్టి వెంటనే కాపురం పెట్టేసుకున్నారు. ఇంతవరకూ తమ కుటుంబాల మధ్య కానీ, తమ మధ్య కానీ ఏ పేచీలు రాలేదు. మరి రమ్య ఇలా చేసిందేమిటి?’ అన్న ఆలోచనలు కందిరీగల్లా వంశీని చుట్టుముట్టసాగాయి.

***

“చూడు వంశీ, నా జీతం నుంచి ఒక్క పైసా కూడా ఇంటి కోసం ఖర్చు పెట్టను. భర్తగా ఇంటి ఖర్చులన్నీ నీవే. చివరకు నేను తిరిగే ‘కాబ్’ ఖర్చులు కూడా నీవే. నా జీతం మొత్తం దాస్తాను.”

“ఇప్పట్నించే పొదుపు చేద్దామనుకుంటున్నావా రమ్యా?”

“నువ్వు ఎలా అనుకున్నా సరే. ఎప్పుడైనా నీకు డబ్బువసరం వచ్చి నా దగ్గర ఏమైనా తీసుకున్నా, తిరిగి ఇచ్చే షరతు మీద మాత్రమే ఇస్తాను వంశీ.”

“కుటుంబం నడిపే సమర్థత నాకున్నది. నీ జీతం నీ ఇష్టం.”

‘ఈ మాటలు తప్పితే రమ్య మిగతా వాటిల్లో ఏం తేడాగా వుండేది గాదు. ఇప్పుడిలా చేసిందేమిటి?’ అనుకుంటూ ఆ సాయంత్రం మైత్రి హాస్టల్‍కు వెళ్ళాడు.

“రమ్యా! కారణం చెప్పకుండా ఇలా ఇల్లొదిలి వచ్చి, రచ్చ చేయటం ఏం బాగా లేదు. ఇంటికి పద. ఏదైనా వుంటే ఇంట్లేనే వుండి తేల్చుకుందాం.”

“రచ్చ చేసేటట్లు మీరు చేశారు. పెళ్లికి ముందు అన్ని విషయలూ మాకు చెప్పలేరు. చెప్పలేదన్న కోపంతోనే నేను ఇలా వచ్చేశాను. మా అమ్మాన్నాలకు ఈ విషయం తెల్పు. ఇంటికి వెళ్ళి మీరూ, మీ అమ్మానాన్నలు నిదానంగా గుర్తు చేసుకోండి. అర్థం అవుతుంది. ప్రస్తుతానికి నేను ఇంకా చెప్పేదేం లేదు. మీరు వెళ్ళచ్చు” అంటూ పిలుస్తున్నా, ఆగకుండా వెళ్ళింది.

***

“వదినగారూ! మా కోడలు రమ్య ఎన్నిసార్లు ఫోన్ చేసినా తీయటం లేదు. కారణం మీరైనా చెప్పండి. మేం ఏ విషయమూ మీ దగ్గర దాచలేదు. కావాలంటే ఏ గుడికొచ్చి ప్రమాణం చేయమంటే అక్కడికొచ్చి చేస్తాం” అన్నది వంశీ తల్లి.

“దాచారని మేమూ ప్రమాణం చేస్తాం. మాటలు అనవసరం. ఇప్పటికైనా మీ పొరపాటు సరిచేసుకోండి. మావారి మాట కూడా ఇదే” అంటూ రమ్య తల్లి ఫోన్ పెట్టేసింది.

***

“రమ్యా! మీ అన్నయ్యకు ఆస్ట్రేలియాలో పి.ఆర్. వచ్చిన కొద్ది నెలలకే మంచి పర్మనెంట్ ఉద్యోగం వచ్చింది. మా మీద ప్రేమతో మమ్మల్ని ఈ పల్లెటూరు వదిలి ఏదైనా టౌనుకు పంపిస్తాడట. మా కోసం మంచి అపార్ట్‌మెంటూ, కారు కొంటానన్నాడు. నెలవారీ లోను కడతానన్నడు. ఈ మాటలుకు మీ నాన్నగారు సంతోషించారు. వచ్చే మహాతల్లి ఎలాంటిదొస్తుందో ఏమో, రెండు మూడేళ్ళ దాకా అన్నయ్యకు పెళ్ళి కూడా చేయం” అన్నది అమ్మ ఫోన్‍లో.

‘అమ్మానాన్నల ఉద్దేశాలు ఇలాంటివా?’ వంశీ కూడా తన తల్లిదండ్రుల మీద ప్రేమతోనే ఒక అపార్ట్‌మెంట్ కొని దాని తాలూకు లోను నెలనెలా 15000/- కడుతున్నాడు. ఆ విషయమే పెళ్ళికి ముందు చెప్పలేదు.

“ఇంకా ముందు మందు ఇంకెన్ని దోచిపెడతాడో? వంశీ కష్టార్జితంతో కొన్న అపార్ట్‌మెంట్ కాబట్టి, వాళ్ళను ఖాళీ చేయించమనండి లేదా అద్దె కట్టమనండి. ఏదో ఒకటి తేలేవరకూ నువ్వు వంశీని బెదిరిస్తూ, హాస్టల్‌కు వెళ్లి పో” అని తనను గడప దాటించారు. ‘తమ విషయం వచ్చేసరికి ఇలా’ అనుకున్నది రమ్య.

ఆ సాయంత్రం వంశీ ఇంటికొచ్చేటప్పటికి ఇంట్లో లైట్లు వెలుగుతున్నాయి. బెల్ కొట్టకుండానే రమ్య వచ్చి తలుపు తీసింది.

Exit mobile version