Site icon Sanchika

కటక్ లో ఉగాదివేడుకలు-పుస్తకావిష్కరణ

ఒడిశా రాష్ట్రంలోని కటక్ నగరానికి ఒక విశిష్టత ఉంది. అశోక చక్రవర్తి కళింగ దేశం మీదకి దండెత్తి కటకం వరకూ తన సామ్రాజ్యాన్ని విస్తరింపజేశాడని చరిత్ర చెబుతోంది. ఆ తర్వాత పదిహేరుగురు పాత్రులు ఉత్కళ దేశాన్ని ఏలారన్నది వాస్తవం.

1936 ఏప్రిల్ 1వ తేదీన భాషా ప్రాతిపాదికన ఓఢ్రదేశం ఏర్పడడం, పొరుగునే ఉన్న ఆంధ్రప్రదేశ్ నుంచి తెలుగువాళ్ళు వలసవచ్చి స్థిరపడ్డారు. వెండితో చేసిన కళాకృతులకు (Filigree works) కటకం ప్రపంచ ప్రసిద్ధి పొందింది. రిక్షా లాగే రింజాతవుడు నుంచి కోటికి పడగలెత్తే కోగాడస్వామి వరకు ఇక్కడ జనజీవన స్రవంతిలో కలిసిమెలిసిపోతున్నారు. ఏది ఏమైనా వాళ్ళు వాళ్ళ మూలాలు మరిచిపోలేదు. సంక్రాంతి, ఉగాది, దసరా పండగలు ఘనంగా జరుపుకొంటుంటారు. ఆ నేపథ్యంలో 22 ఏళ్ళ క్రితం పుట్టింది “ఐక్యత” (Integrated Katak Youth Amity Telugu Association). తప్పటడుగులు వేస్తూ బాల్యం దాటుకొని నేడది ముగ్ధ మోహన ప్రౌఢ అయింది. 18-03-2018 (ఆదివారం) విళంబి ‘ఉగాది’ రోజు సాయంత్రం ఆరు గంటలకు స్థానిక బారాబాటి స్టేడియంలో సెయింట్ జేవియర్ స్కూలు ఆవరణ రంగురంగుల లైట్లతో రమణీయంగా ఉంది. కటక్‌లోని అశేష తెలుగు ప్రజానీకం అక్కడ కుర్చీల్లో ఆసీనులై ఉన్నారు.

పద్మభూషణ్ ప్రొ. యార్లగడ్డ లక్ష్మీప్రసాద్, మాజీ రాజ్యసభ సభ్యులు ముఖ్య అతిథిగా, స్థానిక నియోజకవర్గం శాసనసభ్యుడు శ్రీ దేబాశీస్ సామంత్రాయ్ గౌరవ అతిథిగా వచ్చారు. ద్వీప ప్రజ్వలనతో సభ ప్రారంభమైంది. పంచాంగ శ్రవణం, సాంస్కృతిక కార్యక్రమాలు, పాటలు, నృత్యాలతో అసలైన కొత్త సంవత్సరం అడుగుబెట్టింది. శ్రీకాకుళం నుండి వచ్చిన భారతి రమేష్ ఆర్కెష్ట్రా గాయనీ గాయకులు భక్తి (రక్తి) పాటలతో శ్రోతలను ఓలలాడించారు.

శ్రీ ఎర్రయ్య, చైర్మన్; సుభాష్ నాయుడు, ప్రెసిడెంట్; శ్యాం సుందర్, జనరల్ సెక్రటరీ తదితర కార్యవర్గ సభ్యులు ‘ఐక్యత’ ఆధ్వర్యంలో జరుగుతున్న సామాజిక కార్యక్రమ వివరాలు విశదీకరించారు. స్థానిక పట్టపోలో ప్రాంతంలో ఒకదాత ఇచ్చిన స్థలంలో ఈ సంస్థ స్వంత భవన నిర్మాణం పూర్తి చేసుకోవడం ఒక విశేషం.

దాని పేరే నందమూరి భవన్. అందులో చిన్న ఆసుపత్రి నెలకొల్పి ఉచిత వైద్యం అందించడం, కొన్ని వందల కేటరాక్టు ఆపరేషన్లు జరిపి చూపు లేని వాళ్ళకు చూపు తెప్పించడం, రుద్రభూమి పేరిట స్మశాన వాటికలో ఈశ్వర ప్రతిమ నెలకొల్పి అంతమ సంస్కారానికి వచ్చే ఆర్తులకు నిలవనీడ కల్పించడం యీ సామాజిక కార్యక్రమాలలో కొన్ని ప్రధానాంశాలు.

ప్రొ. యార్లగడ్డ తన ఉపన్యాసంలో ‘ఐక్యత’ సంస్థ ప్రవాసాంధ్రలో చేపట్టిన సామాజిక సేవ, విద్యావ్యాప్తి కృషిని కొనియాడారు. తన స్వంత గడ్డ అయిన ఆంధ్రప్రదేశ్‌లో కూడా జరగని భాషా సేవ ఇక్కడ ప్రవాసాంధ్రులు మాతృభాష పునరుద్ధరణ చేయడం తనకెంతో అమితానందాన్ని ఇచ్చిందని ప్రశంసించారు. తర్వాత రాయగడ నుంచి వచ్చిన రచయిత శ్రీ ఆనందరావు పట్నాయక్ విరచిత “ఆనందరావు కథలు” కథా సంపుటిని ఆవిష్కరించారు. వెండి తెర, బుల్లి తెర మాయలో పడకుండా తమ పిల్లలకు తెలుగు పద్యాలు, పాటలు నేర్పాలని, దీనికి మహిళామణులే ముందుకు రావాలని పిలుపునిచ్చారు పట్నాయక్ గారు.

‘తెలుగు-వెలుగు’ పేరిట ఐక్యత భవన్‌లో తెలుగు బడి ఏర్పాటు చెయ్యటం గురించి వర్కింగ్ ప్రెసిడెంటు శ్రీ కొల్లి శ్రీనివాసరావు వివరించారు. వేసవి సెలవుల్లో, ఆదివారాల్లో బాలబాలికలకు తెలుగు భాష రాయడం, చదవడం నేర్పిస్తామని, సాధ్యమైనంత ఎక్కువ సంఖ్యలో విద్యార్థినీ విద్యార్థులు హాజరయి యీ ప్రాజెక్టుని విజయవంతం చేయాలని పిలుపు నిచ్చారాయన.

సిగ్నేచర్ కంటెస్ట్ పేరిట ఒక పోటీ నిర్వహించి విజేతలకు బహుమతులు అందజేశారు. కార్యక్రమంలో పాల్గొన్న అతిథులకు, కళాకారులకు దుశ్శాలువాలు కప్పి, మెమెంటోలు ఇచ్చి ఘనంగా సత్కరించింది సంస్థ. ఏ దేశమేగినా ఎందుకాలిడినా తెలుగువాళ్ళు తామంతా ఒకే తల్లి బిడ్డలమని నిరూపించారు. 22 మంది డైరక్టర్లు, 13 మంది సలహాదారులతో, 8మంది కార్యవర్గ సభ్యులతో ‘ఐక్యత’ దినదిన ప్రవర్ధమానమయి దేశ విదేశాల్లో విజయబావుటా ఎగరవేస్తుందనడంలో సందేహం లేదు. జై తెలుగు తల్లీ… వందేమాతరం.

Exit mobile version