Site icon Sanchika

కథ అడ్డం తిరిగింది..-1

[కన్నడంలో శ్రీ ప్రేమశేఖర్ రచించిన ‘Niraala Niddeya Nduve’ అనే కథని అనువదించి అందిస్తున్నారు శ్రీ చందకచర్ల రమేశబాబు.]

[dropcap]ని[/dropcap]ద్ర లేకుండా గడిపుతున్న ఎన్నవ రాత్రి ఇది?

లెక్కకందట్లేదు. ఇంకా ఎన్ని రాత్రులు ఇలా? అపరాధ పరిశోధన కథల చక్రవర్తి అనిపించుకున్నవాడికి తన భుజానికెక్కిన ఒక శనిని దులుపుకోవడం చేతకావడం లేదు అంటే ఎలా? ఇది నా చురుకు బుర్రకు, పదును కలానికి అవమానం!

మరుక్షణం ఆలోచన ఇంకో దారి పట్టింది.

కాల్పనిక వ్యక్తుల, కాల్పనిక సమస్యలకు పరిష్కారం కనుక్కోవడం సులభం. కానీ సమస్య నాకే ఎదురైతే? అందులోనూ, ఆ సమస్య నేనే కొనితెచ్చుకున్నదయితే? అన్నీ తెలిసి కూడా ఆ సమస్యలోకి దిగుతూ, గొంతుదాకా మునిగిపోతే?

జీవితంలో మొట్టమొదటిసారిగా ఎదురైన ఈ ప్రశ్నకు సమాధానం దొరకట్లేదు.

ముందుగా ఇది ఒక వరించిన అదృష్టం అనిపించింది. ఇప్పుడేమో అది వీపుకెక్కిన బేతాళుడిలా అయింది. సాహిత్యలోకంలో నేను ఇంతవరకూ సాధించినదంతా మట్టిగొట్టుకుపోతున్నట్టుంది. నా సాహిత్య జీవితానికి మంగళం పాడుతున్నట్టుంది.

నా రాతలే లేనినాడు నా బ్రతుక్కి అర్థమేముంటుంది?

ఏమీ మిగలదు. అంటే జీవితమే మిగలదు అని అర్థం !

‘ఓహ్! నో!!’ ఇలా కాకూడదు.

అంటే ఇంతవరకూ గూఢచారుల చాకచక్యత పైన ప్రాముఖ్యతనిస్తున్న నేను ఇప్పుడు అపరాధి యొక్క చాణక్య బుద్ధిపైన లక్ష్యం పెట్టాలి! ఈ వాస్తవ జీవితంలోని కథలో విజయం సాధించాల్సింది అపరాధే కానీ గూఢచారి కాదు.

ఎందుకంటే ఇక్కడ నేనే ముద్దాయిని!

ముద్దాయిగా నేను విజయం సాధించాల్సుంది. అదీ అరాకొరా విజయం కాదు. దానివలన నా జీవితం బాగుపడదు. నేను నూటికి నూరు, అంతకంటే హెచ్చు విజయవంతుణ్ణి కావాలి. శనిగాడుగా దాపురించిన ఈ శశిగాడిని దులిపేసుకోవాలి.

కానీ ఎలా?

ఇదంతా ప్రారంభమయ్యింది ఒక నెల క్రితం. ఆ శశి తన నవల హస్తప్రతిని నా ముందు పెట్టినప్పుడు.

నా అభిమాని అతడు. ఒక సంవత్సరం నుండి నా పొరుగింటి వాడు కూడా. నా పట్ల అగాధమైన గౌరవం అతడికి. “మీలా నేను కూడా డిటెక్టివ్ కథకుణ్ణి కావాలి సార్. కానీ అవుతానా?” అంటూ వంద సార్లు అడిగాడు. “ఎందుకవవు? తప్పకుండా అవుతావు. సాధన చెయ్యడం మొదలుపెట్టు. నీకు సహాయంగా నేనుంటాను” అని ఆ వందసార్లు కూడా నేను అతడి వీపు తట్టేవాణ్ణి. “గంభీరంగా, నిజాయితీగా సాధన దార్లో వెళ్ళేవాడికి కలం ఎప్పుడూ మోసం చెయ్యదు” అని చెప్పాను.

నన్ను గురువుగా స్వీకరించి, నా మాటను వేదవాక్యమని నమ్మిన శశి సాధన దారిలోకి దిగిపొయ్యాడు. నేనట్టుగానే గంభీరంగా, నిజాయితీగా. అతడి కలం అతడిని మోసగించలేదు.

కానీ నేను “చేశాను”.

తను రాసిన మొదటి నవలను ఒక ఆదివారం ఉదయాన తీసుకొచ్చి నా ముందుంచాడు శశి. “ఇది నా జీవితపు మలుపు సార్” అన్నాడు.

అది నా జీవితపు మలుపు కూడా అవుతుందని ఆ రోజు నాకనిపించలేదు.

అతడు నవలను అందంగా అల్లాడు. ఒక డిటెక్టివ్ నవల రక్తి కట్టాలంటే పత్తేదారే కాదు, నేరస్థుడు కూడా అంతే బుద్ధిమంతుడై ఉండాలి. అతడు పత్తేదారు కంటే రెండడుగులు ముందుండాలి. ఒక అనుకోని మలుపులో ఆ గూఢచారి అతడ్ని వెనక్కి నెట్టి ముందు నిలబడాలి. కథ వేగంగా సాగాలి. పాఠకులను గబగబా పరిగెత్తిస్తూ పోయి అకస్మాత్తుగా పడేసెయ్యాలి అని నేను బోధించిన పాఠాలని నాకంటే బాగా పాలించాడు.

అతడి ‘కసాయివాడి చేతిలో కూన’ ఒక అద్భుతమైన నవల. విషయం, కథనం అన్నిటిలోనూ నవ్యత కనిపించి, అపరాధ పరిశోధన సాహిత్యంలోనే ఒక మైలురాయిగా మారే అన్ని అవకాశాలు నాకు స్పష్టంగా కనిపించసాగాయి. చదువుతూ పోయినట్టల్లా, మొదట మెచ్చుకోలుతో వికసించిన నా మనసు నిదానంగా మత్సరంతో నిండిపోయింది. ఇలాగే సాగితే, పన్నెండు సంవత్సరాలనుండి ఈ సాహిత్యంలో చక్రవర్తిగా వెలుగుతున్న నేను, నా సింహాసనాన్ని అతడికి వదిలేసి, క్రిందికి దిగి, నలుగురిలో ఒకడిగా కనుమరుగవడానికి ఎక్కువ సమయం పట్టదు అనిపించింది. ఇటీవలికాలంలో పదును కోల్పోయిన నా కలానికి శశితో పోటీ చేసే సత్తా ఉన్నట్టు అనిపించలేదు. నా పైన ఉన్న గౌరవం వల్లనో లేక నాతో శతృత్వం ఎందుకు అనో తెలీదు, ఇటివల కొందరు అభిమానులు “మీ దగ్గర సరుకు అయిపోయినట్టుంది సార్” అని చెప్పడం గుర్తుకు వచ్చింది.. ఈ గౌరవం, భయం ఇంకెన్నాళ్ళు? ఆ గౌరవాన్ని నిలుపుకునే సామర్థ్యం నా కలానికి ఉందని అనిపించడం లేదు. శశి నవల చూశాక అయితే నేను అందరి దృష్టినుండి జారిపోవడం ఖాయం.

ఇరవైఏడేళ్ళ శశి ‘కసాయివాడి చేతిలో కూన’ నవల నలభై రెండేళ్ళ నా గొంతుకు ఉరితాడయ్యే సూచనలు కనిపించి నేను విషణ్ణుడనయ్యాను.

కాకతాళీయమన్నట్టు, అదే సమయంలో ఒక పరిచయస్థుడైన డైరెక్టర్ నవనీత్ చంద్రగారి వద్ద నుండి కాల్ వచ్చింది. “కళ్ళు, చెవులు, చేతులు, మనసు అన్నీ దురద పెడుతున్నాయి సార్. ఒక మంచి కథ ఇవ్వండి. సినిమా తీసి దురద పోగొట్టుకుంటాను..” అని.

నా ఆరు కథలు, నవలలను సినిమాలుగా తీసి, రెండి సార్లు రాష్ట్ర పురస్కారం, ఒక సారి జాతీయ పురస్కారం అందుకున్న వాడు నవనీత చంద్ర. ఇప్పుడతడికి లేదన్నానంటే నాకూ, అంతెందుకు నా కలానికే అవమానం.

కానీ నా వద్ధ ఇప్పుడు ఎటువంటు అద్భుతమైన కథ లేదు. కంప్యూటర్లోనూ లేదు, తలకాయలోనూ లేదు. కానీ అదెలా చెప్పేది?

అలాంటి ఒక నిర్ణాయక గడియలో నాకు శశి నవల కనిపించింది.

ఒక్క క్షణం వణికిపోయాను. నా కథలోని, నవలల్లోని దొంగలు, హంతకుల వణుకు కంటే నా వణుకు ఎక్కువే.

మరుసటి రోజు ప్రొడ్యూసర్ గారినుండి కాల్ వచ్చింది. “ఏంటి సార్. మమ్మల్ని మరచిపోయారా? చంద్రన్న అడిగితే మీరేమో ఊ కాని, ఉహూ కాని అనలేదంట! మా వైపునుండి ఏమైనా తప్పు జరిగిందా గురువుగారూ? అలా ఉంటే చెప్పండి, అపరాధ రుసుము చెల్లిస్తాము” అన్నారు ఏడుపు గొంతుతో.

నేనిక నిర్ణయించాను.

శశి రెండు నోటు బుక్కుల్లో రాసుకున్నరెండువందల పుటల నవలను డిటిపి చెయ్యను ప్రారంభించాను. ప్రియాకు తెలియరాదని నా కాలేజ్ ఛేంబర్ లోని కంప్యూటర్ వాడనారంభించాను. మా క్రింది ఫ్లాట్లో తన అక్క బావలతో నివాసమున్న శశి రోజుకోసారి పైకి వచ్చి ‘చదివారా సార్?’ అని అడిగినప్పుడు “ఇంకా లేదు. కొద్దిగా బిజీ” అని అబద్ధం చెప్తూ వచ్చాను. “రాసినాక దాని గురించి ఆలోచించరాదు. దీన్ని వదిలేసి మరో వర్క్ వెంటపడు. రాత పనిలో సమయం వేస్ట్ కారాదు.” అని హితవచనాలు చెప్పాను. పాపం! అతడు “సరే సార్” అన్నప్పుడు నిట్టూర్పు వదిలాను. కొత్తగా అనిపించి, బుర్ర తిన్న దొంగతనం, అబద్దం చెప్పడం ఒక వారం తరువాత అలవాటయిపోయాయి.

‘కసాయి చేతిలో కూన’ ఒక వారంలో కంప్యూటర్ సాక్షిగా అందులో ఇమిడిపోయింది. క్రితం ప్రియాకు చూపించి, తన మెచ్చుకోలు మాటలు విన్న తరువాతే పత్రికలకో, సినిమా దర్శకులకో పంపించేవాణ్ణి. ఇప్పుడంతా రివర్స్ కదా. బ్రతుకు విలువలే రివర్స్ అయినప్పుడు నా నడవడిక రివర్స్ అవడమేమంత ఆశ్చర్యం కాదు. డిటిపి చేసిన నవలను ముందుగా నవనీత చంద్రగారికి మెయిల్ చేసి తరువాత తనకు మెయిల్ చేశాను. ‘ఇంటికొచ్చాక మెయిల్ బాక్స్ తీసి చూడు’ అని రాశాను. వెంటనే మెయిల్ చూసి “తిండి తిప్పలు, నిద్రలతో పాటు నన్ను కూడా మరచిపోయి పొద్దున్నుండి సాయంత్రం దాకా కాలేజిలోనే కూర్చుంటోంది ఎందుకు అని ఆలోచించేదాన్ని. ఇప్పుడు తెలిసింది. ‘ఒళ్ళు గగుర్పొడిచే డిటెక్టివ నవల’ తయారవుతోంది అని” అంటూ ప్రియ నవ్వేసింది. మరుసటి రోజు ఉదయం టిఫిన్ తిని తన ల్యాప్ టాప్ పైన కూర్చుని మొత్తం నాలుగు గంటలు కుర్చీనుండి లేవలేదు. తరువాత లేచిన ప్రియ కళ్ళల్లో కనిపించిన మెరుపు నాలో తెలియని పది రకాల భావనలను రేపింది. “నేను మనసారా మెచ్చుకున్న రచయిత ఎక్కడో తప్పిపోతున్నాడు అని భయం కలిగేదండీ. ఇప్పుడా భయం పూర్తిగా పోయింది. నా ఆరాధ్య దైవం నాకు మళ్ళీ దొరికింది. నాకు చాలా నెమ్మదిగా ఉంది” అంటూ నన్ను హత్తుకుని చెవిలో గుసగుసగా చెప్పినప్పుడు అమూల్యమైనదేదో పోగొట్టుకున్న భావన నాలో. నా విద్యార్థిగా, నా అభిమానిగా, భార్యగా ప్రియ నా జీవితంలోకి ఎక్కి వచ్చిన ఒక్కో మెట్టూ గుర్తుకు రాసాగింది.

రెండు నిమిషాల్లో అంతే వేగంగా “మీకు అలసట అయినట్టనిపిస్తుంది. ముందంతా కథ, నవల రాసి ముగించినప్పుడు కనిపిస్తున్న ఉత్సాహం, ఉల్లాసం ఇప్పుడు మీలో లేవు” అన్నది నా గురించి చింతిస్తూ.

ఆ రోజంతా నేను అన్యమనస్కంగానే ఉన్నాను. మరుసటి రోజు సోమవారం కూడా నాకు అలాగే అనిపించింది. సెలవు తీసుకున్నాను. ఇంటికి కూడా వెళ్ళాలనిపించలేదు. మధ్యాహ్నం చెరువు గట్టు పైన కూర్చుని గడిపాను. అరగంట తరువాత బయలుదేరాను. వేరెక్కడికీ వెళ్ళడానికి రాక మళ్ళీ ఇంటికే వచ్చాను. “కాలేజీలో ఎవరో చనిపోయారు. అందుకే సెలవిచ్చారు” అని అబద్ధం చెప్పాను. “మీకు బాగా కావలసినవాళ్ళా? బాగా డల్‌గా ఉన్నారు” అంది ప్రియ. “సారీ” అన్నాను. గొంతు పెగల్లేదు. “ఏం లేదులే” అన్నాను.

“సంస్మరణ సభ ఉండిందా? మీరు మాట్లాడారా?” ఆమె ప్రశ్నలు ఆగడం లేదు. ఊ కొట్టడం తప్ప నాకేం తోచలేదు. “సరే. షవర్ కింద నిల్చుని రండి. చల్లని నీళ్ళు నెత్తి మీద పడితే హాయిగా ఉంటుంది” అన్నది. ఇప్పుడు నేను నటనలోని రెండో సోపానం ఎక్కాల్సి ఉంది. బాత్రూంకి వెళ్ళి షవర్ క్రింద నుంచుని వచ్చాను. నటన రాటుదేలడం ఇక్కడినుండే ప్రారంభం కానీ అనిపించింది.

ప్రియ చేతిలోని కాఫీ గ్లాసుని పక్కనున్న టీపాయ్ పైన పెట్టి ఆమె వైపే చూస్తూ బెడ్రూం వైపు నడిచాను. తను కిలకిల నవ్వుతూ అనుసరించింది. స్కూలనుండి పిల్లలు రావడానికి ఇంకా చాలా టైముంది.

నేను ప్రియాకు అబద్ధం చెప్పగలిగాను అంటే, తన ఎదుట నటించగలిగాను అంటే నేను ఇక ప్రపంచంలో ఎవరు ఎదుటనైనా నటించగలను. శశి ఎదుటే కాదు, వాడబ్బ ఎదుట కూడా.

సాయంత్రం శశిని వెతుక్కుంటూ నేనే మెట్లు దిగి వెళ్ళాను. వర్క్ ఫ్రం హోమ్ ఒత్తిడిలో ఉన్న అతడు ల్యాప్‌టాప్ నుండి దూరంగా జరిగి నాతో మాట్లాడసాగాడు. కళ్ళలో ఏదో నిరీక్షణ. “నీ నవల చదువుతూ ఉన్నానయ్యా! బావుంది. అద్భుతమైన ప్లాట్. కాని కొన్ని మలుపులు అసహజంగా, అతార్కికంగా అనిపిస్తాయి. బుద్ద్ధివంతులైన పాఠకులు పట్టేస్తారు. మొదటి ప్రయత్నంలోనే వారికి మన పైన విసుగు, నిరాశ అనిపిస్తే పని చెడిపోతుంది. మళ్ళీ వాళ్ళ నమ్మకాన్ని సంపాదించాలంటే పది చెరువుల నీళ్ళు తాగాల్సొస్తుంది.” అంటూ ప్రారంభించాను. అతడి ముఖం నల్లబడడం చూసి తన భుజం తట్టాను. “విచారించొద్దు. నేనున్నాను కదా! అంతా సర్దుతాను. కొంచెం వ్యవధి కావాలి. కాలేజ్‌లో చాలా పనుంటోంది. మా డిపార్ట్‌మెంట్‌లో ఒకాయన పోయి నెల అవుతోంది. ఇంకా ఆయన జాగాలో ఎవరూ రాలేదు. నా నెత్తి పైనే అంతా బాధ్యత. కానీ, నీ నవల మాత్రం అయినంత తొందరగా దిద్ది, సరిచేసిస్తాను. నాకు పరిచయమున్న సంపాదకుడికి నేనే రెకమండ్ చేస్తాను” అన్నాను. అతడి ముఖం వికసించింది. అతడి అక్కయ్య బౌల్‌లో నాలుగ గులాబ్ జామూన్ తీసుకొచ్చి మా ముందుంచింది.

గులాబ్ జామూన్ తినేటప్పుడు నా దృష్టి అతడి ల్యాప్‌టాప్ పైన పడింది. అది పెద్ద అపాయ సూచన!

జవసత్వాలుడిపోయినట్టనిపించింది. సర్దుకున్నాను. “కాదయ్యా! ఇంత మంచి ల్యాప్‌టాప్ ఇంట్లో పెట్టుకుని, నవల మాత్రం పెన్నుతో నోట్ బుక్‌లో రాయడమేమిటి?” అన్నాను.

అతడొక వెర్రి నవ్వు నవ్వాడు. “నాకు టైపింగ్ రాదు సార్. నేర్చుకోలేదు. ఆఫీసు పనుల్లో దాని అవసరం కూడా అంతగా ఉండదు. ఎక్కువగా ఎక్సెల్ షీట్లలోనే పని జరుగుతుంది. అంతగా టైపు చేయాల్సివస్తే కీప్యాడ్ చూసుకుంటూ ఒకే వేలితో దంచుతాను”

“ఔనా” అన్నాను. అయితే ఇతడి నవల సాఫ్ట్ కాపీ లేదు! ఇతడొక నవల రాసాడు అన్నదానికి నాకిచ్చిన రెండు నోట్ బుక్కులు తప్ప ఇంకేమీ దాఖలాలు లేవు!

మనసంతా నిండిన ఆనందపు ఒక్క చినుకు కూడా బయటికి తెలియనీయకుండా బయటికి వచ్చాను. నేనే సృష్టిస్తూ వచ్చిన అనేక పాత్రలను నేనే అనుకరిస్తూ ఉన్నాను ఇప్పుడు!

భగవంతుడా, జీవితంలో ఇదెలాంటి మలుపు!

పది నిముషాల తరువాత నేను విజిల్ వేసుకుంటు మెట్లెక్కసాగాను. నా ఫోన్లో నవనీత చంద్రగారి రెండు మిస్డ్ కాల్స్ ఉన్నాయి. కాల్ చేశాను. అక్కడే ఉన్నట్లు వెంటనే బదులిచ్చారు.

“సూపర్ నవల సార్. ప్రొడ్యూసర్ గారయితే సంతోషం పట్టలేక గెంతులేశారు. నేనయితే ఒక నిమిషం కూడా వృథా చెయ్యకుండా స్క్రిప్ట్ రెడీ చేసేశాను. ఈ సారి కూడా హీరో నీవే అని గగన్‌కు ఫోన్ చేశాను. వాడు కూడా గెంతులేస్తూ ఒప్పుకున్నాడు. హీరోయిన్ రాగిణే ఉండనీ. కానీ కాస్త పొగరు పడింది. తనంతే కదా సార్. బిస్కెట్ వేసి వెయిట్ చేస్తే వచ్చే కుక్క పిల్ల కాదామె. ఊరికే బిస్కెట్ తనకు కనిపించేలా క్రీమ్ బిస్కెట్ వేసి మనది కానట్టు వచ్చేస్తే, పరిగెత్తి వచ్చి కాళ్ళకు చుట్టుకునే పమేరియన్ జాతి కుక్కపిల్ల అని నాకు తెలీదా? మీకూ తెలుసు కదా. విలన్ ఆ కిశోరే ఓకె. క్రితం సారి మీరే కదా సార్ అతడ్ని పంపింది! సూపర్ విలన్ సార్ అతడు! రేపు మాట్లాడతాను అతడితో” డైరెక్టర్ చంద్ర పున్నమ చంద్రుడికంటే ఎక్కువగా విరిసి కనిపించాడు.

ఫోన్ కట్ చేసి క్రింద పెట్టే వేళకి కాలింగ్ బెల్ చప్పుడయ్యింది. తలుపు తీస్తే శశి కనిపించాడు. మొహం పైన గాడమైన గాబరా.

నా ఎద ఝల్లుమంది.

నవనీత చంద్రతో మాట్లాడేటప్పుడు నేను కిటికీ పక్కన నిలబడ్డాను కదూ! గట్టిగా మాట్లాడానా? నవలలోని పాత్రల పేర్లేమయినా నేను గట్టిగా చెప్పానా? చెప్పుంటాను. వంద-వందా యాభై విద్యార్థులున్న క్లాసు రూములో చివరి బెంచీ వాళ్ళక్కూడా వినిపించేలా అరచి అరచి అలవాటయి, ఫోన్లో కూడా అలాగే మాట్లాడుండాలి.

ఛ..

ఎదురుగా నించున్న శశిని చూసి గాబరాపడ్డాను.

అతడు గుసగుసగా చెప్పాడు “ అక్క ఉండింది కదా సార్. అందుకే చెప్పలేదు”

నాకు నెమ్మది అనిపించింది. కానీ పైకి కనిపించనీయలేదు.

నా నటనా కౌశలం రోజు రోజుకీ పెరుగుతోంది! ఇదొక్క సమస్య గడచేదాకా ఇలాగే గడిచేస్తే సరి. దీన్నుండి ఏ రకంగా ఇబ్బంది పడకుండా బయటపడితే అంతే చాలు, మళ్ళీ ఇలాంటి పనికి కలలో కూడా చెయ్యి వెయ్యను.

అతడికి నా మనసులోని కలవరం గురించి అర్థమయినట్టు లేదు. కొంచెం ముందుకు వంగి గొంతు విప్పాడు. “నా భవిష్యత్తే ఈ నవల పైన్ నిలిచుంది సార్”. శశి అలా అనేసరికి నాకు మళ్ళీ గాబరా. కానీ తట్టుకున్నాను. “ఏంటి”అన్నట్టు కనుబొమ్మలు ఎగరేశాను.

“నేనో అమ్మాయిని ప్రేమిస్తున్నాను సార్. నా జిందగీ తను. కానీ తనేమో నాతో ఆడుకుంటోంది. సాఫ్ట్‌వేర్లు వీధికి వంద దొరుకుతారు. ఏదైనా నీదంటూ సాధించి చూపించు. ఇతరులకంటే నువ్వు భిన్నం అని చూపు. అప్పుడు నీ చెయ్యి పట్టుకుని తీసుకెళ్ళి మా నాన్న ముందు నుంచోపెడతాను. లేదంటే మాత్రం ల్యాప్‌టాప్‌లో మొహం దూర్చి కూచోవడమే నీకు గతి” అనింది సార్. తనక్కూడా మీ నవలల పిచ్చి. ఆమె మనసు గెలవాలంటే ఈ నవల ప్రచురణ జరిగి నాకు పేరు రావడమే దారి. లేదంటే..” ఆపాడు. నేను నా చూపును తీక్ష్ణపరిచాను. “లేదంటే మాత్రం నేను ఆమెను పోగొట్టుకుంటాను సార్. తరువాత ఈ బ్రతుకుకు అర్థం ఉండదు” అతడి గొంతు గద్గదమయ్యింది. కళ్ళలో నీళ్ళు కనిపించాయి.

నేను సర్దుకోవడానికి ఒక నిమిషం పట్టింది.

కానీ, నేనిప్పుడు ఓడిపోకూడదు. నేను నడుస్తున్న కొత్త బాటలో ఇలాంటి ఎమోషనల్ కంటకాలు ఎన్నో వస్తాయి. నేను వాటిని దాటి తీరాలి. ఇవన్నీ నాకు తెలియని అడ్డంకులు కావు. నేను రాసిన ప్రతి నవలలోనూ ఒకటి కంటే ఎక్కువ పాత్రలు ఇలాంటి అడ్డంకులను ఎదుర్కొన్నాయి.

కానీ ఇవన్నీ చివరికి ఓడిపోయాయి!

నా గుండె ఆగిపోయేంతగా కొట్టుకోసాగింది. దాని గురించి తెలియని శశి “దీని గురించి మేడంకు కూడా చెప్పకండి సార్. అక్కకు చెప్పేస్తారేమో!” అంటూ ఇంకా చిన్న గొంతుతో “అయితే వస్తాను సార్. చాలా పని మిగిలిపోయింది” అంటూ తొందర తొందరగా వెనక్కి చూడకుండా వెళ్ళిపోయాడు. అదెక్కడినుంచో అకస్మాత్తుగా నాకు ఒక ఆలోచన స్ఫురించింది – ఒకవేళ ఇతడు తన నవలను తన ప్రియురాలికి చూపాడేమో? ఆమె దాన్ని చదివి ఉంటే? చదివిన దాన్ని గుర్తు పెట్టుకునుంటే?

అతడి వెనుకే పరిగెత్తుకుంటూ వెళ్ళాను. మెట్లు దిగేవాడికి నా అడుగుల సవ్వడి వినిపించిందేమో, ఆగి వెనక్కి తిరిగి చూశాడు. నేను నవ్వడానికి ప్రయత్నించాను. అతడు ఆశ్చర్యపడుతూ పైకి వచ్చాడు.

“నీ నవలను నీ ప్రేయసికి చూపావా?” గుసగుసగానే అడిగాను. అతడి మొహంలో చిరునవ్వు కనిపించింది. “లేదు సార్. ఏదైనా పత్రికలో మొదటి ఇన్‌స్టాల్మెంట్ కనబడగానే దాన్ని చూపించి ఆశ్చర్యపరచాలి” అతడు కూడా గుసగుసగానే అని జోరుగా నవ్వేశాడు.

నాకు తెలియకుండానే నా నోటినుంది ఒక పదం వెలికి వచ్చింది “మంచిది” అందులో ఉన్న నెమ్మది నన్నే ఉలిక్కిపడేలా చేసింది.

శశి నవలకు ఏ సాక్ష్యమూ లేదు!

అన్ని గ్రహాలు నాకు సానుకూలంగా ఉన్నట్టు కనిపిస్తున్నాయి! జీవితంలో ఒక్క సారి మాత్రమే వచ్చే అదృష్టం ఇది! సరైన వేళలో నా గార్డియన్ ఏంజల్ మేలుకున్నాడు!

రిలీఫ్‌గా ఊపిరి పీల్చుకున్నాను. పిల్లలకు జోకులు చెప్పి నవ్వించాను. చారుకు పోపు పెడుతున్న ప్రియా వద్దకు మెల్లిగా వెళ్ళి తన మెడ పైన ముద్దు పెట్టాను. తను ఉలిక్కిపడి సిగ్గు పడుతూ తిట్టింది. నేను కప్పు ఎగిరిపోయేలా నవ్వాను.

భోజనం చేసి బాల్కనిలో కూర్చోగానే నా మనసు రాయి పడిన సరస్సయింది. నాకు తెలియని శశి ప్రేయసి నా ఎదురుగా నుంచుని, కళ్ళ్రెర్ర జేసి నాలుక చాపి భయపెట్టసాగింది.

శశి నవల రాసిన ముఖ్యమైన బహుశా ఏకైక ఉద్దేశం ఆమెను మెప్పించడం. నావల్ల అతడి ఆశ అడియాస అవుతుంది. అతడి ప్రేమ మట్టిలో కలుస్తుంది. దీన్ని అతడు ఎలా తీసుకుంటాడు? తను నవల రాసినట్టుగా అతడి వద్ద ఇప్పుడు ఏ దాఖాలాలూ లేవు. నోట్ బుక్కులు నా వద్ద ఉన్నది నిజం. వాటిని ఈ రాత్రి గడిచేలోగా గుర్తే తెలియనట్టు నాశనం చెసేయ్యొచ్చు. అక్కడితో, అతడి చేతివ్రాత ఉన్న ఒక్క సాక్ష్యం కూడా ఉండదు.

కానీ నవల అతగాడి మెదడులో ఉంటుందిగా?

రేపు నవనీత చంద్ర సినిమా చూశాక, అందులో నా పేరు చూశాక, శశి ఎలా రియాక్టవుతాడు? తన ప్రేయసిని ఆకర్షించడానికి తాను వేసిన ఎర చేజారి, బురదలో కనిపించకుండా పోతే అతడు దాన్ని ఎలా తీసుకుంటాడు?

ఉడుకు రక్తం యువకుడు తన తండ్రిని చంపిన హంతకుణ్ణైనా వదిలెయ్యగలడు కానీ తన ప్రేమకేమైనా అయితే మాత్రం క్షమించడు, ఊరికే వదలడు!

నాదే ఒక పాత్రతో నేను పలికించిన డైలాగ్ అది. దాన్ని సీనియర్ నటుడు రాఘవ్ రంజన్ తన గంభీర స్వరంతో చెప్పిన ఆ డైలాగ్‌ని నా లెక్క ప్రకారం ఇప్పటిదాకా ప్రపంచమంతా థియేటర్లలో మూడు కోట్ల జనాభా విన్నారు!

ఇప్పుడది నా చెవుల్లో ప్రతిధ్వనిస్తోంది. ఆ ప్రతిధ్వని క్ష్క్షణక్షణానికి తారకానికి చేరుకుంటోంది.

ఒక వారమంత భయం, ఆందోళనలల్లో ఉడికిపోయాను. శశి నవల ఉన్న రెండు నోట్ బుక్ లను ముక్కల కింద చించేసి, నీటిలోన నానపెట్టి టాయ్లెట్లో వేసి, మూడు సార్లు ఫ్లష్ చేసిన తరువాత కూడా. నా ఆందోళన కొంచెంకూడా తగ్గలేదు. సరికదా ఇంకా ఎక్కువై పొంగుతూ నన్ను క్రుంగదీసింది.

ఆ సినిమా కథ నాది అని చెప్పడానికి శశి వద్ధ ఏ భౌతిక ఆధారమూ లేదు. కానీ కథ మొత్తం అతని తలకాయలో ఉంది కదా? సినిమా దాకా కాకుండా, ట్రైలర్ చూడగానే శశి గొడవ ప్రారంభిస్తే? తోడుగా అతడి గయ్యాళి అక్క కూడా గొంతెత్తితే? ఇద్దరూ కలిసి సినిమా రిలీజ్ అవడానికి అవరోధాలు కల్పిస్తే నవనీత చంద్ర, ప్రొడ్యూసర్ నా పైన మండిపడడం ఖాయం. అంత జరిగేంతలో సాహిత్య క్షేత్రంలో నా పేరు మట్టిగొట్టుకు పోయుంటుంది. ఇలాంటి అవకాశం కోసమే కాచుక్కూచున్న నా పోటీదారులు, శత్రువులు ఇనుమడించిన ఉత్సాహంతో రంగం లోకి దిగుతారు. క్షణంలో నన్ను నాశనం చేసేస్తారు. ఇంతవరకూ నేను రాసిన కథలు, నవలలు ఎక్కడెక్కడినుండి చోరీ చేశాను అని తెలుసుకోవడం మొదలెడతారు. కట్టుకఠలు రెక్కలు కట్టుకుని అక్కడా ఇక్కడా ఎగురుతాయి. టీవీ చానళ్ళలోని రొదతో కూడిన చర్చలకు నేను విషయాన్నవుతాను. విజయవంతమైన కథకుణ్ణైన నేను ఉన్నట్టుండి ఒక క్షుద్ర కథా రచయితనయిపోతాను. అక్కడితో నా సాహిత్య పయనం అంతమవుతుంది.

నా రచనలను మెచ్చుకుని నా భార్య అయిన ప్రియ షాక్ తింటుంది. స్నేహితురాళ్ళ ఎకసెక్కలకు ఆమె కన్నీరే జవాబవుతుంది. పిల్లలిద్దరూ తలలొంచుకుని ఇంట్లోనే మగ్గుతారు.

దీన్ని ఆపడం ఎలా?

నవనీత చంద్రకు నిజం చెప్పెస్తే?

ఉహు. అది కుదరదు! ఆయనకు నా పైన ఉన్న మంచి అభిప్రాయం శాశ్వతంగా మాసిపోతుంది. సమాచారం కొంచెం కొంచెంగా బయటికి వెళుతుంది. తరువాత అది కార్చిచ్చు కావడానికి ఎక్కువ సమయం పట్టదు. నేను భయపడినంతా జరుగుతుంది. కేవలం ఒకటి రెండు రోజులు ఆలస్యంగా అంతే.

నేను ఈ అడ్డదారిలో చాలా దూరం వచ్చేశాను. దార్లో వస్తూ వంతెనలను కూడా కూల్చేశాను. వెనక్కి వెళ్ళడానికి ఏ సుగమమైన మార్గమూ ఇప్పుడు లేదు.

నుదురును వేగంగా ముందుకు తెచ్చి నా పిడికిలితో కొట్టుకున్నాను. అంతలో ఏదో స్విచ్ నొక్కినట్టు మెదడులో ఒక మెరుపు మెరిసింది.

ఒక దారి ఉంది!

“తన నవల గురించి శశివద్ధ ఉన్న ఒకే ఒక సాక్ష్యం అతడి జ్ఞాపకాలు. వాటిని నింపుకున్న అతడి తలకాయ!

“దాన్నే లేదనిపిస్తే?”

విసురుగా లేచాను. శిలాస్థంభంలా నిలబడి ఆలోచనలో మునిగిపోయాను.

దొంగతనం చేశాను. అబద్ధాలు చెప్పాను. నటించాను. నీట్లో మునగడం జరిగింది. ఈదడం తప్ప వేరే దారి లేదు. ఈదేద్దాం! శశిని లేడు అనిపించేద్దాం!

నా అలోచన నన్నే వణికించింది. శశి జ్ఞాపకాలు అడుగంటేలా, అలా కాకుంటే అతడికి పిచ్చి పట్టేలా చెయ్యడానికి దారులేమన్నా ఉన్నాయా అని ఆలోచించాను. కనిపించినవన్నీ నన్నే దారి తప్పించే, పిచ్చి పట్టించేవే. అవన్నిటికంటే సులభమైనది, తొందరగా జరిగే మార్గం అంటే ‘శశిని మట్టుపెట్టడం’ అంతే.

కానీ ఎలా?

ఇప్పుడు ఒక ఉపాయం తోచింది. అంతవరకూ నెమ్మదిగా అనిపించింది. ఈ నెమ్మదిని పూర్తిగా అనుభవించేద్దాం. తరువాత దారి ఏదని చూడడం నా మనసుకు సులభం అనిపిస్తుంది.

చీకటి కమ్మిన ఆకాశంలో ఒంటరి గ్రహం నన్నే చూస్తోంది. అది శనిగ్రహం కాకుండా గురుగ్రహం కావాలని కోరుకున్నాను. కోరిక నెరవేరిందని దానికి థ్యాంక్స్ చెప్పాను. మళ్ళీ అటు వైపు చూడకుండా రూములోకి వెళ్ళాను. ఆ రాత్రి నాకు గాఢ నిద్ర.

***

ఇరవై నాలుగు గంటల్లో ప్లానంతా తయారయ్యింది. దాన్ని కార్యరూపంలో పెట్టడానికి అతి మంచి తరుణం ఈ వీకెండే. అప్పుడు శశి అక్క బావ ఏదో పెళ్ళికని చెన్నైకి వెళ్ళుంటారు. ఇంట్లో అతడొక్కడే! మా ఇంట్లో నేనొక్కణ్ణే ఉండేట్టు చూసుకుంటే చాలు నా పని సులువే!

రాత్రి బోజనం ముగించి బాల్కనీలో కూచున్నప్పుడు, రెండు నెలల క్రితం మైసూరుకి ట్రాన్స్‌ఫర్ అయి వచ్చిన మరదలు, వాళ్ళాయన ఒక వీకెండ్ వాళ్ళ ఇంట్లో గడపమని ప్రియాని, పిల్లల్ని ఒత్తిడి చేస్తున్న విషయాన్ని ప్రస్తావించాను. “వెళ్లి రా” అన్నాను. “మీరు కూడా రండి. ఒక్కళ్ళే ఏం చేస్తారు?” అంది. “నాకు రాతపని ఉంది. అదీ కాకుండా నీకు తెలిసినట్టే నారాయణ మూర్తికి అదేంటో ఆత్మన్యూనత. నేనుంటే అతడు విచిత్రంగా ప్రవర్తిస్తాడు. నీకు తెలుసు కదా? పాపం అతడి వీకెండ్‌ని పాడుచేసే పాపం నాకెందుకులే?” అంటూ ఒక కృత్రిమ నవ్వు నవ్వాను. తను నాకంటే గట్టిగా నవ్వింది. ఆ నవ్వు సహజంగా ఉండింది.

“లేదులెండి. నేను వెళ్ళను. రెండు మూడు వారాల్నుండి మీరు మామూలుగా లేరు. మిమ్మల్ని వదిలి నేను ఎక్కడికీ వెళ్ళను” తలాడించేసింది ప్రియ. “ఈ రెండు రోజులు నువ్వు నన్ను వదలి వెళ్ళకపోతే నేను నిన్ను శాశ్వతంగా వదలి వెళ్ళాల్సొస్తుంది” మనసులో మెదలిన పదాలను గొంతుదాకా రాకుండా అడ్డుకున్నాను. నా కథల పెట్టుబడి అయిన మాటల వలను అల్లసాగాను. అందులో నా ముద్దుల పెళ్ళాం చిక్కుకోవడానికి ఇరవై నిముషాలకంటే ఎక్కువ పట్టలేదు.

అన్ని ఏర్పాట్లూ నేననుకున్నట్టే జరుగుతున్నా మనసులో ఏదో గాబరా, భయం కలుగుతోంది. వెనుకంజ అయితే మళ్ళీ మళ్ళీ తనున్నానని నాను కంగారు పెట్టింది. ఆ పరిస్థితిలో నవీన చంద్రను మాట్లాడించే ధైర్యం కలగలేదు. “సాక్షుల సంత” సెట్ ప్రారంభ కార్యక్రమాన్ని ఏదో సాకుతో తప్పించుకున్నాను. చంద్ర, ప్రొడ్యూసర్లు ఇంటికొచ్చి ఇచ్చి వెళ్ళిన ఐదు లక్షల చెక్కును ప్రియాకు కనబడకుండా దాచాను. ఏ రకమైన అనుమానం లేకుండా తను చెల్లెలు, ఆమె పిల్లలకు రకరకాల పిండివంటలను తయారు చేసి డబ్బాలకు నింపుతోంది.

***

ప్రియా, పిల్లలను శనివారం ఉదయమే సంగీత ఇంట్లో డ్రాప్ చేసి, అక్కడే టిఫిన్ ముగించుకుని, కొంత సేపు కబుర్లు చెప్పి ఇంటికొచ్చాను. దార్లో తలుపుకు రెండు వైపులా చిన్న చిన్న దీపాలను వెలిగించి నవ్వుతున్న కొట్లో నాలుగు నిముషాలు గడపడం మరచిపోలేదు. నా నిద్రాహీనతకు అని తెచ్చిన వస్తువు ఇప్పుడు శశిని శాశ్వత నిద్రకు పంపడమనే ఒక ప్రముఖ బాధ్యత వహించనుంది.

ఇంటికి చేరిన వెంటనే విస్కి బాటిల్‌ని ప్రేమతో నిమిరి ఫ్రిజ్‌లో పెట్టాను. నా అల్మారీ తీసి అందులోనుండి చిన్న బాటిల్‌ని తీసుకుని దాన్లోని తెల్ల మాత్రల పైన ఒక గాఢమైన చూపును విసిరాను. బాటిల్ చేత్తో పట్టుకుని శశికి కాల్ చేశాను. “సాయంత్రం నీ నవల పని ముగించేద్దాం. ఈ రోజు కాకపోతే మరో నెల నాకు తీరిక ఉండదు” అన్నాను. “ఇప్పుడే రానా సార్?” అన్నాడు ఉత్సాహంగా. నేను నవ్వేశాను. నీ సమయం రాత్రికని నిర్ధారించబడిందిరా పిలగా అని చెప్పుకుని గట్టిగా అన్నాను “ ఇప్పుడొద్దయ్యా! నాకు పనుంది. నోటు బుక్, పెన్ తీసుకుని రాత్రి ఎనిమిది గంటలకు పైకొచ్చేయ్. ఇక్కడే భోజనం, మందు. అలవాటుందా?”

అతడు చిన్నగా నవ్వాడు. నేను కాల్ కట్ చేసి విజిల్ వేస్తూ ఇల్లంతా తిరిగాను.

కన్నడ మూలం: ప్రేమశేఖర్

అనువాదం: చందకచర్ల రమేశబాబు

(ముగింపు వచ్చే వారం)

Exit mobile version