Site icon Sanchika

కథ అడ్డం తిరిగింది..-2

[కన్నడంలో శ్రీ ప్రేమశేఖర్ రచించిన ‘Niraala Niddeya Nduve’ అనే కథని అనువదించి అందిస్తున్నారు శ్రీ చందకచర్ల రమేశబాబు. ఇది రెండవ భాగం. మొదటి భాగం లింక్]

[dropcap]చీ[/dropcap]కట్లు ఆవరించసాగినట్లల్లా నేను కార్యోన్ముఖుణ్ణయ్యాను. గ్లాసులో నీళ్ళు నింపి అన్ని నిద్రమాత్రలని అందులోకి వేసి గిలక్కొట్టాను. ఐస్ ట్రే ఒక వరస ఆరు అరల్లో ఆ నీళ్ళు నింపాను. శశి ఒక పెగ్గుకి మూడు అరలు, రెండో పెగ్గుకు మిగతా మూడు. ట్రేలోని ఇటువైపు అరల్లో మామూలు ఐస్ నాకు సరిపోతుంది.

ఐస్ ట్రేని ఫ్రీజర్‌లో పెట్టేటప్పుడు చెయ్యి వణికి నీళ్ళు కొద్దిగా తొణికాయి.

బాల్కనీలోకి వెళ్ళాను. కబూతర్ జాలీ పైన మెల్లగా చెయ్యాడించాను.

మూడు సంవత్సరాల క్రితం పన్నెండవ అంతస్తులోని ఈ ఫ్లాట్ కొనుక్కుని, ఇక్కడ నివసించడం ఆరంభించడానికి చేసుకున్న ఏర్పాట్లలో బాల్కనీకి ఈ కబూతర్ జాలి వేయించడం చాలా ముఖ్యమైనది. నా బాల్కనీని తమ అడ్డా చేసుకుని గలీజు చేసే పావురాల పైన అసహ్యం కాదు. నాది పసిపిల్లలున్న సంసారం. పిల్లలది వయస్సుకనుగుణమైన అల్లరి స్వభావం.

అపార్ట్‌మెంట్ లోని పదహారు ఫ్లోర్లలోని అరవై నాలుగు ఫ్లాట్లలో కొన్నింటికి ఇలా పిజియన్ నెట్ లేదు. అలా లేని వాటిలో శశి ఫ్లాట్ కూడా ఒకటి. పిజియన్ నెట్ ఒకటే కాదు, వంటగదిలో ఒక ఎక్సాస్ట్ ఫ్యాన్ కూడా వేయించి ఇవ్వడానికి వాళ్ళ సింధి ఓనర్ ఒప్పుకోడు. అద్దెకిచ్చిన ఇంటికి ఇంత ఖర్చు చేయడం వేస్ట్, ఈ రోజు ఉండి రేపు వెళ్ళిపోయేవాళ్ళమే కదా అని శశి అక్క బావ నిర్ణయం. ఆమె మాత్రం భర్తకు తగ్గ భార్యే.

స్టూల్ తీసుకొచ్చి, ఎక్కి పిజియన్ నెట్‌ని హుక్స్ నుండి తప్పించి బాల్కని మూలకు చేరేశాను. ఇప్పుడు నిద్రమాత్రలు వేసిన రెండు పెగ్గులు విస్కీ తాగిన శశిని బాల్కనీకి తీసుకువెళ్ళడం ఏమంత పెద్ద పని కాదు. అక్కడ్నుండి అతడిని ఎత్తి పడెయ్యడం కూడా.

ముందున్న రోడ్డుపైన ఎల్లప్పుడూ వెళ్ళే వాహనాల చప్పుడులో అతడి కేక ఎవరి చెవినా పడదు. క్రింది రెండు ప్లోర్ల ఫ్లాట్లు ఖాళీగా ఉన్నాయి. కాబట్టి క్రింద పడిన శశి శరీరం తొందరగా ఎవరికీ కనబడదు. రోడ్లపైనున్న పెద్ద పెద్ద చెట్ల నీడలవలన ఇటు వైపు వెలుగు తక్కువ. అది నాకు ఇంకా సౌకర్యం! ఎవరికి దొరకాలి ఇంత అదృష్టం!!

కానీ ఇంత జరిగాకనే ముఖ్యమైన ఘట్టం ప్రారంభమయ్యేది. ఏదైనా క్రైం ప్లాట్‌లో నేరం చెయ్యడం వంతు పది శాతమే. మిగతా తొంభై శాతం అది ఎవరి కంటా పడకుండా, సాక్ష్యం కూడా దొరక్కుండా చెయ్యడం!

పని అయిపోయిన రెండు నిమిషాల్లో పిజియన్ నెట్ తన స్వస్థానానికి చేరుకోవాలి. శశి తాగిన పెగ్, విస్కి బాటల్ అతడి ఇంటి డైనింగ్ టేబుల్ చేరుకోవాలి. నిద్ర మాత్రల ఖాళీ సీసా కూడా ఒక వైపు అమాయకంగా పడుండాలి. అతడి ఇంటి తాళం చెవి మామూలు మాదిరిగా గోడకు తగిలించిన హుక్కుకు వేలాడుతుండాలి. ముఖ్యంగా వాటిలో దేని పైన కూడా నా వ్రేలిముద్రలు కనిపించకూడదు.

టిష్యూ పేపర్ల పెద్ద ప్యాకెట్ కనిపించేలా డైనింగ్ టేబల్ పైన పెట్టాను. అక్కడే నిలబడి కళ్ళు మూసుకుని మళ్ళీ ఒకసారి లెక్కచూసుకున్నాను.

పనంతా సజావుగా అయిపోయినాక గాఢ నిద్ర పోవాలి. నాకు అది చాలా ముఖ్యం. దానికోసమే కదా ఇంత ప్రణాళిక?

నాకోసం రెండురోజుల మొత్తానికి ప్రియా తయారు చేసి ఫ్రిజ్‌లో పెట్టిన రెండు రకాల చికన్ కూరలు, పరోటాలు బయటికి తీసుంచాను. ఇదంతా అవసరమా అనిపించకపోలేదు.

కానీ, ఉరికంబం ఎక్కే మనిషికైనా అతడిష్టపడిన భోజనం ఇస్తారట. శశికి భోజనయోగం లేకపోతే ఎలాగ? అందులోనూ ప్రియా చేసిన రుచికరమైనా నాన్ వెజ్ భోజనం!!

ఎనిమిదిన్నరకు శశినుండి కాల్ వచ్చింది. “రావచ్చా సార్?” అంటూ. “ వచ్చెయ్” అన్నాను. అలాగే “ఒక పని చెయ్యాలి కదా శశి” అని లాగాను. “ఏంటి సార్?” అంటూ అమాయకంగా అడిగాడు. “ ఏం లేదు. తను ఇంట్లో లేనప్పుడు నేను ఇలాంటివేవో చేస్తానని మా ఆవిడ పెగ్గులనన్నిటినీ ఎవరెవరికో ఇచ్చేసింది. ఢిల్లీ నుండి తెచ్చిన క్రిస్టల్ పెగ్గుకు కూడా అదే గతి పట్టింది” అన్నాను. అతడు నవ్వేశాడు. “నో వర్రీ సార్. మా ఇంట్లో ఉన్నాయి” అన్నాడు. “వావ్” అంటూ “ రెండు చాలు” అన్నాను నవ్వుతూ. “హాట్ డ్రింక్స్‌ని స్టీల్ గ్లాసుల్లో వేసుకుంటే ఏం మజా ఉంటుంది చెప్పు” అని ఇంకా నవ్వాను.

శశి మళ్ళీ నవ్వాడు “ఎస్ సార్. నాకు అర్థం అవుతుంది”

“ఇంతమాత్రం తెలుసుకో. ఎక్కువ తెలివి చూపద్దు” మనసులోనే నవ్వుకున్నాను. తరువాతి సంఘటనలు నా ఊహకు కూడా అందనట్టు వేగంగా అవుతూ పోయాయి.

కొత్త నోట్ బుక్ విప్పి టేబల్ పైన పెట్టాడు శశి. నాకు అక్కడ కనిపించినవి, ఒకదాని క్రింద ఒకటి వేరే వేరే కొలతల నీలి అక్షరాలు. అన్నిటికన్న పైన ‘కసాయివాని చేతిలో కూన’ అని పెద్ద్ద అక్షరాల రెండు పదాలు. దాని క్రింద బ్రాకెట్ లో చిన్న అక్షరాలలో ‘డిటెక్టివ్ నవల’ అని ఉంది. దానికీ క్రింద కుడివైపున ‘శశిధర్ చంగావి’ అని తన పేరును ముద్దుగా చెక్కుకున్నాడు. దాని క్రింద ఎడమ వైపున ‘మార్పులు’ అన్న పదం కూచుని కనిపించింది.

శశి చేతిలోని పెన్ తీసి నోట్ బుక్ పైన పెట్టి పెగ్ అందుకున్నాడు. నేను ఓవన్‌లోనుండి చికన్ కర్రీ, పరాట బయటకు తీశాను. ఒక బౌల్‌లో కర్రీ నింపి, మరో దాన్లో వేయించిన బఠాణీలు వేశాను. శశి మొహం ఇంతైంది. చికన్ కర్రీ ఉన్న బౌల్ తన వైపు లాక్కున్నాడు. “ఇది నాకు ఉండనీ సార్. మీరు ఇంకోటి తీసుకోండి. ఒక స్పూన్ ఇవ్వండి. చికన్ పీస్ కంటే విస్కీ సిప్ల మధ్య ఒక్కొక్క స్పూన్ చికన్ కర్రీ నాలుక పైన వేసుకుంటే దాని మజానే వేరు” అంటూ నవ్వి, సన్నటి నడుము కల పెగ్‌ను తన ఎడమ చేతికి మార్చుకున్నాడు. నేను తను అడిగినదాన్ని వెంటనే ఇచ్చాను.

స్టాండ్ నుండి చిన్నదొకదాన్ని లాగుతుండగానే తలుపు వద్ద శశి “సార్ సార్” అని పిలిచినట్టై అటు తిరిగి చూశాను.

“సార్ ఫోన్ మరచిపోయాను. ఈ రోజంతా అర్చన నా కాల్స్‌ని తీసుకోలేదు. అదేం బిజీగా ఉందో? ఇప్పుడు మళ్ళీ కాల్ చెయ్యాలి. వెళ్ళి తీసుకొస్తాను రెండే నిమిషాలు” అంటూ చిటికెన వ్రేలిపైనున్న తాళం చెవి పైన బొటన వేలునాడిస్తూ కిచెన్ తలుపుల నుండి తప్పుకున్నాడు శశి.

మంచిదే. నేను కూర్చుని పెగ్ తీసుకున్నాను. ఒక సిప్ తాగాను. నోటికి నాలుగు బఠాణాలు వేసుకున్నాను. మరొక గుక్క పానీయం తాగాను. శశి అయిపు లేదు!

“ఇదేంటి?”

“అతడికేమైనా సందేహం కలిగిందా? ఎంతైనా డిటెక్టివ్ కథా రచయిత కదా. అపాయం నుండి పారిపోయాడా? పారిపోయి గమ్మునుంటే ఏం ఫర్వాలేదు. నేను సరిదిద్దుకోగలను. అతడికి డిటెక్టివ్ కథ మెలకువను నేర్పించిన గురువుని నేను.

అలా చేతులు కట్టుకుని కూర్చోకుండా విరుగుడు తంత్రమేమైనా పన్నుతున్నాడా?

గ్లాసు టేబల్ పైన కుక్కి లేచి నుంచున్నాను.

నేను క్రిందికి వెళ్ళినప్పుడు శశి ఫ్లాట్ తలుపు కొద్దిగా తెరిచే ఉండింది. లోపలినుండి ఏ రకమైన చప్పుడూ వినబడలేదు. పదకొండవ అంతస్తంతా మౌనంలో మునిగిపోయి కనిపించింది. పక్క ఫ్లాటు, ఎదురు ఫ్లాటుల తలుపుల వైపు ఒకసారి దృష్టి సారించి, మెల్లగా తలుపు తోశాను.

ఎదురుగా సోఫాలో క్రుంగిపోయి కూర్చున్నాడు శశి. మొహం కళావిహీనంగా ఉంది.

నేను రెండు అంగల్లో అతడి ముందున్నాను. “ఏమైంది శశీ? బాగున్నావు కదా?” అన్నాను. అతడు దోసిలిలో తన మొహాన్ని దాచుకున్నాడు. వెక్కి వెక్కి ఏడవసాగాడు. కళ్లనుండి బయటికి వచ్చిన నీరు అతడి వేళ్లను దాటుకుని క్రిందికి వచ్చి, చిటికెన వ్రేలుకు చుట్టిన తలవాకిలి తాళంచెవి పైన మెరిసింది.

నేను అతడి పక్కన కూర్చుని భుజం తట్టాను. తల నిమిరాను. “చెప్పు. ఏమైంది?”. నాలుగు సార్లు అడిగాను. వెక్కిళ్ళ నడుమ నోరు విప్పాడు. “ఆమె వెళ్ళిపోయింది. నన్ను వదిలి వెళ్ళిపోయింది”. మాట ముగిసేలోగా నా భుజానికి తల పెట్టి “హో” అని ఏడ్వసాగాడు.

ఆమె ఎవరని నాకు అర్థమయ్యింది. “ఇట్స్ ఒకె. ఇటీస్ ఒకె. ఓర్చుకో” అంటూ ఓదార్చాను. “ఆమె జర్మనీ ఫ్లైట్ అందుకొంటూంది ఒక గంటలో. ముంబై ఏర్పోర్ట్ నుండి కాల్ చేసింది. మరచిపో నన్ను అనింది.” శశి తడబడుతున్నాడు. “ఎలా మరచిపోయేది సార్? నా అర్చనను మరచి ఎలా బ్రతికేది సార్?” జోరుగా వెక్కుతున్నాడు. నేను మౌనంగా అతడి వీపు నిమురసాగాను. అక్కడ మాటలకు తావు లేదు అనిపించింది.

అతడు అకస్మాత్తుగా తలను వెనిక్కి తీసుకువెళ్ళాడు. అతడి మెడ వెనుకభాగంలో ఉన్న నా వేళ్ల పైన ఒత్తిడి పడింది. గబుక్కున చెయ్యి తీసేసుకున్నాను.

అతడి రోదన నియంత్రణలోకి వచ్చింది. “సారీ సర్. నాకిప్పుడు విస్కీ వద్దు. భోజనమూ వద్దు. ఊరికే కూర్చోవాలి అనిపిస్తోంది” అంటూ నా చేయి పట్టుకున్నాడు. ఆ చెయ్యి తడిగా తగిలింది.

మౌనంగా పైకి లేచాను. అదే మౌనంలోనే మరోసారి అతడి భుజాన్ని తట్టి, తల నిమిరి తల ఆడించాను.

పైకి వచ్చినప్పుడు నాకు శశి పైన అపరిమితమైన జాలి. ఆశల వయసులో ఉన్న యువకుడు. పాపం! దాని వెనుకనే ఒక నెమ్మది. అతడు ఆ నవల రాసింది ఆమెను గెలవాలని. తనే వెళ్ళిపోయాక ఆ నవలకు అర్థం లేదు. అతడికిక దానితో పన్లేదు. భవిష్యత్తులో గుర్తుకు వచ్చినా, నా మోసం తెలిసొచ్చినా. అది అతడిని వేధించదు. వేధించినా నేను ఎలాగైనా దాన్ని సర్దవచ్చు.

నెల రోజులనుండీ నా ఛాతీపైన బండరాయిలా కూర్చున్న బరువు అదెంత సులభంగా, అది కూడా నా ప్రయత్నమేమీ లేకుండా దిగిపోయింది! ఎంతో నెమ్మదిగా అనిపించింది.

నేను ఎన్నడూ చూడని అతడి ప్రేయసికి మనసులోనే ధన్యవాదాలు అర్పించాను. “నీ ప్రయాణం సుఖంగా సాగని పిల్లా! నీ బ్రతుకు బంగారం కానీ!!” అంటూ గొంతెత్తి దీవించాను. బెడ్రూముకు వెళ్ళి జుబ్బా, పైజామా గిరాటేసి నిద్రకు జారింది మాత్రమే గుర్తు.

ఆహా! అదెంత నెమ్మదైన నిద్ర!

***

కాలింగ బెల్ మ్రోగి లేపింది. కళ్ళు తెరిస్తే రూమంతా వెలుగు. లేత ఎండ కుడివైపు తెల్లటి గోడపై పడి ప్రతిబింబించి రూమంతా వెలుగుమయం చేస్తూంది. కాలింగ్ బెల్ మరోసారి మ్రోగింది. హడావిడిగా పైజామా ధరించి తలుపు తీశాను.

పరిచయమున్న పోలీస్ ఇన్‌స్పెక్టర్ రామనాథ్ ఎదురుగా కనిపించారు.

“సారీ. పొద్దునే దర్శనం ఇచ్చి మీ నిద్రను పాడుచేశాను” అతడి మొహంలో నవ్వు.

“ఏంటి సార్ ఇంత పొద్దునే ఇక్కడికి?” కళ్ళు నులుముకుంటూ ప్రశ్నిచాను. “ఏం లేదు. రాత్రి మీ బిల్డింగ్లో ఒక ప్రమాదం జరిగింది. మీ క్రింది ఫ్లాట్ శశిధర్ అనే యువకుడు సూసైడ్ చేసుకున్నాడు”

“ఆఁ! ఏంటి సార్? ఏంటి మీరనేది?” నా నిద్ర ఎగిరిపోయింది. “బాల్కనినుండి దూకేశాడు. విషయం తెలిసి, రాత్రే ఇక్కడికి వచ్చాను. మిమ్మల్ని డిస్టర్బ్ చెయ్యలనిపించలేదు. నిజం చెప్పాలంటే ఆ హడావిడిలో మీరు గుర్తుకు రాలేదు. ఇప్పుడు మళ్ళీ వచ్చినప్పుడు మిమ్మల్నొక సారి కలిసి వెళ్దామనిపించింది.” రామనాథ్ చెప్తూనే ఉన్నారు. నేను షాక్‌తో గోడ పట్టుకున్నాను.

నా గాఢ నిద్రలో ఏమేమి జరిగింది!

“దిసీజ్ అన్‌ఫేర్” అరిచాను. రామనాథ్ నా భుజం తట్టారు. “అన్‌ఫేర్ ఘటన జరిగినప్పుడే కదా మాలాంటి వాళ్ళు కనిపించేది” నవ్వారు. ఆయన వెనుక నిలబడిన శశి ఎదురు ఫ్లాట్ రిటైర్డ్ ఆర్మీ మేజర్ నడువట్టం సదాశివం గారి గంభీరమైన ముహంలోనూ నవ్వు మెరిసి మాయమయ్యింది. నా తలకాయలో చక్రం తిరుగుతోంది.

“ఇంట్లో ఒకరే ఉన్నట్టుంది. నా భార్య తన అన్నయ్య కూతురు పెళ్ళికి అని వారం క్రితం వెళ్ళింది ఇంకా ఇటు వైపు మొహం తిప్పలేదు. వంటావార్పూ అంతా నాదే. ఇప్పుడు ఒక టీ చేసెయ్యండి. మీ పేరు చెప్పుకుని తాగి వెళ్ళిపోతాను “ విశాలంగా నవ్వారు రామనాథ్.

ఆయన నా కథల అభిమాని. రెండు సంవత్సరాల క్రితం కుందన్ లాల్ జైన్ చందేరి గారి ఆభరణాల కొట్టులో జరిగిన దోపిడీ మిస్టరీని విప్పడానికి నా కథ ఒకటి సహాయం అయిందట. దాన్ని ఆయన ఎంతో మందికి చెప్పారో! ముగ్గురు నలుగురు అపరిచితులు దాని వల్లనే నాతో పరిచయం పెంచుకున్నారు.

“అలాగే సార్. మీతో పాటు ఈ రోజు ఉదయం చాయ్ నాకూ ఇష్టమే” అంటూ బాత్రూమ్ వైపు అడుగులు వేశాను. శశి ఎందుకిలాగ చేసుకున్నాడు అని ఆలోచిస్తూనే ఒంటి బరువు దించుకుని, మొహం పైన నీళ్ళు జల్లుకుని బయటికి వచ్చినప్పుడు హాల్లో రామనాథ్ కనిపించలేదు. తలవాకిలి నుండి ఆయన గొంతు వినిపించింది. “ఇలా రండి సార్. ఇప్పుడే నిద్ర లేచిన మగవాణ్ణి కిచెన్‌కు పంపడం సబబు కాదని మేజర్ సదాశివం గారు తమ ఇంట్లో టీకి ఏర్పాటు చేశారు. రండి వెళ్దాం” అంటూ లోపలికి వచ్చి నా ప్రతిక్రియకూ కాచుకోకుండా అక్కడే ఉన్న టవల్ తీసి భుజం పైన వేసి జబ్బ పట్టుకుని బయటికి తీసుకువెళ్ళారు. నేను తలుపు ఓరగా వేసి, సదాశివం గారికి మనసులోనే ధన్యవాదాలు తెలుపుకుంటూ మెట్లు దిగాను.

శ్రీమతి సదాశివం తయారు చేసిన టీ ఒక్కొక్క గుక్కా తాగాను. శశి గుర్తుకొస్తూనే ఉన్నాడు. “శశి ఎందుకిలా చేసుకున్నాడు? మంచి అబ్బాయి సార్” అన్నాను. “సూసైడ్ నోట్ కూడా రాసిపెట్టలేదు అతను” అన్నారు రామనాథ్. “కృష్టప్ప ఏమో చెప్తున్నాడు” అని గొణుగుతూ బయటికి వెళ్ళారు. తలుపు వద్ద కనిపించిన పనిమనిషి మణి “అన్నా! మీర్కికడున్నారా? సరే. నేను పైకి వెళ్ళ పని మొదలెడతాను. మళ్ళీ ఆలస్యం అవుతుంది. ఈ రోజు ఆదివారం కూడా” అన్నది.

శ్రీమతి సదాశివంకు థ్యాంక్స్ చెప్పి బయటకు వచ్చాను. రామనాథ్ మెట్లు దిగి వస్తున్నారు. “రండి. క్రిందకి వెళ్దాం. నాకు కనిపించనివి మీ రచయితల కళ్ళకేమైనా కనిపించవచ్చు. మీ పదును బుర్రకేమైనా స్ఫురించవచ్చు. నాకు ప్రయోజనం కలుగుతుంది” అన్నారు.

అదీ కరెక్టే అనిపించింది. ఎలాగూ నా బుర్రలో తిరుగుతున్న ప్రశ్నలకు సమాధానం దొరకాలి.

“ఈ వేషంలో క్రిందికి రాలేను సార్. షర్ట్ వేసుకుని వస్తాను” అంటూ ఆయనను దాటి మెట్లెక్కాను. నాకంటే ముందు రెండు రెండు మెట్లు దాటి వెళ్ళిన రామనాథ్ నా తలుపు వద్ద నిలబడి మణితో అన్నారు “మీ అయ్యగారి ఒక షర్ట్ తీసుకురామ్మా”. నేను నవ్వుతూ “షర్ట్‌తో పాటు ఇంటి తాళం చెవి కూడా తీసుకురా మణీ. నువ్వు పని ముగించి వెళ్ళేటప్పుడు తలుపులు లాగి వెళ్ళిపో” అన్నాను. మేజర్ గారు ఎక్కడా కనిపించలేదు.

ఇద్దరూ క్రిందకి వెళ్ళాం. లిఫ్ట్‌లో రామనాథ్ వివరాలు చెప్పారు.

ఆయనకు ఈ విషయం తెలిసింది రాత్రి పదకొండున్నరకట. గార్డు క్రింద అంతస్తులోని పాల్ శామ్రాజ్ గారిని తీసుకెళ్ళి చూపించి, ఆయన పోలీస్ కంట్రోల్ రూముకు ఫోన్ చేసి, అది రామనాథ్‌కు చేరిన పది నిమిషాల్లోనే ఆయన ఇక్కడికి పరిగెత్తి వచ్చారట. కనిపించింది తల చితికి, రెండు చేతులు ఒక కాలు విరిగిన శశి దేహం. జేబునుండి క్రింద పడినట్టున్న మొబైల్ ఫోన్ నాలుగైదు తునకలు దూరంగా పడున్నాయట.

“బాడీని పోస్ట్ మార్టమ్‌కు పంపాము. మృతుడి అక్క, బావలకు ఫోన్ చేశాము. వాళ్ళు చెన్నైనుండి రాత్రే బయలుదేరారు. ఇంతలోనే రావచ్చు” అన్నారు.

రామనాథ్ చెప్పిన విషయాలు తప్ప నాకేం కొత్త విషయాలు తట్టలేదు. “సరే. తరువాత మళ్ళీ కలుస్తాను” అంటూ ఆయన గేట్ బయట ఉన్న జీపు వైపు నడిచారు. నేను కాంక్రీట్ నేల పైన సున్నం వృత్తంలో కనిపించిన రక్తపు మరకలను విషాదంగా చూసి తల వంచుకుని పైకి వెళ్ళాను.

లిఫ్ట్ ఆరవ అంతస్తులో ఆగినప్పుడు నాకు కనిపించింది పనావిడ మణి. నన్ను చూసి బెదిరింది. “పనంతా అయిపోయిందా?” అన్నాను. “హూం” అని తలాడించి చూపులు తిప్పేసింది. “ఎందుకు గాబరా పడుతున్నావు? ఏం సంగతి?” అన్నాను. “టేబల్ పైనున్న గ్లాసులు పగిలిపోయాయి” అన్నది నావైపు చూడకుండా. “నేనే పగలగొట్టాను” అని కూడా చేర్చింది చిన్న గొంతుతో. అంతలో నా పన్నెండవ ఫ్లోర్ వచ్చింది. “సర్లే. పోతే పోనీ” అని బయటకు వచ్చాను. వాటి యజమానే లేనప్పుడు వాటి గురించి పట్టించుకోవడం ఎందుకు?

తలుపు తెరిచి సోఫాలో కూలబడ్డవాడికి తల తిప్పినట్టయింది.

ప్రేయసి వెళ్ళిపోవడం వల్ల తగిలిన షాక్ శశిని ఆత్మహత్యకు ప్రేరేపించిందా? కళ్ళు మూసి అతడి ఏడుపు, మాటలను ఒక్కొక్కటిగా తలచుకున్నాను. నా మనసుకు కూడా పట్టిన ముసురు వదలసాగింది. ఇదంతా రామనాథ్‌కు చెప్పాలి.

ప్రియా చాలా గుర్తుకు వచ్చింది.

బెడ్రూంకు వెళ్ళి ఫోనందుకున్నాను. అందులో అప్పుడే తనవి మూడు మిస్డ్ కాల్స్ ఉన్నాయి. తనకు విషయం చెప్పద్దు అనుకుంటూనే ఫోన్ చేశాను. “ఎక్కడికి వెళ్ళారు? కులాసానే కదా?” అంటూ గాబరాగా అరచిన ఆమెకు “అంతా సరిగ్గా ఉంది. కానీ నువ్వు వచ్చెయ్యి. నాకు ఒంటరిగా అనిపిస్తోంది. ఇంకో గంటలో అక్కడుంటాను. తయారుగా ఉండు. పిల్లల్ని కూడా తయారు చెయ్యి” అన్నాను నింపాదిగా. అటువైపునుండి కొన్ని క్షణాల మౌనం తరువాత ఆమె మాటలు వచ్చాయి. “మీరు రావడం వద్దు. మీ ఆరోగ్యం బాగున్నట్టు లేదు. సంగీత భర్త బయటకు వెళ్ళున్నారు. ఆయన రాగానే నేను డ్రాప్ అడుగుతాను. మీరు ఇంట్లోనే ఉండండి. ఫ్రిజ్ లోనివి తినకండి. నేను వేడిగా ఇక్కడ్నుంచి తెస్తాను.” అన్నది. నేను మెల్లగా హూం అన్నాను.

మణి అంతటినీ శుభ్రం చేసింది. డైనింగ్ టేబల్ పైన పడిన పదార్థాలన్నీ క్లీనయి, పాత్రలన్నీ బోర్లాపడి కనిపించాయి. డస్ట్ బిన్ కూడా ఖాళీ. అందులో రోజూ మాదిరిగానే కొత్త కవర్ కూడా వేసింది. డైనింగ్ టేబల్ పైన శశి నోట్ బుక్ మాత్రం రాత్రి ఎలాగ ఉండిందో అలాగే తెరుచుకుని పడుంది. అతడి పసుపు పెన్ అడ్డంగా పడుకుంది. అవేవీ తన డిపార్ట్‌మెంట్ కాదని మణికి తెలుసు.

ఒక్కడే కూర్చున్నప్పుడు పూర్తిగా ఒక నెలపాటు పీడించిన నా గాబరా, భయం మళ్ళీ సినిమా రీలులా నా కళ్ళముందు కదలాడసాగాయి. నెత్తిమీద కూర్చున్న కొండ తనకు తానుగా ఎలా మాయమయ్యింది? ఇంత ఆలోచన అవసరమా? ఎలాంటి అమాయకుణ్ణి నేను!

అలాగే ఆలోచిస్తూ ఎంతసేపు కూర్చుండి పోయానో! చివరికి చాలనుకుని, తల జాడించి లేచాను. ఇప్పుడు ఒక చన్నీళ్ళతో స్నానం అవసరం అనిపించింది.

అర్ధగంటకు పైగా స్నానాలగదిలో గడిపి కొత్తదనాన్నేదో అనుభవిస్తూ బయటికి వస్తుంటే క్రింది ఫ్లాట్ నుండి శశి అక్క ఏడ్పు వినిపించి నన్ను శిలలా చేసింది. నా కళ్ళలోనూ నీరు. వార్డ్ రోబ్ తీసి పైజామా ధరించి, జుబ్బాకు బదులు గోమ్చా ను భుజం పైన లాక్కుంటుండగా కాలింగ్ బెల్ శబ్దం వినిపించింది.

ప్రియా ఉండవచ్చు అనుకుని వేగంగా తలుపు వైపు నడిచాను. బోల్ట్ తీసి చూసేసరికి కనిపించింది లాఠీ ఆడిస్తూ నుంచున్న ఇన్‌స్పెక్టర్ రామనాథ్. రెండు వైపులా కానిస్టేబుల్స్.

“రండి రండి” అంటూ శుష్కమైన గొంతుతో ఆహ్వానించి లోపలికి జరిగాను. “ఏదైనా క్లూ దొరికిందా? వసంత వచ్చారు” అన్నాను. నా మాటలు నాకే అప్రస్తుతం అనిపించి మౌనంగా అయిపోయాను.

“ఔను. వచ్చారు. ఆమెతో మాట్లాడే వస్తున్నాను” అన్నారు రామనాథ్. సోఫాపైన సౌకర్యంగా కూర్చుని “చెప్పండి. మీరేమో అంటున్నారు. ఏవైనా క్లూలు దొరికాయా అని కదూ? పెద్ద క్లూనే దొరికింది. శశి ఆత్మహత్య చేసుకోలేదు. హత్య చెయ్యబడ్డాడు” రామనాథ్ గబగబా అన్నారు.

“ఆఁ!” ఉలిక్కిపడ్డాను. మాటలు రాకుండా అపనమ్మకంగా ఆయనవైపు చూశాను.

రామనాథ్ నవ్వారు. “హంతకుడి ఆచూకీ కూడా దొరికిపోయింది.” అంటూ నానుండి మొహం తిప్పుకుని బాల్కనీ తలుపు వైపు వెళ్ళి బయటికి చూడసాగారు.

‘ఈ మనిషి ఏం మాట్లాడుతున్నాడు? ఏమైనా అర్థముందా మాటల్లో’ అనుకున్నాను.

“ఇక్కడికి రండి. వింటే మీరే ఉలిక్కిపడతారు” రామనాథ్ అక్కడ నుండే పిలిచారు. ఇంకా బయటికే చూస్తున్నారు. నేను నింపాదిగా ఆయన వైపు నడిచాను. ఎల్లలు దాటుతున్న కుతూహలాన్ని కష్టపడి ఆపుకున్నాను.

నేను బాల్కని చేరుకున్నప్పుడు రామనాథ్ కళ్ళు మూలలో కుప్పగా పడి ఉన్న ఆకుపచ్చని కబూతర్ జాలిపైన తిరుగుతున్నాయి. “దీన్నెందుకు తీశారు సార్? పావురాలతో ఏమైనా కదనవిరామం ఘోషించారా?” నవ్వారు. నేనూ నవ్వాను. దాన్ని తీయనందుకు నాపైన నాకే కోపం, విసుగు రెండూ వచ్చాయి. పిల్లలు వచ్చేలోగా మళ్ళీ కట్టెయ్యాలి. ఏడు సంవత్సరాల చిన్నవాడు చాలా అల్లరివాడు.

“నిన్న రాత్రి శశి ఇక్కడ ఉన్నాడు కదూ?” రామనాథ్ అకస్మాత్తుగా ప్రశ్నించారు. “అవును. వచ్చాడు. ఫోన్ మరచిపోయాను అని తొందరగా వెళ్ళిపోయాడు” అన్నాను.

“ఇక్కడినుండి వెళ్ళాడు అని తెలుసు. నా ప్రశ్న ఇంతే. మెయిన్ డోర్ గుండానో లేదా బాల్కనీ గుండానో అని”

“ఈయన తమాషా చెయ్యడం లేదు కదా” బదులివ్వకుండా ఆయన వైపు తీక్ష్ణంగా చూశాను. రామనాథ్ నవ్వేశారు. “తమాషాకన్నాను లెండి” అంటూ నా జబ్బ పట్టుకున్నారు. రాత్రినుండి కలగూరగంప అయిన మెదడుకు కొంచెం తమాషా కావాలనిపించింది.

“ఈ మనిషికి తమాషా కావాలి! దానికి బలిపశువును నేను!! ఒక జనప్రియ సాహితి, ప్రొఫెసర్!!!”

ఆయన నుండి జబ్బను విడిపించుకున్నాను. “అదేమో శశి ఆతహత్య చేసుకోలేదు అంటున్నారు కదా” అన్నాను కొంచెం కటువుగా. ఆయన నవ్వు ఇంకా పెద్దదయింది. “రండి చెప్తాను” అంటూ బాల్కనివైపు వీపు చేశారు. సోఫా చేరుకుని ఒక్కొక్క పదాన్ని తూచి తూచి చూస్తున్నట్టు నిదానంగా మాటలు వదిలారు. “శశిధర్ హత్య చేయబడ్డాడు అని ఎందుకు అనుమానం వచ్చిందంటే అతడి రక్తంలో విస్కీ, నిద్రమాత్రల అంశాలు ఉన్నాయి అని ఫోరెన్సిక్ రిపోర్ట్ చెప్పింది. అంటే, శశికి ఎవరో నిద్ర మాత్రలు కలిపిన విస్కీ తాపించి బాల్కనీ నుండి క్రిందికి తోసేశారు.”

నేను కంగారుగా ఆయన వైపు చూశాను. ఆయన మొహంలో అదే నవ్వు. “సరే. అంతా తొందరగా చెప్పేస్తాను. ఇక్కడ ఇంకా ఎక్కువ సేపు ఉండలేను. ఇంటికెళ్ళి కొంచెం సేపు నిద్రపోవాలి నేను. రాత్రంతా జాగరణ అయింది.”  ఆవులించారు. ఉన్నట్టుండి గంభీరంగా మారిపోయారు. తరువాతి మాట ఫట్ మని బయటికి వచ్చింది. “ఉదయం నేను మీ ఇంటికి వచ్చింది ఊరకే మిమ్మల్ని చూసి వెళ్దామని సార్. మీరు బాత్రూంకు వెళ్ళినప్పుడు ఊరుకోకుండా అక్కడా ఇక్కడా తిరిగాను. డైనింగ్ టేబుల్ పైనున్న వస్తువులు నన్ను ఆశ్చర్యపరచాయి. నోట్ బుక్‌లో ఉన్నది శశిధర్ చేతివ్రాత అని మేజర్ సదాశివం గారు చెప్పారు. ఓపన్ అయిన పేజీ మూలలో చిన్న అక్షరాలతో నిన్నటి తేదీ రాసుంది.” కొద్దిగా ఆగారు. నా కంగారు ఇంకా పెరిగింది. శశి నోట్ బుక్‌లో నాకు తేదీ కనబడలేదే? రామనాథ్ నాతో ఇంకా తమాషా చేస్తున్నారా? నా మెడ ఆటోమేటిగ్గా డైనింగ్ టేబల్ వైపు తిరిగింది. రామనాథ్ గొంతు మళ్ళీ అతడి వైపు లాగింది. “దాన్ని చూడగానే శశిధర్ నిన్న రాత్రి ఇక్కడ ఉన్నాడు అని అర్థమయింది. టేబల్ పైనున్న వస్తువులను చూసి, అతడు ఇక్కడ ఉన్నది సాయంత్రం లేదా రాత్రి అని అనుకున్నాను. మిమ్మల్ని ఉపాయంగా సదాశివం గారి ఇంటికి పంపి ఇక్కడి వాటి ఫోటోలు తీసుకున్నాను. సగం సగం నింపిన పెగ్గులను, సగం ఖాళీ అయిన విస్కీ బాటల్ ని, టిస్యూ పేపర్ పైనున్న ఎముకల ముక్కలను బయటికి పంపాను. పెగ్గులు పగిలిపోయాయని మీకు చెప్పమని మీ పనిమనషికి నేనే చెప్పాను. తను ముందుగా ఒప్పుకోలేదు. కొంచెం పోలీసు ధమ్కీ ఇచ్చాక ఒప్పుకుంది.”  నవ్వుతూ కొనసాగించారు. “దొరికిన దాన్నంతా ల్యాబ్‌కి పంపాను. ఒక అరగంట క్రితం రిపోర్ట్ వచ్చింది. ఎముకల ముక్కల పైన శశిధర్ ఎంగిలి ఉంది. నోట్ బుక్ పక్కనున్న పెగ్గులో ఉన్న విస్కీలో నిద్రమాత్రలు ధారాళంగా కరిగి ఉన్నాయి. మరో వైపున్న పెగ్‌లో, అది మీది, అందులో ఏమాత్రం లేదు. ఈ వివరాలను పోస్ట్ మార్టమ్ రిపోర్ట్ తో తూచాను.” ఒక్కసారిగా ఆపి నా మొహం ముందుకు తెచ్చారు.

నా పరీక్ష గడియ అది!

వెంటనే సర్దుకున్నాను. “ఎస్ మిస్టర్ రామనాథ్, నిన్న సాయంత్రం శశి నాతో పాటు ఉన్నాడు. ఇద్దరూ విస్కీ తాగింది నిజం. కానీ శశి ఫోన్ తెచ్చుకుంటానని క్రిందకి వెళ్ళాడు. మళ్ళీ పైకి రాలేదు. వెతుకుతూ వెళ్తే అక్కడ అతడు తన ప్రేయసి తనకు మోసం చేసి వెళ్ళిపోయిందని ఏడుస్తూ కూర్చున్నాడు. ఓదార్చి పైకి వచ్చాను. మా పార్టీ అక్కడితో ముగిసింది. అతడి కష్టం చూసి నాకూ బాధ అనిపించింది. వచ్చి పడుకున్నాను. ఉదయం మీరు లేపినప్పుడే నాకు మెలకువ” స్పష్టంగా చెప్పాను. జరిగింది చెప్పడానికి నాకు ఉలుకెందుకు?

రామనాథ్ గట్టిగా నవ్వారు. “సరే. మీ మాటను నేను ఒప్పుకుంటాను. కానీ శశిధర్ పెగ్గులో నిద్రమాత్ర ఉండింది. మీదాంట్లో లేదు. ఈ చోద్యానికి వివరణనివ్వండి” ప్రశ్న నా ఛాతిలో గునపంలో దిగింది.

“అది నాకు తెలియదు. శశి నిద్రమాత్ర ఎందుకు మింగాడో నాకు తెలియదు. దాన్ని నేను గమనించనేలేదు.” తడబడ్డాను.

రామనాథ్ గబుకున్న లేచి నిలబడ్డారు. “అలాగయితే మీ కిచెన్ లోని డస్ట్ బిన్లో ‘ఫినోబాబిర్ టోన్’ మాత్రల ఖాళీ బాటల్ ఎలా వచ్చింది? దాని పైనంతా మీ వ్రేలిముద్రలు ఎలా వచ్చాయి?” ప్రశ్న సూటిగా ఉంది. నా మెదడు మొద్దుబారింది. రామనాథ్ ప్రశ్నల దాడి కొనసాగింది. “శశిధర్‌ను పార్టీకని పిలిచి విస్కీకి నిద్ర మాత్రలు కలిపి, బాల్కనీకి తీసుకెళ్ళి క్రిందికి తోసేశారు మీరు! అతడు తమ తలుపుకు తాళం వేసి ఎడమ చెయ్యి చిటికెనవ్రేలుతో తిప్పుతూ మెట్లెక్కి మీ ఇంటికి వచ్చినందుకు జంట సాక్ష్యం ఉంది. ఆ తాళం చెవి శవం యొక్క అదే చిటికెన వ్రేలుకు అలాగే ఉంది. అతడిని బాల్కనీనుండి క్రిందికి తోయడానికి సౌకర్యంగా ఉంటుందని పిజియన్ నెట్ విప్పి క్రిందికి విసిరేశారు. దాన్ని విప్పింది నిన్న కాదు అని కథ చెప్పకండి. నిన్న సాయంత్రం ఏడున్నర ప్రాంతంలో మీరు దాన్ని విప్పడానికి చేసిన సర్కస్‌కు క్రింద వాకింగ్ చేస్తున్న శ్రీమతి శ్రీదేవి క్షీరసాగర్ గారు సాక్ష్యం ఉంది. నిద్ర మాత్రల ప్రభావానికి లోనై మగతగా ఉన్న శశిధర్‌ను మీరు బాల్కనీ వైపు నడిపించుకుని తీసుకెళ్ళినందుకు సాక్ష్యం అతడు వేసుకన్న టీషర్ట్ వీపు పైన మీ వేలిముద్రలు ఉన్నాయి. క్రిందికి తోసినందుకు గుర్తుగా అతడి మెడ పైన మీ మూడు వేలిముద్రల బలమైన గుర్తులు!” అంటూ ఆపారు. నా వైపు పదునుగా చూసి “చెప్పండి. శశిధర్‌ని హత్య చేసే అవసరం ఎందుకు వచ్చింది?”

“లేదు ఇన్‌స్పెక్టర్! ఇక్కడేదో గడ్బడ్ అయ్యింది! పాపం, అతడిని చంపే అవసరం నాకెందుకు వస్తుంది చెప్పండి?” అని చెప్పడానికి అపసోపాలు పడ్డాను. స్వీయరక్షణలో నేను సృష్టించిన పాత్రలకంటే పేలవమయ్యాను నేను.

రామనాథ్ మళ్ళీ గట్టిగా నవ్వారు. “నేను అన్ని సాక్ష్యాలను చేతిలో ఉంచుకునే మిమ్మల్ని పట్టుకున్నాను. పరిశోధన అంటే మీరు ఈ నాలుగు గోడల మధ్యలో కూర్చుని, మీరు వదిలే గాలినే పీల్చుకుంటూ కట్టే కట్టుకథ కాదు. చురుకు కళ్ళు, ముక్కు, చెవులు పెట్టుకుని అన్నివైపులా దూసుకెళ్ళి సమగ్రమైన సాక్ష్యాన్ని సంగ్రహించి మెదడు అనే మిక్సీలో వేర్వేరు స్పీడ్లలో రుబ్బుకుని తయారు చేసే పర్ఫెక్ట్ మసాలా అది. నేను దాన్నే చేశాను. అలాంటి వాడిని శశిధర్‌ని చంపే అవసరం ఎందుకు వస్తుంది అని అడిగారు కదా! సరే. మీకు తెలిసినదాన్ని మీకే చెప్తాను. శశిధర్ గారికి అపరాధ పరిశోధన సాహిత్యంలో పేరు గడించాలని కోరిక. ఒక నవల రాశారు. దాన్ని అతడి అక్క చదివి చాలా మెచ్చుకున్నారు. చదివి అభిప్రాయం చెప్పమని మీకు ఇచ్చారాయన. మీ పైన ఆయనకు చాలా గౌరవం. కానీ దాని గురించి మీరు ఇంతవరకూ ఏమీ చెప్పలేదు! ఎవరెవరో పరిచయం లేని వాళ్ళు కూడా పంపిన కథలను వెంటనే చదివి అభిప్రాయం తెలిపి, ప్రోత్సహించే మీరు ఇంత దగ్గరి అభిమాని రాసిన నవల పై నెలవరకూ మౌనం! ఇలా ఎందుకు అనేది వసంతగారి ప్రశ్న. ఇదంతా నాకు ఉదయాన్నే ఫోన్లో చెప్పారు. మేజర్ సదాశివంగారి ఇంట్లో మీరు టీకి కూర్చున్నప్పుడు ఇక్కడే నేను ఆమెతో మాట్లాడింది. ఆమె చెప్పిందంతా విని, ఇక్కడ ఒకసారి చెక్ చేశాను. శశిధర్ నవల ఉన్న నోట్ బుక్కులు మీ టేబల్ పైన కనిపించలేదు. బెడ్రూం టేబల్ పైన కూడా లేదు. ఇటీవల మీరు కొత్తగా ఏమీ రాసినట్టు కనబడలేదు. కానీ మీ కొత్త నవల ఒకటి సినిమాగా వస్తున్నదని వైభవంగా సెట్ కెక్కిందని ఎక్కడో చదివినట్టు గుర్తు. డైరెక్టర్ నవనీత్ చంద్రగారిని కాంటాక్ట్ చేస్తే నవల వివరాలు తెలిశాయి. అది పక్కా శశిధర్ నవల అని వసంతగారు కన్ఫర్మ్ చేశారు. మిమ్మల్ని ఇంకా గట్టిగా కట్టివేయడానికి మీ కాలేజ్ అధికారుల పర్మిషన్ తీసుకుని మీ కంప్యూటర్ చెక్ చేశాను. శశిధర్ నవల వేరొక పేరుతో అక్కడ దొరికింది. మీరు దాన్ని నవనీత చంద్రగారికి మెయిల్‌లో పంపిన వివరాలు మా ఐటి ఎక్స్పర్ట్ చెప్పారు” రామనాథ్ గారి వాక్ప్రవాహం ఆగింది. నేను పూర్తిగా మునిగిపోయాను.

నాలో కొద్దిగా ధైర్యం మిగిలి ఉండింది. పెదవి విప్పాను. “లేదు రామనాథ్ గారూ! ఇక్కడేదో గడబిడ జరిగింది” అంటుండగానే నా మాటను సగానికి విరిచేశారు. “గడబిడ మీరు చేసుకుంది అవసరానికంటే ఎక్కువగా! శశిధర్ గారిని ముగించెయ్యడానికి అంతా ప్లాన్ చేసి అతడి అక్క బావ లేని సమయాన్ని ఎంచుకున్నారు. మీ భార్యా పిల్లలను బలవంతంగా మరదలి ఇంటికి పంపారు. నిజంగా అయితే మిమ్మల్ని ఒంటరిగా వదిలి వెళ్లడానికి మీ శ్రీమతికి ఇష్టం లేదు. అలాగని మీ షడ్డకుడు నారాయణ మూర్తి చెప్పారు. అనుమానంగా ఉంటే మీ శ్రీమతిగారినే అడుగుదాం” మాటలాపేసి తలుపు వైపు తిరిగారు. నేను కూడా అటు వైపు తిరిగాను.

తెరచిన తలుపుల వద్ద ప్రియా స్థాణువులా నిలబడుంది. ఆమె వెనుక సంగీత, నారాయణ మూర్తి, ఇద్దరు పిల్లలు ప్రియాకు ఆనుకుని, గాబరాగా చూస్తూ నుంచున్నారు.

నా చూపు తన వైపు తిరగగానే ప్రియా కళ్ళు వెడల్పుగా తెరిచింది. ఆమె ఛాతీ ఒకసారి వేగంగా ఎగిసింది. రెండు అరచేతులు చెవులకు పెట్టుకుని ఒక్కసారి జోరుగా వెక్కింది. పిల్లలిద్దరూ ఆమెను ఇంకా గట్టిగా పట్టుకున్నారు. తలలను ఆమె పొట్టకు ఆనించి జోరుగా ఏడవసాగారు.

ఆ దృశ్యం నా కళ్ళనుండి మరుగయ్యింది. తీసిన కళ్ల ముందు ఎరుపు, ఊదా, పసుపు రంగుల వెలుగు వృత్తాలు. అవి తీక్ష్ణంగా ఉన్నాయి. భయంకరంగా తిరుగుతున్నాయి. అదంతా ఒక్క క్షణం అంతే. తరువాతి క్షణంలో నా కళ్ళ ముందు నల్లని చీకటి!

(సమాప్తం)

కన్నడ మూలం: ప్రేమశేఖర్

అనువాదం: చందకచర్ల రమేశబాబు

Exit mobile version