కథ – మానవసంబంధాలు

0
2

[box type=’note’ fontsize=’16’] “మానవ సంబంధాలను స్పృశించకుండా ఏ కథ వుండదు. మానవ సంబంధాలు బాగున్నాయనో, బాగా లేవనో, థ్వంసం చేయబడ్డాయనో కథలు చెప్పబడతాయి” అంటున్నారు ఎం.కె. కుమార్ ఈ వ్యాసంలో. [/box]

కథ మౌఖికంగా మొదలై రాతకు చేరువైంది. రాత కవిత్వమై, కథై నాటకంగా మారింది. తర్వాత క్రమంలో నాటకం, సినిమా అయింది. వీటన్నిటికి మూలమైన సంభాషణ మానవుడు మాట్లాడటం మొదలుపెట్టినప్పటి నుండి మొదలైంది. భాష ఏర్పడ్డప్పుడే కథ కూడా ఏర్పడి వుంటుందని కథకులు భావిస్తుంటారు. భావాలను పంచుకోవడానికి సంజ్ఞలు మొదట్లో ప్రముఖ స్ధానం వహించేవి. కొన్ని సంజ్ఞలు కథగా కూడా మార్పు చెందేందుకు అవకాశం వుంది. కథ వ్యక్తీకరణకు ప్రతిరూపంగా చెప్పవచ్చు. కథ అతి ప్రాచీనమైనదని చెప్పడంలో అతిశయోక్తి లేదు. అయితే అచ్చు యంత్రాలు వచ్చిన తర్వాత ఈ కథ మొదట రాశారు అని కథకులు చెప్పడం మొదలుపెట్టారు. అన్ని మత గ్రంథాల్లో సారం అంతా కథల రూపంలోనే చెప్పారు. కథ రూపంలో ప్రజలకు చెప్పాల్సిన విషయాన్ని స్పష్టంగా చెప్పడం ద్వారా ప్రజల్లో చైతన్యాన్ని, భావజాలాన్ని పెంపొందించవచ్చు. కథకు వున్న ఈ ప్రత్యేకత వల్ల కథ సాహిత్యంలో మొదటిస్ధానాన్ని ఆక్రమించింది. అలాగే కథకున్న ప్రాథాన్యత రీత్యా విమర్శకుల తాకిడి కూడా ఎక్కువుగా వుంటుంది.

మానవ సంబంధాలను స్పృశించకుండా ఏ కథ వుండదు. మానవ సంబంధాలు బాగున్నాయనో, బాగా లేవనో, థ్వంసం చేయబడ్డాయనో కథలు చెప్పబడతాయి. ఈ కథా వస్తువుతోనే రచయితలు కథలు చాలా రాస్తుంటారు. అంతిమంగా కథా ప్రయోజనం మానవసంబంధాలను పెంపొందించడానికి ఉపయోగపడుతుంది. ఆహారసేకరణలో మానవులు సమూహాలుగా వుండి తమ సమాచారాన్ని ఇచ్చిపుచ్చుకునేవారు. కథా చిత్రాల ద్వారా తాము చేసిన పనిని చిత్రీకరించుకునేవారు. మానవులు సమూహాలుగా వుండటం వల్ల, ముఖ్యంగా కలిసి ఆహారసేకరణను చేయడం వల్ల మానవసంబంధాలు మెరుగయ్యాయి. పనికి మనుషులు కలవడం అవసరం. ఉమ్మడి కార్యాచరణ లేనిదే ఆహార ఉత్పత్తి కాని, వస్తు ఉత్పత్తి గాని జరగదు. అంటే పని చుట్టూనే మానవసంబంధాలు ఏర్పడతాయి. పని క్షేత్రం లేని స్ధలాల్లోను మానవసంబంధాలు వుంటాయి. అలాగే మత కార్యక్రమం, తంతు కార్యక్రమం, కుటుంబంలోను వుంటాయి. ఒక ఇద్దరు మనుషులు కలిసిన ప్రతిచోట సంబంధాలు వుంటాయి. అయితే పని చుట్టూ జరిగే సంబంధాలు జీవితకాలం పాటు కొనసాగుతాయి. ఇవి మనుషులపై, వారి మధ్య వున్న సంబంధాలపై ఘాడ ముద్ర వేస్తాయి. ఉత్పత్తి చుట్టూనే మానవసంబంధాలు ఏర్పడతాయి. ఉత్పత్తి సంబంధాలు మారినప్పుడల్లా మానవ సంబంధాలు మారతాయి. ఆధునిక శ్రమ విభజనలో అసంఘటిత రంగం ఎక్కువయింది. సాంకేతిక పరిజ్ఞానం ఉత్పత్తి ప్రక్రియలో వేగంగా వృద్ధి పొందుతోంది. ఇంట్లోనే కంప్యూటర్‌తో పనిచేసుకునే విధానం వచ్చింది. అంటే దాదాపుగా వస్తువు ఉత్పత్తిలో సంబంధంలేని వర్గాన్ని ఆధునిక పారిశ్రామిక విధానం తయారుచేసింది. నిజానికి వీరు వస్తువు ఉత్పత్తిలో ప్రత్యక్షంగా లేకపోయినప్పటికీ, పరోక్షంగా వుండాల్సిందే. ఇది మనిషి పరాయూకరణకు దారి తీసింది. మానవసంబంధాల్లో క్లిష్టతను పెంచింది.

మానవసంబంధాలు ఏర్పడ్డానికి ఉత్పత్తి ఒక సాధనంగా పనిచేస్తుంది. ఉత్పత్తి ప్రక్రియలో మార్పులు మానవసంబంధాల్లో మార్పులను తీసుకొచ్చాయి. ఈ మార్పులు మనిషి జీవితాన్ని నాశనం చేయడంతో పాటు, మనిషిని ఆత్మనూన్యత వైపు నెట్టాయి. భావజాలంలోని మార్పులు కూడా మానవసంబంధాల్లో సంక్షోభాలను తీసుకొస్తుంది. ఉత్పత్తి ప్రక్రియలో సహజత్వం, క్రమపద్ధతి దూరమవుతుండటం, మానవసంబంధాల్లో అవాంఛనీయ ధోరణులకు దోహదం చేస్తుంది. మానవసంబంధాల్లోని మార్పులు గ్రూపుల్లో కనబడటం ఎక్కువయింది. ఈ స్థాయిలో మానవులను గ్రూపులుగా విభజించి వారందరిపై ఒక భావజాలాన్ని రుద్దడం మొదలైంది. ఇది మనుషులను ఒక మతంలోకి, వర్గంలోకి, కులంలోకి, జెండర్‌లోకి కుక్కింది. మానవసమాజంలో వచ్చిన ఈ మార్పులే మనుషులను మరిన్ని చిన్న గ్రూపులుగా చేసింది. ఈ గ్రూపులు లేదా బృందాలు అస్థిత్వ పోరాటాల వైపు మళ్లడానికి వ్యవస్ధలోని సంక్లిష్టత, వైరుధ్యాలు దోహదం చేశాయి. అంతిమంగా మనుషులందరినీ డబ్బు చుట్టూ, మార్కెట్‌ చుట్టూ తిప్పుకునే ఒక భావజాల పద్ధతి తయారయింది. ప్రతి మనిషి తనకు తానుగా, భౌతిక పరిస్ధితుల రీత్యా తనకంటూ ప్రత్యేకమైన, స్వంతమైన భావజాలాన్ని తయారుచేసుకుంటాడు. ఈ భావజాలంలో మార్పులు నిరంతరం వస్తుంటాయి. ఇవి ఉత్పత్తి సంబంధాలతోను, వాటి ఉపరితలంతోను నిరంతరం ఘర్షణ పడుతూ వుంటాయి. ఇది మానవసంబంధాల్లో సంక్లిష్టతను మరింత పెంచింది. మనిషిలో మానవత్వాన్ని స్పృశించడానికి పెట్టుకున్న కొలమానాలు, చట్రాలు మారాల్సిన పరిస్ధితిని కల్పించింది. వీటన్నిటని కథ తనలో ఇముడ్చుకుంటూనే వచ్చింది. అందుకే కథలో అనేక మార్పులు జరుగుతూనే వున్నాయి. మనిషి ముడుచుకునే కొద్దీ, మానవుని సంబంధాలు కుచించుకుపోయాయి. ఊర్లో రచ్చబండ మీద వున్న మనిషి, వీధిలోకి, ఇంటిలోకి చివరికి ఇంటిలోని బెడ్‌రూమ్‌కు కట్టివేయబడ్డాడు. ఆధునిక సాంకేతికత పుణ్యమా అని మనిషి సెల్‌ అనే వస్తువుకు కుట్టి వేయబడ్డాడు. అలాగే జీవితంలో ఆధిపత్య సంస్కృతి స్పీడును పెంచింది. స్పీడుకు తగ్గట్టు, ఇన్‌స్టెంట్‌ న్యాయం ఉత్పత్తి చేయబడింది. ఇదే మొబైల్‌ పోలీసులను తయారుచేసింది. రెస్క్యూటీములు, వివిధ రకాల టీములు పట్టణాలనుండి అడవుల్లోకి దూరాయి. మార్కెట్‌ ఒక పక్క మనిషిలోని నైపుణ్యాన్ని చంపుతుంటే, మరోవైపు ప్రభుత్వం మనుషులను బల ప్రయోగంతో భయపెట్టడం ప్రారంభించింది. దీంతో స్వేచ్ఛ బందీ అయ్యి, రాతకు పరిమితులు ఏర్పడ్డాయి. ఇది కథకు కావలసిన స్వేచ్ఛాయిత వాతావరణాన్ని ధ్వంసం చేసింది.

రెడీమేడ్‌ పరిష్కారాలు డబ్బు ద్వారా సాధ్యమవుతున్నప్పుడు కథ నిడివి తగ్గిపోయి తన ప్రాభవాన్ని కోల్పోయింది. పెద్ద కథను నవల అనడం ప్రారంభించారు. గొలుసుకట్టు కథలు మత గ్రంథాలుగా చెలామణి అవడం ప్రారంభించాయి. వేల సంవత్సరాలపాటు మానవసంబంధాల్లో వచ్చిన మార్పులను కథల రూపంలో మత గ్రంథాల్లో శిల్పసౌందర్యంతో చొప్పించడం వల్ల అవి మంచి కథల పుస్తకాలుగా పేరెన్నికగన్నాయి. విశ్వాసాలు, నమ్మకాలు ప్రాతిపదికన వస్తున్న కథల్లో ఊహాప్రపంచం ఎక్కువుగా వుంటోంది. మానవుడు తమ సమస్యల పరిష్కార కోసం వేరే లోకాలను కల్పించడం జరిగింది. మానవశక్తికి మించిన శక్తులను నమ్మడం ప్రారంభమయింది. ఇది భావకథనానికి దారితీసింది. ఊహా కథావస్తువులు తయారయ్యాయి. భౌతిక ప్రపంచంతో సంబంధం లేకుండా వచ్చిన కాల్పనిక సాహిత్యం సమాజాన్ని ఊర్రూత లూగించిందని చెప్పడంలో అతిశయోక్తి లేదు. కాని కథకున్న సామాజిక ప్రయోజనాన్ని దృష్టిలో పెట్టుకుంటే అవి మానవసంబంధాల్లో మెరుగైన మార్పులను తీసుకురాలేదనే అంశాన్ని విమర్శకులు గ్రహించారు.

మానవసంబంధాల విశ్లేషణకు కథ అద్భుతంగా ఉపయోగపడుతుంది అనడంలో సందేహం లేదు. మానవసంబంధాల మద్య మానవత్వం లేనప్పుడు, ప్రేమ పూర్వక వాతావరణం లేనపుడు కథను ఎందుకు రాయాలి అనే ప్రశ్న వస్తుంది. మానవసంబంధాలు ఎంత హీనంగా వున్నాయో, వాటిని బలోపేతం చేయడానికి సమాజం ఏం చేయాలో కథా రచయిత రాయచ్చు. లేదా మానవసంబంధాలను ప్రభావితం చేస్తున్న ఉనికిలో వున్న వ్యవస్థీకృత అంశాల గురించి రాయచ్చు. దీనికి కథారచయితకు కావలసింది పరిశీలనా శక్తి, విశ్లేషణా శక్తి. దృక్పథం వున్న రచయితలకు సామాజిక బాధ్యత కూడా వుంటుంది. ఇటువంటి రచయితలు అభూతశక్తులకు సంబంధించిన, అశాస్త్రీయమైన కథావస్తువులపై పెద్దగా దృష్టిని కేంద్రకరించరు. వారి సమయాన్ని వృథా చేసుకోరు. కథా రచయిత తన స్వరాన్ని సైతం కథలో వినిపించాల్సి వస్తుంది. వస్తుగతంగా వున్న పాత్రల స్వభావాన్ని యథాతదంగా రాయడం గాక, పాత్రల స్వభావాలు మారడానికి గల కారణాలను విశ్లేషించాల్సి వస్తుంది. కథారచయిత శైలి, దృక్పథం, కథనం బలంగా వుంటే, ఆ కథ ఖచ్చితంగా మానవసంబంధాలను ప్రభావితం చేయగలదు. పాఠకులలో చైతన్యాన్ని తీసుకురాగలుగుతుంది. కథారచయితకు మానవ చరిత్ర పట్ల అవగాహన వుండాలి. సమాజంలోని వ్యవస్థల్లో వస్తున్న మార్పుల పట్ల పరిశీలన వుండాలి. లేనిపక్షంలో వాస్తవిక సంఘటనల ఆధారంగా కథను యథాతధంగా రాయడం జరుగుతుంది. సామాజిక అభివృద్ధి భావజాలంలో మార్పులు చాలా అవసరం. మనుషుల మధ్య వున్న సంబంధాలను ప్రభావితం చేసే అంశాల పట్ల నిర్దిష్టమైన అవగాహన వుండాలి. దీనికి సమాజ గతి, హేతువు, తర్కము, చారిత్రక అవగాహన, వస్తుగత విశ్లేషణ, శాస్త్రీయ ఆలోచన కథారచయితకు అవసరం అవుతాయి.

కథా రచయిత గొప్ప మేధావి కానవసరం లేదు. కేవలం శాస్రీయ పరిశీలనా శక్తి వుంటే సరిపోతుంది. అది తెలియకుండానే వారి కథల్లో స్పష్టమవుతుంది. నిజానికి గొప్ప మేధావులు అన్న వారెవరూ గొప్పగా కథలు రాయలేదు. గొప్ప కథలు రాసినవారెవరు మేధావులుగా చెలామణి కాలేదు. మేధావికి, మంచి కథారచయితకు మధ్య వున్న చిన్నతేడా అల్ల సృజనాత్మకత. ఒకే కథా వస్తువును ఎన్నుకున్న రచయితల్లో కథాశిల్పం వల్ల కథలో, కథనంలో తేడా వుంటుంది. ఈ కథా శిల్పమే కథను మంచికథగా మలుస్తుంది. కథల్లోని పాత్రల అమాయకత్వం వెనుక దాగున్న ఉన్నతమైన మానవసంబంధాలను చూపించడంలో కథాశిల్పం ప్రముఖ పాత్ర వహిస్తుంది. కుటుంబవ్యవస్ధ ధ్వంసం కావడానికి లేదా బలహీన పడటానికి అనేక చారిత్రక, భౌతిక అంశాలు కారణంగా వుంటాయి. కుటుంబ విధ్వంసానికి ఉత్పత్తి సంబంధాల్లో వస్తున్న మార్పులు ప్రధానకారణంగా వున్నాయి. ఈ మార్పులు భౌతికంగా కనిపించే దానికన్నా, అవి మనిషిలోని మానవత్వాన్ని తగ్గించి, స్వార్ధాన్ని, వ్యక్తిగతవాదాన్ని ఎక్కువ పెంచుతాయి.

కాళీపట్నం రామారావు గారి తరంలో ఆయన రాసిన కథలు దాదాపుగా కుటుంబంలో వస్తున్న మార్పులు గురించి రాశారు. అసమాన వ్యవస్థలో, మానవసంబంధాల మధ్య అనేక అంతరాలు వుంటాయి. ఈ అంతరాలు మనుషుల మధ్య ఘర్షణను పెంచుతాయి. అలాగే మనిషిలోను రెండు విరుద్ధ ఆలోచనల మధ్య సంఘర్షణ వుంటుంది. భౌతిక అంశాల పట్ల వ్యాస రచయితలు పుంకానుపుంకాలుగా వ్యాసాలు రాస్తారు. కాని మనిషిలోపల జరుగుతున్న విధ్వంసాన్ని కథా రచయిత మాత్రమే బలంగా చెప్పగలడు. ఈ అంశాన్ని కారా కథలు ఎక్కువుగా చెప్పగలిగాయి. వ్యవస్థలో వున్న అసమానతను, ధనిక-పేద మధ్య వున్న ఆర్థిక సంబంధాల తేడాను ఏ విధంగా ప్రభుత్వం పెంచిపోషిస్తుందో కారా కథల్లో చెప్పబడింది. ఇది అంతిమంగా కుటుంబం మీద ప్రభావితం చేయబడి, కుటుంబంలో రెండు శత్రు దేశాల మధ్య జరుగుతున్నంత విధ్వంసం ఎలా జరుగుతుందో చూపబడింది. అంటే ప్రభుత్వానికి అసమానతలను పెంచి పోషించడానికి తన స్వార్ధప్రయోజనాలే కారణంగా వుంటాయని పరోక్షంగా పాఠకుడికి అర్థమయ్యే రీతీలో కారా కథలు వుంటాయి. ప్రజాస్వామ్యంలో ఎన్నికల ప్రక్రియలో గెలుపొందిన పార్టీ 5 సంవత్సరాల్లో నిరంకుశమైన పరిపాలనను ప్రజాస్వామ్యం ముసుగులో అమలు చేస్తుంది. ప్రజలు సోకాల్డ్‌ ప్రజాస్వామ్యాన్ని వ్యతిరేకించడానికి వారికి అందుబాటులో వున్న మార్గం ఎన్నికలు. అందుకే ఓటుబ్యాంకు రాజకీయాలు ఎక్కువయ్యాయి. పార్టీను మార్చడం తప్ప ప్రజలకు ఈ ప్రజాస్వామ్య వ్యవస్ధలో వేరే ప్రత్యామ్నాయం లేకుండా చేయడమే ప్రజాస్వామ్యం ముసుగలో అమలవుతున్న నిరంకుశత్వం. ఇదే నిరంకశత్వం కుటుంబంలో బాధ్యత, ప్రేమ, మమకారం పేరుతో అమలవుతుంటాయి. కుటుంబ యజమాని తన కుటుంబసభ్యుల మీద అమలుచేస్తాడు. ఈ అంశాన్ని కారా కథలు ఎత్తిచూపాయి. కుటుంబంలో చర్చాపూరిత వాతావరణం అసలు కనిపించదు. ఇంట్లో గదుల మధ్య గోడలే గాక, భార్యా, భర్త, పిల్లల మధ్యా గోడలు వుంటాయి. ఇవి ఏంతో బలమైన మానసిక శక్తితో నిర్మించబడతాయి. వీటిని బద్దలు కొట్టడానికి యజమాని ఏ మాత్రం ప్రయత్నించడు. అందువల్లే చిన్న విషయాలు పెద్ద సమస్యలుగా రూపాంతరం చెంది, జీవితకాల ఘర్ణణను కొనసాగిస్తాయి. ప్రేమ పెళ్లిళ్లు, కులాంతర వివాహాలు చేసుకుంటున్నప్పుడు, యజమాని పరువు కోసం తాపత్రయపడతాడు. చివరకి కులదురంహకార హత్యలకు పాల్పడటం నేటికి జరుగుతూనే వుంది. కుటుంబంలోని సభ్యులు యజమాని నిరంకుశత్వం వల్ల నష్టపోతారు. మరోవైపు వ్యవస్ధలో వున్న మతం, కులం, జెండర్‌, ప్రాంతీయత, నిరుద్యోగం, మార్కెట్‌, డబ్బు వంటి అంశాల వల్ల తీవ్ర మనోవేదనకు లోనవుతారు. పరువు, ప్రతిష్ట లాంటి మాయావిలువల పట్ల కుటుంబ యజమానికి వున్న విపరీతమైన ప్రేమను కుటుంబాన్ని నాశనం చేస్తుంది. వైరుధ్యాలు మరింత తీవ్రమై కుటుంబాలు రెండుగా చీలిపోతాయి. డబ్బు, ఆస్థి కుటుంబంలో చిచ్చు పెడుతుంది. ఉమ్మడి కుటుంబం చీలడానికి ఈ అంశాలన్నీ ప్రధాన కారణాలుగా వున్నాయి. కుటుంబంలో ప్రజాస్వామిక వాతావరణాన్ని కల్పించడానికి కుటుంబ పెద్ద ఏ మాత్రం ప్రయత్నించకపోవడం ఎక్కువుగా జరుగుతుంది. చివరికి కుటుంబ సభ్యులు ఆత్మన్యూనత వైపు నెట్టబడతారు. ఇది ఆత్మహత్యలకు దారితీస్తుంది. కుటుంబాల్లోకి జొరబడిన విపరీత ధోరణులకు మూల కారణాన్ని అన్వేషించడంలోనే కథారచయిత గొప్పతనం వుంటుంది.

ఆ మూల కారణానికి పరిష్కారాన్ని కనుగొనగలిగి, కనీసం భావితరాలన్నా ప్రేమగా వుండగలరని చెప్పగలిగితే అతను గొప్ప కథకుడు అవుతాడు. కారా తాను రాసిన చివరికథల్లో ఒక అంశాన్ని వెలికితీశారు. అసలు కుటుంబ యజమాని తన కుటుంబానికి మంచిచేయాలనుకున్నా చేయలేడని తేల్చబోయాడు. కారా రాసిన మొదటి కథలు, చివరి కథలు మధ్య జరిగిన సామాజిక వరిస్థితులను పరిశీలించాలి. అప్పుడే కారా విశ్లేషించడంలోను ఒక మంచి రచయితగా విజయం సాధించాడని చెప్పవచ్చు. కుటుంబం వెలుపల వున్న పరిస్ధితులు కుటుంబంలో వున్న ప్రజాస్వామిక వాతావరణాన్ని ధ్వంసం చేస్తాయని చెప్పారు. అంటే అంతిమంగా వ్యవస్ధలోని అంతరాలు, వైరుధ్యాలు కుటుంబం అనే యూనిట్‌ను బలహీనపరుస్తాయి. కుటుంబంలో వున్న కొద్ది ప్రజాస్వామిక వాతావరణాన్ని నాశనం చేస్తాయి. కుటుంబ సభ్యుల్లో వస్తున్న ఘర్షణకు ఆర్ధిక, సామాజిక, రాజకీయ కారణాలు కారణభూతంగా వున్నాయి. ఆర్ధిక కారణాలను మాత్రమే ప్రభుత్వాలు పట్టించుకుంటున్నాయి. అందుకే దేశంలోని పేదరిక జనాభాను 5 సంవత్సరాలలో 5 కోట్లు తగ్గించామని పాలకులు చెపుతున్నారు. ప్రభుత్వ లెక్కల ప్రకారం రోజు వేతనం రు.120 కన్నా తక్కువ వుంటే వారు పేదరికంలో వున్నట్లు లెక్క. సమాజానికి కుటుంబం యూనిట్‌ కాబట్టి, కుటుంబంలోని ఆర్ధిక పరిస్ధితులను మెరుగుపరచడానికి ప్రభుత్వాలు ప్రయత్నిస్తున్నాయి. వారికి ఉపాధిని కల్పించకుండా సంక్షేమ పథకాల ద్వారా తాత్కాలికంగా వారి పేదరికాన్ని తగ్గించడానికి ఓటు బ్యాంకు రాజకీయాలు చేస్తున్నాయి. కుటుంబంలోని వైరుధ్యాలను ఇది పరిష్కరించక పోగా, మరింతగా పెంచుతోంది. అందుకే సమాజంలో దురాచారాల పట్ల, జ్యోతిష్యం, వాస్తు పట్ల మమకారం ఎక్కువైంది. మనుషుల అంతరంగాల్లో జరుగుతున్న ఘర్షణను తగ్గించడానికి ఆధిపత్యశక్తులు ప్రయత్నం చేస్తున్నాయి. ప్రజలను ఇటువంటి అపభ్రంశ అంశాల వైపు మొగ్గుచూపేటట్టు చేస్తున్నారు. అందుకే హ్యారీపోర్టర్‌, దెయ్యాల సినిమాల స్వీకెల్స్‌కు ప్రజల్లో ఆదరణ పెరుగుతోంది. నూతన సాంకేతికతను విరివిగా ఉపయోగిస్తున్న ధనికదేశాల్లో వస్తున్న సినిమాల్లో పూర్తి ఊహాప్రపంచాలే రాజ్యమేలుతున్నాయి. దెయ్యం, ఏలియన్స్‌, మరో ప్రపంచం లాంటి నేల విడిచి సాము చేసే సినిమా సంస్కృతి అక్కడ పెరిగింది. పెట్టుబడిలో వస్తున్న సంక్షోభాలను నివారించడానికి ప్రభుత్వాలు వైఫల్యం చెందుతున్నాయి. ప్రజల్లో ప్రభుత్వం పట్ల పెచ్చరిల్లతున్న అసహనానికి తగ్గించడానికి ప్రభుత్వం ధనిక దేశాల్లో సినిమారంగాన్ని ఉపయోగించుకుంటోంది. అందుకే అక్కడ అభూత కథలకు, నవలలకు ప్రాచుర్యం ఎక్కువ లభిస్తుంది. సర్రియలిజంపై వచ్చే కథలకు అక్కడ ఆదరణ ఎక్కువ లభిస్తుంది.

కుటుంబంలో భౌతిక హింస వల్ల కుటుంబ సభ్యులు అనుభవించే బాధ, వారు అనుభవించే మానసిక హింసకన్నా చాలా తక్కువుగా వుంటుంది. టీవీల్లోని సీరియల్స్‌లో ఇప్పుడు ఈ మానసికహింసను గమనిస్తున్నాం. సోషల్‌ మీడియాల్లో విషప్రచారాలు, టెకీలు ఆడే మైండ్‌గేమ్స్‌ ఎందరో పౌరులను తీవ్రమైన మానసిక వత్తిడికి లోను చేస్తున్నాయి. వీటిని కారా తన కథల్లో కూడా ప్రదర్శించారు. మానసిక హింస పేదరికం వల్ల వస్తుంది. అప్రజాస్వామికత వల్ల వస్తుంది. ప్రేమ రాహిత్యం వల్ల వస్తుంది. కుటుంబాల్లో జరిగే మానసిక హింసకు సమాజం పెట్టుకున్న ముద్దు పేర్లు ప్రేమ, గారాభం, బాధ్యత, పరువు. కారా రాసిన హింస కథ ఈ అంశంపై ప్రత్యేక దృష్టి పెట్టింది.

ప్రేమను వ్యక్తీకరించడానికి సరైన స్ధలం, వాతావరణం ప్రేమికులకు మొదటినుండి లేదు. ఇది వారి మధ్య మనస్పర్ధలకు, అర్ధంచేసుకోలేక పోవడానికి దారితీస్తుంది. వీటిని పాత ఆలోచనలు రంకు అంటే, కొత్త ఆలోచనలు సహజీవనం అంటున్నాయి. స్నేహం అపార్ధాలకు దారితీయడానికి, మనుషుల మధ్య వున్న అనవసర ఇగోలేనని కారా రచనలు చెపుతాయి. మాననసంబంధాలు ఒక 30 సంవత్సరాల కాలంలో తీసుకున్న మార్పులను కారా కథలు ప్రతిఫలిస్తాయి. కారా తరం రచయితలు చాలామంది ఇదే అంశాలను తమ కథలో ఉపయోగించారు. వస్తువైవిధ్యం, శిల్పవైవిధ్యం వున్న కథల్లోను జీవధార తెగిపోకుండా అవి కొనసాగడానికి, కథల్లోని పాత్రల స్వభావాన్ని మానవసంబంధాల కోణంలో విశ్లేషించడమే. ఈ తరహా ధృక్పథం ఈ తరం రచయితల్లో తక్కువుగా వుంది. భవిషత్తు ఆశాజనకంగా వుండాలంటే మానవసంబంధాలు మెరుగుపడాలి. దీనికి రచయితలు తమ రచనల్లో మనుషుల భావజాలల్లో వచ్చిన మార్పులను చెప్పాలి. వాటిని కథావస్తువులుగా చేసుకోవాలి. వ్యవస్ధలో జరుగుతున్న పరిణామాలను, దాని విరుద్ధ దిశలో అర్థం చేసుకున్నప్పుడే పరిశీలనా శక్తి ఇనుమడిస్తుంది.

సామాజిక సంబంధాలు మారుతున్నప్పుడు మానవ సంబంధాలు మారతాయి. మార్కెట్‌, పెట్టుబడి స్వేచ్ఛను సంపాయించినప్పటి నుండి వ్యక్తిగత స్వేచ్ఛకు ప్రాముఖ్యత పెరిగి, సామాజక స్వేచ్ఛకు ఆటంకం ఏర్పడుతోంది. పెట్టుబడికి జాతి, కులం, మత, ప్రాంత, దేశ సరిహద్దులు లేవు కాబట్టి దానికి అంతార్జాతీయ స్వభావం వుంటుంది. ఇది దేశీయ పరిస్ధితులను, ఉత్పత్తి సంబంధాలను మార్చే ప్రయత్నం చేస్తుంటుంది. పెట్టుబడి లాభాలను ఆర్జించడానికి ఇది అత్యవసరం. ధనికదేశాల్లోని బ్యాంకులు వలస దేశాలను నియంత్రించినట్టే, మార్కెట్‌ ఆధిపత్యానికి వలసదేశాల్లోని ప్రభుత్వాలు దాసోహం అంటాయి. అందుకే మానవ సంస్కృతిలో పాశ్చాత్యుల సంస్కృతి జొరబడుతుంది. ఉమ్మడి కుటుంబాలు, చిన్న కుటుంబాలుగా మారడానికి మూలకారణం ఇదే. రచయితకు ఈ ప్రాపంచిక ధృక్పదం లేనప్పుడు అతని ఆలోచనలు కేవలం నాలుగు గోడలకు లేదా కుటుంబంలో జరిగే ఘర్షణలకు మాత్రమే పరిమితమౌతుంది. కుటుంబంలో వస్తున్న వైరుధ్యాలకు మూలకారణం బాహ్య ప్రపంచంలో జరుగుతున్న వస్తుగత పరిణామాలు అనే అవగాహన అతనికి లేకుండా పోతుంది. పెట్టుబడిలో అసమానతలు వున్నాయి. పెట్టుబడి స్వభావంలో వున్న ఈ వైరుధ్యాలే వ్యవస్ధలో పాత సంబంధాలను నిలిపి వుంచడానికి దోహదం చేస్తుంది. అందుకే మూఢాచారాలు, వాస్తు, జ్యోతిష్యం ఒకవైపు రాజ్యమేలుతుంటే ఆధునిక సాంకేతికత మరోవైపు రాజ్యమేలుతుంది. శ్రీహరికోటలో ఉపగ్రహాన్ని కక్ష్యలోకి ప్రవేశపెట్టడానికి పూజ నిర్వహించడం ఇందులో భాగమే.

మార్కెట్‌ విస్తరణకు పెట్టుబడి స్ధానిక ఆచార, సంప్రదాయాలను గౌరవించడం, లేదా వాటికి కట్టుబడి వుంటడం అవసరమవుతుంది. అందుకే వడ్డీవ్యాపారుల వ్యవస్ధ, జాతీయ బ్యాంకుల వ్యవస్ధ రెండూ గ్రామాలలో రాజ్యమేలుతుంటాయి. రైతు గతంలో అధిక వడ్డీ కట్టక ఆత్మహత్య చేసుకుంటే, ఇప్పుడు జాతీయ బ్యాంకులు పొలాన్ని జప్తు చేయడం భరించలేక ఆత్మహత్య చేసుకుంటున్నాడు. ఇవి మానవసంబంధాలను అతి క్లిష్టంగా మార్చాయి. మార్కెట్‌ సంబంధాలు మానవ సంబంధాలను ధ్వంసం చేస్తునప్పుడు ప్రజాస్వామ్య భావనలు రచయితల్లో ఎలా వస్తాయి అనే విషయాన్ని ఆలోచించాలి. ఈ సందర్భంలో బాలగోపాల్‌ ఉవాచ ఏంటంటే భావజాలాన్ని ఆధిపత్య వ్యవస్ధలు రుద్దినప్పటికీ, ప్రతి మనిషిలో స్వీయాత్మక లేదా వ్యక్తిగత భావజాలం వుంటుంది. దీన్ని ఆధిపత్య భావజాలం ఎక్కువ స్థాయిలో ప్రభావితం చేయలేదని అంటారు. నిజానికి పెట్టుబడి మానవ, శ్రమ సంబంధాలను మారుస్తుంది. ఈ క్రమంలో శ్రమకు, పెట్టుబడికి నిరంతరం ఘర్షణ జరుగుతూ వుంటుంది. ఈ ఘర్షణలోనుండే ప్రజల్లో శాస్త్రీయ భావాలు, ప్రజాస్వామిక భావాలు పెంపొందుతాయి. పెట్టుబడికున్న వైరుథ్యం రీత్యానే అన్ని భావాలు హింస-అహింస, మానవ-అమానవ, హక్కులు-హక్కుల ఉల్లంఘన లాంటి భావాలు భావజాల రంగంలో కలగలిసి వుంటాయి. ఇది వ్యక్తి ప్రాధాన్యతను నీరుగారుస్తుందనే వాదన వుంది. అంటే వ్యక్తి పూర్తిగా పెట్టుబడి ఆడించే కీలుబొమ్మగానే వుంటాడు. అతని స్వీయ చైతన్యం బాహ్య, భౌతిక పరిస్థితుల మీదే ఆధారపడి వుంటుందనే వాదనకు మద్దతు ఇచ్చినట్టు అవుతుంది. వ్యక్తిని సమాజం నుండి వేరుచేయలేనప్పుడు అతను సమజాంలో వచ్చే భిన్న పరిస్థితులకు వ్యతిరేకమైన ఆలోచనల చేయడం వల్లనే అతని సృజనాత్మకత, తార్కికత చలనంలో వుంటుంది. అందుకే ఉపరితలం పునాదిని ప్రభావితం చేస్తుందని, రెండు పరస్పరం ప్రభావితాలను విమర్శకులు భావిస్తారు.

2019లోని ఓ కథలో సాఫ్ట్‌వేర్‌ ఇంజనీరు తన భార్యకు డెలివరీ చేయిస్తాడు. ఆధునిక పరిజ్ఞానం సిజేరియన్‌ అనే వెసులుబాటును తల్లికి ఇస్తున్నప్పుడు అతను నార్మల్‌ డెలివరీ వైపే మొగ్గుజూపుతాడు. డెలివరీ అయిం తర్వాత, తనకు శారీరక సుఖం సరిగాలేదని, దానికి తన భార్యే బాధ్యత వహించాలని అంటాడు. ఇంగ్లీషు మాట్లాడుతూ, అమెరికాలో సాఫ్ట్‌వేర్‌ ఇంజనీర్‌గా పనిచేస్తున్న అతనిలో ఇటువంటి అనాగరిక భావాలు వుండటానికి కారణం పైన చెప్పుకున్నదే. రచయితకు సరైన పరిశీలనా శక్తి లేకపోతే సాఫ్ట్‌వేర్‌ ఇంజనీరు చేసింది కరెక్ట్‌ అనిపిస్తుంది. సర్రోగసీ, టెస్ట్‌ట్యూబ్‌ బేబీలు ఇవన్నీ నిజమే అనిపిస్తాయి. రచయితకు చరిత్ర పట్ల కూడా అవగాహన వుండాలి. భారత దేశ స్వాతంత్య్ర పోరాటం స్థానిక పెట్టుబడి జాతీయ స్వభావాన్ని అంతరించుకోవడంలో భాగంగా జరిగిందనే ప్రాథమిక అవగాహన రచయితకు వుండాలి. అప్పుడే అతని కథల్లో సంపూర్ణత్వం, నిర్దిష్టత వస్తుంది. వ్యక్తిని విశ్లేషించేటపుడు, పాత్రను అర్థం చేసుకునేటపుడు సమగ్రత వస్తుంది.

ఫ్యాక్షన్‌ కథలు ఎక్కువుగా రాయలసీమ నుండి వచ్చాయి. ఫ్యాక్షనిస్టు తన అనుచరులకు జీతాలకింద ఏ డబ్బును ఇస్తాడు. ప్రజల దగ్గర దోచుకున్న డబ్బే కదా. ఈ అవగాహన ఫ్యాక్షనిస్టు అనుచరలకు లేకపోవడం వల్లే అతను ఫ్యాక్షనిస్టుకి విధేయుడిగా వుంటాడు. కాని రచయితకు ఈ అవగాహన వుండాలి. అలాగే ప్రపంచ పరిజ్ఞానంలో బ్రిటీష్‌వలసవాదులు భారత్‌ లాంటి దేశాల సంపదను దోపిడీ చేసే వారి సైన్యానికి, కార్మికులకు అధిక జీతాలు, సదుపాయాలు కల్పించారు. అనివార్యంగా బ్రిటీష్‌ సైనికులు, కార్మికులు బ్రిటీష్‌ ప్రభుత్వానికి విధేయులై వుంటారు. వాళ్లలో అంతర్జాతీయ మైత్రి సన్నగిల్లి, జాతిఐక్యత కోసం వేరేదేశాన్ని దోపిడీ చేసేందుకు ఉత్సాహం చూపిస్తారు.

మానవసంబంధాలు కథల్లో ప్రతిఫలించాలంటే రచయితకు పరిశీలనా శక్తి, శాస్త్రీయ అవగాహన అవసరం. మనిషిని సామాజిక సంబంధాలలో లొకేట్‌ చేయగలిగితేనే ఇది సాధ్యమవుతుంది. సమాజం, పౌరుడు, ప్రకృతికి మధ్య వున్న సంబంధాన్ని మొదట రచయిత అర్థం చేసుకోవాలి. సమాజంలో పౌరులు భాగం కాబట్టి, పౌరునికి సామాజిక స్వభావం వుండాలి. మానవసంబంధాల్లో వస్తున్న విపరీతధోరణులకు కారణం వ్యక్తి తన స్వార్ధ ప్రయోజనాలకు విలువ ఇవ్వడమే. సమాజానికి ప్రాచీనతత్వం వుంటుంది. వ్యక్తి వర్తమానంలో పుడతాడు. అతని పుట్టకకు ముందే సమాజంలో కొన్ని నియమాలు, విలువలు వుంటాయి. వ్యక్తి బుద్దిజీవిగా మారినప్పుడు అతను జీవించే క్రమంలో అప్పటికే సమాజంలో వ్యవస్థీకృతమైన విలువలను అర్థం చేసుకునే ప్రయత్నం చేస్తాడు. వాటిని వ్యతిరేకించడమో, మార్చడానికి ప్రయత్నంచడమో చేస్తాడు. ఇది వ్యక్తికి, సమాజానికి మధ్య ఘర్షణకు దారితీస్తుంది. ఇక్కడే మానవసంబంధాల పాత్ర ప్రాముఖ్యతను సంతరించుకుంటుంది. ఇప్పటికే సామాజిక భావన కుటుంబ స్థాయికి కుంచించుకుపోయింది. ఆ కుటుంబం ఇప్పుడు భార్య, భర్త, పిల్లలు అనే గీత గీసుకుంది. నాకు మాత్రమే అనే వ్యక్తి స్వార్ధానికి దారితీసింది. న్యాయస్ధానాలు సైతం వ్యక్తిస్వేచ్ఛకు ప్రాధాన్యతను ఇస్తున్నాయి. మార్కెట్‌ ప్రభావం వల్లే ఇది జరుగుతోంది. వ్యక్తిలో సామాజిక సంబంధాలను పెంపొందిస్తేనే, మానవసంబంధాలు బలోపేతం అవుతాయి. వ్యక్తి జీవనానికి, అభివృద్ధికి, స్వేచ్ఛకి సామాజిక విలువలు అవరోధం అయినపుడు వాటిని వ్యతిరేకించాలి, వాటిని ప్రజాస్వామీకరించాలి. వీటిని పౌరుల హక్కుల్లో భాగంగా గుర్తించాలి.

డబ్బు మానవసంబంధాలను నియంత్రిస్తుంది. వ్యక్తికి అల్పత్వాన్ని ఆపాదిస్తుంది. ఈ అల్పత్వం అసహజమైనది. మార్కెట్‌ రుద్దినది. ఈ అసహజత్వం మానవసంబంధాలలో అసహజత్వానికి దారితీస్తుంది. మార్పులకు నిరంతరం లోనయ్యే సమాజం విభిన్న కుదుపులకు లోనవుతుంది. మనుషులను కేేవలం సామాజిక వ్యవస్థలోని సంబంధాలకు సంబంధించిన నిర్మాణంగానే చూడకూడదు. వీరికి సమాజం కొన్ని పాత్రలు నిర్దేశించి అవే చెయ్యమంటుంది. అంతమాత్రాన వ్యక్తి చైతన్య రహితుడు కాడు. మనిషి తన క్రియాశీలక జీవితాన్ని అర్థం చేసుకోవడానికి కొన్ని భావాలను కలిగివుంటాడు. ఆచరణలో వాటిని పెట్టే క్రమంలోనే అతనికి సమాజంతో ఘర్షణ వస్తుంది. ఈ ఘర్షణే మానవసంబంధాల్లో అభివృద్ధికరమైన మార్పులు తెస్తుంది. సున్నితమైన అంశాలను కథావస్తువుగా ఎన్నుకోవడంలోను, కథాశిల్పచాతుర్యాన్ని ప్రదర్శించడంలోను చూపితే అతను వట్టి రచయితే అవుతాడు. పరిశీలనాశక్తిని, సామాజిక చలనసూత్రాలను కథలో చూపించగలిగనపుడే అతను మంచి రచయిత అవుతాడు. అతనే భిన్ని వైరుధ్యాల మధ్య వున్న మనిషిని, అతను సమాజంతో నెరిపే మానవసంబంధాలను నిర్దిష్టంగా చెప్పగలడు. స్థల, కాల, సంఘటనల సమాహారంగా పాత్రలను మలచగలడు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here