[box type=’note’ fontsize=’16’] ఇటీవల ఒంగోలులో పదిరోజులు జరిగిన 2వ పుస్తక మహోత్సవాల సందర్భంగా ఏర్పాటు చేసిన సభల్లో ఒకరోజు “కథ- ప్రస్తుత ధోరణులు” గురించి చర్చ జరిగింది. అందులో పాల్గొన్నభీమరాజు వెంకటరమణ ఆ చర్చలో తాను వెలిబుచ్చిన అభిప్రాయాల సారాంశాన్ని సంచిక పాఠకులతో పంచుకుంటున్నారు. [/box]
[dropcap]ఈ[/dropcap] మధ్య ఒంగోలులో పదిరోజులు జరిగిన 2వ పుస్తక మహోత్సవాలు సందర్భంగా ఏర్పాటు చేసిన సభల్లో ఒకరోజు “కథ- ప్రస్తుత ధోరణులు” గురించి చర్చ జరిగింది. అందులో పాల్గొన్న నేను వెలిబుచ్చిన అభిప్రాయాల సారాంశాన్ని ఇక్కడ అందరితో పంచుకుంటున్నాను.
కథ గురించి క్లుప్తంగా చెప్పుకోవాలంటే మనందరికీ తెలుసు రచన ఏదైనా రసాత్మకంగా ఉంటేనే దాని విలువ అనే ఒకనాటి మాట. రచనని తపస్సుతో పోల్చారు శ్రీపాదవారు.
కాలక్రమేణా వస్తువుకే ప్రాధాన్యత ఇవ్వడం, గ్రాంథికం నుండి వ్యావహారికానికి మరలడంతో కథ ఊపందుకుంది. గురజాడవారి దిద్దుబాటు కథ తరువాత శ్రీపాద వారితో పాటు తల్లావఝుల శివశంకర శాస్త్రి గారు, మాడపాటి హనుమంతరావుగారు, చింతా దీక్షితులు గారు మొదలైన వారు మొదటి దశలో కథా రచన చేపట్టారు.
1920లో “సాహితీ” పత్రిక వెలువడినప్పటి నుండీ చలం, మునిమాణిక్యం, విశ్వనాథ, బాపిరాజు గారు ఇంకా ఎందరో ఉత్సాహంగా రచనలు చేశారు.
దేశవిదేశీ సాహిత్యం అధ్యయనం చేయబడింది. తెలుగు కథకు మెరుగులు దిద్దారు. అన్నిరకాల వాదాలు వచ్చాయి. వివక్ష అనేది మానవ జాతికి మచ్చ. దానిపై అందరితోపాటు రచయితా పోరాడాల్సిందే! సమాజ శ్రేయస్సు రచయిత కర్తవ్యంగా ఉండాలి. ఇది మనందరికీ తెలుసు. కథ ఈ రోజు ఉధృతంగా సాగుతున్నది. ఇది మంచి పరిణామమనే చెప్పొచ్చు.
ఇక “కథ- ప్రస్తుత ధోరణులు” విషయానికొస్తే నాకు రెండు అసంతృప్తులున్నాయి. మొదటిది: ఈరోజు రామాయణం, భారతం, భాగవతం, భగవద్గీత లేదా కనీసం సాంప్రదాయం అనే శబ్దాలు వినపడంగానే కొందరు ముఖం చిరాకుగా అసహనంగా పెట్టడం గమనిస్తుంటాము. వాటన్నిటినీ కూలంకషంగా అధ్యయనం చేసి అందులో ఏమీ లేదని తేల్చేసిన వైనంగా అన్నమాట. నిజానికి వాటిల్లో లేని రసాత్మకతా, వస్తువు మన ప్రస్తుత సాహిత్యంలో ఉన్నాయా అని మనం ప్రశ్నించుకుని పరిశీలిస్తే మనకే తెలుస్తుంది.
మన రచనల్లో మనకు తెలియని విషయం గురించి ప్రస్తావించాల్సొచ్చినపుడు దానికి సంబంధించిన నిష్ణాతులను అడిగి తెలుసుకుంటాం లేదా ఇప్పుడు గూగుల్‌లోనూ వెతికి వీలైనంత సమాచారాన్ని సేకరించుకుంటున్నారు. అలాగే పురాణ సంబంధ పాత్రలను గురించి వ్రాయడమో ఉదహరించడమో చేసేప్పుడు వాటి గురించి పైకి కనపడే స్థూలమైన విషయాన్నే కాక అంతర్లీనంగా ఉన్న తత్వాన్నీ తెలుసుకోవాలి. అందుకు మనకు పెద్దవాళ్ళ, పండితుల నుండి కావలసిన, అర్థంకాని విషయాలు తెలుసుకోవాలి.
అలా కాక పురాణ పాత్రలను కించపరుస్తూ చిత్రీకరించి వాయడం జరుగుతున్నది. దానివల్ల మన ఖజానాలో ఉన్న మేలిమి బంగారం నకిలీదని మనమే చాటింపు వేసుకుని మనకున్న ఆస్తిని, అండను పోగొట్టుకోవడం లాంటిదని నాకనిపిస్తుంది. ఇంతకు మించి ఈ విషయంలో చర్చ అవసరం లేదేమో అనిపిస్తున్నది.
మరొక అసంతృప్తి:- రచయితలు ఈ మధ్య ఇతివృత్త స్వీకరణలో స్వేచ్ఛను విరివిగా తీసుకుంటున్నారు. మంచిదే! కానీ ఆ సమయంలో సామాజిక బాధ్యతకూడా దృష్టిలో పెట్టుకోవాలి. నామటుకు నాకు ఈ మధ్య స్వేచ్ఛ పేరుతో సహజీవనాన్ని సమర్థిస్తూ వస్తున్న రచనలు కాస్త బాధ కలిగిస్తున్నాయి.
కుటుంబంలో సమస్యలు లేదా అసంతృప్తి లేదా ఒక అన్యాయాన్ని చర్చిస్తూ, ఆ స్త్రీ కుటుంబాన్ని వదిలేసి సహజీవనం వైపు వెళ్ళడం పరిష్కారంగా చూపి ఆ రచనను ముగిస్తున్నారు.
అయితే వాళ్ళు ఎవరైనా సరే మరొకరితో సహజీవనం అనేది మొదలెట్టాక అది ఎలా జరుతున్నది, అక్కడ కూడా సమస్యలు ఏమీ రావా? వస్తే పరిష్కార మార్గాలు, సామాజిక, ఆర్థిక సంబంధమైన ఇబ్బందులు దాని పర్యవసానాలు ఎలా ఉంటాయి, పిల్లల్ని కంటారా లేదా? కంటే వారి భవిష్యత్తు? కనకపోతే ఆ స్త్రీ మానసిక స్థితి? ఆ వ్యక్తి తోనూ అనుకున్న విధంగా జీవితం ఉండకపోతే ఏం చెయ్యాలి? వంటి విషయాలు కూడా తర్కించడం కానీ, సహజీవనమే ఎందుకు సరైన మార్గం? కుటుంబ జీవితంలో కనిపిస్తున్న సమస్యల పరిష్కారానికి అది ఎలా భరోసా ఇవ్వగలదు? అనే విషయాలపై స్పష్టత కానీ ఆ కథలలో కనబడడం లేదు. సహజీవనం వల్ల వచ్చే కొత్త సమస్యలను గురించిన కనీస చర్చా ఉండడం లేదు. అటువంటి అవగాహన కూడా ఆ కథలలో కలుగజేయాలి.
వివాహితులు తమకు ఆ భాగస్వామితో సఖ్యత కుదరకపోతే విడాకుల తీసుకునే పద్ధతి మనకున్నది. వేరొకరిని పెళ్ళిచేసుకోవచ్చు. అందరూ అంగీకరించి సహకరిస్తారు. అలా కాక మరొకరితో వెళ్ళిపోయి సహజీవనం చేస్తే ఆ గౌరవము, సహకారము ఉండవు. కుటుంబపరంగా ఉండే రక్షణ ఉండదు. అసలు అందరూ సహజీవనం బాట పడితే ఒకనాటికి వావి వరసలు ఏ విధంగా ఉంటాయి? అలాంటి సమాజాన్ని మనం అంగీకరించ గలమా?
రోడ్డు మీద నడవడానికి మనమే ట్రాఫిక్ ఆంక్షలు పెట్టుకున్నాం. అందులో అవసరమైన సవరణలు చేసుకుంటూ భద్రతగా ప్రయాణించే ప్రయత్నం చేస్తున్నాం. అలాగే జీవిత ప్రయాణంలో కూడా కొన్ని ఆంక్షలు పెట్టుకున్నాం. వాటిల్లో కూడా అవసరమైన సవరణలు చేసుకుంటూ ముందుకు పోతున్నాము.
స్వేచ్చ ఉండాల్సిందే. కానీ అదీ మరీ హద్దు మీరి అవతలకు వెళితే ప్రమాదం ఆ వ్యక్తికే! సహజీవనం విషయంలో ప్రమాదం స్త్రీ కే ఎక్కువ అని నా అభిప్రాయం.
ఈ మధ్యనే ఒక దినపత్రికలో ఈ విషయం పై వచ్చిన ఒక వ్యాసం చదివే ఉంటారు. పిల్లలు చదువులకని పోయి సహజీవనం చేస్తునారు అని. చదువుల కోసం ఇతర ఊర్లకు వెళుతున్న పిల్లలు చిన్న వయసులోనే, జీవితం పట్లా, తాము అందుకోవలసిన లక్ష్యాలపట్లా పూర్తి అవగాహన లేని దశలోనే సహజీవనం చేస్తున్నారని. అంతే కాదు నాకు బాగా సన్నిహితులైన డాక్టరు దంపతుల ద్వారా తెలుసుకుని నేను బాధ పడ్డ విషయం సహజీవనం చేస్తున్న యువతులు/మహిళలు ఎంతో మంది అబార్షన్ల కోసం తంటాలు పడుతున్నారని.
ఒకప్పటి మన రచయితలు కథ చెప్పే విధానాన్ని కొన్నిసార్లు విదేశీ సాహిత్యంలోంచి గ్రహించినప్పటికీ వారి సంస్కృతిని మన కథల లోకి తీసుకరాలేదు. కానీ ఈనాడు జరుగుతున్నది వారి సంస్కృతి దిగుమతి. అది కథలో స్వేచ్ఛను చూపించటం కోసం కావచ్చు, ఒక కొత్తదనాన్ని చూపించడం కోసం కావచ్చు.
ఈ విషయంలో రెండు వాదనలు నాముందుకొచ్చాయి. వితంతు వివాహాలను కూడా అప్పట్లో ఇలాగే వ్యతిరేకించారు కదా! తరువాత అంగీకరించబడలేదా అని. వితంతు వివాహాలు మనం చేసుకున్న మంచి సవరణ. దాని వల్ల ఆ స్త్రీకి కుటుంబం, గౌరవమూ రెండూ ఏర్పడతాయి. సహజీవనం అసహజమైన బంధాన్ని ఏర్పరుస్తుంది. ఆ బంధానికి ఏ బాధ్యతా ఉండదు.
మరొకటి అది మంచి పరిణామమే అయితే నిలుస్తుంది లేకుంటే నిలవదు కదా, మనం ముందే ఖండించడం దేనికీ ఆహ్వానిద్దాం అని. వివాహ వ్యవస్థ అనే పునాదులమీద ఉన్న మన సాంప్రదాయ కుటుంబ జీవన విధానంలోకి సహజీవనం అనేది ఏ విధంగా అహ్వానించబడి మంచిదో కాదో పరీక్షించే అవసరం ఉంటుంది? కాస్త ఆలోచిస్తే మనకే అర్ధమౌతుంది.
యత్ర నార్యంతు పూజ్యంతే అనే ప్రవచనాలు వల్లె వేయకపోయినా ఆమె జీవితం పెనం మీదనుంచి పొయ్యిలోకి పడేట్లు చేసే విధానాలను సునిసితంగా పరిశీలించి ప్రక్కకు తోసెయ్యాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరి మీదా ఉంది.
కేవలం రచయిత(త్రు)లు వల్లనే ఈ సహజీవన విధానం వృద్ధి చెందుతోంది అని నా ఉద్దేశ్యం కాదు. అది ఏకారణాల వల్ల మన జీవన విధానంలోకి చొచ్చుకు వచ్చినా మన రచనలవల్ల అది అగ్నికి ఆజ్యం పోసినట్లు కాకూడదు అని నా అభిలాష.
రచయిత(త్రు)లు తమ అనుభవంలో లేని, తాము పాటించి ఉండని, పరిశీలించి ఉండని, కనీసం అన్ని వైపుల నుండి సమగ్రంగా ఆలోచించి ఉండని పరిష్కారాలను సూచించడం సమాజానికి హానికరం అయ్యే అవకాశముంది.
కొందరు రచయిత(త్రు) లకు నా మాటలు రుచించవు అని ఊహించగలను. అయినా నాలోని ఆందోళనను వెలిబుచ్చే ప్రయత్నం చెయ్యాలనిపించింది.
నిబద్ధతతో ఉండి, అస్పష్టత లేని, మనిషి ఉన్నతి దృష్టిలో పెట్టుకుని మంచి రచనలు చేసే రచయిత(త్రు)లకు నేనెప్పుడూ అభిమానినే అని చెబుతూ….. నమస్కారం.