Site icon Sanchika

కథా సోపానములు-12

[box type=’note’ fontsize=’16’] డా. బి.వి.ఎన్. స్వామి ‘కథా సోపానములు’ అనే శీర్షికతో అందిస్తున్న వ్యాస పరంపరలోనిది ఈ వ్యాసం. కథకి తగిన ‘శిల్పం’ ఎంత అవసరమో వివరిస్తుంది. [/box]

శిల్పం

[dropcap]“శి[/dropcap]ల్పం” అనే పదానికి “రాతితో చెక్కిన బొమ్మ” అని అర్థం. శిల-శిల్పం రెండు విడదీయరాని విషయాలు. శిల్పానికి ముడిసరుకు శిల. శిల్పం తయారయ్యే క్రమంలో శిల నుండి అనవసర భాగాన్ని తొలగించాలి. అప్పుడే మనకవసరమైన, అందమైన శిల్పం తయారైతుంది. అందంగా ముస్తాబు చెయ్యాలంటే శిల్పానికి తొడగాల్సిన తొడుగు లేవో తెలియాలి. అంటే తొలగించాల్సినవి, తొడగాల్సినవి శిల్పకారునికి తెలిసి ఉండాలి. నగ తయారీకి కావల్సిన ముడిసరుకు బంగారం. ముడిసరుకును ఆభరణంగా చేయాలంటే దానికి సహాయకారిగా “ఎలిగారం” కలపాల్సి ఉంటది. అప్పుడు అందమైన ఆభరణం చేతి కందుతుంది. ఎలిగారం ఎంత కలపాలో తెలియాలి. ఆభరణం తయారు చేసేటప్పుడు “తరుగు” ఎంత తీయాలో తెలియాలి. అప్పుడే ఆభరణం అందంగా చేతి కందుతుంది. కథకు ముడిసరుకు జీవితం. జీవితంలో అనేక విషయాలుంటాయి. కథ కోసం విషయాన్ని ఎంచుకుంటాము. ఎంచుకున్న విషయాన్ని కథగా మార్చే క్రమంలో తెలిసిన దాంట్లో రాయాల్సింది ఏదో, దాయాల్సింది ఏదో తెలియాలి. అప్పుడే మంచి కథ ఉదయిస్తుంది. పై మూడు సందర్భాల్లోను ఉంచడం, తొలగించడం అనే క్రియ అత్యంత ప్రధానమైనదిగా ఉంది. ఈ సర్దుబాటు తతంగం కథకు ప్రధానం ఇది తెలిస్తే శిల్పం తెలిసినట్టు.

పాటకు శృతి ఎంత ముఖ్యమో, కథకు శిల్పం అంతే ముఖ్యం. శిల్పం అంటే ఏమిటి? కథను నడిపించే విధానం ఏ విషయాన్నైతే పాఠకుడికి అందించాలను కుంటున్నామో, దాన్ని అందంగా మలచి, ఆకర్షణీయంగా తయారు చేసి, అతనిపై బలమైన ముద్ర వేసేదిగా ముడిచి, ఆత్మీయంగా అందించాలి. అందుకు తీసుకునే జాగ్రత్తల్ని కలిపి శిల్పం అంటాము. కథకు పేరు, ప్రారంభం, కొనసాగింపు, సంభాషణలు, సంఘటనలు, మలుపులు, కొసమెరుపు, నేపథ్యం, ముగింపు ఇదంతా శిల్ప సామాగ్రి. వీటిని ఏది ఎక్కడ ఉంచితే విషయపటుత్వం కలుగుతుందో, దేన్ని ఎక్కడ ఉంచకుంటే విషయం అందుతుందో కథకుడికి తెలియాలి. అట్లా తెలిస్తే శిల్పం తెలిసినట్లు. మంచి శిల్పి చేతిలో మంచి శిల్పం తయారు అవుతుంది.

కథ తయారీకి మూలపరికరం శిల్పం. పనితనం ఉన్నవాడి చేతిలో పరికరం శోభిస్తుంది. కథను ఎక్కడ ప్రారంభించాలి? ఎలా ప్రారంభించాలి? ప్రారంభించి ఎంత వరకు చెప్పాలి? ఏది వదిలెయ్యాలి? చెప్పినది ఏ స్వరంతో చెప్పాలి? ఎక్కడ సన్నివేశాన్ని పొందుపరచాలి? ఎక్కడ ఘర్షణను రేకెత్తించాలి? ఏయే పాత్రలను ఎక్కడ ప్రవేశపెట్టాలి? ఆయా పాత్రల ప్రవర్తన ఎలా ఉండాలి? ఎలాంటి సంభాషణలు పెట్టాలి? పాత్రలు ఎలాంటి భాషను పలకాలి? ఏ దశలో మార్పు కనపరచాలి? ఎలాంటి పేరు పెట్టాలి? ఎట్లా ముగించాలి? ఇవన్ని తెలిస్తే శిల్పం తెలిసినట్లు. తెలియడమే కాదు వీటిని ఏ క్రమంలో అమర్చాలో తెలిస్తే మంచి శిల్పం అలవడినట్లు.

శిల్పం పకడ్బందీగా ఉండటానికి కథా విషయం బలమైనదిగా ఉండాలి. కథా విషయం పైన కథకుడికి చక్కటి అవగాహన ఉండాలి. స్థలకాలాల మధ్య ఐక్యత ఉండాలి. బోడిగుండుకు మోకాలికి ముడి పెట్టకూడదు. కురుక్షేత్రంలో మొదలైన యుద్ధం అక్కడే పూర్తి కావాలి. కృతయుగంలో మొదలైన కథ కలియుగంలో ముగియకూడదు. “బలవంతపు తద్దినం”లా కథను పాఠకులపై విసరకూడదు. కథలోని పాత్రలు, సంఘటనలు, పాఠకుల కళ్ళ ముందు కదిలినట్లుగా ఉండాలి. చెప్పదలచుకున్న విషయం పట్ల రచయితకు సందిగ్ధం ఉండకూడదు. ఉంటే కథ ద్వారా అది పాఠకుడికి బదిలి అవుతుంది. దీని తర్వాత ఏది చెప్పాలనే చక్కటి ప్రణాళిక వేసుకోవాలి. జరిగింది జరిగినట్లుగా అనుభవాల్ని రాసినప్పుడు అది పాఠకుల మన్నన పొందుతుందా లేదా అనేది ముఖ్యం. అందుకే ఏది, ఎప్పుడు, ఎలా చెప్పాలనేదే శిల్పం. దాన్ని అనుసరించి రాయడమే ప్రధానం.

“పనితనం కనపడడం”ను శిల్పమనవచ్చు. ఇది కథలో అంతర్వాహినిగా ప్రవహించాలి. వింటినుండి వెలువడిన బాణం సూటిగా వెళ్ళి, గమ్యాన్ని ఏ విధంగా తాకుతుందో అలా కథ పాఠకుణ్ణి చేరాలి. దానికి ఉపయోగపడేదే శిల్పం.

(మరోసారి మరో అంశంతో)

Exit mobile version