కథా సోపానములు-3

7
2

[box type=’note’ fontsize=’16’] డా. బి.వి.ఎన్. స్వామి ‘కథా సోపానములు’ అనే శీర్షికతో అందిస్తున్న వ్యాస పరంపరలోనిది ఈ వ్యాసం. కథకి తగిన ‘ప్రారంభం’ ఎంత అవసరమో వివరిస్తుంది. [/box]

ప్రారంభం

[dropcap]చే[/dropcap]స్తున్న పని నిర్విఘ్నంగా కొనసాగాలని కోరుకోని వారెవ్వరు? అందుకు జాగ్రత్తలు తీసుకోని వారెవ్వరు? ఒక పని మొదలు పెట్టడానికి ప్రణాళిక సిద్ధం చేసుకుంటాం. అది ఆచరణలో పెట్టడానికి తీసుకునే సమయం కూడా ప్రణాళికలో భాగంగా ఉంటుంది. పని ప్రారంభించటానికి సంప్రదాయవాదులు సుముహూర్తాలను ఎన్నుకుంటారు. అందుకు భిన్నమైన వారు ప్రారంభించడానికి ఎనలేని జాగ్రత్తలు తీసుకుంటారు. వీరందరితో పాటు ఏదీ అవసరం లేదనే వాళ్ళు కూడా పని ప్రారంభంలో ఉత్కంఠకు గురి అవుతుంటారు. కోరకుంటున్న సఫలత దీనంతటికి కారణం. చేస్తున్న పనిలో ఎలాంటి ఆటంకాలు రాకూడదని పని దిగ్విజయంగా జరగాలని కోరుకోవడం మానవ సహజం. అంతిమ ఫలితానికి మొదటి అడుగు ప్రారంభం. మహాపాదయాత్రలకు మొదటి అడుగే ఆరంభం. మనుషులంతా ఒక్క తీరుగా ఉండనట్లే, పనులన్నీ ఒకే లక్షణాల్ని కలిగి ఉండవు. కనుక ప్రారంభాలన్నీ ఒక్క తీరుగ ఉండవు. కొందరు ఫలితాన్ని దృష్టిలో పెట్టుకొని ఎట్లా మొదలు పెట్టాలో ఆలోచిస్తారు. మరికొందరు ప్రారంభించడం మన వంతు అన్నట్లు వ్యవహరిస్తారు. ప్రారంభాల్ని ఉత్సవంగా జరిపేవారుంటారు. ఇలా ఎవరి అభిరుచుల మేరకు వాళ్ళు వ్యవహరిస్తుంటారు.

శా॥

ఆరంభింపరు నీచమానవులు విఘ్నాయాససంత్రస్తులై
యారంభించి పరిత్యజింతురురవిఘ్నాయత్తులై మధ్యముల్
ధీరుల్ విఘ్ననిహన్యమానులగుచున్ ధృత్యున్నతోత్సాహులై
ప్రారబ్దార్థము లుజ్జగింపరు సుమీ ప్రజ్ఞానిధుల్‌గావునన్

అధములైన మానవులు విఘ్నములు కలుగునని ఒక్క కార్యమును ప్రారంభించరు. మధ్యములు ఆరంభించి గొప్ప విఘ్నములు కలుగుటచే ఆ కార్యమును మధ్యలోనే వదలి వేయుదురు. ధీరులు ఎన్ని మారులు ఎటువంటి విఘ్నములు కలిగినను తాము పట్టిన కార్యమును వదలరు అని భర్తృహరి చెప్పాడు. ఒక పని చేయుటకు ఎంతటి తండ్లాట ఉంటదో నిత్య వ్యవహారంలో చూస్తున్నదే. కనుకనే పని ప్రారంభించే ప్రతి ఒక్కరు తగిన జాగ్రత్తలు తీసుకుంటారు. ఆరంభానికి అంతటి విశిష్టత ఉంది. అదొక అసిధారవ్రతం. కథకు కూడా ఆరంభం అనేది ఉంటుంది. కథకుడు ఆరంభం పట్ల అత్యంత జాగరుకుడై ఉండాలి.

కథా ప్రారంభాన్ని ఎత్తుగడ అని కూడ అంటారు. ప్రారంభం కథకు సింహద్వారం వంటిది. ఆకర్షణీయమైన సింహద్వారాన్నుండి ప్రవేశించడానికి ఆసక్తి చూపుతారు. మంచి ఎత్తుగడ వల్ల కథకు అందం వస్తుంది. ప్రారంభం కథకుడి సమర్థతను తెలుపుతుంది. కథను ఎక్కడ ప్రారంభించాలి? ఎలా ప్రారంభించాలి? అనే ప్రశ్నలు నిలువనీయవు. కథను ఎక్కడ ఎత్తుకోవాలో అక్కడ ఎత్తుకోకపోవడం వల్ల కథా ప్రవేశానికి ఆటంకం కలుగుతుంది. బాగా ఆరంభిస్తే సగం పని పూర్తి అయినట్లే. కథలో ఏం చెప్పదలచుకున్నామో, దాంతో మొదలు పెట్టరాదు. అట్లా చేస్తే కథాంశం ముందే తెలిసి, కథపై ఆసక్తి సన్నగిల్లుతుంది. కథలో ఏ అంశం గురించి చెప్పదలచుకున్నామో, ఏ కీలకాన్ని విడమరచదలచుకున్నామో, వాటికి సమర్థింపుగా నిలిచే విషయాల నుండి కథ మొదలు పెట్టాలి. దాని వల్ల పాఠకుడిలో ఉత్కంఠ, కోరికలు కలిగి కథలోకి ప్రవేశిస్తాడు. అలా అతడు కథా కొనసాగింపుతో కలిసి నడుస్తాడు.

ఎలా మొదలు పెట్టాలి? అనే ప్రశ్నకు జవాబుగా కథాముట్లు (పనిముట్లు) అనేకం కనిపిస్తాయి. ఏ అంశం గురించైతే చెప్పదలచుకున్నామో దాన్ని విడవకుండా చదివించేలా మొదలు పెట్టాలి. సన్నివేశం, వర్ణన, సంఘటన, సంభాషణ, సంఘర్షణ, సామెత, పాట, పాత్ర, వాతావరణం, ఒకే ఒక్క వాక్యం, ఇలా దేనితోనైనా కథా ప్రారంభం చేయవచ్చు. కథకుడి ఇష్టంపై ఆధారపడి ప్రారంభం మొదలవుతుంది. చెడు ప్రారంభం చెడగొడితే, మంచి ప్రారంభం విజయాన్నందిస్తుంది. అందువల్లనే ప్రారంభం ముఖ్యమైనది. చిన్న పిల్లలు అత్యంత శ్రద్ధతో కాగితపు పడవలు తయారు చేస్తారు. వాటిని బహు నేర్పుగా కాలువలోకి విడిచి, అది ప్రయాణిస్తుంటే చూసి ఆనందిస్తారు. కాగితపు పడవను నీటిలోకి విసిరితే, అది మునుగుతుంది, లేక కొట్టుకపోతుంది. సాఫీగా ప్రయాణం సాగదు. పిల్లలు పడవను వదిలినట్లు కథా ప్రారంభం ఉండాలి. దాంతోనే పాఠకుడు కథలోకి ప్రయాణిస్తాడు.

సాధారణంగా చెప్తే వినడం కష్టం. సంచలనాన్ని జత చేసి చెప్తే వినడం కద్దు. ఇదొక టెక్నిక్. ఇట్లా రచయిత తనకు తోచిన పద్దతితో ప్రారంభం చెయ్యాలి. కథ చెట్టనుకుంటే, ప్రారంభం మొలక లాంటిది. మొలక బతికి బట్టకడితే చెట్టు ఫల పుష్ప సహితంగా శోభిస్తుంది. కొందరు చేయితిరిగిన కథకులు ‘కథ ఎక్కడి నుండైనా మొదలు పెట్టవచ్చు. మొదలు పెడితేనే కొనసాగుతది. కొనసాగింపే కథ.’ అన్నారు. మరికొందరు ‘కథ ఎట్లా అయినా మొదలు పెట్టవచ్చు. అయితే అది ఆకర్షణీయంగా, ఆసక్తికరంగా కనిపించాలి’ అన్నారు. ఈ అభిప్రాయాల్లో నిజం ఉంది. ఇల్లన్నాక, ఇంటికి వచ్చేవాళ్ళు ఉంటరు. వచ్చిన వాళ్ళను, ఇంట్లోకి ఆహ్వానించడం మర్యాద. ఎంత మర్యాదగా ఆహ్వానిస్తే, అంత సంతోషంగా అతిథి ఇంట్లోకి ప్రవేశిస్తడు. ఇంటివారి పట్ల మక్కువ ప్రదర్శిస్తడు. కథ ఒక ఇల్లు. పాఠకుడు అతిథి. కథకుడు కుటుంబీకుడు. ఆహ్వానం ఒక ప్రారంభం. అదెంత మర్యాదగా, ఆసక్తిగా ఉంటే అంతే హుందాగా, సంతోషంగా ప్రవేశం ఉంటది. ఇల్లే కాదు కథ కూడా రాణింపుకొస్తది.

ఉదాహరణ:

తనకు స్త్రీ గండం ఉందని నికోలస్‌కు చాలాకాలంగా తెలుసు. పుట్టినప్పుడు జాతకం రాసిన వాళ్ళు అదే చెప్పారు. తరువాత చెయ్యి చూసిన జనరల్ స్టోర్ యజమానురాలూ అదే చెప్పింది. అయితే ఆ స్త్రీ, జడ్డిగారి భార్య కాసిల్లా రూపంలో తారస పడుతుందని అతడూహించలేదు. మనిషి అందంగా లేదు. అంటే మగాళ్ళకు నచ్చే మనిషి కాదు. సన్నగా, పీలగా, కండలేని మనిషిలా ఉంది. ఎలా ఉంటేనేమిటి దగ్గరకు పోకూడదు. పరిచయం పెంచుకోవద్దు. కాని కాసిల్దాను స్త్రీగా గుర్తించటం కష్టం. ఆమె ‘గండం’ తెచ్చే మనిషి అయ్యే అవకాశమే లేదు.”

పెరూలో పుట్టిన ఇసాబెల్ అలెండె రాసిన కథకు తెలుగు అనువాదం “మరొక్క సారి”. ఆ కథ ప్రారంభం ఇది. ఇందులో ఒక స్త్రీ శారీరక వర్ణన ఉంది. ఆమె వల్ల జరగబోవు నష్ట సూచన ఉంది. దూరం ఉండాలనే జాగ్రత్త ఉంది. ఇన్ని విధాల ఉన్న ఎత్తుగడను చదివిన పాఠకుడు ఆసక్తికి గురి అయి కథలోకి వెళ్ళకుండా ఉండగలడా? ఎత్తుగడ అంటే అది.

(మరోసారి మరో అంశంతో)

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here