[శ్రీ. ఎన్. కె. బాబు సంపాదకత్వంలో వెలువడిన ‘కథా పరిమళాలు’ అనే కథా సంకలనాన్ని సమీక్షిస్తున్నారు కొల్లూరి సోమ శంకర్.]
[dropcap]శ్రీ [/dropcap]ఎన్. కె. బాబు సంపాదకత్వంలో వెలువడిన ‘కథా పరిమళాలు’ అనే కథా సంకలనంలో 56 మంది కథకుల కథలు ఉన్నాయి. ఈ సంకలనంలో వివిధ ప్రాంతాల నుండి 15 మంది రచయిత్రులతో పాటు విజయనగరం నుండి 13 మంది, విశాఖపట్టణం నుంచి 13 మంది, శ్రీకాకుళం నుంచి ఇద్దరు, హైదరాబాద్ నుంచి 7గురు, యానం, చీరాల, తిరుపతి, ముంబై, భద్రాచలం, పార్వతీపురంల నుంచి ఒక్కొక్కరు చొప్పున మొత్తం 56 మంది కథలు అందించారు. కథకుల భౌగోళిక విభిన్నత, కథల ఇతివృత్తాలలో వేఱిమితో పాటు, కథా నిడివిలో కొన్ని చిన్నవి కొన్ని పెద్దవి కావడం వల్ల ఈ సంకలనం వైవిధ్యంగా ఉండి ఆసక్తిగా చదివింపజేస్తుంది.
***
మొబైల్ ఫోన్ మాట్లాడుతూ చుట్టుపక్కల చూసుకోకుండా ప్రమాదాలకి గురై ప్రాణాలు కోల్పోయిన వారి గురించి చెప్పిన కథ ‘ఎవరికి వారు’. అడపా రామకృష్ణ గారు రచించిన ఈ కథ స్మార్ట్‌ఫోన్ పిల్లలకి ఓ వ్యసనంలా మారడం గురించి హెచ్చరిస్తుంది. డ్రైవింగ్ చేస్తున్నప్పుడు ఫోన్ మాట్లాడకూడదనీ, మేడ మీద, పిట్ట గోడల చివరగా నిల్చుని ఫోన్ మాట్లాడేటప్పుడు ఎంతో అప్రమత్తంగా ఉండాలని సూచిస్తుంది. అందరికీ తెలిసిన విషయమే అయినా పాటించకపోవడం వల్ల జరిగే దుష్పరిణామాలను కళ్ళకు కడుతుంది.
అత్తివిల్లి బాలసుబ్రహ్మణ్యం గారు రచించిన ‘వెల్లివిరిసిన మానవత్వం’ కథ మనుషులల్లోని రెండు పోకడలను వ్యక్తం చేసింది. అచ్యుతరావు మంచితనం, అతని రెండో వియ్యంకుడి పిసినారితనం/స్వార్థం – సమాజంలోని ఆయా స్వభావాలు ఉన్న వ్యక్తులకి ప్రతీకగా అనిపిస్తాయి. చేసిన సాయం ఊరికే పోదు, అవసరమైనప్పుడు మరో రూపంలో మనకే లభిస్తుందని పెద్దలు చెప్పే మాట నిజమని ఈ కథ చెబుతుంది.
బొడ్డ కూర్మారావు గారు రచించిన ‘వర్తమానం’ కథ పట్నంలోని బీదల బ్రతుకుని, పల్లెల్లో ఆశలుడిన రైతుల వ్యథని చాటుతుంది. విషాదాంతమైన ఈ కథ తొలుత 1989 జూన్‌లో ‘జ్యోతి’ మాసపత్రికలో ప్రచురితమైంది. కూతురి పట్ల తండ్రి ప్రేమనీ, రైతుల దుస్థితిని కలిపి చెప్పిన రెండు వాక్యాలు – ‘తన పొలంలా గుండె ఎండిపోలేదు. తన నుయ్యిలో నీరు ఇంకిపోయినట్టు తన మనసులో కూతురుపై నున్న ప్రేమ ఇంకిపోలేదు’ పాఠకులని అమితంగా ఆకట్టుకుంటాయి.
బళ్ళా షణ్ముఖరావు గారు రచించిన ‘పరిణామ క్రమం’ కథ ప్రభుత్వ కార్యాలయాలలోని కొందరు ఉద్యోగుల స్వభావం, పనితీరు ఎలా ఉంటాయో చెబుతుంది. వారిలో ఒక్కో దశలో వచ్చే మార్పులను చక్కగా చిత్రించింది. అడ్డూ అదుపు లేకుండా చెలరేగిపోతే ఏం జరగవచ్చో చెప్పి, హెచ్చరిస్తుంది.
సి.వి. శాస్త్రి గారి కథ ‘బిందువు’ మనుషుల్ని అర్థం చేసుకోవడంలో ఎంత జాగ్రత్తగా ఉండాలో చెబుతుంది. స్వార్థపరుడిలా నటించి తల్లిదండ్రులను, ఆప్తులను మోహన్ ఎందుకు దూరంగా ఉంచాడో తెలిసాకా, అతని నిర్ణయాన్ని హర్షించాలో, లేక తీవ్రవాదుల టార్గెట్‍లో ఉన్న పోలీసు అధికారుల జీవితాల్లోని అభద్రతకి విచారించాలో అర్థం కాదు.
చాగంటి కృష్ణకుమారి గారు చాసో మీద చాసో రాసిన 5 కథల నుంచి అల్లిన కథ ‘వండనన్నావ్! ఎందుకొండావ్?’. ఈ కథ చదివినవాళ్ళూ చాసో గారి ఆ అయిదు కథలూ చదవాలనుకుంటారు. తిరుగుబోతు, తాగుబోతు మొగుడ్ని వదిలి, పిల్లాడి జీవితమైనా బాగుపరచాలని ఓ తల్లి తీసుకున్న నిర్ణయాన్ని చాగంటి తులసి గారి ‘నోకం.. ఆడదాయి బతుకు’ కథ చెబుతుంది.
తల్లి గొప్పతనాన్ని పరాయి అమ్మాయి గుర్తించి ప్రపంచానికి చాటిన తరువాతే ఆమె సంతానానికి తెలియడం గురించి చెప్పిన కథ ‘శంఖంలో పోస్తేనే’. చెళ్ళపిళ్ళ (కూరెళ్ళ) శ్యామల గారు క్లుప్తతకి ప్రాధాన్యత నిచ్చి రాసినట్లున్న ఈ రెండు పేజీల కథ – మరికొన్ని సన్నివేశాలు కల్పించి నిడివి పెంచి వ్రాసి ఉంటే, బహుశా ఇంకా మంచి కథ అయి ఉండేదనిపించింది.
వస్తు వినియోగం మాయలో పడిపోతే సంసారాలు ఎలా సాగుతాయో దాసరి రామచంద్రరావు గారి ‘ప్రవాహం’ కథ చెబుతుంది. దిగువ మధ్యతరగతి కుటుంబీకుడు జాగ్రత్తగా సంసారసాగరాన్నీ ఈదాలనే ప్రయత్నానికి కుటుంబ సభ్యులే ఆటంకాలు కల్పిస్తే, ఆ మనిషి గుండె చెదిరిపోదూ? మనసు మొద్దుబారిపోదూ? శ్రమజీవుల జీవితాల్లోని నిస్సహాయతలకు అద్దం పడుతుందీ కథ.
దేశ స్వాతంత్ర్య అమృతోత్సవాల సందర్భంగా – ఒక బడిలో జరిగిన కార్యక్రమంలో పిల్లల చేత కథలు రాయిండానికి వచ్చిన శివం – విస్మృతికి గురైన స్వాతంత్ర్య సమరయోధుడి మునిమనవడిని కలిసి, ఆయనని సమాజానికి పరిచయం చేసేలా పిల్లల చేత కథ రాయిస్తాడు దాట్ల దేవదానంరాజు గారి ‘కథలు పిల్లలందు..’ కథలో.
నగరాలలో/పట్టణాలలో గేటెడ్ కమ్యూనిటీలలో, అపార్టుమెంటులో నివసిస్తున్న కుటుంబాల వారు పావురాల వల్ల ఎదుర్కుంటున్న ఇబ్బందులను ప్రస్తావిస్తుంది దేశరాజు గారి ‘సహజా సహజం’ కథ. పీజియన్ నెట్ వేయించమని అసోసియేషన్‍లో గొడవ చేసి, చివరికి దాన్ని సాధించిన ఓ కుటుబం, తీరా నెట్స్ బిగించాకా, గిల్టీనెస్‍కి లోనవుతుంది. కథలోని పాపకి ఎన్నో సందేహాలు వస్తాయి, చదువుతున్న పాఠకుల మనసుల్లో ఎన్నో ప్రశ్నలు తలెత్తుతాయి. ఖమ్మం ఈస్తటిక్స్ వారి కథల పోటీలో ద్వితీయ బహుమతి పొందిందీ కథ.
ఆస్ట్రేలియా-ఇండియా క్రికెట్ టెస్ట్ మ్యాచ్ నేపథ్యంగా సాగిన కథ ‘రిమోట్ కంట్రోల్’. టివిలో మ్యాచ్ చూడాలని అన్న, సీరియల్ చూడాలని చెల్లి గొడవడపడతారు. మూలా సుబ్రహ్మణ్యం గారు రాసిన ఈ కథ ఒకరి అభిప్రాయాలు మరొకరి మీద రుద్దడమే రిమోట్ కంట్రోల్ అని చెబుతుంది. సరదాగా సాగినట్టు అనిపిస్తూనే, లోతైన భావాలను వ్యక్తం చేస్తుంది.
గయ్యాళి అనిపించుకున్న భార్య ప్రవర్తనలోని అంతరార్థాన్ని ఆమె డైరీ చదివి అర్థం చేసుకుంటాడు ఓ భర్త డా. జి.వి.జి.శంకరరావు రాసిన ‘గయ్యాళి డైరీ..’ కథలో. తను పూర్తిగా పాడయిపోడానికి కారణం తన తండ్రేనని ఆరోపించిన కొడుకు అభిప్రాయం సరైనదో కాదో తెలియాలంటే డా. దేవరకొండ సహదేవరావు గారు రాసిన ‘నాకింకా బతకాలని ఉంది నాన్న’ కథ చదవాలి.
వైద్యులు ఎంతో శ్రమించి, ప్రాణం కాపాడిన ఒక రౌడీ కారణంగా ఓ ప్రాణం పోతే ఆ బాధ్యత ఎవరిది? ఎన్నో ప్రశ్నలను కథ లోని ప్రధానపాత్రకే లేవనెత్తిన కథ డా. ఎం. వి. రమణారావు రచించిన ‘ఫలితం’.
డా. మూలా రవి కుమార్ గారు రచించిన ‘రభస దేవుడు’ కథ ఓ ఊర్లోని ఊరకుక్కలు రేబిస్ వేక్సినేషన్ వేయాల్సి వస్తే జరిగిన తతంగానికి చెబుతుంది. వ్యంగ్యాత్మక శైలిలో సాగిన ఈ కథలో రభస అనే సంస్కృత పదానికీ, రేబిస్ అనే ఆంగ్ల పదానికి మూలపదం బహుశా ఇండో ఆర్యన్ భాషలో ఉండి ఉంటుందనుకుంటాడు ప్రధాన పాత్రధారి.
జి.వి. శ్రీనివాస్ గారు రాసిన ‘గదిలో పులి’ కథ ఒక మానసిక వైద్యుడికి, ఓ ప్రభుత్వోగికి మధ్య నడిచిన కథ. సమాజం పట్ల ద్వేషం పెంచుకున్న హేమంత్‌ని తన తెలివితేటలతో హంతకుడిగా మారకుండా కాపాడుతాడా డాక్టర్.
గంగాధర్ వడ్లమన్నాటి గారి కథ ‘అనుకోని మలుపు’ ఆడపిల్లని నిర్లక్ష్యం చేసి కొడుకుని గారాబం చేసి, పెద్దయ్యాకా కొడుకు/కోడలి చేత తరిమివేయబడి కూతురి పంచన చేరాలనుకున్న తల్లిదండ్రుల కథ. సినిమాల్లో ఇలానే జరిగినప్పుడు కూతురు తల్లిదండ్రులని ఆదరిస్తుందని, అలాగే తమ కూతురు కూడా తమని చేరదీస్తుందని భావించిన సుబ్బారావుకి కూతురు లలిత షాక్ ఇస్తుంది.
జిల్లా పరిషత్ హైస్కూల్‍లో పనిచేసే ఫిజిక్స్ మాస్టారు మహేష్ – తన బాధ్యతలను సక్రమంగా నిర్వహించి, విద్యార్థులలో జ్ఞానతృష్ణని పెంచి, బడి ఉత్తీర్ణతా శాతాన్ని పెంచుతాడు. అతని బోధనకి ఎంతో పేరొచ్చి, కార్పొరేట్ స్కూళ్ళు ప్రలోభపెట్టినా వాటికి లొంగడు. సింప్లిసిటీతో, ఉన్నత విలువలతో జీవనం సాగిస్తున్న మహేశ్, ధనవంతులై విదేశాలలో ఉంటున్న తన మిత్రుడు సూర్యంలో కూడా మార్పు తెచ్చి అతనూ సేవా కార్యక్రమాలలో భాగం పంచుకునేలా చేస్తాడు గన్నవరపు నరసింహమూర్తి గారి కథ ‘ఇచ్చుటలో ఉన్న హాయి’లో.
ఆచారాలు, సాంప్రదాయాలు పేరుతో – కొడుకు ప్రకాష్ కులాంతర వివాహాన్ని హర్షించడు సుబ్రహ్మణ్యశాస్త్రి. కొడుకుని ఇంట్లోంచి బయటకు తోస్తేస్తాడు. ప్రకాష్ తాను ప్రేమించిన అమ్మాయిని పెళ్ళి చేసుకున్నా, తల్లిదండ్రులను మరువడు. తన మిత్రుడు కార్తీక్ ద్వారా కుటుంబానికి తన వంతు సాయం చేస్తునే ఉంటాడు. ప్రకాష్ పంపుతున్న డబ్బు తనే ఇస్తున్నట్టు ఆ కుటుంబాన్ని నమ్మించి, ప్రకాష్ చెల్లెల్ని ప్రేమ పేరుతో వంచిస్తాడు కార్తీక్. తోటివారి అసహాయ పరిస్థితులను స్వార్థానికి ఉపయోగించుకునే ధూర్తుల స్వభావాన్ని చాటుతుంది కె.వి.ఎస్. ప్రసాద్ గారి ‘ఓ తులసి కథ’.
కూర చిదంబరం గారి ‘పునర్జన్మ’ కథలో తమ ఇంట్లో పెరిగి, 20 ఏళ్ళుగా మునగాకు, ములక్కాడలు అందించిన మునగచెట్టుని గొంగళిపురుగులు ఆశించడం వల్ల ఇబ్బందులు పడ్డ రాఘవయ్య – అందరి బలవంతం మీదా ఆ చెట్టుని కొట్టేయిస్తాడు. చెట్టు కొట్టేశాకా ఆ ప్రదేశమూ, అతని మనసు శూన్యమవుతాయి. కొద్ది రోజుల తర్వాత ఆ చెట్టు స్థానంలోనే మరో మునగ మొక్క చిగురించడంతో, ఆయన దాన్ని సంరక్షించే జాగ్రత్తలు తీసుకుంటాడు.
ఎల్.ఆర్.స్వామి గారి ‘కుక్కకాటు’ కథ బాసుని కాకా పట్టడానికి ఓ ఉద్యోగిని చేసిన ప్రయత్నాలు వికటించిన వైనాన్ని తెలుపుతుంది. బహుళజాతి సంస్థల్లో పనిచేసే కొందరి స్వభావాలను రచయిత చిత్రించారీ కథలో.
పెళ్ళికి ఇష్టపడని సుచరిత తల్లి బలవంతం చేస్తే రెండో పెళ్ళి వాడయితే చేసుకుంటాను అని అంటుంది. తల్లి ఆశ్చర్యపోతుంది. కానీ కూతురు తన పట్టు వీడదని గ్రహించాక, రెండో వివాహం చేసుకోదలచిన వారి సంబంధాలు వెతుకుతారు. హైదరాబాద్‍లో కేంద్ర ప్రభుత్వ ఉద్యోగిగా పని చేసే సురేష్ అనే అతను సుచరితతో మాట్లాడడానికి వస్తాడు. ఇద్దరూ తమ తమ ఇంటి పరిస్థితుల గురించి మనసు విప్పి మాట్లాడుకుంటారు. కానీ సుచరిత రెండో పెళ్ళి వాణ్ణి మాత్రమే చేసుకోవాలని ఎందుకు పట్టుదలగా ఉందో తరచి తరచి అడిగి కారణం తెలుసుకుంటాడు. తర్వాత ఏం జరిగిందో తెలుసుకోవాలంటే మద్దాళి నిర్మల గారి ‘ఒకటో నంబరు’ కథ చదవాలి.
మల్లాది వెంకటకృష్ణమూర్తి గారి ‘మనసు గది’ తోటి మనుషులలోని సున్నితత్వాన్ని చంపేస్తే ఏం జరుగుతుందో చెబుతుంది. ఇతరుల మనసులతో ఆడుకునే హక్కు ఎవరికీ లేదనే ఈ కథలోని మొదటి వాక్యం సదా ఆచరణీయం.
కాలానుగుణంగా ఓ రచయితలో చోటు చేసుకున్న మార్పులను చక్కగా చెబుతుంది మాల్యశ్రీ గారి ‘అంతస్తులు’ కథ. మనిషి ఆత్మవంచన చేసుకుంటే ఎంత ఎత్తుకు ఎదగవచ్చో ఈ కథ చెబుతుంది.
కొత్త కథకుడంటే ఎవరో చెబుతారు మెడికో శ్యాం ‘వంటకం’ కథలో. ప్రతీకాత్మకంగా సాగిన ఈ కథలో రచన ఎలా ఉండాలో చెబుతారు. ‘కథలు రాయడం ఉప్మా చేయడం వంటిదే, అంత తిప్పడంలోనే ఉంటుంద’ని చెప్పిన, తరువాత చెప్పిన ఒక వాక్యం కథకులకి అత్యంత ఆవశ్యకమైనది.
అవకాశం లేదనుకున్న వ్యక్తి, అవకాశవాది ఎలా అయ్యాడో చెబుతుంది ఎన్.కె. బాబు గారి ‘స్నానం’ కథ. ఓ వ్యక్తిలోని భౌతికమైన లోపాలను చూసి హేళన చేస్తూ నవ్వుకున్న జనాలే, ఆయన మంచితనం గ్రహించి ఆశ్చర్యపోతారు పాణ్యం దత్తశర్మ గారి ‘తింగరి త్రిలింగం’ కథలో. చివరి వరకూ నవ్వొచ్చేలా రాసినా, చివరలో దీన్ని హాస్యకథ అంటారా అని చదువరులను ప్రశ్నిస్తారు రచయిత.
ఎలాగైనా సరే చదువు కొనసాగించాలనుకున్న అమ్మాయి కథ ‘సుజాత’. పట్నాల ఈశ్వరరావు గారు రాసిన ఈ కథ పాఠకుల హృదయాలను తాకుతుంది. ఆడపిల్లలకు విద్య ఎందుకు అవసరమో ఈ కథ చెబుతుంది.
ఆర్. సి. కృష్ణస్వామిరాజు గారు రచించిన ‘అమ్మకి ఏమయ్యింది’ కథ వైద్యుడిపై రోగికి నమ్మకం కుదరడం ఎంత అవసరమో చెబుతుంది. ఆయుర్వేద వైద్యుడు, హోమియోపతి వైద్యుడు, అల్లోపతి వైద్యుడు నయం చేయలేని జబ్బుని ఓ ఆర్.ఎమ్.పి. డాక్టర్ నయం చేస్తాడు. మొదటి మూడింట్లోనూ రోగికి వైద్యులపై నమ్మకం లేదు, అందువల్ల గుణం కనిపించదు. చివరి వైద్యంలో ఆ డాక్టరు పై గురి ఎక్కువ, అందుకని ఆయన చికిత్సకి ఫలితం దొరుకుతుంది.
ముందు వెనుక చూసుకోకుండా దానధర్మాలు చేసి, తమ ఆస్తులన్నింటిని కరిగించేసి, చనిపోయిన తండ్రి అంటే కోపం సారథికి. తను పడుతున్న అవస్థలన్నింటికీ కారణం తన తండ్రేననీ, ఆయనని తిట్టుకుంటాడు. కష్టాలను భరించలేక జీవితాన్ని ముగిద్దామనుకున్నప్పుడు ఓ వ్యక్తి ఆపి, మనోధైర్యం నూరిపోస్తారు. తల్లిదండ్రులను ద్వేషించేవారు జీవితంలో ఏ విషయంలోనూ రాణించలేరని చెప్తారు. ఆయన సలహా విన్న సారథి ఆత్మవిమర్శ చేసుకుంటాడు. తన లోపమేమిటో అర్థమవుతుంది. రాధిక మంగిపూడి గారు రాసిన ‘ఋణం’ అనే ఈ కథ మనుషుల్లో మంచితనం పూర్తిగా నశించలేదని చెబుతుంది.
కాలప్రవాహంలో ముందుకే ఈదాలని చెప్పిన కథ రజనీ సుబ్రహ్మణ్యం గారి ‘కుందేలు’. జీవితంలో ఇక సాధించాల్సిందేమీ లేదు అని ఉదాసీనతకి తావివ్వడం ఎంత ప్రమాదకరమో ఈ కథ చెబుతుంది. అలాగే వర్తమానంలో తోటివాళ్ళని లోకువగా చూడుకూడదని, భవిష్యత్తులో వాళ్ళు మనకంటే ఎత్తుకి ఎదిగిపోవచ్చని ఈ కథ సూచిస్తుంది.
అత్యంత సున్నితమైన అంశంతో అల్లిన కథ ‘అమ్మ’. రంగనాయకమ్మ గారి ఈ కథ ఈ మధ్య కాలంలో వచ్చిన ఒక హిందీ సినిమాని గుర్తు చేస్తుంది. ‘అప్పుడు తన అమ్మ, ఇప్పుడు తమ్ముడి అమ్మ, ఒకసారి అమ్మ కాగలిన అమ్మకి వయసేమిటి’ అన్న ఈ వాక్యాలు కథకి నిండుదనాన్ని తెచ్చాయి.
రావాడ శ్యామల గారి ‘మెరుపులు.. మరకలు’ కథ క్రియేటివిటీ పేరుతో టీవీలలో వచ్చే క్రైం ప్రోగ్రామ్స్‌లో చైల్డ్ అబ్యూస్ ఎలా జరుగుతుందో చెబుతుంది. పేదరికం, నిస్సహాయత అమాయకురాలైన ఓ బాలిక జీవితాన్ని ఎలా ఛిద్రం చేసాయో ఈ కథలో తెలుస్తుంది.
ఎస్.ఎస్.ఎస్.ఎస్.వి.ఆర్.ఎమ్. రాజు గారు రాసిన ‘ప్రేమ పూర్ణ’ కథ కదిలిస్తుంది. తన తండ్రికి ఆయన పేరు ఎవరు పెట్టారో, ఎందుకు పెట్టారో అడిగి తెలుసుకున్న ప్రేమ పూర్ణ, తనకి తండ్రి ఆ పేరు ఎందుకు పెట్టారో తెలుసుకుంటుంది. ఆలోచనలు, చేతలు వేరుగా ఉండకూడని చిన్నతనంలోనే తెలుసుకున్న ఆ అమ్మాయి జీవితంలో ఉన్నత స్థానానికి చేరుతుంది.
సలీం గారి ‘మూడో పాదం’ కథ – సమాజంలో ట్రాన్స్‌జెండర్లు ఎదుర్కుంటున్న సమస్యలను ప్రస్తావించి, అవకాశం లభించి, మంచి మనుషుల సహాకారం దొరికితే జీవితంలో కాస్త ఎదిగి, సమాజంలో గౌరవం పొందగలుగుతున్నారని చెబుతుంది.
పసిపిల్లల చదువులపై, భారమవుతున్న విద్య గురించి వ్యంగ్యపు విసురు సంఘమిత్ర గారి ‘సరస్వతీ కటాక్షం’. విద్యా వ్యాపారంలోని రహస్యం తెలుసుకున్న భీమరావు ఆచరణలో పెడితే, అతడిని చూసి మరొకరు అతని అడుగుజాడల్లో నడుస్తారు.
చేతబడి, చిల్లంగి వంటి పనులు ఎవరికి ఉపయోగపడుతున్నాయో, అమాయకులు ఇంకా వాటికి ఎందుకు బలవుతున్నారో శీరాపు శ్రీనివాసరావు గారి ‘లోగుట్టు’ కథ చెబుతుంది. జన్యు వైవిధ్యం ఎందుకు అత్యవసరమో, మేనరికాలు ఎందుకు ప్రమాదకరమో పత్తి సుమతి గారి ‘జన్యు విధ్వంసం’ కథ చెబుతుంది.
సునీతా మూర్తి గారి ‘అమ్మ నేర్పిన పాఠాలు’ చక్కని కథ. నిజమైన చదువంటే ఏమిటో కొడుకుకి చెప్పి ప్రయోజకుడిని చేసిన ఓ తల్లి కథ. మరి తల్లిన నేర్పిన పాఠాలు ఆ కొడుక్కి ఒంటబట్టాయా? తెలియాలంటే ఈ కథ చదవాలి.
తమ పిల్లలను ఇంజనీరింగ్ లోనో, మెడిసిన్ లోనో, ఐఐటిలలో చదివించాలనుకునే తల్లితండ్రుల ఆశలను సొమ్ము చేసుకునే కార్పోరేట్ రెసిడెన్షియల్ కాలేజీల తీరుతెన్నులను వ్యంగ్యంగా వివరిస్తుంది జ్యోతి సుంకరణం గారి ‘మేము చదువుకోనివ్వం’ కథ.
నిజజీవితంలో నాటకాలు ఆడడం ఒక్కోసారి ఎంత మేలు చేస్తుందో సుసర్ల సర్వేశ్వరశాస్త్రి గారి ‘మబ్బు వీడిన మానవత్వం’ కథ చెబుతుంది. ఇళ్ళల్లో పెద్దవాళ్ళు ఉండడం ఎందుకు అవసరమో ఈ కథ వివరిస్తుంది. తోటివారికి సాయపడేలా చేయమని, భగవద్దర్శనానికి రాజకీయ నాయకుల సిఫార్సు ఉపయోగించకుండా చూడమని వేంకటేశ్వరుని ఓ ‘చిన్న కోరిక’ కోరుతుందో కుటుంబం తెలికిచెర్ల రామకృష్ణ గారి కథలో.
‘ఎంతో బాధ్యతగా, ముప్ఫై ఏళ్ళ నుంచి ఉద్యోగం చేస్తూ బాత్రూములు కడిగినప్పుడు, రోగుల మైల ఎత్తినప్పుడు కలగని బాధ కూతురన్న మాటతో కలిగి.. మనసు బాధతో ములిగింది ఆ తల్లికి’ – ఇలాంటి వాక్యాలతో నిండిన ఆర్ద్రమైన కథ తెలికిచెర్ల విజయలక్ష్మి గారు రాసిన ‘కోరని వరం!’
పేకాట వ్యసనంలో పడి కుటుంబాన్ని నిర్లక్ష్యం చేయవద్దని బెహరా ఉమామహేశ్వరావు గారి ‘చీకటి తొలగింది’ కథ చెబుతుంది. డబ్బు, రాజకీయాల వెంటబడి జీవితాలను నిస్సారం చేసుకుంటూ ప్రశాంత జీవనానికి దూరమవుతున్న మనుషుల కథ వి. ప్రతిమ గారి ‘ప్రాణశంఖం’. అద్భుతమైన వాక్యాలతో అంతరంగపు అలజడికి అద్దం పడుతుందీ కథ. వడలి రాధాకృష్ణ గారి ‘కాలక్రమం’ కథ జీవితపు కఠిన సత్యాలను చాటుతుంది. కాస్త వేదనని కలిగిస్తుంది.
ఇల్లు అంటే ఏమిటో వాడ్రేవు వీరలక్ష్మీదేవి గారి ‘పునరుత్థానం’ కథ చెబుతుంది. సమాజంలోని ఆర్థిక శక్తుల ప్రభావం తెలిసి ఉండడం అత్యంత అవసరమని ఈ కథ హెచ్చరిస్తుంది. బతుకు బరువైనప్పుడు జీవితపు శిధిలాలలోంచి కొత్త జీవితాన్ని నిర్మించుకోవాలని ఆదిలక్ష్మి పాత్ర ద్వారా రచయిత్రి సూచిస్తారు.
ఆకెళ్ళ వేంకటేశ్వరరావు గారి ‘లక్ష్యం’ కథ – విద్యార్థులకు బహుమతులు ఇచ్చి ప్రోత్సహించాలన్న ఉదాత్త ఆశయం ఉండడం మంచిదే అయినా, వాటిని సదుపయోగం చేసుకునే పిల్లలకు అందివ్వడం ముఖ్యమని చెబుతుంది. మిత్రులైన ఒక రచయిత, ఒక సంపాదకుడి కథ యెలిశెట్టి శంకరరావు గారి ‘జీవన వేదం’. ప్రస్తుతం తెలుగు పత్రికా రంగంలో ఉన్న ధోరణులను క్లుప్తంగా ప్రస్తావిస్తుందీ కథ.
తప్పుదారిలో అడుగేయబోయిన తన విద్యార్థులను సరైన మార్గంలో నడిపించిన లెక్చరర్ కథ నల్లా యోగీశ్వరరావు గారు రాసిన ‘గురుదేవోభవ’.
ఈ సంకలనంలో దేవరాజు రవి గారి ‘కాలు జారితే..’ డా. కూటికుప్పల సూర్యారావు గారి ‘కాచేంగుడు’, జక్కని గంగాధర్ గారి ‘మంచితనం..’, వియోగి గారి ‘ఓ బాసు గారి కుక్కగారు’ లాంటి కథలు విలక్షణమైనవి.
కొన్ని ఆర్ద్రమైన కథలు, కొన్ని వేదన కలిగించే కథలు, కొన్ని నవ్వించే కథలు, సమాజంలో వికృత ధోరణలు ప్రదర్శించిన కథలు, సంఘంలోని మంచిని చాటిని కథలు, మనుషుల ఉద్వేగాలను అక్షరాలలో నింపిన కథలు – వెరసి పరిమళాలు వెదజల్లిన కథలివి.
***
(56 మంది కథకుల 56 కథలు)
సంపాదకత్వం: ఎన్. కె. బాబు
ప్రచురణ: ఎన్.కె. పబ్లికేషన్స్
పేజీలు: 404
వెల: ₹ 350
ప్రతులకు:
ఎన్. కె. బాబు
24-8-1, సమీర్ రెసిడెన్సీ,
విజయనగరం. ఆం.ప్ర. 535002
ఫోన్: 9440343479
nkbabu.publisher@gmail.com
ఆన్‍లైన్‌లో
https://logilitelugubooks.com/book/katha-parimalalu-n-k-babu