Site icon Sanchika

వైవిధ్యవంతమైన సంకలనం – ‘కథా సుధ’

[చైతన్య భారతి ప్రచురించిన ‘కథా సుధ’ అనే పుస్తకాన్ని సమీక్షిస్తున్నారు కొల్లూరి సోమ శంకర్.]

[dropcap]న[/dropcap]లుగురు రచయితలు శ్రీయుతులు చిత్తజల్లు ప్రసాద్, కొండూరు కాశీ, తిరువీధుల సతీష్ కుమార్, కట్టా వెంకటేశ్వర రావు కలిసి పరస్పర సహకార పద్ధతిలో వెలువరించిన కథా సంకలనం ‘కథా సుధ’. ఇందులో ఒక్కొక్క రచయితవి మూడు చొప్పున మొత్తం 12 కథలున్నాయి. 2008 సంవత్సరంలో ప్రచురితమైందీ సంకలనం.

***

బట్టల కొట్టు ముందు జోకర్ కాస్ట్యూమ్ ధరించి ఆడుతూ, కొనుగోలుదారులను ఆహ్వానిస్తూ సందడి చేసే రాఘవ తన జీవితంలోని వ్యథని ఓ మిత్రునితో చెప్పుకుంటాడు. కన్న కొడుకే తన్ని తరిమేస్తే, ఊరు కాని ఊరొచ్చి ఆత్మాభిమానంతో ముసుగు వేసుకుని బొమ్మలా నటిస్తూ జీవనం కొనసాగిస్తాడు. ‘జోకర్ బొమ్మ’ చదివాకా మనసు బరువెక్కుతుంది.

‘ప్రేమే నేరమౌనా’ కథలో ఒకరికి తెలియకుండా ఒకరిగా వైశాలినీ, సునయనని ప్రేమించి వాళ్ళని మోసం చేసిన శశాంక్‍ హత్యకి గురవుతాడు. హత్యకి గురైన సమయంలో సునయన, వైశాలి ఇద్దరూ అక్కడే ఉంటారు. వైశాలి ఉన్నట్టు సునయనకి తెలుస్తుంది. కానీ, సునయన సంగతి వైశాలికి తెలియదు. ఎవరి వల్ల అతను చనిపోయాడనేది రేఖామాత్రంగా స్పష్టమైపోయి, ముగింపు కూడా పాఠకుల ఊహకి అందుతుంది.

సునామీ అనంతరం సముద్ర తీరంలోని తమ గ్రామానికి కొట్టుకొచ్చిన ఓ మహిళ శవానికి చుట్టబడి ఉన్న చీరలో ఓ పసిబిడ్డ దొరుకుతుంది పళనికి. అదే సమయంలో అతని భార్య మునెమ్మకి ఓ బాబు దొరుకుతాడు. పిల్లలు లేని ఆ దంపతులు పాపకి గంగ అనీ, బాబుకి సాగర్ అని పేరు పెట్టి పెంచి పెద్ద చేస్తారు. పిల్లలిద్దరూ కష్టపడి చదవుకుని ఒకరు డాక్టరు, మరొకరు లాయరు అయి తల్లిదండ్రులకి, తమని ఆదరించిన ఆ ఊరికి అండగా నిలుస్తారు ‘గంగాసాగర్’ కథలో.

ఈ మూడు కథలని రచించినది చిత్తజల్లు ప్రసాద్ గారు.

~

‘జ్ఞానోదయం’ కథలో ఒక ఊరి శ్మశానంలో శవాలను కాల్చే పోలిగాడికి గాంధీ అనే ఓ మంచి వ్యక్తి పరిచయం అవుతుంది. కానీ ఆయన కారణంగా పోలిగాడిలో ఓ దురాశ కలుగుతుంది. ఓ శవాన్ని పూడ్చే కార్యక్రమాలయిపోయాకా, అందరూ వెళ్ళిపోయినా, కాసేపు తనతో ఉండమని గాంధీని బ్రతిమాలి, కాసేపయ్యాకా ఆయనపై దాడి చేసి చంపేస్తాడు. ఎందుకు చంపాడో పాఠకులకి తెలుస్తుంది. కానీ హత్య చేసినందుకు పోలిగాడికి శిక్ష పడిందా లేదా అన్నది పాఠకుల ఊహకి వదిలేశారు రచయిత.

ఒక ఆఫీసులో ఒకరిని చూసి ఒకరు నవ్వుతూంటారు. ఎందుకు నవ్వుతున్నారో మొదటి వ్యక్తికి తప్ప మిగతావారెవరికీ తెలియదు. ఇంతలో బాస్ వచ్చి వాచ్‍మన్‍ని ఎందుకు నవ్వుతున్నావంటే, టైపిస్ట్ నవ్వుతున్నాడు కాబట్టి నేను నవ్వాను అంటాడు, అలా ఒకరు నవ్వారని తాము నవ్వామని అందరూ చెప్తారు. చివరికి అసలు కారకురాలు రోజా అని బాస్‍కి తెలుస్తుంది. ఒక్కసారిగా అందరినీ కోపంగా చూస్తాడు బాస్. అందరి నవ్వులూ ఆగిపోతాయి. వాళ్ళ నవ్వుల వెనుక ఉన్నది కూడా బాసిజమే అని గ్రహిస్తాడు బాస్ ‘నవ్వు’ కథలో.

ఓ వైద్యశాలలో – డాక్టర్ గారి చికిత్స మాత్రమే కాకుండా ఆమె నవ్వు కూడా కావాలని రోగులు ఎందుకు కోరుకున్నారో చెప్పే కథ ‘ఆమె నవ్వే కావాలి!’. నిత్య జీవితంలో నవ్వు ఆవశ్యకతని చెబుతుందీ కథ.

ఈ మూడు కథలని రచించినది కట్టా వెంకటేశ్వర రావు గారు.

~

‘మనసులేని ప్రేమ’ అనే శీర్షిక చూసినప్పుడు అదేంటి ప్రేమించడానికి కావల్సినదే మనసు కదా అని సందేహం వస్తుంది. కానీ కథ చదివాక, టైటిల్ జస్టిపై అవుతుంది. లెక్కలు వేసుకుని ప్రేమించేవాళ్ళ స్వభావాలను చాటుతుందీ కథ.

‘డాక్టర్ టైలర్’ కథలో – దర్జీ పని ద్వారా వచ్చే ఆదాయం ఏ మాత్రం సరిపోవడం లేదని నకిలీ డాక్టర్ అవతారమెత్తుతాడు రాజు. టైలర్ షాపులోని తన సహాయకుడు కైలాసాన్నే కాంపౌండర్‍గా పెట్టుకుంటాడు. డబ్బుల కోసం కక్కుర్తి పడి జనాల ఆరోగ్యంతో ఆటలాడుకున్న రాజుని, కైలాసాన్ని అరెస్టు చేస్తారు. రోగులకి చికిత్స చేసే ప్రహసనంలో హాస్యం జొప్పించినా, నకిలీ వైద్యుల బెడదని ఎదుర్కోవాల్సిన అవసరాన్ని ముందుకు తెచ్చారు రచయిత.

విద్యావేత్తనని గొప్పలు చెప్పుకునే ధూర్తుడి అసలు స్వరూపాన్ని వెల్లడిస్తుంది ‘చాకిరి’ కథ. అయినా ప్రభుత్వం దృష్టిలో, అధికారుల దృష్టిలో అతను దోషి కాకపోవడం మన వ్యవస్థలోని లోపం!

కొండూరి కాశీ రచించిన ఈ మూడు కథలు ఆలోచింపజేస్తాయి.

~

భార్యని అర్థం చేసుకోవడం కష్టం అనుకున్న అభిజిత్ – ఆమె అంతరంగాన్ని గ్రహించేసరికి ఆలస్యమైపోతుంది ‘ప్రవల్లిక’ కథలో. కొసమెరుపు కథ ఇది.

భారతదేశంలో జరుగుతున్న వివిధ సంఘటనలను కళ్ళారా చూసేందుకు విష్ణుమూర్తి నారదుడితో కలిసి వస్తాడు ‘భూభాగోతం’ కథలో. దేశంలోనూ, అప్పటి ఉమ్మడి రాష్ట్రంలోనూ జరుగుతున్న పలు సంఘటనలని స్పృశిస్తూ అల్లిన వ్యంగ్యాత్మక కథ ఇది.

చాన్నాళ్ళకి కల్సిన బాల్యమిత్రుడు నాగేశ్వరరావుని మర్నాడు తమ ఇంటికి ఆహ్వానిస్తాడు రామారావు. రామిగా, నాగ్గా అని ఒకరినొకరు ఆప్యాయంగా పిల్చుకునేవారు ఆ మిత్రులు. రామిగాడి ఇంటికి వెళ్ళి తమ చిన్నప్పటి అనుభవాలను కలబోసుకుందామనుకున్న నాగ్గాడికి ఎదురైన విషమ పరిస్థితి ఏమిటో ‘గోలాయణం’ కథ చెబుతుంది.

ఈ మూడు కథలని రచించినది తిరువీధుల సతీష్ కుమార్ గారు.

వేర్వేరు ఇతివృత్తాలతో, విభిన్నమైన శైలులతో, వైవిధ్యవంతమైన చిన్న కథలను అందించారీ రచయితలు.

***

కథా సుధ (కథా సంకలనం)
సంపాదకులు: శ్రీ కట్టా వెంకటేశ్వరరావు
ప్రచురణ: చైతన్య భారతి, హైదరాబాద్
పేజీలు: 75
వెల: ₹ 50.00
ప్రతులకు:
చైతన్య భారతి
చైతన్య బుక్ అండ్ పెన్ కార్నర్,
షాపు నెం. 15, మోతీ నగర్,
హైదరాబాద్ 500018
ఫోన్: 9849251214

 

Exit mobile version