[త్వరలో విడుదలవుతున్న ‘కథాపరిమళాలు’ అనే కథా సంకలనానికి కస్తూరి మురళీకృష్ణ వ్రాసిన ముందుమాటని పాఠకులకు అందిస్తున్నాము.]
[dropcap]ప్ర[/dropcap]తి రచయితా కథల సంకలనంలో తన కథ ప్రచురితమవాలని కోరుకుంటాడు. తన రచన పాఠకులకు అందాలని, ఆ రచనను చదివిన పాఠకులు తన కథపై అభిప్రాయాలు తెలియచెప్పాలని, తన కథ గురించి చర్చలు, విశ్లేషణలు జరగాలని కోరుకుంటాడు. తన కథ వల్ల తనకు గుర్తింపు రావాలని వాంచిస్తాడు. ఇతర భాషల రచయితలకు ఈ కోరిక విచిత్రంగా అనిపించవచ్చు. కానీ, తెలుగు రచయితలకు ఇది చిన్న కోరిక కాదు. దాదాపుగా గగన కుసుమంలాంటిదీ కోరిక. ఇందుకు కారణాలు తెలుసుకోవాలంటే, ప్రస్తుతం తెలుగు సాహిత్య ప్రపంచంలో నెలకొనివున్న పరిస్థితులను గురించి తెలుసుకోవాల్సివుంటుంది.
తెలుగు సాహిత్య ప్రపంచం సాహిత్య మాఫియా ముఠాలు, ఇజాల గుప్పిట్లో చిక్కుకుని వుంది. కలసికట్టుగా ఈ ముఠాలంతా పరస్పర సహకారంతో తాము చెప్పిందే సాహిత్యం, తాము మెచ్చిందే ఉత్తమ సాహిత్యం, తమకు నచ్చినవాడే ఉత్తమ రచయిత అనేంత రీతిలో తమ కబంధ హస్తాలలో సాహిత్యాన్ని చుట్టేశారు. దీనివల్ల ఒక రచయితకు గుర్తింపు రావాలన్నా, అతని రచన పాఠకులకు తెలియాలన్నా, అతని రచనలు ఉత్తమ రచనలుగా గుర్తింపు పొందాలన్నా ఈ మాఫియాముఠాలలో దేన్లోనో ఒక దాన్లో చేరక తప్పని పరిస్థితి నెలకొంది. ఈ మాఫియా ముఠాలు తలచుకుంటే, కథను కథ కాదని తీర్మానించగలరు. వ్యాసాన్ని ఉత్తమ కథగా చలామణీ చేయగలరు. ఉత్తమ రచయితను అనామకుడిగా విస్మృతిలోకి నెట్టగలరు. ఒక వాక్యం సరిగ్గా రాయలేనివాడిని ఉత్తమ రచయితగా నిలపగలరు. ఈ మాఫియా ముఠాల నెట్వర్క్ విదేశాలనుంచి స్వదేశంవరకూ పలు విభిన్నరూపాలలో విస్తరించి వుంది. మీడియా, అకాడెమీషియన్లు, అకాడెమీలు, ఉన్నతోద్యోగులు.. ఇలా మాఫియా ముఠాలు అత్యంత శక్తి కలిగి సాహిత్య రంగాన్ని శాసిస్తూ నిర్దేశించగలిగే స్థితిలో వుండటంతో నిజంగా సాహిత్యంపై ఆసక్తితో, అనురక్తితో రచనలు చేసే రచయితల మనుగడ ప్రశ్నార్ధకమయిపోయింది. రచనలు చేయటమేకాదు, తమ రచనలను సజీవంగా వుంచుకునే బాధ్యతకూడా రచయితలదే అయింది. ముఖ్యంగా, తమదంటూ స్వీయ వ్యక్తిత్వం కలిగి, స్వంత ఆలోచనలూ అభిప్రాయాలు ఉన్న రచయితల పరిస్థితి మరింత జటిలమైపోయింది. తమ రచనలకు గుర్తింపు లభించాలంటే మాఫియా ముఠాలను ఆశ్రయించక తప్పదు. మాఫియా ముఠాలను ఆశ్రయిస్తే, రచయిత తన వ్యక్తిత్వాన్ని, అస్తిత్వాన్నీ కోల్పోవాల్సివుంటుంది. తనకు నచ్చినట్టు కాక, ముఠాలు ఆదేశించినట్టు రాయాల్సివుంటుంది. మూస రచయితల జాబితాలో చేరి మూస రచనలు చేయాల్సివుంటుంది. వ్యక్తిత్వం, వెన్నెముకలున్న రచయితలకు మరణసదృశం ఇది. చిన్న చిన్న అవార్డులనుంచి అకాడెమీ అవార్డులవరకూ, సన్మానాలనుంచి, కథల సంకలనాలవరకూ , సోషల్ మీడియాలో ప్రస్తావనలనుంచి, పత్రికలలో పొగడ్తల వరకూ ప్రతీదీ సాహిత్య మాఫియా ముఠాల ఇష్టానుసారం జరిగే పరిస్థితులలో రచనలు చేయటమే కాదు, తమ రచనలను సజీవంగా నిలుపుకోవాల్సిన పని కూడా రచయితదే అవుతుంది. వ్యక్తిగతంగా సంపుటులు ఎన్ని ప్రచురించుకున్నా, సంకలనాలలో ఇతర రచయితల సరసన తమ రచనవుండటం వల్ల కలిగే గౌరవం, విలువలు వేరు. ఎలాగో ముఠాల సంకలనాల్లో తమ కథలు వచ్చే వీలు లేదు కాబట్టి, తమ ఉనికిని చాటుకునేందుకు రచయితలు జట్లుగా ఏర్పడి సహకార పధ్ధతిన కథల సంకలనాలు ప్రచురించటం ఆరంభమయింది. సాహిత్య మాఫియా ముఠాల సంకలనాలకు లభించినంత ప్రచారం లభించకున్నా ఈ సంకలనాలు రచయితలకు తమ రచనలను సంకలనాలలో చూసుకోవాలన్న కోరికను తీర్చటమే కాకుండా, వారి రచనలు పాఠకుల దృష్టికి తెచ్చే వీలునూ ఇచ్చాయి. ఎవరో ఒకరు ముందుకు వచ్చి, రచయితలను ఒక త్రాటిపైకి తీసుకువచ్చి, సహకార పద్ధతిలో కథల సంకలనాలు ప్రచురించటం ఒకరకంగా కథల సంకలనాలపై సాహిత్య మాఫియా ముఠాల పట్టును ప్రశ్నించి, ముఠాల గుప్పెడుమంది రచయితలే కాదు, ఇంత విభిన్నంగా, విశిష్టంగా రచయితలనేకులున్నరని పాఠకులకు తెలియచెప్పి ముఠాల ఏకచత్రాధిపత్యాన్ని ప్రశ్నిస్తున్నట్టవుతుంది. అందుకే తెలుగు సాహిత్యంలో ఇతర ఏ భాషలో లేని విధంగా, ప్రాంతీయంగా, భావజాల పరంగా, కులం ఆధారంగా, చివరికి రచయితల వయసుల ఆధారంగా కూడా సంకలనాలు ప్రచురితమవుతున్నాయి. కానీ, ఎలాంటి పరిధులు, పరిమితులూ లేకుండా రచయితల దృష్టిలో వారి ఉత్తమ రచనలను ఒకచోట చేర్చి అందించే కార్యం మాత్రం చేస్తున్నది ఎన్.కె. బాబు మాత్రమే!
ఇలా సహకార పద్ధతిలో సంకలనాలు ప్రచురించటంలో భాగంగా, సాహిత్యాభిమాని, పుస్తకం అంటే ప్రాణం ఇచ్చే శ్రీ ఎన్.కె. బాబు ఒక వినూత్న పద్ధతిని ప్రారంభించాడు. రచయితలు తమకు నచ్చిన తమ కథను ఎంపిక చేస్తే వాటిని ఒక సంకలనంగా ‘నాకు నచ్చిన నా కథ’ పేరిట ప్రచురిస్తాడు. లాభ నష్టాల ప్రసక్తి లేకుండా, కేవలం సాహిత్యాభిమానంతో, రచయితలంటే తనకున్న అమితమైన గౌరవంవల్ల ఎన్.కె. బాబు ఈ పని చేస్తున్నారు. ప్రస్తుతం తెలుగు పుస్తకాల ప్రచురణ పరిస్థితి గురించి తెలిసినవారికి పుస్తక ప్రచురణ అన్నది కేవలం ఒక పాషన్‌తో చేసే పని తప్ప లాభసాటి వ్యాపారం కాదని తెలుసు. ఇలాంటి పరిస్థితుల్లో దాదాపుగా 205 రచయితల కథలను 6 ‘నాకు నచ్చిన నా కథ’ల సంకలనాలుగా ప్రచురించటం సామాన్యమైన పనికాదు. ఎంతో నిజాయితీ, నిబధ్ధత , సాహిత్యం పట్ల తీవ్రమైన అభిమానం, రచయితల పట్ల అత్యంత గౌరవం వుంటే తప్ప ఇలా ఒకటి తరువాత ఒకటిగా సంకలనాలను ప్రచురించటం అసాధ్యం. అలాంటి అసాధ్యమయిన పనిని సుసాధ్యం చేస్తూ, ఇప్పుడు కథా పరిమళాలు శీర్షికన 56 గురు రచయితల కథలతో మరో సంకలనం వెలువరిస్తున్నరు ఎన్.కె. బాబు. ఇది ఆహ్వానించదగ్గది. ముఖ్యంగా ఎన్.కె. బాబు సంపాదకత్వం వహించే కథల సంకలనాలు ఒక ప్రాంతానికో, భావజాలానికో పరిమితం కాకుండా రచయితలందరినీ కూడదీసుకోవాలన్న ప్రయత్నం అభినందనీయం. ఈ సంకలనంలో పేరున్న పెద్ద రచయితలూ, పేరు తెచ్చుకుంటున్న మంచి రచయితలూ, పేరు సాధించేందుకు ప్రయత్నిస్తున్న యువ రచయితలూ అందరికీ సమానమైన వేదికను కల్పించటం ప్రశంసనీయం. మరో అభినందించవలసిన విషయం ఏమిటంటే ఇప్పటికే లబ్ధప్రతిష్ఠులయిన రచయితలు రంగనాయకమ్మ, మల్లాది వంటి వారు ఇతర రచయితలను ప్రోత్సహించేందుకు తమ కథలను ఈ సంకలనంలో ప్రచురణకు ఇవ్వటం. ఇది పాఠకులకు పలు రకాల రచనలు, పలు విభిన్నమైన స్థాయిలలోవున్న రచనలూ చదివే వీలునిస్తుందీ సంకలనం. యువ రచయితలకు తమ కథలు పేరుపొందిన రచయితల సరసన చూసుకోవటం ఉత్సాహకరమూ ప్రోత్సాహకరమైన అంశం. పేరుపొందిన రచయితల కథలు చదివి తమ తమ రచనాశైలిని విశ్లేషించుకునే వీలునిస్తాయి ఇలాంటి సంకలనాలు. నిజానికి రచయితలందరినీ సమానంగా గౌరవింఛే ఇలాంటి సంకలనాలకు రావాల్సినంత ప్రచారం రావటంలేదు. చేరాల్సిన రీతిలో పాఠకులను చేరటం లేదు. ఇందుకు కారణాలనేకం. ముఖ్యంగా తెలుగులో ప్రచురితమయిన పుస్తకాలను పాఠకులకు చేరువచేసే వ్యవస్థ లేకపోవటం, ఆ వున్న వ్యవస్థా సాహిత్య మాఫియాల గుప్పిట్లో వుండటం ప్రధాన కారణాలు. ఎలాగయితే రచయితలు కలిసి సంకలనాలు రూపొందిస్తున్నారో, అలాగే ప్రచార వ్యవస్థను కూడా ఏర్పాటు చేసుకునే దిశగా ఆలోచించాలి. అప్పుడుకానీ, చక్కటి పుస్తకాలకు లభింఛాల్సినంత ఆదరణ లభించదు. సంకలనాలలో తమ కథలను చూసుకోవాలన్న రచయితల కలను సాకారం చేసేందుకు కృషి చేస్తున్న ఎన్.కె. బాబు ఈ విషయం మీద కూడా దృష్టి సారింఛాల్సివుంటుంది. రచయితలందరినీ ఏక త్రాటిపై నిలిపి అసలయిన సాహిత్యాన్ని సజీవంగా నిలిపే ప్రయత్నాలలో తన పాత్రను సమర్ధవంతంగా నిర్వహిస్తున్న ఎన్.కె. బాబును ప్రశంసిస్తూ, అతని ఈ ప్రయత్నానికి సహాయ సహకారాలు అందిస్తున్న రచయితలకు అభినందనలు తెలియచేస్తున్నాను. ఇంత వరకూ ఇలాంటి సంకలనాలవైపు దృష్టి సారించని రచయితలు ఈ వైపు దృష్టిని ప్రసరింపచేయాలి. రచయితలంతా ఇలా ఒకటై కలసికట్టుగా పనిచేస్తే బలవంతమైన సర్పము చలిచీమలచేత చిక్కి చచ్చినట్టు, తెలుగు సాహిత్యాన్ని తమ గుప్పెట్లో ఇముడ్చుకున్న సాహిత్య మాఫియా ముఠాల ఆటలు కడతాయి. అసలయిన రచయితలకూ, రచనలకూ సముఛిత స్థానం లభించే మంచి రోజులొస్తాయి. ఈ దిశగా సాహిత్యాన్ని నడిపించటంలో ఎన్.కె. బాబు వేస్తున్న అడుగులివి. రచయితలందరూ కలిస్తే ఇదొక వెల్లువ అవుతుంది. ఇలాంటి సంకలనాలను అక్కున చేర్చుకుని సాహిత్యాన్ని సజీవంగా నిలిపే బాధ్యత పాఠకులదే.
***
కథాపరిమళాలు (కథా సంకలనం)
సంపాదకత్వం: ఎన్.కె. బాబు
వెల: ₹ 300/-
ప్రతులకు:
N K Babu.
24-8-1,
Sahaja Society,
Vizianagaram: 535002
Cell 89777 32619.
nkbabu_nk@yahoo.com
మరిన్ని వివరాలకు పై నెంబరులో సంప్రదించగలరు.