కథల గోదారి – పుస్తక పరిచయం

0
2

[dropcap]గో[/dropcap]దావరి నది నేపథ్యంతో ప్రముఖ కథకులు దాట్ల దేవదానం రాజు వ్రాసిన 14 కథల సంపుటి “కథల గోదావరి”.

“కొన్ని కథలు జీవన వాస్తవికతను ప్రతిబింబిస్తూ సార్వజనీన సత్యాలుగా నిలుస్తాయి. ఒక శాశ్వతత్వం సిద్దించడానికి అలాంటి కథలు రాయాలనే తపన ప్రతి రచయితకు ఉంటుంది. తగిన తాత్విక భూమికను ఏర్పరచుకుని కథను ఒక కళావస్తువుగా మలచడానికి కథకుడు శ్రమపడి తీరాలి. మానవతా విలువలు పెంచి పోషించే కథలంటే నాకు ఇష్టం. ఒక జీవిత సత్యాన్ని ఒక నైతిక సంఘర్షణని ఆవిష్కరించినపుడే కథాప్రయోజనం నెరవేరుతుంది” అంటూ తాను ఈ కథలెందుకు రాసారో చెప్పారు రచయిత “గోదారి గలగలల గురించి…”లో.

***

“వడ్డించిన విస్తరి మాదిరి జీవితాలను ఒడిదుడుకులకు అతీతంగా గడిపేవారు ఎప్పటికీ కథావస్తువులు కాజాలరు. సామాన్యుల మధ్యకి – అందునా – ఒడిదుడుకులెరిగిన వారి మధ్యకు రచయిత వెళ్ళాలి. అప్పుడే మనుషుల జీవితాలను పరిపాలించే పలు అంశాలు బయటకు వస్తాయి. దాట్ల దేవదానం రాజు, గోదావరి నది మీద యానాం తీరానికి ప్రయాణిస్తూ రకరకాల మనుషుల్ని పలకరిస్తూ వారి అంతరంగాల్ని శోధిస్తూ వ్రాసిన జీవవంతమైన కథలివి” అన్నారు ప్రముఖ కవి ఇంద్రగంటి శ్రీకాంతశర్మ “జీవధార” అనే ముందుమాటలో.

***

“ఈ గుచ్చంలో కథలన్నిటికి కాన్వాస్ గోదావరే. పొడుగు వెడల్పుతో బాటు ఎత్తు కలిగిన కాన్వాస్ గోదావరి. దాట్ల దేవదానం రాజు ఒక్కో అలని చుట్ట చుట్టకు ఇంటికి తీసుకెళ్ళి, మనసులో పరిచి ఆరబెట్టి దాని మీద రాసిన కథలివి. పైగా కథాశీర్షికల్ని మిత్రులు సూచించగా వాటితో ఇతివృత్తాలు అల్లుకున్నారు. చక్కని పూరణతో అందించి, సరికొత్త అవధానానికి అంటూ తొక్కారు. గోదారి గాలి పీలుస్తూ, గోదారి నీరు సేవిస్తూ, గోదాట్లో స్నానిస్తూ, గోదార్ని జపించే వారికి ఇదేమీ బ్రహ్మవిద్య కాదు” అని వ్యాఖ్యానించారు సుప్రసిద్ధ కథకులు శ్రీరమణ “కథల గోదారికి గొజ్జంగి పూదండ” అనే ముందుమాటలో.

***

కథల గోదారి (కథలు)

రచయిత: దాట్ల దేవదానం రాజు

పేజీలు: 147

వెల: రూ.120/-

ప్రతులకు:

నవోదయా, విశాలాంధ్ర, ప్రజాశక్తి, ఎమెస్కో, ఇతర ప్రముఖ పుస్తక కేంద్రాలు, రచయిత వద్ద.

దాట్ల దేవదానం రాజు, 8-1-048, ఉదయిని, జక్రియనగర్, యానాం – 533 464, Ph: 0884-2321096

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here