మనవైన సామెతలు – మేలైన కథలు

0
1

[ప్రముఖ రచయిత్రి శ్రీమతి మద్దూరి బిందుమాధవి గారి “క‘థ’న కుతూహలం” అనే సామెత కథల సంపుటికి కొల్లూరి సోమ శంకర్ రాసిన ముందుమాట.]

[dropcap]సా[/dropcap]హిత్యం అంటే హితం కోరేది. ఏ రూపంలో ఉన్నా దాని మౌలిక లక్షణం – హితం కలిగించటం అనేది మారదు. కథ/కవిత/నవల/వ్యాసం – రూపం ఏదైనా – అంతిమ ఉద్దేశం చదువరులలో మానసిక వికాసం కల్గించటమే, మార్పుకు అవకాశం కల్పించటమే. సాహిత్యం వల్ల ఎందరో ఫ్రభావితులైన ఉదంతాలు ఉన్నాయి.

మన దేశంలో హితం చెప్పడం అనేది పెద్దల ద్వారా పిల్లలకి అనాదిగా మౌఖికంగా సాగింది. మంచి మాటలని, నీతి బోధలని పెద్దల ముఖతా విని, నేర్చుకుని పాటించి, తమ తరానికి అందించేవారు. ఈ మంచి మాటలే కొన్ని తరాలు గడిచేసరికి సామెతలుగా మారి ఉండవచ్చు. ఎప్పుడు ఏది చెయ్యాలో, ఏది ఎప్పుడు చేయకూడదో, ఎవరితో ఎలా మాట్లాడాలో, ఎలా మాట్లాడకూడదో సూచిస్తూ – మన నడవడికి మార్గం చూపుతాయి సామెతలు.

అటువంటి సామెతలను ఉపయోగిస్తూ, ఆధునిక తరానికి ఉపకరించేలా, నేటి పరిస్థితులకు అన్వయిస్తూ కథల రూపంలో అందిస్తున్నారు శ్రీమతి మద్దూరి బిందుమాధవి.

నిజానికి చాలామందికి సామెతలు కొత్త కాదు, కథలూ కొత్త కాదు. అయితే చాలామందికి తెలిసిన సామెతని కొత్తగా కథలో అన్వయించటంలో రచయిత్రి నేర్పు చూపారు.

సమాజంలో చోటు చేసుకుంటున్న మార్పులు, బీటలు వారుతున్న బంధాలు, మారుతున్న విలువలు, నిత్యం రూపాంతరం చెందుతున్న సాంకేతికతలు, వ్యక్తుల ఆశలు, ఆకాంక్షలు, స్వీయ ప్రయోజనాలకే పెద్ద పీట వేయటం లాంటి ఇతివృత్తాలకు సామెతలను అన్వయిస్తూ – హెచ్చరికలు చేస్తూ యువతకి దారిదీపంలా ఉపయోగపడే కథలను అందించారు రచయిత్రి.

భార్యాభర్తలు, తల్లిదండ్రులు, అక్కా చెల్లెల్లు, అన్నాతమ్ముళ్లు – ఇలా కుటుంబ సభ్యుల ప్రవర్తనలని ఆయా కథల్లో ప్రస్తావిస్తూ – సందర్భోచితమైన సామెతలని ఉటంకిస్తూ – ఆయా సామెతలను ఇటువంటి సందర్భాలలో వాడతారని తెలుపుతారు.

కొన్ని కథలలో ఆధునిక యువతీ యువకుల ఆలోచనలు, కెరీర్లు, వివాహం విషయాల వాళ్ళు తీసుకునే తొందరపాటు నిర్ణయాలను ప్రస్తావించి – జీవితమంటే అవసరమైన సర్దుబాట్లు చేసుకోవడమేనని, అలా చేసుకోలేకపోతే ఇబ్బందులు తప్పదని చెబుతారు.

అసూయా ద్వేషాలతో రగిలిపోయే వారు ఎదుటివారి ఉన్నతిని సహించలేరని, ఎప్పుడు అవకాశం దొరికినా ఎదుటివారిని కించపరిచి మానసికానందం పొండానికి ప్రయత్నిస్తూ – తాము లోకువ అవుతున్నట్లు గ్రహించలేని వైనాన్ని సున్నితంగా చెప్తారు.

వెయిట్ కాన్షన్‌సెస్‌తో, హెల్త్ కాన్సియస్‌నెస్ పేరుతో అతి జాగ్రత్తలకు పోయే మనుషులు, తెలిసో తెలియకో ఎదుటివారికి ఆహారపు అలవాట్లను దెప్పిపొడిచే వ్యక్తులు ఈ కథల్లో మనకి కనిపిస్తారు.

వీలైనంత తక్కువ సమయంలో ఎక్కువ సంపాదించేయాలన్న తాపత్రయం అధికమవుతున్న నేటి రోజుల్లో కాంట్రాక్టులకు ఒప్పుకున పనివాళ్ళ వల్ల ఎదురయ్యే ఇబ్బందులను, చేసే పనిలో ఏకాగ్రత లేక చేసిన పనినే మళ్ళీ చేస్తూ డబ్బూ, సమయం వృథా చేసేవాళ్లు తారసపడతారు.

ఆర్థిక అసమానతల వల్ల కలిగే న్యూనతా భావాల వల్ల పెద్దలు నోరు జారి ఏదో అంటే, పిల్లలు ఆ మాటల్ని గుర్తుపెట్టుకుని మిత్రులతో అనడం, పెద్దల మధ్య కోపతాపాలు సంభవించడం, స్నేహాలు దూరమవటం జరుగుతుంది.

నిన్నటి దాకా హాయిగా ఆడుతూ పాడుతూ ఆరోగ్యంగా ఉన్న వ్యక్తి నేడు మృత్యువాత పడడం (ప్రమాదాల వల్ల కాకుండా) అనేది ఊహకి అందని విషయం. మరణం మన అదుపులో ఉండదని ఓ కథలో చెప్తారు.

తమ ప్రవర్తన ద్వారా పెద్దలకు ఎలా నడుచుకోవాలో చెప్తారు. పెద్దలే తప్పుడు మార్గంలో నడిచి, పిల్లలు పెద్దయ్యాకా, వాళ్ళు సరైన దారిలో వెళ్ళడం లేదని వాపోయి ఉపయోగం ఉండదని వ్యాఖ్యానిస్తారు.

వ్యాపార ప్రకటనలు గుడ్డిగా నమ్మి, అవసరమున్నా లేకపోయినా షాపింగ్‍ చేద్దామని నిర్ణయించుకున్నవారి వైఖరి ఎలా ఉంటుందో, వారిని వాదనలో నెగ్గలేమన్న విషయాన్ని హాస్యంగా చెబుతోందో కథ. ఈ సందర్భంగా ఈ కథలో ఓ సామెతని చెప్పిన తీరు బావుంది.

ఓ కథలో ఒక పిల్లాడి పాత్ర ద్వారా సుమతీ పద్యం చెప్పించి తమ విలువలని కాపాడుకునేందు రాజీ పడనివారుంటాని తెలిపారు.

నలుగురికీ ఇబ్బంది కలిగించే విషయాన్ని, ఆ వ్యక్తి అపార్థం చేసుకోకుండా.. సున్నితంగా అర్థమయ్యేలా చెప్పాలనీ ఓ సహోద్యోగి చేసిన ప్రయత్నానికి – పిల్లి మెడలో గంట కట్టడం అనే సామెత అన్వయించి అల్లిన కథ – కార్యాలయాలలో స్నేహ సంబంధాలు నిలుపుకోడానికి, సీనియర్ల అనుభవాన్ని ఉపయోగించుకుని, జూనియర్లు నేర్చుకోవడానికి దోహదం చేస్తుంది.

దూరదేశాల ప్రయాణాలు అలవాటు లేక, చెప్పేవాళ్ళు లేక విమానాశ్రయాలలో ఇబ్బందులు పడేవాళ్ళ వ్యథలని చక్కని సామెతతో అన్వయించి అందించారు.

పిల్లల చదువుల విషయంలో తల్లిదండ్రులు ఎదుటివారితో పోలికలు పెట్టుకుని తప్పటడుగులు వేయకూడదని ఓ కథలో చెప్తారు. సందర్భోచితంగా ఈ కథలో పలు సామెతలను ప్రస్తావించారు.

భర్త ఉన్నప్పుడు ఇంటి బాధ్యత అంతా చక్కబెట్టి, ఆయన మరణాంతరం, ఇంటి బాధ్యత కోడలి చేతికి వెళ్ళాక ఎదురవుతున్న మార్పులను తట్టుకోలేకపోతుంది భారతి. పరిస్థితులతో రాజీ పడి, కోడలిని ఇబ్బంది పెట్టకూడనుకుంటుంది. ఈ కథకి ఉపయోగించిన సామెత కథకి బాగా నప్పింది.

‘చిన్న చిన్న వాన చినుకులే వరద అయినట్లు’ అనే సామెతని పాజిటివ్‍గా ఉపయోగించిన తీరు బావుంది. ఆధునిక వసతులని అవగాహన చేసుకుంటే, మంచి మనుషుల సాయం అక్కరకొస్తుందని చెప్తుందీ కథ.

‘పెళ్ళికి పోతూ పిల్లిని చంకన పెట్టుకెళ్ళినట్లు’ అనే కథలో పెళ్ళికి ముందు ఎంత హడావిడి ఉంటుందో చెప్తూ, ఎన్నో సామెతలని ఉదహరించారు.

సానుభూతి చూపించాల్సిన ఒక మెడికల్ ఛాలెంజ్‌‌కి సామెతని అన్వయించి కథలా అల్లారు. తొందరగా అపార్థానికి కారణమయ్యే ఈ సమస్యని హోమియో మందులతో నయం చేయవచ్చని అంటారు.

అన్నీ అంగట్లో దొరికినట్లే మానవత్వం కూడా ఎక్కడన్నా అమ్మితే బాగుండు అని ఒక కథలో ఒక పాత్ర అనడం, అక్కడి సన్నివేశం పాఠకుల హృదయాలని తాకుతాయి.

‘లోకో భిన్న రుచి’ అంటూ వివిధ వ్యక్తుల ప్రవర్తనను ఓ కథలో చెప్పిన వైనం ఆసక్తిగా ఉంటుంది.

కొన్ని బాగా తెలిసిన సామెతలు, అంతగా తెలియని సామెతలను ఆయా కథలలో ప్రస్తావించి ఈ కథా సంపుటి ఉద్దేశానికి పూర్తి న్యాయం చేకూర్చారు.

‘ఏటి ఈత లంక మేత’, ‘వేలూ మనదే కన్నూ మనదే’, ‘చిచ్చు గలమ్మ చిత్రాంగి.. పాత్ర గలమ్మ పనిమంతురాలు’, ‘నోరా ఏం చేశావంటే వీపుకి దెబ్బలు’, ‘నింద లేనిదే బొంది పోదు’, ‘చావు కాలానికి లావు దుఃఖం’, ‘పెట్టకపోతే పెట్టే ఇల్లు చూపించు’, ‘పెనిమిటి పెట్టిన పెద్దరికం’, ‘భూదేవికే పక్షపాతం.. కన్నతల్లికే పక్షపాతం’, ‘మనిషికి ఉన్నది పుష్టి.. గొడ్డుకి తిన్నది పుష్టి’, ‘సంసారం గుట్టు రోగం రట్టు’ – వంటి సామెతలను కొన్ని కథలకి శీర్షికలుగా, కొన్ని కథలలో సందర్భానుసారంగా ఉపయోగించి పాఠకులకు ఆసక్తి కల్పించడంలో రచయిత్రి నైపుణ్యం చూపారు.

ఒకప్పుడు జనాల నాలుకలపై కదలాడి, ప్రస్తుతం విస్మృతికి గురవుతున్న తెలుగు సామెతలను నేటి/రాబోయే తరాలకు గుర్తు చేస్తూ – నేటి ఆధునిక జీవన శైలులను, మనుషుల మధ్య సంబంధ బాంధవ్యాలను ప్రస్తావించి, ఆయా సామతల ఉద్దేశాన్ని కథలో ప్రతిబించించి ఆ సామెత చెప్పే హితాన్ని పాఠకులకి సులువుగా అవగతమయ్యేలా ఈ కథలను రూపొందించిన బిందుమాధవి గారికి అభినందనలు.

***

క‘థ’న కుతూహలం (సామెత కథల సంపుటి)
రచన: మద్దూరి బిందుమాధవి
పేజీలు: 174
వెల: ₹ 125/-
ప్రతులకు:
నవోదయ బుక్ హౌస్, కాచీగుడా,
హైదరాబాద్. ఫోన్: 9000413413
రచయిత్రి: 9491727272

 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here