Site icon Sanchika

కథావిష్కారం – పుస్తక పరిచయం

[dropcap]కె.[/dropcap]పి. అశోక్‌ కుమార్ గారు తెలుగు కథలపై వ్రాసిన 22 విమర్శా వ్యాసాల సంకలనం ఈ ‘కథావిష్కారం‘ పుస్తకం. ఈ వ్యాసాలను తానెందుకు రాసారో, ఎలా రాసారో ‘నా మాట’లో రచయిత వివరించారు.

***

“కథల ఉత్పత్తి పెరుగుతున్నా వాటి మంచీచెడుల విశ్లేషకులు అరుదు. అందునా పేరొందిన కథా రచయితల గురించే ఎక్కువమంది మరల మరల రాస్తుంటారు. అసలు విమర్శనా రంగంలో ఎక్కువమంది కవిత్వప్రక్రియ చుట్టూరానే తిరుగాడుతుంటారు. వచనప్రక్రియల మీద దృష్టి సారించి కూలంకషంగా విమర్శ చేసేవారు బహు తక్కువ. వీరిలో అగ్రగణ్యుడు కె.పి.అశోక్ కుమార్. గత ముప్పయి సంవత్సరాల వచన సాహిత్య విమర్శనా వ్యాసంగాన్ని పరిశీలిస్తే ఎక్కువగా రాసినవారిలో అశోక్‌ కుమార్ ప్రథమునిగా నిలుస్తాడు. సంఖ్యరీత్యా చూసినా, సారాంశరీత్యా పరిగణించినా అశోక్ కుమార్ వచన సాహిత్య విమర్శలో అగ్రభాగాన నిలబడతాడు.

మూడు దశాబ్దాలుగా కథాసాహిత్యం పుష్కలంగా వస్తున్నప్పటికీ, కథావిమర్శ మాత్రం పరిమితంగానే వెలువడుతున్నది. నిరంతరాయంగా రాస్తున్నవారిలో అశోక్ కుమార్ ప్రధానంగా కనిపిస్తాడు. అందులోనూ విస్మృతికి గురయిన వారి కథల పట్ల పట్టింపు ఎక్కువ. కనుక అశోక్ కుమార్ వ్యాసంగం కథా సాహిత్య విమర్శ విస్తృతికి చేసిన మేలు అపారం. అంతేగాక సాహిత్య, సామాజిక చరిత్రకారులకు మంచి ఉపకరణాలు అశోక్ కుమార్ వ్యాసాలు. ఎందుకంటే ఒక రచయిత కథలని వివరిస్తాడు. ఏ ఇతివృత్తం ఆధారంగా, ఏ కాలంలో, ఏ నేపథ్యంలో ఆ కథలు వచ్చాయో తెలియజేస్తాడు. అందువలన ఆయా వ్యాసాలు చదివిన వారికి రచయితల పట్ల అవగాహన ఏర్పడుతుంది.

కథల్లోని అందచందాలపైనే కాదు, వాటిలోని ఇతివృత్తాల పట్ల ప్రత్యేక శ్రద్ధాసక్తులు ఉన్నపుడే ఇలా రాయడం సాధ్యం. అందువల్లనే అశోక్ కుమార్ విమర్శనా వ్యాసంగం సాహిత్యానికీ, సమాజానికీ అవసరమైంది. అతనిది ప్రధానంగా వస్తుప్రాధాన్య విమర్శ. ఇది ఒక కోణంలో చూస్తే పరిమితి అనిపిస్తుంది. మరో కోణంలో చూస్తే దీని ప్రాధాన్యం బోధపడుతుంది. శైలీశిల్పాల గురించి అలంకార శాస్త్రదృష్టితో విశ్లేషించినప్పటికీ వస్తువు గురించి చర్చ లేకపోతే ఆ విమర్శ అసమగ్రం. రచయిత ఎంచుకున్న వస్తువుని విశ్లేషించడం దారానే ఆయా రచయితల నిబద్ధత, నీతి, దృష్టికోణం తెలిసే అవకాశముంది, రచయితకు ఉన్న కాలికస్పృహ, సామాజిక అవగాహన తెలుస్తాయి, తన చుట్టూ ఉన్న జీవితం పట్ల రచయిత ఏవిధంగా స్పందిస్తున్నారో అర్థం చేసుకోడం వీలవుతుంది. కనుకనే అశోక్ కుమార్ విమర్శనా వ్యాసంగం చేస్తున్న మేలు విశిష్టమైంది, విశేషమైంది, ఈ దృష్టితో ఆలోచించినపుడు అశోక్ కుమార్ సాహిత్యవిమర్శనా వ్యాసంగమంతా గ్రంథస్థం కావలసిన అవసరం బోధపడుతుంది” అన్నారు గుడిపాటి ‘విమర్శలో విభిన్న కోణాలు’ అనే తన ముందుమాటలో.

***

“దాదాపు పదేళ్లుగా అశోక్‌ కుమార్ రాసిన వందలాది సమీక్షల నుంచి, ముందుమాటల నుంచి, పరిశోధనాత్మక వ్యాసాల నుంచి యెంపిక చేసిన 20కి పైగా రచనలతో వస్తోన్న ‘కథావిష్కారం’ కథా విమర్శకుడిగా అతని కృషికి నిలువెత్తు సాక్ష్యం. కథ పట్ల అతని ప్రేమకు దర్పణం. కథకులుగా యీ తరం పాఠకులకు అంతగా తెలీని కొనకళ్ళ వెంకటరత్నం, సి వేణు, యం.రామకోటి, వల్లంపాటి వంటి రచయితల కథలపై రాసిన సమగ్ర వ్యాసాలు అరుదైన రచనల్నీ విస్మృత రచయితల్నీ వెలుగులోకి తేవడానికి అశోక్ పడే తపనను మరోసారి వెల్లడి చేస్తాయి.

ఒక విధంగా కథలు చదవగానే స్పష్టాస్పష్టంగా గోచరించే కథకుడి ఆత్మని పట్టుకుని దాన్ని పాఠకులకు చేరవేయడమే ప్రధాన లక్ష్యంగా సాగే ప్రణాళికని తన విమర్శలో అశోక్ నిర్దుష్టంగా సమర్థవంతంగా నిర్వహించాడని యీ వ్యాసాలు ఆసాంతం చదివితే అర్థమౌతుంది. ఈ క్రమంలో రచయితల్లో కనిపించే లోపాల్ని నిజాయితీతో యెత్తిచూపడానికి సైతం అతను యెక్కడా సంకోచించలేదు.

విమర్శకుడు ప్రాంతీయ పరిమితులకు లోబడి వుండకూదదన్నది అశోక్ తరచుగా చెప్పే మాట. ఎల్లలు లేని అవ్యాజ సాహిత్య ప్రేమికుడు మాత్రమే అనగల మాట అది” అని వ్యాఖ్యానించారు ఎ.కె. ప్రభాకర్ తమ ముందుమాట ‘ఆగిన చోట మొదలెడదాం!’లో.

***

కథావిష్కారం (విమర్శా వ్యాసాలు)
రచన: కె.పి. అశోక్‌ కుమార్
ప్రచురణ: సామ్రాట్ పబ్లికేషన్స్, సికింద్రాబాద్
పుటలు: 168, వెల:  ₹ 120/-
ప్రతులకు: కె.పి.అశోక్‌కుమార్, 6, మా సంతోషీ కాలనీ, తుర్కపల్లి రోడ్, బొల్లారం, సికింద్రాబాద్ 500010. ఫోన్: 9700000948
ఇతర ప్రముఖ పుస్తక కేంద్రాలు.

Exit mobile version