Site icon Sanchika

కౌపీనవంతః ఖలు భాగ్యవంతః!

[శ్రీ యన్. వి. శాంతి రెడ్డి గారు రచించిన ‘కౌపీనవంతః ఖలు భాగ్యవంతః!’ అనే వేదాంత కథ అందిస్తున్నాము.]

[dropcap]శ్రీ[/dropcap] దక్షిణామూర్తి వటవృక్షం ఛాయలో ఆనాటి సత్సంగం మొదలైంది. మాతాజీ సద్విద్యానంద సరస్వతి వారి ఆసనంలో ఆశీనులైనారు. నేనూ మా సువర్ణ లక్ష్మీ అడిగిన వారి సందేహాలు తీర్చుతున్నాము. ఆ రోజు అంశం ‘అవధూత’!

“అవధూత లక్షణాలేమిటి బాబూ!” అడిగాడు గునివాడ అప్పలరాజు తన చెవిటి మిషన్ సరి చేసుకుంటూ.

“ఏ లక్షణాలు లేక పోవడమే అవధూత లక్షణం” చెప్పాను.

“అదెలా?” కరుటూరి ప్రకాశరావు.

“ఆశా పాశముల నుండి విముక్తి పొందిన వాడు, ఆది మధ్యాంతరముల యందు నిర్మలుడు, ఆనందాన్ని నిరంతరం పొందేవాడు అవధూత అనబడతాడు” చెప్పాను.

“అవధూతలు ఎక్కువగా మౌనన్ని ఎందుకు పాటిస్తారు?” రొంగల భారతమ్మ ప్రశ్న.

“టీచర్‌ను టీచింగ్ నుండీ, డ్రైవర్‌ను డ్రైవింగ్ నుండి, నటుడిని నటన నుండి ఎలా వేరు చేయలేమో అలానే నిజాన్ని నిశ్శబ్దాన్ని వేరు చేయలేము. నిశ్శబ్దమే బ్రహ్మ అని విని యుండలేదా? నిరంతరం ఆ బ్రహ్మలో రమిస్తూ వుండే అవధూత పాటించనక్కర లేకుండానే మౌనంలో ఉంటాడు.”

మా సువర్ణ చెప్పిన జవాబు మాతాజీకి కూడా నచ్చింది.

“అసలు.. భయాలు, బాధలు అవధూతలకు ఉండవట కదా? అవి మనకెందుకు ఉంటాయి?” బ్రహ్మచారిణి శ్రీ లక్ష్మీ చైతన్య ప్రశ్న.

“అవి సంసారం యొక్క మౌలికమైన లక్షణాలు. సంసారులు భూతకాలం గురించి తలపోస్తుంటారు కాబట్టి బాధలు గుర్తుకొస్తాయి. అలాగే భవిష్యత్ ఎలా గడుస్తుందనే తలంపు భయమే కదా?” సువర్ణ.

“సత్యం, జ్ఞానమనంతం బ్రహ్మ! అంటారు. సత్యం గురించి చెప్పండి!” భారతమ్మ.

“సత్యం మాటల్లో ఉండదు. ఎక్కడ మాటలు పూర్తవుతాయో అక్కడ మనసుండదు కనుక సంకల్పములు వుండవు. అక్కడున్నది సత్యం మాత్రమే! ‘యతో వాచో నివర్తంతే అప్రాప్య మనసా సహా’ అంటుంది ఉపనిషత్తు. సత్యం చాలా సూక్ష్మమైంది, ఎంతంటే కంటికి కనిపించనంత. ఒకవిధంగా కంటికి కనిపించేది సత్యాన్ని కప్పివేసేదై ఉంటుంది.” సువర్ణ లక్ష్మి.

“అవధూత సాదా సీదాగా జీవించే చేతకానివాడా?” కాటమ రెడ్డి ప్రశ్న.

“అతను చాలా సాదాగా అమాయకంగా ఉంటాడు. కానీ అజ్ఞాని మాత్రం కాదు” చెప్పాను.

“అవధూతలకు చెయ్యాల్సిన ఉపాసనలు ఏమీ ఉండవా?” తమ్మిన శ్రీధర్ బాబు ప్రశ్న.

“ఎవరికి కోరికలు – భయాలు ఉండవో వారికి ఉపాసనలతో పనేలేదు” చెప్పాను.

“అవధూత అనుష్ఠించేది అస్పర్శ యోగమా?” కోలా సత్యనారాయణ.

“తను ఆచరిస్తున్నానని అనుకోకపోయినా అది సత్యమే! ఆత్మ సత్యానుబోధ. నిజాన్ని దర్శించే దృష్టి కోణం! అతను సుఖం గానూ ఉండడు. దుఃఖం గానూ ఉండడు. అంద వికారములతో పనిలేని ఆమనీభావం” చెప్పాను.

“ఈ మద్యే శరీర త్యాగం చేసిన శాంతి ఆశ్రమ రామ్ సింగ్ బాబా, పిఠాపురం గోపాల్ బాబా మాట్లాడిన భాష ఏమిటి?” ప్రకాశరావు.

“ఇంటోనేషనల్ (intonational ) సౌండ్స్. ధ్వన్యాత్మక శబ్దాలు. ఉదాహరణకు పసిపాపలు చేసే శబ్దాలు. పక్షుల కిలకిలా రావాలు, లేగ దూడల అంబారావాలు ఈ కోవలోవే. మనం మాట్లాడుకొనే మాటలను అల్పాబెటికల్ సౌండ్స్ అంటారు. అవే వర్ణాత్మక శబ్దాలు. ధ్వన్యాత్మక శబ్దాలు దేవుడి మాటలయితే వర్ణాత్మక శబ్దాలు జీవుడి మాటలుగా చెప్పుకోవచ్చు” చెప్పాను.

ఈ వివరణ మాతాజీకి చాలా నచ్చింది. ప్రసన్నంగా నవ్వారు.

“అవధూతలకు సంసారులకు తేడా ఏమిటి?” నూలు నారాయణ ప్రశ్న.

“అవధూత ఆత్మయై ఆత్మతో రమిస్తుంటాడు. రెండోది తెలియని వాడు. రెండోది లేనివాడు. అనుభవము – తానూ ఒక్కటే అనుకొనేవాడు. ఇక సంసారి మనసును (సం) భోగిస్తుంటాడు. విషయాలను భోగిస్తూ విషాన్ని ప్రోగు చేసుకుంటూ దాన్నే అమృతమని భ్రమ పడుతుంటాడు” చెప్పాను.

“కొంతమంది అవధూతలు వారి కొన్ని ప్రత్యేక సందేశాలు చెప్పండి” తమ్మిన శ్రీధర్.

“పిచ్చమ్మ అవధూతను ఒక భక్తుడు దేవుణ్ణి చూపించమని అడిగితే ‘దేవుడ్ని ఎవరు చూపించగలర్రా? నా, నీ అనే తేడా పోయిన్నాడు వాడే తెలుస్తాడు’ అనేది. ఎవరైనా చనిపోతే ‘ఐదు ఐదులో కలిసి పోయాయి’ అనేది పంచభూతాలను దృష్టిలో పెట్టుకోని. తర్వాత మరో అవధూత తాజద్దీన్ బాబా. ఇతన్నే మహిమల బాబా అనేవారు. ‘పనులు మానేసి కూర్చోవడం కాదు విరక్తి, ఆలోచనల స్రవంతిని అరికట్టుటే విరక్తి’ అనేవారు, చివటం అమ్మ ‘శ్రవణం కూరంత – ధ్యానం అన్నమంతా’ అనేది, ఎవరైనా చెడ్డవారు వస్తే ‘నన్ను తాకవద్దు నాకు ముళ్ళు గుచ్చుకుంటాయి’ అనేది. ఇంకా ‘నన్ను చూసినట్టు గానే మీకు కనిపించే పామును కూడా చూడండి’ అనేది” అంటూ నేను విన్న సంగతులు చెప్పాను.

“అవధూతలకు కూడా కొన్ని బలహీనతలుంటాయా?” నూలు నారాయణ.

“బలమంటే ఏమిటో బలహీనత అంటే ఏమిటో కూడా వారికి తెలీదు. ఎందుకడిగారు ఈ ప్రశ్న?” అన్నాను.

“పిఠాపురం గోపాల్ బాబా సిగరెట్టు తాగేవాడు. శాంతి ఆశ్రమ రామ్ సింగ్ బాబా ఎదురైన ప్రతి వారిని చాయ్ అడిగేవాడు. అవి వారి బలహీనతలే గదా?” నారాయణ.

“అనుభవించాల్సిన ప్రారబ్ధాన్ని తీసుకొని ఈ జన్మకు వస్తాడు జీవుడు. ఎంతటి మహనీయుడైనా అనుభవించే తీరాలి. శ్రీ రామకృష్ణ పరమహంసకూ, భగవాన్ రమణులకు కూడా ప్రారబ్ధ శేషం అనుభవించక తప్పలేదు కదా!” చెప్పాను.

“రెడ్డి గారూ! మీకు స్వయంగా పరిచయమున్న ఒక అవధూత గురించి చెప్పండి” ప్రకాశరావు.

“అలాగే! నాకు, సువర్ణ కూ పరిచయం ఉన్న ‘గోచి బాబా’ అనే అవధూత గురించి చెబుతాను. మేమిద్దరం మా పసలపూడి ఎలిమెంటరీ స్కూల్‍లో ఐదవ తరగతి పాస్ అయి మా ఊరికి మూడు కిలోమీటర్ల దూరంలో వున్న రామచంద్రపురంలో శ్రీ కృత్తివెంటి పేర్రాజు జిల్లా పరిషత్ హై స్కూల్‌లో ఆరవ తరగతిలో జాయిన్ అయిన రోజులవి. ఉదయం తొమ్మిది గంటలకు కేరేజీలు పట్టుకొని అడ్డదారిలో పంట చేల గట్లమ్మట నడుస్తూ లెప్రసీ హాస్పిటల్ దగ్గర తారు రోడ్డుకు చేరి అక్కడి నుండి రెండు కిలోమీటర్లు నడుచుకుంటూ స్కూలుకు వెళ్ళేవాళ్ళం. మాతో పాటు మా సీనియర్లు మరో పాతిక మంది జట్లు జట్లుగా నడుస్తుండే వారు. మా ముందు పొట్టి సుబ్బిరెడ్డి గారి సత్యం, కర్రోరి సుబ్బారెడ్డి, మిలిట్రి అప్పారావు గారి నాగమణి నడుస్తున్నారు. మా వెనుక బళ్ళ బుల్లెబ్బాయి గారి జ్ఞాన గురువు, కోనాల వెంకటరెడ్డి ఇంకా కొంత మంది వస్తున్నారు. వి. ఎస్. యమ్ కాలేజీ దాటేటప్పటికి మా ముందు బాచ్‌లో కలకలం మొదలైంది. మా ముందు బాచ్ కుడివైపున వున్న కారుకొండ శ్రీరాములు గారి పొలం వైపు వెనుక నున్న బాచ్ ఎడమ వైపు చుండ్రు శ్రీహరి గారి పొలం గట్లలోకి పరుగు లంకించుకొని మా ఇద్దరినీ కూడా రమ్మని కేకలు వేశారు.

మేం వున్న చోటునే విగ్రహాల్లా నిలబడిపోయాము. మా ఎదుట ఒక భయంకరమైన నల్లటి రూపం! మాసిపోయిన గోచి, శరీరమంతా బూడిద రాసుకొని వున్నాడు. మేము అతని వైపు చూసాము. అతను మా వైపు చూసాడు. అతని కళ్ళలో ఒక వింత మెరుపు! అతను రెండు చేతులూ పైకెత్తాడు. మాకు చాలా భయం వేసింది. కానీ, పై కెత్తిన ఆ చేతులతో మా బుగ్గలు నిమిరాడు. ఆ స్పర్శ చాలా బావుంది. చిన్నగా నవ్వాడు. ఎందుకో ఆ నవ్వు – ఆ కళ్ళు మాకు చాలా పరిచయం వున్న భావన కలిగింది. మాకు చాలా బావున్నట్టు భావన కలిగింది. అతను పసలపూడి వైపు వెళ్ళిపోయాడు. మేము రామచంద్రపురం వైపు నడక మొదలెట్టాము. చేల గట్ల లోకి పారిపోయిన వారంతా వచ్చి మాతో కలిశారు. మా తెలివితక్కువ తనానికి నిందించారు. ఎన్నో మెళకువలు చెప్పారు. అతను కొడతాడని, అందర్నీ ముట్టుకొని బూడిద రాసేస్తాడని, అతన్ని అందరూ ‘ముట్టుకొనే పిచ్చివాడు’ అంటారని చెప్పారు.

వాళ్ళు చెప్పిన దాంట్లో ఎంత నిజం ఉందో మాకు తెలీదు కానీ, మాకు మాత్రం అతను, అతని కళ్ళు, అతని మందహాసం బాగా నచ్చాయి. అవి మాకు ఎక్కడ పరిచయమా అని ఆలోచిస్తూ నడుచుకుంటూ స్కూల్ గేట్ వరకూ వచ్చే టప్పటికి సువర్ణ మైండ్‍లో తళుక్కున ఒక జ్ఞాపకం మెరిసింది.

“ఆ కళ్ళు.. అవే కళ్ళు! ఏ మాత్రం తేడా లేదు” అంది చాలా నమ్మకంగా.

“ఏ కళ్ళు? మనకు తెలిసినవేనా?” అడిగాను ఆత్రుతగా.

“బాగా! రోజూ మన వీధిలో మా ఇంటి ముందూ, మీ ఇంటి ముందూ ఆగుతుంది. నల్లమిల్లి నారాయణ మూర్తి గారి కపిల ఆవు.. మనం అరటిపండో, బెల్లం ముక్కో పెడతాము, ఆ కపిల ఆవు కళ్ళకూ ఈ గోచి బాబా కళ్ళకూ ఏ మాత్రం తేడా లేదు. అవే కళ్ళు” అంది చాలా విస్మయంగా సువర్ణ.

“ఎస్! నో డౌట్, అవే కళ్ళు! ఇందాక మనం సరిగ్గా పట్టించుకోలేదు. అతను నవ్వుతూ మన వైపు చేతులు చాచాడు. బహుశా ఏమైనా పెట్టమని అయ్యుంటుంది” అన్నా చాలా ఉద్వేగంగా.

“అయ్యుంటుంది. రేపటి నుండి ఏదైనా పండో, స్వీటో దగ్గర పెట్టుకుందాము. అవునో, కాదో తెలిసిపోతుంది.” అంది సువర్ణ. బెల్ కొట్టేసారు. క్లాస్ రూమ్‌కు వెళ్లి ఆ సంగతి మర్చిపోయాం!

ఆ తర్వాత ఈ గోచీ బాబా గురించి చాలా వివరాలు తెలిసాయి. ఊరి చివర టౌన్ హాల్ అని పిలవబడే పేకాట క్లబ్ ఎదురుగా వున్న స్మశానం అతని నివాసం. శవాలపై కప్పి అక్కడ వదిలేసే వస్త్రమే అతని కౌపీనం. శవాలను కాల్చిన బూడిదే అతని అలంకార ద్రవ్యం. గోచీ బాబా ఉదయాన్నే బయలుదేరి పసలపూడి బస్ స్టాండ్ వరకూ మనుషులకు అర్థం కాని కూనిరాగాలు తీసుకుంటూ నడచి వెళతాడు. అతన్ని చూడగానే కాఫీ హోటల్ గోపాల రావు కౌంటర్ నుండి దిగీ వచ్చి బాబాను లోనికి తీసుకెళ్లి కౌంటర్‌లో గల్లా పెట్టి ముందు కూర్చోబెడతాడు. రెడీగా వున్న టిఫిన్లు రకానికి ఒకటి చొప్పున ప్లేట్లో వడ్డించి బాబా వద్దనే వరకూ చాలా ప్రేమగా తినిపిస్తాడు. పెద్ద స్టీల్ గ్లాసుడు కాఫీ కలిపి తాగిస్తాడు. ఆ రోజు అతని సేల్స్ డబల్ అవుతాయని నమ్మకం. ఆ నమ్మకం చాలా సార్లు నిజమైంది కూడా!

ఆ తర్వాత అక్కడ నుండి నడుచుకుంటూ వెనక్కు వెళ్లిపోతాడు. దారిలో ఎదురైన ప్రతీ వారిని ముట్టుకోవడం అతని బలహీనత అనుకుంటారు. అది ఆశీర్వాదం కావచ్చు. అతనికి ‘ముట్టుకొనేవాడు’ అన్న పేరు స్థిరపడిపోయింది. చాలా మంది పిల్లలూ, పెద్దలు కూడా భయపడి తప్పించుకొని పారిపోయేవారు.

నేనూ సువర్ణా ఆరోతరగతి పాసై ఏడవ తరగతికి వచ్చాము. జిల్లా స్థాయిలో కామన్ పరీక్షలకు కష్టపడి చదివేవాళ్ళం. అప్పుడప్పుడు మాకు గోచీ బాబా ఎదురై మా బుగ్గలు నిమిరి మేము ఇచ్చిన అరటిపండు గానీ, మీఠాయి గానీ తినేవాడు. మిగతా పిల్లలు అతన్ని చూడగానే పారిపోయేవారు.

ఒక రోజు గోచీ బాబా మా ఎదురుగా వస్తున్నాడు. మేము సంచిలో నుండి పళ్ళు, మిఠాయిలు తీసి పట్టుకున్నాము. పరిశీలించి చూడగా అతని శరీరమంతా గాయాలే! ఎవరో కొట్టినట్టు వున్నారు. మాకు చాలా బాధేసింది. బాబా మాత్రం అందమైన ఆ కళ్ళతో నవ్వుతూ మా బుగ్గలు నిమిరి మేమిచ్చిన మిఠాయి తింటూ ముందుకెళ్ళి పోయాడు. వంటి నిండా దెబ్బలేనన్న ద్యాసే అతనికి ఉన్నట్టు లేదు.

అతని దెబ్బలకు కారణం.. ముందు రోజు ఎదురైన చింతా రాములు గారి సుబ్బలక్ష్మిని చెంప మీద కొట్టేడట! భయపడిన సుబ్బలక్ష్మి బడికి వెళ్లకుండా వెనక్కు వెళ్లిపోయి ఏడుస్తూ వాళ్ళ నాన్నకు చెప్పిందట. వాళ్ల నాన్న దుడ్డు కర్రతో దారి కాసి బాబాను చిదక బాదేశాడట. ఆ గోచీ బాబా ప్రేమతో ఇచ్చే ఆశీర్వాదాన్ని చాలా తప్పుగా అపార్థం చేసుకుంటున్నారు.

ఏడో తరగతి కామన్ పరీక్షలు చాలా బాగా రాసాము. రెండు నెలలు సెలవలు. బాబా దర్శనం లేదు. రిజల్ట్స్ వచ్చాయి. జిల్లా స్థాయి మా ఇద్దరికీ మొదటి రెండు రాంకులు వచ్చాయి. మా ఊళ్ళో అభినందన సభ జరిపి ప్రెసిడెంట్ కర్రి మందా రెడ్డి గారు మా ఇద్దరికీ సైకిల్స్ బహుమతిగా ఇచ్చారు. మా విజయానికి కారణం వివరిస్తే మిగతా పిల్లలకు స్ఫూర్తిదాయకంగా ఉంటుందని యండమూరి ప్రభాకర రావు మాస్టారు ఆదేశించగా నేను మైక్ ముందుకొచ్చి ‘మా విజయానికి మొదటి కారణం ఏ రోజు పాఠాలు ఆ రోజే చదువు కోవడం అనీ, గోచీ బాబా ఆశీర్వాదాలు రెండో కారణం’ అని చెప్పాను.

సభ ముగిసింది.

ఆ రోజు స్కూల్ రీఓపెనింగ్ డే!మా ఆనందానికి మొదటి కారణం ఎనిమిదో తరగతికి ప్రమోషన్ అయితే, గోచీ బాబాను చూడవచ్చు అనేది రెండో కారణం, సున్నిఉండలు పొట్లం కట్టుకొని, బహుమతిగా వచ్చిన సైకిల్స్ వేసుకొని మెయిన్ రోడ్డమ్మట బయలుదేరాము ఆనందంగా! ట్రావెలర్స్ బంగాళా దగ్గరకు వచ్చేటప్పటికి దూరంగా వస్తూ గోచీ బాబా కనిపించాడు. మా ముందు వెళుతున్న పది మంది పైగా వున్న బ్యాచ్ పిల్లలు బాబా దారికి అడ్డుగా నిలబడి వున్నారు చాలా దైర్యంగా! అందరి కంటే ముందు ఏడో తరగతి రెండోసారి కూడా ఫెయిల్ అయిన చింతా రాములు గారి బొండం సుబ్బలక్ష్మి నిలబడి వుంది, చేతిలో అరటి పండుతో గోచీ బాబా ఆశీర్వాదం కోసం!!!

సువర్ణా, నేనూ అభినందన సభ రోజున వేసిన మా పాచిక పారిందని, గోచీ బాబాకు కష్టాలు తీరాయని ఒకరినొకరు అభినందించుకున్నాము.

రెడ్డి గారు చెప్పిన ‘గోచీ బాబా’ అనే అవధూత వాస్తవ కథనంతో ఆనాటి సత్సంగం ముగిసింది. అందరూ కుటీరాలకు మరలి వెళ్తున్నారు!

సదా తిష్ఠతి గంభీరో జ్ఞానీ కేవలమాత్మని।
నాసత్యం చింతయే ద్విశ్వం న వా స్వస్య తదన్యతాం॥

– – స్వస్తి – –

Exit mobile version