Site icon Sanchika

సన్మానం చేస్తున్నారు…జాగ్రత్త!!!!!

[box type=’note’ fontsize=’16’] సన్మానాలు అపహాస్యం పాలయి, సన్మానం అంటే అవమానాన్ని మూట కట్టుకోవడమేనన్న భావన స్థిరపడుతున్న సమయంలో సన్మానాలలో ‘మానం’ ఎంత అన్న చేదునిజాన్ని అత్యంత హాస్యంగా, తాత్వికంగా ప్రదర్శిస్తుంది వేదాంతం శ్రీపతి శర్మ హాస్య వ్యంగ్య రచన ‘సన్మానం చేస్తున్నారు… జాగ్రత్త’. ప్రతి కవి, రచయిత, సన్మానం పొందినవారు, పొందని వారు, సన్మానాల వెంటపడేవారు అందరూ చదివి ఆనందిస్తున్న, భుజాలు తడుమునేట్టు చేసే కథ. [/box]

మన మాటలతో మాట కలిపే వాళ్ళ కోసం వెతుక్కుంటూ స్నేహశీలులెందరో చాలామందితో మాట్లాడే ప్రయత్నం చేస్తూ ఉంటారు.

‘నాకేదో ఆలోచన వచ్చింది, ఇది నలుగురు చదివేసి మెచ్చుకోవాలి’ అనుకునే వారు నాలుగు పుస్తకాలు కలిపి నిలబెట్టిన చోట ప్రత్యక్షమవుతూ ఉంటారు.

ఓ గుడ్డ సంచీ వేసుకుని శ్రీధరరావు లోపలికి వచ్చాడు. ‘అక్షారనికి అభివందనం’ అని ఒక చోట వ్రాసి ఉంది. దానినే చూస్తున్న అతన్ని వింతగా చూశాను.

“దీని క్రిందనే నిలబడ్డారెందుకు?” నన్ను అడిగాడు.

అపుడర్థమైంది నేనెక్కడున్నానా అని. వెనక్కి చూసి నవ్వాను.

“మీలాంటి వారికి అభివందనం చెబుదామని” అన్నాను.

“నేను మీకు తెలుసా?” అడిగాడు.

“తెలుసు. శ్రీ అనే కలంతో వ్రాస్తారు. అవునా?”

“కరెక్ట్. ఇక్కడ కవులకు, రచయితలకు సన్మానాలు చేస్తున్నారట?” అడిగాడు.

“ఓ! సన్మానం కోసం…”

చెయ్యి అడ్డుపెట్టాడు. “అలా ఎప్పుడూ అనకూడదు. నిజమా కాదా అని తెలుసుకునేందుకు వచ్చాను”

“నిజమే! కానీ ఎక్కడో ఇంతవరకూ తెలియలేదు”

“ఓ. ఎవరు సన్మానిస్తున్నారు?”

“అది అడక్కూడదు”

ఇద్దరం అలా నాలుగు అడుగులు నడుచుకుంటూ వెళ్ళాం.

“ఎవరిని సన్మానిస్తున్నారు?”

“తెలియదు. ఏవో నియమ నిబంధనలుంటాయి”

“నేను అందులోకి రానా?”

“రాకూడదు”

“ఎంత మాట?”

“అలా వచ్చేస్తే సరైన అక్షరానికి సరిపోయే మాల దొరకదు”

“బాగుంది. మాలిక అనండి. ఇంకా బాగుంటుంది”

శ్రీధరరావు సిగరెట్ తీసాడు. రచయితలు ఎక్కువగా – కాదు, ఎక్కువమంది రచయితలు సిగరెట్లు ఎందుకు త్రాగుతారు అనే ఆలోచన చాలామందికి వస్తుంది. శ్రీధరరావు అడక్కుండానే చెప్పాడు.

“గొప్పవారు సిగరెట్లు త్రాగరు. సిగరెట్లను వాడుకుంటారు”

“ఛా”

“అవును మరి. అంతా అనవసరమైన పొగే…!

ఇంతలో మైకులో వినబడుతోంది. “అందరికీ అక్షరాంజలి! కవులూ, రచయితలూ, విద్వత్‌కవులూ, విదూషకులు, దూషకులు… క్షమించాలి. మరల చెబుతున్నాను, నవరచనావిదూషకులు స్టాల్ నెంబరు 100 వద్ద ఏర్పరిచిన వేదిక వద్దకు రావల్సిందిగా కోరుతున్నాం. ఈ స్టాల్ వెనుక ఉన్న వాష్ రూమ్… కాదా? కాదు. క్షమించాలి, ఆశాకిరణం స్టాల్‌లో మీ పేర్లు నమోదు చేసుకొని సభలోకి రావలసిందిగా మనవి!”

శ్రీధరరావు నా భుజం మీద చెయ్యి వేశాడు.

“చూశారా! చేస్తున్నారు. సన్మానం ఉన్నది. అక్షరం బ్రతికే ఉన్నది”

“భలేవారే! నిప్పు ఉన్నంతకాలం పొగ బ్రతికే ఉంటుంది”
“కరెక్ట్. దేవుడున్నంత కాలం గుడి కడుతూనే ఉంటారు” అన్నాను.

“ఇటు తిప్పి అనండి…!” అన్నాడు.

“గుడి కడుతున్నంత కాలం దేవుడు బ్రతికేస్తాడు!”

“మీకు సన్మానం తప్పకుండా ఉంటుంది”

“ఎందుకలా అనిపించింది?”

“కమ్యూనిజం చమత్కారంగా తర్కం చేస్తోంది”

“మీ అభిమానం నుండి నాకు ఆశువుగా అశ్రువులు స్పెషల్ కొరియర్‌లో వస్తున్నట్టున్నాయి!”

“వదలండి”

ఒంటరివాడ్ని

“శభాష్”

ఒంటరివాడ్ని, ఒంటె లాంటి వాడ్ని

“ఓ…”

ఒకే అక్షరాన్ని, మరుభూమిలో కూడా మరో మరమనిషిని

“బాగుంది”

ఒంటరివాడ్ని, ఒంటె లాంటి వాడ్ని. ముఖం నిండా నవ్వున్న తుంటరివాడ్ని

“అలా కూడానా?”

“అవును మరి”

ఛందో జైలులో బందీ అయిన అందమైన కుందనపు బొమ్మను

“అదిరింది”

సిగరెట్ క్రింద పడేసాడు.

నన్ను తీవ్రమైన దృష్టితో చూశాడు.

అశేషమైన సాహిత్యంలో కాలసర్పంలా దాగిన ఆశ్లేషను నేను

నాకు నేనై మిగిలిపోయిన శ్లేషను నేను

ఒంటరిని నేను, అక్షరాన్ని నేను

ఇద్దరం మాట్లాడుతూనే ఆ స్టాల్ వైపు నడిచాం. దాని వెనుక ‘ఆశాకిరణం’ అనే స్టాల్ ఉంది. దాని బైట పోలీస్ స్టేషన్‌లో వేసే నాలుగు చెక్క బెంచీలు మమ్మల్ని ఆహ్వానించాయి. రచయితలు కాబోలు వాటి మీద కూర్చున్నారు. మాకు చోటు దొరకలేదు. అలా నిలబడే ఉన్నాం. ఒకాయన స్టాల్ లోంచి బయటకొచ్చాడు.
“ఏంటి సార్, ఏంటి కథ?” అని ఎవరో ఆయన్ని అడిగారు.

“ఏం లేదండీ. పేరు రిజిస్టర్ చేసుకుంటున్నారు. కాగితాలు చేతికిచ్చి మన గురించి దాంట్లో నింపమంటున్నారు”

శ్రీధరరావు సంచీలోంచి బాటిల్ తీసి గొంతు తడుపుకున్నాడు.

“సార్…!” నేనన్నాను. “… మీరు ఈ పని పూర్తి చేసుకునే లోపల నేనలా నాలుగైదు స్టాల్స్ చూసేసొస్తాను”

“అలాగే. ఇక్కడే కలుసుకుందాం”


తెలియకుండానే ఓ గంట పట్టేసింది. ఎక్కడి నుండో మైకులో వినిపిస్తోంది… “అయ్యా, నేను శ్రీధరరావు మాట్లాడున్నాను. నా పేరు శ్రీధరరావు. నన్ను మీరు అక్షరానికి అభివందనం అని వ్రాసి యున్న చోట కలుసుకున్నారు. మీరు అక్కడికే రండి. నేను అక్కడే ఉంటాను. నన్ను ఎక్కడా వెతుక్కోకండి. ఒకవేళ ఈ పుస్తక ప్రదర్శనలో మీరు ఇంకా ఉంటే అక్కడికే రండి. మరో పావు గంట అక్కడే ఉంటాను”

ఇలా రెండు మూడు సార్లు వినిపించింది.

గబాగబా అక్కడికి వెళ్ళాను. శ్రీధరరావు ఓ శాలువా, రెండు పండ్లు పట్టుకుని నిలుచుని ఉన్నాడు.

“ఏం సార్? సన్మానం అయిపోయిందా?”

“ఆఁ. ఇదుగోండి. ఆ రూమ్‌లోకి పట్టుకెళ్ళి నిలబెట్టారు. వాళ్ళెవరో కూడా నాకు తెలియదు. కాగితాలు చదివారు. వెనకాల ఓ గంప ఉంది. చదువుతూనే అందులోకి చెయ్యి పోనిచ్చి ఓ శాలువా తీసారు. అతని పక్కన ఓ అమ్మాయి ఉంది. ఆమె ప్రక్కనున్న గంపలోకి ఎడమ చెయ్యి పోనిచ్చి రెండు యాపిల్ పళ్ళు అందుకుంది.  కవిత ఏదైనా చెప్పమన్నారు. ఇదుగో ఇందాక చెప్పిన కవిత వినిపించాను. చేతిలో పండ్లు పెట్టారు. శాలువా కప్పబోతుంటే మొబైల్‌లో ఏదో ఫోన్ వచ్చింది. అందులో మాట్లాడుతూనే నా చేతి మీద శాలువా పడేసాడు. ‘వేదిక మీద సన్మానం’ అని నేను గొణుగుతుండగా నన్ను దయచేయమని సైగ చేసాడు!”

ఆలోచించాను. చుట్టూతా పుస్తకాలు, దుకాణాలు, పాఠకులు, రచయితలు, వ్యాపారులు, పిల్లలు, పెద్దలు… నా చుట్టూతా గిర్రున తిరుగుతున్నట్టు కనిపించాయి.

ఓ చిన్న పిల్ల మా వెనుక ఉన్న ‘అక్షరానికి అభివందనం’ అని వ్రాసి ఉన్న బోర్డును జాగ్రత్తగా చదువుతూ దాని చుట్టూతా ఉన్న మహాకవుల బొమ్మలను ఫొటో తీసుకుంటోంది. శ్రీధరరావు ఆ పిల్లను అలాగే ఉండమన్నాడు. ఆ ఫొటోలలో పడేటట్టు ఆ శాలువా నాకు కప్పాడు. రెండు పండ్లూ నా చేతిలో పెట్టాడు. అమ్మాయి వీడియో ఆన్ చేసింది…

“నాకు సన్మానం సరైనది కాదని ఇక్కడే వీరు నాకు చెప్పారు…” శ్రీధరరావు చెప్పాడు. “అక్షరానికి సరైన మాలిక దొరకడం లేదన్నారు. వాస్తవం చెప్పారు. ఇక్కడ నేను ఆశువుగా ఒక కవిత చెప్పాను. ఈ ఫ్లెక్సీలో కనిపిస్తున్న వారందరి సమక్షంలో వీరికి ఈ సన్మానం చేసుకుంటున్నాను….

నేనిప్పుడు మరో అక్షరాన్ని

జ్ఞానాంజనం పూసుకున్న శబ్దమంజరిని

నేను ఒంటరిని కాను

నిశ్శబ్దరంజనిని

చెట్టునాదని చాటుకోలేని బీజాక్షరాన్ని

దేనిపై మోజు లేని కలేజా కలవాణ్ణి

అంతలోనే దిగంతాలను తాకే ప్రకాశాన్ని

కనిపించని రవిని, కనిపెంచే విశ్వాన్ని… ఓ విశ్వకవిని!

నేనిప్పుడు మరో అక్షరాన్ని…”

శ్రీధరరావు సంచీ సర్దుకుని మరో సిగరెట్టు ముట్టించుకుంటూ వెళ్ళిపోతున్నాడు. ఆ అమ్మాయి ఆ ఫొటోలూ, వీడియో నాకు షేర్ చేస్తోంది.


మైకులో ఎవరో మాట్లాడుతున్నారు. “వేదికను అలంకరించిన పెద్దలకు, ఇక్కడికి విచ్చేసిన సాహితీప్రియులందరికీ స్వాగతం, సుస్వాగతం…”

Exit mobile version