Site icon Sanchika

కవీంద్ర ప్రభ!!

[శ్రీ సముద్రాల హరికృష్ణ రచించిన ‘కవీంద్ర ప్రభ!!’ అనే కవితని పాఠకులకు అందిస్తున్నాము.]

[dropcap]అ[/dropcap]వలోకించి, అవ్యక్తముల సువ్యక్తము జేసెడి సూక్ష్మేక్షిక!
కవితామృత వరకలశి నిచ్చు భావుకతా పూర్ణ చంద్రిక!!
***
కవులకె కవి, ప్రకృతి కవి, ఊహా హర్మ్య చంద్రశాలా ఛవి!
అవన్యంబరముల యన్ని ఒడిసిపట్టు సుపర్ణ సమ కవి!
***
కేవల కవిమాత్రుడే?! పత్రరథమై యెగసి, వని సొంపుల
ఈ విరి కెంపుల, నది వంపుల, ఇంపుగనాలపించు గానర్షి!
***
కేవల గాయకుడె, తారామణి కుట్టిమమా ఆకాశ రేఖల
సు వర్ణ వేదియై, రసరమ్యాకృతుల జూపు లేఖన శేముషి!
***
పదముల నేరు, లాలించు, సుమదళ సమములై ఆదరించు
పొదిగించు నా రత్న కాంతుల, కవనాభరణ ధగద్ధగలై!
***
అల్లు సుకుమార భావంపు టలరుల కైతలు, తావిదండలై
ఇలాలక్ష్మి లలిత రవళు లెద నూగ, ఆనంద డోలికలై!
***
సెలయేటి పాటతో రాగాలు తీయు, కొమ్మల తా కోయిలై కూయు!
ఎలతేటి ఝంకారముల సోలు, నాద మూలముల తా కలియు!
***
నీలాకాశపు తారా సందేశముల కెగయు, ఊహా నిశ్శ్రేణుల
ఫాలాక్షపుటెరుపున సంధ్యారుణ సొబగెంచు, ప్రేమోల్లసియై
***
వెన్నెలల, బాలుడైచూచు, ఆ కౌముదుల తానె శశియై పంచు
కన్నులార హరివిల్లు శోధించు, తానె సప్తవర్ణియై దీపించు!
***
మనసు పొరల తరచి చూచు, పల్వన్నెల మూర్తుల సృష్టించు
కనుల చూచు జగతి నరయు, తానే రస జగతి రచించు!
***
ఎంత స్వాప్నికుడొ అంత క్రియాశీలి, జనహిత కార్యసంధాయి
ఎంత జనాంతికుడొ, అంత గూఢాంతరంగ బహు శిత గవేషి!
***
ఎంత లోకవృత్తానుసారియొ, అంత చింతనాధ్యయనశీలి
ఇంతింతన నేమి, అంతట శోధించు కళానేక గభస్తిమాలి!
***
ఆకు చాటు కోయిలై, ఆతని కోమలభావ మార్మిక గానము
ఏ కటువోపని శాంత వ్యోమవీథుల నాతని చాంద్రీరథము
***
ఏ యనిదంపూర్వ రత్నములకొ, ఆ సాగరాంతర శోధనము
ఏ మనోనేత్రముతో జూచునో, ప్రకృతె తా పలికెడి నేస్తము!
***
వన లతాంతముల, గిరి కంథరముల, ఘన వారిదముల
ఇన్ద్రధనువుల నూరేగు, సితకాంతుల, సాంద్రనీహారముల!
***
ఎన్న నెంతగ మురిసిరొ వాల్మీకి కాళిదాసు లంత మురిసి
కనుల చూచు దానిని, కన్పించని ధాత నుగ్గడించు తనిసి!!
***
మనిషికి, జగత్కేంద్ర మహచ్ఛక్తి కనుస్యూత బంధమని
మున్నెన్నడు వినని ఫణితుల చెప్పు, దర్శియై, క్రాంతదర్శియై!!
***
పికాళికి పాట నిచ్చు దైవము, నా గీతి నేల రచించడను!
సుఖాదుల చొక్కి సాటివాని నణతురేల,? ప్రశ్నింతునను!
***
ఏ క్రాంతసీమ, శుష్కములహేతువింకిపోదొ, అదె సంపదను
వీకమౌ సాంప్రదాయ నూత్నముల సరి మేళనమె పసందను!
***
తన రాగానేక కవితా ప్రస్తారము ల్గీతాంజలియౌ సత్కీర్తి
తన తూలికావతీర్ణ రేఖాకృతు లలేఖ్యములౌ సందీప్తి!
***
తన నిసర్గ సుందర దేశిక పీఠి, శాంతినికేతన ఖ్యాతి!
తన భావన, రసజగతీ విహరణ, వాణ్యాశీఃఫల క్రాంతి!
***
ఆ మహనీయ సంగీతమూర్తి, నూత్న పథ సంధాన చక్రవర్తి
ఆ మహత్తర జగద్ధితాశయ ధూర్జటి, రవీంద్రనామ స్ఫూర్తి!
***
మంగళ ‘జనగణమన’ సుర్గంగోదయ మూలమీ రవీంద్ర ప్రభ!
వంగావని పూచిన, క్షతి నొల్లని విశ్వకవి, యీ శుభ్రేందుప్రభ

Exit mobile version