[తెలుగు సాహిత్యం పట్ల కొన్ని తరాలలో ఆసక్తి రగిలించి, ఆధునిక తరానికి వ్యక్తిత్వ వికాస పాఠాలు చెప్తూ, యువతకు ఉత్తమ సాహిత్యం ద్వారాఉత్తమ వ్యక్తిత్వాన్నివ్వాలని నిరంతరం తపించే యువభారతి సంస్థ స్థాపించి వచ్చే దసరాకు 60 సంవత్సరాలు పూర్తవుతాయి. ఈ సందర్భాన్ని పురస్కరించుకుని తెలుగు సాహిత్యానికి, సమాజానికి యువభారతి చేసిన సేవను తెలుగు పాఠకులకు పరిచయం చేసే ఉద్దేశంతో ప్రతి ఆదివారం సంచికలో యువభారతి ప్రచురించిన పుస్తకాల పరిచయం వుంటుంది. ఈ శీర్షిక వచ్చే విజయదశమి వరకూ సాగుతుంది.]
కవితా లహరి
ఉత్తమ సాహిత్యాధ్యయనానికి అనువైన భూమికను ఏర్పరచడానికి యువభారతి, తెలుగుజాతిని రసాత్మకంగా మలచిన మహాకవి వతంసుల సాహిత్య వ్యక్తిత్వాలను గూర్చి విజ్ఞులచేత ఉపన్యాసాలిప్పించి, వాటిని పుస్తకరూపంలో ప్రచురించి జన బాహుళ్యానికి అందుబాటులో ఉంచే ప్రయత్నం చేసింది. ఆ కృషి లోనే కావ్యలహరి, చైతన్యలహరి, వికాసలహరి, ప్రతిభాలహరి వెలువడిన తరువాత ఈ ‘కవితా లహరి’ ఐదవది.
ఆంధ్ర వాంగ్మయం లో కవిత్రయం తరువాత, వారితో సమానుడిగానో, వారిలో ఒకరిద్దరికన్నా ఎక్కువ గానో పరిగణింపబడి, విమర్శకుల మన్ననలందుకున్న వాడు, తనకంటే పూర్వమున్న కవితా రీతులకంటే కొత్త గుణాలను ప్రదర్శించిన నాచన సోముడి గురించి ఆచార్య దివాకర్ల వేంకటావధాని గారు –
పురాణ యుగము, ప్రబంధ యుగము – ఈ రెండింటి సంధి కాలంలో ఉన్న గొప్ప కవులలో ఒకడు, ప్రబంధ కవితా మార్గానికి అంకురార్పణ చేసిన పిల్లలమఱ్ఱి పిన వీరభద్రుని గురించి ఆచార్య బిరుదురాజు రామరాజు గారు –
కాల్పనిక కవితా పథానికి దిగ్దర్శనం చేసిన దేవులపల్లి కృష్ణశాస్త్రి గురించి ఆచార్య ఎస్వీ జోగారావు గారు –
యుగోచితాగ్ర గామిత్వంతో, సమకాలీన సాహిత్యోద్యమాలు కల్గించిన సంస్కారంతో, శాశ్వతమైన శాంతిని పరికల్పించి పరిరక్షించడానికి తిమిరంతో సమరం జరిపిన దాశరథి రంగాచార్య గురించి డా జి వి సుబ్రహ్మణ్యం గారు –
చేసిన ప్రసంగాల పాఠమే – ఈ ప్రచురణ.
క్రింద ఇవ్వబడిన link ను క్లిక్ చేసి ఈ పుస్తకాన్ని ఉచితంగానే చదువుకోండి.
లేదా క్రింద ఇవ్వబడిన QR code ను scan చేసినా ఆ పుస్తకాన్ని ఉచితంగా చదువుకోవచ్చు.