[dropcap]తె[/dropcap]గని ఆలోచనలతో కూచున్నా
కొత్త కవితకై,
కలం కాగితం చేతబట్టుకొని
బిలబిలమంటూ వచ్చి చేరాయి
అలవాటైన అక్షరాలు నా పక్కన
వత్తులు గుణింతాలను
వెంటేసుకుని మరీ
ఆటలాడటం మొదలెట్టాయి
అల్లరల్లరిగా చుట్టూ తిరుగుతూ
కుదురుగా ఒకచోట కూర్చోకుండా
వాటినేమనలేని నన్నోకంట గమనిస్తూ
ఓ కొత్త భావాన్ని కొంగున కట్టుకుని
గాలివాటున ఎగిరెళుతోన్న ఓ భావన
ఎందుకో ఓసారి మా అందరి వైపు చూసింది
నవ్వుతూ నడిచొచ్చి మధ్యన నిలిచింది
తాయిలం ఏదో
ఆశచూపించినట్టుంది గుట్టుగా
అల్లరిమానిన ఆ అక్షరాలన్నీ
కుదురుకున్నాయి అక్కడికక్కడ
ముందు వెనకలై … వెనకా ముందులై
సర్దుకున్నాయి ఎక్కడికక్కడ
అందమైన పదాలై..
సరసంగా వరుస పంక్తులలో
అవును, మీరన్నట్లే.. కవిత పూర్తయింది!