కవిత్వం అందించే మధురానుభూతులు ఎన్నో

0
2

[జొన్నలగడ్డ శేషమ్మ గారు రచించిన ‘కవిత్వం అందించే మధురానుభూతులు ఎన్నో’ అనే వ్యాసాన్ని పాఠకులకు అందిస్తున్నాము.]

[dropcap]క[/dropcap]విత్వం మనకు ఇచ్చే హృదయ స్పందన, స్వాంతన, విషాదం, మధురిమ, వైరాగ్యం, ప్రేమ, వాత్సల్యం, అనురాగం ఇవన్నీ మాటలకందనివి.

కవులు అలాంటి రచన ఎలా చేస్తారు! వారికి రకరకాల భావాలు ఒక్కోసారి ఒక్కో విధంగా కలుగుతాయి. అవి పెల్లుబికి బయటకు వస్తాయి.

కవిత్వం లేని భాష ఏదీ ఉండదేమో! ఆంగ్లంలో ఒక saying ఉంది – “poetry is the outer expression of the inner excess of energy” – అని.

కవి హృదయం ఉర్రూతలూగినపుడు సెలయేరులా వస్తుంది. విషాదం నిండినపుడు ఉప్పెనలా విరుచుకు పడి రోదిస్తుంది. వైరాగ్య భావాలు కలిగినపుడు – నిదానంగా – కాలంలో కురిసే వర్షంలా ప్రశాంతంగా ఉంటుంది. “మానిషాద ప్రతిష్ఠాంత్వ మగ మశ్శాశ్వతీ సమాహ్ యత్ క్రౌంచమిథునా దేఖమవహీథిః కామ మోహితం” అని – ఒక బోయవాడు తన కళ్ల ఎదుట క్రౌంచ పక్షుల జంటలో ఒక దానిని బాణంతో చంపినపుడు వాల్మీకి బాధా హృదయుడు ఔతాడు. అది “శోకం లో శ్లోకం” లా వాల్మీకికి శ్రీమద్రామాయణ మహా కావ్య రచనకు నాంది పలికింది. వాల్మీకిని మహర్షిని చేసింది. రామాయణం ఆది కావ్యమై నేటికీ ప్రపంచ ప్రజలందరికీ విస్మయాన్ని అందిస్తోంది. ఆదర్శప్రాయమైంది.

అల్పాక్షరాలలో అనల్పమైన అర్థాలను ఇమిడ్చి చెప్పేదే కవిత్వం. ప్రకృతికి దగ్గరగా తిరిగి జీవించే వారికే ఇది సాధ్యం. కృతకంగా పుట్టదు. నగరాల్లో, అపార్టుమెంట్లలో, air conditioned గదుల్లో కూర్చుంటే వచ్చేది కాదు కవిత్వం.

అడవులు, మహోన్నత వృక్షరాజాలు, సెలయేళ్లు, సముద్రం కొండలు, గుట్టలు, నదీ ప్రవాహాలు – ఇక్కడ తిరిగే భాగ్యం కలవారు కవులు. సూర్యోదయం, నిశి రాత్రి, నిండు పున్నమి – ఇలా ప్రకృతితో మమేకమైనవారే అసలైన కవులు.

సిరివెన్నెల సీతారామ శాస్త్రిగారు, దర్శకులు విశ్వనాథ్ గారు కలసి హంపీ క్షేత్రానికి వెళ్లి, తుంగ భద్రానది “తోయ మాలికలలో” పడవలో విహరిస్తూండగా సీతారామశాస్త్రి గారికి “ఆది భిక్షువు వాడినేది కోరేదీ” అనే పాట స్ఫురించిందట.

ప్రతి కవిత వెనుక – ఓ కథ, ఓ రస స్పందన..

పూర్వం తెలుగు భాషలో కవిత్వం కఠినంగా ఉండేది. ఛందస్సు, గణాలు, యతి, ప్రాస నియమం – అనేక పద్య జాతులు – ఇలా – కవిత్వం నియమాల చట్రంలో బిగింపబడి వుండేది.

అసలు సంస్కృతానికి అతి చేరువలో వున్న భాషే కదా మన తెలుగు.

తీరు మార్చిన ఘనులు తిక్కన సోమయాజి, బమ్మెర పోతన. వీరిరువురూ అచ్ఛ తెలుగులో అందరికీ సరళంగా, చదివిన వెంటనే భావం తెలిసేలా వ్రాసేరు.

ఉదాహరణకు తిక్కన సోమయాజి పద్యాలు:

  1. మహా భారతంలో ఉత్తర గోగ్రహణం సందర్భం; అర్జునుడు సుయోధనునితో “యుద్ధమున ఓడిపోయిన సార్వభౌమా, జూదమిచ్చట నాడంగ రాదు” అంటాడు
  2. కృష్ణ రాయబారం, శ్రీ కృష్ణుడు పాండవులను, ద్రౌపదిని వారి అభిప్రాయలు సంధి గురించి అడిగినపుడు – ద్రౌపది పలికిన పలుకులు “వరమున పుట్టితిన్, భరత వంశము చొచ్చితి, అందు పాండు భూవరునికి కోడలనైతి, జనవంద్యుల పొందితి, నీతి విక్రమ స్థిరులగు పుత్రులన్ పడసితిన్..”

ఇంక పోతన గారి పద్యాలు – ఆణిముత్యాలు.

  1. గజేంద్ర మోక్షము – గజ రాజు జల క్రీడలాడుతుండగా మొసలి అతని కాలిని కంఠంతో పట్టింది. పెనగులాడి, ప్రయోజనం లేక నారాయణుని శరణు వేడుకుంటాడు “వినుదట జీవుల మాటలు, చనుదట చనరాని చోట్ల శరణార్థులకు ‘ఓ’ అనుదట, పిలిచినా సర్వము కనుదట..”
  2. ప్రహ్లాదుణ్ని హిరణ్య కశపుడు “ఎక్కడ రా నీ హరి” అని అడిగినపుడు, ప్రహ్లాదుడి సమాధానం “ఇందు గలడు, అందు లేడను సందేహము వలదు, చక్రి సర్వోపగతుండు ఎందెందు వెతకి చూసిన, అందందే కలడు..” అంటాడు.

ఆధునిక యుగంలో గురజాడ అప్పారావు గారి ధర్మమా అని, తెలుగు భాష, ప్రజల భాష అయింది. శ్రీశ్రీ వంటి విప్లవ కవులు ఛందస్సుతో పని లేకుండా కవితలు అల్లేరు. అవి తరువాత కవులకు వరవడి పెట్టేయి.

శబ్దాలు, అక్షర రమ్యత, ఒక పదం మరల మరల వస్తూంటే కలిగే లయ విన్యాసం – వీని వలన కవిత్వం వీనుల విందు అయింది.

ఆంగ్లంలో కవులు ఎన్నో, పద్యాలు వ్రాసేరు. ప్రకృతిని వేనోళ్ల పొగిడేరు. బాల్యం గొప్పతనము, యవ్వనంలో కలిగే ప్రేమానుభూతులు వర్ణించేరు. William Wordsworth, Keats మొదలగు ప్రముఖులు వయస్సుతో నిమిత్తం లేకుండా భార్యాభర్తల మధ్య, అన్నదమ్ముల మధ్య, స్నేహితుల మధ్య, తల్లిదండ్రుల పైన – బంధాలు ఎలా ఉంటాయి, ఎలా ఉండాలి అనే తీపిని వర్ణించేరు.

నాలుగు పాదాలున్న పద్యం చివర లయ విన్యాసాలు, rhyming, repetition, మొదలగు వానితో సాగిన పద్యాలు అందరిచేత మరల మరల చదివించేవిగా వుంటాయి.

ఇంక sonnets విషయానికి వస్తే సరిగ్గా 14 పాదాలలో విషయం ప్రస్తావన, కొద్దిపాటి వివరణ, ముగింపులో సందేశం ఇమిడి వుంటాయి.

ప్రసిద్ధమైన కొన్ని Shakespeare Sonnets:

కాల మహిమను గురించి చెప్తూ “శక్తివంతమైన ఈ కవిత్వం గొప్పతనం ఏమని చెప్పను? అఖండ కళాఖండాల కన్న, పాలరాతిచే నిర్మించిన భవనాల కన్న, అవి శాశ్వతమైన కట్టడాలు కొంత కాలానికి మట్టిలో కలిసిపోతాయి – యుద్ధాలవల్ల కొన్ని నాశనమవుతాయి. నా యీ కవిత్వంలో, మిత్రమా నీ జ్ఞాపకాలు మాత్రం సృష్టి వున్నంతకాలం, భూమిపై మానవుడు నిలిచినంతకాలం ఉంటాయి” అంటాడు.

[“Not marble, nor the gilded monuments of princes shall outlive this powerful rhyme”]

మరో sonnet లో “నా కాలంలోని సిరాకు వున్నా బలమే ప్రేమను బ్రతికిస్తుంది. సౌందర్యాన్ని రక్షిస్తుంది. కాలాన్ని సవాలు చేసి నిలుస్తుంది” అంటాడు. “Since brass nor stone, nor earth, nor boundless sea..”

“Lyrical and Reflective Poetry” అని R J Rees వ్రాసిన “English Literature” అను Title గల పుస్తకంలో “కవిత్వం లయబద్ధమైనది, మనస్సుకు ప్రశాంతతనిస్తుంది. పద్యాలు చిన్నవే. భావాలు అతి మధురం, ఉదాత్తం” అంటాడు.

“My heart leaps when I behold

A rainbow in the sky”

అని ప్రారంభించి – “నాకు గుర్తు – నేను బాల్యంలోను, యవ్వనంలోనూ, ఇదే అనుభూతి పొందుతున్నాను – వయస్సు మళ్లి వృద్ధుడినయినా ఇంతే” – “The child is the father of the man” అంటాడు William Wordsworth.

ఇక Milton వ్రాసిన “On His Blindness” ఒక అద్భుత కళాఖండం. అంధుడయి, బాధపడుతూ, కోపమంతా భగవంతునిపై చూపించి, “ఏమయ్యా, మంచి మంచి కవితలు వ్రాసేవాడిని కదా, కళ్లు తీసేసేవు! ఇప్పుడేమి చెయ్యను?” అని గోల పెట్టి ఏడుస్తాడు.

ఇంతలో మనస్సులో, మేధలో, హృదయంలో పెనుమార్పు! “ఓ ప్రభువా! నేనెంతవాణ్ణి – మహా అల్పుడిని! నీవు తలచుకుంటే అతిరథ మహారథులైన కవులు నీ మహత్తును గురించి పద్యాలు అల్లగలరు” అని పశ్చాత్తాప హృదయుడు అవుతాడు. తరువాత Milton రచించిన అజరామరమైన మహాకావ్యాలు Paradise Lost మరియు Paradise Regained. శాశ్వతత్వాన్ని సంతరించుకొన్నాయి కదా!

ఇలా ఆంగ్ల భాషలో మరెందరో కవులు మధుర భావాలతో వర్ణనలు సాగించేరు.

యువత కవిత్వం చదవాలి. అప్పుడే హృదయం మార్దవమవుతుంది. మనిషి – తనను, తోటి వారిని, సృష్టిని – అర్థం చేసికొని ప్రేమించగలడు.

తను కూడ అందమైన కవితలు అల్లే ప్రయత్నం చేయాలి. ఆ మంచి రోజులు రావాలని ఎదురు చూద్దాము.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here