Site icon Sanchika

కవిత్వం ఒక తపస్సు

[శ్రీ కనపర్తి రాజశేఖరమ్ రచించిన ‘కవిత్వం ఒక తపస్సు’ అనే కవితని పాఠకులకు అందిస్తున్నాము.]

[dropcap]అ[/dropcap]న్నములో
పప్పేసి నెయ్యేసి
కలిపి తినిపించి
దాని రుచి చూపినట్లే
కవిత్వాన్ని
ఎవరూ రుచి చూపలేరు

స్పందించే మనస్సు ఉండాలి
ప్రతీది కవితా వస్తువే
కవిత్వపు రుచి దొరుకుతుంది

చిన్ననాడు
పలకా బలపాన్ని చేతికిచ్చి
చేయి ఆసరా అందించి
అక్షరాలను వ్రాయ నేర్పినట్లే
కవిత్వాన్ని
ఎవరూ వ్రాయ నేర్పలేరు

గ్రహించుకునే జ్ఞానం ఉండాలి
ప్రతీది కవితా వస్తువే
కవిత్వం వ్రాసుకోవడం తెలుస్తుంది.

బాల్యములో
మాట స్పష్టత కోసం
వసకొమ్మును
నూరి శిశువుకు పోసినట్లే
కవిత్వాన్ని
ఎవరూ నూరి పోయలేరు

ఇముడ్చుకునే శక్తి ఉండాలి
ప్రతీది కవితా వస్తువే
నూరిపోస్తే కవిత్వం ఒనగూడుతుంది

కవిత్వం ఒక తపస్సు

Exit mobile version