[డా.టి.రాధాకృష్ణమాచార్యులు రచించిన ‘కవిత్వాన్ని నిద్ర పోనివ్వను’ అనే కవితని పాఠకులకు అందిస్తున్నాము.]
[dropcap]దే[/dropcap]శాన్ని జాగృతం చేసే
ఉత్ప్రేరక వాహకాన్ని
నిద్రపోనివ్వను క్షణమైనా
మనిషిని మేల్కొల్పే
ఉద్వేగ సాధనాన్ని
మగతలోకి జారనివ్వను ధరలో
సామాజిక చైతన్యం వెలిగించే
ఉత్తమ మానవాగ్నిని
ఊబి కానివ్వను కలనైనా
కనులు తెరిపించే
జ్ఞానశీల కనుదోయిని
రెప్పల కునుకు చేరనివ్వను ఇల
ఆకుపచ్చ మైదానం ఊపే
వీవెనల గాలిని
తలవాల్చనివ్వను కాలంలో
కష్టాలూ కన్నీళ్ల ప్రయాణాన్ని
తీర్చిదిద్దే
నదీప్రవాహాన్ని నిదురపోనివ్వను
సంవేదనల బతుకు రగిలించే
ప్రేరణైన భావోద్వేగాల
కవిత్వాన్ని నిద్రపోనివ్వను
మంచికీ చెడుకూ మధ్య సమాజాన
ఎత్తిన పిడికిలి చేసే
కదన కవాతును నిదురపోనివ్వను