[dropcap]పు[/dropcap]ట్టిన పురుటి గుడ్డు తలమీద ఆ మాతృత్వపు
మమతల హస్తం గొడుగుపట్టినప్పుడు కురిసిన
అమృతత్వపు మమకారం వర్ణించనలవికాని కావ్యం.
రక్తమాంసాలను పతిరూపపు తనువుగా ప్రతిరూపమిచ్చి
బ్రతుకు మాగాణీలో మొలకగా అంకురింపచేసిన మాతృమూర్తి
హృదయపు మానసికానందమ్ సప్తసముద్రాలను
మించిన లోతేరుగని అమ్మ సముద్రం.
ఒకచేయి ఆలంబనగాచేసి పొత్తిళ్ళ ప్రపంచాన్ని
ఒడిసి పట్టి రెండవచేత్తో పాల కలశపుధారను నోటికందించి
కుడిపినప్పుడు ఆమె శరీరమొక అనుభూతుల జీవనది.
భూమ్యాకాశపు ప్రతిరూపాలుగా కనురెప్పలు విచ్చుకున్న
పత్తికాయలై తనని గుర్తించినప్పుడు ఆమె నవనీత
హృదయం పరిమళ పారిజాతాలా బృందానం.
తనని చూసినప్పుడు ప్రవహించే బోసినవ్వుల కొలనులో
పుష్పించే కరింతల పిందెలని ముద్దాడుతూ ఏరుకుని
బుగ్గ గిన్నెల్లో దాచుకునే నవజాత పారిజాత వృక్షం ఆమె.
ఆకలి మంటల ఆక్రందనలో అలమటిస్తూ ఆర్తిగా రోదించినప్పుడు
నీ ప్రపంచాన్ని తన మాయాలోకంతో సంతృప్తి పరచే అన్నపూర్ణ ఆమె.
రెండు చేతులా, రెండు కాళ్లా గాలిసైకిల్ని శక్తికొద్దీ తొక్కుతున్న
నీ లయవిన్యాసపు విలాసానికి అమ్మ నవ్వుల సెలయేరవుతుంది.
నీమీదకు ఆకాశంలా వంగి నుదురు చుంబించిన క్షణంలో
నీ తనువు మొక్కనిండా రోమాంచితపు చివుళ్లే…
తొలిసారి ఊ..ఊ.. ఉఖూ…లకు కుడుముల ప్రసాదపునోళ్ళు పరవశిస్తే…
తొలినవ్వునాడు నువ్వులుండలన్నీ తీపి పాకాన మమేకమవ్వాల్సిందే.
తొలిసారి బోర్లాపడిన రోజున బొబ్బట్ల వీపు మాడి మచ్చలు తేలాల్సిందే.
పాకితే పాకపు వుండలన్నీ వేగివేగి దొరరంగు పులుముకోవాల్సిందే…
తొలిసారి గడపదాటినప్పుడు నీమువ్వల నాదంలో గవ్వలు రాలాల్సిందే.
తొలి తప్పటడుగు వేసినప్పుడు అరిసెలు దోరచంద్రుళ్ళవ్వాల్సిందే.
‘అత్త’ ‘తాత’లు తొలిసారి నీ బుంగ నోటినుంచి
బయల్పడినప్పుడు పంచదార చిలకలన్నీ
నీ ఇంటివాకిట నడయాడవలసిందే. నీ ‘బాగు’ కవచపు భవితకోసం
తన రెండుచూపుడువేళ్ళ ఆలంబనతో ప్రపంచలోకి నడిపించే
అమ్మ కవిత్వంలో నీవెపుడు ఉత్సాహపు కెరటానివే.
వృద్ధాప్యపు దశలో అమెకొక నాన్నవైనప్పుడు
అమ్మ కవిత్వపు మహాసంద్రమంతా నీదే !!!