కావ్య మత్తు జీవితమంతా నన్ను మత్తులోనే ఉంచింది… -1

0
2

[box type=’note’ fontsize=’16’] నీరజ్‌గారితో డా.ప్రేమ్‌కుమార్ జరిపిన సుదీర్ఘ సంభాషణని తెలుగులో అందిస్తున్నారు డా. వసంత టి.సి. ఇది మొదటి భాగం. [/box]

[dropcap]‘నీ[/dropcap]రజ్‌’గారిని ‘దిన్‌కర్ గారు ‘హిందీ కావ్యవీణ’ అని, భదంత్ ఆనంద్ కౌసల్యాయన్ గారు ‘హిందీ అశ్వఘోష్’ అని నీరజ్‌లోని కావ్య ప్రతిభను వేనోళ్ళ పొగిడారు. వారి జీవితం, రచనలు, శ్రావ్యంగా చదివే తీరు చూసి వారిని ఆధునిక కబీర్ అని ఎందరో మహానుభావులు మెచ్చుకున్నారు. ఎందరో స్నేహితులు ఆయనని లోభి అని, ఆయనలోని ప్రేమించే గుణాన్ని చిలువలు పలువలుగా అల్లుతూ విమర్శిస్తూ ఆనందాన్ని పొందేవాళ్ళు ఉన్నారు. కబీ‍ర్‌లా నీరజ్ కుల గోత్రాలకి, మతమౌఢ్యాలకీ ఏ మాత్రం విలువ ఇవ్వరు. నిజానికి జలంలో జన్మించినా పై మెట్టు మీద నిలబడి నిర్లిప్తంగా ఉండే పంకజాన్ని నీరజ్ అని అంటారు. తన చుట్టూ ఉన్న బురదలో పడకుండా ఇల్లు వాకిలి, భార్యా, బిడ్డలు ప్రేమను పంచుతూ ప్రేమను పొందుతూ ఐహిక సుఖాలలో చిక్కుకున్న నీరజ్ తనకు తాను… ఒక యోగిలా చెప్పకుంటారు. వారిని ఎందరో భోగలాలసలలో కొట్టుకుపోతున్న ఒక యోగి అని ఎద్దేవా చేయడం నేను విన్నాను. ఆయనని ఎవరు ఎంతగా విమర్శించినా ఆయన అవతలి వాళ్ళని ఎప్పుడూ అన్‌కల్చర్డ్‌గా తిట్టలేదని వాళ్ళే అనడం నేను విన్నాను. ఇంతకు ముందు వారు గీతాలను పాడటం ఎన్నోసార్లు విన్నాను. అప్పుడప్పుడు వారికి దగ్గరగా కూర్చొవడం, మాట్లాడడం కూడా జరిగాయి. ఇప్పుడు వారితో చాలాసేపు మాట్లాడడం, అర్థం చేసుకోవడం వలన అసలు ఇంతకు ముందు వారి గురించి తెలిసిందల్లా చాలా తక్కువ అని సగం సగం మాత్రమే తెలుసుకున్నానని అనిపించింది. ఇప్పుడు వారితో ఎక్కవసేపు మాట్లాడే అదృష్టం కలిగింది. నీరజ్‌లోని అసలైన నీరజ్‌ని తెలుసుకోగలిగాను. నిజానికి ఇది అముల్యం. ఎప్పటికి చెరిగిపోని గుర్తులు.

కుంభవృష్టి కురిసింది. మరునాడు నీరజ్ దగ్గరగా ఆ వర్షపు తాలుకూ గుర్తులు దుమ్ముకొట్టుకున్న దుప్పట్లు, కవర్లు లేకుండా దుమ్ము ధూళిలతో ఉన్న దిండ్లు…. ప్లాస్టిక్ నవారుతో నేయబడిన కుర్చీలు…. అంతా దుమ్మే… వీటన్నింటి ప్రభావం నీరజ్ గారిపైన ఏమాత్రం లేదు… ఉక్కపోత వలన అప్పుడప్పుడు మూల్గుతూ తన ఇంట్లో అద్దెకుండే ఇంజనీర్‌తో పిచ్చాపాటీ మాట్లాడుతూ… కరెంటు, నీళ్ళు… ధర్మం… ఖర్మం…. ఏవేవో మాటలు… ఏ సంవత్సరం అయితే మామిడికాయలు విరివిగా వస్తాయో… ఆ ఏడాది గాలి దుమారాలు, తుఫానులు వస్తాయి. ప్రకృతికి తనదంటు ఒక పద్ధతి ఉంటుంది. బ్యాలెన్స్ చేసే నేచర్ ప్రకృతికి సహజం. లేకపోతే అధికమైన బరువు వలన చెట్లు నేల కూల్తాయి. కర్మలు మూడు రకాలు… క్రియ… సంచనయం… ప్రారబ్ధం… మనిషి తన నుండి తమ ముందుగా పరిగెత్తుతాడు. జపాలు, తపాలు… అంతా వ్యర్థం… కరెంటుతో కన్నా ఇన్‍వర్‌టర్‌తో శక్తి ఎక్కువ… ఫాన్ ఎంత వేడిగా తిరుగుతోంది… సింగ్ సింగ్ అని పిలిచారు…. డా. వార్ష్నేయ్ దగ్గరికి వెళ్ళి ఎగ్జామినేషన్ పేపర్లు వచ్చాయో లేదో అడిగి రమ్మన్నారు.

ఇప్పుడు కూడా పేపర్లు దిద్దుతున్నారంటే నాకెంతో ఆశ్చర్యం వేసింది. వారితో ఇప్పటికీ ఆ ఉత్సాహం…. నేను ఎమ్.ఎ.వి మాత్రమే చూస్తాను. పోయిన సంవత్సరం చూసాను. అసలు ఈ రోజుల్లో చదువుల సంగతి ఏం చెప్పను. ఒక విధ్యార్థి ఏం రాసాడో తెలుసా… నవలా సమ్రాట్ కబీర్ దాస్… అప్పుడు అందరూ ఫెయిల్ అయ్యారు. ఇరవై మార్కులు కలిపి వాళ్ళందరిని పాస్ చేసారని విన్నాను.

సగం చేతుల బనీయన్, లుంగీ పెరిగిన గడ్డం మంచం పైన మాటి మాటికి అటు ఇటు కదులుతూ…. మాట్లాడేటప్పుడు ఎంతో ఉత్సాహం…. తన్మయత్వం… కవితా మృత్యువు… కవి సమ్మేళనాలు…. దిగజారుతున్న స్థాయి… గీతాల ప్రక్రియ లుప్తం కావడం… ఈ విషయాలు వచ్చినప్పుడు ఆయన భావోద్రోకం… ఒక చెలమ… ఒక తవ్వకం… ‘గీతాకార్‌కీ మృత్యు’ అని శీర్షకన దిన్‌కర్ గారు ధర్మయుగ్‌లో ఒక కవిత రాసారు.

1) గీత్‌కార్ చనిపోయినప్పుడు చంద్రుడు కన్నీళ్ళు కార్చాడు.

ప్రేత వస్త్రంగా మారిన వెన్నెల తపించింది.

శవాన్ని మలయానిలం తన భుజాల మీద మోసింది.

తగుల బెట్టడానికి అడవి చందనపు కట్టెలను పంపింది.

“ఆ రోజుల్లో ఎంత గొప్పగా ఆయన ఈ గీతం రాసారు. గీతాలు రాసే కవులని బహిష్కరించారు. దిన్‌కర్ గారు ‘గీత్‌కార్‌‌కీ మృత్యు’ రాసారు, దానికి మీరు జవాబివ్వండి అంటూ నన్ను చాలామంది అడిగారు. ఒక నెల తరువాత నేను రాసిన గీతం ‘గీత్‌కార్ కా జన్మ్’ ధర్మయుగ్‌లో ప్రచురితం అయింది.”

2) గీత్‌కార్ పుట్టినప్పుడు ధరణి ఒడి అయింది.

గాలి ఉయ్యాల ఊపాలని ఉవ్విళ్ళూరింది

గీత్‌కార్ మురళిని వాయిస్తూ నడుస్తున్నప్పుడు

తరుణులు ముగ్ధులయ్యారు, కుండలు గలగలా కదిలాయి.

హృదయాలు పొంగేలా పిల్ల తెమ్మెరలు వీచాయి.

చెట్ల కొమ్మల్లో పిట్టలు కువకువలాడాయి.

ఓహ్, ఇతడి పాటలో ఎంత సమ్యోహన శక్తి ఉంది.

మా ఆయుష్షు కూడా ఇతడికే ఇవ్వాలనుంది,

అసలు ఇటువంటి గులాబీని ఈ జగత్తులోనే చూడలేదు.

ప్రగతివాది ఉద్యమం తరువాత ‘తారసప్తక్’ నుండి మరో కొత్త ఉద్యమం మొదలయింది. సమీక్షలు, పత్రికలు, రేడియో అన్నింటినీ వాళ్ళ చేతుల్లో పెట్టుకున్నారు. గీత్‌కార్‌ల విషయంలో మౌనం వహించారు. “నేను ఒకసారి ప్రభాకర్ మచ్‌వేగారితో “మీరు మమ్మల్ని పొగడకపోయినా ఫరవాలేదు కాని తిట్టండి” అని అన్నాను. “ఒక వేళ మేం అట్లా చేసినా మీకేం ప్రచారం ఎక్కువ అవుతుంది అని జవాబిచ్చారు.” మా విషయంలో సరియైన విమర్శలు రావడం ఆయనకి ఇష్టం లేదు. 50 నుండి 75 వరకు అంటే దాదాపు 25 సంవత్సరాలు ఒక కుతంత్రం జరగడం వలన గీతాలను ఎవరు అంతగా పట్టింటుకోలేదు. అసలు గీతాలే వద్దనుకున్నారు. వాటికి విలువ ఇవ్వలేదు. ఏ చర్చ జరగలేదు. అప్పుడప్పుడు హరివంశరాయ్ బచ్చన్ గురించి మాట్లాడేవాళ్ళు. అప్పటికి కొందరు గీత్‌కార్‌లు గీతాలు రాస్తూనే ఉన్నారు. వారి ప్రభావం సమాజంపై అంతో ఇంతో ఉంది. కాని బచ్చన్‌కి కొంత పేరు వచ్చింది. ఇప్పుడు జీవితంలో మనం ఎంతో స్వేచ్చగా త్వరత్వరగా మందుకు పోతున్నాం. ఛందస్సులో సమాజపు వ్యక్తి మనోభావాలను వ్యక్తపరచడం కష్టం. ముద్రణ యంత్రం లేని రోజుల్లో కవితలు – పాటలు రాసేవాళ్ళు. పాడేవాళ్ళు. వైజ్ఞానిక యుగంలో భావుకతను మాత్రమే వ్యక్తం చేసే గీతాలు ఎందుకు? ఆనాడు గీత్‌కార్‌ల దగ్గర పత్రికలు, ఉద్యమాలు, విమర్శలు ఏవీ లేవు. కేవలం కవి సమ్మేళానాలు మాత్రమే వారి దగ్గర ఉన్న సాధనం. లక్షల సంఖ్యలో దర్శకులు వచ్చేవారు. ఛందస్సు వాడని కవులు, నాలుగు వాక్యాలు రాసుకుని తాము పెద్ద కవులుగా అనుకునేవారు. ఇంత మంది కవులు పుట్టినా పేరు సంపాదించుకోలేకపోయారు.

ఆ కవితలు నిలబడ లేకపోయాయి. ప్రగతివాది, జనవాది, ప్రయోగవాది, నయా కవితా…. ఈ ఫ్రేముల్లో మేం ఫిట్ కాలేకపోయాం. ఇహ విమర్శ విషయానికి వస్తే ‘మక్షికా స్థానే మక్షికా’. ఎవరైనా ఒక్కసారి తప్పు చేస్తే జీవితాంతం వెంటాడుతూనే ఉంటుంది. ఏవో ఒకటి రెండు శృంగార కవితలు రాసాను అంతే నా పైన శృంగార కవి అని ముద్ర వేసారు. కాని నేను శృంగార కవిని కానేకాను.

ఆ ఉద్యమాలను ఎందుర్కోవాలని ‘లయ్’ అనే పత్రికను 1964 – 65లలో ప్రారంభించాను. దాదాపు 9 సంచికలు వచ్చాయి. నేను బొంబాయి వెళ్ళిపోయాను. ‘లయ్’ని ముందుకు నడపలేకపోయాను. పైసలు ఇచ్చి పుస్తకాలు అచ్చు వేయించుకుంటున్నారు. పబ్లిషర్లు ముద్రించినా అవి అమ్ముడు పోవడం లేదు. నావి దాదపు 40 నుండి ప్రచురితం అవుతున్నాయి… రాయితీ కూడా వస్తోంది. ఒక్కక్క సంస్కరణ వచ్చినప్పుడల్లా 20,30 కాపీలు కొనేవాళ్ళు. స్నేహితులకి ఇచ్చేవాళ్ళు. ఆ సమయంలో బచ్చన్, నేపాలీ, రంగ్, దనేష్, వీరేంద్ర మిశ్ర్, అవస్థీ, గిరిధర్ గోపాల్, రామావతార్ త్యాగీ, దిన్‌కర్, నీరజ్ తరువుతా, కుంవర్ బేచైన్, భరత్ భూషణ్, సోమ్ ఠాకుర్, కిషన్ సరోజ్ – గీతాలు రాయడంలో దిట్టలు. కాని గీత్‌కార్‌లకు విలువ తగ్గిపోవడం వలన వీళ్ళందరు కవిసమ్మేళనాల వైపు వెళ్ళిపోయారు. అక్కడ గుంపులు ఉంటారు, శ్రోతలు ఉండరు. లతీఫాలు… గీతాలు… స్థాయి నుండి దిగజారిపోయాయి, పశుమేళాలు, ప్రదర్శనలతో కవి సమ్మేళనాలను ముడి వేసారు. రోటరీ, లైన్స్ క్లబ్‌లలో చేరిన వారు తమని తాము ఇంటలిజెన్షియా… క్లాస్‌గా నిరుపించుకోవడాని కవి సమ్మేళనాలను జరిపించడం మొదలు పెట్టారు. ఇక ఇప్పుడు కవిత్వం లుప్తం అయింది. హాస్య వ్యంగ్య కవితలు మొదలయ్యాయి. ‘చిట్‌కులే’లు మొదలయ్యాయి.

ఎవరు ’కామాయనీ’, ’సాకేత్’ల లాంటి మహాకావ్యాలు రాస్తారు? ఇక ఇప్పుడు కవుల బదులుగా వారి ప్రేతాలు – అసలు సైకిల్ కూడా కొనలేని వారికి ఇప్పుడు పెద్ద పెద్ద భవనాలు, కార్లు మొబైళ్ళు… కాంట్రాక్టర్లు బయలుదేరారు… ఒక్కొక్క కవి సమ్మేళనానికి ఇన్ని వందలు… ఇన్ని వేలు అంటూ బేరాలు! సగం వాళ్ళు ఉంచుకోవడం, సగం కవులకు పంచడం… కవులకు తక్కువ ఇవ్వడం…. రసీదులో ఎక్కవ రాయడం…

మరి మీరందరు ఎదిరించలేదా…

ఎదిరించాం. ఇక్కడ మన నగరంలో కూడా గొడవ చేసాం. కాని ఏం ఏం జరిగింది. మ్మమ్మల్ని బయట వాళ్లు పిలుస్తారు. మిత్రులు పిలుస్తారు. ఇవాళ రెండే రెండింటికి విలువ – అర్ధం – లాభం. ధనానికి మన వాళ్ళు అతిగా విలువ ఇవ్వలేదు. పైగా పిశాచంలా చూసారు. ఈ పిశాచం రక్తం పీల్చే మనిషిని చంపేస్తుంది. సాహిత్యం, కళ ధర్మం, దర్శన్, విద్య, రాజకీయం, ఎక్కడైనా సరే ధనం కేంద్రం అవుతుందో అన్నీ వ్యర్థమే. అన్నీ వికృతమే. ధనం లక్ష్యం కాకుడదు. మాధ్యమం కాగలగాలి. ఇది ధర్మాన్ని, అధర్మంగా మార్చింది. ధర్మం, రాజకీయం రెండు వ్యాపారాలు అయ్యాయి.

ఇటువంటి దూషిత వాతావరణంలో కవిత భవిష్యత్తు ఏమిటి?

వీటన్నింటి వలన గీత్‌కార్‌లు చాలా బాధపడ్డారు. కవిత్వానికి ఎటువంటి విలువ లేకుండా పోయింది. గుంపుల ముందు కావ్య పఠనం వలన చాలా ముప్పు వచ్చింది. ఒక సమయంలో మైథిలీ శరణ్ గుప్త్, నిరాలా, మహాదేవి, గురు భక్త సింహ్ భక్ మొదలైన దిగ్గజ కవులు అధ్యక్షతను వహించేవారు. ఎవరైనా స్టేజ్ మీద తక్కువ స్థాయి కవితలు చదవతుంటే వాళ్ళని వెంటనే ఆపేసే వాళ్ళు. ఇప్పుడు ఏవి చదివినా ఎవరూ పట్టించుకోరు. ఆనాడు కవిసమ్మేళ్ళలను ఏర్పాటు చేసేవాళ్ళు కూడా బాగా చదువుకున్నవాళ్ళు ఉండేవాళ్లు. కవితల పట్ల వాళ్ళకు ఎంతో ఇష్టం ఉండేది. ఇప్పటికీ కొన్ని చోట్ల ఇంకా మంచి స్థాయిలో కవి సమ్మేళనాలు ఏర్పాటు చేస్తున్నారు. డి.సీ.ఎమ్ కవి సమ్మేళనం. దాదపు 30,35 సంవత్సరాలు నుండి నడుస్తోంది. ఇండియన్ ఆయిల్ వాళ్ళది ఎన్.టి.పీ.సీ, గేల్, భెల్ మొదైలన సంస్థలు మంచి కవి సమ్మేళానికి ఏర్పాటు చేస్తున్నాయి. 1983లో నేను మొట్టమొదట అమెరికా వెళ్ళాను. తలుపులు తెలిచాను. ఇప్పుడు అక్కడ కూడా స్థాయి దిగజారిపోయింది. కెనెడా, ఆస్ట్రేలియాలకి తరువాత ఎందరో వెళ్ళి వస్తున్నారు. కాఠ్‌మండుకి అప్పట్లో సుమన్‌గారు ఉండేవారు, మూడుసార్లు బ్రిటనుకి నేను వెళ్ళాను. నేను పెద్ద పెద్ద కవుల సమక్షంలో కవితలు చదివాను. ఉర్దూ కవులతో కూడా కలిసి చదివాను. వాళ్ళ ఆశీర్వాదాలు లభించాయి. ఇందంతా నా అదృష్టం.

ఉర్దూ కవులతో మీ అనుభవాలు? మీరేం పొందారు?

బహుశ 1944లో అనుకుంటాను. శిమ్లాలో గాంధీ… జిన్నా సమ్మేళనం తరువాత నేనొక గీతం రాసాను. ‘ఆజ్ మిలా హై గంగాజల్… జల్ దమ్ దమ్‌కా…’ నేను ఢిల్లీలో ఒక కవి సమ్మేళనంలో ఈ గీతాన్ని పాడాను. ఒక పెద్దమనిషి నన్ను పిలిచి అడిగారు – సాహెబ్ జాదే! మీరేం చేస్తూ ఉంటారు? అని. నేను సప్లయి విభాగంలో టైపిస్ట్‌ని అని చెప్పాను. అరవై అయిదు రూపాయలు జీతం. అప్పుడు “సరే రేపు మా ఆఫీసుకు రండి. నాకు లిటరరీ అసిస్టెంట్‌గా మిమ్మల్ని తీసుకుంటాను. 130 రూపాయలు జీతం ఇస్తాను” అన్నారాయన. ఆయన హఫీజ్ జలంధరీ సాహెబ్. ఆనాటి మహాకవి. పాట్నాలో దినకర్ గారితో ఢిల్లీలో సాంగ్స్ పబ్లిసిటీ ఆర్గనైజేషన్‌కి ఆయన డైరెక్టర్‌గా ఉండేవారు. ఆక్కడికి వెళ్ళాక గీతాల ద్వారా గవర్నమెంటు ప్రణాళికల గురించిన ప్రచారం చేయాలి అని చెప్పారు. కవి సమ్మేళనాలు ఏర్పాటు చేయడానికి ఒక లక్ష రూపాయలు ఇచ్చారు. యు.పి, పంజాబ్ ఎన్నో చోట్ల కవి సమ్మేళనాలు జరిగాయి. 43లో బంగాల్‌లో క్షమం వచ్చింది. తినడానికి మెతుకు లేక జనం అల్లాడిపోయారు. వాళ్ళ సహయార్థం మార్వాడీలు 3 రోజులు కవి సమ్మేళనాన్ని కలకత్తాలో ఏర్పాటు చేసారు. నేను అక్కడికి వెళ్ళినప్పుడు హృదయ విదారకమైన దృశ్యాలను చూసాను. నాలుగు మెతుకుల కోసం మనుషులు కుక్కలతో పోట్లాడుతున్నారు. మనస్సంతా వికలం అయిపోయింది. ‘మై విద్రోహీ హుం. జగ్‌ మే విద్రోహ్ కరానే ఆయా’ అన్న గీతాన్ని రాసాను. దేశాన్ని జాగృతపరిచే ఆ గీతం ఎంతో ప్రసిద్ధి చెందింది. 44లోనో 45లోనో గుర్తుకు రావడం లేదు, డెహ్రాడూన్‌లో కవి సమ్మేళనం ప్రభుత్వం ఏర్పాటు చేసింది. అక్కడ నేనొక కవితను చదివాను. సమ్మేళనం కాగానే డిప్యూటీ కలెక్టర్ రఫీద్ అహమ్మద్ బుఖారీ నన్ను పిలిపించారు. ఇట్లా అన్నాడు “నీరజ్ ఇక ఇప్పుడు నీవు ఢిల్లీ వెళ్ళకు. నీవు ప్రభుత్వం డబ్బులు ఖర్చు పెడుతూ, ప్రభుత్వానికి వ్యతిరేకంగా ప్రచారం చేస్తున్నావని ఫిర్యాదు వచ్చింది.” నేను కాన్పూర్‌కి వచ్చేసాను. సామానంతా మాహ్‌రామ్ మొహల్లాలో ఉండిపోయింది. షాహ్‌దరాలో ఈ బస్తీ ఉంది. తరువాత అసలు ఆయన ఎందుకట్లా అన్నారో అర్థం అయింది. ఒక సంవత్సరం క్రిందట డెహరాడూన్‌లో ఆయన నా కవితలని విన్నారు. ఆయన ప్రభావితులయ్యారు. మరునాడు జరగబోయే ముషాయరీ కోసం నన్ను ఉండమన్నారు. జిగర్ సాహెబ్‌కి నా కవితలు చదివించాలని చెప్పారు. జిగర్ గారు దాదాపు మూడు కవితలు చదివే అవకాశం ఇచ్చారు. ఒక్కొక్క కవిత చదవగానే వారు శభాష్ అంటూ నా వీపు చరిచారు. ‘ఉమ్ర దరాజ్ హో ఇస్ లడకే కీ క్యా పడతా హై జైసే నగమ్ గూంజ్‌తా హై’ అన్నారు. వారు గజుల్ బాద్‌షాహ్. లయన ఆయనకి  బాగా తెలుసు. ఎందరో కవులు ఆయన స్టైల్‌లో పాడేవారు (నీరజ్ ఆయన గజళ్ళని వినిపించారు). షకీల్ ఆ స్టైల్‌ని తీసుకున్నారు. నేను షకీల్ కలిసి పని చేసాము. ఆయన కంప్‌పేరియర్. అప్పుడు షకీల్ బదయునీ బి.ఎ. పాస్ అయ్యారు. నేను హై స్కూల్, నా స్టైల్ వేరే. అసలు నా స్టైల్ ఎవరికి ఎంత నేర్పించినా రాలేదు. అసలు నా కవితల్లో ఉండే పసని పట్టులేకపోయారు. నా స్టైల్‌ని నేర్చుకో లేకపోయారు. నేను పేషెంట్‌ని. నా గొంతు విన్నాక నేను తాగి పాడుతాను అని అందరు అనుకునేవారు.

జజ్జీ సాహెబ్ గజల్ – ‘అపనీ సోయి హుయి దునియా కో జగాలూం..’ వారి ‘బహర్’ (ఉర్దూలో ప్రత్యేకమైన దాదాపు 19 బహర్ (లయ)లు) ను నేను తీసుకున్నాను – ఒక గీతం రాసాను – ‘ఐసీ క్యా బాత్‌ హై, చల్‌తా హుం, అభీ చల్‌తా హం, గీత్ ఎక్ అభీ ఝమ్‌గాతూం తో చలూం…’ నీరజ్ పూర్తిగా తన్మయత్వంతో పాడారు. టాగూరులోని వైశిష్టత ఎంటో తెలుసా? ఉదాత్త కవి. అసలు ఆయన అంత సబ్లైమ్ ఎవరు లేరు. వారి నుండే నేను సబ్లిమేషన్ సూత్రాన్ని నేర్చుకున్నాను. అసలు నేటి మనిషి ఎన్నో కష్టాలు కడగండ్లలలో చిక్కకుపోయాడు. కవితలు రాయాలంటే ఎంతో కష్టపడాలి. బుద్ధిని ఉపయోగించాలి. ఉర్దూ కవితలు రాసేవాళ్ళు తక్కువ అయ్యారు. లాభం లేకపోతే ఎవరు ఏమీ రాయరు. రాష్ట్ర భాషలో రాసి పాడే గాయకుడు లేడు. తులసీ, … మీరాల భజనలు ఎక్కువగా పాడుతున్నారు. హిందీలో ఎవరు లేరు. బరువైన కవితలు రాసేదెవరు? అందుకే కవితలకు అంత ప్రాముఖ్యత లేకుండా పోయింది.

***

ఉర్దూ షేర్ షాయరీ పట్ల మీకు ఎంతో ఆకర్షణ ఉంది. ఇదివరకు మీరు దీని గురించి ఎక్కువగా మాట్లాడేవారు.. ఇప్పుడే మీరు హిందీ కవిత్వంలో ఉన్న బలహీనతలు గురించి చెప్పారు. అసలు మీ దృష్టిలో దీనికి కారణాలు ఏమిటి?

కారణాలు ఏం చెప్పను? హిందీ కవితలు తొందరగా నోటికిరావు. సంచాలనం చేసే వాళ్ళు షేర్ చదివే మొదలు పెడతారు. ఒక పెద్ద గాప్ వచ్చింది. ముక్త ఛందస్సు దీనిని నింపలేదు. దాన్ని ఎవరు కనీసం పాడరు, మెచ్చుకోరు. బాగుంది అని అంటారు అంతే. వ్యక్తుల నాలుకలపైన ఉంటే కాని భవిష్యత్తులో జీవించి ఉండదు. అంటే నిరింతరం వ్యక్తులకు పాడాలని అనిపించాలి. కేవలం కాగితాల పైన ముద్రింపబడి ఇళ్ళల్లో, లైబ్రరీలలో ఉండి పోతే ఏం లాభం? ఎంత మంది కవుల కవితా పంక్తులు గుర్తుంటాయి. మహా అయితే నాలుగైదు పంక్తులు… పుస్తకాలు ఎంత మంది దగ్గర ఉన్నాయి. టెన్నిసన్, కీట్సీ, షెల్లీ, షేక్స్‌పియర్ ఇప్పటికీ జీవించే ఎందుకు ఉన్నారు?

అమర్‌నాథ్ ఝా  కాన్పూర్ సమ్మేళనంలో నేను ఫస్ట క్లాస్ రావడానికి కారణం ఏమిటి అని అడిగారు. నేను అప్పుడు బి.ఎ.స్టుడెంట్‌ని. నేను కవిత చదివాక నా వీపు తడుతూ ఆయన – “ఎంతగా మనం గుర్తుపెట్టుకుంటామో అదే మనకు దక్కుతుంది” అని అన్నారు. నేను ఉద్యోగం చేయడం వలన కాలేజీకి వెళ్ళలేకపోయేవాడిని. కాని ఇంగ్లీషులో పెద్ద పెద్ద కవితలు నాకు నోటికి వచ్చేవి. లిటరేచర్ విషయంలో ఆ ఎంజాయ్‌మెంట్ మన పెదవులపైనే ఉంటుంది. మాట్లాడేటప్పుడు పుస్తకాలు వెతికి తేగలుగుతామా!

ఆయన ఝూ సాహెబ్ విషయం చెబుతూ ఆర్థికంగా తాను ఎంతగా ఇబ్బంది పడ్డాడో గుర్తు చేసుకున్నారు. నెహ్రూగారు ఉత్తరాలకి జవాబులు ఇచ్చేవారని ఆయనని పొగిడారు. కె.పి భట్నాగర్‌ని గుర్తు చేసుకున్నారు.

జూన్ ఫస్ట్‌న నా కొడుకు గుంజల్ పుట్టాడు. అప్పుడే రిజల్టు వచ్చింది. నా సోదరులు ఫీజ్ మాఫ్ కాలేదు. నేనెంతో బాధపడ్డాను. భట్నాగర్ ఒక సోదరుడికి సగం ఫీజు తగ్గిస్తానని చెప్పారు. నేను గది లోపలికి వెళ్ళాను, అక్కడ సోదరుడు కూర్చుని ఉన్నాడు. నేను ఫస్ట్ క్లాస్‌లో పాస్ అయ్యాను అని ఆయన చెప్పారు. నేను ఒక వేలు చూపించాను. సమాధానంగా ఆయన వేలు చూపించారు. నాకు కొడుకు పుట్టాడని చెప్పాను.

బచ్చన్ ‘మధుశాల’ కవితలను చెప్పడం మొదలుపెట్టారు. “నేను బచ్చన్ సాహిత్యాన్ని లోతుగా పరిశీలించాను. బహుశ నేను ఆయన సాఫిత్యాన్ని చదివినంతగా మరెవరు చదివి ఉండరు. అందరికన్నా ముందుగా ‘బచ్చన్ ఏక్ యుగాంతర్’ అన్న పేరన నేను సంపాదకత్వాన్ని వహించాను. ఆయన ‘హాలావాది’. ‘ఏకాంత్ సంగీత్’ తరువాత ‘మిలన్ యుమిని’, ‘మధుశాల’ తరువాత ‘హాలాహల్’ జీవితానికి రెండంచులు. ‘హాలాహల్ ’నిజానికి గొప్ప కావ్యం. పాఠకులు దీన్ని ఎక్కువగా చదవలేరు. ‘నిషా నిమంత్రణ్’ వందగీతాల ఖండకావ్యం. ఒక్క గీతం కాదు మొత్తం ఒక్కసారిగా చదవాలి. ‘సానెట్’ పాటర్న్‌లో అది రాయబడ్డది. సంధ్యాకాలం నుండి ప్రొద్దుటి దాకా ఒక్కొక్క క్షణం గురించిన సూక్ష్మ పరిశీలన అది. భార్య కాలం చెందింది. ఆ తరువాత ఆయన అనుభవించిన అనుభూతి అది (కంఠంలో ఆద్రత ఉంది)”.

“ఏకాంత్ హై మన్ దుఃఖీ హై

ఏక్ కిరణ్ చంద్రమా కీ

ఝరో కేసే అందర్ ఆకర్ పడ్‌గయా హై

దే రహీ కితనా దిలాసా”

“ఆ ఝరోకే సే జరా సా

చాంద్‌నీ పిఛలే పహర్‌ కీ

పాస్ మే జో సోగయీ హై

రాత్ ఆధీ హోగయీ హై”

“ఏకాంతం, మనస్సంతా బాధ

ఒక చంద్ర కిరణం,

కిటికీలో నుండి లోపలికి వచ్చింది,

ఎంతగానో మనస్సుకు కాంతి నిచ్చింది”

“ఈ రోజు కిటికీ నుండి కొంచెం

గడిచిన ఘడియల వెన్నెల

దగ్గర పడుకుంది

రాత్రి సగం గడిచింది”.

ఎంత గొప్పటి చిత్రం. అనుభూతి ఉంది. ఒంటరిగా ఉన్న ఈ వ్యక్తి సూక్ష్మ పరిశీలనను ఎవరు అర్థం చేసుకున్నారు? భార్య వియెగం వలన బాధపడ్డ మనస్సు, వియోగపు క్షణాలు. ‘హాలాహల్’లో ప్రారంభ వాక్యం జీవితానికి గొప్ప పరిభాష –

జగత్-ఘట్‌ కో విష్‌ సే కర్ పూర్ణ్,

కియా జిన్ హాథోం నే తైయార్,

లగాయా ఉస్ కే ముఖ్ పర్ నారి,

తుమ్హారే అధరోం కా మధు సార్,

నహీఁ తో దేతా కబ్‌ కా దేతా తోడ్

పురుష్-విష్‌-ఘట్ యహ్ ఠోకర్ మార్,

 ఇసీ మధు కా లేనే కో స్వాద్

హాలాహల్ పీ జాతా సంసార్.

(నీరజ్ భావుకుడైపోయారు. పదే పదే పంక్తులను చెప్పడం మొదలు పెట్టారు.)

[లోకపు ఘటాన్ని (కుండ) విషంతో ఏ చేతులు తయారు చేసాయో, నారీ నీవు దాని ముఖం పైన నీ పెదవుల మధువును పూసావు లేకపోతే ఎప్పుడో పురుషుడు విషపు ఘటాన్ని కాళ్ళతో తన్నేసేవాడు. ఈ మధువు రుచి చూడడానికే హాలాహాలాన్ని ఈ లోకం తాగేస్తుంది.]

(ఇంకా ఉంది)

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here