కావ్య మత్తు జీవితమంతా నన్ను మత్తులోనే ఉంచింది… -4

0
2

[box type=’note’ fontsize=’16’] నీరజ్‌గారితో డా.ప్రేమ్‌కుమార్ జరిపిన సుదీర్ఘ సంభాషణని తెలుగులో అందిస్తున్నారు డా. వసంత టి.సి. ఇది నాల్గవ భాగం. [/box]

[dropcap]సం[/dropcap]గీతమయమైన భాషను రాయడం చాలా కష్టం. (పాడటం మొదలు పెట్టారు) ‘నభ్ కీ బిందియా చందావాలీ, భూ కీ అంగియా ఫూలోంవాలీ. సావన్ కీ ఋతు ఝులోంవాలీ, ఫాగున్ కి ఋతు భూలోంవాలీ,. కజ్‌రారీ పలకేం షర్మీలీ, నిందియారీ అలకేం వుర్‌ఝీలీ. గీతోంవాలీ గోరీ ఉషా, సుధింయొం వాలీ సంధ్యా కాలీ’). ఊర్దూ పదాలు వాడిన భాష – ఎంతో నాజుకుతనం కల భాష. మధురమైన భాష – “ఫిర్ వహీ షహర్, వహీ షామ్, వహీ తేరీ తలాష్. ముస్కురాతే హుయే తట్ పర్ ఉదాస్ భైఠా హుఁ. తేరే వాయదోం కీ కసమ్ తేరీ నజరోం కీ కసమ్ దూర్ హోకర్ భీ బహుత్ తేరే పాస్ భైఠా హుఁ”. జుహు ఒడ్డున మగపిల్లలు ఆడపిల్లలు కూర్చుని ఉంటారు. మాట్లాడుకుంటూ ఉంటారు. చూసాక రాసాను – “చాందీకీ బాహ్ మే ఉలఝాయే లచక్‌తీ బాహేం. కభీ షరీఫ్, కభీ షోఖ్. లహర్ ఆతీహై. ఉడ్‌తే ఛీటోం కీ తరహ్ యాద్ తేరీ ఉడ్ కర్ కభీ దామన్ కో, కభీ దిల్ కో భాగ్ జాతీ హై.”

నేను చరస్ ఎప్పుడు తాగలేదు. – “ఇతనీ జోర్ సే పూక్ చిలమ్ కో, జో మిలే సితారోంసే, ఐసా ఉగె ప్రకాష్ జ్యోతి కా, ఝరనా ఝరే పహాడేంసే. జో బన్‌గయా ప్రకాష్ ఉసీ కా జీవన్ సఫల్ హువా హై రే.” (చిలమ్‌ని ఎంత గట్టిగా ఊదానంటే మంట నక్షత్రాలలో కలిసిపోయింది. జ్యోతికి వెలుగు పుట్టింది కొండల నుండి సెలయేళ్ళు ప్రవహించాయి. ఎవరైతే వెలుగు అవుతారో వాళ్ళ జీవితం సఫలం అవుతుంది. (ప్రతీకాత్మక శైలిలో నీరజ్ రాసిన ‘నీరజ్‌కీ పాతీ’ చాలా ప్రసిద్ది చెందింది.)

ఈ నగరంలో చూసారా కరెంటు వాటర్ ప్రాబ్లమ్ ఎంతగా ఉందో. ఎటువంటి దుర్గతి పట్టింది. నాకు విసుగు వచ్చి నిన్ననే ఒక దోహా రాసాను. “ఆంఖోంకా పానీ మరా, హమ్ సబ్ కా యుం ఆజ్. సుఖ్ గమీ సల్ స్త్రోత్ జల్. ఇతనీ అయ్ లజ్.” (ఇవాళ ఈ విధంగా మనందరి కళ్ళలో నీళ్ళు ఇంకిపోయాయి. ఊట ఎండిపోయింది. ఎంతో సిగ్గుపడ్డాను.)

నేను భగీరధ ప్రయత్నం చేసి రాయను. ఇప్పటి వరకు నేను చెప్పింది, రాసింది ప్రయత్నం చేసి కాదు. దోహే, ముక్తక్, గజల్‌ల ద్వారా నేను కొత్త విషయాలు ఎన్నో చెప్పాను. ఛందస్సు లేని కవితలు కూడా నేను రాసాను. ముక్త చంధ్ కవితల్లో అంత్య ప్రాస ఉండదు. చందస్సు ఉండదు. దీనిని ఫ్రాంస్‌లో ఫ్రీ వర్స్ లిబరే అని అంటారు. ఫ్రెంచ్ భాషలో ఇది చాలా పాపులర్ అయింది. దీనిని నేను ఒక సినిమా గీతంలో చూపించాను – ఆ గీతం – “ఏ భాయ్ జర దేఖకే చలో…” ప్రపంచం అంతటి ప్రసిద్ది పొందిన గీతం. దీని ట్యూన్ మ్యూజిక్ డైరెక్టర్ చేయలేకపోయాడు. శంకర్ – జైకిషన్ చేయలేకపోయారు. అప్పుడు దీన్ని ఎట్లా పాడగలుగుతాం అని నన్ను అడిగారు. నేను పాడి చూపించాను. ఇంతకు ముందు ఎప్పుడు సినిమా పాటలలో గీతం, ఖవ్వాలి, గజల్‌లు ఎక్కువగా ఉండేవి. ఛందస్సు లేని కవితలని ఉపయోగించలేదు. ఆరు పేజీల గీతం ఇది. (నీరజ్ అభినయిస్తూ పాడారు). నిజానికి అంతా ప్రోజే. ఆత్మలో నిలిచిపోయింది. అంతా జీవితం గురించిన తత్వమే. గొప్ప ఫిలాసఫీ. రాజ్‌కపూర్ ముగ్ధుడై అన్నారు – “అసలు ఇంతకు ముందు ఇటు వంటి గీతం ఎవరు రాయలేదు. ఈ గీతాన్ని ఎట్లా ఉపయోగించుకోవాలి?”. ఆయన ఎంతో ఆలోచించారు. ఇప్పుడు ముప్పై సంవత్సరాలు తరువాత కూడా నాకు రాయల్టీ వస్తోంది. గీతాంజలి, ఉద్‌గమ్, నీరజ్, మదిర్ ఇట్లాంటి ఎన్నో శబ్దాలని వాడాను. పలకోంకే ఝులే (కనురెప్పల ఊయల) సపనోంకీ డోలీ( కలల పల్లకీ) ఇటువంటి బింబాలను సృష్టించాను. అందరు ఎంతో మెచ్చుకున్నారు. శంకర్ జైకిషన్ ‘ఏ భాయి జర దేఖ్ కే చలో’ గీతం విషయంలో ఇట్లా అన్నారు – “ఇది కూడా ఒక గీతమేనా? ఆరుపైసల గీతం”. నిజానికి వారన్నదాంట్లో తప్పేమీ లేదు. దోహ కాదు, గీతం కాదు, గజల్ కాదు, రుబాయి కాదు, ఘనాక్షరీ, సహైయ్యా కాదు, భజన కాదు – అసలు ఫామ్ లోను లేదు. మరి అట్లా గాక ఇంకా ఏమంటారు? నేను చెప్పాక ఆయన ట్యూన్ తయారు చేసారు. నేను పాడినట్లుగా స్వరాన్ని రాసారు. సర్కస్ ద్వారా మొత్తం సిట్యుయేషన్ కవర్ అయింది. పాట హిట్ అయింది.

సినిమాల విషయం వచ్చింది కనుక నేను సినిమా ప్రపంచానికి సంబంధించిన వారి అనుభవాలను తెలుసుకోడానికి నీరజ్‌ని కొన్ని ప్రశ్నలు వేసాను. సినిమా ప్రపంచంలోకి ఆయన ఎట్లా వెళ్ళారు, అక్కడి నుండి వెనుక్కు తిరిగి వచ్చిన పరిస్థితులు, ఏం పొందారు. ఏం పోగొట్టుకున్నారు మొదలైన విషయాలు గురించి వారు చాలా సేపు మాట్లాడారు.

“సినిమా ప్రపంచంలోకి 8 ఫిబ్రవరి 1960లో నేను వెళ్ళాను. నా పుట్టిన రోజు ఫిబ్రవరి 5. ఫిబ్రవరి 8, 60న నా పుట్టిన రోజు సందర్భంగా నీరజ్ గీత్ గుంజన్ పేరిట బొంబాయిలో ఒక కార్యక్రమం జరిగింది. ఆ కార్యక్రమంలో ముఖ్యమంత్రి యశ్వంతరావు చౌహన్ 5 వేల రూపాయలు నాకు సన్మానం చేస్తూ ఇచ్చారు. దీని ఏర్పాటు శ్రీశాంతి ప్రసాద్ జైన్ పెద్ద అన్నయ్య. శ్రీయాంష్ ప్రసాద్ జైన్ అధ్యక్షతన జరిగింది. ఆ కార్యక్రమం చూసి శ్రీ ఆర్. చంద్ర ఎంతో ప్రభావితులయ్యారు. ఆయన ఆలీఘడ్ నివాసి. వారు ‘బరసాత్ కీ రాత్’ నిర్మాత… తన ఫిల్మ్ ‘నయా ఉమర్ కీ నయి ఫసల్’కి నాతో ఎగ్రిమెంట్ చేసారు. అందులో ‘కారవాం గుజర్ గయీ….’ నా పాట ఎంతో హిట్ అయింది. ఈ ఫిల్మ్ కోసం కొత్తగా నేను రాయలేదు. నేను ఇంతకు ముందు రాసిన కవితనే వారు తీసుకున్నారు. 65లో ఈ ఫిల్మ్ రిలీజ్ అయింది. అందులో నా పాటలన్ని హిట్ అయ్యాయి. 1967లో దేవానంద్ గారు ‘ప్రేమ్ పుజారి’ సినిమా కోసం పాటలు రాయమన్నారు. 67-68లో రెండు సంవత్సరాలు సెలవు పెట్టి వెళ్ళాను. 69లో మళ్ళీ వెనక్కి వచ్చాను. 70లో కాలేజీలో ఉద్యోగం వదిలేసి బొంబాయికి వెళ్ళిపోయాను. అక్కడ 72 దాకా ఉన్నాను. దాదాపు 5 సంవత్సరాలు ఉన్నాను. 70లో నాకు ఫిల్మ్ ఫెయిర్ అవార్డ్ వచ్చింది. నిజానికి ఇది గీత రచయితకి ఎంతో గౌరవం. ఈ 5 సంవత్సరాలలో నేను సినిమా పాటల భాషను మార్చాను. పై స్థాయికి తీసుకు వెళ్ళాను. ఎన్నో ప్రయోగాలు చేసాను. ‘ఏ భాయ్! జర దేఖ కే చలో…’ లాంటి ఫ్రీ వర్స్ లిబరే కవిత విశ్వ ప్రసిద్ధి గీతంగా పేరు పొందింది. ‘మేఘా ఛాయే ఆధీ రాత్….’ పాట ఎంత హిట్ అయిదో అందరికి తెలుసు. క్లాసిక్, పాప్, ఫోక్, భజనలు, వేశ్యవాడల గీతాలు… నజ్మ్… అన్నింటికి ఓ పాపులారిటీ లభించింది.

చాలా మంది కవిత, ఫిల్మ్ గీతాల మధ్య ఏ భేధం లేదు అన్ని భ్రమలో ఉన్నారు. కాని ఇది తప్పు. ఫిల్మ్ సాంగ్స్ వ్యాపారంతో ముడివడి ఉన్నాయి. అందులో ఎదురెదురు కూడా మాటలు ఉండవు. అందులో పర్దా మాట్లాడతుంది. ఇందులో అభినయం ఉటుంది. రెండున్నర మూడు నిమిషాలలో కథకి భాగంగా ప్రస్తుతీకరణ జరుగుతుంది. వంద రెండొందల మందికి కాదు, లక్షల కోట్ల మంది కోసం రాస్తారు. ఈ గుణాలు, ఈ బాదీలు వలన కవితకి ఈ గీతాలకి బేధం ఉంటుంది. సినిమా పాటలు రాయాలంటే ఒక టెక్నిక్ ఉంటుంది. గొప్ప కవులు కూడా ఈ టెక్నిక్ గురించి తెలియకపోతే సినిమా ప్రపంచంలో గీత రచయితగా నిలదొక్కుకోలేరు. పంత్‌గారు, నరేంద్ర మిశ్ర, గోపాల్ సింఘ్ నేపాలీ, వీరేంద్ర మిశ్ర, సోమ్ ఠాకుర్ రాసారు. కానీ శైలేంద్ర, భరత్ వ్యాస్, ఇందీవర్, నీరజ్‌లు  సఫలీకృతులయ్యారు. పాటలు హిట్ అయ్యాయి. కమర్షియల్ ఆర్ట్. హిందుస్థానీ భాష మీద అధికారం ఉండాలి. సామెతలను వాడే శక్తి ఉండాలి. లేకపోతే వాళ్ళు సక్సెస్ కాలేరు. కవులు సినిమా గీతాలు రాయాలి. దీని వలన భాష ప్రజల భాష నేర్చుకోగలనుగుతారు. యువకవులు తెలుసుకోగలుగుతారు. వివిద ప్రదేశాల సంస్కృతి తెలుస్తుంది. సినిమా గీతాలు మద్రాసు, బెంగాలు, కేరళ, దేశ విదేశాలలో కూడా అందరూ వింటారు. సినిమా గీతాల రచయిత ప్రపంచంలో పేరు తెచ్చుకోగలుగుతాడు. మీ శక్తి, మీ జ్ఞానం, మీ వ్యక్తిత్వం మీద ఆధారపడి ఉంటుంది. మీరు గీతాల రాయడానికి క్రింద స్థాయికి దిగజారుతారో లేకపోతే ఫిల్మ్ డైరెక్టర్లని పై స్థాయికి తీసుకువెళ్తారో. నేను దాదాపు 130 గీతాలు రాసాను. ఇప్పటికి దాదాపు 120 పాటలు ఎంతో పాపులర్ అయ్యాయి. ఇప్పటికి రాయల్టీలు వస్తున్నాయి. ఈ గీతాలలో సాహిత్యం ఉంది. ‘ఫూలోం కే రంగ్ సే, దిల్ కీ కలమ్ సే…’, ‘షోకియోం మే ఘోలా జాయే, ఫూలోం కా షబాబ్…’ లాంటి గీతాల భాష చూడండి. ఎటువంటి మధురమైన భాష. బ్లేడింగ్ చూడండి. ఇందులో రసజ్ఞత ఎంతగా ఉంది. ఫోఖ్, ఫూల్, షబాబ్ పదాలలో ఎటువంటి రసం ఉందంటే మనం మామిడి రసాలు తిన్నట్లుగా తీపిగా ఉంటుంది. ‘దిల్ ఆజ్ షాయర్ హై, గమ్ ఆజ్ న‍గ్‌మా హై…’ నజ్మ్ స్టైల్‍లో ఉంది. ‘కాల్ కా పహియా ఘూమే రే భయ్యా…’, ‘భజన్ జై సే రాధా నే మాలా జపీ శ్యామ్‌ కీ….’లో భారతీయ సంస్కృతి ఉట్టిపడతోంది. కోఠే (వేశ్యావాటిక) లకు సంబంధించిన పాటలు కూడా రాసాను. కాని చాలా మర్యాదగా ఉండేటట్లు రాసాను. ‘మేరీ నజరోం నే కైసే కైసే కామ్ కర్ దియే. మై నే మద్దమ్ చిరాగ్ సారే షామ్ కర్ దియే…’ సెక్స్ సంకేతం ఉంది. ‘రేష్మి ఉజాలా హై, మఖమలీ అంధేరా. ఆజ్ కీ రాత్ ఐసా కుచ్ కరో. హో నహీఁ హో నహీఁ సవేరా’ పాప్ సాంగ్ ఎంతో పాపులర్ అయింది. ‘ప్రేమ్ పూజారి’ టైటిల్ సాంగ్ ‘ప్రేమ్ కే పూజారీ, హమ్ రస్ కా బిఖారీ…’ ఎస్.డి.బర్మన్ ముగ్ధులయ్యారు. వేరే వాళ్ళు రాసిన కేవలం ఎనిమిది పాటలను మాత్రమే పాడారు. వారు ప్రతీ వాళ్ళ గీతాలను పాడేవారు కాదు. నేను ఒక హాస్యం గీతం వారు అడగారు రాసాను. పారడీ- ఒక ప్రత్యేకమైన స్టైల్‌లో… ‘ధీరే సే జుకా ఖటియన్ మే… ఓ ఖట్‌మల్… ధీరే సే జానా..’ ఇది బర్మన్ పాట చాలా పాపులర్ అయిన పాటకు పారడీ.. ‘ధీరేసే జానా బగియన్ మే, ఓ భవరా… ధీరే సే జానా బగియన్ మే…’ ‘సోయా హై రాజకుమారీ, దేఖ్ రహీ హై మీఠే సపనే. జూ…జూ… చిఫ్ జా తకియన్ మే…’ అంతా మజాక్ ఉంది. కాని ఎక్కడా అమర్యాద లేదు. ‘చుప్… చుప్ కే ప్యార్ కరే తూ… బడా ఛుపా రుస్తమ్ హై తూ… లే…లే… హమ్ కో భీ శరణ్ మే… ’ ఒక గర్భవతి బిడ్డ ఆగమనం సమయంలో ఎంతో ఆనందంగా పాడుతుంది – ఒక వేళ ఇది తెలియకపోతే పాట రాయలేము. ఒక్కక్క మాట, వాక్యం వినండి. ‘తేరే మేరే సపనే’లోని పాట ‘జీవన్ కీ బగియా మహకేగీ లహకేగీ, చహుకేగీ… వో తేరా హో గా… థోడా హమారా… థోడా తుమ్హారా… ఆయేగా ఫిర్ సే బచపన్ హమారా… ’ బర్మన్ కళ్ళలో మెరుపు.. పదాల పొదింక… అర్ధం… ఇదీ కళ.

ఒకసారి శంకర్‌ గారు ఆయన ఏర్పరచే ట్యూన్ మీద గీతాన్ని రాయమన్నారు. మీ గీతం సరిగా లేదని అన్నారు. అంతే నేను కాగితాన్ని చింపేసాను. నేను ఎంగిలిని అమ్మను అని కుండ బద్దలుకొట్టినట్లు అన్నాను. ఈ గీతాన్ని మరో సినిమాలో ఉపయోగించుకుంటా అని అన్నారు. నేను ససేమిరా ఒప్పుకోలేదు. ‘కన్యాదాన్’ ప్రొడ్యూసర్ శ్రీ రాజేంద్ర భాటియా ఛాలెంజ్ చేస్తూ అన్నారు. “ఇక మీరు ఆయన బాజాను విరగగొట్టేయండి”. అప్పుడు నేను ఒక పాట రాసాను. ‘లిఖే జో ఖత్ తుఝే వో తేరీ యాద్ మే …’ వినగానే భాటియా “మీకేం కావాలో చెప్పండి? నాకు కారు తాళం చేతులు ఇచ్చేయండి” అని అన్నాను. ఆ క్షణంలోనే నాకు వారు తాళం చేతులు ఇచ్చారు. ‘మేరా నామ్ జోకర్’ ప్లాప్ అయినప్పుడు నాకు షాక్ తగిలింది. అసలు ఈ సినిమా హిట్ అవుతుందని నేను అనుకున్నాను. ‘ప్రేమ్ పూజారీ’ ప్లాప్ అయింది. ‘షర్మిలి’ ‘పహచాన్’ సిల్వర్ జూబ్లీ అయిన సినిమాలు. ‘చందా ఔర్ బిజిలీ’కి ఫిల్మ్ ఫేర్ అవార్డ్ వచ్చింది. ‘మేరా నామ్ జోకర్’ ఫ్లాప్ అయినందువలన రాజ్‌కపూర్ ఆత్మహత్య చేసుకునే స్థితికి వచ్చారు. ఆయన బాగా తాగడం మొదలు పెట్టారు. నా పాటలు హిట్ అయ్యేవి కాని సినిమా ఫ్లాప్ అయ్యాయి. పాటలు హిట్ కావాలన్నా, సినిమాలు ఫ్లాప్ కావాలన్నా నీరజ్ చేత పాటలు రాయించుకోండి అని అందరు అనడం మొదలు పెట్టారు. అక్కడి కవి కన్నా సంగీతకారుడికి ఎక్కువ గౌరవం ఇచ్చేవాళ్ళు. నేను బాధపడేవాడిని. వార్తాపత్రికల వాళ్ళు మ్యూజిక్ హిట్ అనే రాసేవాళ్ళు, కాని పాట హిట్ అని రాసేవాళ్ళు కాదు. ఫిల్మ్‌లలో గీత రచయిత పేరు ఇచ్చేవారు కాదు. సాహిర్ లుధియాన్వీ కవికి కూడా సమానమైన గౌరవం ఇవ్వాలని పట్టుపట్టారు. ఆ తరువాత ఆయన మొదలుపెట్టిన ఉద్యమం వలన సినిమాలో గీత రచయిత పేరు, అడ్వర్‌టైజ్‌మెంట్ రికార్డుల పైన కవి పేరు ఇవ్వడం మొదలు పెట్టారు. నాతో పాటు ఉన్నవాళ్ళు మెల్లి మెల్లిగా అటు ఇటు వెళ్ళిపోయారు. అందువలన నేను అక్కడి నుండి వచ్చేసాను. రోషన్ వెళ్ళిపోయారు. జైకిషన్ చనిపోయాక రాజ్‌కపూర్ గ్రూప్ వాళ్ళు అటు ఇటు వెళ్ళిపోయారు. బర్మన్ జబ్బు పడ్డారు. ‘మేరా నామ్ జోకర్’ ఫ్లాప్ అయినందు వలన ఇక అక్కడ ఉండటం ఎందుకు అని అనుకున్నాను.

నీరజ్ కవితల విమర్శ గురించి తెలుసుకుందామని ఈ విషయం గురించి ప్రశ్నించాను. “కవి సమ్మేళన కవి, శృంగార కవి, వ్యక్తివాది కవి రూపంలోనే చాలా వరకు విమర్శలు వచ్చాయి, మీకెట్లా అనిపిస్తుంది?”

నీరజ్ కొంచెం ఊదాసీనంగా చెప్పడం మొదలు పెట్టారు. ‘నన్ను శృంగార కవి, సమ్మేళన కవి అని విమర్శస్తూ అవమానించారు. నాకు కోపం వచ్చి ఒక గీతం రాసాను-’‘విశ్వచాహే యా న చాహే లోగ్ సమ్‌ఝే యా న సమఝే ఆగయే హైం యహాఁ తో గీతీ గాకర్ హీ ఉఠేంగే… హమ్ జలే హైఁ తో ధరాకో జగ్‌మగాకర్ హీ ఉఠేంగే… (లోకం కోరుకోనీ, కోరుకోకపోనీ, ప్రజలు అర్థం చేసుకోనీ, చేసుకోపోనీ, ఇక్కడికి వచ్చాక గీతాన్ని పాడే లేస్తాను. నేను మండినా ధరణికి వెలుగునిచ్చే లేస్తాను.)

నా పుస్తకాలు దాదాపు 20 సార్లు కొత్త ఎడిషన్స్ వచ్చాయి. కాని చదివే వాళ్ళు తక్కువ. క్షామం, వరదలు, ఆకలి, బీదరికం, నిరుద్యోగం, ఎమర్జెన్సీ, మతకల్లోలాలు – ఏ విషయం మీద రాయలేదని? అన్ని విషయాలపై రాసాను. ‘నీరజ్ కీ పాతీ’ (నీరజ్ లేఖలు) ఇంటర్నేషనల్ సమస్యలు ఉన్నాయి. ఎమర్జెన్సీ సమయంలో రాసాను – “పూలోం కీ ఆంఖోం మే ఆంసూ ఉతరా హై రంగ్ బహరోం కా. లగ్‌తా హై ఆనేవాలా హై ఫిర్ సే మౌసమ్ ఆంగారోంకా. ఆంతరిక్ సురక్షా కే భయ్ సే బుల్ బుల్ నే గానా ఛోడ్‌దియా…” (పూల కళ్ళల్లో నీళ్ళు వచ్చాయి…. వసంత మాసం రంగు మారింది. మళ్ళీ అగ్ని మాసం వస్తుందేమోనని అనిపిస్తోంది. లోపలి రక్షణ కోసం బుల్ బుల్ పిట్ట పాడటమే మానేసింది). ఆ సమయంలో ఇంటిలిజెన్షియా క్లాస్ చేస్తున్న పనిని నేను విమర్సించాను-

“వో ప్రగతీ హుయీ, దేవాలయ్ కీ పూజా మదిరాలయ్ జా పహుంచీ, సూర్యోదయ్ తజ్‌కర్ రాజనీతి తమ్ కే సచివాలయ్ జా పహుంచీ సబ్ పాత్రోం కా స్వరూప్ బదలా యూం ఘమా చక్ కుమ్ హారోంకా” (దేవాలయ పూజ మదిరాలయం చేరింది. ఇదే ప్రగతి రాజనీతి సూర్యోదయాన్ని త్యజించి చీకటి సచివాలయంకి వెళ్ళిపోయింది. కుమ్మరి సారె తిరిగిపోయింది. అన్ని పాత్రల స్వరూపం మారింది). రూపకం, శ్లేషార్థం చూసారుగా… ఏ ఆచ్ఛాదన లేకుండా కూడా చెప్పా- ‘సంసద్ జానేవాలే రాహీ, కహ్‌నా ఇందిరా గాంధీ సే బచ్ న సకేగీ దిల్లీ భీ జయ్ ప్రకాష్‌ కీ ఆంధీ సే’ (సచివాలయం వెళ్ళే బాటసారీ, దిల్లీ కూడా జయ ప్రకాష్ నారాయణ తుఫాను నుండి తనకు తను కాపాడుకోలేదని ఇందిరాగాంధీకి చెప్పు).

‘ఉస్ పర్ జాదూ నహీ చలేగా సత్తాకే దీవానోంకా. అభీ సమయ్ హై శేష్ బచాలో ఖుద్ కో తుమ్ బర్‌బాదీ సే.’ (అధికార వ్యామోహం కల పిచ్చివాళ్ళ గారడీ ఇక ఏ ప్రభావం చూపెట్టలేదు. ఇంకా సమయం ఉంది, తను నాశనం కాకుండా రక్షించుకోడానికి అని చెప్పు)

అప్పుడు ఇది స్లోగన్‌‌గా కూడా పేరు పొందింది. ఇదే విషయం నేను గజల్ రూపంలో కూడా చెప్పాను. “యే తో మాలుమ్ హై ఖామోష్ హై మహుఫిల్ సారీ. పర్ న మాలూమ్ యే ఖామోషీ కహాఁ తక్ పహుంచే. ఇసీ ఉమ్మీద్ పర్ కర్ లీ హై ఆజ్ బంద్ జుబాఁ. కల్‌ కో షాయద్ మేరీ ఆవాజ్ వహాఁ తక్ పహుంచే”. (మహుఫిల్ అంత మౌనం ఉందని అందరికి తెలుసు. కాని ఈ మౌనం ఎక్కడి దాకా వెళ్తుందో ఎవరికి తెలియదు. ఆశ తోటే ఈనాడు నోరు తెరవడం లేదు. రేపు ఎప్పుడో ఒకప్పుడు నా గొంతు అక్కడిదాకా వినిపిస్తుంది.)

కేవలం రాయలేదు. వేదికనెక్కి పాడాను, ఎమర్జెన్సీలో జరిగిన ఒక సంఘటన గురించి చెబుతాను. బనారస్‌లో ఒక కవి సమ్మేళనంలో శ్రీ కమలా పతి త్రిపాఠీ ఉన్నారు. ఆయన ఎమర్జెన్సీకి వ్యతిరేకి. బాహాటంగా అనేవారు కారు. నన్ను పిలవకపోవడం వలన అందరికి కోపం వచ్చింది. తరువాత త్రిపాఠీ గారు పిలిచారు. “పూలోం కీ ఆంఖోంమే ఆంసూ…” కవితను చదవమన్నారు. బెనారస్‌లో ఎక్కవ మంది కవిత లోని అర్థాన్ని తెలుసుకోడానికి వస్తారు. నేను చెప్పిన తీరు వేరుగా ఉంది. ఎవరు పట్టుకోలేకపోయారు. అసలు కవిత మీద ప్రతిబంధం ఉన్నప్పుడే మంచి కవిత జన్మిస్తుంది. వారి పైన ప్రతిబంధం ఉంటేనే కవికి గుర్తింపు వస్తుంది. ఎమర్జెన్సీ పైన కాన్పూర్ కవి రాసిన షేర్ ని విని నేను ఎంతో సంతోషపడ్డాను – “అంధేరోం కో నికాలా జా రహా హై, మగర్ ఘర్ సే ఉజాలా జా రహా హై చుభో జయేంగే తలువోం సే నష్తత్ అభీ కాంటే నికాలా రహా హై” (చీకట్లను పారద్రోలుతున్నారు కాని ఇంట్లోంచి వెలుగులు వెళ్ళి పోతున్నాయి. అరకాళ్ళలో ఆపరేషన్ కత్తితో పొడుస్తున్నారు, ఇప్పుడు ముల్లుని తీస్తున్నారు.) ఉర్దూ వాళ్ళలో ఉన్న ఈ కళని హిందీ వాళ్ళు నేర్చుకోవాలి. కవి కర్మ చాలా కఠినమైనది. అందరు ఇది ఏదో మాములు తేలిక అని అనుకుంటారు. కవిత్వాన్ని సరిగ్గా విమర్శించే వాడే మంచి కవి. తన కవితలని కూడా విమర్శించగలగాలి.

ఇది వరకు ప్రజలు కవితను ఏ విధంగా వినే వాళ్ళు, దాని మీద తమ స్పందనని ఏ విధంగా వ్యక్తం చేసే వాళ్ళో ఒక ఉదాహరణని చెబుతాను. టెన్సింగ్ ఏడుసార్లు విఫలుడై తరువాత ఎవరెస్ట్ పైన మొదటిసారి కాలు పెట్టాడు. అప్పుడు నేను ఒక కవితని రాసాను.

ఖండ్‌వాలో మఖన్‌లాల్ చతుర్వేదీ గారి అధ్యక్షతన ఒక కవి సమ్మేళనం జరిగింది. అప్పుడు నేను కవితని చదివాను. మొదటి చరణం – “ఆఖిర్ ముఠ్ భర్ ధూల్ పహుంచ్ హీగయీ వహాఁ. జా సకే న పాఁవ్ జహాఁ ఇతిహాస్ పురాణోంకే. ఆఖిర్ ధరతీ కే లేటే నే సుంథ్ హీ దియే, బర్‍ఫీలే బాల్ పహాడోం కే చెట్టానోం కే పర్ ఠహర్ గర్వ్ కా ముకుట్ న పహనా గౌరవ్‌ కో బస్ యహీఁ, యహీఁ తేరే గిర్‌జానే కా భయ్ హై. కర్ సకా న ప్రాప్త్ విజయ్ ఖుద్ పర్ హీ తో తేరీ యే ప్రకృతి విజయ్ రే, సబ్ సే బడీ పరాజయ్ హై.” (చివరకి ఒక పిడికెడు దుమ్ము చరిత్ర, పురాణాల చరణాలు కూడా వెళ్ళలేని చోటికి చేరింది, చివరికి భూమిపుత్రుడు కొండల పర్వతాల మంచు జుట్టును ముడివేసాడు. కాని ఆగు… ఈ గౌరవానికి గర్వపు కిరీటాన్ని పెట్టకు. ఇక్కడే ఇక్కడే నీవు పడిపోతావేమోనన్న భయం. నీ మీద నువ్వు విజయం పొందకపోతే నీ ఈ ప్రకృతి విజయం పరాజయమే.) మఖన్‌లాల్ గారు ఈ విధంగా చెప్పడం మొదలు పెట్టారు. “కవితలో వాడిన మొదటి శబ్దం బంగారమే. కాని కవితని ఏ విధంగా ముగించారంటే ఈ కవిత పరుసవేది అయింది. ఇందులో మొదటి శబ్దం, చివరి శబ్దంలో ఉన్న ప్రత్యేకత ఏమిటి? ఇందులో వెనకటి ఏడు అసఫలతల కథ దాగి ఉంది. ఇప్పుడు ఒక్కొక్క శబ్దానికి ఈ విధంగా అర్ధాన్ని విప్పి చెప్పి వ్యాఖ్య చేసే వాళ్ళు ఎంత మంది ఉన్నారు? చంద్రుడి మీద మనిషి కాలు పెట్టినప్పుడు నేను ఒక కవిత రాసాను. – నాలుగు పంక్తులలో ఉన్న ఈ అద్భుత సౌందర్యాన్ని చూడండి – “అమృత్ మంథన్ కీ బాత్ సునీ హీ థీ కేవల్, లేకిన్ ఆంఖోంసే అబ్ నభ్ – మంథన్ దేఖ్ లియా ఓ ధన్య్ మనుష్య్ కే సాహస్, లఖ్ సితారోం మే జా జలాదియా తు నే మిట్టీ కా ఏక్ దియా” (అమృత మంథనం గురించి కేవలం విన్నాం, కాని ఇప్పుడు నభోమంథనాన్ని కళ్ళారా చూసాం. మనిషి సాహసమా! నీవు ధన్యురాలివి. లక్షల నక్షత్రాలలో నీవు ఒక మట్టి ప్రమిదను

వెలిగించావు.) ప్రగతిశీల కవితల పేరు మీద అడ్డదిడ్డంగా కవితలు రాస్తున్నారు. నా దృష్టిలో మనిషి కన్నా మరో సత్యం లేదు. అతడి సాహసం ముందు తక్కినదంతా దిగదుడుపే. సాహసం ముందు ఏదీ అసంభవం కాదు. భాష పైన అధికారం ఉంటే చెప్పే దానిని ఎంతో బాగా చెప్పవచ్చు.

ఉగ్ర, ఉద్దండ రాజకీయ శక్తులను సమర్థించేవారిని ఏ విధంగా దెబ్బ కొట్టవచ్చో చూడండి. “అబ్ ఉజాలోం కో యహాఁ వనవాస్ హీ లేనా పడేగా. సూర్యకే బేటే అంధేరోం కో సమర్థన్ కర్ రహే హైం. – థా సునా హమ్ నే కి జిన్‌కే ఖాంస్‌నే భర్ సే, జాగ్‌తీ థీ కిస్మత్ సోయే జమానోం కీ ఔర్ జిన్‌కే క్రోధ్ కీ చింగారియాఁ ఛూకర్, టూట్ జాతీ థీ సలాఖౌం జేల్‌ఖానోం కీ ఆజ్ వే హీ లోగ్ పర్ కే లోభ్ లాలచ్ మే దేష్ కీ నిర్మమ్ లుటేరోం కా సమర్ధన్ కర్ రహే హైం” (ఇక ఇప్పుడు వెలుగులు వనవాసమే చేయాల్సి వస్తుంది. సూర్యపుత్రులు చీకట్ల పక్షం వైపు నిలిచారు. ఎవరైతే దగ్గగానే నిద్రపోతున్న ప్రపంచపు భాగ్యరేఖలో చైతన్యం వస్తుందని, ఎవరి క్రోధపు నిప్పు కణికలను స్పర్శించగానే జైళ్ళ ఊచలు తెగిపోతాయని విన్నామో, ఇవాళ వాళ్ళు పదవీ వ్యామోహంతో, దేశాన్ని దోచుకునే దయలేని దోపిడీదారులను సమక్థిస్తున్నారు.) ఇటువంటి కవితలు, ఇంకా వేరే విషయాలపై రాసిన కవిని కేవలం ఒక శృంగార, వ్యక్తి వాద, మంచ్ కవి (స్టేజ్ పోయట్)గా ముద్ర వేస్తే ఎట్లా ఉంటుంది? ఇది సమంజసమైనదేనా?

నీరజ్ గారు ఇంటి బయట చెట్టుకింది నిల్చుని కూలి వాళ్ళకు పని చెబుతున్నారు. అక్కడ రాజ్ ఉన్నాడు. నేను రావడం చూసి కర్ర సహాయంతో గబగబా నడుచుకుంటూ లోపలికి వచ్చేసారు.

“చూడండి ఎంత వేడిగా ఉందో! కరెంటు సరిగా లేదు. ఇవాళ కూర్చోలేను.” వరండాలో ఉన్న బల్ల దగ్గరకు వచ్చి స్విచ్ ఆన్ చేసారు. “ఫాన్ స్పీడ్ చూసారా? వోల్టేజ్ ఎంత తక్కువగా ఉంది, రండి లోపల కూర్చుందాం.” “అబ్బ ఎంత ఉక్కపోతగా ఉంది కూర్చోండి. నిన్న జెనరేటల్ రిపేర్ అయింది. దాని సహాయంతోనే అంతా నడుస్తోంది.” పనివాడు సింగ్-సింగ్ రాజ్‌తో కలిసి వచ్చాడు. మాన్‌హోల్ దగ్గర లెవలింగ్ ఎట్లా చేయాలో, ఎల్బో ఎట్లా పెట్టాలో మాట్లాడారు. బయటకి వెళ్ళారు. మళ్ళీ లోపలికి వచ్చారు. తరువాత మాట్లాడటం మొదలు పెట్టారు.

నీరజ్ ధర్మసమాజ్ కాలేజీ అలీగఢ్‌లో హిందీ విభాగంలో 1956 నుండి 1970 వరకు పని చేసారు. పని చేసే సమయంలో ఉద్యోగం వదిలేసాక ఆయన గురించి రకరకాలుగా మాట్లాడుకునేవారు. ఈ విషయం గురించి నేను అడిగినప్పుడు తడుముకోకుండా ఏ సంకోచం లేకుండా చెప్పడం మొదలు పెట్టారు. “ఆ రోజుల్లో నాకు చాలాసార్లు బయటకి వెళ్ళాల్సి వచ్చేది. నేను రెండు సంవత్సరాలు సెలవు తీసుకుని బొంబాయి వెళ్ళాను. విభాగంలో ఒక లెక్చరర్ భవిష్యత్తులో అధ్యక్షుడు కావాలన్న ఉద్దేశ్యంతో లోభత్వంతో కాసులతో విద్యార్థులతో కొంత అల్లర్లు కొనసాగించాడు. అప్పటి ప్రిన్సిపాల్, అధ్యక్షుడి సమర్ధన ఆయనకు లభించింది. ఒకసారి నేను బొంబాయి వెళ్ళినప్పుడు నా టికెట్ వివరాలు తెలుసుకోడానికి ప్రయత్నించారు. అదే సమయంలో నేను బదాయూంలో జరిగిన సమ్మేళనంలో పాల్గొని వెనక్కి వస్తున్నాను. కారులో కాకా హధరసీ కాకుండా ఇద్దరు ముగ్గురు కవులు కూడా ఉన్నారు. నేను కారుని నడుపుతున్నాను. రాత్రంతా మేల్కోని ఉన్నాము. కఛలా వచ్చి కాసేపు విశ్రాంతి తీసుకున్నాము. నాకు నిద్ర మత్తుగా అనిపించింది. కాకా ‘నీకు నిద్రవస్తోంది కారుని దేనికైనా కొట్టేవు. ఇక్కడే ఆగిపోదాం. విశ్రాంతి తీసుకుందాం’ అని అన్నారు. నేను కాలేజీకి వెళ్ళాలి తప్పదు అని చెప్పాను. నీవు ఈ ఉద్యోగంలో ఎందుకు ఇరుక్కుపోయావు? ఎందుకు వదిలివేయవు. ఈ సమ్మేళనంలో కూడా 500 రూపాయలు ఇచ్చారు. ఇక ఉద్యోగం వదిలి వేయాలని అప్పుడే నిర్ణయం తీసుకున్నాను. ఎవరు రిజైన్ ఇవ్వమని చెప్పలేదు. అప్పుడు కొంత బాధపడ్డాను. కాని ఇప్పుడు ఆలోచిస్తే భగవంతుడు ఎంతో సహాయం చేసాడు అని అనిపిస్తుంది. ఆ తరువాత బొంబాయి వెళ్ళి చాలా పాటలు రాసాను. దేశం అంతా తిరిగాను. మంచి పేరు తెచ్చుకున్నాను. కీర్తి నా జాతకంలో ఉంది. కాని మెల్లి మెల్లిగా లభిస్తుంది. కాని చాలా పైకి పోతాను. అటల్ గారి లాగా. మా ఇద్దరి జాతకాలు చాలా వరకు ఒకటిగా ఉన్నాయి. ఆయన ప్రధానమంత్రి అయ్యారు. కాని ఇద్దరం పేరు ప్రఖ్యతలు కలవాళ్ళం. బాగా మాట్లాడగలం. కాళ్ళరోగం, స్త్రీ ప్రియులం… గుణాలు రోగాలు సమానంగా ఉన్నాయి.”

నేను విన్న విటిని బట్టి అసలు మీరు రిజైన్ చేయడానికి కారణం స్టూడెంట్సా అని అడిగాను.

నీరజ్ గారు ఆ చేదు జ్ఞాపకాల నేలమాళిగలోకి మెట్టు మెట్టు దిగడం మొదలుపెట్టారు. “నేను మొదటి నుండి ఎన్నో కష్టాలు పడ్డాను. ఇక్కడ ఆడపిల్లల గొడవ ఎంత మాత్రం లేదు. అదంతా మేరఠ్‍లో. 1955లో మేరఠ్ కాలేజీలో చేరాను. కమిటీలోని ఓ మెంబరు కూతురికి ఆ ఉద్యోగం ఇవ్వాలని వాళ్ళు అనుకున్నారు. ఆ సంవత్సరం ఆమెకు పి.హెచ్.డి కూడా అయిపోయింది. ఒక సంవత్సరం నేను ఉద్యోగం చేసాను. పర్మనెంట్ కావాలంటే రెండోసారి మళ్ళీ ఇంటర్‌వ్యూ ఇవ్వాల్సి వచ్చింది. అక్కడ విద్యార్థినులకు నా పట్ల ఆకర్షణ ఎక్కువ. ఇక నా మీద అన్నీ ఇన్నీ వదంతులు కావు. పిర్యాదులు, రిపోర్టులు… అపాయింట్‌మెంట్ విషయంలో కమెటీలో చీలికలయ్యాయి. చివరికి తర్జన భర్జనలు అయ్యాక నన్నే మళ్ళీ తీసుకున్నారు. ప్రిన్సిపాల్ నాకు లెటర్ ఇచ్చేటప్పుడు నేను ఇట్లు అన్నాను “మీరు నా పైన ఎంతో దయ చూపెట్టారు. లంచాలు తీసుకున్నాని, రేప్ లాంటి చార్జ్‌లు పెట్టలేదు. ఇక ఇప్పుడు ఇక్కడ ఉద్యోగం చేస్తే మీరు ఇంకా ఏం ఏం చార్జీలు పెడతారో ఎవరికి తెలుసు? మీకు పెట్టాల్సి వస్తుంది. ఇక నేను ఉద్యోగం చేయను. నేను ఆయన ఎదురుకుండానే అపాంయింట్‌మెంట్ లెటర్‌ని చింపి పడేసాను. ఆయన చాలా సేపు నన్ను ఒప్పించడానకి ప్రయత్నం చేసారు. కాని వచ్చేసాను. ఆ సమయంలో ధర్మసమాజ్ కాలేజీ ప్రిన్సిపాల్ ఎ.జి ఝింగరన్ సాహెబ్‌తో నేను మాట్లాడాను. ఆయన ఎంతో సంతోషంగా నాకు ఉద్యోగం ఇచ్చారు. వాళ్ళందరు మంచి వాళ్ళు, ప్రతిభను గుర్తించగలిగేవారు.

మేరఠ్ ముందు కూడా కొన్ని సంఘటనలు జరిగాయి. 1953, 1955 మధ్య రెండు సంవత్సరాలు నిరుద్యోగిగా ఉన్నాను. నిజానికి ఆ సమయంలోనే నాకు చాలా పేరు వచ్చింది. ఇదంతా భగవంతుడి దయ. అంతకు ముందు నేను డిస్ట్రిక్ట్ ఇన్‌ఫర్‌మేషన్  ఆఫీసర్‌గా పనిచేసేవాడిని. కాని లెక్చరర్ ఉద్యోగం నాకు ఎంతో ఇష్టం. నేను ఎం.ఎ. ఫస్ట్ క్లాసులో పాస్ అయ్యాను. డి.ఎ.వి. కాలేజీ స్టూడెంట్‌ని, అందులోనే ఒక ఫోస్ట్ ఖాళీ ఉంది. నేను ప్రిన్సిపాల్‌ని, చందూ బాబుని కలిసాను. “నీకు కాక ఎవరికి ఇస్తాం ఈ ఉద్యోగం” అని అన్నారు. కాని టైమ్ వచ్చేసరికి ముఖాలు చాటేసారు. మాటి మాటికి ఆయన దగ్గరికి పోతే ఈయన దగ్గరికి ఈయన దగ్గిరికి పోతే ఆయనని కలవమని చెప్పేవాళ్ళు. నాకు విసుగు వచ్చి ఎందుకిట్లా చేస్తున్నారని అడిగాను. అప్పుడు ప్రిన్సిపాల్ ఇట్లు అన్నారు – “నాకు వి.సి. అయ్యే ఛాన్స్ ఉంది. సి.ఎమ్. ఒక కాండిడేట్‌ని రికమెండ్ చేసారు”. చందు బాబు ఇట్లు అన్నారు – “నేను ఎమ్.ఎల్.సి. కావాలి, సంపూర్ణానంద్ మాట ఎట్లా కాదనగలను?” ఇక నా పరిస్థితి! వాళ్ళ మాట ప్రకారం నేను జిల్లా సూచనా అధికారి పదవికి రాజీనామా ఇచ్చాను. ఆ రాజీనామా విషయంలో మరో కథ నడిచింది. నన్ను అపాంయిట్ చేసినప్పుడు కమలాపతి త్రిపాఠీ ఛైర్మన్‌గా ఉన్నారు. నేనంటే వారికి ఎంతో ఇష్టం. నేను ఎమ్.ఎలో జాయిన్ అయ్యానని చెప్పాను. మా పదాధికారికి ఆ రోజుల్లో ఒక పికప్ దొరికేది. దాని లాగ్ బుక్ నింపే విషయంలో డి.ఎమ్‌.కి నాకు మధ్య వివాదం జరిగింది. ఆయన వేరే వాళ్ళకి పికప్ చూపెట్టి లాగ్ బుక్ మాతో నింపించాలని చూసారు. ఇట్లాంటి తప్పుడు పని చేయడానికి నేను ఒప్పుకోలేదు. ఆయన ‘యు.ఆర్ నాట్ బిహెవింగ్ లైక్ ఎ ఆఫీసర్’ అని అన్నారు. ‘సర్! నేను ఆఫీసర్‌నా! నేను సర్వెంట్‌ను’ అని నేనన్నాను. ఆయనకి కోపం వచ్చింది. కాలేజి నుండి అటెండెన్స్ తెప్పించారు. నన్ను సస్పెండ్ చేసారు. 45 రోజులలో సమాధానం ఇవ్వాలని అన్నారు. అప్పుడే పరీక్షలు వచ్చాయి. పోనీలే పరీక్షలకు బాగా ప్రిపేర్ కావచ్చని అనుకున్నాను. పరీక్షలయ్యాక నేను త్రిపాఠీ గారిని కలిసాను. అప్పుడు ఆయన ఇన్‌ఫర్‌మేషన్ మినిస్టర్‌గా ఉంటేవారు. కాలేజీకి వెళ్ళకుండానే నా అటెండెన్స్ విషయం గురించి అడిగారు. ప్రతీ మీటింగ్‌కి నేను వచ్చినట్లుగా డి.ఎమ్. ఇంకా తక్కిన వాళ్ళ సంతకాలు ఉన్నాయి. ఆయన చిరునవ్వు నవ్వుతూ అప్లికేషన్ మీద అక్కడ కాదు ఆగ్రాకి వెళ్ళు అని రాసారు. అక్కడికి వెళ్ళాను. అక్కడ డి.ఎమ్.కి ముందే నా గురించి సూచనలు వెళ్లాయని తెలిసింది. ఒక ఐ.ఏ.ఎస్, ఎస్.డి.ఎమ్ ద్వారా సస్పెండ్ అయినా తరువాత కూడా నాకు అక్కడ ఉద్యోగం దొరికింది. సెలవులు అక్కడ కూడా తీసుకోవాల్సిన పరిస్థితే. ఎప్పుటికీ ఇక సెలవు తీసుకో అని డి.ఎమ్ అన్నారు. నేను సరే అని అన్నాను. రిజైన్ చేస్తానని త్రిపాఠికి చెప్పాను. ఆయన సెక్రెటేరియట్‌లో తీసుకుంటానని చెప్పారు. ‘సాహెబ్! జిల్లాలో ఒక ఆఫీసర్ ఉంటే నా పరిస్థితి ఇట్లా ఉంటే ఇక అక్కడ చాలా మంది ఆఫీసర్లు ఉంటారు. మరి పరిస్థితి ఎట్లా ఉంటుంది? ఇక ఇప్పుడు నేను ఉద్యోగానికి రాజీనామా చేస్తున్నాను అని చెప్పి ఇచ్చాను. నాకు డి.ఎ.వి. కాలేజీ పైన ఎంతో నమ్మకం ఉంది. ఇహ ఈతి బాధలు తప్పవు. ఇల్లు గడవాలి. చాలా బాధపడ్డాను. ఇక ఏ పని అయినా సరే చేద్దాం అని అనుకున్నాను. ఒక ఫాక్టరీలో అడిగితే వయస్సు తక్కువ ఉంది అన్నారు. మరో చోటికి వెళ్తే ఇంత క్వాలిఫైడ్ వాళ్ళకి ఇక్కడ ఉద్యోగం ఇవ్వలేము అని అన్నారు. ఇట్లా ఎక్కడికి పోయినా చుక్కెదురు. అంతకు ముందు నేను కచేరీలో టైపిస్ట్‌గా పనిచేసాను. గోధుమలు, నెయ్యి, నూనె అంతా చౌకగా ఉడేవి. తరువాత అరవై రూపాయలయ్యాయి. ఆ ఉన్నదాంట్లోనే ఇల్లు నడిపాను.”

ఈ ఉద్యోగాలు చేయడం, మానేయడం చూస్తుంటే అసలు మీలో టీచరుగా పని చేయాలన్న కోరిక లేదు అని తెలుస్తోంది. మీరు పి.హెచ్.డి చేయాలని అనుకున్నారు. మీ లెటర్‌పాడ్ మీద ఇచ్చిన వివరాలు, ముఖ్యంగా డి.లిట్‌ని (గౌరవ)  చూస్తుంటే అయ్యో లెక్చరర్‌గా ఉంటే బాగుండేది అని మీరనుకుంటున్నారు కదూ! లెక్చరర్‌గా పని చేసి ఉంటే మీ సాహిత్యం పైన విమర్శల విలువ వేరుగా ఉండేదికదా?

ఉద్యోగం చేసి ఉంటే పెన్షన్ వచ్చేది. జీవితాంతం ఆర్థికంగా అంతగా ఇబ్బంది ఉండదు. కాని ఇప్పుడు నేనేమీ బాధపడను. నిజానికి ఇప్పుడు ఈ వృత్తికి అంతగా గౌరవం లేదు. ఆగ్రా విశ్వవిద్యాలయం వారు గౌరవ డి.లిట్ ఇచ్చారు. లెటర్‌పాడ్ మీద దీనిని ఎందుకు పెట్టుకున్నానంటే పద్మశ్రీ వచ్చినప్పుడు కూడా నేను ఇంత ఆనందం పొందలేదు. పద్మశ్రీ మీ వ్యక్తిత్వానికి అని రాస్తారు. డి.లిట్ మీ ఎకడమిక్ యోగ్యతను సన్మానిస్తూ అని రాస్తారు. ఏ యూనివర్శిటిలో నేను చదువుకున్నానో వాళ్ళు నా ఎకడమిక్ యోగ్యతను గుర్తించారు. స్వీకరించారు. నన్ను సన్మానం చేసారు. కైఫీ ఆజ్మీకి నాకు ఇద్దరికీ ఒకేసారి ఇచ్చారు. ‘యశ్ భారతి’ కూడా మేం ఇద్దరం కలిసే తీసుకున్నాం. వారిధి, వాచస్పతి, రత్న ఇట్లాంటి ఎన్నో అవార్డులు లభించాయి. కాని ఆ ఆనందం రాలేదు. కాని ఇప్పుడు ఇవన్నీ బరువుగా అనిపిస్తున్నాయి. ‘ఎంత తక్కువ సామాను ఉంటే’ ఆయన చెబుతున్నవి వింటూ ఆ గదిలో ఉన్న షీల్డ్స్, మెమెంటోస్. ప్రశంసాపత్రాలు, ఫోటోల మీద ఉన్న ధూళి దుమ్మును చూస్తూ కూర్చున్నాను. కొన్ని సామాన్లు అటు ఇటు పడి ఉన్నాయి.

(ఇంకా ఉంది)

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here