Site icon Sanchika

కావ్య పరిమళం-1

[box type=’note’ fontsize=’16’] సాహిత్య విశిష్టతలోనూ, కథాకథన శిల్పంలోనూ, పద్య రచనా చమత్కృతిలోనూ, శైలి విన్యాసంలోనూ మధురాలైన ప్రాచీన కావ్యాల పరిమళాలను అందిస్తున్నారు డా. రేవూరు అనంతపద్మనాభరావు. [/box]

శ్రీనాథుని శృంగార నైషధం

[dropcap]వే[/dropcap]యి సంవత్సరాల తెలుగు సాహిత్యంలో భారత భాగవత రామాయణాది అనేక పురాణాలు, వీర విలాసాది కవ్యాలు, మనుచరిత్రాది ప్రబంధాలు వెలశాయి. ప్రాచీన సాహిత్యం పట్ల మక్కువ వున్న చాలామంది పాఠకులకు ప్రాచీన కావ్య పరిచయం వుండి వారి స్మృతిపథంలో అవి మెదలుతూ వుంటాయి. అటు సాహిత్య విశిష్టతలోనూ, కథాకథన శిల్పంలోనూ, పద్య రచనా చమత్కృతి లోనూ, శైలి విన్యాసంలోనూ అవి ఆ పాత మధురాలు. నా శక్తి కొలది సాధారణ పాఠకులు ఆ మధురిమలను, పరిమళాలను పరిచయం చేసే ప్రయత్నం ‘సంచిక’ ద్వారా చేస్తున్నాను.

14వ శతాబ్దిని ఆంధ్ర సాహిత్య చరిత్రలో శ్రీనాథ యుగంగా ఆచార్య పింగళి లక్ష్మీకాంతం విశ్లేషించారు. క్రీ.శ.1380-1470 మధ్య కాలం నాటి శ్రీనాథ కవి సార్వభౌముడు రెడ్డి రాజుల కొలువులో ఆస్థానకవిగా వెలిగాడు. పెద కోమటి వేమారెడ్ది కాలంలో విద్యాధికారి. ప్రౌఢ దేవరాయల ఆస్థానంలో వాగ్వాదానికి దిగి డిండిమ పండితుడిని ఓడించి కంచుఢక్కను పగలగొట్టించాడు. దేశాటనం సాగించాడు. ఒడ్డె రాజుల కాలంలో బాధలు అనుభవించాడు. ‘అరుగుచున్నాడు శ్రీనాథు డమరపురికి’ అని ఢంకా బజాయించి చెప్పాడు.

శ్రీనాథుని రచనలు:

శ్రీనాథుడు 12 రచనలు చేశాడు. “చిన్నారి పొన్నారి చిరుత కూకటి నాడు రచియించితిని మరత్తరాట్ చరిత్ర” అనే కాశీ ఖండ అవతారిక పద్యం ద్వారా ఆయన రచనలు కొన్ని తెలిసాయి. మరుత్తరాట్చరిత్ర, శాలివాహన సప్తశతి, శృంగార నైషధము, భీమ ఖండము, కాశీ ఖండము, పండితారాధ్య చరిత్రము, హర విలాసము, క్రీడాభిరామము, శివరాత్రి మాహాత్యము, పల్నాటి వీరచరిత్రము మొదలైనవి ఆయన రచనలు. రచనాకాలం గూర్చి కొన్ని వాదోపవాదాలున్నాయి.

హర్ష నైషధం అనువాదం“సంతరించితి నిండు జవ్వనంబునయందు హర్షనైషధకావ్య మాంధ్రభాషఁ” అని చెప్పడం వల్ల హర్ష నైషధానికి తెలుగు అనువాదం యవ్వనప్రాయంలో జరిగింది. 8 అశ్వాసాల పద్య కావ్యమది. “నైషధం విద్వదేహధం” అనే నానుడి ప్రచారంలో వుంది. దానిని ‘శృంగార నైషధము’గా శ్రీనాథుడు మలచాడు. నలదమయంతుల శృంగారం ఇందులో ప్రస్తావించబడింది. మామిడి సింగనకు అంకితం.

“తెనుగుసేతయెగాక నీవు చేసినది ఏది శ్రీనాథ చెప్పికోగ” అని ఒక వ్యంగ్యోక్తి కూడా వుంది. క్లిష్టమైన నారికేళపాకంలో వుండే హర్ష నైషధాన్ని అనువదించడాన్ని కొందరు హర్షించలేదు గాబోలు, కృతిభర్తయైన మామిడి సింగన చేత ఈ మాటలు పలికించాడు శ్రీనాథుడు అవతారికలో –

చం.
పనివడి నారికేళఫల పాకమునం జవియైన భట్టహ
ర్షుని కవితానుగుంభములు సోమరిపోతులు కొందరయ్య లౌ
నని కొనియాడనేర; రది అట్టిద; లేజవరాలు చెక్కు గీ
టిన వసవల్చు బాలకుడు డెందమునన్ కలగంగ నేర్చునే!

అంటే దాని అర్థం – యవ్వనవతి ఒక బాలుణ్ణి చెక్కు గీటితే వాడికి అందులో శృంగారం తెలియనట్లే తన నైషధానువాదం మిడిమిడి జ్ఞానం గల పండితులు హర్షించరు.

అనువాద పద్ధతి:

శృంగార నైషధంలోని కవితా నైపుణ్యాన్ని శ్రీనాథుడు ప్రస్తావించాడు.

శబ్దంబు ననుసరించియు, అభిప్రాయంబు గుర్తించి, భావంబు ఉపలక్షించి, అలంకారంబు భూషించి, అనౌచిత్యంబు పరిహరించి, ఔచిత్యంబు ఆదరించి, రసంబు పోషించి – అనువాదం చేస్తానన్నాడు. ఈ వివరాలను ద్వానాశాస్త్రి గారు తమ తెలుగు సాహిత్య చరిత్రలో వివరించారు. 1300 గద్యపద్యాలలో ఈ కావ్యం నడిచింది.

ఆంధ్రప్రదేశ్ సాహిత్య అకాడెమీ వారు 1967లో ప్రాచీన ప్రబంధాల ప్రచురణలో భాగంగా 1967లో వేదం వెంకటరాయశాస్త్రి (మనుమలు) సంపాదకులుగా చౌకధరలకు (రూ.ఒకటిన్నర) ప్రచురించారు. షట్చక్రవర్తులలో ఒకడైన నలుని గాథ ఇందులో ప్రధానం. అరణ్యపర్వము ద్వితీయాశ్వాసంలో ధర్మరాజునకు బృహదశ్వుడు నలోపాఖ్యానం వివరంగా చెప్పాడు. అందులో నలదమయంతుల వివాహము, వారు అడవికి వెళ్ళుత్ట, కర్కోటకునిచే నలుగు దష్టుడు గావడం, దమయంతిని ఎడబాయడం, కలిచేత విముక్తుడై విదర్భకు వెళ్ళడం, దమయంతి ద్వితీయ స్వయంవర ప్రకటన, నలదమయంతుల సమాగమం వర్ణించబడ్డాయి. ఆంధ్ర మహాభారతంలోని ఈ పద్యం పలువురికి కంఠతా వచ్చు.

చం.
నలదమయంతు లిద్దఱు మనఃప్రభవానల బాధ్యమానులై
సలిపిరి దీర్ఘవాసర నిశల్‌ విలసన్నవనందనంబులన్‌
నలినదళంబులన్‌ మృదుమృణాళములన్‌ ఘనసారపాంసులం
దలిరుల శయ్యలన్‌ సలిలధారలఁ జందనచారుచర్చలన్‌.
(ఆంధ్ర భారత. అరణ్య 2 -24)

ఎమెస్కో సంప్రదాయ సాహితి 2009లో విశ్వనాథ సత్యనారాయణ కమనీయ పీఠికతో మరో ముద్రణ వచ్చింది. విశ్వనాథ తనదైన శైలితో శ్రీనాథుని కావ్య పరిమళాలను వెదజల్లారు. ఈ హార్షనైషధ అనువాదం శ్రీనాథుడు చేయడం తెలుగువారి అదృష్టమన్నారు. “నల చరిత్రలో సాహిత్య లక్షణ మెక్కువ యున్నది. గడుసు తన మెక్కువ యున్నది… స్త్రీ పురుషులిద్దరి మధ్య ప్రేమ యెక్కువై వివహాము దూరమైన్ ఒకరి కొకరు బాధపడుట జరిగినది. స్త్రీ పురుల మధ్య కొంత రాయబారము జరిగినది… రాయబారము నడిపినది హంస. అది వట్టి హంస కాదు. శివుని యొక్క అవతారమైన హంస. స్త్రీ పురుషుల మధ్య పరమేశ్వరుడు రాయబారము చేసినచో ఆ నాయికా నాయకులెట్టివారు? ఇది ఆశ్చర్యము.” – ఇలా విశ్వనాథ విశ్లేషణ సాగినది.

కథా సంవిధానము:

శ్రీహర్షుని నైషధంలో కథ నలదమయంతుల వివాహంతో పూర్తి అవుతుంది. ద్వితీయ భాగంలొ వారి కష్టనష్టాలు సంస్కృత భారతంలో ఉన్నాయి. శ్రీనాథుడు శ్రీహర్షుని అనువదించాడు కాబట్టి ద్వితీయ భాగాన్ని స్పృశించలేదు. అంతే ఆధునిక చలన చిత్రాలతో పోలిస్తే ‘ఇంటర్వెల్’ వరకే కథ సాగింది. ‘సెకండ్ హాఫ్’ లేదు. ఇందులో హంసదూత్యం అద్భుత కల్పన. కథాగమనం ఇలా కొనసాగింది.

నిషధ దేశాధీశుడైన నలమహారాజు తన రాజ్యాన్ని సుభిక్షంగా పరిపాలిస్తూ దానధర్మాలు చేస్తున్నాడు. అతని కీర్తి ప్రతాపాలు నలుదిశలా ప్రసరించాయి. స్వర్గ, మర్త్య, పాతాళాది లోకాలలోని స్త్రీలు అతని అందానికి పరవశులయ్యారు. అతనిని భీమరాజ పుత్రి యైన దమయంతి మోహించింది. రోజు రోజుకు అతని పట్ల అనురక్తి పెంచుకొంది. అదే విధంగా నలుడు కూడా దమయంతి పట్ల ఆసక్తిని చూపాడు. పరస్పరం అనురాగభరితులయ్యారు. ఒకనాడు నలుడు విహారం కోసం తన ఉపవనానికి వెళ్ళాడు. మలయ మారుతం వీస్తోంది. అక్కడ ఒక తటాక తీర ప్రదేశంలో బంగరు రెక్కలు గల ఒక రాజహంసను నలుడు గమనించాడు. క్రమంగా దానిని తన రెండు చేతులతో పట్టుకొన్నాడు.

ఆ హంస మాటకారి. మృదువుగా మాట్లాడుతూ నలుని మనసును చూరగొంది. ‘చెరుప దలంతురే ఘనులు చిత్తమునన్ పగవారి నేనియున్’ – అని ప్రాధేయపడింది. తన ముదుసలి తల్లి బాధ పడుతుందనీ, తనను విడిచిపెట్టమని మొదలిడింది. దయార్ద్ర హృదయుడైన నలుడు ఆ హంస కన్నీటికి కరిగిపోయాడు. దానిని స్వేచ్ఛగా వదిలివేశాడు. ఆ హంస కృతజ్ఞతాపూర్వకంగా దమయంతీ సౌందర్యాన్ని నలునికి వర్ణించింది.

మీ ఇద్దరికి వివాహం జరిగేలా చూస్తానని మాట ఇచ్చింది. నలుడు తన విరహ బాధను తెలుపుతూ దమయంతి వద్దకు హంసను దూతగా వెళ్ళమని అర్థించాడు.

హంస కుండినపురం చేరుకుంది. అక్కడ దమయంతి దానిని పట్తుకునే పట్టుకొనే ప్రయత్నం చేసింది. అప్పుడు మనుష్య వాకులతో హంస నలుని గుణగణాలని ప్రశంసించింది. మీ ఇద్దరికీ జత కలుస్తుందని జోస్యం చెప్పింది:

చం.
“అడిగితి నొక్కనాడు, కమలాసను తేరికి వాహనంబ నై
నడచుచు, ‘ఉర్విలో నిషధ నాధున కెవ్వతె యొక్కొ భార్యయ
య్యెడు’నని, చక్ర ఘోషమున నించుక యించుక గాని, యంత యే
ర్పడ విననైతి నీవనును పల్కిన చందము తోచె మానినీ!”

అని పలికింది. తన రాయబారం ఫలించింది. దమయంతి విరహతప్త అయింది.

దమయంతీ స్వయంవరాన్ని ప్రకటించారు. నారదుడు ఈ వార్తను ఇంద్రుడికి తెలియజేశాడు. ఇంద్రాదులు స్వయంవరానికి బయలుదేరారు. మార్గమధ్యంలో నలుని చూశారు. యముడు, వరుణుడు, అగ్ని, ఇంద్రుడు – నలునితో దమయంతి వద్దకు దూతగా వెళ్లమని అర్థించారు. అడిగిన అర్థులకు కాదనజాలని ఆ నలుడు మాయా రూపంలో దమయంతి మందిరానికి వెళ్ళాడు.

అంతకు ముందే ఇంద్రాదుల దూతికలు దమయంతి వద్దకు వెళ్ళారు. వారి మాటను దమయంతి తిరస్కరించింది. నలుడు దిక్పాలుర సందేశాన్ని ఆమెకు తెలియజేశాడు. ఆమె తన స్థిరనిర్ణయాన్ని తెలిపింది. చివరకు తన వివరాలను తెలిపాడు. తన రాయబారం ఫలించనందుకు బాధపడ్డాడు.

దమయంతి దుఃఖభారంతో వుండగా హంస వచ్చి ఓదార్చింది. స్వయంవర సభ సమావేశం కాగానే భీమరాజు ఆయా రాజుల వివరాలను దమయంతికి తెలియజేయమని సరస్వతిని ప్రార్థించాడు. సరస్వతీ దేవి ప్రత్యక్షమై పేరు పేరున దేవతలను, సకల దేశాధీశులను దమయంతికి వర్ణించి చెప్పింది. నలుని వేషంలో వున్న ఇంద్రాదులు నలువురు యథాస్థితిని పొందారు. దమయంతి నలుని మెడలో వరమాలను వేసింది. ఇంద్రాదులు దంపతులకు వరాలనిచ్చారు.

సరస్వతి దేవి నలునికి చింతామణీ మంత్రం ఉపదేశించింది. నల దమయంతుల వివాహం అట్టహాసంగా జరిగింది. నలుడు దమయంతితో కలసి తన రాజధానికి చేరుకున్నాడు. ఇంద్రాదులు స్వర్గానికి వెళ్ళిపోయారు. కలి పురుషుడు ఆ రాజ్యంలొ చేరి రంధ్రాన్వేషణ చేయసాగాడు. దంపతులు యౌన సామ్రాజ్య పట్టాభిషిక్తులై కాలం వెళ్ళబుచ్చారు. ఇదీ సంక్షిప్తంగా కథ. శ్రీనాథుని చమత్కృత గాథ.

Exit mobile version