Site icon Sanchika

కావ్య పరిమళం-13

[box type=’note’ fontsize=’16’] సాహిత్య విశిష్టతలోనూ, కథాకథన శిల్పంలోనూ, పద్య రచనా చమత్కృతిలోనూ, శైలి విన్యాసంలోనూ మధురాలైన ప్రాచీన కావ్యాల పరిమళాలను అందిస్తున్నారు డా. రేవూరు అనంతపద్మనాభరావు. [/box]

తిక్కన భారతం

[dropcap]క[/dropcap]విబ్రహ్మ తిక్కన నెల్లూరు సీమవాడు. మనుమసిద్ధికి కుడిభుజం. రాజ్యతంత్రంలోను సహకరించినవాడు. ఉభయకవిమిత్రుడిగా ప్రసిద్ధికెక్కినవాడు. నన్నయ తర్వాత విరాటపర్వం నుండి 15 పర్వాలు భారతానువాదం చేసినవాడు. హరిహరనాథ తత్వాన్ని బహుళ ప్రచారంలోకి తెచ్చినవాడు. తన కాలం నాటి శైవ వైష్ణవ కవితోద్యమాలు ప్రబలంగా ఉన్న రోజుల్లో మధ్యేమార్గంగా హరిహరాద్వైత సిద్ధాంతాన్ని ప్రతిపాదించినవాడు.

నిర్వచనోత్తర రామాయణం:

తిక్కనామాత్యుడు తొలుత ఉత్తర రామాయణాన్ని కేవలం పద్యాలలో వ్రాశాడు. మిగతా పూర్వ రామాయణం వ్రాయకపోవడానికి కారణం – అప్పటికే గోన బుద్ధారెడ్డి వ్రాసిన రంగనాథ రామాయణం ప్రాచుర్యంలో ఉండడమే. ఆ తర్వాత చాలా శతాబ్దాలకు కంకంటి పాపరాజు ఉత్తర రామాయణం వ్రాశాడు. మనుమసిద్ధి వద్ద మంత్రిగా పనిచేసిన యుద్ధ ఘట్టాలను అద్భుతంగా చిత్రించాడు.

తిక్కన ప్రణాళిక:

మహాభారతానువాద సమయంలో తిక్కన ‘శ్రీయన గౌరి నాబరగు చెల్వకు చిత్తము పల్లవింపభ ద్రాయిత మూర్తియై’ – అని ప్రారంభం చేయడం గమనార్హం. విరాటపర్వం మొదలు స్వర్గారోహణ పర్వం వరకు కథకథనాన్ని నడిపాడు. తిక్కన పద్య శైలి తర్వాతి కవులకు మార్గదర్శకమైంది. “బరులేయవి యొనరించిన, నరవర! అది తన మనంబున క యప్రియంబగు” అనే పద్యం బహుళ వ్యాప్తిలో వుంది. ఆంధ్రపత్రిక దినపత్రికలో కాశీనాథుని నాగేశ్వరరావు దీనిని మకుటాయమానంగా ప్రచురించారు. నన్నయ ఒరవడిని కొనసాగిస్తూ తిక్కన వ్యాసభారతానికి సన్నిహితంగా రచన నడిపాడు. భీష్మపర్వం మొదలు ద్రోణ, కర్ణ, శల్య, సౌప్తిక పర్వాల వరకు యుద్ధ వర్ణనలే చోటు చేసుకొన్నా పాఠకుని ఎక్కువ విసుగు తోచదు.

నాటకీయ శైలి:

తిక్కన రసజ్ఞత అంతా నాటకీయ రచనలోనే వుంది. రాయబార ఘట్టంలోని గాని, కీచక వధ ఘట్టంలో గాని ఆయన పద్యశైలి నాటకీయం. ‘దుర్వారోద్యమ బాహువిక్రమ…’ వంటి పద్యాలు చదువుతున్నపుడు భావావేశం పొంగిపొరలుతుంది. పాండవోద్యోగ విజయాలు నాటక రచన ద్వారా తిరుపతి వేంకట కవులు తెలుగు పద్యానికి పట్టం గట్టారు.

“మాకుం గుడు మిండిదె మీరు వ్రక్కఁ గొనుఁడని” సంజయ రాయబార ఘట్టంలో పలికిన తీరు తిక్కన ప్రసస్తికి బావుటా. ఆయన శిష్యుడు కేతన తన దశకుమార చరిత్రను తిక్కనకు అంకితం చేశాడు. మారన మరొక శిష్యుడు. ఆ శతాబ్దిని తిక్కన యుగంగా ఆచార్య పింగళి లక్ష్మీకాంతం నిర్ధారించారు.

తిక్కన రచనా ప్రణాళికపై వివిధ విశ్వవిద్యాలయాలలో సాహిత్య పరిశోధనలు జరిగి ప్రచురితమయ్యాయి. నన్నయ అక్షర రమ్యతకు ప్రాధాన్యతనీయగా, తిక్కన నాటకీయతకు అగ్రపీఠం వేశాడు. తిక్కన పలికిన నవ్వులలో వైవిధ్యాన్ని పండితులు ప్రశంసించారు. అలానే పద వైచిత్రి కూడా ప్రసిద్ధం.

భీష్ముని ఎదుర్కొనలేని పాండవులు యుద్ధ సమయంలో ఒకనాటి రాత్రి భీష్ముని విశ్రాంతి గృహంలోకి ప్రవేశించి –

“చిచ్చఱకన్ను మూసుకుని చేతి త్రిశూలము డాఁచి లీలమై

వచ్చిన రుద్రుచందమున వ్రాలుదు వీ వనిలోన” అంటూ నమస్కరిస్తారు. నీతో తలపడలేమనీ, మార్గాంతరం చూపమంటారు. చక్కని పద్యమది.

దుర్యోధనుడు ద్రోణాచార్యుని నిందించే ఘట్టంలో పద్యం మరొక వైచిత్రి.

చం:

నిను నవలీల దాటి ప్రజ నేలకు గోలకు దెచ్చు చున్నయ
ర్జును దలయెత్తి యైన నటుసూడవు పాండవ పక్షపాతినీ
యన మటు గాక యెప్పుడును మాదెస గప్ప యెలుంగు బామవై
యునికి యెరుంగ వచ్చెనటు లూరటగా వరమిచ్చి నాడవో
(సం.7-69-1)

“కప్ప -ఎలుగు – పాము” స్థితిని ఉపమించాడు తిక్కన.

సైంధవ వధ సందర్భంలో అర్జునుని బల పరాక్రమ వర్ణన ఈ పద్యం:

ఉ:

నీమగడెల్లి సైంధవు ననిన్ తెగటార్చి శిరంబు తెచ్చినన్
కోమలి! నీదు పాదములకున్ తగు పీఠము సేయు మాతడు
ద్దామ భుజబలాఢ్యు దది తప్పదు, వాని ప్రతిజ్ఞ తప్పినన్
భూమి వడంకదే! తరణి పొల్పు తలంకదె! వార్ధి ఇంకదే!
ఈ విధమైన కథాకథన శైలి తిక్కన ప్రత్యేకత.

కవిత్రయ ప్రశస్తి:

నన్నయతో ఆరంభమై, తిక్కన, ఎర్రనలు పూరించిన వ్యాస భారాతానువాదం విశేష ప్రశస్తిని పొందింది. వాల్మీకి రామాయణానికి పదులు సంఖ్యలో అనువాదాలు వచ్చాయి గానీ, వ్యాసభారతానువాదాలు రాలేదు. ఒక్క శ్రీకృష్ణ భారతం – శ్రీపాద కృష్ణమూర్తి శాస్త్రి రచన అందుకు మినహాయింపు.

ప్రత్యేకత:

“ద్రౌపది బంధురం బయిన క్రొమ్ముడి గ్రన్నన విచ్చి” – అనే పద్యం రాయబారానికి వెళ్తున్న శ్రీకృష్ణుని  ముందు ద్రౌపది క్రోధమయమూర్తిని ప్రత్యక్షం చేస్తుంది.

కీచక వధ ఘట్టంలో సహజ సుందరమైన సంభాషణ కొనసాగింది. కీచకుడు సైరంధ్రిని బలాత్కరించబోతాడు. అజ్ఞాతవాసం గడుపుతున్న సమయమది. తన గోడు చెప్పుకోవడానికి ద్రౌపది భీముని ఎంచుకొంది. రాత్రి సమయంలో నిద్రిస్తున్న భీముని సమీపించి మేల్కొలిపే ప్రయత్నం చేసింది. నిద్రాముద్రితుడై భీముడు ఆమె మెల్లగా పలికిన పలుకులు విని –

“అది ఎవ్వరనపుడు – ద్రౌపది  నేనేన అమ్మనిని ఎలుంగెరింగి” అంటాడు తిక్కన.

ఎంత సహజ సుందర వర్ణన.

సాధారణంగా రాత్రి పూట తలుపు తీయడానికి వచ్చిన అర్ధాంగి – భర్తని గుర్తు పట్టడానికి – “ఎవరది?” అని ప్రశ్నించడం సహజం. భర్త తన పేరు చెప్పడు. “నేను!” అంటాడు. ఆ కంఠస్వరాన్ని గుర్తుపట్టి ఆమె తలుపు తీస్తుంది. అది లోక సహజం. తిక్కన అదే చూపాడు.

సంభాషణా చతురత:

రాయబారానికి వెళ్ళివచ్చిన శ్రీకృష్ణునితో భీముడు పలికిన సరసోక్తులు తిక్కన ఘంటం నుండి జాలువారిన తీరిది:

ఉ:

కయ్యము గల్గినట్లయిన గంధ గజ ప్రకరంబు కుంభముల్‌
వ్రయ్యఁ దురంగ పంక్తులు ధరం బడఁ దేరిగముల్‌ బడల్పడన్‌
డయ్యమి కీవు వెక్కసపడన్‌ గదపండువు సేయఁగోరు నా
దయ్యము నెత్తికోలు దుది దాఁకుటగాదె భుజంగభంజనా!
(ఉద్యోగపర్వము – తృతీయాశ్వాసము – 67)

తిక్కన కాలము:

తిక్కన సోమయాజి కొట్టరువు వంశీకుడు. క్రీ.శ.1205-1288 ప్రాంతంలో కాకతీయుల పరిపాలనా కాలం నాటి వాడు. అప్పట్లో కాకతీయ చక్రవర్తి గణపతిదేవుడు తెలుగు రాజ్యాలన్నింటినీ తన ఛత్రచ్ఛాయలలోకి తెచ్చి పాలిస్తున్నాడు. మనుమసిద్ధికి తిక్కన మంత్రి. మనుమసిద్ధి కాకతీయుల సామంతుడు. మనుమసిద్ధిని ఆయన జ్ఞాతులు పదవీచ్యుతుని చేసినపుడు తిక్కన గణపతిదేవుని సాయంతో మనుమసిద్ధికి రాజ్యం తిరిగి చేకూరేలా చేశాడు.

సంస్కృతాంధ్ర భాషలలో నిష్ణాతుడైనందున తిక్కను ఉభయభాషాకవిమిత్ర బిరుదు లభించింది. తెలుగు జాతీయాలను తిక్కన సందర్భోచితంగా వాడాడు:

– మాడుగు చీరయందు మాసి తాకినట్లు

– పాలలో పడిన బల్లి విధంబున

– నేయివోసిన అగ్ని భంగి

– మంటలో మిడతలు చచ్చినట్లున

– కంటికిన్ రెప్పయుబోలె

– నూతిలో కప్ప విధంబున

తెలుగుదనం ఉట్టిపడే పలుకుబడులివి.

హరిహరనాథుడే తిక్కనకు ప్రత్యక్షమై మహాభారతాన్ని తనకంకితమివ్వమని కోరాడు. “ఏ నిన్ను మామ యని మెడుదానికి తగునిమ్ము భారతీకన్యక” అని మనుమసిద్ధి చేత అడిగించుకొని తిక్కన నిర్వచనోత్తర రామాయణం రచించాడు. మహోన్నత కవి తిక్కన.

Exit mobile version