Site icon Sanchika

కావ్య పరిమళం-16

[box type=’note’ fontsize=’16’] సాహిత్య విశిష్టతలోనూ, కథాకథన శిల్పంలోనూ, పద్య రచనా చమత్కృతిలోనూ, శైలి విన్యాసంలోనూ మధురాలైన ప్రాచీన కావ్యాల పరిమళాలను అందిస్తున్నారు డా. రేవూరు అనంతపద్మనాభరావు. [/box]

రామరాజభూషణుని వసుచరిత్ర

ప్రబంధ యుగంలో వెలువడిన గ్రంథాలలో మణిపూస వంటిది వసుచరిత్ర. రామరాజభూషణుడు పెనుగొండ రాజధానిగా ఏలిన తిరుమలరాయల ఆస్థానకవి. వసుచరిత్రను 1565-70ల మధ్య వ్రాసెను. తిరుమలరాయల కంకితమిచ్చెను. ఈ కావ్యానికి మూలం భారతం ఆదిపర్వంలోని ఉపరిచరవసు వృత్తాంతం. మూలకథకు మార్పులు, చేర్పులు చేసి భట్టుమూర్తిగా పేరుగాంచిన రామరాజభూషణుడు ఆరు ఆశ్వాసాల ప్రబంధాన్ని సమకూర్చాడు. వసుచరిత్రకు పిల్ల వసుచరిత్రలు కూడా వచ్చాయంటే దాని ప్రచారం విశదం. వర్ణనలను తొలగించి ఆ పని చేశాడు.

రామరాజభూషణుడు సంగీత సాహిత్యాలలో మేటి. సంగీత కళా రహస్యనిధి. లయ గమకాలతో కూడి కుందనపు తీగ వలె పద్యాల నడక సాగిపోయింది. ప్రొద్దుటూరుకి చెందిన యస్. రాజన్నకవి అనేక సభల్లో రాగయుక్తంగా గానం చేసి ప్రసంగం చేసేవాడు. వ్యంగ్యం, శ్లేష, పద్య రామణీయకం ఈ ప్రబంధంలో విశిష్టత. ఆచార్య పింగళి లక్ష్మీకాంతం ఇలా అభిప్రాయపడ్డారు: “ఈ గ్రంథము సంస్కృత నైషధము” అన్నారు.

రామరాజభూషణుడు ‘హరిశ్చంద్రనలోపాఖ్యానము’ అనే ద్వర్ధికావ్యం కూడా వ్రాశాడు. అదే కాలంలో సూరన ‘రాఘవపాండవీయం’ కూడా వెలువడింది. రామరాజభూషణుని వలె పద్యం వ్రాయగలవారు లేరని పండితుల అభిప్రాయం. ఇతడు కడప మండలం వాడు. అష్టదిగ్గజ కవులలో లేడని విమర్శకుల అభిప్రాయం.

శ్లేషకవితా చక్రవర్తి:

ఈ కవి శ్లేషకవితా చక్రవర్తిగా ప్రశస్తి. ఈతడు శ్రీరామభక్తుడు. నన్నయ కేవలం 12 గద్య పద్యాలలో చెప్పిన వసురాజు వృత్తాంతాన్ని ఈ కవి 800 గద్య పద్యాలలో ప్రబంధరీతిలో మలచాడు. వసురాజు గిరికను వివాహమాడటం ప్రధాన కథ.

ఉ:
“కేవల కల్పనాకథలు కృత్రిమ రత్నము లాద్య సత్కథల్
వావిరిబుట్టు రత్నములవారిత సత్కవి కల్పనా విభూ
షావహ పూర్వ వృత్తములు సానలదీరిన జాతిరత్నముల్
కావున ఇట్టి మిశ్రకథగా నొనరింపుము నేర్పు పెంపునన్” అంటాడు కవి.

అందుకే మిశ్రరచన చేశాడు. కృతిపతి అలా కోరడంలో విశేషం కవి భావనయే. ఆంధ్ర పంచకావ్యాలలో వసుచరిత్ర ఒకటి. శ్లేష వైచిత్రితో నాటకీయంగా రచింపబడినది.

మహాభారతంలో కథ:

భారతం ఆదిపర్వం తృతీయాశ్వాసంలో వేదవ్యాసుని జన్మ వృత్తాంతం చెప్పే సందర్బంలో ఉపచరవసు మహారాజు కథ చెప్పబడింది. ఇంద్రునితో సమానమైన వసువు అనే రాజు వేట కోసం అడవికి వెళ్ళాడు. అక్కడ ఒక ముని ఆశ్రమంలో వైరాగ్యమ్తో అస్త్రశస్త్రాలు విసర్జించి, మహానిష్ఠతో తపస్సు చేశాడు. అతని వద్దకు దేవతలతో సహా ఇంద్రుడు వచ్చాడు. “నీ తపస్సుకు మెచ్చాను. నీవు నాతో స్నేహం చేస్తూ నా వద్దకు వస్తూ పోతూ నీ రాజ్యపాలన చేసె దేవత్వాన్ని ప్రసాదిస్తున్నాను అని పలికి ఒక స్వర్ణ విమానాన్ని ప్రసాదించాడు.

“అవ్వసువును దద్విమానారూఢుం డై యుపరిలోకంబునం జరించుటంజేసి యుపరిచరుండు నాఁ బరఁగి, యక్కమల మాలికయుఁ దనకుం జిహ్నంబుగా నవ్వేణుయష్టికి మహావిభవంబు సేయుచు, మెఱసి యేఁటేఁట నింద్రోత్సవం బను నుత్సవంబు సేయుచు నీశ్వరునకు నింద్రాదిదేవతలకు నతిప్రీతి సేసె”

(ఆదిపర్వము – తృతీయాశ్వాసము-24)

ఆ వసురాజుకు కొడుకులు జన్మించారు. ఒకనాడు ఆ రాజు నగరానికి సమీపంలోని శుక్తిమతీ నదిని కోలాహలుడనే పర్వతం కామించి అడ్డుపడ్డాడు. అది చూచిన వసురాజు తన కాలితో పర్వతాన్ని తొలగదోశాడు. ఆ సమాగమం వల్ల శుక్తిమతికి వసుపదుడనే కొడుకు, గిరిక – అనే కూతురు జన్మించారు. ఆమె వారినిద్దరినీ వసురాజునకు కానుకగా ఇచ్చింది. అతడు వసుపదునకు సేనాపతి పదవినిచ్చి, గిరికను పెండ్లాడాడు. ఇలా కథ ముందుకు నడిచింది. దానిని ఆధారంగా తీసుకుని రామరాజభూషణుడు ఒక రమ్యప్రబంధ హర్మ్యాన్ని నిర్మించాడు.

కవి తనను గూర్చి చెప్పుకొనిని మాటలు:

రామరాజభూషణుడు కృతిపతి చేత తన గొప్పతనాన్ని వర్ణించాడు. తాను శ్రీరామభక్తుడు. జగత్ ప్రాణనందన కారుణ్య కటాక్ష లబ్ధ కవితా ధారసుధారాణి ఏకైక దిన ప్రబంధ ఘటనా శతగ్రంథకర్త. సంగీతకళా రహస్య నిధి. రాజుల చేత రత్నహారహేమవేదండాగ్రహారాది సత్కారాలను పొందినవాడు.

ఈ వివరాల ద్వారా కవి ప్రతిభ ద్యోతకమవుతోంది. కృతిపతి యైన తిరుమలరాయని వంశాన్ని సుదీర్ఘంగా వర్ణించాడు కవి. 65 పద్యాలలో సంపూర్ణ వంశ చరిత్రను పొగిడి ఆ పైన కథా ప్రారంభం చేశాడు. పూర్వ కవిస్తుతిలో వ్యాసకాళీదాసాది మహాకవులను స్మరించాడు. తెలుగు కవులలో నన్నయ, శ్రీనాథ, సోమన, భాస్కరులను ప్రస్తుతించాడు.

కథా సారాంశం:

వసుచరిత్రలో కథా భాగం స్వల్పం. అష్టాదశ వర్ణనలతో కావ్యాన్ని విస్తృతం చేసి ఆరు ఆశ్వాసాలుగా కవి మలచాడు. సూతమహర్షి కుమారుడైన సౌతి – శుకశౌనకులకు దేవతాచిహ్నములు గల ఒక రాజు కథను చెప్పాడు. అధిష్ఠానపురం రాజధానిగా వసురాజు పరిపాలిస్తున్నాడు. ఆ నగరాన్ని సర్వాంగ సుందరంగా 20 పద్యాలలో కవి వర్ణించాడు. ఒక రోజు ఆ రాజు ఒక ఘనకార్యం చేశాడు. హిమవంతుని కొడుకు కోలాహలుడనే పర్వతరాజు. అతడు శుక్తిమతి – అనే నదిని ఒకనాడు బలాత్కారం చేశాడు. అది గమనించిన వసురాజు కోపించి తన కాలితో ఆ పర్వతాన్ని ఎగమీటాడు. ఆ ఘనకార్యాన్ని చూచిన ఇంద్రుడు ఆశ్చర్యపోయి అతనితో స్నేహం చేశాడు. ఆ పర్వతమ్ వసురాజు క్రీడాపర్వతంగా వుండిపోయింది.

ఉద్యానవన పాలకుల కోరిక మేరకు వసురాజు ఉద్యానవనాల్ని చూడడానికి వెళ్ళాడు. పక్కనే క్రీడా పర్వతము, శుక్తిమతి నది. దగ్గరలో చెట్టు మీద ఉన్న కిన్నర దంపతులు – “ఓ రాజా! నీకు కొద్దిలో గొప్ప శుభం జరగబోతోంది” అని చెప్పారు. ఆ పర్వతం మీద నుండి ఒక వీణా వాదనం వినిపించింది. ఆ వీణా వాదన ఎవరు చేస్తూన్నారో చూచి రమ్మని రాజు తన నర్మ సచివుని యతి వేషంలో అక్కడికి పంపాడు. అతడు అక్కడికెళ్ళి ఆమెను చూచి వచ్చి ఇలా పలికాడు. ఆమె నాశికా వర్ణన సాహిత్యంలో ప్రశస్తం:

“శా:
నానాసూన వితానవాసనల నానందించు సొరంగ మే
లా నన్నొల్ల దటంచు గంధఫలి బల్ కాక తపం బంది యో
షా నాసాకృతి దాల్చి సర్వసుమనస్సౌరభ్య సంవాసి యై
పూనెన్ ప్రేక్షణమాలికా మధుకరీ పుంజంబు లిర్వకలన్.”
(ద్వితీయా-47)

సంపంగి తపస్సు చేసి ఆ గిరిక ముక్కుగా రూపొందిందని భావం. చెలి మంజువాణి ద్వారా గిరిక జన్మవృత్తాంతాన్ని తెలుసుకొని వచ్చాడు నర్మసచివుడు.

శుక్తిమతీ కోలాహాలులకు గిరిక జన్మించించి. వసురాజు గిరికను చూచి విరహతప్తుడయ్యాడు. గిరిక వసురాజును చూచి మోహపరవశురాలైంది. చెలులు ఆమెకు శిశిరోపచారాలు చేశారు. గిరిక దూతగా చెలి మంజువాణి వసురాజు వద్దకు వెళ్ళింది. నైషధంలో హంసదూత్యం ప్రసిద్ధం. అదే ధోరణిలో వసుచరిత్రలో మంజువాణీ దౌత్యమ్ రసవత్తరం. తిరస్కరిణీ విద్యతో వెళ్ళిన మంజువాణి గిరికా ముత్యాల హారాన్ని వసురాజు మెడలో వేసింది. ఔచిత్యంగా దూత నిర్వహణ చేసింది. రాజు కూడా సముచితంగా మాట్లాడి తన ముద్రికను గిరికకు అంగీకారసూచకంగా పంపాడు.

నదిని స్త్రీతోను, పర్వతాన్ని పురుషునితోనూ పోల్చడం ఇందులో విశేషం. కథాభాగంలో ఆ తర్వాత ఇంద్రుడు సపరివారంగా కోలాహలుని వద్దకు వచ్చాడు. పర్వత రాజు ఇంద్రుని పూజించాడు. గిరిక చేత దేవతలకు మొక్కించాడు. ఆకాశగంగ గిరికను ఆశీర్వదించింది. గిరికను వసురాజున కిచ్చి వివాహం చేయమని ఇంద్రుడు పర్వతరాజును కోరాడు. పెండ్లికొడుకు వసురాజు. పిల్లనడగడానికి వచ్చినవాడు ఇంద్రుడు. దేవలతలందరికీ ఇష్టమైన ఈ పెళ్ళి చేయడం కన్నతల్లిదండ్రులకు అదృష్టమే గదా! అని పర్వతరాజు అన్నాదు. నదులు కొండలు పెళ్ళిపెద్దలుగా వచ్చారు. ఇంద్రుడు కోలాహలునికి ఒక దివ్య పట్టణం నిర్మించి ఇచ్చాడు. బృహస్పతి శుభలగ్నం నిశ్చయించాడు. ఇంద్రుడు వసురాజు వద్దకు వచ్చి విషయం చెప్పాడు.

గిరిక వసురాజుల వివాహం అంగరంగ వైభవంగా మొదలెట్టారు. వసురాజు కోలాహలపురానికి బయలుదేరాడు. పురస్త్రీలు దారిలో లాజలు చల్లారు. కోలాహలుడు ఎదుర్కోలు పలికి విడిది చేయించాడు. వివాహం ఘనంగా జరిగింది. కన్యాదానం ఇలా జరిగింది:

“మ:
సుముహుర్తం బని సన్మునుల్ తెలుప, అచ్చో దివ్యశైలేంద్రుడా
యమరాధీశు హితక్రియానిరతు, నామామ్లాన మాలాకలా
పమనోహరి నకుంఠ విక్రమునిగా భావించి, లక్ష్మి గురు
త్వము దీపింపంగ ధారవోసె తనయన్ వర్ధిష్ణు సంపన్నిధిన్.”
(చతుర్థా-26)

దేవతలు ఆశీర్వదించారు. కట్నాలు చదివించారు. ఏనుగులు, గుర్రాలు, రధాలు కన్యలు, హేమర జలాలు కానుకలుగా సమర్పించారు. ఇంద్రుడు వసురాజుకు ‘వేణు యష్టి’ని ఇచ్చాడు. గిరికను సాగనంపుతూ తండ్రి బుద్ధులు చెప్పాడు: “నీ పని పాటలలో పెద్ద పట్ల మారుమాటాడవద్దు. సవతులతో సఖ్యంగా మెలగు. సంపదలకు పొంగి గర్వించవచ్చు. లోకం మెచ్చుకొనేలా ప్రవర్తించి మాకందరికీ పేరు తెచ్చేలా ప్రవర్తించు” అని హితవు పలికాడు. తల్లి శుక్తిమతి ధైర్యం చెప్పింది.

తమ్ముల పంపుదున్, మణిశ మ్ముల పంపుదు రాజహంసపో
తమ్ముల పంపుదున్, పరిచితమ్ముల కానన దేవతాళిజా
తమ్ముల పంపుదున్, ద్రుతగతమ్ముల నేనును సారణి ప్రసా
తమ్ముల వత్తు విశ్వవిధితా! ముదితా! మది తాప మేటికిన్.
(షష్ఠ-60)

గిరికా వసురాజులు శృంగారకేళిలో మునిగితేలారు వసురాజు లోకహితంగా రాజ్యపాలన చేశాడు. రామరాజుభూషణుని కవితాధారలో పాఠకులు శుక్తిమతీ నదీ స్నాతులవుతారు.

Exit mobile version