కావ్య పరిమళం-2

0
2

[box type=’note’ fontsize=’16’] సాహిత్య విశిష్టతలోనూ, కథాకథన శిల్పంలోనూ, పద్య రచనా చమత్కృతిలోనూ, శైలి విన్యాసంలోనూ మధురాలైన ప్రాచీన కావ్యాల పరిమళాలను అందిస్తున్నారు డా. రేవూరు అనంతపద్మనాభరావు. [/box]

శృంగార శాకుంతలం

[dropcap]సం[/dropcap]స్కృత సాహిత్యంలో కాళిదాసుని అభిజ్ఞాన శాకుంతలం ప్రసిద్ధం. మహాభారతంలోనూ శకుంతలోపాఖ్యానం వంద పద్యాలకు పైగా చెప్పబడింది. శ్రీనాథ యుగానికి చెందిన పిల్లలమర్రి పినవీరభద్రుడు శకుంతలా దుష్యంతుల గాథను శృంగార శాకుంతల కావ్యంగా నాలుగు ఆశ్వాసాలలో వ్రాశాడు. ‘వాణి నా రాణి’ అని సగర్వంగా చెప్పుకొన్నాడు. వారిది ‘శారదా పీఠం’గా ప్రసిద్ధికెక్కిన పండితవంశం.

పినవీరన నల్గొండ జిల్లాలోని పిల్లలమర్రి గ్రామవాసి. ఆయన చిల్లర నాగయ వెన్నమంత్రికి అంకితంగా శృంగార శాకుంతలం వ్రాశాడు. అతడు అప్పటి నెల్లూరు జిల్లా సోమరాజు పల్లె ప్రాంతము వాడు. శాకుంతల రచన క్రీ.శ. 1474 కంటే ముందు కావచ్చని ఆచార్య నాయని కృష్ణకుమారి ఆంధ్రప్రదేశ్ సాహిత్య అకాడెమీ ప్రచురించిన శృంగార శాకుంతలం పీఠికలో విశ్లేషించారు. జైమినీ భారతాన్ని పినవీరన సాళువ నరసింగరాయలకు అంకితమిచ్చాడు. శ్రీనాథుడు, పినవీరన వీధిలో కలుసుకుని శృంగార నైషధానువాదం గూర్చి ముచ్చటించుకొన్నట్లు ఒక ఐతిహ్యం ప్రచారంలో వుంది. శ్రీనాథుడు నైషధాన్ని శృంగార నైషధంగా మలచినట్టే పినవీరన శాకుంతలాన్ని శృంగార శాకుంతలం చేశాడు. కొరవి గోపరాజు వీరనను ‘మహామతి’ అని ప్రశంసించాడు. మరొకిన్ని రచనలు పినవీరన రచించినట్లు అవతారిక పద్యాలలో పేర్కొన్నా అవి నేడు అలభ్యం.

శ్రీనాథ యుగంలో వచ్చిన కావ్యాలను నాయని కృష్ణకుమారి మూడు రకాలుగా వర్గీకరించారు. 1. పురాణాలను పరివర్తన చేసిన కోవలో వరాహా, పద్మ పురాణాలు, జైమినీ భారతం, వాసిష్ఠరామాయణం భాగవతం (దశమ స్కందం) వస్తాయి. 2. పురాణాలలోని కథలను ప్రబంధాలు చేసిన కోవలో – శృంగార శాకుంతలం, హరవిలాసం, కాశీఖండం, భీమఖండం, శృంగార నైషధం, నాచికేతోపాఖ్యానం వస్తాయి. 3. అనేక కథలను ఒకచోట చేర్చిన కావ్యాలలో – విక్రమార్క చరిత్ర, భోజరాజీయం, సింహాసనద్వాత్రింశిక, పంచతంత్రం వస్తాయని వింగడించారు.

కాళిదాసు – పినవీరన:

శ్రీనాథుడు శ్రీహర్షుని నైషధాన్ని అనుకరించినట్లే, పినవీరభద్రుడు కాళిదాసుని అభిజ్ఞాన శాకుంతలాన్ని ఆధారంగా చేసుకొన్నాడు. అయితే అనువదించదలచుకోలేదు. కాళిదాసుని నాటక విధానాన్ని కొంత, మహాభారతంలోని శాకుంతల కథను కొంత స్వీకరించి, శ్రీనాథుని శృంగార ధోరణిలో కథను నడిపించాడు. దీనిని ప్రబంధంగా తీర్చిదిద్దుతానన్నాడు.

భారత కథలో దుష్యంతుడు ధీరోదాత్త నాయకుడు కాదు. లోకోపవాదానికి భయపడి అసత్య దోషానికి పాల్పడినాడు. అందుకే కాళిదాసు దుర్వాస శాపాన్ని కల్పించి ముద్రికను శకుంతల జారవిడుచుకునే ఘట్టాన్ని సృష్టించి దుష్యంతునకు మరపు కల్పించాడు. శకుంతలా దుష్యంతులు రాజసభలో గాక మారీచాశ్రమంలో కలుసుకొన్నట్లు వర్ణించాడు.

పినవీరభద్రుడు ముద్రికా ప్రాధాన్యాన్ని అంగీకరించాడు కాని దానిని శకుంతల జారవిడుచుకున్నట్టు చెప్పలేదు. ఒక్క దుర్వాస శాప కల్పనం తప్ప మిగిలిన కథ అంతా పినవీరన భారత ఛాయలో నడిపాడు. ప్రబంధోచిత రీతిలో విశ్వామిత్ర తపోవన వర్ణన, మేనక పుష్పాపచయము, మధుమాసము వర్ణించబడ్డాయి. శకుంతల జన్మవృత్తాంతాన్ని దుష్యంతునికి కణ్వుని శిష్యుడు శకుంతల లేని వేళ చెప్పాడు. కాళిదాసు శాకుంతలంలో శకుంతలతో బాటు రాజసభకు అనసూయా ప్రియంవదలు వెళ్ళడం ఉచితం కాదని వారించాడు. పినవీరన వారిని శకుంతలతో రాజభవనానికి పంపి, శకుంతల వ్రేలి కున్న ముద్రికను దుష్యుంతునిపై విసిరివేసి శాపవిముక్తి కలిగించేలా మార్పు చేశాడు. మరో విశేషం నారదుడు రాజసభకు వచ్చినట్టు కల్పించడం. కాళిదాస శ్లోకమైన ‘గ్రీవాభంగాభిరామం’ కడు ప్రసిద్ధం. దానిని వీరన ఔచిత్యంగా అనువదించాడు.

“విలుగొని వెంట వెంటఁ బృథివీపతి రా శరపాతభీతిఁ దా
మలఁగి మలంగి కన్గొనుచు మార్గముక్రేవకు నడ్డగించుకు
న్నిలుచుచుఁ గొంతకొంత గమనించుకు నర్థము మేసిమేసి ద
ర్భలు వివృతాస్యపార్శ్వముల రాలఁగ మింటికిఁ జౌకళించుచున్”
(శాకుంతలం 2 -19)

అలానే హిమాలయ వర్ణనలో గూడ కవి తన ప్రత్యేకతను నిలుపుకొన్నాడు. అక్కడక్కడా నన్నయ పద్యాల ప్రభావం కుడా కన్పిస్తుంది. స్వతస్సిద్ధంగా అతనిది భారతం కంతే భిన్న శైలి. శ్రీనాథుని ఛాయ ఎక్కువ. శృంగార నైషధ పద్య నడక కూడా శాకుంతలంలో కన్పిస్తుంది.

ఇందులో కథ:

హస్తినాపురం రాజధానిగా దుష్యంత మహారాజు పరిపాలిస్తున్నాడు. రాజాస్థానం వైభవంగా విలసిల్లుతుండగా ‘సు ధర్మ’లో ఇంద్రుని వలె దుష్యంతుడు కొలువుదీరాడు. ఆ సమయంలో పుళింద నాయకులు రాజ సందర్శనానికి వచ్చి అన్ని రకాలైన ముత్యాలు, వెదురు బియ్యము, జువ్వాది, సురటులు, జుంటితేనె కానుకగా తెచ్చి సమర్పించారు. వారిని చూడగానే రాజుకు వేటకి వెళ్ళాలనే ఉత్సాహం కలిగింది. మా ప్రాంతంలో క్రూరమృగాల బెడదను తొలగించమని రాజును వారు వేడుకొన్నారు.

దుష్యంతుడు వేటకు వినోదంగా వెళ్ళడానికి సన్నాహాలు చెయ్యండని చాటింపు వేశారు.  వేటకాండ్రు సిద్ధమయ్యారు. దుష్యంతుడు ఎక్కిన రథం వేగంగా ముందుకు సాగింది. ఒక గొల్లపల్లె వద్ద రథం ఆపారు. అక్కడి ప్రజలు అతిథి సత్కారాలు చేసి స్వాగతం పలికారు. అతనితో బాటు మిత్రుడు మాండవ్యుడు కూడా వేటకు వచ్చాడు. వేటకు వచ్చిన వేళ శుభశకునాలు కన్పిస్తున్నాయని మిత్రునికి మాండవ్యుడు చెప్పాడు.

దుష్యంతుడు వేటలో ఒక జింకను వెన్నంటి తరముతూ ఒక మున్యాశ్రమ ప్రాంతానికి చేరాడు. అక్కడి వృద్ధ  ముని ఆశ్రమ మృగంపై బాణం వేయవద్దని వారించాడు. కణ్వాశ్రమం అది. అక్కడి సాత్విక లక్షణాలు గల జంతువులను చూసి దుష్యంతుడు ఆశ్చర్యచకితుడయ్యాడు. శకుంతలను చూసి మోహపరవశుడయ్యాడు. శకుంతల ముఖపద్మాన్ని ఆశించి ఒక భ్రమరం కలవరపరిచింది. అ బెడద తొలగించడానికి దుష్యంతుడు మునికన్యల వద్ద ప్రత్యక్షమయ్యాడు. శకుంతలా దుష్యంతులు పరస్పరానురాగ పీడితులయ్యారు.

మునిశిష్యుడు దుష్యంతునికి శకుంతలా జన్మవృత్తంతాన్ని వివరంగా చెప్పాడు. హిమాలయంపై ఘోరతపస్సు చేస్తున్నాడు విశ్వామిత్రుడు. ఆ తపస్సును భంగం చేయడానికి ఇంద్రుడు మేనకను పంపాడు. వారి దాంపత్య జీవన ఫలంగా శకుంతల జన్మించింది. మేనక ఆ పురిటి బిడ్డను మాలినీ నది ఇసుక తిన్నెలపై వదిలి ఇంద్రలోకానికి వెళ్ళిపోయింది. కణ్వ మహర్షి ఆ పసికందును ఆశ్రమానికి తెచ్చి పెంచాడు. శకుంతల అని పేరు పెట్టారు. ఆ వృత్తాంతం విన్న దుష్యంతునికి శకుంతల మునికన్య కాదనే విశ్వాసం కలిగింది. ఎట్టకేలకు అక్కడి నుండి వెనుదిరిగి తన పరివారాన్ని చేరుకున్నాడు రాజు. విదూషకుడైన మాండవ్యునికి తమ ప్రేమ వృత్తాంతాన్ని వివరించి విరహాన్ని ప్రకటించాడు.

ఈ సమయంలో రాజు తనతొ వచ్చిన వేటగాండ్రను నగరానికి త్రిప్పి పంపాడు. ఇంతలో అక్కడి మునులు వచ్చి అతిరాత్ర యజ్ఞాన్ని కాపాడమని దుష్యుంతుని పరిపరి విధాల వేడుకొన్నారు.

శకుంతలా దుష్యంతులు విరహతప్తులయ్యారు. వేటగాని వలె వెళ్ళి దుష్యంతుడు శకుంతల వున్న వృక్షవాటికకు వెళ్ళాడు. అనసూయా ప్రియంవదలు రాజుని చూసి శకుంతలా దుష్యంతుల సమావేశాన్ని ఏర్పరిచారు. శకుంతలను గాంధర్వ వివాహం చేసుకుంటానని దుష్యంతుడు వారితో అన్నాడు. ఈమెకు పుట్టబోయే బిడ్డ నీ రాజ్యానికి వారసుడు కాగలడని వాగ్దానం చేయమని వారు రాజుతో ఇలా అన్నారు:

“మా తరలాక్షి పైఁ గలుగు మక్కువ నిక్కువ మయ్యెనేని యో
భూతలనాథ యీతలిరుఁబోడికి నీకునుఁ బుట్టుపుత్రుఁ బ్ర
స్ఫీతిగ యౌవరాజ్యపదపీఠమున న్నిలుపంగ సత్కృపా
న్వీతుఁడవై మనోజ్ఞ మహనీయముగా శపథంబు నీఁదగున్”

రాజు ‘సరే’నని శపథం చేసి గాంధర్వ వివాహం చేసుకొన్నాడు. ఇంతలో మునులపై రాక్షసులు దండెత్తారు. భయంకర యుద్ధంలో దుష్యుంతుడు బ్రహ్మాస్త్రంతో కాళికాముఖుని భస్మూభూతం చేశాడు. ఈ యుద్ధవార్త విని హస్తినాపురం నుండి సేనలు విచ్చేశాయి.

యాగం పూర్తికాగానే మునుల ఆశీస్సులు తీసుకుని దుష్యంతుడు శకుంతల వద్దకు వచ్చి ‘తాను హస్తినకు వెళ్ళి పదవనాదు తిరిగివస్తాననీ, కణ్వుని అనుమతితో శకుంతలని తీసుకెళ్తా’ననీ అభయం ఇచ్చాడు.

కణ్వుడు ఆశ్రమానికి వచ్చి శకుంతల చంద్రవంశ రాణీ అయినందుకు సంతోషించాడు. ఒకనాడు మధ్యాహ్న సమయంలో కణ్వుడు నదికి వెళ్ళాడు. అప్పుడు దుర్వాసుడు పర్ణశాల వద్దకు వచ్చి నిల్చి, శకుంతల పరాయత్తచిత్తంతో ఉన్నదని శపించాదు. అనసూయ శాపవిముక్తిని కోరింది. ముద్రికను చూడగానే రాజు గుర్తిస్తాడని ముని ప్రతివచనం చెప్పాడు.

శకుంతల పుత్రునకు జన్మనిచ్చింది. అతడికి సర్వదమనుడని నామకరణం చేశాడు ముని. కొన్నాళ్ళకు శిష్యులతో శకుంతలను, భరతునీ రాజు వద్దకు పంపాడు. దుష్యంతుడు “నీవెవరో తెలియదు” అని విపరీతవాదం చేశాడు. అనసూయా ప్రియంవదలు రాజును అధిక్షేపించారు. ఆకాశవాని సత్యం తెలిపింది. శకుంతల చేతి ఉంగరాన్ని రాజుపైకి విసిరారు. అప్పుడు రాజు గుర్తించి చింతించాడు. నారదుడు వచ్చి ఆశీర్వదించాడు. శకుంతల పట్టమహిషిగా నెలకొంది. దుష్యంతుడు భరతునకు యౌవరాజ్య పట్టాభిషేకం చేసి చాలా సంవత్సరాలు రాజ్యపాలన చేశాడు. ఇదీ కథ.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here