[box type=’note’ fontsize=’16’] సాహిత్య విశిష్టతలోనూ, కథాకథన శిల్పంలోనూ, పద్య రచనా చమత్కృతిలోనూ, శైలి విన్యాసంలోనూ మధురాలైన ప్రాచీన కావ్యాల పరిమళాలను అందిస్తున్నారు డా. రేవూరు అనంతపద్మనాభరావు. [/box]
పింగళి సూరన కళాపూర్ణోదయం
[dropcap]పిం[/dropcap]గళి సూరన రాయల కాలమునకు తర్వాతి వాడు. ఆయన రచనలలో రాఘవ పాండవీయం, కళాపూర్ణోదయం, ప్రభావతీప్రద్యుమ్నం మాత్రమే లభిస్తున్నాయి. కళాపూర్ణోదయ గాథను ఆధునిక నవలగా సూరన మలచెను. తన కాలానికి తర్వాత నాలుగైదు శతాబ్దుల నాటి ఆలోచనలతో ఆయన కథను మధ్యలో ప్రారంభించెను. ఇందులో మూలబీజం సరస్వతీ బ్రహ్మల ప్రణయ కలహం. కావ్యారంభమొకచోట, కథారంభం మరొకచోట ఉన్నాయి. దానికి తగినట్లుగా పాత్ర సృష్టి చేసినాడు.
కళాపూర్ణోదయాన్ని నంద్యాల కృష్ణభూపతి కంకితమిచ్చినాడు. సూరనకు శృంగారరసాధిదేవత ఒక నర్తకి వలె బహురూపాలుగా సాక్షాత్కరించింది. ఆ వివిధ రూపాల వ్యక్తీకరణకు కళాపూర్ణోదయంలో వివిధ గాథలను మలచాడు. సత్యలోక శృంగారానికి సరస్వతీ బ్రహ్మల ప్రణయం ఉదాహరణ. రంభా నలకూబరుల ప్రణయం దివ్యలోకాలకు చెందినది. కలభాషిణీ ప్రణయం మానవ లోక సంబంధం. శల్యాసురుని వశమైన శృంగారం తుచ్ఛ కామపరమైన రాక్షసలోకపరం.
తెలుగు ప్రబంధాలు నాయక ప్రధానాలు. కళాపూర్ణోదయంలో కలభాషిణి ప్రధానపాత్ర. ఇందులో సన్నివేశాలను పందెంలో పరుగిడునట్లు సూరన వడివడిగా నడిపించెను. కలభాషిణికీ, రంభకూ, మణికంధరునకు నలకూబరునుకు, నారద తుంబురులకు, శుచిముఖీరాగవల్లరులకు పందెం నడిచినట్లు కథాగమనం సాగింది.
కళాపూర్ణోదయం ప్రబంధయుగంలో ఒక విప్లవాత్మక సృష్టి. అసాధారణ భావనాపటిమకి, రచనాచమత్కృతికి ఇది తార్కాణం. తిక్కన వలె సూరన సంభాషణలను నాటకీయంగా సాగించడంలో చతురుడు. పాత్రల హావభావలను, చేష్టలను మరొక పాత్ర ద్వారా కనబరచాడు. సూరన బహుశాస్త్ర పరిజ్ఞానము, లోకజ్ఞత స్పష్టంగా వ్యక్తమయ్యాయి. సామెతలు, సూక్తులు, నీతులు సమయోచితంగా ప్రయోగించి పాత్రలకు, సన్నివేశాలకూ జిగిబిగి కల్పించగల దిట్ట. చిత్రబంధ కవిత్వాలతో తన శైలికి పుష్టిని చేకూర్చాడు. పాత్రలు కళ్ళ ఎదుట ప్రత్యక్షమయ్యేలా వర్ణించాడు. చిత్ర కవిత్వంలో సూరన చాలా చమత్కారాలు చేశాడు. ‘పొసగముత్తెపు సరుల్ పోహళించిన లీల’ అనే పద్యంలో సత్కవివరుని రచన ఎలా ఉండాలో నిర్వచించాడు.
వ్యాసుడు – సూరన:
సంస్కృత సాహిత్యంలో వ్యాసుడు ఆఖ్యాన వరిష్ఠుడు. అంటే కథలు చెప్పడంలో అంతటివాడు మరొకడు లేదు. ఫ్లాష్‌బాక్‌లాగా కథను ప్రారంభించి పాఠకునిని ప్రరోచన కలిగించి కథను మార్చి మార్చి చెప్పడంలో వ్యాసుడు దిట్ట. మహాభారతంలో మానవ జీవిత చిత్రణను అలా చేశాడు. కథకచక్రవర్తి వ్యాసుడు. అదే విధంగా సంకీర్ణమైన బృహత్కథగా కళాపూర్ణోదయాన్ని ఆంధ్రా ఆఖ్యాన వరిష్ఠుడైన పింగళి సూరనను విమర్శకులు సంభావించారు. పాశ్చాత్య సాహిత్య పక్షపాతియైన కట్టమంటి రామలింగారెడ్ది వంటి మనీషులు ప్రశంసించిన విశిష్టకావ్యం కళాపూర్ణోదయం.
కళాపూర్ణోదయ కావ్యంలో కేంద్రస్థానం కళాపూర్ణుడి కథ. అది ఐదో ఆశ్వాసంలోగాని ఆరంభం కాదు. కాని, కళాపూర్ణుని ప్రసక్తి మొదటి ఆశ్వాసంలోనే వస్తుంది. కళాపూర్ణుడి కథ వింటే లోకంలో పుత్రపౌత్రాభివృద్ధిగా సర్వసౌఖ్యాలు లభిస్తాయని ఫలశృతి. కానీ ఆ కథ అతి రహస్యం. కథ పూర్తి అయ్యేవరకు ఆసక్తి. ఇంగ్లండులో షేక్‌స్పియరు, ఫ్రాన్స్‌లో రబెల్లో, ఇటలీలో ఆర్లండో వంటి మహా కథకులకు ఇంచుమించు సమకాలికుడిగా పుట్టి సూరన ఈ స్వతంత్ర పద్యకావ్యం నిర్మించాడు.
కృతిపతి:
కృతిపతియైన నంద్యాల కృష్ణ భూపతి ఒకరోజు సభలో కూచొని పింగళి సూరనామాత్యుని ప్రియంగా ఆహ్వానించాడు. “నీచేత నిర్ణిద్ర సారస్య లీలా చిత్రంబైన ఒక మహా ప్రబంధం చేయించుకోవాలని మా మనస్సులోని కోరిక. అది నీవు తీర్చాలి!” అని అభ్యర్థించాడు. సూరన అందుకు సంతోషంగా అంగీకరించి అత్యపూర్వ కథా సంవిధాన మహనీయము, శృంగారప్రాయము, పుణ్యవస్తువర్ణనాకర్ణనీయము అయిన కళాపూర్ణోదయ మహాకావ్య నిర్మాణానికి పూనుకున్నాడు. ఎనిమిది ఆశ్వాసాల కావ్యాన్ని లోకోత్తరంగా రచించాడు. ఆధునిక కాలంలో సినిమాలో వలె అధికభాగం దృశ్యాలతోను, కొద్దిగా సంభాషణలతోనూ కథను సూరన నడిపించాడు.
ఇది ప్రణయ విజ్ఞాన సర్వస్వం. రంభానలకూబరులు, కలభాషిణీ మణికంధరౌలు, సుగాత్రీశాలీనులు, మరికొన్ని జంటల ప్రణయ వృత్తాంతాలు ఇందులో వర్ణించబడ్డాయి. రంభానలకూబరులు ఆదర్శ ప్రణయజీవులు. ఎందరి తపస్సులో విఘ్నం చేసి, వారిని తన కౌగిట బంధించినా, ఆమె మనసులో నిత్యం మెదలే ప్రియుడు ఒక్క నలకూబరుడే! నలకూబరునికి ఆమె విరహం భరింపరానిదే! అలానే కలభాషిణీ మణికంధరుల ప్రణయం భయదూషితం. సుగాత్రీశాలీనుల ప్రణయం విచిత్రం!
పాఠకులను విభ్రాంతపరచడం:
కావ్యం చదువుతున్నంతసేపు పాఠకుడు రసానందం పొందుతాడు. ఆకాశగమనం, దూరదర్శన, దూరశ్రవణం లాంటి అపరిచితమైన అద్భుత సంఘటనలు పాఠకుణ్ణి నివ్వెరపరుస్తాయి. వర్ణనలు, కల్పనలు, అన్ని ప్రబంధాలలో వలె ఇందులో కన్పిస్తాయి. ప్రథామాశ్వాసంలో పుర వర్ణన, కలభాషిణి చెలికెత్తెలతో విహరంచే ఉద్యానవన వర్ణన, ద్వితీయాశ్వాసంలో మణికంధరుని తీర్థయాత్రావర్ణన, చతుర్థాశ్వాసంలో సముద్ర వర్ణన, చివరి ఆశ్వాసంలో కళాపూర్ణుని దాంపత్య శృంగారం పాఠకుల్ని ఆకట్టుకుంటాయి.
నారదుడు, రంభ, నలకూబరుడు, బ్రహ్మ, సరస్వతి – వంటి పాత్రలు పురాణ ప్రసిద్ధాలైనా, వారికి సంబంధించిన కథ ఇందులో కొత్తది. వినూత్నశైలి. సామాజికుని హృదయంలో ఈ కళాఖండం పట్ల కలిగే కేతుకానికి కారణభుతమైన ఆవేశపూరిత మనస్సు, సౌందర్యానుభవశక్తినీ అన్వయించుకుంటూ పోతే అనంతంగా వ్యంగ్యార్థాలు స్ఫురిస్తాయి. కళాపూర్ణోదయం కథారూపంలో చెప్పిన కవిత్వ తత్వవిచారం తప్ప మరొకటి కాదని డా. జి.వి.కృష్ణారావు తమ సిద్ధాంత గ్రంథం – “Studies in Kalapoorndodaya”లో విశ్లేషించారు.
కథలో కొద్ది భాగానికే కవి స్వయంగా వక్త. మిగిలిన భాగాలకు పాత్రలే వక్తలు. ఎక్కువ కథాభాగాలు చెప్పినవారు ముగ్గురు: (1) మణిస్తంభుడు (2) మణికంధరుడు (3) మధుర లాలస. కథ మొదటి నుండి తబ్బిబ్బుల ప్రహసనం. ఇది ఒక అన్యాపదేశ కథ (allegory). అసలు కథ బ్రహ్మ ఉద్యానవనంలోని కాసారం మధ్య ఉన్న మణిస్తంభంలో ప్రతిఫలించిన సరస్వతీ ప్రతిబింబంతో మొదలవుతుంది. బ్రహ్మ సృష్టికర్త. ఈ జగత్తు ఆయన కల్పించిన కథ. ఆయన కంటున్న స్వప్నం. ఆయన ఏ కట్టుకథ చెప్పినా లోకంలో అది వాస్తవమవుతుంది. ఈ అన్యాపదేశాన్ని ఐదో ఆశ్వాసంలో సరస్వతీదేవి సుదీర్ఘ వచనంలో సుబోధకం చేసింది.
కళాపూర్ణుడు సరస్వతీదేవి ప్రతిబింబం. బ్రహ్మ విజ్ఞానానికి ప్రతీక. అందుచేత శాస్త్ర కళాదృష్టుల సంయోగం వల్ల కళ యొక్క పూర్ణోదయం ఎలా జరిగేది సూరన ఈ కావ్యంలో చెప్పాడు. కళాపూర్ణుడు అత్యుత్తమ కళాఖండానికి ప్రతీక. అతని జన్మకు కారకులైన మణిస్తంభ సముఖాసత్తులు ప్రతిభావ్యుత్పత్తులు ఈ కోణంలో పాఠకుడు కావ్యాన్ని విశ్లేషించుకోవాలి.
కథా సంవిధానం:
బ్రహ్మ కథ చెబుతుంటే సరస్వతీదేవి పెంపుడు చిలుక ‘ఊ’ కొడుతూ వింటోంది. “తల్లి మగవాడు, తండ్రి ఆడుదీ” అనే కథ విని సరస్వతి ప్రేమగా నాథుని కౌగిలించుకొంది. బ్రహ్మ తన నాలుగు ముఖాలతో ఆమె అధరాన్ని చుంచించి దంతక్షతం చేశాడు. ఏకాంతంలో చెప్పిన ఈ కథ సరస్వతీ బ్రహ్మలకు, పెంపుడు చిలుకకఊ తప్ప మరెవ్వరికీ తెలియదు. రంభానలకూబరులు విమాన విహారం చేస్తూ సరస్వతీదేవి అనురాగంతో చేసిన మణిత స్వరం గురించి అడిగాడు.
సుగాత్రీ శాలీనుల కథ ఇందులో విచిత్రమైనది. తొలిరాత్రి భర్త శయన గృహానికి వెళ్ళిన సుగాత్రి తన భర్త అనుకూలింపకపోవడంతో ఇలా అంటుంది:
“అకటా! ఏమని దూరుదాన మిము నాథా! వేగు జామయ్యె; పొం
దికగా పాదము లొత్తరమ్మనుట గానీ, వొంటి యేమో కదా!
నికటక్షోణికి ఏగుదెమ్మనుట గానీ, కొంత నెయ్యంపు పూ
నికతో కన్నులు విచ్చి చూచుటయే కానీ, లేద – యొక్కింతయున్.” (4-116)
మరో జంట కళాపూర్ణుడు – అభినవ కౌముది, మధుర లాలసలు. కళాపూర్ణుడు దిగ్విజయ యాత్ర చేసి మృగేంద్ర వాహన ఆలయానికి వెళ్ళి ఆ దేవిని సేవించి, అక్కడ తాను వెనుకటి జన్మలో దాచి వుంచిన వీణను తెచ్చి అభినవ కౌముడికి కానుకగా ఇచ్చాడు. మధుర లాలసకు కానుకగా రత్నాల అందె బహుకరించాడు.
కలభాషిణి చెలికత్తెలతో ఉయ్యాల లూగే సందర్భంలో మణికంధరుడు, నారదుని మధ్య జరిగిన సంభాషణ ఎంతో రసవత్తరం. ఊయల లూగుతూ వున్న వారు దేవకాంతలపైకి పంతానికి కాలు దువ్వినట్లుందంటాడు సూరన:
“తమి పూదీగెల తూగుడుయ్యెలల పంతా లాడుచున్ తూగు ఆ
కొమరుం బ్రాయపు గబ్బిగుబ్బెతల అంఘ్రల్ చక్కగా జాగి మిం
టి మొగంబై చనుదెంచు ఠీవి కనుగొంటే, దివ్య మౌనీంద్ర! నా
కమృగీనేతల మీద కయ్యమునకున్ కాల్ చాచు లాగొప్పెడున్”. (ప్రథమా-43)
కథా సంవిధానంలో సూరన ఎన్నో పోకడలు పోయాడు. ఎమెస్కో ప్రచురణ సంస్థ వారు కళాపూర్ణోదయం రెండు భాగాలుగా బొమ్మకంటి శ్రీనివాసాచార్యుల వాచవితో 2006లో ప్రచురించి సాహితీ సేవ చేశారు.