[box type=’note’ fontsize=’16’] సాహిత్య విశిష్టతలోనూ, కథాకథన శిల్పంలోనూ, పద్య రచనా చమత్కృతిలోనూ, శైలి విన్యాసంలోనూ మధురాలైన ప్రాచీన కావ్యాల పరిమళాలను అందిస్తున్నారు డా. రేవూరు అనంతపద్మనాభరావు. [/box]
ధూర్జటి శ్రీకాళహస్తి మాహాత్యం
[dropcap]శ్రీ[/dropcap]కృష్ణదేవరాయల అష్టదిగ్గజ కవులలో ధూర్జటి మేటి కవి. ఇతర కవుల వలె ఈయన రాయల కంకితంగా ఏ కావ్యమూ ఇవ్వలేదు. కాళహస్తి మాహాత్యం శివున కంకితం. ధూర్జటి పల్కుల విషయంలో ఒక పద్యం అతని తమ్ముని మనుమడు కృష్ణరాయ విజయంలో ఉదహరించాడు:
‘స్తుతమతియైన ఆంధ్రకవి ధూర్జటి పల్కుల కేల కల్గె నో
అతులిత మాధురీ మహిమ?’ అనే చాటువు ప్రచారంలో వుంది.
కాళహస్తి మాహాత్యము క్షేత్ర మాహాత్యం. శ్రీనాథుని భీమఖండ, కాశీఖండాల వలె ఇది శివభక్తిపారమ్య కావ్యం. శివభక్తుల కథలను ఒక చోట గుదిగ్రుచ్చి చెప్పినందువలన ఏకసూత్రత లేదు. కాళహస్తి శతకం బాగా ప్రచారంలో వుంది. రాజ దూషణ ఆ పద్యాలలో కనిపిస్తుంది. ధూర్జటి పద్యాలు వ్యాకరణ సూత్రాలకు లొంగలేదు. లోక సంస్కారం కోసం అనేక నీతులు అందులో ప్రవచించాడు. “రాజుల్ మత్తులు, వారి సేవ నరక ప్రాయంబు” అని నిరసించిన కవి ధూర్జటి.
ఆచార్య పింగళి లక్ష్మీకాంతం ధూర్జటిని ఇలా విశ్లేషించారు:
“కవి కాళహస్తి శతకమును రచించిన కాలమున ఈశ్వరుని ముఖమును తప్ప ప్రపంచమును చూడలేదనిపించును. ఇంతటి అంతశ్శుద్ధి గల కవిత్వమే త్యాగయ్య కృతులలోనో కాని సర్వత్ర లభించదు.” (ఆంధ్ర సాహిత్య చరిత్ర – పుట 385).
సుఖదుఃఖాది ద్వంద్వాలకు వశుడై పొంగిపొరలే హృదయవేదనను ఈశ్వరుని ఎదుట ధూర్జటి మొర వెడ్చుకొన్నాడు. ఈశ్వరుని పరిపరి విధాల వేడుకొన్నాడు. తెలుగు శతక సాహిత్యంలో కాళహస్తి శతకం విశిష్టం.
ధూర్జటి సుమారు 1500-1530 ప్రాంతంలో రాయల ఆస్థానంలో వున్నట్టు సాహిత్య చరిత్రకారులు అభిప్రాయపడ్డారు. ధూర్జటి రసికుడనే పై చాటువు లోకంలో వాడుకలో వుంది. కాళహస్తి మాహాత్య రచనకు స్కాందపురాణం ఆధారమై వుండునని ఆరుద్ర అభిప్రాయపడ్డారు. ఇది నాలుగాశ్వాసాల కావ్యం. ఎమెస్కో సంప్రదాయ సాహితిలో కవిసామ్రాట్ విశ్వనాథ కమనీయ పీఠికతో ఇది ప్రచురితమైంది.
విశ్వనాథ ఈ కావ్య ప్రశస్తిని ఇలా కొనియాడారు:
“ఈ కాళహస్తి మాహాత్యము వంటి గ్రంథము తెలుగులో మరొకటి లేదు. ఇందులో ఏనుగు, పాము, తిన్నడు సాయుజ్యం పొందిన కథలు భక్తితో చదువగలిగి చదివినచో మానవులు, తెలుగువారు పరమేశ్వరుడైన శివునకు దగ్గర వారగుదురు. అందులో సందేహము లేదు… తక్కినవారి కవిత్వము మనసునకు వాటి పెట్టి హృదయమును పాటునకు తెచ్చును. ఈ కవిత్వము మనస్సు వాడిమిని దాటి, గుండె యొక్క పాటు దాటి, దూరాన శివుడు కనిపించినట్లు చేయును.” (ఎమెస్కో సంప్రదాయ సాహితి పీఠిక).
ఆచార్య పింగళి లక్ష్మీకాంతం ఈ కావ్య విశిష్టతను శ్లాఘించారు:
“గ్రంథమంతట కవి లోకవృత్త పరిజ్ఞాన మకుంఠితముగా తోచును. తెలుగు కవులలో చాలామంది గ్రంథ పరిచయము గలవారే గాని లోకపరిచయము కలవారు కారు. ఆ యున కతిపయవర్గములో ఈయన యొక మేటి. విజయనగరవాసి యైన ఆతడు తిన్నని కథలో ప్రదర్శించిన ఆటవిక జీవనము సాక్షాత్ అనుభూతమైనదే గాని భావనాశక్తి ఫలితమున గాదు. అట్లే వేశ్యా కుటుంబ వర్ణనయందును భావానా మాత్రముచే ఎరుగని రహస్యము లెన్నో చూపెను. రాజాంతఃపుర వ్యవహారములను ఊహింపవచ్చును గాని ఈ నిరాడంబర జీవితమట్టిది కాదు.
కిరాతుల ఆచార వ్యవాహారములు, తిను తిండి, తాల్చు నగలు, పండించు పంటలు, కొలుచు దేవతలు మొదలగు సమస్త వివరములు కవికి సుపరిచితములే.” (ఆంధ్ర సాహిత్య చరిత్ర – పుట 384).
స్వయంగా పరమశివుడే ధూర్జటిని ఇలా ప్రశంసించాడు:
“ధూర్జటీ! నీ శివభక్తి కావ్య సరణిన్ కడు ధన్యత పొంద
నవ్యభాశా శతధానిగుంబన రసస్థితి నొప్పుదలిర్ప చెప్పుమా!” అంటాడు శివుడు.
ఈ కావ్యంలో ప్రధాన రసం శాంతం. కాని భక్తి రసం పొంగిపొరలింది. ఎక్కువమంది భక్తిని అలంకారశాస్త్ర రీత్యా రసంగా లెక్కించలేదు. ఇక్కడ శాంతరసానికి అంగరసాలుగా వీర, శృంగార రసాలు పోషించాడు కవి. భక్తికి పర్యవసానం శాంతమే అనే అభిప్రాయం కూడా వుంది. ధూర్జటి పురవర్ణన చేస్తూ కాళహస్తిలో కామినులు కూడా యోగిజనమే అంటాడు. పార్వతీపరమేశ్వరుల విహారం, వాణి హిరణ్యగర్భుల కథ, చెంచులు, చెంచిత విహారాలు, మిండ జంగాల కథలో శృంగారం ఎక్కువగా పోషించాడు కవి. లోకజ్ఞత కలిగిన కవి నాటి సామాజిక ఆచార వ్యవహారాలను అనుభవ పూర్వకంగా వర్ణించాడు.
వివిధ కథా సంకలనం:
శ్రీకాళహస్తి మాహాత్యంలో పలువురు శివభక్తుల కథలు వివరింపబడ్డాయి. శివలింగంలో ఐక్యమయిన సాలెపురుగు (శ్రీ), పాము (కాళ), ఏనుగు (హస్తి) భక్తి పారమ్యం ప్రధానం. ఒక యాదవ రాజు భక్తిని పరీక్షించడానికి పరమశివుడు తానొక జంగమదేవర రూపం ధరించి వచ్చాడు. ఆతడొక జంగమురాలి ఇంటికి వెళ్ళి ఒక రాత్రిని ఏకాంతముగా గడిపెను. ఆమె ఆ రాజుగారి అంతఃపుర ఉద్యోగిని. ఆమె అంతఃపురానికి ఆ రోజు రాలేదు. రాజునకు కోపం వచ్చి ఆమెకి శిక్ష విధించి బుర్ర గొరిగించాడు. ఆమె జంగమునకు తన బాధ చెప్పగా, ఆయన ఆమె శిరస్సును ముట్టుకోగానే ఆమెకు యథాప్రకార కేశసంపద లభించింది.
ఆ రాజు జంగముని వద్దకు వెళ్ళగా, దక్షిణ కైలాసంలో శివునకు ఒక దేవాలయం కట్టించమని జంగముడు (శివుడు) కాళహస్తి క్షేత్ర మాహాత్యం వివరించాడు. ఈ కావ్యములో తిర్యగ్జంతువులైన మూడు ముగ్ధభక్తితో శివైక్యం పొందడం విశేషం. కాళహస్తి కొండమీద ఒక శివలింగం వుంది. ఆ లింగానికి ఒక సాలెపురుగు తన శరీరం నుండి వెలువడిన దారంళో శివునకు గుళ్ళు, గోపురాలు, ప్రాకారాలు, కొలువు కూటాలు, పందిళ్ళు కట్టింది. పరివార దేవతలైన కుమారస్వామి, నంది, సప్తమాతృకలకు అలానే ఆచ్ఛాదన కల్పించింది. శివుడు దాని భక్తిని పరీక్షింపదలచి పక్కనే వున్న దీపం మండించి సాలెపురుగు నిర్మించిన ఇళ్ళన్నీ తగలబడిపోయేలా చేశాడు. సాలెపురుగు దీపాన్ని మింగబోయింది. శివుడు ప్రత్యక్షమై వరం కోరుకోమంటే పునర్జన్మ లేకుండా నీలో కలుపుకొమ్మంది. శివైక్యం చెందింది. ఇప్పటికీ శివలింగంపై కాళహస్తిలో సాలీడు గుర్తులు కనిపిస్తాయి.
ఏనుగు – నాగుపాము:
ఈ కథ త్రేతాయుగం చివరి మాట. ఒక పెద్ద పాము, పాతాళ లోకం నుంది పెద్ద పెద్ద మాణిక్యాలు తెచ్చి కాళహస్తీశ్వరుని సేవించేంది. యుగం గడిచిపోయి ద్వాపర యుగం వచ్చింది. అప్పుడు ఒక ఏనుగు స్వర్ణముఖి నదిలో స్నానం చేసి మారేడు దళాలు, పూలు తెచ్చి అంతకు ముందున్న పాము తెచ్చిన మణులు త్రోసివేసి, మారేడు దళాలు, పూలతో పూజించెది. అవి మణులనుకోలేదు, ఏవో రాళ్ళు అనుకొంది. అలా కొద్ది రోజులు గడిచాయి. మళ్ళీ మణులు కన్పిస్తున్నాయి. ఇవాళ, నేనో మరొకడో తేలిపోవాలని ఏనుగు నిశ్చయించుకుని ఆ రాత్రి ఎదురు చూసింది. ఇక్కడ సూర్యోదయాన్ని ధూర్జటి అద్భుతంగా వర్ణించాడు.
ఉదయ గ్రావము పానవట్ట, మభిషేకోద ప్రవాహంబు వా
ర్ధి, ధరీధ్వాంతము ధూపధూమము, జ్వలద్దీప ప్రభారాజి కౌ
ముది, తారానివహంబు లర్పిత సుమంబుల్‌గా, తమోదూర సౌ
ఖ్యదమై శీతగభస్తిబింబ శివలింగం బొప్పె ప్రాచీదిశన్.” (ద్వితీయా -133).
పాము తెల్లవారగానే వచ్చింది. ఆ చాటున దాగుకొని వుంది. ఏనుగు తొండంతో నీళ్ళు తెచ్చి లింగంపై చల్లడానికి తొండం సాచింది. పాము తొండంలోకి చొరబడి కుంభస్థలానికి ఎక్కింది. వాటి రెండింటికీ పోటీ పెరిగింది. ఏనుగు తన కుంభస్థలాన్ని కొండకేసి బలంగా కొట్టింది. ఏనుగు, పాము చనిపోయాయి. వారిద్దరు రుద్రగణాలుగా మారిపోయారు.
తిన్నని కథ:
ఇతడొక ముగ్ధ భక్తుడు. వానిది పొత్తసినాడు. ఉడుమూరు అనే బోయపల్లెలో తిన్నని నివాసం. అతని తండ్రి ఆ పల్లె జనానికి రాజైన నాథనాథుడు. ఒకనాడు తిన్నడు యథావిధిగా వేటకు వెళ్ళాడు. అలసిపోయి ఒక పొగడ చెట్టు నీడలో నిద్రించాడు. స్వప్నంలో శివుడు కనిపించి, ‘ఓరీ! ఇక్కడ కొండ సమీపంలో మర్రిచెట్టు కింద శివుడున్నాడు. నీవు అతనిని కొలువు’మన్నాడు. కళ్ళు తెరిచిన తిన్ననికి ఎదురుగా ఒక అడవి పంది కన్పించింది. దానిని వేటాడుతూ ఆ శివుడున్న చోటికి వచ్చాడు తిన్నడు.
శివలింగం కన్పించింది. పులకితగాత్రుడయ్యాడు. నాతో మా బోయపల్లెకు రమ్మని బ్రతిమాలాడు:
“ఓ సామీ! ఇటువంటి కొండ దరిలో, ఒంటిన్ పులుల్, సింగముల్
గాసిం బెట్టెడు కుట్ర నట్టడవిలో, కల్జువ్వి క్రీనీడ, ఏ
ఆ సంగట్టితి వేటిగడ్డ నిలు? నీవాకొన్నచో కూడు నీ
ల్లే సుట్టంబులు దెచ్చి పెట్టెదరు? నీకిందేటికే లింగమా!” (3-65) అని అమాయకంగా కోరుకున్నాడు.
అతని స్నేహితులు బోయపల్లెకు రమ్మన్నా వెళ్ళలేదు తిన్నడు. శివుని వదిలి వెళ్ళడం ఇష్టం లేదు. అతని ముగ్ధ భక్తిని శివుడు పరీక్షించదలచాడు. ఒకనాడు వేటాడి తెచ్చిన మాంసఖండాలను కాల్చి దొప్పలలో పెట్టి లింగానికి ఆహారంగా సమర్పించాడు. శివార్చకుడు అది చూచి ఎంతో బాధపడ్డాడు. తిన్నని భక్తి శివార్చకునికి చూపాలని శివుడు ఏకధారగా కన్నీరు కార్చసాగాడు. అతడు కంటికి కన్ను మందుగా భావించి తన కన్ను పొడిచి సమర్పించాడు. రెండో కన్ను చెమర్చింది. రక్తధారలు వస్తున్నాయి. చెప్పు కాలితో లింగంపై తన్నిపట్టి, తన చేతి బాణంతో రెండో కనుగుడ్డు పెకిలింపబోయాడు.
శివుడు ప్రత్యక్షమయ్యాడు. తిన్నడు, శివార్చకుడు శివసాయుజ్యం పొందారు.
నత్కీరుడు:
ఈ కావ్యంలో మరొక విచిత్ర కథనం నత్కీరుని కథ. మధురా నగరవాసియైన ఒక పూజారికి శివుడు అరవ భాషలో ఒక పద్యం వ్రాసి యిచ్చి పాండ్యనగర రాజు సన్మానం పొందమని చెప్పాడు. ఆ సభలో ఈ పద్యం చదవగానే నత్కీరుడనే కవి ఆక్షేపించాడు. “సిందుర రాజ గమనాధమ్మిల్ల బంధంబు సహజ గంధంబు” అనే ఉపమానాన్ని నిరసించాడు. తల వెంట్రుకలకు సహజవాసన లేదన్నాడు. శివుని వాక్యమన్నా అంగీకరించలేదు. శివుడతనికి శాపమిచ్చాడు. కుష్ఠు వ్యాధి పీడితుడై నత్కీరుడు దక్షిణ కైలాసానికి వచ్చి తరించాడు. ఈ విధమైన శివభక్తుల కథలు శ్రీనాథుని హరవిలాసంలోనూ, పాల్కురికి సోమ బసవ పురాణం, పండితారాధ్యచరిత్రలలోనూ విశేషంగా కన్పిస్తాయి.