కావ్య పరిమళం-25

0
2

[box type=’note’ fontsize=’16’] సాహిత్య విశిష్టతలోనూ, కథాకథన శిల్పంలోనూ, పద్య రచనా చమత్కృతిలోనూ, శైలి విన్యాసంలోనూ మధురాలైన ప్రాచీన కావ్యాల పరిమళాలను అందిస్తున్నారు డా. రేవూరు అనంతపద్మనాభరావు. [/box]

చేమకూర వెంకటకవి విజయవిలాసం

[dropcap]ద[/dropcap]క్షిణాంధ్ర యుగమునకు చెందిన రఘునాథనాయకుని కంకితంగా చేమకూర వెంకటకవి విజయవిలాస ప్రబంధం సమకూర్చాడు. సారంగధర చరిత్ర కూడా ఇతని రచనయే. “విజయవిలాస పద్యము లందలి వ్యంగ్యాదులు మొగ్గ తనంత తాను విచ్చునట్లుగా విచ్చు”నని వేదం వేంకట రాయశాస్త్రులు అభిప్రాయపడ్డారు. కీర్తనలో క్షేత్రయ్య, ప్రబంధాలలో వేంకటకవి సుప్రసిద్ధులు. వసుచరిత్రకారుడు అతిప్రయత్నం మీద సాధించిన ధ్వనులు, వ్యంగ్యాలు వేంకటకవి సహజధోరణిలో అప్రయత్నంగా రచించాడు. ప్రతిపద్య రసాత్మకం విజయవిలాసం. తెలుగు పంచకావ్యాలలో ఇది ఐదవది. మొదటి నాలుగు ప్రౌఢ సాహిత్యాలు. చేమకూర పలుకులు సంగీతమయం. క్షేత్రయ్య, వేంకటకవి ఆంధ్ర సాహిత్యంలో రెండు ఉత్తమ శిఖరాలని ఆచార్య పింగళి లక్ష్మీకాంతం అభిప్రాయపడ్డారు (ఆంధ్ర సాహిత్య చరిత్ర – పుట 422).

రఘునాథ నాయకుని ఆస్థానకవిగా వెంకటకవి (1614-1635) రచనలు కొనసాగించాడు. “ప్రతిపద్యమునందు చమత్‌కృతి కలుగం చెప్పనేర్తు”వని రఘునాథుడు ప్రశంసించాడు. “చక్కెర మడిలో అమృతం పారించి పండించిన చేమకూర” అనే సూక్తి ఈ కవి విషయంలో ప్రచారంలో ఉంది. ‘ఏ గతి రచియించిరేని సమకాలము వారలు మెచ్చరే గదా!’ అని కవి వాపోయాడు. విజయవిలాసం మూడాశ్వాసాల కావ్యం. అర్జునుడు తీర్థయాత్రల సమయంలో ఉలూచి, చిత్రాంగద, సుభద్రలను వివాహమాడే కథలు ఇందులో ప్రధానం.

డా. జి.వి. సుబ్రహ్మణ్యం చేమకూర చమత్కారాలను ఇలా విశ్లేషించారు: “చేమకూర వెంకటకవి రచనా సౌందర్యాన్ని ఆరాధించిన కవి. శబ్దాలంకారాలను సార్థకంగా వాడడం, శ్లేషను తెలుగు పలుకుబడులలో కొత్త సొంపులతో సంతరించటం ఆయన కవిత్వంలో సాధించిన ప్రత్యేక గుణాలు. మాటల విరుపుల్లో మాటల కదుపుల్లో చూపించే చమత్కారాలు ప్రతిపద్య ప్రత్యక్షాలు.”

అల్పాక్షరాలలో అనల్పార్థ ద్యోతకంగా రచించే నేర్పు చేమకూరకి ఎంతో వుంది. సామెతలు, లోకోక్తులు, జాతీయాలు సమయోచితంగా వాడాడు. “ప్రతి పదమ్మున జాతియు, వార్తయున్ చమత్కారము, అర్థ గౌరవము కల్ల అనేక కృతుల్ రచించి మహిమించిన” కవి చేమకూర.

ఎమెస్కో సంప్రదాయ సాహితిలో భాగంగా విశ్వనాథ పీఠికతో విజయవిలాసం ప్రచురించబడింది. చేమకూర వెంకటకవి తంజావూరు కవి. ఆనాటి కవులలో శృంగార రసమెక్కువ. ఆ రాజులు శృంగార ప్రియులు. ముద్దు పళని వంటి వేశ్యలు అవలీలగా ఆశు పద్యాలు చెప్పిన ప్రౌఢలు:

“ఏ వనితల్ మముందలుపనేమిపనో తమరాడువారుకా
రో, వలపించునేర్పెరుగరో! తమకౌగిలిలోననుండగా,
రావదియేమిరా విజయరాఘవ! అంచిలుదూరి బల్మియై,
తీవరకత్తెనై, పెనగి తీసుకవచ్చితినా తలోదరీ!” – అన్న కవయిత్రి.

ఈ కావ్యంలో కథానాయకుడు అర్జునుడు. అతడు పాండవవీరుడు. ఖాండవదహనం చేసినవాడు. శివుని గెలిచి పాశుపతాస్త్ర సంపాదన చేసిన ఘనుడు. కానీ, అతని ఆ వీరోచిన గాథల కిందులో చోటు లేదు. ఆయన శృంగార గాథల చిత్రణ వుంది. “ఇందులో శృంగార రస సంబంధమైన వర్ణనలో వెంకటకవి చూపించిన అనంతమైన, విశిష్టమైన చాతుర్యం, నైపుణ్యం అమోఘం. పాఠకుడు ప్రతి పద్యం చదివి, చమత్కారాలను భవించి, వాటిలో రమించాలి” అంటారు విశ్వనాథ పీఠికలో.

చేమకూరకు కావ్య రచనలో ముగ్గురు మార్గదర్శకులు ప్రధానులు. ఒకడు వసుచరిత్రకారుడు రామరాజ భూషణుడు, మరొక కవి పారిజాతాపహరణకర్త తిమ్మన, మూడవవాడు ప్రభావతీ ప్రద్యుమ్న రథసారథి సూరన. పెద్దన వాడిన ‘వెన్నుదన్ని’ పదాన్ని చేమకూర మరల మరల ప్రయోగించాడు.

ఈ కావ్యంలో శృంగార వైవిధ్యం మూడు రకాలుగా గోచరిస్తుంది.

  • ఉలూచి అర్జునుని ప్రేమించింది.
  • అర్జునుడు చిత్రాంగదని చూచి ఆకర్షితుడయ్యాడు.
  • నిజమైన ప్రేమ సుభద్రపై అర్జునుడు చూపాడు.

మొదటి శృంగారం వృథా అయిపోగా, రెండో శృంగారం తనకు గాకపోయింది. సుభద్రతో నిజమైన ప్రేమయే ఫలించినది. ఈ కావ్యంలో పద్యాలు ఎన్నైనా ఎత్తి చూపవచ్చును. అతని సమకాలము వారు అతనిని మెచ్చుకొనలేదు.

‘ఏ గతి రచియించిరేని సమకాలము వారలు మెచ్చరే గదా!’ అనే బాధను సాయంకాల వర్ణన సందర్భంగా యథాలాపంగా వ్యక్తపరిచాడు కవి. చేమకుర అద్భుతమైన యమక చక్రవర్తి. కల్పనల విషయంలో అద్భుత చమత్కారాలు చూపగలిగాడు. భారతగాథ ఆధారంగా ప్రధానంగా సుభద్రార్జునుల ప్రణయం ఇందులో వర్ణింపబడింది.

కథాకథనం:

ఇంద్రప్రస్థనగరం రాజధానిగా ధర్మరాజు ధర్మపరిపాలన చేస్తున్నాడు. ఆ నగర వర్ణనను చేమకూర ప్రబంధోచిత ధోరణిలో వ్రాశాడు. పౌరుషశాలి యైన అర్జునుడు అన్నలైన ధర్మజ, భీముల పట్ల గౌరవాదరాలతో ప్రవర్తిస్తున్నాడు. అతడు సోయగంలో జయంతుని తమ్ముడు. యాదవ వంశానికి చెందిన గదుడు ఇంద్రప్రస్థ నగరానికి కృష్ణుని  పనుపన వచ్చాడు. ద్వారకలో వార్తలు చెబుతూ సుభద్ర అందచందాలు వర్ణించాడు.

ఉ:
ఎక్కడ చెప్పినాద తరళేక్షణ చక్కదనమ్ము? ఇంక అ
మ్మక్క! అదే అనంగ  నిపుడండు శతాంశము తెల్పలేదు, నే
నొక్క యంగమెంచవలయున్, పదివేల ముఖంబులాయెబో
చొక్కపు చూపులో సొలపు చూచిన గాక ఎరుంగవచ్చునే.” (1-41) అని పొగిడాడు.

ఒకనాడు ఒక బ్రాహ్మణుని గోవును ఒక చోరుడు అపహరించగా అర్జునుడు తన బాణ తుణీరాలు తెచ్చుకోవడానికి ధర్మజుని మందిరం ప్రవేశించవలసిన అగత్యం ఏర్పడింది. ద్రౌపది ఆ సంవత్సరం ధర్మజుని అంతఃపురంలో వుంది. పాండవులు నియమ ప్రకారం అర్జునుడు సమయభంగం చేశాడు. దాని పరిహారార్థం తీర్థయాత్రలకు అన్న అనుమతితో బయలుదేరాడు.

ఉలూచి:

గంగానదీ తీరంలో ఉలూచి అనే నాగకన్య అర్జునుని చూచి మరులుగొంది. ఆతని అందచందాలకు ఆకర్షితులరాలైంది. అక్కడ సంధ్యవార్చి జపం చేసుకొంటున్న అర్జునుని నాగలోకానికి తీసుకెళ్ళింది. భోగవతీపురంలో ఉలూచి సౌందర్యాన్ని చూసి అర్జునుడు ఆశ్చర్యపోయాడు. ఉలూచితో సరస సంవాదం చేశాడు. ‘నా మనోహర రూపాన్ని నీకు జన్నియపట్టా’నని ఆమె పట్టుబట్టింది. ‘నీవు నాగకన్యవు, నేను మనుష్యజాతివాడను. నీ కోర్కె విపరీతంగా వుంద’న్నాడు విజయుడు.

“పూర్వం శ్రీరామచంద్రుని కుమారుడు కుశుడు మా జాతి కుముద్వతినీ, పురుకుత్సుడు నర్మదని పెళ్ళాడా”రని ఉలూచి సమర్థించింది. పైపెచ్చు కన్నీరు పెట్టుకుంది. అర్జునుడు తన వ్రతాన్ని చెప్పి ఆమెతో సంసార సుఖాలనుభవించాడు. సద్యోగర్భంలో ఆమెకు ఇలావంతుడనే కొడుకు పుట్టాడు. తాను తీర్థయాత్ర కొనసాగించాలని అర్జునుడు వేగిరపడడంతో ఉలూచి అతనిని తిరిగి గంగానది వొడ్డుకు చేర్చింది. అర్జునుడు తన ఇష్టసఖుడైన విశారదునికి ఉలూచీ ప్రణయప్రసంగాన్ని వివరించాడు. అక్కడ నుండి హిమగిరి మీదుగా వివిధ తీర్థాలు సేవిస్తూ పాండ్యరాజ్యానికి చేరుకొన్నాడు.

చిత్రాంగద:

అక్కడ పాండ్యరాజు కుమార్తె చిత్రాంగద అర్జునకు తారసపడింది. ఆమె సౌందర్యం చూచి అర్జునుడు విరహం పొందాడు. తన స్నేహితుడు విశారదుని రాయబారం పంపాడు. తీర్థయాత్రకు వచ్చిన అర్జునునకు ప్రత్యేకంగా విడిది ఏర్పాటు చేశాడు పాండ్యరాజు. వివాహ ప్రస్తావనలో తన కుమార్తెకు జన్మించే కుమారుడు రాజ్యాధిపతి కాగలడని రాజు పేర్కొన్నాడు. చిత్రాంగద, అర్జునుల వివాహం శోభాయమానంగా జరిపించారు. వారి పడకటింటి ముచ్చటలను కవి సుదీర్ఘంగా వర్ణించాడు. వారికి బబ్రువాహనుడు జన్మించి ఆ రాజ్యానికి రాజయ్యాడు.

అక్కడ నుండి బయలుదేరిన అర్జునుడు సౌభద్రతీర్థంలో ఐదు మొసళ్ళకు శాపవిమోచనం కలిగించాడు. అటు నుండి సుభద్ర రూపురేఖలను చూడటానికి ద్వారకా నగరానికి కపట సన్యాసి వేషంలో చేరాడు. కృష్ణు డతనిని రైవత పర్వతంపై విడిది చేయించి, బలరామునిచే ద్వారకకు ఆహ్వానింపజేశాడు.

సన్యాసికి సపర్యలు చేయడానికి చెల్లెలు సుభద్రను బలరాముడు నియోగించాడు. సన్యాసి సుభద్రకు శకున శాస్త్రం చెప్పాడు. ‘మీ రందందు నరుగ నరు గానరుగా’ అని సుభద్ర ప్రశ్నించింది. చూశానన్నాడు సన్యాసి.

ఉ:
ఎచ్చట గంటిరో విజయు నిక్కువ, నిక్కువ మౌనె? రాడుగా
యిచ్చటి కంచు కోరికల ఈరిక లెత్త పల్కగా
నొచ్చెములేని బీర మెదనూరగ, నూరగసాగె వెంటనే
పచ్చని వింటివా డపుడు పైదలిపై తలిరాకు కైదువుల్. (2-167).

సన్యాసి తానే అర్జునుడని బయటపడ్డాడు. సుభద్ర సరసోక్తులతో తప్పించుకొని పారిపోయింది. అర్జునుడు విరహతాపం పొందాడు. అదే విధంగా సుభద్ర విరహాన్ని అనుభవించింది. వదినెలు మేలమాడారు. శ్రీకృష్ణుని ఆధ్వర్యంలో సుభద్రార్జునుల వివాహం జరిగింది. పెళ్ళి చూడడానికి ఇంద్రుడు స్వర్గం నుంచి విచ్చేశాడు. సుభద్రార్జునులు ఇంద్రప్రస్థానికి బయలుదేరగా యాదవసేనలు అడ్డగించాయి.

సుభద్ర సారథ్యం వహించగా అర్జునుడు విరోచితంగా పోరాడాడు. ఆ విషయం తెలిసి బలరాముడు కోపించాడు. శ్రీకృష్ణు డాయనను శాంతపరిచాడు. ధర్మరాజు బలరామాదులను సగౌరవంగా ఆహ్వానించాడు. బలరాముడు సుభద్ర వివాహాన్ని అతి వైభవంగా నిర్వహించాడు. సుభద్రార్జునులు శృంగార రసాంబుధిలో ఓలలాడారు. ఈ మూడాశ్వాసాలలో వెంకటకవి అద్భుత పద ప్రయోగాలు చేసి కావ్యాన్ని రసవత్తరంగా తీర్చిదిద్దాడు. దీనిని ‘పిల్ల వసుచరిత్ర’ అని కొందరు ఆక్షేపిస్తారు. ఏమైనా విజయవిలాసం ఆంధ్ర సాహితీలలామ విలాసం!

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here